Feb 6, 2020

కియా మోటార్స్ తరలింపు? - ఏపీ 24X7 చర్చ



ఛానల్ - టీవీ - ఏపీ 24X7 - తేదీ: 06.02.2020 గురువారం ఉదయం 7.30 గం.
అంశాలు :    కియా మోటార్స్ – జీవీఎల్

మాల్యాద్రి – టీడీపీ
రాష్ట్ర ప్రయోజనాలకు ఇది చాలా పెద్ద సమస్య. దీనిని ప్రజల దృష్టికి తెచ్చిన రాయిటర్ సంస్థకు, ఏపీ 24కి కృతజ్ఞతలు. పార్టీలకు అతీతంగా, రాష్ట్రంపై ప్రేమతో ఆలోచన చేయాలి. దక్షిణాది రాష్ట్రాలన్నిటికంటే ఏపీలో నీరు వనరులు, పవర్, మానవ వనరులు, కోస్టల్ లైన్, పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే భూమి ధరలు కూడా తక్కువ. అందుబాటు కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నా అన్ని రాష్ట్రాలకంటే వెనుకబడ్డాం. తరసరి ఆదాయంలో, ఉపాధి కల్పనలో, పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం. రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉపాధి లభించడానికి వీలవుతుంది. దేశంలో కూడా ఇటువంటి సమస్య ఉంది. అందువల్ల నిన్న కేంద్ర బడ్జెట్ లో కూడా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ కూడా మినహాయించారు. అందువల్ల విదేశీ పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.  ఇక్కడ అందరూ రాష్ట్ర ప్రయోజనం ఆశించి చేయవలసి ఉంది. తమిళనాడులో పార్టీల విషయంలో చాలా సీనియర్ గా కొట్టాడుకుంటారు. తెలంగాణలో కూడా అంతే. రాష్ట్ర సమస్య వచ్చేసరికి అందరూ ఒక మాటకు వస్తారు. తెలంగాణ విషయంలో మా టిడిపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారిపై వత్తిడి తెచ్చారు. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రం నుంచి తరలి వెళ్లడానికి వీలులేదు. అందరూ కలసికట్టుగా పనిచేయవలసి ఉంది. ప్రపంచంలో కార్ల పరిశ్రమలు కియా మోటార్స్ 5వ స్థానంలో ఉంది. 12వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. మూడేళ్ల కింద అక్కడ ఎకరా  లక్షల రూపాయలుంది, ఇప్పుడు అక్కడ 40 కిలోమీటర్ల రేంజ్ లో రూ.60 లక్షలు ఉంది. ఉద్యోగాలు, పన్నులు వస్తున్నాయి. ఇటువంటి బహుళ జాతి కంపెనీలు వస్తే అవి విస్తరిస్తాయి. 17 అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. అవి కూడా వెళుతాయని అంటున్నారు. ఇటువంటి పరిశ్రమ పోకూడదు. రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఉపయోపడుతుంది. ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తి చేయాలన్నది ఆ కంపెనీ లక్ష్యం. అనంతపురంలో తయారయ్యే కారు ప్రపంచంలోని దేశాలలో రోడ్లపై తిరిగే అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేయకూడదు. కొత్త గవర్నమెంట్ లో పారిశ్రామిక విధానం సరిగా లేదని, పవర్ కొనుగోలు విషయంలో  తేడా ఉన్నట్లు తేలింది. ఈ విషయంలో మంత్రి మేకపాటి గౌతం సీఎం జగన్ గారితో వెంటనే మాట్లాడి వారిని పిలిచి  సంతృప్తి పరిచి  కంపెనీ పోకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ స్థానిక వైసీపీ నాయకులు కూడా ఆ పరిశ్రమ మీదకు దౌర్జాన్యానికి పోకుండా ఉంటే మంచిది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పారిశ్రామిక సంక్షోభం ఉంది. ఈ పరిస్థితులలో కంపెనీలతో గొడవపడటం మంచిది కాదు.
రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 5.12 లక్షల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అసెంబ్లీలో చెప్పారు. వివాదాల జోలికి పోకూడదని వాటిని మాట్లాడటంలేదు. మేం రూ.5 లక్షల కోట్లు తెస్తే, వారిని పది లక్షల కోట్లు తెమ్మనండి. మంచిది. ప్రతిదాంట్లో రాజకీయమేనా. ప్రతి దాంట్లో దుమ్ము వేయడమేనా. ఇది రాష్ట్ర సమస్య. అదువల్ల విమర్శలజోలికి వెళ్లలేదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.
