Nov 9, 2023

తెలుగు సమాచారం

 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం


వేదాలు :(1) ఋగ్వే దం, 

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం


 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా


 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.


పంచేంద్రియాలు : (1) కన్ను, 

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.


 లలిత కళలు : 

(1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.


పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి, (5) తుంగభద్ర.


 దేవతావృక్షాలు : (1) మందారం, 

(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.


పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.


పంచలోహాలు : (1) బంగారం, 

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.


పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం


షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 

(3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.


అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:

(1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.


ఋతువులు :

 (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు, 

(5) హేమంత, (6) శిశిర


సప్త ఋషులు :

 (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.


తిరుపతి సప్తగిరులు :

 (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.


సప్త వ్యసనాలు :

 (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం, 

(4) వేట, (5) వ్యభిచారం, 

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.


 సప్త నదులు : 

(1) గంగ, (2) యమునా,  (3) సరస్వతి, 

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.


నవధాన్యాలు : 

(1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు, 

(😎 ఉలవలు, (9) అలసందలు.


నవరత్నాలు :

 (1) ముత్యం, 

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 

(7) కనకపుష్యరాగం, 

(😎 పచ్చ (మరకతం), 

(9) ఎరుపు (వైడూర్యం).


నవధాతువులు :

 (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (😎 తగరం, 

(9) కాంతలోహం.


నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 

(6) భయానక, (7) బీభత్స, 

(😎 అద్భుత, (9) వీర


నవదుర్గలు :

 (1) శైలపుత్రి, 

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత, 

(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 

(😎 మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.


 దశ సంస్కారాలు :

 (1 ) వివాహం, 

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 

(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 

(10) సమవర్తనం


దశావతారాలు :

 (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన, 

(6) పరశురామ, (7) శ్రీరామ,

(😎 శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.


జ్యోతిర్లింగాలు :


హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 

తమిళనాడు ~ రామలింగేశ్వరం


తెలుగు వారాలు :

 (1) ఆది, (2) సోమ, 

(3) మంగళ, (4) బుధ, (5) గురు, 

(6) శుక్ర, (7) శని.


తెలుగు నెలలు : 

(1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 

(5) శ్రావణం, (6) భాద్రపదం, 

(7) ఆశ్వీయుజం, (😎 కార్తీకం, 

(9) మార్గశిరం, (10) పుష్యం, 

(11) మాఘం, (12) ఫాల్గుణం.


 రాశులు :

 (1) మేషం,(2) వృషభం, 

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, 

(😎 వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, 

(12) మీనం.


తిథులు : 

(1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (😎 అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.


నక్షత్రాలు : 

(1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(😎 పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.


తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :- 1927, 1987, 2047, 2107

(2) విభవ :- 1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 1934, 1994, 2054, 2114

9యువ.  - 1935, 1995, 2055, 2115

10.ధాత.  - 1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 1940, 2000, 2060, 2120

15.వృష.-1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 1943, 2003, 2063, 2123

18.తారణ. - 1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 1945, 2005, 2065, 2125

20.వ్యయ.-1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128

23.విరోధి. - 1949, 2009, 2069, 2129

24.వికృతి. - 1950, 2010, 2070, 2130

25.ఖర. 1951, 2011, 2071, 2131

26.నందన.1952, 2012, 2072, 2132

27 విజయ.1953, 2013, 2073, 2133,

28.జయ. 1954, 2014, 2074, 2134

29.మన్మద.1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 1957, 2017, 2077, 2137

32.విళంబి. 1958, 2018, 2078, 2138

33.వికారి.1959, 2019, 2079, 2139

34.శార్వారి. 1960, 2020, 2080, 2140

35.ప్లవ 1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 1963, 2023, 2083, 2143

38. క్రోది.1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.1965, 2025, 2085, 2145

40.పరాభవ.1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147

42.కీలక. 1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 1969, 2029, 2089, 2149

44.సాధారణ . 1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151

46.పరీదావి. 1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 1973, 2033, 2093, 2153

48.ఆనంద. 1974, 2034, 2094, 2154

49.రాక్షస. 1975, 2035, 2095, 2155

50.నల :-1976, 2036, 2096, 2156, 

51.పింగళ        1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి   1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి     1979, 2039, 2099, 2159

54.రౌద్రి      1980, 2040, 2100, 2160

55.దుర్మతి    1981, 2041, 2101, 2161

56.దుందుభి   1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి   1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి   1984, 2044, 2104, 2164

59.క్రోదన   1985, 2045, 2105, 216

60.అక్షయ   1986, 2046, 2106, 2166.




