Aug 31, 2019

రాజధానిని తరలించే అవకాశంలేదు





v 34 వేల ఎకరాల భూ సమీకరణ
v తాత్కాలిక శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణం
v రూ.40వేల కోట్ల వ్యయంతో కొనసాగుతున్న 36 ప్రాజెక్టుల నిర్మాణాలు
v 65 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 13 వందల ఎకరాల కేటాయింపు
v రాజధాని తరలింపు భారీ వ్యయంతో కూడిన పని
v అనుకూలంగా లేని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
v అభివృద్ధి వికేంద్రీకరణకు కొన్ని ముఖ్య నగరాలపై దృష్టి
v రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవకాశం
v కొంత భూమి రైతులకు తిరిగి ఇచ్చే ఆలోచన

              కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవడం, ఇటీవల పట్టణాభివృద్ధి  శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రాంత ప్రజలలో  రాజధానిని తరలిస్తారన్న ఆందోళన మొదలైంది. రాష్ట్ర నడిబొడ్డున, కృష్ణా నది ఒడ్డున స్థల ఎంపిక, భూసేకరణ, కొన్ని నిర్మాణాలు పూర్తి కావడం, మరి కొన్ని నిర్మాణ పనులు జరుగుతుండటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో రాజధానిని తరలించే అవకాశం లేదు. ప్రదేశం ఎంపిక, భూ సేకరణ విషయంలో కొంతమందికి  అభ్యంతరాలు ఉంటాయి. అలాగే లాభ నష్టాలు కూడా ఉంటాయి. అది సహజం. కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో అందరినీ సంతృప్తిపరచడం అసాధ్యం. అమరావతి భూసేకరణ, నిర్మాణాలు, కాంట్రాక్టుల ప్రక్రియలో అవకతవకలు జరిగడానికి అవకాశం ఉంది. అయితే  ఈ పరిస్థితులలో రాజధానిని మార్చడం అత్యంత వ్యయప్రయాసలు, భారంతో కూడుకొన్న పని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రభుత్వం అటువంటి అలోచన చేసే అవకాశాలు చాలా తక్కువ. అవకతవకలను సరిదిద్ధడానికి, రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పలువురు భావిస్తున్నారు.  
                      గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రాజధాని అమరావతిగా ప్రకటించారు. ఈ గ్రామాలకు చెందిన 28,158 మంది రైతుల నుంచి 34 వేలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతులకు చాలా వరకు ప్లాట్లు పంపిణీ చేశారు.
           తాత్కాలిక శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి.  అక్కడ నుంచే చట్టాలు రూపొందించండం, పరిపాలన, కోర్టు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపు 65 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 13 వందలకు పైగా ఎకరాల భూమి కేటాయించారు. కొన్ని సంస్థలకు అప్పగించారు. వందల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలు ఇక్కడ క్యాంపస్‌లు నిర్వహిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు సంబంధించి ప్రభుత్వ వసతి గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. రాజధానిలో ప్రతి పేదకు కట్టించే ఇళ్ల నిర్మాణం చాలా వరకు పూర్తి అయింది. కొన్నిటి నిర్మాణం పూర్తి కాగా, కొన్నిటి నిర్మాణం చివరి దశలో ఉన్నాయి.
                రాజధానిలో రూ.40వేల కోట్ల విలువైన 36 ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 35 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తి అయ్యాయి. పది వంతెనలు నిర్మించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. గత ఏడాదే దానిని ప్రారంభించారు. మౌలిక వసతులకు సంబంధించిన పలు పనులు మధ్యలో ఆగిపోయాయి. కొద్దిపాటి వ్యయంతో పలు భవనాల నిర్మాణం పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఆ భవనాలన్నిటినీ ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఇక్కడ ఇంత వ్యయం చేసి, ఇన్ని నిర్మాణాలు జరిగిన తరువాత రాజధానిని తరలించే ఆలోచన ప్రభుత్వం చేయదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు గానీ, బీజేపీ ఎంపీ గానీ  మాట్లాడుతున్న మాటల ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. 1. రాజధాని అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలను నిదానంగా పూర్తి చేయడం. 2. రాజధానికి ఇంత భూమి వద్దనుకుంటే కొంత భూమి రైతులకు తిరిగి ఇచ్చే అవకాశం. దానికి విధి విధానాలు రూపొందించండ. 3.అధికార వికేంద్రీకరణలో భాగంగా ఆయా ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి, కర్నూలులలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం. 4. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం. 5.పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం విశాఖ, తిరుపతి, దొనకొండ, అనంతపురంలపై ప్రత్యేక శ్రద్ధ. 6.రాష్ట్రమంతటితోపాటు సముద్ర తీరం వెంట పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం.... వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధానిని తరలించడం గానీ, రెండు మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేయడం గానీ అత్యంత వ్యయంతో కూడుకున్న పని. ప్రస్తుతం రాజధాని కోసం అంత వ్యయం చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు ‘నవరత్నాల’ అమలుకు భారీ వ్యయం అవుతుంది. ప్రభుత్వం దృష్టంతా నవరత్నాలపైనే ఉంది. అయితే రాజధాని అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ జరిగే సమయంలో త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Aug 24, 2019