జీవీఎల్ గారు ఆంధ్రమాతకు వాతలు వేస్తే, రఘురామ్ గారు నొప్పి తెలియకుండా వెన్నపూస రాస్తున్నారు. 2019 ఫిబ్రవరి తరువాత హోదా ఉన్న రాష్ట్రాలకు హోదా మినహాయిస్తున్నాం. ఏపీకీ ఎలా ఇస్తాం అని అని వారు అన్నారు. దానికి సమాన నిధులు ఇస్తామని చెప్పారు.  తరువాత మార్చిలో 11 రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో హోదా ఇస్తామని రాశారు. పార్లమెంటులో అడిగింది మేమే అన్నారు. ఎవరు మార్చారు. ఆలోచించాలి. రోజు ప్రతిదానికి చంద్రబాబు నాయుడుని విమర్శించడం, నిందలు వేయడం  ప్రజలకు కూడా వెగటు వచ్చేసింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని  కష్టపడి నిలబెట్టారు. ఈ దాడులు, వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఏమిటని ప్రజలు భావిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఇతర రాష్ట్రలకు ఇచ్చిన విధంగా రాయితీలు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. దానికి బీజేపీ వారు ఆగ్రహించారు. వారి ఓట్లు కూడా వైసీపీకి వేసి జగన్ ని గెలిపించారు. చీఫ్ సెక్రటరీని మార్చేశారు. వారికి అనుకూలంగా పెట్టారు. ఏమేమి చేయాలో, అన్నీ చేశారు.  కేసీఆర్ కూడా చేయాల్సింది చేశారు. కేంద్రం, కేసీఆర్, ప్రశాంత కిషోర్ ల పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారి కేసు హైకోర్టు కొట్టివేసింది. పదేపదే చంద్రబాబు నాయుడు పారిపోయారని చెబుతున్నారు. చంద్రబాబు గారు డబ్బు ఇచ్చినది మీరు చూశారా? విభజన చట్టం తరువాత కాంగ్రెస్ పై రాష్ట్ర ప్రజలల్లో ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఈ విపత్తు నుంచి పెట్టుబడుల వ్యతిరేక చర్యలు, రాజధాని విషయంలో మోడీ కాపాడతారని ప్రజలలలో ఒక రకమైన బ్రమ వచ్చింది. బీజేపీ రాష్ట్ర పార్టీ అమరావతికి మద్దతు ఇస్తోంది. విశాఖ జిల్లా శాఖ వారు కూడా రాజధాని అమరావతి ఉండాలిన విశాఖ కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చారు. ప్రశంసించవలసిన విషయం. కొంతవరకు కేంద్రంపై ఆగ్రహం తగ్గింది. కోర్టులపై ప్రజలకు ఆశ ఉంది. బీవీఎల్ చేసే కార్యక్రమం బీజేపీకి ఏమైనా లాభమా? ఈ ప్రభుత్వంపై ఈగ వాలకుండా చేయడం ఏమిటీ? పార్టీ పెట్టిన తరువాత 6 సార్లు గెలిచాం. 5 సార్లు ఓడిపోయాం. ఓడిపోయినా ఇంత ఓటింగ్ శాతం రాలేదు. బీజేపీకీ 0.84 శాతం వచ్చింది. వారికి అంత తక్కువ ఓట్లు లేవు ఇక్కడ. వారి ఓటింగ్ అంతా అటు తిప్పారు. అధికార యంత్రాన్ని అటు తిప్పారు. ఈవీఎంల విషయం ప్రజలు మాట్లాడుతున్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయి.
మెడలు వంచుతామన్నారు. రాజీనామాలు చేస్తే ఉద్యోగాల విప్లవం వస్తుందని చెప్పారు.
8 నెలల్లో లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు పోగొట్టారు. పరిశ్రమలను తరిమేశారు.