Nov 2, 2023

ఆశాజనకంగాలేని బీఆర్ఎస్ పరిస్థితి


తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే  కాంగ్రెస్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.  తెలంగాణ సాధించిన పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఇప్పటి వరకు మంచి గుర్తింపు ఉంది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు  పక్షపాతంతో  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినవస్తున్నాయి.  నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.తీవ్ర ఒత్తిడికి గురైన యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. టికెట్ల కేటాయింపులో బీసీలు, మహిళలతోపాటు చాలా వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి వల్లే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారు మళ్లీ పోటీచేస్తున్న కొన్ని చోట్ల ప్రజలు ఆవేశంతో ఊగిపోతున్నారు. మళ్లీ వారికి ఓటువేసే ప్రసక్తేలేదని ఖరాఖండిగా చెబుతున్నారు.  ప్రచారానికి వెళుతున్న కొందరు ఎమ్మెల్యేలపై  ప్రజలు తిరగబడుతున్నారు.కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా, అభ్యర్థి అయినా ‘మా ఊరికి రావద్దు’ అని ప్లెక్సీలు కూడా పెడుతున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నల్లొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆదోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దినకర్ రావు,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదం కిషోర్ కుమార్ వంటి అనేక మందిని ఓటర్లు నిలదీస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారు చల్లగా జారుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగి ప్రజలకు సర్ధిచెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. 

 అనేక మంది ఎమ్మెల్యేలు  భూములు ఆక్రమించినట్లు  ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారన్నది ప్రజల ఆరోపణ. చాలా పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, పథకాల అమలులో అవకతవకలు జరగడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తీవ్రవ్యతిరేకత ఏర్పడింది. అనేక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వారికి 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్ లలో భూమి కేటాయించింది. సొసైటీవారు ఆ భూమికి అప్పటి మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వానికి డబ్బు చెల్లించారు. సుప్రీం కోర్టు కూడా ఏడాది క్రితం సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ భూమిని సొసైటీకి అప్పగిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా నమ్మబలికారు.  ఒక్క నిజాంపేట  భూమిని మాత్రమే సొసైటీకి అప్పగించారు. పేట్ బషీరాబాద్ భూమిని ఇప్పటి వరకు అప్పగించలేదు. ఈ సొసైటీలో దాదాపు 1100 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 70 మంది వరకు తనువు చాలించారు. హైదరాబాద్ లోని మిగిలిన జర్నలిస్టులు కూడా సొసైటీ ఏర్పాటు చేసుకుంటే భూములు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. వారు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు. భూమి మాత్రం కేటాయించలేదు. దాంతో అత్యధిక మంది జర్నలిస్టులు ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ప్రజల్లో బీఆర్ఎస్ అంటే ఇంతటి తీవ్రవ్యతిరేకత కనిపించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.  

బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా అంతఆశాజనకంగా లేదు. వాటిలో ప్రజాకర్షణ పథకాలు ఏమీలేవు.  పాత పథకాలు కొనసాగిస్తామని, ప్రజలందరికీ బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరమితి రూ.15 లక్షలకు పెంచుతామని, పేద మహిళలకు, జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి,రేష‌న్ కార్డు పై సన్న బియ్యం ఇస్తామని, రైతుబంధు,దివ్యాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్ ల పెంపు వంటి హామీలు ఇచ్చారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలు  సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయడానికి  ఒక  కమిటీ నియమిస్తామని చెప్పారు. అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేతకు ప్రయత్నం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చింది. ఈ హామీలన్నిటికీ మెలికలు పెట్టారు. అందువల్ల ఓటర్లు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరు. 

గతంలో ఇతర పార్టీలకు చెందిన అనేకమంది బీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. సర్వేలలో  అధిక శాతం కాంగ్రెస్ కు అనుకూలత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు,జడ్పీ చైర్మన్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు పలుకుబడికలిగిన ముఖ్యనేతలు, జడ్సీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు అనేక మంది బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారు. అయితే, అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ లో టికెట్లు రాని కొంతమంది ప్రముఖులు తమ అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ వారికి టికెట్లు కూడా ఇచ్చింది. 