అరుణ్‌ జైట్లీ కన్నుమూత!


                
                న్యూడిల్లీ: భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు.  గత కొంతకాలంగా మూత్రపిండాలు,  క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయను గతంలో వైద్యం చేయించడం కోసం అమెరికా తీసుకువెళ్లారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ ఫలితం లేదు. అరుణ్ జైట్లీ మరణించిన విషయాన్ని  ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

               2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్య మంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు.  2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బీజేపీ విజయం సాధించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు.
1952 నవంబర్ 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో అరుణ్‌ జైట్లీ జన్మించారు. వారిది పంజాబీ హిందూ కుటుంబం. తండ్రి న్యాయవాది. ఢిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో (1960- 1969)పాఠశాల విద్య అభ్యసించారు.  1973లో కామర్స్‌ లో డిగ్రీ, 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో  ఏబీవీపీ ఉద్యమాలలో పాల్గొన్నారు.  1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అరుణ్‌ జైట్లీ 1982 మే 24న సంగీత డోగ్రీని వివాహం చేసుకున్నారు.   1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు,  కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.  పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు.
                   1991 నుంచి ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అరుణ్ జైట్లీకి ఇద్దరు పిల్లలు సోనాలీ జైట్లీరోహన్‌ జైట్లీ. వారు ఇద్దరూ కూడా న్యాయవాదులే. తాత దగ్గర నుంచి  వారిది న్యాయవాదుల కుటుంబం. 
http://tolivelugu.com/abvp-to-rajyasabha/

Aug 22, 2019


ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం?
                  సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనం సృష్టించనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయమే మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు అందుకు అంగీకరించలేదు. హైదరాబాద్ ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.  రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇక్కడ కూడా తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ ని రెండవ రాజధానిగా చేసే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్ట్రపతికి  శీతాకాల విడిదిగా ఉంటోంది. సికింద్రాబాద్ లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు, ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. అలాగే సిమ్లాలో రాష్ట్రపతికి వేసవి విడిది కూడా ఉంది.  
               కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజలలో బీజేపీ మంచి పట్టు సాధించింది. అలాగే  సీడీఎస్ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) నియామక నిర్ణయం కూడా పలువురిని ఆకట్టుకుంది.   ఇదే క్రమంలో అటు తెలంగాణలో టీఆర్ఎస్ ని దెబ్బతీసి, హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఇటు ఏపీ ప్రజల మనసు చూరగొనాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విధంగా   రెండు తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో  వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2023లో తెలంగాణలో తమ పార్టీ  అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.    