రాజీవ్ గాంధీ – వైసీపీ
జర్నలిజం మసకబారిపోయింది. మా తరం వచ్చేసరికి మారిపోయింది. కియా మోటార్స్ కు సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడతారు. ప్రభుత్వం కూడా అటువంటి కంపెనీలతో మాట్లాడుతుంది. కొన్ని అవాస్తవ కథనాలు ఉంటాయి. ఈ విషయాన్ని జగన్మోహన రెడ్డి గారి దృష్టికి తీసుకువెళతాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాలనే విషయంలో నైపుణ్యత లేదంటే నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మన యువతకు శిక్షణ ఇప్పిస్తున్నారు. రాజశేఖర రెడ్డిగారు ఆ కంపెనీకి లెటర్ రాశారు. ఎక్కడో తయారైన కార్లను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. వాస్తవ ప్రారంభం జగన్ గారు చేశారు. కియా కంపెనీ ఇక్కడే ఉండాలిన మనం కోరుకుందాం. ఈ విషయంలో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కంపెనీ అనుకుందని ఎక్కడా కన్ఫర్మేషన్ రాలేదు. గొడవలు, ఘర్షణలు పడే వాతావరణం మా వద్ద లేదు.
చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ గతి పట్టించలేదు. రాష్ట్ర ప్రజలే పట్టించారు. మేం ఒక్కరిగానే పోటీ చేశాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంకృతాపరాదంతోనే ఓడిపోయారు. తెలుగువాళ్లు, ముఖ్యంగా జగన్ వంటి నాయకులు బెదిరిస్తే బెదురుతారు అనుకోవడం అవివేకం. ప్రత్యేక హోదా విషయంలో అందరం కలసికట్టుగా వెళ్లవలసిన అవసరం ఉంది. సీఎం ప్రధానికి లేఖ రాశారు. అక్కడ నుంచి స్పందన రావాలి. తోలు తీస్తాం, తొక్క తీస్తాం అని ఈ రాజకీయ నాయకులు అనడం అలవాటైపోయింది. ఇటువంటి వాదనలు అప్రస్తుతం. ప్రత్యేక హోదా అడిగి తీరతారు.
చట్టంలో పెట్టారు గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. (మార్చి 2,2014లో అప్పటి యుపిఏ ప్రభుత్వం కేబినెట్ రిజల్యూషన్ కూడా 14 ఫైనాన్స్ కమిషన్ కు వెళ్లిపోయింది. కాంగ్రెస్ చేయవలసిన పని అయిపోయింది) కుట్రపూరితంగా కాంగ్రెస్ చివరి నిమిషంలో చేసింది. రాష్ట్రానికి ఈ గతి పట్టింది. 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పాం. దేవుడి దయ ఆ మోడీకి కూడా ఉంది. మిగతా పార్టీలు వేరు, మా పార్టీ వేరు. మా నాయకుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టారు.
8 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు ఏపీ హెచ్ఎస్ స్టీల్, పోస్కో స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, చింకాం స్టీల్, ఏసీటీ టైల్స్, పానాసోనిక్ ఎలక్ట్రానిక్స్, బ్లాక్ కార్బన్... దాదాపు 30వేల కోట్ల పెట్టుబడులతో 25,965 మందికి ఉపాధి కల్పించే విధంగా సంస్థలు వచ్చాయి. కొన్ని ప్రోసెస్ లో ఉన్నాయి.

రఘురామ్ – బీజేపీ
ఒక కంపెనీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం.  ఒక పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రావడం, ఆర్థిక రాబడి, అభివృద్ధి ఉంటాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎవరిమీదో కోపంతో ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదు. అటువంటి ఆలోచన కూడా తప్పే. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకోవాలి. ఉన్న పరిశ్రమ వెళుతుందంటే కొత్తగా ఎవరూ రారు.  సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి ఇద్దరూ యువకులే. చంద్రబాబుకు మించి పోటీపడి పెట్టుబడులు తేవాలి. ఏపీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటివి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు పరిస్థితి వస్తుంది. మొత్తంగా ఏపీకి నష్టం జరుగుతుంది. ప్రస్తుతం పార్లమెంటులో కూడా ఏపీ విషయమే మాట్లాడుతున్నారు. ఏపీకి ఏమివ్వాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది. ఈ విషయంలో కేంద్రం కలుగజేసుకుంటంది. 