బీఆర్ఎస్ పై వ్యతిరేకత  కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీలో ఓ ఊపు తెచ్చారు. దానికి తోడు బీఆర్ఎస్ పై అసంతృప్తి, ఆ పార్టీ ప్రముఖ నేతలు భారీస్థాయిలో  కాంగ్రెస్ లో చేరడం... వంటి అంశాలన్నీ కాంగ్రెస్ కు కలిసివస్తున్నాయి. దాంతో ఆ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల హామీ కూడా ఓటర్లలోకి బాగా చొచ్చుకు వెళ్లింది. మహిళలు, యువతపై వారు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా పథకాలు పక్క రాష్ట్రం కర్ణాటకలో అమలు చేయడంతో ఆ పార్టీపై నమ్మకం పెరిగింది. ఎన్నికల సర్వేల ఫలితాలు, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ అసాధ్యంగా కనిపిస్తోంది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

‘విశ్వవిఖ్యాత’ చిత్రకారుడు – ఎస్వీ రామారావు

64 కళలు.కాం సకల కళల సమాహారం


ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన తెలుగువాడు డాక్టర్ ఎస్వీ రామారావు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణత్వాన్ని సాధించి ప్రపంచ ఖ్యాతి గడించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళా విమర్శకుడు, వ్యాస రచయిత, కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ. తైలవర్ణంలో ఆయన గీసిన అద్వితీయమైన చిత్రాలు ఓ సంచలనం. రంగులు, ఆ రంగుల గీతల భాష తెలిసిన మేథావి. పుస్తక పఠనంతో మేథోశక్తిని పొందారు. తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. తెలుగుదనంతోపాటు వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకున్నారు. వీటన్నిటి మేళవింపుతో రూపొందించినందునే ఎస్వీ చిత్రాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఆయన మద్రాస్ లో ఉన్న సమయంలో భారతి, మురళి,ఆంధ్రమహిళ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలకు చిత్రకళతోపాటు వివిధ అంశాలపై వ్యాసాలు రాసేవారు. చిత్రకళా విమర్శ చేసేవారు. ఏపీ ప్రభుత్వం లలిత కళా అకాడమీని ప్రారంభించినప్పుడు విజయ-వాహినీ స్టూడియోలోని గార్డెనర్ ని సభ్యునిగా నియమించింది. ఆ స్టూడియో ఉద్యోగి కావడమే అతని అర్హత. ఆ నియామకాన్ని ఏకిపారేస్తూ భారతిలో ఓ వ్యాసం రాసి అందరి దృష్టిలో పడ్డారు. ఏమాత్రం లలిత కళలు తెలియని ఓ గార్డెనర్ ని సభ్యుడిగా నియమించడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి విపరీతమైన స్పందన రావడంతో ఆ తర్వాత ఆ వ్యాసాన్ని ఆంధ్రపత్రికలో కూడా రీప్రింట్ చేశారు.