Aug 9, 2019


ఒకే దేశం - ఒకే రాజ్యాంగం


‘ఒకే దేశం - ఒకే రాజ్యాంగం’ అదే బీజేపీ లక్ష్యం.  ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అంటూ ఏక్తా భారత్ అనే నినాదంతో  జనసంఘ్ పార్టీ పుట్టింది. కాల క్రమంలో అది భారతీయ జనతా పార్టీ(బీజేపీ)గా ఏర్పడింది. ఆ పార్టీ సిద్ధాంత రూప కర్త రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ఉద్దేశం కూడా అదే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే ఎన్నికలు - ఒకే కార్డు,  ఒకే విధమైన రిజర్వేషన్ విధానం -  దేశ పౌరులందరికీ (స్త్రీ, పురుషులిద్దరికీ) సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను..... విధానాలతో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ
నేపధ్యంలో  దేశ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ
సంచలన  నిర్ణయాలు తీసుకున్నారు. అదే జమ్ము-కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే రాజ్యాంగంలోని 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దు, జమ్ము-కశ్మీర్ విభజన నిర్ణయాలు.  భారతదేశ చరిత్రలో 1947 ఆగస్ట్ 15 తరువాత గుర్తుంచుకోతగిన రోజు 2019 ఆగస్ట్ 5. ఆ రోజున  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  103 క్లాజులతో 58 పేజీల ‘జమ్ము-కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్-2019’ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఉమ్మడి జమ్ము-కశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజన అయ్యాయి. జమ్ము-కశ్మీర్‌ శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించాయి. ప్రస్తుతం కశ్మీర్‌ ప్రాంతపరిధిలోని పది జిల్లాలు, జమ్ము ప్రాంతంలోని పది కలిపి 20 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడింది. అలాగే లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో లద్దాఖ్‌ ప్రాంతం చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకె)కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. ఆ ప్రాంతం మొత్తంపై కేంద్ర అధికార పరిధి పెరిగింది.  రాజ్యసభ ఆ బిల్లును  ఆమోదించింది. మరో పక్క అదే సమయంలో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. దాంతో జమ్ము- కశ్మీర్‌ శాసనసభలో భారతరాజ్యాంగం తక్షణం పూర్తి  స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుని ఆగస్ట్ 6న లోక్ సభలో చర్చకు పెట్టారు. బీజేపీకి బలం ఉన్నందున అక్కడ కూడా ఆమోదం పొందుతుంది.  ఈ బిల్లు రూపొందించడంలో మోడీ, అమిత్ షాలు ఇద్దరూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘనవిజయం సాధించారు. ఈ ఇద్దరూ హీరోలుగా నిలిచారు.   దేశంలో అత్యధిక మంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ, శాంతి భద్రతల విషయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటూ, 70 ఏళ్లుగా రావణ కాష్టంలా రగులుతున్న సమస్యకు పరిష్కారం చూపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థిర, చరాస్తులను వదులుకొని ఎక్కడెక్కడో తలదాసుకుంటున్న కశ్మీరీ పండిట్ ల ఆనందానికి అవధులులేవు. ఈ చర్యతో మోడీ, అమిత్ షాలు ఇద్దరూ దేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ మాదిరిగా గుర్తుండిపోతారు.
            చర్చ జరుగకుండా ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెట్టడంలో అర్ధంలేదు. జమ్ము- కశ్మీర్‌ ప్రాంతంలో శాంతిలేదు. ప్రజలకు భద్రత కరువైంది. ఏడు దశాబ్దాలుగా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఆర్టికల్‌ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. మరో పక్క ఆ ప్రాంతంలో అశాంతిని పెంచడానికి, కల్లోలం సృష్టించడానికి  పాకిస్తాన్  చేస్తున్న చేష్టలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితులలో ముందుగా ఈ వ్యూహం బయటపెట్టి, చర్చించిన తరువాత చర్యలకు దిగితే దేశం లోపల, వెలుపల ఎన్నో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది. అందువల్లనే దూరాలోచనతో వారు ఈ ఆలోచనను అత్యంత గోప్యంగా ఉంచి, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొని బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల ఆ ప్రాంత ప్రజల హక్కులు ఏమీ హరించుకుపోలేదు. వారి గౌరవానికి ఏవిధంమై భంగం కలుగదు. వారి మత విశ్వాలసాలకు, సంస్కృతికి ఎటువంటి హానీ ఉండదు. దేశంలోని ఇతర పౌరులకు ఉన్న అన్ని హక్కులు వారు అనుభవిస్తారు. అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి. ఇంకా అదనంగా అక్కడి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. అక్కడ శాంతి నెలకొంటే, కేంద్రం శాంతిభద్రతలపై కాకుండా, అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వీటన్నికంటే ముఖ్యంగా  దేశ సమైక్యతకు, సమగ్రతకు మేలు జరుగుతుంది.  దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా నెలకొనడానికి అవకాశం ఏర్పడుతుంది.

