Feb 27, 2017

నరేగా నిధులతో గ్రామీణాభివృద్ధి

Ø 2017-18లో భారీ ప్రతిపాదనలు
Ø నిధుల వినియోగ లక్ష్యం రూ.7500 కోట్లు
Ø 4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు
Ø 4 లక్షల పంట సంజీవని కుంటలు
Ø 3 వేల కిలోమీటర్ల పొడవున మొక్కల  పెంపకం
Ø6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు
Ø 70 మినీ స్టేడియంల నిర్మాణం
Ø 90 లక్షల డ్వాక్రా సభ్యుల భాగస్వామ్యం
Ø ‘పల్లెవనం’ పేరుతో గ్రామాల్లో మొక్కలు

        రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి, ఉపాధి హామీకి నరేగా(ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) అత్యంత ఉపయోగకరంగా ఉంది. దీని ద్వారా గ్రామీణులకు ఉపాధితోపాటు అభివృద్ధి జరుగుతోంది. ఈ నిధులతో గ్రామాల్లో పాఠశాల భవనాలు, సిసి రోడ్లు మొదలైన మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే చెరువులు, పంటసంజీవని కుంటల తవ్వకం, చిన్నచిన్న కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, అడవుల పెంపకం, చెట్లు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడేవిధంగా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు నిర్మించడం  వంటి  పనులు చేపడతారు.  153 రకాల కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఉన్న ఈ నిధుల వినియోగానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించేందుకు  త్వరలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నిధులను సమర్ధవంతంగా వినియోగించడానికి, జవాబుదారీతనం వుండేలా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా  సంపద సృష్టి జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
ఎక్కువ శాఖలు నరేగా నిధులు ఉపయోగించుకుని ఆస్తులు సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ పథకం అమలులో రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తున్నందుకు కేంద్రం ప్రశంచింది. ఈ నిధులను వినియోగించి ఉపాధి హామీ పనులు కల్పించడంలో రెండవ స్థానంలో ఉన్న ఏపీని మొదటి స్థానానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.

       రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 661 మండలాల్లోని 13,104 గ్రామ పంచాయతీల్లో ఈ ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఈ పథకం కింద 84,68,774  జాబ్ కార్డులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నాటికి రాష్ట్రంలో నరేగా కింద 11,54,297 పనులు పూర్తి చేశారు. 5,87,080 పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 17,47,57,199 వ్యక్తిగత పని దినాలు కల్పించారు. కూలీలకు కూలి కింద రూ. 2,471 కోట్లు చెల్లించారు. 37,84,846 కుటుంబాలకు చెందిన 62,09,757 మందికి ఉపాధి కల్పించారు.

      రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ పంటలు విషపూరితమవుతున్నాయి. వీటిని వినియోగించిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వాడటం వల్ల మన దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, మిరపకాయలు, కూరగాయలను కొన్ని దేశాలు తిరస్కరిస్తున్నాయి.  సేంద్రీయ ఎరువుల వాడటం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడమేకాకుండా పర్యావరణానికి  రక్షణ చేకూరుతుంది. పర్యావరణ సమతౌల్యతను కాపాడుకోగలిగితే అటు పంటలకు, ఇటు ప్రజలకు కూడా అన్ని విధాల ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.   రసాయనిక ఎరువులు వాడుతూపోతే భూసారం దెబ్బతింటుంది. రానురాను పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సేంద్రీయ వ్యవసాయాన్నే ప్రోత్సహిస్తోంది. సేంద్రీయ వ్యవసాయానికి మించిన మరో ఉత్తమ మార్గంలేదని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇన్ని  ప్రయోజనాలు ఉన్నందున  రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించింది. ఉత్పత్తిలో సస్య రక్షణ చర్యలు చేపట్టి  నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా నరేగా నిధులతో భారీ స్థాయిలో వర్మికంపోస్ట్ యూనిట్లను నెలకొల్పేవిధంగా రైతులను ప్రోత్సహిస్తోంది.  వ్యవసాయ -ఉద్యానవ శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, సెర్ప్ సమన్వయంతో వర్మి కంపోస్ట్ తయారీ, సరఫరాకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు.

    ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయల నరేగా నిధులు ఖర్చు చేశారు.  వచ్చే అర్థిక సంవత్సరం 2017-18లో రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నిధులతో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 4 లక్షల పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల వర్మి కంపోస్ట్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అలాగే  3 వేల కిలోమీటర్ల పొడవున మొక్కల  పెంపకం చేపడతారు.  4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించారు.  6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపడతారు.  రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ధేశించారు.  70 మినీ స్టేడియాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నరేగా నిధులతో మొక్కల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అటు ఉపాధి, ఇటు పచ్చదనం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అటవీ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో,  రహదారులకు ఇరువైపులా ఈ నిధులతో మొక్కలు పెంచుతారు.
      నగర వనాలతో ఆశించిన ఫలితాలు లభించాయి. అందువల్లపల్లెవనంపేరుతో గ్రామాల్లో కూడా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.   గ్రీన్ ఫీల్డ్ లక్ష్య సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుంది.   ఉద్యానవన శాఖ అత్యధిక ఫలితాలు సాధిస్తే పర్యావరణానికి  ఎక్కువ మేలు జరుగుతుంది. రైతులు అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎక్కువ అవకాశం వుంటుంది. నరేగా నిధులను ఖర్చు చేయడం ద్వారా ఈ శాఖ  నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది. 
ఈ నిధులు వినియోగించి చేపట్టే ఉపాధి కార్యక్రమాల్లో రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు చెందిన  90 లక్షల మంది సభ్యులను భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ విధంగా చేస్తే  ప్రతి కుటుంబానికి నెలకు ఖచ్చితంగా రూ. 10 వేల ఆదాయం లభించే అవకాశం లభిస్తుంది.

          ఈ పథకం కింద చేపట్టే పనులను నిధుల కోసం ఆపకుండా, ఆయా శాఖలు తమ వద్ద ఉన్న నిధులను వినియోగించి ఆ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ తరువాత ఎటూ ఆ నిధులు వస్తాయి కాబట్టి డబ్బు ముందుగా ఖర్చు చేసినా ఆయా శాఖలకు ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రతి శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించి లక్ష్యాలను నిర్ణయించుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా నరేగా నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువమందికి ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ పచ్చదనం నింపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

