Nov 30, 2016

సీఆర్డీఏలో పారదర్శకతకు పెద్దపీట

§  25,217 మంది రైతుల నుంచి 31,989 ఎకరాల సమీకరణ
§  ప్రధాన వెబ్ సైట్ లో పూర్తి వివరాలు
§  డ్యాష్ బోర్డులో అన్ని విభాగాల వివరాలు వెల్లడి
§  డిజిటలైజేషన్ లో దూసుకుపోతున్న ఏపీ

            డిజిటలైజేషన్ లో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఏపీ ప్రభుత్వం ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖలలో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినట్లు,  అక్రమార్జనకు కళ్లెంపడి అవినీతి తగ్గినట్లు నీతిఅయోగ్ ప్రశంసించింది.   రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి కూడా సీఎం డ్యాష్ బోర్డు మాదిరి డ్యాష్ బోర్డుని ఏర్పాటు చేశారు.  ఈ డ్యాస్ బోర్డులో సీఆర్డీఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరిచారు. ఏపీ ఇ-ప్రొక్యూర్ మెంట్, నా ఇటుక – నా అమరావతి వంటి లింకులను కూడా ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు.   8,603 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధిలో 217 చదరపు కిలోమీటర్లలో నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలి, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంత సేకరించారు, ఎంత మంది రైతులు భూములు ఇచ్చారు, ఎంతమంది భూమిలేని పేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మాస్టర్ ప్లాన్, టెండర్లు, ఆమోదించిన, ఆమోదించని ప్లాన్లు తదితర  వివరాలన్నింటిని ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు.

12 అంశాలతో డ్యాష్ బోర్డు
           ప్రధాన వెబ్ సైట్ కు అనుబంధంగా ఇప్పుడు 12 అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్(ఎల్పీఎస్), ఒకేసారి రైతుల రుణ మాఫీ, భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, బిల్డిండ్ పెనలైజేషన్ స్కీమ్(బీపీఎస్), అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్-నరేగా), అమరావతి, అమరావతిలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ), బయోమెట్రిక్ హాజరు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, పరిసరాల పచ్చదనం, అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి ఈ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో మూడు అంశాలు (ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, బయోమెట్రిక్ హాజరు) తప్ప మిగిలిన వివరాలన్నింటినీ అప్ డేట్ చేశారు. నరేగాకు సంబంధించి మెయిన్ వెబ్ సైట్ లింగ్ ఇచ్చారు.

