Feb 28, 2018

నైపుణ్య శిక్షణ, ముద్రపై ప్రధాని సమీక్ష


 సచివాలయం, ఫిబ్రవరి 28: ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకెవివై), ప్రధాన మంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన(పీఎంఎంవై) పథకాలను సమీక్షించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఎన్ఎస్ డీసీ) ద్వారా 75 శాతం పీఎంకెవివై నిధులు వినియోగించి యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించినట్లు  అధికారులు ప్రధానికి వివరించారు. మొత్తం వ్యయంలో రాష్ట్రాలు 25 శాతం నిధులు భరిస్తాయని చెప్పారు.  స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల వివరాలు, పరిశ్రమలు,  ప్రైవేటు రంగ భాగస్వామ్య గురించి తెలిపారు. 33 భాగస్వామ్య పరిశ్రమలు రూ.100 కోట్లు సహాయం అందించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందినవారి వివరాలు తెలిపారు.  ముద్ర పథకం ద్వారా రుణాలు తీసుకున్న, చెల్లించినవారి వివరాలు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సాంఘీక సంక్షేమ శాఖ  ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.

Feb 27, 2018

రాష్ట్రంలో దివ్యాంగులకు సంక్షేమ చర్యలు చేపట్టాలి



దివ్యాంగుల జాతీయ చీఫ్ కమిషనర్ కమలేష్ కుమార్ పాండే
              సచివాలయం, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమ కోసం పలు  చర్యలు చేపట్టవలసి ఉందని దివ్యాంగుల జాతీయ కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ కమలేష్ కుమార్ పాండే అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దివ్యాంగుల పథకాలు అమలు తీరుని సమీక్షించేందుకు ఇక్కడికి వచ్చామని, అయితే విశాఖలో భాగస్వామ్య సదస్సుకు వెళ్లడం వల్ల అధికారులు ఎక్కవమంది సమావేశానికి హాజరుకాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి మళ్లీ వస్తానన, సీఎం, సీఎస్, ఇతర అధికారులను కలసి మాట్లాడాతానని చెప్పారు.  దేశంలో దివ్యాంగుల కోసం 1983లో మొట్టమొదటిసారిగా  ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ దే నన్నారు. అయితే ప్రస్తుతం దీనికి పూర్తి స్థాయి కమిషనర్ ని, ఇతర సిబ్బందిని నియమించి, వాహనం వంటి ఇతర సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో 2.6 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని, వారి సంక్షేమం, వారి హక్కుల కోసం జాతీయ కమిషన్, రాష్ట్ర శాఖలు పని చేస్తుంటాయన్నారు. దివ్యాంగుల అంశం రాష్ట్రాలకు చెందిన అంశమని, కేంద్రం నమూనాగా కొన్ని అంశాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు 10 లక్షల  సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్ లో ఈ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలకు కేంద్రమే రూ.6 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్రం కూడా మంజూరు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఆ విధంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