వివాదాస్పద ఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలో దిట్ట

         వివాదాలకు చిరునామా రామ్ గోపాల్ వర్మ.  పరిచయం అక్కరలేని సంచలన సినిమా దర్శకుడు. వివాదాస్పద వాస్తవ ఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలో వర్మ దిట్ట.  అటు సినిమా, ఇటు నిజజీవితంలో ఏదో ఒక వ్యాఖ్య చేసి  వార్తలకెక్కడం ఆయన జీవన శైలిగా మారిపోయింది. సినిమా హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు, చివరికి మత విశ్వాసాలను కూడా  వదలరు. కొన్ని సందర్భాల్లో  చాలా వింత వింతగా  మాట్లాడతారు. ఆయన మాటల ద్వారా ఎంతోమందిని నొప్పిస్తుంటారు. మెప్పిస్తుంటారు. వివాదాలు, సంచలనాలే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో  కొత్తకొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటారు.  వివాదాలు లేకపోతే ఆయనకు ఒక్క క్షణం కూడా గడవదు. ఎంతటి వివాదాన్నైనా వర్మ సీరియస్ గా తీసుకోరు. అదే ఆయన ప్రత్యేకత.  ఆయన ఎన్నుకునే సినిమా కథలు కూడా ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో వివాదాలు రేపి, సంచలనాలు సృష్టించిన వాస్తవ సంఘటనలే అయి ఉంటాయి.  సినిమా టైటిల్ ద్వారా కూడా వర్మ రాము సంచలనాలు సృష్టించగల నేర్పరి. 26/11 ఇండియాపై దాడి, రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి వంటి సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, రక్తి కట్టించడం అంత సామాన్యమైన విషయమేమీకాదు. ఇవన్నీ చాలా వివాదాస్పద వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రాలు. ఈ కథలతో సంబంధం ఉన్న వ్యక్తులు, గ్రూపులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇవేమీ చారిత్రక కథలు కాదు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు. ముఖ్యంగా రక్త చరిత్ర, వంగవీటి చిత్రాలు నిర్మిస్తున్నట్లు వర్మ ప్రకటించినప్పుడు చాలా మంది కంగారుపడ్డారు. ఈ కథలకు సంబంధించి వాస్తవ సంఘటనలు తెలిసినవారు, కీలక పాత్ర పోషించినవారు, మంచి, చెడు ఫలితాలు అనుభవించినవారు ఇంకా బతికే ఉన్నారు. ముఖ్యంగా ఈ కథల్లోని ప్రధాన పాత్రల భార్యలు, వారి పిల్లలు అందరూ బతికే ఉన్నారు. ఆయా కథలకు సంబంధించి కొన్ని ప్రధాన సంఘటనలు ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనాలు  సృష్టించాయి. ఇటువంటి చిత్రాలను నిర్మించి వర్మ ఏం గొడవలు సృష్టిస్తాడోనని కూడా కొందరు భయపడ్డారు. ప్రజలే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా భయపడ్డారు.  ఈ చిత్రాలను నిర్మించవద్దని వర్మకు కొందరు మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో చెప్పారు. కొందరు మామూలుగా, కొందరు బెదిరించి మరీ చెప్పారు. సినిమాలు నిర్మించడంలో ఎంతటి ప్రావీణ్యత ఉందో ఇటువంటివి ధైర్యంగా ఎదుర్కొనడంలో కూడా వర్మ ఘటికుడు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రని, సమాజంలో పలు అంశాలతో పెనవేసుకున్న సంఘటనలను ఎటువంటి వివాదాలకు తావులేకుండా చిత్ర రూపం కల్పించడంలో వర్మ దిట్ట అని రుజువైంది. ఈ చిత్రాలను వర్మ చాలా చాకచక్యంగా నిర్మించారు.
       భారతీయ సినిమా చరిత్రలో ఆ రంగంలోని 24 విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న అత్యంత శక్తివంతుడైన దర్శకుడు వర్మ.   కథల ఎంపిక, చిత్రానువాదం, దర్శకత్వం, చిత్ర ప్రచారం విషయంలో తనకు తనే సాటి.  అతనితో పోల్చగల దర్శకులు మరొకరులేరు. ప్రతి చిత్రంపై అతని ముద్ర ఉంటుంది. అదే అతని ప్రత్యేకత. భారతీయ చిత్ర పరిశ్రమలో  మెగా దర్శకులుగా పేరుపొందినవారి ప్రతిభా సామర్థ్యాలతో పోల్చిచే ఇతనికి చాలా అదనపు అర్హతలు, తెలివితేటలు, శక్తి, సామర్ధ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. కథ- కథనం -  సంగీతం- చిత్రీకరణలో కొత్తదనం చూడంతోపాటు ఆధునిక సాంకేతికతను ఆసాంతం వాడుకునే సమర్ధత ఉన్న దర్శకుడు వర్మ. కొత్త కొత్త ఆలోచనలు, కొత్తపోకడలు పోవడంతోపాటు ఎటువంటి ఆలోచననైనా సినిమాగా రూపొందించగల  సత్తా, సామర్ధ్యం ఆయనకు ఉన్నాయి. కథ పాతదే అయినా కొత్త తరహాలో, అత్యాధునిక సాంకేతిక విలువలతో చిత్రం నిర్మించడం అతని ప్రత్యేకత. అందుకే ఇంత సుదీర్ఘ కాలం వర్మ దర్శకుడిగా మనగలుగుతున్నారు. ఇక  చిత్ర ప్రచారం విషయంలో  ఏ దర్శకునికీ లేని ప్రత్యేక సామర్థ్యం అతనికి ఉంది. ఇంతకు ముందు కూడా ఎవరూ సినిమా ద్వారా గానీ, వ్యక్తిగతంగానీ ఇంతటి ప్రచారాన్ని పొందలేదు. ముందు ప్రేక్షకులను ఆకర్షించేవిధంగా, వారిలో ఆసక్తి రేకెత్తించే విధంగా సినిమా పేరుపెడతారు. ఆ తరువాత కథ, కథనంపై సంచనల వ్యాఖ్యలు చేస్తారు. దాంతో అందరి నోళ్లలో వర్మ, అతని కొత్త సినిమాపైనే చర్చ జరుగుతుంది. వంగవీటి తరువాత యథావిధిగా వర్మ మరో ప్రకటన చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, ముఖ్యమంత్రి అవ్వాలన్న కలలు కల్లలై జైలుకు వెళ్లిన శశికళ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని స్నేహితురాళ్లు ఇద్దరి మధ్య ఉన్న విషయాలను తెరకెక్కిస్తానని వర్మ చెప్పారు. తనదైన శైలిలో కథలో చివరి భాగం చెప్పి చర్చకు తెరలేపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు తట్టుకోలేక జయలలిత ఆత్మ సమాధిలో నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ గా వర్మ చెప్పారు.

శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Feb 22, 2017

ఎల్ఈడీ బల్బులతో భారీగా విద్యుత్ ఆదా

v ఏడాదికి రూ.11,022 కోట్ల ఆదా
v దేశంలో 21,21,69,709 ఎల్ఈడీ బల్బులు పంపిణీv ఏపీలో 2,07,81,743 పంపిణీ
         ఆధునిక సమాజంలో విద్యుత్ లేకుండా ఒక్క క్షణం గడవదు. ఏ ప్రాంత అభివృద్ధి అయినా విద్యుత్ సరఫరాపైనే అధారపడి ఉంటుంది. విద్యుత్ సరఫరా తగినంత లేక అనేక ప్రాంతాలలో పలు చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతోపాటు విద్యుత్ ని ఆదా చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నాయి. ఎల్ఈడి (లైట్ ఎమిట్టింగ్ డైయోడ్)  బల్బుల వినియోగం వల్ల 45 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. 60 వాట్స్ సాధారణ బల్బు జీవిత కాలం 1200 గంటలయితే, 6-8 వాట్స్ ఎల్ఈడీ బల్బు జీవిత కాలం 50 వేల గంటలు. సాధారణ బల్బుతో పోల్చితే ఎల్ఈడీ బల్బు జీవిత కాలం నాలుగు రెట్లు ఎక్కువ.  అలాగే సాధారణ 60 వాట్స్ బల్బుతో సమానంగా 8 వాట్స్ ఎల్ఈడీ బల్బు కాంతిని ఇస్తుంది. అంటే చాలా తక్కువ విద్యుత్ తో ఎక్కువ కాంతిని పొందవచ్చు. ఈ బల్బులను వినియోగించడం వల్ల వినియోగదారుల విద్యుత్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది. దేశంలో మొదటిసారిగా పాండిచేరిలో 2014 ఫిబ్రవరి 7న డిస్కమ్స్ సహకారంతో సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చే ఎనర్జీ ఎఫిసియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(ఈఈఎల్ పి)ని ప్రారంభించారు.  ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బుల వాడకం మొదలుపెట్టాయి. దాంతో దేశంలో భారీ స్థాయిలో విద్యుత్  ఆదా అవుతోంది. ఈ పథకాన్ని 2015 జనవరి 5న డొమెస్టిక్ ఎఫిసియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(డీఈఎల్ పీ)గా మర్చారు. అందరికీ ఎల్ఈడీ బల్బులు అందజేసే ఉజాల(యుజెఏఎల్ఏ-ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 మే1న ప్రారంభించారు. ఈ పథకం కింద 9 వాట్ల లెడ్ బల్బును రాయితీపైన అందజేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు బల్బులు ఇస్తున్నారు. ఇళ్లలో  60 వాట్ల బల్బు వాడే స్థానంలో వీటిని వాడుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరకు వీటిని అందజేశారు.  దీని అసలు ధర 160 రూపాయలు ఉండగా, రాష్ట్రాలలో సబ్సిడీపై 10 రూపాయల నుంచి 85 రూపాయల వరకు వినియోగదారులకు అందజేశారు. ఎల్ఈడీ బల్బులు సబ్సిడీపై ఇవ్వడాన్ని ఏపీలో 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. ఇక్కడ అత్యధిక సబ్సిడీపై అతి తక్కువ ధరకు ఒక్కో బల్బు పది రూపాయలకే ఇచ్చారు.
 ఏడాదికి రూ.11,022 కోట్ల ఆదా:  2017 ఫిబ్రవరి 21వ తేదీ ఉజాల డ్యాష్ బోర్డు లెక్కల ప్రకారం ఈ బల్బులు వాడటం వల్ల దేశం మొత్తం మీద ఏడాదికి 27,554 ఎంఎన్ కెడబ్ల్యూహెచ్ విద్యుత్, రూ.11,022 కోట్లు ఆదా అయ్యాయి. పీక్ అవర్ డిమాండ్ 5,516 మెగావాట్స్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి 26,98,863 ఎండబ్లూహెచ్ (మెగావాట్ అవర్స్) విద్యుత్,  రూ.1,080 కోట్లు ఆదా అయింది. పీక్ అవర్ డిమాండ్ 540 మెగావాట్స్ కు తగ్గింది. దాదాపు 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుండటంతో ఎల్ఈడీ బల్బుల పంపిణీ ప్రక్రియని ముమ్మరం చేశారు. ఉజాల పథకం కింద 2017 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రానికి  దేశంలో 21,21,69,709 ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈ బల్బుల పరిశ్రమలు 2016 డిసెంబర్ 31 వరకు 26 కోట్ల 30 లక్షల బల్బులు అమ్మాయి. 2019 నాటికి దేశంలో 77 కోట్ల సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ విధంగా వంద మిలియన్ కెడబ్ల్యూహెచ్ (కిలోవాట్ అవర్) విద్యుత్ ఆదా అవుతుందని అంచనా.
           రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే 3,09,12,435 బల్బులు పంపిణీ చేసి గుజరాత్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2,07,81,743 బల్బులతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, 2,07,28,359 బల్బులతో మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉన్నాయి. 1,50,16,547  బల్బులతో ఉత్తర ప్రదేశ్ 4వ స్థానం, 1,45,50,181 బల్బులతో కర్ణాటక 5వ స్థానంలో, 1,25,16,616  బల్బులు పంపిణీ చేసి రాజస్థాన్ 6వ స్థానంలో, 1,09,97,122 బల్బులు పంపిణీ చేసి బీహార్ 7వ స్థానంలో, 1,07,95,778 బల్బులతో మధ్యప్రదేశ్ 8వ స్థానంలో, 1,01,08,040 బల్బులతో కేరళ 9వ స్థానంలో ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కోటి బల్బుల లోపలే పంపిణీ చేశాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
        మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, ఇళ్లలోనూ లెడ్ లైటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఓ ఛాలెంచ్ గా తీసుకొని దిగ్విజయంగా అమలు చేస్తోంది. విద్యుత్ ని ఆదా చేయడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పలు బహుమతులను కూడా గెలుచుకుంది. మళ్లీ ఇప్పుడు లెడ్ బల్బుల వినియోగం వల్ల అయ్యే విద్యుత్ ఆదా గురించి  ప్రజలకు అవగాహన కలిగించి, విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బులను వినియోగించి విద్యుత్ ని సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయాన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.  ఏపీలో నగర వీధులన్నిటినీ లెడ్ బల్బుల వెలుగులతో నింపేశారు. పట్టణాల వీధుల్లో కూడా పూర్తిగా ఈ బల్బులను అమరుస్తున్నారు. చాలా వరకు పూర్తి చేశారు. ఇక గ్రామ వీధులపై దృష్టి పెట్టారు. విశాఖ నగర వీధుల్లో అత్యధికంగా 1,02,227 బల్సులను అమర్చారు. ఇక్కడ 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. విజయవాడలో 32,296 బల్బులు అమర్చారు.
నెల్లూరులో 23,202 బల్బులు అమర్చగా 59.19 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. ఏలూరులో 8,035 బల్బులు అమర్చగా, 59.69 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.
 కాకినాడలో 12,365, గుంటూరులో 10,096, అనంతపురంలో 9,912, విజయనగరంలో 9,450, తిరుపతిలో 9,038,  కర్నూలులో 5, 045, రాజమండ్రిలో 5,770 బల్సులు అమర్చారు. మునిసిపల్ వీధులలో కూడా ఈ బల్బులే కాంతులు వెదజల్లుతున్నాయి. కావలి వీధుల్లో 6,007 బల్బులు, హిందూపూర్ లో 6,397, నరసరావు పేట వీధుల్లో 4,871 బల్బులు అమర్చారు. మిగిలిన మునిసిపాలిటీలలో ఆయా పట్టణాల పరిధిని బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఈ బల్బులు ఏర్పాటు చేశారు.
      రాష్ట్రంలోని 12,909 గ్రామాల్లోని 25 లక్షల సాధారణ వీధి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడానికి ఏర్పాట్లు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచే శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలోని 120 సాధారణ వీధి బల్బుల స్థానంలో  ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఇంకా మరికొన్ని గ్రామాలలో కూడా అమర్చారు. అన్ని గ్రామాలలో ఈ బల్బులను అమరిస్తే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందా అవుతుందని అంచనా.   వంద శాతం ఇళ్లలో వినియోగించడానికి మొత్తం 2.32 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం మొత్తం అమలయితే 1291 ఎంయు(మిలియన్ యూనిట్స్) విద్యుత్ ను పొదుపు చేయవచ్చని అంచనా. పీక్ అవర్స్ లో లోడ్ ను 620 మెగావాట్స్ కు తగ్గించవచ్చని భావిస్తున్నారు.  ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేశారు. ఓ సర్వే ప్రకారం ఆ జిల్లాల్లో 58 వేల మంది వినియోగదారులు ఒక్కో బల్బుకు ఏడాదికి 73.7 యూనిట్స్ విద్యుత్ ను ఆదా చేశారు.
విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా:  విశాఖపట్నంలో అన్ని వీధి దీపాలు హుద్ హుద్ తుపానుకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానంలో లెడ్ బల్బులను అమర్చారు. 92 వేల ఎల్ఈడీ వీధి బల్బులను 45 రోజులలో అమర్చి రికార్డు సృష్టించారు. ఈ  బల్బుల వల్ల నెలకు 40 నుంచి 45 శాతం వరకు విద్యుత్ ఆదా అయింది. ఆ ప్రకారం 2015 సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.4.23 కోట్లు తగ్గింది. ప్రస్తుతం విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.  రాష్ట్రంలోని 111 మునిసిపాలిటీలలో 5.7 లక్షల వీధి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చటానికి పూనుకున్నారు. ఇప్పటికే చాలావరకు మునిసిపాలిటీలలో బల్బులు మార్చారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు:   రాష్ట్రంలో జరుగుతున్న ఎల్ఈడీ లైటింగ్ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రపంచ బ్యాంక్, ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) వంటి సంస్థలు పనితీరును మెచ్చుకున్నాయి. పారిస్ లో జరిగిన సిఓపి-21 సమ్మిట్ లో ఎల్ఈడీ వీధి లైట్ల వినియోగం ద్వారా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో  ఆదా అయిన విద్యుత్ అంశాన్ని చర్చించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,చైనా, ఇండియా,సౌత్ ఆఫ్రికా) వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే ప్రదర్శించి, ఇతర దేశాలకు ఓ రోల్ మోడల్ గా నిలిచింది.
అవార్డులు: ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 2015కు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి  విశాఖ మహానగర పాలక సంస్థ జాతీయ అవార్డు సాధించింది.
     - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్