           ఇప్పటి వరకు భారత పార్లమెంటులో చేసే ఏ చట్టంలోనైనా ‘జమ్ము-కశ్మీర్ మినహా’ అని ఉంటుంది. ఇక నుంచి పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం జమ్ము-కశ్మీర్‌లో అమలవుతుంది. ఇప్పటి వరకూ జమ్ము-కశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల విక్రయించే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా అక్కడ భూములను కొని, అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది అంత సామాన్యమైన నిర్ణయం ఏమీకాదు. ఈ నిర్ణయం వల్ల ఇంటా బయట ఎదురయ్యే అన్ని అంశాలను దృష్టిలోపెట్టుకొనే వారిద్దరూ రంగంలోకి దిగి ఉంటారు. అందులో అనుమానం ఏమీలేదు. బిల్లు ప్రవేశపెట్టడానిక ముందు వారు తీసుకున్న జాగ్రత్తలే ఇందుకు నిదర్శనం. ఇక ముందు తలెత్తే అన్నిటిని కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొనగలదని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914






Aug 4, 2019

అవినీతిపై జగన్ ఉక్కుపాదం

         
వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుపోయింది. ప్రభుత్వంలోని కొన్ని శాఖలలో ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, వైద్యం ... వంటి శాఖలలో లంచం ఇవ్వనిదే పనులు జరగవు. వారు  మానవత్వాన్ని కూడా ఏనాడో మరచిపోయారు.  వృద్ధులకు పెన్షన్ కోసం లంచం, రిజిస్ట్రార్  కార్యాలయంలో డాక్యుమెంట్ లో వారు చేసిన తప్పులు సరిదిద్దడానికి కూడా లంచం, పొలం కొలవాలంటే లంచం, పాస్ పుస్తకానికి లంచం, డ్రైవింగ్ లైసెన్స్ కు లంచం, ఇంటి ప్లాన్ కు లంచం, ప్రభుత్వ ఇల్లు మంజూరుకు లంచం, రేషన్ కార్డుకు లంచం, దివ్యాంగుడు కుంటుకుంటూ వచ్చి ధృవపత్రం ఇవ్వమన్నా లంచం... ఈ విధంగా పౌరుల పట్ల వారి వ్యవహార శైలి అత్యంత దారుణంగా ఉంటోంది. అంతా లంచాల మయం. ఇది జగమెరిగిన సత్యం. అటెండర్ దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాలు తినమరిగారు. అవినీతి నిరోధక శాఖ దాడులలో  బయటపడే అధికారుల ఆస్తుల లెక్కలే ఇందుకు నిదర్శనం. కొందరు ఉద్యోగులు లంచం తీసుకోవడం తమ హక్కుగా భావించే స్థితి నెలకొంది. ఉద్యోగులు తమ హక్కుల కోసం, జీతాలు పెంచమని పోరాడతారు. అవినీతి నిర్మూలన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యవస్థలో, ఈ ఉద్యోగులలో మార్పు తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ పరిస్థితులలో అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి సిద్దం పడ్డారు.  వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి, దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్ధాయి వరకు అవినీతిని రూపుమాపడానికి ఆయన పూనుకున్నారు. సీఎం తన స్థాయిలో తాను అవినీతి ప్రక్షాళన మొదలు పెట్టారు. జిల్లాలలో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు అప్పగించారు. మనసుపెట్టి పని చేయమని వారిని కోరారు. రెండు, మూడు నెలల్లో మార్పు కనిపించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. అవినీతి నిర్మూలన కావాలని, లంచం తీసుకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని  ఓ పక్క  సీఎం హెచ్చరిస్తున్నా, కొందరు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా వారి ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారు. అటువంటి వారికి కౌన్సిలింగ్ లాంటి చర్యల వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ముఖ్యంగా వారికి సహాయపడేవారిపైన, వారికి మధ్యవర్తులుగా వ్యవహరించేవారిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది.  ఇదే పట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడే కొంతమందినైనా తొలగిస్తే ఏడాది, రెండేళ్లలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో పదం ఏదైనా  ‘లంచంఅనే అర్ధం వచ్చే మాటను పలకడానికి ప్రతి ఉద్యోగి భయపడే పరిస్థితి రావాలి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ప్రజలకు కావలసిన పనులు లంచం ఇవ్వకుండా నిర్ణీత సమయంలో జరగాలి.  ఆ రకమైన మార్పు వస్తే వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు మళ్లీ  పోటీ చేస్తే ఎన్నికల ప్రచారానికి కూడా వారు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. ప్రజలే స్వచ్ఛందంగా వారికి మద్దతు పలుకుతారు. ఓటర్లు బారులుతీరి మరీ వారికే ఓట్లు వేస్తారు. ఈ ప్రభుత్వం చేపట్టే చర్యల వల్ల వ్యవస్థలో మార్పులు వస్తాయని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Aug 1, 2019