25,217 మంది రైతుల నుంచి 31,989 ఎకరాల సమీకరణ
      డ్యాష్ బోర్డులో తెలిపిన ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 27,625 మంది రైతుల నుంచి 34,095.8322 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,217 మంది రైతుల నుంచి 31,989.5913 ఎకరాలు సమీకరించింది. ఇంకా 2115 మంది రైతుల నుంచి 1175.8978 ఎకరాలు సమీకరించవలసి ఉంది. ఏ గ్రామంలో ఎంత భూమి సమీకరించారో, ఎంత సమీకరించాలో, పట్టా భూమి, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ భూమి... తదితర వివరాలు కూడా ఇక్కడ అప్ డేట్ చేశారు.
రూ.88.67 కోట్ల రుణాలు రద్దు: రైతుల రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. మొత్తం 27 గ్రామాలలోని 20,355 మంది రైతులకు చెందిన రూ.88.67 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. గ్రామాల వారీగా వివరాలను కూడా ఇక్కడ ఉంచారు.
వార్షిక చెల్లింపులు రూ.136 కోట్లు: స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కాకుండా భూ సారం ఆధారంగా ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పది సంవత్సరాలపాటు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రకారం వార్షిక చెల్లింపులలో భాగంగా 31,987.84 ఎకరాలకు 26,776 మంది రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.136.71 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, యూనిట్ల వారీగా పూర్తి వివరాలు ఇందులో ఉంచారు.
బీపీఎస్ కింద 6429 దరకాస్తులు: బిల్డింగ్ పెనలైజేషన్ పథకం కింద సీఆర్డీఏకు ఇప్పటి వరకు 6429 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 1813 ప్రొసీడింగ్ లెటర్ దశలో ఉన్నాయి. 4491 పరిశీలనలో ఉన్నాయి. 125 దరకాస్తులను తిరస్కరించారు. వ్యక్తిగతంగా దరకాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి బీపీఎస్ సైట్ లింక్ కూడా అక్కడే ఇచ్చారు.
ఏఎస్ డీఐ: అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్ ద్వారా 483 మందికి శిక్షణ ఇప్పించారు. వారిలో 386 మందికి ఉపాధి కల్పించారు. 225 మందికి నేరుగా ఉపాధి కల్పించారు. గ్రామాల వారీగా ఎంతెంతమందికి ఉపాధి కల్పించారో పూర్తి వివరాలు పొందుపరిచారు.
ఏఎల్ పీపీ కింద 22,021 మందికి పెన్షన్: అమరావతి గ్రామాలలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ) పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.2,500 ఇస్తున్నారు.  ఇప్పటివరకు 22,021 కుటుంబాలకు రూ.104.60 కోట్లు విడుదల చేశారు. గ్రామాల వారీగా పూర్తి వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపరిచారు.
పరిసరాల పచ్చదనం, సుందరీకరణ:  సీఆర్డీఏ ప్రాంతంలో, రాజధాని పరిధిలో పరిసరాల పచ్చదనం, సుందరీకరణ పనుల వివరాలను ఇక్కడ పొందుపరిచారు. గన్నవరం- తాడిగడప క్రాస్ రోడ్డులో రూ.95 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు. గన్నవరం-నిడమానూరు రోడ్డుకు ఇరువైపుల సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిడమానూరు-రామవర్పాడు రింగ్ రోడ్డు వరకు రూ.68 లక్షలతో పనులు చేపట్టారు. భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు పూల మొక్కలు, పచ్చికబయళ్లు ఏర్పాటు కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అమరావతి పరిధిలో వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు చేసి పచ్చదనం నింపుతున్నారు. కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నారు.   రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా చేశారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపారు. అన్ని ప్రాంతాల ఫొటోలతోసహా ఆ వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచారు.
అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్: అమరావతిలో పెట్టిన ఎన్టీఆర్ క్యాంటిన్ ద్వారా 85,399 మందికి లంచ్, బ్రేక్ ఫాస్ట్  అందించారు. జూన్ 25 నుంచి ఏ నెలలో ఎంత మందికి ఆహారం అందజేశారో వివరాలు తెలిపారు. ఇడ్లీ, పొంగల్, పెరుగన్నం, సాంబారన్నం వంటివి ఎంత పరిమాణంలో అందజేశారో కూడా వివరాలు పొందుపరిచారు.

ఈ విధంగా సీఆర్డీఏలో జరిగే ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలను దాపరికంలేకుండా  ఈ డ్యాష్ బోర్డులో పొందుపరిచారు. నూతన రాజధాని నిర్మాణంలో అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర  వివరాలు అందరూ తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా పారదర్శకతలో దేశంలో ఏపీ అగ్రభాగాన నిలిచింది.
  
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

 apspecialnews@gmail.com

Nov 29, 2016

300 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి


ü
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక
ü మూడు పారిశ్రామిక కారిడార్లు
ü ఏడు పారిశ్రామిక నోడ్ లు
ü ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 16 భారీ ప్రాజెక్టులు
ü రెండు జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండళ్లు
ü 20 ప్రత్యేక ఆర్థిక మండళ్లు
ü చిత్తూరు, విశాఖలలో ఐటీ పెట్టుబడి రీజియన్లు
ü స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ 
             ప్రణాళికాబద్దమైన, స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందు కోసం పఠిష్టమైన ప్రణాళికలు రూపొందించింది. పారిశ్రామికాభివృద్ధికి క్లస్టర్ ప్రాతిపదికన ముందుకు వెళుతోంది.  పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్దతిలో బహుళ రంగాలకు సంబంధించి ప్రత్యేకమైన పార్కులు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. ఇందులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త పార్కుల ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక పెట్టుబడుల రీజియన్లు, ప్రత్యేక పెట్టుబడి జోన్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేశారు.
 మూడు పారిశ్రామిక కారిడార్లు
            చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ), విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ), కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఈ మూడు కారిడార్లకు అనుబంధంగా ఏడు పారిశ్రామిక నోడ్ లను ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి-ఏర్పేడు, కృష్ణా జిల్లా గన్నవరం-కంకిపాడు, కాకినాడ, విశాఖపట్నంలలో పారిశ్రామిక నోడ్ లను ఏర్పాటు చేస్తారు.  నోడ్ ల అభివృద్ధికి  ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజన్సీ(జేఐసీఏ) వంటివి ఆర్థిక సహాయం అందిస్తాయి. అంతేకాకుండా ఈ మూడు కారిడార్ల అనుసంధాన కేంద్రంగా ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారిడార్లు రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడతాయి. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పోటీ వాతావరణం ఉంటుంది. పెట్టబడులు, మౌలికసదుపాయాలతోపాటు స్థానిక వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడతాయి.  విశాఖపట్నం, నక్కపల్లి, కాకినాడ ప్రాంతాలను  పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్ వెస్ట్ మెంట్ రీజియన్స్ (పీసీపీఐఆర్)గా అభివృద్ధి చేస్తారు.


