Apr 16, 2017

తెలంగాణ ఇంటర్ లో మెరిసిన ఆకురాతి మానస

82 మార్కులతో 10వ ర్యాంక్

        గుంటూరుకు చెందిన ఆకురాతి వెంకట కృష్ణారావు, భారత స్వరాజ్యలక్ష్మిల మనవరాలు ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. 10వ ర్యాంక్ తో తెలంగాణలో మెరిసింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీగాయత్రి జూనియర్ కాలేజీలో  మానస ఇంటర్ బైపీసీ చదివింది. వెంకట కృష్ణారావు గుంటూరు పట్టణ పద్మశాలి సంఘానికి కొంత కాలం కార్యదర్శిగా పని చేశారు. పద్మశాలీయుల ఐక్యతకు కృషి చేశారు.

           మానస తండ్రి ఆకురాతి వరహా కిషోర్ సుందరం ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారు నివాసం ఉన్నారు. దాంతో మానస ఆయా ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో పదవ తరగతి వరకు చదివింది. ఒకటి, రెండు తరగతులు రాజమండ్రిలో, 3,4,5 తరగతులు విజయవాడలో, 6, 7 తరగతులు కోల్ కతాలో, 8వ తరగతి భువనేశ్వర్ లో 9,10 తరగతులు  హైదరాబాద్ లో, ఇంటర్ సికింద్రాబాద్ లో చదివింది.
తండ్రి వరహా కిషోర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి, ప్రస్తుతం యాస్ట్రో సైకాలజీలో పీహెచ్ డీ చేస్తున్నారు. తల్లి బాలసరస్వతి ఎమ్మెస్సీ చేశారు. వీరికి ఇంజనీరింగ్ చదువుతున్న స్వరాజ్, మానస ఇద్దరు బిడ్డలు. బాలసరస్వతి కొద్ది కాలం లెక్చరర్ గా పని చేశారు. ఆ తరువాత భర్త ఉద్యోగరీత్యా బదిలీలు - పిల్లలు ఎదిగిరావడం - వారి ఆలనాపాలనా చదువులు - ఆసక్తి ఉన్న అంశాలలో వారిని ప్రోత్సహించడం చేశారు. భర్త ఉద్యోగబాధ్యతల్లో తలమునకలై ఉంటే, పిల్లల అవసరాలన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది.  చదువులో తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకొని మానస ఇంటర్ లో ర్యాంక్ సాదించింది. ఉన్నత చదువులు చదవాలన్న ఆసక్తితో ఉంది. ఇంటర్ లో అధిక మార్కులు సాధించిన సందర్భంగా మానస మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఇది సాధ్యమైందని తెలిపింది. ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదంది. హెల్త్ కు సంబంధించిన కోర్సు చేసి, ఆరోగ్య భారత్ లో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు మానస చెప్పింది.
       

        చదువే కాకుండా మానసకు సంగీతం పట్ల ఆసక్తి ఉంది. లండన్ కు చెందిన ట్రినిటీ కాలేజీ పియానో పరీక్షల్లో డిస్టిన్షన్ లో మంచి మెరిట్ లో పాసవుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు స్థాయిల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.  సికింద్రాబాద్ లోని శ్రీభక్త రామదాస్ ప్రభుత్వ మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీలో వీణ సర్టిఫికెట్ కోర్సు 4వ సంవత్సరం చేస్తోంది.  ఈ కోర్సులో మానస ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటోంది. బెంగళూరులోని పండిట్ రవిశంకర్ అంతర్జాతీయ కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన వీణ సమ్మేళనాల్లో పాల్గొని మానస పలువురి ప్రశంసలు అందుకుంది.  అటు పాశ్యాత్య(పియానో), ఇటు భారతీయ (వీణ)  వాయిద్య పరికరాలతో ప్రయోగాలు చేసి జనరంజకమైన సంగీతం అందించాలన్నది తన ఆకాంక్షగా తెలిపింది.   సంగీతం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తానని మానస చెప్పింది.  