ఒకనాటి మిస్టర్ ఆంధ్ర నేడు స్పీకర్         
          
 రెండు సార్లు మిస్టర్ ఆంధ్ర, మూడు సార్లు మంత్రి, అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ 15వ శాసనసభ స్పీకర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం నుంచి  శాసనసభ్యునిగా ఎన్నికైన సీతారామ్ ఆ జిల్లా నుంచి ఎంపికైన నాలుగవ స్పీకర్. తమ్మినేని సీతారామ్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తొగరాం గ్రామం. 1955 జూన్ 10న తమ్మినేని శ్రీరామమూర్తి, ఇందువతమ్మ దంపతులకు 5వ సంతానంగా ఆయన జన్మించారు. ఆ కుటుంబంలో ఆయనే చిన్నవారు. ఆయనకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. డిగ్రీ వరకు చదివిన సీతారామ్ వాణిశ్రీని పెళ్లి చేసుకున్నారు.  ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్, కుమర్తె నాగినీ విజయలక్ష్మి. అల్లుడు హనుమంతు రాజీవ్ గాంధీ ఐఏఎస్ అధికారి. మొదటి నుంచి సీతారామ్ వ్యాయామం, క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవారు. శరీర దారుఢ్యం, ఆరోగ్యం విషయంలో ఆయన చాలా శ్రద్ధ వహిస్తారు. గతంలో ఆయన మిస్టర్ ఆంధ్రగా రెండు సార్లు ఎంపికయ్యారు.  ప్రొటీన్లు ఎక్కువ, క్యాలరీస్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటారు. ప్రతి రోజూ వాకింగ్ చేస్తారు.

                  విద్యార్థి  దశ నుంచే ఆయన రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.  స్టూడెంట్ యూనియన్ నాయకులుగా ఎదిగారు. 1982లో ఆమదాలవలస సహకార చెక్కర కర్మాగారం డైరెక్టర్ గా పని చేశారు.  పాల్గొన్నారు. 1983లో ఎన్టీఆర్  పిలుపుతో టీడీపీలో చేరారు. 2007 వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. 1983లో తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.  వాక్ఛాతుర్యం కలిగిన సీతారామ్ 1985లో రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ గా పని చేశారు.  ఇప్పటి వరకు ఆరు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1989లో పైడి శ్రీరామమూర్తితో పోటీ చేసి ఓడిపోయారు. 1991, 1994, 1999లో వరుసగా మూడు సార్లు గెలిచారు. 2004 వరకు శాసనసభ్యులుగా ఉన్నారు. 2004, 2009లో బొడ్డేపల్లి సత్యవతిపై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూన రవికుమార్ తో పోటీ చేసి ఓడిపోయారు.  ఆయనకు విశేష రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రచార ప్రతినిధిగా పనిచేశారు.  సీతారామ్ అనర్ఘళంగా ప్రసంగించగల దిట్ట. ఆయనకు ఆవేశం కూడా కాస్త ఎక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  శాప్ వైస్ ప్రసిడెంట్ గా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, యువజన, ఖాదీ, లిడ్ క్యాప్,  క్రీడలు, మున్సిపల్ , చిన్నతరహా పరిశ్రమలు,  సమాచార, పర్యాటక, ఎక్సైజ్, న్యాయ  తదితర 18 శాఖలకు 9 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో టీడీపీ నుంచి ఆ పార్టీలో  చేరారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో మళ్లీ టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 2014లో టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరారు.  వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యునిగా పని చేశారు.  కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఐదుసార్లు ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు టీడీపీ నుంచి,  ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
-శిరందాసు నాగార్జున

నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి సుచరిత
             
  సంచలన నిర్ణయాలతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంత్రి వర్గ కూర్పులో కూడా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళలకు సముచిత స్థానం కల్పించి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ వర్గానికి పాముల పుష్ప శ్రీవాణికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన  మేకతోటి సుచరితకు ఏకంగా హోం మంత్రిత్వ శాఖ అప్పగించారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో సబిత ఇంద్రా రెడ్డికి  హోం శాఖ బాధ్యతలు అప్పగించి సంచలనం సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో హోం శాఖా మంత్రిగా పని చేసిన  తొలి మహిళ ఆమె.  తండ్రి బాటలోనే జగన్ కూడా నవ్యాంధ్ర తొలి హోం మంత్రి బాధ్యతలు  ఓ మహిళకు అప్పగించారు.

          గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత 1972 డిసెంబర్ 25న పొన్నూరులో జన్మించారు. డాక్టర్ నన్నం అంకారావు, ధనమ్మ దంపతుల కుమార్తె అయిన సుచరిత బీఏఎంఎస్( బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) చేశారు.  మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందారు. 1995 మే 21న మేకతోటి దయాసాగర్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన ఇన్ కం టాక్స్ కమిషనర్ గా పని చేస్తున్నారు.   వారికి ఇద్దరు పిల్లలు కుమారుడు హర్షిత, కుమార్తె రితిక. టీవీ చూడటంతోపాటు పుస్తకాలు చవడం కూడా   సుచరితకు ఎంతో ఇష్టం. మాంసాహార ప్రియులు. హైదరాబాద్ బిర్యాని అంటే ఆమెకు చాలా ఇష్టం.

మొదటి నుంచి ఆమె  సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంచినీటి బోర్లు వేయించడం, మెడికల్ క్యాంపులు, మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.  డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో 2006లో ఆమె రాజకీయాలలోకి వచ్చారు.  2006 నుంచి 2009 వరకు ఫిరంగిపురం జడ్పీటీసీగా  పని చేశారు. రాజకీయాలలో డాక్టర్ వైస్సే ఆమెకు గాడ్ ఫాధర్. 2009లో  ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ వైఎస్ ఆమెకు ఇప్పించారు.  తొలి ప్రయత్నంలోనే టీడీపీ అభ్యర్థి కందుకూరి వీరయ్యపై 2042 ఓట్ల మెజార్టీతో శాసనసభ్యురాలిగా ఆమె విజయం సాధించారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో  ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కందుకూరి వీరయ్యపై 16,781 ఓట్ల మెజారిటీతో రెండో సారి  గెలిచారు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. మొదటి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండే సుచరిత ఆయన మరణానంతరం జగన్ వెంటే నిలిచారు. 2014లో వైసీపీ  తరుపున మరోసారి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో 7,405 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్, పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలిగా ఆమె పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. 2019లో వైసీపీ తరఫున మరోసారి పోటీ చేసి ఇద్దరు మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబులను ఓడించి  7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హోం మంత్రి అయ్యారు.
-శిరందాసు నాగార్జున