ప్రత్యేక హోదా రాకున్నా ఆగని పెట్టుబడుల ప్రవాహం!

v రూ.10.50 లక్షల కోట్ల పెట్టుబడులకు 664 ఒప్పందాలు
v అధిక భాగం పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలవేv ప్రతిపానలు కార్యరూపం దాల్చడానికి ప్రత్యేక చర్యలుv ప్రతి ఎంఓయుకు ఒక ఎస్కార్ట్‌ అధికారిv ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ -1v ప్రత్యేక ప్యాకేజీకి నేడు చట్టబద్దత లభించే అవకాశం
    


       ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకున్నా పారిశ్రామిక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రంగానికి కొన్ని రాయితీలు వచ్చే మాట వాస్తవమే. అయితే అంతకు మించిన అంశాలు కూడా ఉంటాయని ఇక్కడ రుజువైంది.  ఏదైనా ఒక ప్రాంతంలో పారిశ్రామికవేత్తలు  పెట్టుబడులు పెట్టడానికి ప్రధానంగా ఆ ప్రాంతంలో లభించే వనరులు (ముడిపదార్థాలు), భూమి, నైపుణ్యత కలిగిన మానవ వనరులు, ప్రభుత్వం కల్పించే రాయితీలు, మౌలిక వసతుల ఆధారంగా ఆసక్తి చూపుతారు. వీటన్నిటికీ మించి విదేశాల్లో స్థిరపడిన సంపన్న వర్గాలు తమ జన్మభూమిపై మక్కువ కూడా మరో ప్రధాన కారణమవుతోంది.

              రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఇక నైపుణ్యత కలిగిన మానవ వనరులకు ఇక్కడ కొదవలేదు. పరిశ్రలమల స్థాపనకు అవసరమైనంత భూమి కూడా అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, పారిశ్రామిక అవసరాలకు కావలసినంత భూమిని కేటాయింస్తోంది. అలాగే జాతీయ రహదారులు, విద్యుత్, ఫైబర్ నెట్, పోర్టులు, అంతర్గత జలరవాణా వంటి మౌలిక వసతుల కల్పనకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనేక రాయితీలు కల్పిస్తోంది. దాంతో  రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.25 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి రేటు, 2015-16 నాటికి 11.1 శాతంగా నమోదై రెండంకెల వృద్ధి రేటు సాధించి.   రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక  ఉత్పత్తి రూ.63,229 కోట్ల (2011-12 ధరల ఆధారంగా)తో  9.98 శాతం వృద్ధి రేటు నమోదైంది. పారిశ్రామిక వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధిస్తోంది.
            రాష్ట్ర ప్రభుత్వ అయిదేళ్లకు (2015-2020) రూపొందించిన పారిశ్రామిక విధానం మంచి ఫలితాలనిస్తోంది. వివిధ రంగాలలో రూ.3,17,000 కోట్ల పెట్టుబడులు, 28,25,000 ఉద్యోగాలు లక్ష్యంగా వివిధ పాలసీలను రూపొందించింది.  ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖలు తీసుకునే చర్యల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పాలసీ రూపొందించిన ఏడాదిలోనే పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.  ప్రభుత్వం పది ప్రధాన రంగాలను గుర్తించి, వాటిని ప్రోత్సహిస్తోంది. ఆగ్రో అండ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్స్, వస్త్రాలు-దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ ఆటో విడిభాగాలుపెట్రోకెమికల్స్, ఇంధనం, మినరల్ ఆధారిత పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ రంగాలు రాష్ట్రంలో విస్తరించడానికి అవకాశం ఉంది. దాంతో ఈ రంగాల్లో  ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. వీటన్నిటి రీత్యా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రవాస తెలుగువారు స్వరాష్ట్రంలో సొంతగడ్డపై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇంకా వస్తున్నారు.
          పరిశ్రమల స్థాపనకు, వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత సంవత్సరం 2వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది మొదటి స్థానానికి ఎగబాకింది. ప్రపంచ బ్యాంకు ఎనర్జీ ఎఫిషియన్సీ 2016 నవంబర్ నివేదిక ప్రకారం విద్యుత్ ని ఆదా చేయడంలో, సమర్థవంతంగా వినియోగించడంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. 2015-16లో  ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఆ విధంగా ఏపీ మొదటి స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన విభాగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచి ఇండియాటుడే అవార్డు గెలుచుకుంది. అలాగే ఆర్బీఐ 2016 సెప్టెంబర్ బులిటెన్ ప్రకారం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఉంది.
పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ మొదటి స్థానానికి ఎగబాకింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్ అంచనాలపై చేసిన అధ్యయనంలో  దేశంలో ఏ రాష్ట్రం సాధించనంతటి వృద్ధిని ఏపీ సాధించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద రాష్ట్రానికి 8.1 శాతం పారిశ్రామిక  పెట్టుబడులు రాగా2015-16 లో  15.8 శాతం పెట్టుబడులు వచ్చాయి. అంటే  ఒక్క ఏడాది కాలంలో 7.7 శాతం పెట్టుబడులు పెరిగాయి. గత ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్ డిపి) వృద్ధి రేటులో కూడా దేశం మొత్తం మీద ఏపీ  మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 7.3 శాతం ఉండగా, రాష్ట్రం 10.5 శాతం వృద్ధి రేటు సాధించింది. తలసరి ఆదాయం రాష్ట్రంలో తొలిసారిగా లక్ష రూపాయలకు పైగా నమోదైంది. ఏడు జిల్లాలలో తలసరి ఆదాయం లక్ష రూపాయలు, అంతకు మించి ఉంది. విద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది.
          రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించిన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ వెస్ట్ మెంట్ మీట్, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, రాష్ట్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖల ఆధ్వర్యంలో 2016 జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు మంచి ఫలితాలనిచ్చింది.  రూ.4.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 50 శాతం వరకు ఆచరణలోకి వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.10.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు వచ్చాయి. 664 ఒప్పందాలు(ఎంఓయు) జరిగాయి. ఈ పెట్టుబడులు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో అధిక భాగం పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతిపానలన్నీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
 ప్రతి ఎంఓయుకు ఒక ఎస్కార్ట్‌ అధికారి
          భాగస్వామ్య సదస్సు ద్వారా కుదిరిన ప్రతి అవగాహన ఒప్పందం వాస్తవరూపం దాల్చడానికి ఎస్కార్ట్ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి ఎంఓయుకు ఒక ఎస్కార్ట్‌ అధికారిని నియమిస్తారు. ఆ ఒప్పందం కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకునే బాధ్యత ఆ అధికారిదే. అలాగే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున కావలసిన పనులు, ఇతర వ్యవహారాలు ఆ అధికారి చూసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఒప్పందం కార్యరూపం దాల్చేవరకు ఆ అధికారి వారి వెంటపడి పని చేయాలి.
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, ఆ స్థాయిలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ప్రత్యేక హోదా ద్వారా ఏయే ప్రయోజనాలు వస్తాయో అవన్నీ కూడా ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇస్తోంది.  ఆ ప్యాకేజీకి ఈ నెల 22న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చట్టబద్దత కల్పించే అవకాశం ఉంది. అంతే కాకుండా కేంద్రం నుంచి రావలసిన అన్ని రకాల రాయితీలను రాబడుతూ పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే ప్రత్యేక చర్యల వల్ల పెట్టుబడుల ప్రవాహం పెరిగి లక్షల మందికి  ఉపాధి లభించే అవకాశం ఉంది. 