      

Apr 5, 2017

అత్యంత సమర్థవంతులైన తెలుగు నేతలు


  రాజకీయం అంటే ఏ పార్టీ అయినా, సిద్ధాంతాలు ఏవైనా  అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. ఎవరైనా తమ చాకచక్యాన్నంతా ప్రదర్శించి యుక్తులు, కుయుక్తులు పన్ని, కుల రాజకీయాల్లో నెగ్గుకొచ్చి, డబ్బు ఖర్చు చేసి, ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినంత మాత్రాన సమర్థవంతమైన రాజకీయ నేతకాలేరు. రాజకీయాల్లో విజయం సాధించడంతోపాటు పరిపాలనా సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థను క్రమపద్దతిలో పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించడం  ముఖ్యం. ఈ మూడు లక్షణాల్లో ఎవరైతే తమ సమర్థతను ప్రదర్శించగలతో వారే శక్తివంతమైన నాయకులుగా ఎదుగుతారు. గుర్తింపు పొందుతారు. అటువంటివారే దీర్ఘకాలంలో అధికారంలో కొనసాగగలరు. నేతలుగా మనగలిగి పదికాలాలపాటు గుర్తుండిపోతారు. రాజనీతి విషయంలో కొన్ని సందర్భాల్లో ఇది మంచి, ఇది చెడు అని చెప్పడం సాధ్యం కాదు. సమకాలీన పరిస్థితులు, రాజకీయ, సామాజిక అంశాల ఆధారంగా  వ్యూహ రచన చేసి, అమలు చేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా అది కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అయినా, చివరకు వామపక్షాలైనా రాజకీయాల్లో కులాలు, వర్గాలు, గ్రూపులు, ప్రాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు నడపక తప్పవు.  ఎన్నికల సమయంలోనూ, ఆ తరువాత కూడా ఆయా వర్గాలను వివిధ రకాలుగా సంతృప్తిపరచవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో కుల ఉద్యమాలు పెరిగిపోయాయి. కులాల ప్రాతిపదికగా నిధులు కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిలో నెగ్గినవాడే అధికారాన్ని పొందగలుగుతాడు. దానిని నిలబెట్టుకోగలుగుతాడు. అన్ని సందర్భాల్లో ఒకే రకమైన రాజనీతి ప్రదర్శించడం సాధ్యం కాదు, ఆయా సందర్భాలను బట్టి రాజనీతి మారుతూ ఉంటుంది. అందలం ఎక్కిన తరువాత దీర్ఘ కాలం కొనసాగాలంటే పాలనానుభవం ఉండాలి. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఆర్థిక అంశాలపై అవగామన ఉండాలి. దేశ, విదేశాల్లోని ఆర్థిక సంస్థల నుంచి ఎంతైనా అప్పు తేవచ్చు. అయితే తీసుకువచ్చిన డబ్బుని సమర్థవంతంగా వినియోగించి (మనీ మేనేజ్ మెంట్) ఫలితాలను సాధించాలి.