అక్రమ కట్టడాల కూల్చివేత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం        
  వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా అనేక సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి వాటిలో అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం ఒకటి. ఉండవల్ల సమీపంలో కరకట్ట పక్కన కృష్ణానది ఒడ్డున  ప్రజావేదికలో జూన్ 24న జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘‘మనందరం  పరిస్థితులను ఒక్కసారి గమనించాలి. వ్యవస్థ ఏ స్థాయిలో దిజగారిపోయిందో చూడాలి.  ఈ హాల్లో ఇంత మంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, మంత్రులు, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూర్చున్నారు. ఈ భవనం  చట్టపరంగా సరైనదేనా?
నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, అవినీతితో కట్టిన భవనం ఇది. నది వరద మట్టం స్థాయి 24 మీటర్లు, కాని ఈ భవనం ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. ప్రజావేదిక హాలు ఇక్కడ కట్టొద్దని  కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. నదీ పరిరక్షణ చట్టాన్ని, లోకాయుక్త సిఫార్సులు పట్టించుకోలేదు. ఇది చూపించడానికి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న ఆత్మపరిశీలన చేసుకోవడానికే ఇక్కడే మీటింగ్‌ పెట్టమని చెప్పాను. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని, పర్యావరణ చట్టాలు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలన్నిటినీ ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతర్‌ చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేస్తే మనం ఏం చేసేవాళ్లం? అక్రమ నిర్మాణం ఎందుకు కడుతున్నామని అడిగేవాళ్లం. ఎవరైనా బలహీనులు ఈ పనిచేస్తే.. మనం అక్కడకు వెళ్లి ఆ నిర్మాణాన్ని తొలగిస్తాం. కాని మనమే ముఖ్యమంత్రిగా ఉండి, మనం రూల్స్‌ ను, నియమాలను ఉల్లంఘిస్తున్నాం. అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాలి. ఈ హాలు నుంచే ఆదేశాలు ఇస్తున్నా. ఈ హాలులో ఇదే చివరి మీటింగ్‌.  మొదటి అక్రమ నిర్మాణం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి’’ అని తెగేసి చెప్పారు. 25వ తేదీ ఎస్పీలతో సమావేశం ముగిసిన తరువాత దానిని కూల్చివేశారు. ఆ తరువాత విశాఖలోని అక్రమ నిర్మాణాలకు జీవీఎంసీ, కృష్ణా కరకట్ట వెంట నిర్మాణాలకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేశాయి. కరకట్ట పక్కన మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండే భవనానికి సంబంధించి లింగమనేని రమేష్ పేరిట సీఆర్‌డీఏ అధికారులు నోటీస్ జారీ చేశారు. నోటీస్ కాపీని భవనం బయట గోడకు అతికించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన భూమి, అతను దానం ఇచ్చిన భూములలోనే ఎక్కువ కట్టడాలు ఉన్నాయి. అన్ని అనుమతులతోనే వాటిని నిర్మించినట్లు ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ప్లాన్‌ లేకుండా నిర్మించిన టిడిపి మాజీ ఎంపి మురళీమోహన్‌కు చెందిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ తోపాటు పలు భవనాలను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చేశారు.  భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంప్‌ కార్యాలయం మరి కొన్ని నిర్మాణాలకు అనుమతులు లేనట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
          స్పందన కార్యక్రమంలో తొలి ఫిర్యాదుతో  రాజధాని అమరావతి పరిధి మంగళగిరి మండలం  నవులూరు గ్రామంలో ఓ అక్రమ కట్టడాన్ని రెవెన్యూ అధికారులు జూలై 5న కూల్చివేశారు. గ్రామంలో రోడ్డును ఆక్రమించి  ఓ టీడీపీ నాయకుడు రేకుల షెడ్డు నిర్మించాడు.  ఈ విషయంపై స్థానికులు గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేసిన ఫిర్యాదుకు  రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాన్ని ప్రొక్లెయిన్ సహాయంతో  కూల్చివేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు. దాంతో పర్యావరణ పరిరక్షణతోపాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.  
-శిరందాసు నాగార్జున

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...