Feb 17, 2017

సీఆర్డీఏ వివరాలన్నీ బహిర్గతమే!

§  పారదర్శకతకు నిదర్శనం
§  రాజధాని అమరావతి కోసం
25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాల సమీకరణ
§  ప్రధాన వెబ్ సైట్ లో పూర్తి వివరాలు
§  డ్యాష్ బోర్డులో 12 విభాగాల పూర్తి వివరాలు వెల్లడి

            డిజిటలైజేషన్ లో ఏపీ ప్రభుత్వం  దూసుకుపోతోంది. అన్ని రంగాలలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఏపీ ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖలలో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది.  అక్రమార్జనకు కళ్లెంపడింది. అవినీతి తగ్గింది. ఈ మేరకు నీతిఅయోగ్ ఏపీని ప్రశంసించింది.   ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి కూడా సీఎం డ్యాష్ బోర్డు మాదిరి డ్యాష్ బోర్డుని ఏర్పాటు చేశారు.  ఈ డ్యాస్ బోర్డులో సీఆర్డీఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరిచారు. ఏపీ ఇ-ప్రొక్యూర్ మెంట్, నా ఇటుక – నా అమరావతి వంటి లింకులను కూడా ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలు దాపరికంలేకుండా అందరికీ అందుబాటులో ఉంచారు. సీఆర్డీఏ విస్తీర్ణం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని  8,603 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.  నూతన రాజధాని అమరావతిని 217 చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలి, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంత సేకరించారు, ఎంత మంది రైతులు భూములు ఇచ్చారు, ఎంతమంది భూమిలేని పేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మాస్టర్ ప్లాన్, టెండర్లు, ఆమోదించిన, ఆమోదించని ప్లాన్లు తదితర  వివరాలన్నింటిని ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు. పనులు జరిగే క్రమం, టెండర్ల వివరాలు, రైతులకు ప్లాట్ల పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు.