16 భారీ ప్రాజెక్టులు
            పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ 16 భారీ ప్రాజెక్టులు చేపట్టింది. విశాఖ జిల్లా గుర్రంపాలెంలో ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్‌(ఈఎంసీ), కాపులుప్పాడలో సమీకృత ఐటీ టౌన్‌షిప్‌, నక్కపల్లి,  విశాఖలలో సమీకృత పారిశ్రామిక తయారీ క్లస్టర్లు,  కృష్ణా జిల్లా నూజివీడులో మెగాఫుడ్‌ పార్కు, నందిగామలో పారిశ్రామిక పార్కు, ప్రకాశం జిల్లా దొనకొండలో పీపీపీ పద్ధతిలో ప్రాంతీయ అభివృద్ధి కేంద్రం, కర్నూలు జిల్లాలో అల్ట్రామెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు, ఓర్వకల్లు మెగా పారిశ్రామిక హబ్, అనంతపురం జిల్లా పాలసముద్రం క్లస్టర్, నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదర్శ పారిశ్రామిక పార్కు, చిత్తూరు జిల్లాలో సెరామిక్ క్లస్టర్, తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చురింగ్ క్లస్టర్ లు వివిద దశలలో ఉన్నాయి.

రెండు జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండళ్లు
            ప్రకాశం జిల్లా పామూరు సమీపంలో, చిత్తూరు జిల్లాలో కేంద్రం జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండలి(ఎన్ఐఎంజడ్- నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చురింగ్ జోన్)లను ఏర్పాటు చేస్తుంది. ఈ జోన్లను అయిదు వేల ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధితోపాటు ఉపాధి కల్పనకు  ఈ మండళ్లు దోహదపడతాయి.
 చిత్తూరు, విశాఖలలో ఐటీ పెట్టుబడి రీజియన్లు
      విశాఖ, చిత్తూరులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడి రీజియన్లను ఏర్పాటు చేస్తారు. ఈ రీజియన్లలో నివాస ప్రాంతాలతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ ఉత్పత్తులు, ప్రజోపకరణాలు, మౌలిక సదుపాయాలు, పరిపాలనా సేవలు అందుబాటులో ఉంటాయి. పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సమీకృత టౌన్ షిప్ ల వంటివి కూడా ఉంటాయి. 

స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్
ప్రభుత్వం వివిధ జిల్లాలలో స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్(ఎస్ఐటీ)ను  ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ పట్టణాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ పట్టణాల నుంచి సమీపంలోని జాతీయ రహదారులను కలిపే విధంగా నాలుగు లైన్ల రోడ్లు నిర్మిస్తారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. సమీపంలోని రైల్వే స్టేషన్లకు, పోర్టులకు అనుసందానంగా రోడ్లు వేస్తారు. ఫైబర్ లైన్లను కూడా అందుబాటులోకి తెస్తారు.
 20 ప్రత్యేక ఆర్థిక మండళ్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 16 ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఇజెడ్-సెజ్) ఉన్నాయి. మరో నాలుగిటిని ఏర్పాటు చేస్తారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ మండళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెజ్ నిబంధనల ప్రకారం అనేక రాయితీలు కల్పిస్తూ, త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే పెట్టుబడుల రాకతోపాటు రాష్ట్రం ఒక మెగా పారిశ్రామిక హబ్ గా ఏర్పాడుతుంది. ఇక్కడ యువతకు ఉపాధికి ఢోకా ఉండదు. దేశంలో అత్యున్నత రాష్ట్రంగా ఎదగటానికి అవకాశం ఏర్పడుతుంది.
  