ఎస్వీ రామారావు 1936 జూన్ 12న కృష్ణా జిల్లా గుడివాడలో శిరందాసు గంగయ్య, లక్ష్మమ్మలకు జన్మించారు. ఆయన పూర్తి పేరు శిరందాసు వెంకట రామారావు. 12 ఏళ్ల వయసులోనే ఆయన చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. దానికి తోడు ఆ వయసులోనే ఆయనకు గుడివాడలోనే ప్రముఖ చిత్రకారుడు కె.వేణుగోపాల్ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళలో మెళకువలు తెలుసుకున్నారు. చిత్రకళ పట్ల ఆసక్తిని పెంచుకున్న ఎస్వీని చూసి తండ్రి తొలుత ఆందోళన చెందారు. తండ్రి కోరికమేరకు 1954లో బీకాం పూర్తి చేశారు. చరిత్రపై ఆసక్తితో ప్రైవేటుగా బీఏ పూర్తిచేశారు. 1955 నాటికి చిత్రకళలో నాలుగు డిప్లొమాలు సంపాదించారు. కలకత్తాలోని శాంతినికేతన్ లో శిక్షణ పొందాలనుకున్నారు గానీ, అది సాధ్యంకాలేదు. చిత్రకళపట్ల కుమారుని ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి గంగయ్య చివరకు మద్రాస్ లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా చేర్పించారు. ప్రఖ్యాత సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఎంట్రన్స్ రాశారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ అతనిని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. అదే ఆయన జీవితంలో ఓ పెద్ద మలుపు. అక్కడ ఆయన నిష్ణాతులైనవారి వద్ద వివిధ రీతుల చిత్రకళలలో మెళకువలు నేర్చుకున్నారు. వాటర్ , ఆయిల్, టెంపేరా కలర్స్ లో చిత్రాలు గీసేవారు.పెద్దలతో పోటీపడిమరీ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచారు. దేశంలో చాలా మ్యూజియంలవారు ఎస్వీ చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో సాహిత్యంలో, చిత్రకళలో పెన్ నేమ్ వాడటం ఫ్యాషన్ గా ఉండేది. ఆ ప్రభావంతో ఎస్వీ కూడా ‘ఆర్యదేవ’ పేరుతో చిత్రాలు గీసేవారు. ఆయన భారత్ లో ఉన్నంత కాలం ఆ పేరుతోనే చిత్రీకరించారు. మనదేశంలో మద్రాస్ మ్యూజియం, కేరళ మ్యూజియం, ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలలో ఆయన చిత్రాలు ఆర్యదేవ పేరుతోనే ఉన్నాయి.


కామన్ వెల్త్ దేశాల చిత్రకారులతో పోటీపడి కామన్ వెల్త్ ఫెలోషిప్ సాధించారు. అన్నికామన్ వెల్త్ దేశాల చిత్రకారులలో ఒకరిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆధునిక చిత్రకళను అధ్యయనం చేయడానికి 1962లో ఎస్వీ రామారావు లండన్ వెళ్లారు. అక్కడ లండన్ యూనివర్సిటీకి చెందిన స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో 1965లో కోర్సు పూర్తి చేశారు. లితోగ్రఫీ ఆర్ట్ లో ఎస్వీ దిట్ట. అందులో కొత్తపుంతలు తొక్కారు. లితోగ్రఫీ ఆర్ట్ లో మాస్టర్ గా లండన్ లో పేరుగడించారు. 1965లో లితోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. ఎస్వీని ‘గాడ్ గివెన్ కలరిస్ట్’ అని విమర్శకులు కొనియాడారు. అప్పుడే ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ లండన్ టైమ్స్ కూడా రాసింది. లండన్ వెళ్లినప్పటి నుంచి ఆయన తన పేరుతోనే చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్వీ రామారావు చిత్రాలకు స్థానం లభించింది. 1965లో కామన్ వెల్త్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో‘ఈ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు, 2001లో పద్మశ్రీ వంటి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. ఒక చిత్రాన్ని ఒకేసారి గీస్తారు. ఒకేసారి అమ్ముతారు. దానిని ప్రింట్లు తీసి అమ్మరు. అదే ఆయన ప్రత్యేకత. ప్రతిభ ఉన్నవారు ఎదగడానికి కులం, మతం, ప్రాంతం ఏవీ అడ్డురావని నిరూపించారు ఎస్వీ రామారావు. తెలుగు జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. లండన్ లోని టాటా గ్యాలరీ, న్యూయార్క్ లోని మెట్రొపోలియన్ మ్యూజియం ఆర్ట్స్ తోపాటు ప్రపంచంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియంలలో అతను గీసిన చిత్రాలు ఉన్నాయి. మొదట అమెరికాలోని ఒహాయో రాష్ట్రం సిన్సనాటిలో యూనివర్సిటీ ఆఫ్ సిన్స నాటిలో టీచింగ్ అసిస్టెంట్ గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్ గ్రీన్ లోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్ గా చేసి పదవీవిరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్ పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్ సిటీలోని వేండర్ బిల్ట్ యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు.

50 ఏళ్లుగా అమెరికాలోని చికాగోలోనే ఉంటున్నారు. కుటుంబం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన తరచూ భారత్ వస్తుంటారు. ఒక్కోసారి ఎక్కువ కాలం ఇక్కడే ఉండి చిత్రాలు గీస్తుంటారు. 2008 నుంచి 2015 వరకు ఢిల్లీలోనే ఉండి, అనేక బొమ్మలు గీశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా తదితర నగరాలలో తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని సూర్య భగవానుడంటే ఆయనకు నమ్మకం ఎక్కువ. భారత్ వచ్చిన ప్రతిసారీ అక్కడకు వెళ్లి వస్తుంటారు.