దివ్యాంగుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో 1998 సెప్టెంబర్ నుంచి 2018 జనవరి వరకు 35,417 ఫిర్యాదులు నమోదు కాగా, వాటిలో 33,636  పరిష్కరించినట్లు వివరించారు. ఒక్క జనవరిలో 162 ఫిర్యాదులు రాగా, 110 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. వికలాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డు (యుడిఐడి) పథకం కేంద్రం ప్రవేశపెట్టిందని, ఈ పథకం కింద కొంతమందికి శిక్షణ ఇస్తారని, నిధులను కూడా కేంద్రం విడుదల చేస్తుందని చెప్పారు. దీనికి రాష్ట్ర కోఆర్డినేటర్ ని నియమించవలసి ఉందని చెప్పారు.
చిన్న పిల్లల్లో వినికిడి సమస్య పరిష్కారానికి కాక్లియా అమరిక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒక్కో కాక్లియా అమరికకు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అటువంటి పథకం రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో దివ్యాంగులకు సంబంధించిన ఒక శాఖ ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలలో చేర్చుకోవడానికి నిరాకరిస్తే, దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారని హెచ్చరించారు. దివ్యాంగులకు సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పని చేసే దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి తాము ముందుంటామని చెప్పారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి ఆయా రాష్ట్రాల కమిషనర్లతో కలసి జాతీయ చీఫ్ కమిషనర్ మొబైల్ కోర్టులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఏపీతో సహా 22 రాష్ట్రాల్లో 40 మొబైల్ కోర్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులు 8,80,800 మందికి సహాయం, వివిధ ఉపకరణాలు పంపిణీ చేయడం కోసం కేంద్రం రూ.550 కోట్లు ఖర్చు చేసి 5500 క్యాంపులు నిర్వహించినట్లు వివరించారు. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటి వరకు 44వేల మందికి శిక్షణ ఇప్పించిందని, ఈ ఏడాది చివరకు 5 లక్షల మందికి, 2022 నాటికి 25 లక్షల మందికి శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేంద్రం 46 వేల ప్రీ-మెట్రిక్, 30 వేల మెట్రిక్, విదేశాల్లో పరిశోధన కోసం 200 స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్లు చెప్పారు. 2017 ఏప్రిల్ 19 నుంచి అమలులోకి వచ్చిన దివ్యాంగుల చట్టం-2016 ప్రకారం 3 శాతం ఉన్న రిజర్వేషన్ ని 4 శాతానికి పెంచారని,  అలాగే ఈ చట్టం ద్వారా వారికి అనేక సౌకర్యాలు, రాయితీలు కల్పించారని వివరించారు. దివ్యాంగులు తమ సమస్యలను సీసీపీడి ఎట్ ఎన్ఐసీ.ఇన్(ccpd@nic.in) ద్వారా చీఫ్ కమిషనర్ కు పంపవచ్చునని కమలేష్ కుమార్ పాండే చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ డిప్యూటీ చీఫ్ కమిషనర్ రాకేష్ కుమార్ రావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ కెఆర్ బీహెచ్ఎన్ చక్రవర్తి, డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ కుమార్ రాజా పాల్గొన్నారు.