            రాజకీయాల్లో మన తెలుగు నేతలు రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ పేరు గడించినవారు అనేక మంది ఉన్నారు. అయితే వారిలో దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు (పాములపర్తి వెంకట నరసింహారావు), ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు అత్యంత శక్తివంతమైన పరిపాలనాదక్షులుగా గుర్తింపు పొందారు. చాకచక్యంగా రాజకీయాలను నడపడంలో, ఆర్థిక వ్యవస్థను అద్వితీయమైన రీతిలో చక్కదిద్దటంలో వారికి వారే సాటి. ఇద్దరూ ఇద్దరే. అపర చాణుక్యులు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో పీవీ ప్రధాని అయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్రభుత్వానికి గడ్డు కాలం అది. పార్లమెంట్ లో ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేదు. ఆనాడు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. దానికి తోడు నిరుద్యోగం తాండవిస్తోంది. ఆర్థిక వృద్ధి తిరోగమనంలో ఉంది. తయారీ రంగంలో సంక్షోభం నెలకొంది. విదేశీ అప్పులు పేరుకుపోయాయి.  అన్ని విధాలా అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల్లో  దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించింది. అధ్వాన్న స్థితికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థను పీవీ చక్కదిద్దారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, సరళీకరణ విధానాల వల్లే ఆ తరువాత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధించింది. రాజకీయ అనుభవంలేని ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ ని కేంద్రంలో ఆర్థిక మంత్రిని చేశారు. ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అపర చాణుక్యుడిగా పేరు గఢించారు. 1991 జులైలో మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవేసింది. ఆ బడ్జెట్ దేశంలో ఆర్థికంగా ఓ ఊపు తెచ్చింది. ఎగుమతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. దిగుమతులను బాగా కట్టడి చేశారు. పన్ను విధానాల్లో కూడా మార్పులు చేసి కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించారు. మన్మోహన్‌ తీసుకొచ్చిన సరళీకరణ విధానాలు సత్ఫలితాలనిచ్చాయి.
        పార్లమెంట్ లో తగిన బలం లేకపోవడం వల్ల రాజకీయంగా తలెత్తిన సంక్షోభాలను పీవీ తన  సహజసిద్ధమైన తెలివితేటలు, అపార రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా పొందిన అనుభవంతో చాకచక్యంగా ఎదుర్కొన్నారు. 1991 నుంచి 1996 వరకు పూర్తి కాలం అయిదు సంవత్సరాలు ప్రధానిగా కొనసాగారు. నెహ్రూ, గాంధీ కుటుంబాల నుంచి కాకుండా అప్పటి వరకు ఇతరులు ఎవరూ పూర్తి కాలం అయిదు సంవత్సరాలు ప్రధానిగా కొనసాగలేదు. ఆ ఘనత తెలుగువాడైన పీవీకే దక్కింది. అంతే కాకుండా  ఇప్పటివరకు ప్రధాని అయిన తెలుగు నేత పీవీ ఒక్కరే.

           పీవీలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆ మూడు విషయాల్లో అత్యంత సమర్థతను ప్రదర్శిస్తారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అత్యధిక కాలం 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగి చరిత్ర సృష్టించారు. 1995లో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఆయన ఎటువంటి రాజనీతిని ప్రదర్శించారో అందరికీ తెలిసిందే. 25 ఏళ్ల క్రితం పివి హయాంలో మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితాలు మన రాష్ట్రంలో కూడా కనిపిస్తున్నాయి. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. దేశంలో సంపదతోపాటు ఉద్యోగ అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగాయి. 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు  ఆ సంస్కరణలను అందిపుచ్చుకున్నారు. ఆర్థిక పరంగా రాష్ట్రంలో గట్టి పునాదులు వేశారు.   ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కూడా ఆయన బాటలోనే వెళ్లవలసి వచ్చింది. మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో తను కొనసాగించిన విధానాలనే మళ్లీ కొనసాగించారు. ఆయన వేసిన పునాదులపై బలపడిన  వ్యవస్థ నుంచి మంచి ఫలితాలు రావడం మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి. ముందు చూపుతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.

           రాష్ట్రవిభజన జరిగిన నేపధ్యంలో అనేక రాజకీయ సమీకరణలను అత్యద్భుతంగా తనకు అనుకూలంగా మలచుకొని ఎన్నికల్లో విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అసంఖ్యాకమైన కష్టాలను మన ముందుంచింది. జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువగా వచ్చే ప్రాంతాన్ని ఏపీగా విభజించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రధాన ఆస్తులు, భవనాలు అన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయాయి. రాజధాని లేని, నిండా అప్పుల్లో మునిగిన ఏపీని అప్పగించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ఒక పక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తూనే, మరో పక్క వినూత్నమైన రీతిలో అభివృద్ధి వ్యూహాలను అనుసరించి సమ్మిళిత వృద్ధి సాధించారు.

      ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులలో ఉన్న ఆంధ్రప్రదేశ్  రెండేరెండేళ్ల వ్యవధిలో మంచి అభివృద్ధి సాధించింది. పలు అంశాలలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. ఆయనకున్న అపార రాజకీయ, పాలనా అనుభవం ద్వారా రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న సహజ, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని రెండంకెల వృద్ధిరేటు సాధించే విధంగా కృషి చేశారు. సమర్థ నీటి వినియోగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (రాష్ట్రంలో ఏడాది కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తి- జిఎస్ డిపి- గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్) వృద్ధి రేటులో మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ ఆర్థిక సంవత్సరం(2016–17 )లో  ముందుగా వేసిన అంచనాల ప్రకారం 12.61 శాతం వృద్ధి రేటు సాధించింది. రాష్ట్రంలో సరాసరి తలసరి ఆదాయం మొదటిసారిగా లక్ష రూపాయలు దాటి రికార్డు సృష్టించింది.  2015–16లో రూ.1,08, 163లు ఉండగా, 2016–17లో రూ.1,22,376 తలసరి ఆదాయం ఉంటుందని అంచనా. చంద్రబాబు పాలనలో ఆర్థిక వృద్ధిరేటు ఏడాదికి ఏడాది పెరుగుతూ వస్తోంది. అర్థశాస్త్రంలో మాస్టర్ డిగ్రీతోపాటు ఎంఫిల్ కూడా చేయడం వల్ల ఆర్థిక విషయాల పట్ల ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది.   పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం దేశంలో మొదటి ర్యాంకు సాధించింది. విద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. హుద్ హుద్ తుపాను వంటి ప్రకృతీవైపరీత్యాలు సంభవించినా, వర్షపాతం తగ్గి కరవు పరిస్థితులు నెలకొన్నా, ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నా రాష్ట్రం ఇంతటి విజయాలను సాధించడం చంద్రబాబు శక్తి,సామర్థ్యాలకు నిదర్శనం.  నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి  భూ సమీకరణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. వేల ఎకరాలు సమీకరించడం మాటలుకాదు. అంత భూమిని రైతులు ఇవ్వడానికి అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా అసలే లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అవకాశం ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనదైన తీరులో స్పందించారు. పూలింగ్ ద్వారా భూ సమీకరణ విధానం అతని ఆలోచనే. రైతులకు సమన్యాయం అందించేవిధంగా  ఓ కొత్త విధానం మన రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు 25 రెవెన్యూ గ్రామాల (29 గ్రామాలు)కు చెందిన 25,871 మంది రైతులు 32,513 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇంత భూమి ఈ విధంగా సమీకరించలేదు. స్వచ్ఛందంగా కూడా ఇలా ఇంత భూ సమీకరణ చేయవచ్చని చేసి చూపించి చంద్రబాబు ఓ కొత్త వరవడి సృష్టించారు.

   కంప్యూటర్ కు సంబంధించి పీవీకీ, చంద్రబాబుకు సామీప్యం ఉంది.  కంప్యూటర్ ను ఉపయోగించడం, దానికి సంబంధించి కొత్త విషయాలు తెలుసుకోవడంలో  పీవీ ఎప్పుడూ ముందుండేవారు. చంద్రబాబు  కూడా ఈ విషయంలో చాలా శ్రద్ధ కనపరుస్తారు. కొత్త కొత్త అంశాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందడానికి విశేష కృషి చేస్తున్నారు.  పీవీ విషయానికి వచ్చేసరికి ఆయనకు అనేక అదనపు సామర్థ్యాలు కూడా ఉన్నాయి.  ఆయన సాహితీ స్రష్ట. 17 భాషలు తెలిసిన బహుభాషావేత్త. విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయిపడగలును హిందీలోకి అనువదించారు. అతని ఆత్మకథ ఇన్ సైడర్’ (లోపలి మనిషి) బహుళా ప్రాచుర్యం పొందింది. పరిపాలనలో మాత్రం ఇద్దరూ తమ సమర్థతను చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు మూడవసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పాలనలో ఆధునిక అంశాలను చొప్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారు.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...