ఎస్వీ గీసిన చిత్రాలు మద్రాస్ లో ఉన్నప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. అయితే, అలా అమ్ముడుపోతున్నాయని అవే చిత్రాలు గీసేవారు కాదు. వెంటనే ఆర్ట్ స్టైల్ మార్చేవారు. కొత్త రూపంలో చిత్రాలు గీసేవారు. అలా మార్చి మార్చి గీతలు గీసేవారు. ఆయన సాహితీ అధ్యయనం, సామాజిక పరిశీలన, వివిధ దేశాల సంస్కృతులు ఆకళింపు చేసుకొని కొత్తకొత్త విధానాలతో రంగులలో కూడా కొత్తదనం చూపిస్తూ చిత్రాలను రూపొందించేవారు. అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులను పొందగలిగారు. అలాగే, అన్ని దేశాలలో ఆయన చిత్రాలను అమ్ముడు పోయేవి. అనేక దేశాల రాయబారులు ఆయన చిత్రాలను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసేవారు. ఆ విధంగా ఆయన విశ్వచిత్రకారుడయ్యారు.

రాష్ట్రపతి అబ్దుల్ కలాం 5 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చి, ఆయనతో ఆ కొద్ది సమయం మాట్లాడిన తర్వాత 45 నిమిషాలు ఆయనతోనే గడిపారు. రాష్ట్రపతి భవన్ లోని గార్డెన్ ని తనే దగ్గరుండి చూపించారు. అంతేకాకుండా పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రపతి ఎస్వీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘డాక్టర్ ఎస్వీ రామారావు యాబ్ స్ట్రాక్ట్ చిత్రకారుడు అవ్వాలనుకున్నారు. రెండేళ్లలోపే లండన్ లో చిత్రాలు వేస్తూ, పికాసోకు సమానంగా, అంతపేరు తెచ్చుకున్న మేథావి’’ అని పొగడ్తలతో ముంచెత్తారు. అది ఎస్వీకి దక్కిన గొప్పగౌరవం.




అన్ని శాస్త్రాలకంటే సాహిత్యం ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడని ఎస్వీ రామారావు చెప్పారు. తెలియనిది తెలుసుకుంటూ, తనకు ఇష్టమైన రీతిలో రంగులను ఉపయోగిస్తానన్నారు. నవ్యచిత్రకళ విశ్వజనీనం అని, ఈ చిత్రకళలో రూపానికంటే రంగుకే ప్రాధాన్యం అని వివరించారు. చిత్ర విచిత్రమైన రంగుల ఇంద్రజాలం ద్వారా విశిష్ట కాంతులను సృష్టించటం అందులోని విలక్షణత. నవ్య చిత్రకళ వాస్తవ వాదానికి చెందదని, సహజరూపాన్ని బ్రద్దలుకొట్టి అందులోని ప్రాథమిక రూపాన్ని విశ్లేషణ పద్దతిలో చిత్రించటమే ఇందులోని ప్రధాన లక్షణం అని ఎస్వీ రామారావు చెబుతారు. చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్వీ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023కు ఎంపిక చేసింది. నవంబరు 1న విజయవాడలో ఆయన ఈ అవార్డును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, A.P. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు.

–శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Nov 1, 2023

చిత్రకళలో తెలుగు వెలుగు

విశ్వ నైరూప్య చిత్రకారుడు ఎస్వీకి జీవితసాఫల్య పురస్కారం

అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక చిత్రకళలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలుగువాడు డాక్టర్ ఎస్వీ రామారావు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్వీ చదువుకునే రోజుల నుంచే ఆ నాటి పత్రికలు భారతి, ఆంధ్రపత్రిక వంటి వాటికి పలు అంశాలపై వ్యాసాలు రాసేవారు. కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ.  పద్మశ్రీ అవార్డు పొందిన ఎస్వీ  తైలవర్ణంలో  అద్వితీయమైన చిత్రాలు గీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. చిన్నప్పటి నుంచి చూసిన పరిసరాలు, ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, సామాజిక అంశాలే ఆయన నైరూప్య చిత్రకళలో ప్రతిబింబిస్తాయి. దానికి తోడు రంగులు, ఆ రంగుల గీతలలు,  భాష తెలిసిన మేథావి. పుస్తక పఠనంతో పాటు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఎస్వీ రామారావు 1936 జూన్ 12న కృష్ణా జిల్లా గుడివాడలో  శిరందాసు గంగయ్య, లక్ష్మమ్మలకు జన్మించారు. ఆయన పూర్తి పేరు శిరందాసు వెంకట రామారావు.ఆయనకు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు. 12 ఏళ్ల వయసులోనే ఆయన చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. దానికి తోడు ఆ వయసులోనే ఆయనకు గుడివాడలోనే ప్రముఖ చిత్రకారుడు కె.వేణుగోపాల్ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళలో మెళకువలు తెలుసుకున్నారు. చిత్రకళ పట్ల ఆసక్తిని పెంచుకున్న ఎస్వీని చూసి కలప వ్యాపారి అయిన తండ్రి తొలుత ఆందోళన చెందారు. ఇంటికి పెద్ద కుమారుడైన ఎస్వీ తండ్రి కోరికమేరకు 1954లో  బీకాం పూర్తి చేశారు. చరిత్రపై ఆసక్తితో ప్రైవేటుగా బీఏ కూడా పూర్తిచేశారు.  1955 నాటికి  చిత్రకళలో ఆయన  నాలుగు డిప్లొమాలు పూర్తి చేశారు. 

కలకత్తాలోని శాంతినికేతన్ లో శిక్షణ పొందాలన్న కోరిక ఆయనకు ఉండేది. అయితే, అది సాధ్యంకాలేదు. చిత్రకళపట్ల కుమారుని ఆసక్తిని గమనించిన  తండ్రి గంగయ్య చివరకు మద్రాస్  లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా చేర్పించారు. ఆ సినిమా సంస్థలో మంగళగిరి చెందిన కారుమంచి వెంకటసుబ్బయ్య కూడా భాగస్వామి. అక్కడ ప్రఖ్యాత సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల  గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఎంట్రన్స్ రాశారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ అతనిని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. అక్కడ నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. వివిధ రంగా ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం, నడవడి అందరినీ ఆకర్షిస్తాయి. 

మద్రాస్ లో  నిష్ణాతులైనవారి వద్ద  చిత్రకళలో  వివిధ రీతులను నేర్చుకున్నారు. వాటర్ , ఆయిల్, టెంపేరా కలర్స్ లో  చిత్రాలు గీసేవారు.పెద్దలతో పోటీపడిమరీ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచారు. దేశంలో చాలా మ్యూజియంలవారు ఎస్వీ చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అయితే, ఎస్వీ తన పేరుతో కాకుండా పెన్ నేమ్ ‘ఆర్యదేవ’ పేరుతో మాత్రమే చిత్రాలు గీసేవారు. ఆయన భారత్ లో ఉన్నంత కాలం ఆ పేరుతోనే చిత్రీకరించారు.మద్రాస్ మ్యూజియం, కేరళ మ్యూజియం, ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలలో ఆయన చిత్రాలు  ఆర్యదేవ పేరుతోనే ఉన్నాయి.

కామన్ వెల్త్ దేశాల చిత్రకారులు 325 మందితో పోటీపడి  కామన్ వెల్త్ ఫెలోషిప్ సాధించారు. ఆధునిక చిత్రకళను అధ్యయనం చేయడానికి 1962లో   ఎస్వీ రామారావు లండన్ వెళ్లారు.  అక్కడ లండన్ యూనివర్సిటీకి చెందిన స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో  1965లో కోర్సు పూర్తి చేశారు. లితోగ్రఫీ ఆర్ట్ లో ఎస్వీ దిట్ట. అందులో కొత్తపుంతలు తొక్కారు. లితోగ్రఫీ ఆర్ట్ లో  మాస్టర్ గా  లండన్ లో పేరుగడించారు. 1965లో లితోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు.కొత్త కొత్త రంగులు, రేఖలతో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎస్వీని  ‘గాడ్ గివెన్ కలరిస్ట్’ అని విమర్శకులు కొనియాడారు. అప్పుడే ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ లండన్ టైమ్స్ కూడా రాసింది. లండన్ వెళ్లినప్పటి నుంచి ఆయన తన పేరుతోనే చిత్రాలు గీయడం మొదలుపెట్టారు.  ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్వీ రామారావు చిత్రాలకు స్థానం లభించింది.  1965లో   కామన్ వెల్త్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో‘ఈ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.ప్రపంచం మొత్తం ఎస్వీని గుర్తించింది.  ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన  వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. భారత ప్రభుత్వం  2001లో   జాతీయ అవార్డు  పద్మశ్రీతో సత్కరించింది.