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com



Nov 23, 2016

అమరావతిలో సుందరీకరణ మొదలు


·       వెలగపూడితోనే ప్రారంభం
·       కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు
·       వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు
·       శంకుస్థాపన ప్రదేశానికి ఉద్యానవన శోభ
     
       నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ(బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం(ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్) నిర్మించారు. రాజధాని నిర్మాణం తొలిదశ పనులు త్వరితగతిన జరిగే ఏర్పాట్లు చేశారు.  పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు కూడా వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజీసీ, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లదకరంగా ఉండేవిధంగా అనువైన  వాతావరణం కల్పించడానికి  పచ్చదనం పరుస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాకులతోపాటు పరిసరాలలో 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. బ్లాకులవారీగా పచ్చదనం నింపుతున్నారు.  ఇప్పటికే రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది.
కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు
     పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం, కోల్ కత్తా, బెంగళూరుల నుంచి  పలు రకాల మొక్కలు తెస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు నాటి కనువిందు చేయనున్నారు. 32,469 చదరపు మీటర్లలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 42వేల మోండో గడ్డి మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేశారు. ఒక కిలో మీటర్ వాకింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. మరో 1342 మొక్కలతో నేలంతటినీ పచ్చదనంతో నింపారు. వందల రకాల పూల మొక్కలతోపాటు గడ్డి మొక్కలను కూడా తీసుకువస్తున్నారు.  ఇక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన పార్కులలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్కల పెంపకానికి కావలసిన మట్టిని తీసుకువచ్చి, చదును చేసి సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బ్లాక్‌ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తారు. ఈ పార్క్‌ ని రకరకాల పూల మొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని 360 రోజులూ పూస్తూనే ఉంటాయి.  పౌంటేన్లు ఏర్పాటు చేస్తారు.  పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తారు.  శాసనసభ  భవనం ముందు కూడా పార్కు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయి. 

పచ్చదనంతో నిండిన తుళ్లూరు చెరువు పరిసరాలు
        
  తుళ్లూరులో చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపేస్తున్నారు. ఇక్కడ 80 లక్షల రూపాయల అంచనాలతో పనులు చేపట్టారు. వివిధ రకాల 107 మొక్కలు నాటారు. 8,421 పూలు పూసే గుబురు మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. 646 కొబ్బరి చెట్లు నాటారు.  2,200 చదరపు మీటర్ల స్థలంలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి  వివిధ రూపాలలో కత్తిరించిన (టాపియరీ) 98 మొక్కలను ఏర్పాటు చేస్తారు.


                                 వెలగపూడి  వద్ద తాత్కాలిక సచివాలయం
                             శంకుస్థాపన ప్రదేశానికి ఉద్యానవన శోభ
           
 నూతన రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా రూపొందిస్తున్నారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపుతున్నారు. మరో 260 చదరపు మీటర్ల ప్రాంతంలో మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించి హద్దుగోడలు ఏర్పాటు చేస్తారు. అలాగే 50 చదరపు మీటర్ల నేలని పచ్చదనంతో నింపుతారు. వివిధ రకాల 12 మొక్కలను కూడా నాటారు.


జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం


v 12,354 చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపనకు అనుమతి
v భారీ స్థాయిలో ఫార్మా కంపెనీల రాక
v పవర్ సెక్టార్, సిమెంట్ పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు
v హెచ్ పీసీఎల్, ఓఎన్ జీసీ, కోల్గేట్ పామోలివ్,  ఏషియన్ పెయిట్స్ ప్రాజెక్టులు
v విద్యుత్, టెక్స్ టైల్స్, ఫుడ్, ఆగ్రో ప్రాజెక్టుల స్థాపనకు ఏర్పాట్లు