జీవిఎల్ గారివి హెచ్చరికలు అనుకోవద్దు. కించపరిచే మాటలు ఏమీ లేవు. హోదాపై రాజకీయం తగదు అనేదే. ఆయన బెదిరిస్తే జగన్ భయపడిపోతాడా? బీజేపీ ఎంపీ కాబట్టి ఆయన మాట్లాడతారు. గతంలో చంద్రబాబు నాయుడు హోదా కావాలని, తరువాత హోదా వద్దని, ప్యాకేజీ కావాలని, మళ్లీ హోదా కావాలన్నారు. అలాంటివి వద్దన్నారు. బీజేపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ప్యాకేజీ ఇస్తామంటే అప్పటి ప్రభుత్వం వెనక్కు వెళ్లింది. ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. రాష్ట్రంలో 53,800 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర పార్టీల మధ్య వ్యత్యాసం ఉంది. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి రాజకీయాలు చేస్తాం. రాజకీయాలు చేయకుండా రాజకీయ పార్టీ ఏంటి?
రాజీవ్ చెప్పిన విధంగా, మాల్యాద్రి గారు చెప్పిన విధంగా ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఎవరైనా ప్రత్యేక హోదా ఇస్తే వస్తామని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు సమ్మిట్లు పెడితే ఒక్కరు కూడా ప్రత్యేక హోదా అడగలేదు. రూ. 17 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు పెట్టారు. ఒప్పుకున్న ప్యాకేజీ ప్రకారం ఏం రావాలో రాయమనండి మేం కూడా వస్తాం. అడుగుదాం. డబ్బు తెద్దాం. 13 జిల్లాలను అభివృద్ధి చేద్దాం. రాజధాని అమరావతి ఉంది గదా. అందరూ అమరావతి అంటున్నాం. అమరావతి అని జీవిఎల్ కూడా చెప్పారు.

అంబటి రామకృష్ణ – కాంగ్రెస్
కియా మోటార్స్ వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. ఉత్పత్తి ప్రారంభం అయింది. కారు బయటకు వచ్చింది. ఈ పరిస్థితులలో ఆ కంపెనీవారు వార్త రాయించుకొని బేరసారాలకు వెళుతున్నారంటే మనం ఆలోచించాలి. ఇదే కంపెనీ ఆగస్ట్ 22, 2019లో రెండవ షిఫ్ట్ కూడా నడుపుతామని చెప్పింది. అలా చెప్పిన కంపెనీ వెళ్లిపోవడానికి సిద్ధం పడిందంటే ఆలోచించాలి. అనుబంధ పరిశ్రమలు...... పరిశ్రమలకు పాత ప్రభుత్వం రాయితీలు ఇచ్చేసింది. పరిశ్రమ ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఆ రాయితీను భరించలేమని అంటే ఎలా? కొత్తగా భరించేది ఏముంటుంది. హూండాయ్ కంపెనీకి మంచి పేరుంది. ఆ కంపెనీ తరపున వెళితే మంచిదన్న ఉద్దేశంతో వారు వెళ్లి ఉండవచ్చు. మన దేశంలో ఎఫ్ డీఐలు పది సంవత్సరాలు వెనక్కు వెళ్లాయి. ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటివి వెనక్కువెళితే రాష్ట్ర మనుగడ పరిస్థితిని ఆలోచించాలి. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆ కంపెనీ ఇక్కడ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రత్యేక హోదాని అడిగాయి. చంద్రబాబుని దించి జగన్ గారికి గెలిపించారంటేనే ఆయన ప్రత్యేక హోదా విషయంలో చేసింది ఉత్తుత్తి పోరాటం అని తేలిపోయింది. ఇప్పుడు నామకేవాస్త అడుతున్నారు. ఎవరైనా అడిగితే దింపుతామని హెచ్చరిస్తున్నారు. ఆ దింపడం ఏమిటి? ఇప్పుడు కొత్తగా మిత్రుడు వచ్చి వారితో చేరాడు. ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడటంలేదు. నెస్ట్ లైన్ లోకి ఆయనను తీసుకువచ్చే అవకాశం ఉంది. మనం ఆలోచించాలి. కాంగ్రెస్ బలం తగ్గిపోయిన విషయం వాస్తవమే. మాపై కుట్ర జరిగింది. మన్మోహన్ సింగ్ కేబినెట్ ఆమోదించింది, దానిని చంద్రబాబు నాయుడు సాధించలేకపోయారని జగన్ గారు విమర్శిస్తారు. రాజీవ్ లాంటివారు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటారు. ద్వంద ప్రమాణాలతో కాంగ్రెస్ పార్టీని చంపే ప్రయత్నం చేశారు. నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే జీవీఎల్ ఆ విధంగా మాట్లాడుతున్నందున అఖిలపక్షాన్ని పిలవండి. పోట్లాడటాం. పోరాడదాం. జగన్ గారు మెడలు వంచి తీసుకువస్తానన్నారు.  అవన్ని ఏమైపోయాయి. వైసీపీ బానిస బతుకు బతకడానికి కారణం ఏమిటి? మిమ్మల్ని ఏ గతి పట్టిస్తామని సవాల్ చేస్తున్నారు. వారికి తొడలు కొట్టండి.