 12 అంశాలతో డ్యాష్ బోర్డు
           ప్రధాన వెబ్ సైట్ కు అనుబంధంగా ఇప్పుడు 12 అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్(ఎల్పీఎస్), ఒకేసారి రైతుల రుణ మాఫీ, భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, బిల్డిండ్ పెనలైజేషన్ స్కీమ్(బీపీఎస్), అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్-నరేగా), అమరావతి గ్రామాల్లో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ), బయోమెట్రిక్ హాజరు, ఇంజనీరింగ్ వర్క్స్, పరిసరాల పచ్చదనం, అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి ఈ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తప్ప మిగిలిన వివరాలన్నింటినీ అప్ డేట్ చేశారు.  దీనికి సంబంధించి అప్ డేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాల సమీకరణ
      డ్యాష్ బోర్డులో తెలిపిన ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 27,874 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాలు సమీకరించింది. ఇంకా 3344 మంది రైతుల నుంచి 1857 ఎకరాలు సమీకరించవలసి ఉంది. ఏ గ్రామంలో ఎంత భూమి సమీకరించారో, ఎంత సమీకరించాలో, పట్టా భూమి, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ భూమి... తదితర వివరాలు కూడా ఇక్కడ అప్ డేట్ చేశారు.
రూ.85.35 కోట్ల రుణాలు రద్దు: రైతుల రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. మొత్తం 25 గ్రామ పంచాయతీల్లోని 19,518 మంది రైతులకు చెందిన రూ.85.35 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. గ్రామాల వారీగా వివరాలను కూడా ఇక్కడ ఉంచారు.
వార్షిక చెల్లింపులు రూ.137.44 కోట్లు: స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కాకుండా భూ సారం ఆధారంగా ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పది సంవత్సరాలపాటు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రకారం వార్షిక చెల్లింపులలో భాగంగా 32,423 ఎకరాలకు సంబంధించి 25,781 మంది రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.138.69 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, యూనిట్ల వారీగా పూర్తి వివరాలు ఇందులో ఉంచారు.
బీపీఎస్ కింద 6429 దరకాస్తులు: బిల్డింగ్ పెనలైజేషన్ పథకం (బీపీఎస్)కింద సీఆర్డీఏకు ఇప్పటి వరకు 6429 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 2,506కు ప్రొసీడింగ్ లెటర్ పంపారు. 3751 పరిశీలనలో ఉన్నాయి. 172 దరకాస్తులను తిరస్కరించారు. వ్యక్తిగతంగా దరకాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి బీపీఎస్ సైట్ లింక్ కూడా అక్కడే ఇచ్చారు.
ఏఎస్ డీఐ: అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ) ద్వారా 483 మందికి శిక్షణ ఇప్పించారు. వారిలో 386 మందికి ఉపాధి కల్పించారు. 225 మందికి నేరుగా ఉపాధి కల్పించారు. గ్రామాల వారీగా ఎంతెంతమందికి ఉపాధి కల్పించారో పూర్తి వివరాలు పొందుపరిచారు.
ప్రొక్యూర్ మెంట్: వివిధ పనులు, కన్సల్టెన్సీలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించి సీఆర్డీఏ  విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్ల వివరాలు ఈ విభాగంలో పొందుపరిచారు.  ఇప్పటి వరకు రూ.589.42 కోట్ల విలువైన 62 అంశాలకు సంబంధించి టెండర్లు పిలిచారు.
ఏఎల్ పీపీ కింద 20,013 మందికి పెన్షన్: అమరావతి గ్రామాలలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ) పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.2,500 ఇస్తున్నారు.   ఇప్పటి వరకు 20,013 కుటుంబాలకు రూ.5 కోట్లు విడుదల చేశారు. గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంతమందికి, ఎవరెవరికి ఇచ్చింది వారి పేర్లతోసహా పూర్తి వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపరిచారు.
బయోమెట్రిక్ అటెండెన్స్:  సీఆర్డీఏలోని ఉద్యోగులను బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిష్టర్ లో నమోదు చేస్తున్నారు. 2017 ఫిబ్రవరి 14వ తేదీ వరకు 326 మంది ఉద్యోగుల పేర్లు నమోదు చేశారు. ఏ రోజు ఎంతమంది ఏ సమయానికి  విధులకు హాజరయ్యారో ఆ వివరాలు ఇక్కడ అందరికీ కనిపిస్తాయి. ఉద్యోగుల పేర్లు, వారి హోదాలు వారు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్లారు తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు.
ఇంజనీరింగ్ పనులు: ఇంజనీరింగ్ పనులు ఏ గ్రామంలో ఏఏ పనులు చేపట్టారు, ఏ పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి... తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. కొండవీటివాగు సర్వే పనులు, వీధి దీపాలు ఏర్పాట్లు 95 శాతం పూర్తి అయినట్లు ఇక్కడ నమోదు చేశారు. కొన్ని పనులు వంద శాతం పూర్తి అయినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు 55 శాతం పూర్తి అయినట్లు నమోదు చేశారు. అన్ని పనుల వివరాలు, ప్రస్తుతం వాటి స్థాయి అన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
పరిసరాల పచ్చదనం, సుందరీకరణ:  సీఆర్డీఏ ప్రాంతంలో, రాజధాని పరిధిలో పరిసరాల పచ్చదనం, సుందరీకరణ పనుల వివరాలను ఇక్కడ పొందుపరిచారు. గన్నవరం- తాడిగడప క్రాస్ రోడ్డులో రూ.95 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు. గన్నవరం-నిడమానూరు రోడ్డుకు ఇరువైపుల సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిడమానూరు-రామవర్పాడు రింగ్ రోడ్డు వరకు రూ.68 లక్షలతో పనులు చేపట్టారు. భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు పూల మొక్కలు, పచ్చికబయళ్లు ఏర్పాటు కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అమరావతి పరిధిలో వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు చేసి పచ్చదనం నింపుతున్నారు. కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నారు.   రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా చేశారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపారు. అన్ని ప్రాంతాల ఫొటోలతోసహా ఆ వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచారు.

ఈ విధంగా సీఆర్డీఏలో జరిగే ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలను దాపరికంలేకుండా  ఈ డ్యాష్ బోర్డులో పొందుపరిచారు. నూతన రాజధాని నిర్మాణంలో అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర  వివరాలు అందరూ తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా పారదర్శకతలో దేశంలో ఏపీ అగ్రభాగాన నిలుస్తోంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...