Feb 20, 2018

24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు


పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ రెడ్డి
Ø 11 అంశాల ప్లీనరీ సెషన్స్
Ø 8 అంశాల  రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్
Ø రెండు కొరియా, జపాన్ సెషన్స్
Ø భారీగా పెట్టుబడులు రాక
Ø ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అనుకూల వాతావరణం

           సచివాలయం, ఫిబ్రవరి 20: విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు భాగస్వామ్య సదస్సు జరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ రెడ్డి చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సదస్సుకు సంబంధించిన అంశాలను ఆయన వెళ్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 2001, 2003, 2004లలో ఈ సదస్సులు జరిగాయాని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరిగే మూడవ సదస్సు ఇదని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో  కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సులలో గతంలో కేంద్ర ప్రభుత్వం సెషన్స్ మాత్రమే జరిగేవని, ఈ సారి  కేంద్రానికి చెందిన 11 ప్లీనరీ సెషన్స్ తోపాటు 8 అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్ ఉంటాయని తెలిపారు. ప్లీనరీ సెషన్స్ లో సన్ రైజ్ ఏపీ, ఇండస్ట్రీ 4.0, స్కిల్ డెవలప్ మెంట్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, మౌలికవసతుల అభివృద్ధి, రాష్ట్ర సెషన్స్ లో ఆటోమొబైల్, టెక్స్ టైల్, పునరుత్పాదక శక్తి, పర్యాటకం, ఎరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ ఎక్విప్ మెంట్ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అంతేకాకుండా కొరియాజపాన్ దేశాలకు చెందిన రెండు సెషన్స్ కూడా జరుగుతాయని చెప్పారు. ఈ సదస్సు ప్రారంభం రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరవుతారన్నారు. 14 దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, అంతర్జాతీయంగా పేరున్న 39 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు మొత్తం 2500 మందిని ఆహ్వానించినట్లు వివరించారు.
                సీనియర్ నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని, ఆయన వల్ల రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అన్నారు. 2016లో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.3,44,201 కోట్ల పెట్టుబడులు, 7,03,727 మందికి ఉపాధి లభించే సంస్థల ఏర్పాటుకు సంబంధించి 290 అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) జరిగినట్లు వివరించారు. వాటిలో 65.17 శాతం సంస్థలు, 44.26 శాతం పెట్టుబడులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 2017లో జరిగిన సదస్సులో 14,96,513 మందికి ఉపాధి కల్పించే  రూ.7,65,994 కోట్ల పెట్టుబడులతో స్థాపించే ప్రాజెక్టులకు సంబంధించి 586 అవగాహన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. వాటిలో 39.76 శాతం ప్రాజెక్టులు, 33.86 శాతం పెట్టుబడులకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సదస్సులలో కాకుండా 11,28,340 మందికి ఉపాధి లభించే రూ.3,15,713 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు సంబంధించి 941 ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. వాటిలో 53 శాతం ప్రాజెక్టులకు సంబంధించి 38 శాతం పెట్టుబడులతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
రెండు సదస్సులు కలుపుకొని పారిశ్రామిక విభాగంలో 8,74,658 మందికి ఉపాధి లభించే  రూ.2,92,300 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించే ప్రాజెక్టులకు సంబంధించి 178 ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. వాటిలో 54 శాతం ప్రాజెక్టులు 57.80 శాతం పెట్టుబలతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులలో కొన్ని నిర్మాణ దశలో, మరి కొన్ని యంత్రాల అమర్చే దశలో, ఇంకొన్ని ప్రారంభించే దశలో ఉన్నాయని చెప్పారు.
                     రాష్ట్రంలో సముద్రతీరం అధికంగా ఉండటం, వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం వల్ల  ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఆశాజనకంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ రంగానికి ఇక్కడ అనుకూల వాతావరణం ఉన్నందన్నారు.  ఈ రంగంలో రెండు సదస్సులలో 88,793 మందికి ఉపాధి కల్పించే రూ.9,702 కోట్లతో ప్రారంభించే ప్రాజెక్టులకు సంబంధించి 243 ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. వాటిలో 62 శాతం ప్రాజెక్టులు 65 శాతం పెట్టుబడులతో నిర్మాణదశలో ఉన్నట్లు తెలిపారు. ఈ రంగం అభివృద్ధి చెందడం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఇటు వినియోగదారులకు నాణ్యమైన ఆహారపదార్ధాలు లభిస్తాయన్నారు.  ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి జర్మనీకి చెందిన ఒక లాబ్ ఈరోజే మంగళగిరిలో ప్రారంభించినట్లు చెప్పారు. ఆసియా ఖండంలోనే  ఈ లాబ్ మొదటి స్థానంలో ఉందని, ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ కూడా ఇస్తారని తెలిపారు. డాక్టరేట్ చేసే విద్యార్థుల పరిశోధనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులు పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. సీఎం కష్టపడి పెట్టుబడులు రాబడుతున్నట్లు చెప్పారు.  అనంతపురంలోని కియా ప్లాంట్‌లో ఫ్రేమ్‌వర్క్‌ ఇన్‌స్టలేషన్‌ పనులను ఈ నెల 22న సీఎం ప్రారంభిస్తారని మంత్రి అమరనాథ రెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...