తెలకపల్లి రవి – సీనియర్ జర్నలిస్ట్
కియా మోటార్స్ తరలిస్తారనే వార్త (రాయిటర్స్ ప్రత్యేక వార్తాకథనం) బాధాకరం. ఏపీలో రాజధాని మార్పు,  రివర్స్ టెండరింగ్, అన్నిటినీ సమీక్షించడం ... వంటి అంశాలు పెట్టుబడిదారులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం భరోసా ఇచ్చేవిధంగా వ్యవహరించవలసి ఉంది. కియామోటార్స్ వార్త క్లైమాక్స్ గా అనుకోవచ్చు. ఆసక్తి కలిగినవారు లేదా కంపెనీలు బేరసారాలు ఉండవచ్చు. లోకల్ వారికి ఉద్యోగాలు 75 శాతం ఇవ్వాలన్న విషయంలో ఎలా సాధ్యం అని పత్రికలు కూడా సంపాదకీయాలు రాశాయి. మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. చుట్టుపక్కల అనుబంధ పరిశ్రమలు పెట్టడానికి గత ప్రభుత్వం ఎకరా రూ.6 లక్షలకు ఇస్తే, ఈ ప్రభుత్వం రూ.60 అడుగుతుందని, ఇంత భరించలేమని సంస్థ చెబుతోంది. దీనికి ముందు ఇది తమిళనాడు నుంచి ఏపీకి వచ్చింది. అక్కడ లంచాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చారు. దీని తరలింపు ఆపకపోతే ఉద్యోగపరంగా, పెట్టుబడుల పరంగా, రాజకీయంగా కూడా నష్టం జరుగుతుంది. బెంగాల్ లో పెట్టిన నానో మోటార్స్ గుజరాత్ కు ఎలా వెళ్లిందో మనకు తెలుసు. గత ప్రభుత్వం బాగా చేసింది, ఈ ప్రభుత్వం బాగా చేయడంలేదని తేలికగా చెప్పగలగడం ఒక విషయం. లోతుగా చూస్తే ఇతరఇరితర కారణాలు ఉండవచ్చు. మల్లగుల్లాలు జరుగుతున్నది స్పష్టం. అక్కడ చుట్టుపక్కల కూడా రూ.4వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. లక్ష కోట్ల పెట్టుబడులని ప్రచారం చేస్తున్నారు, వాస్తవానికి రూ.30వేల కోట్ల పెట్టుబడులతో 57వేల ఉద్యోగాలు వచ్చాయని ఇటీవల పరిశ్రమల శాఖ సీఎంకు ఒక నివేదిక సమర్పించింది. మిగిలినవి పైప్ లైన్ లో ఉన్నాయని చెప్పారు. కియాని అంత సులభంగా తరలించడం సాధ్యంకాదు. కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకోమని అంటుంది. పీపీఏల విషయంలో జోక్యం చేసుకున్నారు గదా. పెట్టుబడులకు నష్టం వచ్చినప్పుడు కేంద్రం కదులుతుంది. జాతీయంగా మాంద్యం ఉంది. మేకిన్ ఇండియా నుంచి అసెంబుల్ ఇండియాకి వస్తున్నాం. దీనిని జాతీయ కోణంలో కూడా చూడవలసి ఉంది.
