Feb 11, 2020

సీఎస్‌కు తెలియకుండానే ఆమె పేరిటే జీవో-13

v  ఫిబ్రవరి 1న అర్ధరాత్రి.. చడీచప్పుడు లేకుండా అమరావతిలోని 2 కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్లు సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేరిట జీవో.13 జారీ అయింది. ఆ విషయం ఆమెకు తెలియదు. ఆమె సంతకం, కామెంట్లు లేకుండా.. జీఏడీ ముఖ్య కార్యదర్శి సీఎం కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈ  జీవోను జారీ చేయించారు.
v విజిలెన్స్‌ కమిషన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు సీఎంఓ నుంచి సీఎం జగన్‌ సంతకం లేకుండా వచ్చిన ఒక నోట్‌ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చేరింది. ఆమె డిజిటల్‌ సంతకం కూడా లేకుండా అక్కడి నుంచి ఆ ఫైలు ప్రవీణ్‌ ప్రకాశ్‌కు వచ్చింది. సీఎస్‌ సంతకం లేకుండా వచ్చిన ఆ ఫైలుపై ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్లీజ్‌ ఇష్యూ ఆర్డర్స్‌అని రాసి కిందకు పంపారు. అనంతరం 1న అర్ధరాత్రి దాటాక సీఎస్‌ పేరుతో విజిలెన్స్‌ కమిషన్‌, కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ను పరిపాలన సౌలభ్యం కోసం కర్నూలుకు తరలిస్తున్నట్టు జీవో ఇచ్చారు. ఈ కార్యాలయాలను తక్షణమే కర్నూలుకు తరలించేందుకు అవసరమైన భవనాలను చూడాలని కలెక్టర్‌ను, రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. కర్నూలులో కార్యాలయాలే చూడకుండా ఆ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించాలని అంత హడావుడిగా జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కాని అంశం. పైగా ఏ జీవోకు సంబంధించిన ఫైలయినా సెక్షన్‌ అధికారి నుంచి ముందుకు కదులుతుంది. వివరాలు బయటకు పొక్కుతాయన్న ఉద్దేశంతో గుట్టుగా అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయిలో పని కానిచ్చేశారు!
v   సాధారణంగా ఏదైనా ఫైలుపై ఎలాంటి కామెంట్లు రాయాల్సిన అవసరం లేనప్పుడు కొందరు అధికారులు నేరుగా డిజిటల్‌ సైన్‌ చేసి పంపుతారు.. మరికొందరు సీన్‌’(చూశాను) అని రాసి డిజిటల్‌ సంతకం పెట్టి పంపుతుంటారు. కానీ జీవో 13 కోసం నడిపిన నోట్‌ ఫైలులో సీఎస్‌ డిజిటల్‌ సంతకం లేదు. కనీసం ఆమె ఆ ఫైలును చూసినట్లుగా కూడా ఏమీ రాయలేదు. ఈ ఫైలు సీఎంవో నుంచి వచ్చి జీఏడీలో ముగిసింది. సీఎంవోలోనూ, జీఏడీలోనూ ఉన్నది ఒకే ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశే కాబట్టి ఆయనే ఆ ఫైలును సృష్టించి, సీఎస్ కు మార్క్‌ చేసి, ఆమె స్పందించక ముందే జీఏడీకి తీసుకుని ఆదేశాలివ్వండంటూ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు అవగతమవుతోంది. ఈనెల 26 వరకూ తరలింపునకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని అంతకుముందే హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ రీలొకేషన్‌ అనే పదం వాడి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. సీఎస్‌ ఆమోదం లేకుండానే కింది స్థాయి ఉద్యోగులను ఉపయోగించుకుని జీవో ఇచ్చేశారు.
v   సీఎస్‌ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రవీణ్‌ ప్రకాశే తీసుకున్నట్లు ఈ నోట్‌ ఫైలు స్పష్టం చేస్తోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలనుకుంటే దానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకోవాలి. ఆ ఆదేశాలపై ఆయన/ఆమె సంతకం ఉండాలి. అలా ఉంటేనే ఆ ఆదేశాలు చెల్లుబాటవుతాయి. కానీ జీవో నంబరు 13 విషయంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. నోట్‌ ఫైలుపై సీఎస్‌ సంతకం లేదు, కనీసం ఆ ఫైలు చూసినట్లు ఆనవాళ్లు కూడా లేవు. జీవో మాత్రం సీఎస్‌ పేరుతో జారీ చేశారు. మరి ఈ ఆదేశాలు చెల్లుబాటవుతాయా లేదా అనే సందిగ్ధం నెలకొంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...