Feb 21, 2017

9 నగరాలకు భూముల కేటాయింపు
















 పర్యాటక నగరానికి అత్యధిక భూమి
 పరిపాలన నగరానికి అతి తక్కువ
 ప్రభుత్వానికి 22న అందనున్న రాజధాని ప్రధాన ఆకృతులు


         నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మహానగరంలో అంతర్భాగంగా నిర్మించే 9 నగరాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.   రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ దాదాపు పూర్తి అయింది. 25,796 మంది రైతులు 32,448 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేశారు. కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. నిధుల సమీకరణ ఓ కొలిక్కి వచ్చింది. ఇక డిజైన్ల (ఆకృతులు)ను ఆమోదించి నిర్మాణం మొదలుపెట్టడమే మిగిలింది. రాజధాని అంటే కేవలం  పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని నిర్మిస్తారు. మన దేశంలోని గాంధీనగర్, జైపూర్, నయారాయ్ పూర్, ఛండీగఢ్, అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, బ్రెజిల్ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్ రాజధాని ఆస్థానా వంటి నగరాలను సీఎం స్వయంగా సందర్శించారు. అక్కడి కట్టడాలను వీక్షించారు. ఆయా నగరాల  ఆకృతులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో కొన్ని వాటర్ ఫ్రంట్ నగరాలు, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ ప్లాన్డ్ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ఆకృతులను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా చుట్టూ ఓ మణిహారంలా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. ఈ నగరాల్లో కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా నిర్మిస్తారు.  అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. రాజధాని ప్రధాన ఆకృతులను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ 22న ప్రభుత్వానికి అందజేయనుంది.
           
             ఈ నేపధ్యంలో ఈ 9 నగరాలకు ప్రభుత్వం భూములను కేటాయించింది. రాజధాని నగర పరిధి మొత్తం 53,647 ఎకరాలు. అత్యధికంగా పర్యాటక నగరానికి ఎక్కువ భూమి కేటాయించింది. అతి తక్కువగా పరిపాలన నగరానికి కేటాయించింది. ఆ వివరాలను పరిశీలిస్తే పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు, విజ్ఞాన నగరానికి 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ నగరానికి 6,582, ఆరోగ్యనగరానికి 6,511, ఆర్థిక నగరానికి 5,168, మీడియా నగరానికి 5,107,  క్రీడల నగరానికి 4,150, న్యాయ నగరానికి 3,438, పరిపాలన నగరానికి 2,702 ఎకరాలు కేటాయించారు. ప్రతి నగరంలో వివిధ విభాగాలకు కూడా భూముల కేటాయింపు జరిగిపోయింది. ప్రతి నగరంలో ఆయా రంగాలకు చెందిన కార్యాలయాలతోపాటు ఆయా శాఖల ఉద్యోగుల నివాస గృహాలు ఉంటాయి.
      పర్యాటక నగరం: ఈ నగరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతారు. అలాగే పర్యాటక రంగానికి చెందిన కార్యాలయాలు, స్టార్ హోటళ్లు ఉంటాయి. ఈ నగరానికి కేటాయించిన మొత్తం 11,574 ఎకరాల్లో వినోద అవసరాలకు, ఇతరత్రా ప్రజోపయోగాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 8,778 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1397 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 451, పరిశ్రమలకు 100, ప్రత్యేక జోన్ కు 156 ఎకరాలు కేటాయించారు. ముందు జాగ్రత్తగా భవిష్యత్ అవసరాల కోసం 692 ఎకరాలను ఉంచారు.
విజ్ఞాన నగరం : ఈ నగరంలో విశ్వవిద్యాలయాలు, టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ నగరంలో గృహావసరాలకు 3562 ఎకరాలు కేటాయించారు. వినోద, ఇతరత్రా ప్రజోప్రయోజనాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1340 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 1257 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 979, పరిశ్రమలకు 87, భవిష్యత్ అవసరాల కోసం 1322 ఎకరాలు కేటాయించారు.
ఎలక్ట్రానిక్స్ నగరం: ఈ నగరంలో ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,582 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, పారిశ్రామిక రంగానికి 1618, వినోదం, ఇతర ప్రయోజనాల కోసం 757, వాణిజ్య అవసరాలకు 682,  ప్రత్యేక జోన్ కు 645, భవిష్యత్ అవసరాలకు 503 ఎకరాలు కేటాయించారు.
ఆరోగ్య నగరం: ఈ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు, కార్పోరేట్ ఆస్పత్రులు, వైద్య విశ్వవిద్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,511 ఎకరాలు కేటాయించారు. ఈ మొత్తంలో వివిధ విభాగాల కేటాయింపులను పరిశీలిస్తే గృహావసరాలకు 3,306 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 1072, ప్రత్యేక జోన్ కు 1048, వినోదం, ఇతరత్రా ప్రయోజనాల కోసం  బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 580, వాణిజ్య అవసరాలకు 504 ఎకరాలు కేటాయించారు.
ఆర్థిక నగరం: ఈ నగరంలో ఆర్థిక శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థలతోపాటు ఇతర ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 5,168 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1389 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1250, ప్రత్యేక జోన్లకు 844, వాణిజ్య అవసరాలకు 828, భవిష్యత్ అవసరాలకు 756, పారిశ్రామిక రంగానికి 101 ఎకరాలు కేటాయించారు.
క్రీడల నగరం: ఈ నగరంలో క్రీడా మైదానాలతోపాటు ఆ శాఖకు చెందిన పరిపాలన కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 4150 ఎకరాలు కేటాయించారు. వివిధ విభాగాల కేటాయింపులు పరిశీలిస్తే గృహావసరాలకు 1819 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 693, ఇతర సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 555, వాణిజ్య అవసరాలకు 513, ప్రత్యేక జోన్లకు 436, పారిశ్రామిక అవసరాలకు 134 ఎకరాలు కేటాయించారు.
న్యాయ నగరం: ఈ నగరంలో హైకోర్టుతోపాటు ఇతర న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పరిపాలనా కార్యాలయాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి ఆ శాఖకు చెందిన ఉద్యోగుల నివాస గృహాలు  ఉంటాయి. ఈ నగరానికి 3,438 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1276 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 692, భవిష్యత్ అవసరాలకు 545, వాణిజ్య అవసరాలకు 467, ప్రత్యేక జోన్లకు 458 ఎకరాలు కేటాయించారు.  
మీడియా నగరం: ఈ నగరంలో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియాలకు చెందిన కార్యాలయాలు, ఆయా సంస్థల ఉద్యోగుల గృహాలు ఉంటాయి. ఈ నగరానికి 5,107 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1291, భవిష్యత్ అవసరాలకు 567, వాణిజ్య అవసరాలకు 791, ప్రత్యేక జోన్లకు 346, పారిశ్రామిక అవసరాలకు 250 ఎకరాలు కేటాయించారు.
ప్రభుత్వ పరిపాలన నగరం : రాజధానిలో ఇది చాలా కీలకమైనది. శాసనసభ, శాసన మండలి, సచివాలయం తదితర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. అయినా దీనికి అతి తక్కువగా 2,702 ఎకరాలు మాత్రమే కేటాయించారు. ఈ నగరంలో గృహావసరాలకు 833 ఎకరాలు, ప్రత్యేక జోన్లకు 638, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 567, భవిష్యత్ అవసరాలకు 427, వాణిజ్య కార్యకలాపాలకు 237 ఎకరాలు కేటాయించారు.
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో ఈ 9 నగరాలను కలుపుతూ విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ  (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)  ప్రణాళికలు సిద్ధం చేసింది.