 50 ఏళ్లుగా ఎస్వీ  అమెరికాలోనే స్థిరపడ్డా తరచూ భారత్ వస్తుంటారు. ఆయన భార్య డాక్టర్ సుగుణ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. కుమార్తె పద్మావతి హాస్పిటాలజీలో పీజీ చేసి అదే వృత్తిలో స్థిరపడ్డారు.  పద్మావతి నృత్యకళాకారిణి కూడా. కుటుంబం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఎస్వీ  ఒక్కోసారి ఎక్కువ కాలం ఇక్కడే ఉండి చిత్రాలు గీస్తుంటారు. 2008 నుంచి 2015 వరకు ఢిల్లీలోనే ఉండి, అనేక బొమ్మలు గీశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా తదితర నగరాలలో తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.  మొదట అమెరికాలోని  ఒహాయో రాష్ట్రం  సిన్సనాటిలో  యూనివర్సిటీ ఆఫ్ సిన్స నాటిలో టీచింగ్ అసిస్టెంట్ గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్ గ్రీన్ లోని  వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్ గా చేసి పదవీవిరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్ పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్ సిటీలోని వేండర్ బిల్ట్ యూనివర్సిటీలో  లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు. ఆయన రాసిన తెలుగు కవితలు మూడు సంకలనాలుగా, ఇంగ్లీషు కవితలు ఒక సంకలనంగా వెలువడ్డాయి. ఆయన రచనలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి కూడా అనువాదం అవుతున్నాయి. 

ఎస్వీ గీసిన చిత్రాలు మద్రాస్ లో ఉన్నప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. అయితే, అలా అమ్ముడుపోతున్నాయని అవే చిత్రాలు గీసేవారు కాదు. వెంటనే  స్టైల్ మార్చేవారు.కొత్త వన్నెల్లో చిత్రాలు గీసేవారు. అలా గీతలను, రంగులను, కళా రూపాలను మార్చేస్తుండేవారు.అదే ఆయన ప్రత్యేకత. అలా చేయడం వల్లే అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చినట్లు ఎస్వీ తెలిపారు.   అలాగే, అన్ని దేశాలలో ఆయన చిత్రాలను అమ్ముడు పోయేవి. అనేక దేశాల రాయబారులు ఆయన చిత్రాలను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసేవారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం 5 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చి, 45 నిమిషాలు  ఆయనతోనే గడిపారు. రాష్ట్రపతి భవన్ లోని గార్డెన్ ని  తనే దగ్గరుండి తిప్పి చూపించారు. అంతేకాకుండా పార్లమెంట్ ఉభయసభల్లో  ఆయన గురించి ప్రశంసిస్తూ రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

‘‘అన్ని శాస్త్రాలకంటే సాహిత్యం ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడు. తెలియనిది తెలుసుకుంటూ, తనకు  ఇష్టమైన రీతిలో రంగులను ఉపయోగిస్తాను. నవ్యచిత్రకళ  విశ్వజనీనం,  ఈ చిత్రకళలో రూపానికంటే రంగుకే ప్రాధాన్యం.చిత్ర విచిత్రమైన  రంగుల ఇంద్రజాలం ద్వారా విశిష్ట కాంతులను సృష్టించటం ఇందులోని  విలక్షణత. నవ్య చిత్రకళ  వాస్తవ వాదానికి చెందదు. సహజరూపాన్ని  బ్రద్దలుకొట్టి అందులోని ప్రాథమిక రూపాన్ని విశ్లేషణ పద్దతిలో చిత్రించటమే ఇందులోని ప్రధాన లక్షణం’’ అని ఎస్వీ రామారావు చెప్పారు.  చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్వీ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  గుర్తించి వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023కు ఎంపిక చేసింది. నవంబరు 1న విజయవాడలో ఆయనకు ఈ అవార్డు అందజేస్తారు.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914




అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...