Feb 23, 2018

పకడ్బంధీగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు


Ø ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు
Ø పరీక్ష రాసే విద్యార్థులు 10.26 లక్షల మంది
Ø ఈ ఏడాది నుంచి గ్రేడ్ విధానం
Ø పరీక్షా కేంద్రం తెలుసుకోవడం కోసం నూతన యాప్
Ø కాపీ కొడితే 8 పరీక్షల వరకు డిబార్
Ø సమస్యలు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబర్: 18002749868
Ø ఫీజు పేరుతో హాల్ టికెట్ ఆపితే చర్యలు: ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక

             సచివాలయం, ఫిబ్రవరి 23: ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ బి.ఉదయలక్ష్మి చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 10,26,891 మంది పరీక్షకు హాజరవుతారన్నారు.  పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక రోజు మొదటి సంవత్సరం వారికి, తరువాత రోజు రెండవ సంవత్సరం వారికి జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోమని సలహా ఇచ్చారు.  ఈ రోజు నుంచి హాల్ టికెట్లను జ్ఞానభూమి.ఏపీ.జీఓవి.ఇన్ (jnanabhumi.ap.gov.in) వెబ్ సైట్ ని నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చిని తెలిపారు. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ను సంబంధింత కళాశాల ప్రిన్సిపాల్ చేత ధృవీకరించాలని, దానిని తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళ్లాలని వివరించారు. ఫీజులు చెల్లించలేదన్న  పేరుతో విద్యార్థుల హాల్ టికెట్లను ధృవీకరించని ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత ఉన్న విద్యార్థులందరికీ హాల్ టికెట్లు ధృవీకరించాలని ఆమె చెప్పారు. విద్యార్థులు చదువుకునే కాలేజీ కాకుండా జంబ్లింగ్ విధానంలో మరో కాలేజీని పరీక్షా కేంద్రంగా నిర్ణయించినందున, వాళ్లు పరీక్షా కేంద్రాలను తెలుసుకోవడానికి ఇబ్బందిపడకుండా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ లొకేటర్ అనే నూతన యాప్ ను రూపొందించినట్లు తెలిపారు. యాండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే, అది కోడ్ నెంబర్ అడుగుతుందని, ఆ స్థానంలో విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రాన్ని చూపుతుందని వివరించారు. యాండ్రాయిడ్ సెల్ ఫోన్ లేనివారు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవడం  మంచిదని సలహా ఇచ్చారు. పరీక్ష రోజు ఉదయం కేంద్రాన్ని వెతుక్కోవడానికి ఎక్కవ సమయం కేటాయించకుండా, హడావుడి లేకుండా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలన్నారు. మొత్తం 1423 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటిలో 116 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. కాపీయింగ్ జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాపీ చేస్తూ పట్టుబడితే విద్యార్థిని 8 పరీక్షల వరకు డిబార్ చేస్తామన్నారు. విద్యార్థులు కాపీ చేసే అవకాశం లేకుండా, వారు డీబార్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద, అవకాశం ఉన్న మేరకు ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని, సమస్యాత్మక కేంద్రాలలో తప్పనిసరిగా ప్రతి గదిలో ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. థియరీ పరీక్షలను కూడా పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి పది పరీక్షా కేంద్రాలకు ఒక ఫైయింగ్ స్క్వాడ్ ని, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రతి కేంద్రానికి ఒక సిటింగ్ స్క్వాడ్ ని నియమించినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని పరీక్షరాసే పరిస్థితి లేకుండా, అందరికి కుర్చీలు గానీ, బెంచీలు గాని తప్పనిసరిగా ఏర్పాటు చేయమని లేకపోతే అద్దెకు తీసుకొని ఏర్పాటు చేయమని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి రోజూ లాటరీ పద్దతిలో ఇన్విజిలేటర్లను ఎంపిక చేస్తారని చెప్పారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే విజయవాడ ఇంటర్ బోర్డులోని ఫోన్ నెంబర్ 0866-2974130, ఫాక్స్ నెంబర్ 0866-2970056, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868కు తెలియజేయమన్నారు.

               పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించడం కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎండలో వచ్చిన విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ప్రతి సెంటర్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఒక నర్సుని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి ఓ గంట ముందే కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని, కాపీయింగ్ జరుగకుండా ప్రతి కేంద్రం సమీపంలోని ఫొటోస్టాట్ సెంటర్లను మూయిస్తున్నామని, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతోపాటు ఒక పోలీస్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సహకరించవలసిందిగా ఆయా జిల్లా కలెక్టర్లను, పోలీస్, వైద్య ఆరోగ్యం శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ,  ఆర్టీసీ అధికారులకు కోరినట్లు చెప్పారు. ఇంటర్ బోర్డు తరపున నాలుగు వేల మంది  అధికారులు పని చేస్తున్నారని, వారికి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు. కొంతమంది కావాలని పేపర్ లీకైనట్లు వదంతులు సృష్టించే అవకాశం ఉందని, అటువంటివాటిని నమ్మవద్దని చెప్పారు. ఒక వేళ నిజంగా లీకైతే విచారణ జరిపి, నిజానిజాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు సెల్ ఫోన్ తీసుకువెళ్లకుండా నిషేధించినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశ్నాపత్రంపై ఉండే నియమ నిబంధనలు తప్పనిసరిగా చదువుకొని, పరీక్ష రాయడం మొదలుపెట్టాలన్నారు. ఈ ఏడాది ర్యాంకింగ్ లు ఇవ్వడంలేదని, గ్రేడ్ విధానం ప్రవేశపెడుతున్నట్లు ఆమె చెప్పారు.