Feb 17, 2017

ఐటీ కంపెనీల స్థాపనకు ప్రవాస తెలుగువారి ఆసక్తి

ü ఏపీఎన్ఆర్టీలో 83 దేశాలకు చెందిన 32 వేల మంది సభ్యులు
ü ప్రవాస తెలుగువారికి అన్నిరకాల సహాయసహకారాలు
ü వందల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి
ü 86 గ్రామాల దత్తత

          రాష్ట్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగువారి సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) వివిధ రూపాలలో తనవంతు సాయం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతూ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, వేల మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. 2016 మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ఈ సొసైటీలో 83 దేశాలకు చెందిన 32వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుడైన డాక్టర్ రవి వేమూరి అధ్యక్షులుగా పూర్తీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్షలేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు.  దీని ప్రధాన కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. 192 మంది అంతర్జాతీయ కోఆర్డినేటర్లు, ఆరుగురు ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. ఈ సొసైటీ ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పని చేస్తోంది. ప్రవాస తెలుగువారికి పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. ముందుకు వచ్చినవారికి పెట్టుబడులకు సంబంధించిన, న్యాయపరమైన సలహాలు, బ్యాంకింగ్ సేవలు అందజేస్తోంది. పరిశ్రమల స్థాపనలో వివిధ ప్రక్రియలలో వారికి సహాయ సహకారాలు అందజేస్తోంది. వారు స్వదేశానికి వచ్చే సమయంలో ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ దగ్గర నుంచి హోటల్ రూమ్స్, క్యాబ్స్ బుకింగ్, దేవాలయాల సందర్శనలకు సహాయపడుతోంది. ప్రవాస తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో కూడా ఈ సొసైటీ సహకారం అందిస్తుంది.  డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు, పాస్ పోర్టు, ఓటర్ కార్డు వంటి వాటిని పోగొట్టుకున్నప్పుడు వాటిని వెతికే విషయంలో ఈ సొసైటీకి సంబంధించిన బృందం సహాయపడుతుంది. వారి సమయం వృధాకాకుండా చూస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలలో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తోంది. గత నవంబర్ వరకు విశాఖపట్నంలో  ప్రవాస తెలుగువారు 9 ఐటీ కంపెనీలను స్థాపించారు. ఆ కంపెనీల (డీజిట్, ఎవాల్యూట్, నెట్ వర్క్ ఆబ్జెక్ట్, రిసికార్ప, కైరోస్,అంజూర్,ప్రిమస్,ఫ్యాబిట్,థాట్ వేవ్) ద్వారా 430 మందికి ఉపాధి లభిస్తోంది.

 ఈ నెల16న  విజయవాడలో యాక్సెల్‌ ఐటీ, హార్జన్‌ ఐటీ, ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌, అడాప్ట్‌ సొల్యూషన్స్‌, అడ్వాన్స్‌ సాప్ట్‌, ఇంటెల్లి సాఫ్ట్‌, టైమ్‌స్క్వేరిట్‌ వంటి ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీలకు ఆటోనగర్‌లో అత్యాధునికమైన భవనాన్ని కేటాయించారు.  అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఏపీఎన్‌ఆర్టీయే సమకూర్చనుంది.  ఈ కంపెనీల్లో పనిచేయడానికి అనుకూలంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తగి శిక్షణ ఇప్పించేందుకు మరో 14 కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలను ఇక్కడ  ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలకు మంగళగిరి వద్ద ఉన్న ఐటీ టవర్‌లో స్థలం కేటాయించారు. 10 ఐటీ కంపెనీలకు 500 నుంచి వెయ్యి మంది వరకు  అవసరం ఉంటుంది. మూడు మాసాల్లో శిక్షణ పూర్తి చేసి జూన్‌ నాటికి ఐటీ కంపెనీల్లో వారు ఉద్యోగాలు చేసుకునేలా అవకాశం కల్పిస్తారు. అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నగరాన్ని పెద్ద ఐటీ హబ్‌గా రూపొందించి,  ఇంజినీరింగ్‌ యువతకు స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్ రప్టివ్ సాఫ్ట్ వేర్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ వంటి సంస్థలు ప్రారంభించారు. అత్యధిక మంది రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.

రూ.201.50 కోట్ల పెట్టుబడితో 2615 మందికి ఉపాధి
          అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో దాదాపు రూ.201.50 కోట్ల పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ తో 75 పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా 2615 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల స్థాపనకు 6348.50 యూనిట్ల హెచ్ పీ విద్యుత్, 8,96,976 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వాటిలో లక్ష్మీ ప్లాస్టిక్స్, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, శ్రీభరణి ఎంటర్ ప్రైజెస్, సీ అండ్ ఎన్ ఇండస్ట్రీస్, ఎస్వీ పాలిమర్స్,మార్క్ ఆంగ్రో ఇండస్ట్రీస్, గౌతమ్ ఇండస్ట్రీస్, జీఎస్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు  ఉన్నాయి. నాలుగు ఐటీ, ఒక ఆటోమొబైల్ కంపెనీలు విశాఖపట్నంలో తమ యూనిట్లను స్థాపించడానికి వచ్చే ఫిబ్రవరిలో పనులను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటోమోటిక్ రోబోటిక్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ప్రెసిసింగ్ ఇంజన్ టెస్టింగ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ని స్థాపించాలన్న యోచనలో ఉంది. ఈ యూనిట్ స్థాపిస్తే 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అమరావతి, విశాఖలలో వచ్చే మార్చిలో 14 ఐటీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంశాలలో  శిక్షణ ఇస్తారు.

86 గ్రామాల దత్తత
           స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రవాస తెలుగువారు రాష్ట్రంలో 13 జిల్లాల్లో 86 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు ఖర్చు చేయాలని వారు నిర్ణయించారు. ఈ గ్రామాలలో వారు వాటర్ ప్లాంట్స్, శ్మశానవాటికలు, పాఠశాలలు, సోలార్ పానెల్స్, లెడ్ బల్బులు ఏర్పాటు చేశారు.

ఎన్ఆర్టీ ఐకాన్ : ఈ సొసైటీ ఇంకా అనేక కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎన్ఆర్టీ ఐకాన్ నిర్మించాలని, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే అమరావతి టెక్ సపోర్ట్ విలేజ్, గల్ఫ్ బాధితులకు మద్దతుగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. అమెరికాలోని దేవాలయాల ద్వారా రాష్ట్రంలోని గ్రామాలను దత్తత తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. రాష్ట్రాభివృద్ధి విషయంలో బాధ్యతగా తమ వంతు కృషి చేస్తామని ఎన్ఆర్టీ ప్రతినిధులు చెప్పారు.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

2017-18 ఇ-ప్రగతి పాలన

ü శరవేగంగా జరుగుతున్న పనులుü ఫైబర్‌ గ్రిడ్‌ మొదటి దశ పూర్తి
ü  133 ప్రభుత్వ విభాగాల్లోని సేవలన్నీ డిజిటలైజేషన్
ü  745 సేవల అనుసంధానం

           రాష్ట్ర మంత్రి మండలి 2017-18ని ‘ఇ-ప్రగతి పాలన’ సంవత్సరంగా ప్రకటించింది.  రాష్ట్రంలో ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నతంగా నిలిపేందుకు 'ఇ-ప్రగతి' ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్రం డిజిటల్‌ ఇండియాను రూపొందించడంతో అన్ని రాష్ట్రాల కన్నా ముందే దాని అమలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కేంద్ర సంస్థలు వచ్చే వరకు ఆగకుండా రాష్ట్రంలో తామే జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును నిర్మించుకుంటామని ప్రకటించింది. ఇలా ప్రకటించిన ఘనత ఏపీకే దక్కుతుంది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ‘ఇ-ప్రగతి’పై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇ-ప్రగతి పనులు ముమ్మరంగా జరగాలని నిర్ణయించారు. ఈ సారి జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు నాటికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆన్ లైన్ లోనే జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశించారు. ప్రతినెలా ఒక కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నారు. ఏ ఏ శాఖలను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ముందు గుర్తించాలని చెప్పారు. ఇ-ప్రగతి ప్రాజెక్ట్ లో ప్రధానంగా  భాగం కావలసినవి పీపుల్స్ హబ్‌, ల్యాండ్ హబ్, ఇ-నిధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలన్నారు.  ఇ-ప్రగతిలో లోకలైజేషన్, టెంపుల్ మేనేజ్‌మెంట్, హైబ్రిడ్ క్లౌడ్, సన్ రైజ్ స్కోర్ బోర్డ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, ప్రైమరీ సెక్టార్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కార్డ్ ప్లస్ ప్లస్, ఇ-ప్రగతి కోర్, పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ వాటర్, సేఫ్ ఏపీ, హెల్త్ ప్రాజెక్టులుగా సీఎం వివరించారు. గ్రామస్థాయి నుంచి అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలని, ప్రతి ఫైలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.  రికార్డుల ఇ-ఫైలింగ్ ఎంత మేర పూర్తయ్యింది? చట్టబద్దంగా హార్డ్ కాపీలను ఎలా భద్రపరచాలి? అనే అంశాలపై పూర్లి వివరాలను వచ్చే కలెక్టర్ల  సమావేశం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

           అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉద్ధేశంతో 2015 జులైలో  ఇ-ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు.  ఫైబర్‌ గ్రిడ్‌తో రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తి కావస్తోంది. ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  ఇంటర్నెట్, మొబైల్ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్ బ్రాండ్ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ తరుణంలో బ్రాడ్ బ్రాండ్ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో గత నెలలో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పది వేల నెట్ కనెక్షన్లు ఇచ్చారు. మంత్రి మండలి సమావేశంలో ఫైబర్ గ్రిడ్ పై అధికారులతో సీఎం చర్చించారు. ఈ నెలాఖరునాటికి లక్ష బాక్సులు అమర్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 నాటికి పది లక్షల కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. 
          దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం చేపట్టిన రాష్ట్రం మనదే.   ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు 8 జిల్లాలలో ఈ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం 23,500 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో  22 వేల కిలో మీటర్లకుపైగా లైన్లు పూర్తి అయ్యాయి.  ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం  పూర్తి అయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. 

         పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు  అందించేందుకు 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్ఈఏ)లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ఇ-ప్రగతిరూపకల్పన జరిగింది. ఇటువంటి ప్రాజెక్టు చేపట్టిన రాష్ట్రం దేశంలోనేకాదు దక్షిణాసియాలోనే మొదటిది ఏపీ. వాస్తవానికి ఇది ఒక ప్రాజెక్టు కాదు. పరిణామ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సాంకేతిక మార్పులు, అవసరాలు, వ్యూహాలు, నూతన ఆవిష్కరణలను అనుసరించి నిరంతరం కొనసాగే ఒక సాంకేతిక ప్రక్రియ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని  పరిపాలనకు అన్వయించడం ద్వారా సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ సిస్టమ్ (సీఎల్జీఎస్), డయల్ ఏపీ, మన రాష్ట్రం, టెలీహెల్త్, ఇ-ఎడ్యుకేషన్, హరిత, ఇ-మండీ, సిటిజెన్ ఇన్ బాక్స్, డిజిటల్ లిటరసీ, ఇ-ఎస్‌హెచ్‌జీ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ గ్రిడ్ తదితర సేవలన్నీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.  ప్రజల ఆరోగ్యం, పాఠశాలల్లో డ్రాపవుట్ రేటు తదితర ప్రామాణికాల నిర్దారణకు ఇ-ప్రగతి ప్రాజెక్టు ఉపకరిస్తుంది. మీ సేవ, సీఎం డ్యాష్ బోర్డు, మీ భూమి తదితర కామన్ ఆప్లికేషన్లతో పాటు ఆర్థిక, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేటగిరిలవారీగా, అన్ని వయసుల వారికి సమగ్ర సమాచారం  అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగానే స్మార్ట్‌ పల్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు 1,37,42,586 కుటుంబాలకు చెందిన 4,32,55,924 మంది వివరాలు సేకరించారు.
      ఇ-ప్రగతి ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగం మిషన్‌లోని వ్యవసాయం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధకం తదితర అనుబంధ రంగాల సమాచారాన్ని ఇ-ప్రగతి ప్రాజెక్టు సేవల ద్వారా పొందవచ్చు. పంటలు, భూములు, విత్తనాలు, బీమా, మార్కెటింగ్, ఇ-మండీ తదితర వివరాలన్నీ  లభ్యమవుతాయి.  మాన్యువల్‌గా చేసే వేల కొద్దీ పనులు ఈరోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది.  రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందిని ఇప్పడు చాలా వరకు తగ్గించారు. ముందుముందు సర్టిఫికెట్‌లెస్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల అవసరాలకు గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి అవసరం ఇకముందు ఉండదు. ఇప్పటికే కుల, ఆధాయ ధృవీకరణ, ఇసీ, బీ1 అడంగుల్... వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేబర్ లైసెన్సులు, పారిశ్రామిక అనుమతులు, అన్ని రకాల పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపులు  వంటివి  ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి.

         అన్ని ప్రభుత్వ శాఖల, రాష్ట్రంలోని భూమి, లేఅవుట్లు, ఇళ్లు, రోడ్లు, దేవాలయాలు, భూగర్భజలాలు.. ఇలా ఒక్కటేమిటి సమగ్ర సమాచారం ఆయా శాఖల వెబ్ సైట్ లలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ పరిధిలోని  సమాచారాన్ని చాలా వరకు వెబ్ సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాయి. అందుకు నిదర్శనంగా పట్టణ గ్రామీణ ప్రణాళికా శాఖ (డీటీసీపీ-డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) వెబ్ సైట్ ను పేర్కొనవచ్చు. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రంలోని సీఆర్ డీఏ మొదలుకొని పట్టణాభివృద్ధి సంస్థలు, నగరాలు, పట్టణాలు, నగర పంచాయితీల వంటి వాటి మాస్టర్ ప్లాన్లు, అనుమంతి పొందిన లేఅవుట్ల, వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత చట్టాల సమాచారం అంతా  ఉంది. ఆయా ప్రాంతాలలో లేఅవుట్లు, భవన నిర్మాణాలు, గ్రూప్ హౌస్ లు లాంటి అన్ని రకాల అనుమతులకు కావలసిన దరకాస్తులు ఉన్నాయి. అన్ని దరకాస్తులను ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. ఫీజులను కూడా ఆన్ లైన్ లోనే చెల్లించవచ్చు. దరకాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
       ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారంతోపాటు ప్రతి పౌరుడి సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. సీఎం డ్యాష్ బోర్డులో అయితే ప్రభుత్వ విభాగాలలో ఏ పని ఎంత వరకు జరిగిందో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. కొన్ని విభాగాల్లో ప్రతి 5 నిమిషాలకు జరిగిన మార్పులను ఎంటర్ చేస్తారు. కొన్ని విభాగాలు రోజుకు ఒకసారి, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, మరికొన్ని నెలకు ఒకసారి, ఇంకొన్ని మూడు నెలలకు ఒకసారి అప్ డేట్ చేస్తారు.  వర్షపాతం దగ్గర నుంచి భూగర్భ జలాలు, రెవెన్యూ ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం, సివిల్ సప్లైస్ వారు రేషన్ డిపోలకు పంపే సరుకుల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ విధంగా ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రభుత్వంలోని అన్ని పనులు ఆన్ లైన్ లో జరిగిపోతాయి. ప్రభుత్వ పరంగా ప్రజలకు కావలసిన పనులు త్వరితగతిన అవడానికి అవకాశం ఏర్పడుతుంది.

సీఆర్డీఏ వివరాలన్నీ బహిర్గతమే!