రాయిటర్ వంటి సంస్థలు అభివృద్ధి చెందిన పెట్టుబడి దారుల పక్షాన ఉండే అవకాశం ఉంది. కియా వంటి సంస్థలకు భారతదేశం వంటి పెద్ద మార్కెట్ పై దృష్టి ఉంటుంది. తమిళనాడు-ఏపీ మధ్య వైరుద్యాలను వాడుకోవలన్న ఉద్దేశం కూడా ఉండి ఉండవచ్చు. ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ సమస్య కాదు. ఆ కంపెనీని కాపాడుకోవాలి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు అనేది పెద్ద సమస్య. సుప్రీం కోర్టులో కూడా దీనిని సవాల్ చేశారు. వైసీపీ వారికి ప్రో యాక్టివ్ విధానం ఉండాలి. విదేశీ సంస్థలను, వార్తా సంస్థలను నమ్మవలసిన అవసరంలేదు. వాటికి ప్రయోజనాలు ఉంటాయి. మనకీ ప్రయోజనాలు ఉంటాయి. నెగెటివ్ సిగ్నల్స్ ని పోగోట్టడానికి ప్రభుత్వం ప్రోయాక్టిక్ విధానం అనుసరించాలి. ఆ బాధ్యత సీఎంపై ఉంది.
జీవీఎల్ వ్యాఖ్య ఘోరం. దురహంకారానికి పరాకాష్ట. ప్రత్యేక హోదా రాదురాదు అని చెప్పడం ఏంటి? వచ్చేటెట్లు చేయమని కోరాం. ఆయన నోరు విప్పిన ప్రతిసారి వివాదం. సీఎం ప్రధానికి లేఖ రాస్తే, ఈయన బెదిరించినట్లు మాట్లాడం ఏంటి? బీజేపీ ద్వంద నీతికి జీవిఎల్ ప్రతినిధి. ప్రత్యేక హోదా కోసం లేఖలు రాస్తారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయారంటే బీజేపీ ఏమైనా పాముకుందా? బీజేపీని ఎవరూ బలపరచలేదు. చంద్రబాబు నాయుడు గారికి 39, 40 శాతం ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్ పైన, టీడీపీపైన ఒంటికాలిమీద లేచే వైసీసీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం జీవిఎల్ వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటంలేదు? ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి కార్యాలయం గానీ స్పందించరా?
మూడు పార్టీలు మా మీద కుట్ర జరిగిందని చెబుతున్నారు. బీజేపీ ఏమీ మాట్లాడదు. ఏపీపై పెద్ద కుట్ర జరుగుతుంది. అనురాగ్ ఠాగూర్ చెప్పారు ముగిసిన అధ్యాయం అని. మెడలు వంచుతామన్నవారు తల వంచుతున్నారు. అందరినీ ఎందుకు కలుపుకోరూ. బూటక రాజకీయం నడుస్తోంది.


రవి కిరణ్ – అవుట్ పుట్ ఎడిటర్
రాయిటర్ వార్తా సంస్థ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న సంస్థ. అంత తేలికగా వార్తా కథనం ఇవ్వదు. ఈ వార్తని ముగ్గురు విలేకరులు ఆదిత్య, సుదర్శన్, నిత్య పరిశోధన చేసి  రాత్రి 8 గంటలకు ప్రత్యేక కథనంగా ఇచ్చారు. దీనిని కీలకమైనదిగానే భావించాలి.  కియా మోటార్స్ ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అందువల్ల ఇక్కడకు రావాలని ప్రయత్నిస్తోందని, ఈ వారంలో ప్రాధమిక స్థాయిలో చర్చలు జరిగాయని, వచ్చేవారం సెక్రేటరీ స్థాయిలో చర్చలు జరుగుతాయని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. వారు కియా మోటార్స్ తరపున కాకుండా దాని అనుబంధ సంస్థ హుండయ్ కంపెనీ తరపున వెళ్లి మాట్లాడారు. రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. అయితే కియా మోటార్స్ యాజమాన్యం గానీ, ప్రతినిధులు గానీ ఎవరూ కన్ఫాం చేయలని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, విద్యుత్, పన్నులు, భూమి విలువ ... వంటి కారణాలు చెప్పారు. రూ.7,833 కోట్లతో ప్లాంట్ పెట్టి ప్రారంభించిన నెలల్లోనే తరలించడం అంటే ఖర్చుతో కూడిన పని. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కారణాలు ఉండి ఉంటాయన్నది అనుమానం. ప్రభుత్వం తరపు నుంచి కూడా వేరే కారణాలు ఉండి ఉండవచ్చు. భారత దేశ మార్కెట్ పై మాకు ఆసక్తి ఉంది. అయితే ఇక్కడ సమస్యలు వస్తున్నందున తమిళనాడు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపినట్లు అందులో రాశారు.
------------------

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...