స్పాట్ వాల్యూషన్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు
              పరీక్షలు ముగిసిన తరువాత స్పాట్ వాల్యూషన్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. పేపర్లు దిద్దే అధ్యాపకులకు రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తామని, వారు దిద్దడంలో అశ్రద్ధ చూపకుండా, తరచూ బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.   సంస్కృతం పేపర్లు దిద్దడానికి ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను తప్పనిసరిగా పంపించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పాట్ వాల్యూషన్ కు వచ్చిన అధ్యాపకులకు వారి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా నగదు రహిత చెల్లింపు అంటే వారి బ్యాంకు ఖాతాలో టీఏ, డీఏలు జమ అవుతాయ ఉదయలక్ష్మి చెప్పారు.

Feb 21, 2018

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త


మంత్రి మండలి నిర్ణయాలు వెళ్లడించిన మంత్రి కాలవ శ్రీనివాసులు

ü డిఏ పెంపు – 2017 జనవరి 1 నుంచి చెల్లింపు
ü 3.86 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
ü గ్రామసహాయకులకు అదనంగా రూ.300
ü విశాఖ, తిరుపతిలలో ఎఫ్ఈసీలు
ü 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు 
ü ఏసీబీలో అదనపు పోస్టులు భర్తీకి ఆమోదం
ü విజయవాడలో ఉర్ధూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు  భూమిని కేటాయింపు
ü శ్రీకాకుళం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుకు భూమి


            సచివాలయం, ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తరువాత 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో మంత్రి కాలవ మంత్రి మండలి నిర్ణయాలు వెళ్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2015 వేతన సవరణ మేరకు 22.008 శాతం నుంచి 24.104 శాతం మేరకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెరిగిన 2.096 శాతం కరవు భత్యం 2017 జనవరి 1వ తేదీ నుంచి చెల్లిస్తారని చెప్పారు. యూజీసీ స్కేల్ వర్తించే వారికి 132 నుంచి 136 శాతానికి డీఏ పెరిగనుందన్నారు. ఈ పెంపు వల్ల 3.86 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పెంచిన కరవు భత్యం నగదు రూపంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న తీసుకునే మార్చి నెల జీతంతోపాటు అందిస్తారన్నారు.   పాత బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోకి జమ చేస్తారనిపదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మార్చి నెల వేతనం నుంచే డీఏ పెంపు వర్తిస్తుందని చెప్పారు కరవు భత్యం పెంపు వల్ల ప్రభుత్వంపై  ప్రతి నెలా రూ.69.91 కోట్లు, ఏడాదికి రూ.838.87 కోట్ల చొప్పున భారం పడనుందని వివరించారు. గ్రామ రెవిన్యూ సహాయకులకు నెలకు రూ.300 చొప్పున తాత్కాలికంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం  ఏడాదికి రూ.6.57 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందన్నారు. ఈ రెండూ కలిపి ప్రభుత్వంపై రూ.845.44 కోట్ల భారం పడుతుందని తెలిపారు.

      పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు పాత రేట్లకే ముందుకొచ్చిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రూ.1244.36 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతి ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు.  ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(ఎపీఇడిబి)కు స్వయం ప్రతిపత్తి కల్పించే ముసాయిదా బిల్లుని ఆమోదించినట్లు తెలిపారు.   రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎటువంటి భయాలు లేకుండా వివాదరహితంగా ఉండేలా చూడటానికి బోర్డుకు స్వయం ప్రతిపత్తి కల్పించే బిల్లు దోహదపడుతుందని మంత్రిమండలి భావించినట్లు పేర్కొన్నారు.   ఏపీ ఈడీబీ చట్టం 2018 అనుసరించి స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ), స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ కమిటీలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించేలా బిల్లు రూపొందించారని వివరించారు.