§  పారదర్శకతకు నిదర్శనం
§  రాజధాని అమరావతి కోసం
25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాల సమీకరణ
§  ప్రధాన వెబ్ సైట్ లో పూర్తి వివరాలు
§  డ్యాష్ బోర్డులో 12 విభాగాల పూర్తి వివరాలు వెల్లడి

            డిజిటలైజేషన్ లో ఏపీ ప్రభుత్వం  దూసుకుపోతోంది. అన్ని రంగాలలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఏపీ ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖలలో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది.  అక్రమార్జనకు కళ్లెంపడింది. అవినీతి తగ్గింది. ఈ మేరకు నీతిఅయోగ్ ఏపీని ప్రశంసించింది.   ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి కూడా సీఎం డ్యాష్ బోర్డు మాదిరి డ్యాష్ బోర్డుని ఏర్పాటు చేశారు.  ఈ డ్యాస్ బోర్డులో సీఆర్డీఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరిచారు. ఏపీ ఇ-ప్రొక్యూర్ మెంట్, నా ఇటుక – నా అమరావతి వంటి లింకులను కూడా ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలు దాపరికంలేకుండా అందరికీ అందుబాటులో ఉంచారు. సీఆర్డీఏ విస్తీర్ణం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని  8,603 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.  నూతన రాజధాని అమరావతిని 217 చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలి, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంత సేకరించారు, ఎంత మంది రైతులు భూములు ఇచ్చారు, ఎంతమంది భూమిలేని పేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మాస్టర్ ప్లాన్, టెండర్లు, ఆమోదించిన, ఆమోదించని ప్లాన్లు తదితర  వివరాలన్నింటిని ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు. పనులు జరిగే క్రమం, టెండర్ల వివరాలు, రైతులకు ప్లాట్ల పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు.

 12 అంశాలతో డ్యాష్ బోర్డు
           ప్రధాన వెబ్ సైట్ కు అనుబంధంగా ఇప్పుడు 12 అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్(ఎల్పీఎస్), ఒకేసారి రైతుల రుణ మాఫీ, భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, బిల్డిండ్ పెనలైజేషన్ స్కీమ్(బీపీఎస్), అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్-నరేగా), అమరావతి గ్రామాల్లో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ), బయోమెట్రిక్ హాజరు, ఇంజనీరింగ్ వర్క్స్, పరిసరాల పచ్చదనం, అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి ఈ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తప్ప మిగిలిన వివరాలన్నింటినీ అప్ డేట్ చేశారు.  దీనికి సంబంధించి అప్ డేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాల సమీకరణ
      డ్యాష్ బోర్డులో తెలిపిన ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 27,874 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాలు సమీకరించింది. ఇంకా 3344 మంది రైతుల నుంచి 1857 ఎకరాలు సమీకరించవలసి ఉంది. ఏ గ్రామంలో ఎంత భూమి సమీకరించారో, ఎంత సమీకరించాలో, పట్టా భూమి, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ భూమి... తదితర వివరాలు కూడా ఇక్కడ అప్ డేట్ చేశారు.
రూ.85.35 కోట్ల రుణాలు రద్దు: రైతుల రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. మొత్తం 25 గ్రామ పంచాయతీల్లోని 19,518 మంది రైతులకు చెందిన రూ.85.35 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. గ్రామాల వారీగా వివరాలను కూడా ఇక్కడ ఉంచారు.
వార్షిక చెల్లింపులు రూ.137.44 కోట్లు: స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కాకుండా భూ సారం ఆధారంగా ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పది సంవత్సరాలపాటు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రకారం వార్షిక చెల్లింపులలో భాగంగా 32,423 ఎకరాలకు సంబంధించి 25,781 మంది రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.138.69 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, యూనిట్ల వారీగా పూర్తి వివరాలు ఇందులో ఉంచారు.
బీపీఎస్ కింద 6429 దరకాస్తులు: బిల్డింగ్ పెనలైజేషన్ పథకం (బీపీఎస్)కింద సీఆర్డీఏకు ఇప్పటి వరకు 6429 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 2,506కు ప్రొసీడింగ్ లెటర్ పంపారు. 3751 పరిశీలనలో ఉన్నాయి. 172 దరకాస్తులను తిరస్కరించారు. వ్యక్తిగతంగా దరకాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి బీపీఎస్ సైట్ లింక్ కూడా అక్కడే ఇచ్చారు.
ఏఎస్ డీఐ: అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ) ద్వారా 483 మందికి శిక్షణ ఇప్పించారు. వారిలో 386 మందికి ఉపాధి కల్పించారు. 225 మందికి నేరుగా ఉపాధి కల్పించారు. గ్రామాల వారీగా ఎంతెంతమందికి ఉపాధి కల్పించారో పూర్తి వివరాలు పొందుపరిచారు.
ప్రొక్యూర్ మెంట్: వివిధ పనులు, కన్సల్టెన్సీలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించి సీఆర్డీఏ  విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్ల వివరాలు ఈ విభాగంలో పొందుపరిచారు.  ఇప్పటి వరకు రూ.589.42 కోట్ల విలువైన 62 అంశాలకు సంబంధించి టెండర్లు పిలిచారు.
ఏఎల్ పీపీ కింద 20,013 మందికి పెన్షన్: అమరావతి గ్రామాలలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ) పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.2,500 ఇస్తున్నారు.   ఇప్పటి వరకు 20,013 కుటుంబాలకు రూ.5 కోట్లు విడుదల చేశారు. గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంతమందికి, ఎవరెవరికి ఇచ్చింది వారి పేర్లతోసహా పూర్తి వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపరిచారు.
బయోమెట్రిక్ అటెండెన్స్:  సీఆర్డీఏలోని ఉద్యోగులను బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిష్టర్ లో నమోదు చేస్తున్నారు. 2017 ఫిబ్రవరి 14వ తేదీ వరకు 326 మంది ఉద్యోగుల పేర్లు నమోదు చేశారు. ఏ రోజు ఎంతమంది ఏ సమయానికి  విధులకు హాజరయ్యారో ఆ వివరాలు ఇక్కడ అందరికీ కనిపిస్తాయి. ఉద్యోగుల పేర్లు, వారి హోదాలు వారు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్లారు తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు.
ఇంజనీరింగ్ పనులు: ఇంజనీరింగ్ పనులు ఏ గ్రామంలో ఏఏ పనులు చేపట్టారు, ఏ పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి... తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. కొండవీటివాగు సర్వే పనులు, వీధి దీపాలు ఏర్పాట్లు 95 శాతం పూర్తి అయినట్లు ఇక్కడ నమోదు చేశారు. కొన్ని పనులు వంద శాతం పూర్తి అయినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు 55 శాతం పూర్తి అయినట్లు నమోదు చేశారు. అన్ని పనుల వివరాలు, ప్రస్తుతం వాటి స్థాయి అన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
పరిసరాల పచ్చదనం, సుందరీకరణ:  సీఆర్డీఏ ప్రాంతంలో, రాజధాని పరిధిలో పరిసరాల పచ్చదనం, సుందరీకరణ పనుల వివరాలను ఇక్కడ పొందుపరిచారు. గన్నవరం- తాడిగడప క్రాస్ రోడ్డులో రూ.95 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు. గన్నవరం-నిడమానూరు రోడ్డుకు ఇరువైపుల సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిడమానూరు-రామవర్పాడు రింగ్ రోడ్డు వరకు రూ.68 లక్షలతో పనులు చేపట్టారు. భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు పూల మొక్కలు, పచ్చికబయళ్లు ఏర్పాటు కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అమరావతి పరిధిలో వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు చేసి పచ్చదనం నింపుతున్నారు. కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నారు.   రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా చేశారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపారు. అన్ని ప్రాంతాల ఫొటోలతోసహా ఆ వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచారు.

ఈ విధంగా సీఆర్డీఏలో జరిగే ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలను దాపరికంలేకుండా  ఈ డ్యాష్ బోర్డులో పొందుపరిచారు. నూతన రాజధాని నిర్మాణంలో అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర  వివరాలు అందరూ తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా పారదర్శకతలో దేశంలో ఏపీ అగ్రభాగాన నిలుస్తోంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...