విశాఖ, తిరుపతిలలో ఎఫ్ఈసీలు
             జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్నిపల్ కార్పోరేషన్) పరిధిలో కుటుంబ వినోద కేంద్రం (ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్-ఎఫ్ఈసీ) ఏర్పాటుకు ఎస్పీఐ సినిమాస్ ప్రెవేట్ లిమిటెడ్ (డెవలపర్)కు 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన 2.7 ఎకరాలను కేటాయించేందుకు జీవీఎంసీ కమిషనరుకు అనుమతి ఇస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు.  లీజు రూపంలో మొదటి ఏడాది రూ. 4.284 కోట్లు చెల్లించాల్సి వుంటుందని, ఏడాదికి 5 శాతం చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పారు.  పీపీపీ పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టుని రూ. 25 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారన్నారుప్రాథమికంగా ఏపీ టూరిజం కార్పోరేషన్(ఏపీటీడీసీ) దీని ఖర్చులను భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీనిని నిర్వహిస్తుందని చెప్పారు.  తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో ఎఫ్ఈసీ ఏర్పాటుకు అన్నమయ్య సర్కిల్‌లో 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన 3.72 ఎకరాలను ఎస్పీఐ సినిమాస్ కు కేటాయించేందుకు తుడా వైస్ చైర్మన్‌కు అనుమతిస్తూ  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.   లీజు రూపంలో మొదటి ఏడాది రూ. 3.265 కోట్లు చెల్లించేవిధంగా, ఏడాదికి 5 శాతం చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా ఒప్పందం కుదుర్చుకుంటారని వివరించారు. పీపీపీ పద్దతిలో 25 కోట్ల వ్యయంతో  చేపట్టే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పారు.
23 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్, 80 వేల చ.. విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయం ఏర్పాటు చేస్తారని, 6 మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్లతో ఐమ్యాక్స్ ధియేటర్, 3 స్టార్ల హోటల్ నిర్మిస్తారని వివరించారు. ఈ ప్రాజెక్టులో వారు ప్రతిపాదించిన రూముల కంటే ఎక్కువ సంఖ్యలో రూములను నిర్మించాలని సీఎం సూచించినట్లు తెలిపారు. దీని ఖర్చులను కూడా ఏపీటీడీసీయే భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తుందని చెప్పారు.
42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు 
           ఎక్స్ టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల క్రింద ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు పబ్లిక్ హెల్త్, మెడికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని సింగిల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  42 నాన్ అమృత్ పట్టణాల స్థానిక సంస్థలలో మౌలిక సదుపాయాల సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వ్యయం కోసం  రూ.4,188.71 కోట్లకు పరిపాలనా ఆమోదం లభించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116.99 కోట్లు, ఆయా పురపాలక సంస్థలు రూ.465.41 కోట్లు ఖర్చు చేస్తాయని, ఎక్స్‌ టెర్నల్ ఏజెన్సీలు రూ.2,066.31 కోట్లు చొప్పున ప్రాజెక్టుకు ఫైనాన్సింగ్‌ చేస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఏపీయుడబ్ల్యూఎస్ఎస్ఎంఐపీ) కింద ఈ ప్రాజెక్టు చేపడతారని చెప్పారు.  ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంటు బ్యాంకుతో వివిధ ఒప్పందాలను చేసుకునే బాధ్యతను అప్పగిస్తూ మంత్రి మండలి తీర్మానించినట్లు తెలిపారు.

      యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)లో కొత్తగా 350 పోస్టులను భర్తీ చేసేందుకు,   అందులో 300 ఖాళీలను నేరుగానూ, మిగిలిన 50 ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని  నిర్ణయించినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టినందున ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూసేందుకు ఏసీబీని బలోపేతం చేయాలని, జాయింట్ డైరెక్టర్ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ వరకు వివిధ స్థాయిల్లో ఈ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుందన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరంలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు కోసం కొత్తగా 25 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని,  ఇందులో సీనియర్ సివిల్ జడ్జి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు వున్నాయని వివరించారు.
శాసన సభాపతికి  పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ని నియమించేందుకు వీలుగా ఒక పోస్టును సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు,  ముందుగా ఒక ఏడాది కాలం డిప్యూటేషన్ విధానంలో సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి భర్తీ చేసుకోవాల్సి వుంటుందన్నారు. విజయవాడ విద్యాధరపురంలో ప్రభుత్వ ఉర్ధూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు 92 సెంట్ల భూమిని కేటాయిస్తూ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలోని 44.97 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి  ఉచితంగా అందిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసున్నట్లు మంత్రి కాలవ తెలిపారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...