             రాష్ట్రంలో ఒక ఉద్యమంలా పరిశ్రమల స్థాపనకు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇది అది అని లేదు అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు దరకాస్తులు వెల్లువెత్తాయి. ఫార్మాస్యూటికల్స్, హోటల్, పెయింట్స్, ఆగ్రో అండ్ ప్రాసెసింగ్, సిమెంట్, విద్యుత్, వస్త్రాలు-దుస్తులు, ఫెర్టిలైజర్స్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్, బెవరేజెస్, గ్రానైట్, సిరామిక్, ఎలక్ట్రికల్, ఐటీ, ఆటోమొబైల్,  పెట్రోకెమికల్స్, ఇంధనం, మినరల్ ఆధారిత పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఇంజనీరింగ్, గ్లాస్, బొగ్గు, పర్యాటక, పేపర్, ప్లాస్టిక్, మెరైన్ తదితర రంగాలలో ప్రాజెక్టుల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.  ప్రభుత్వ రంగంలో కూడా భారీ పరిశ్రమలు స్థాపించనున్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించింది. అందులో భాగంగా భూ కేటాయింపులు, పన్నుల రాయితీలు కల్పిస్తోంది.  అనుకూలమైన, సులభతరమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తుండటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే అక్కడ తయారైయ్యే ఉత్పత్తి, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా 20 నుంచి 30 రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. కొన్ని శాఖలలో మూడునాలుగు రకాల అనుమతులు కూడా పొందవలసి ఉంటుంది.  వివిధ శాఖలలో ఈ అనుమతులు అన్ని పొందడానికి గతంలో అయితే సుదీర్ఘ కాలం పట్టేది. ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సింగిల్ డెస్క్ విధానం ప్రవేశపెట్టింది. కార్యాలయాల చుట్టూ తిరగవసిన అవసరంలేదు. ఈ విధానం ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతి ఇస్తున్నారు.  ఈ డెస్క్ ప్రారంభమైన 2015 ఏప్రిల్ 29 నుంచి  ఇప్పటి (నవంబర్ 21) వరకు చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటు కొరకు 13,347 దరకాస్తులు రాగా, 12,354 కి అనుమతులు మంజూరు చేశారు. మరో 225 దరకాస్తులు సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పరిధిలో పెండింగ్ లో ఉన్నాయి. గత మూడు నెలల కాలంలో వచ్చిన దరకాస్తులను పరిశీలిస్తే సెప్టెబర్ లో 884 దరకాస్తులు రాగా, 840కి అనుమతులు మంజూరు చేశారు. అక్టోబర్ లో 783 రాగా, 729ని అనుమతించారు. ఈ నెలలో 21వ తేదీ వరకు 574 రాగా, 349కి అనుమతులు మంజూరు చేశారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి.

భారీ స్థాయిలో ఫార్మా కంపెనీల రాక
       వివిధ రంగాలను పరిశీలిస్తే ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను స్థాపించడానికి ఎక్కువగా ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలతోపాటు కొత్త కంపెనీలు కూడా తమ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పనున్నాయి.  గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,  డాక్టర్ రెడ్డి ల్యాబరేటరీస్, దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్,  హెటీరో డ్రగ్స్ లిమిటెడ్, హోనార్ ల్యాబ్, ఇనోజెంట్ లేబరేటరీ, లారస్ ల్యాబ్స్, లీ ఫార్మా, లుపిన్ లిమిటెడ్, మైలాన్ లేబరేటరీస్, ఫాలన్ ఎక్స్ లాబ్, రాక్స్ ఫార్మా, శ్రీనీ ఫార్మాస్యూటికల్స్, వసుధా ఫార్మా, విజయశ్రీ ఫార్మా,  డార్విన్ ఫార్మా, ఇసాయ్ ఫార్మాస్యూటికల్స్, ఎమ్మెన్నార్ ఫార్మా, ఎసెంటియా అడ్వాన్స్ డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, గిల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్, అక్తినోస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, గొంగిటి రవీంద్రా రెడ్డి, గ్రాన్యూవల్ ఓమ్మికెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ లేబరేటరీస్, హర్ష ఇంగ్రెడియంట్స్, హత్రి ఫార్మా వంటి సంస్థలు తమ యూనిట్లను స్థాపించనున్నాయి.
ఆ తరువాత ఫుడ్, ఆగ్రో, టెక్స్ టైల్స్ పరిశ్రమల స్థాపనకు ఎక్కువగా అనుమతులు పొందారు.  పవర్ సెక్టార్, సిమెంట్ పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు స్థాపించనున్నాయి. సోలార్ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా పలువురు ముందుకు వచ్చారు.  ఆల్ట్రాటెక్, సెట్టినాడు, రామ్ కో  వంటి సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పనున్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్ మెంట్ కంపెనీ, ఆంధ్ర ప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పోరేషన్ లు  రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.
      హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్), ఆయిల్ నేచుల్ గ్యాస్ కార్పోరేషన్(ఓఎన్ జీసీ), కోల్గేట్ పామోలివ్,  ఏషియన్ పెయింట్స్, లూయిస్ డ్రేఫస్ కమోడిటీస్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్, ఇసుజు మోటార్స్, దయానిధి సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే అనుమతించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తే రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. యువతకు ఉపాధికి ఢోకా ఉండదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.

జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com


Nov 21, 2016

అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ప్రధాన్యత


Ø రూ.41,235 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
Ø 30 శాతం భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
Ø టార్గెట్‌ 2018’  నినాదంతో పనులు వేగవంతం
Ø గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణం మొదలు
Ø 7 ప్రధాన రోడ్లు, 6 పాఠశాల నిర్మాణానికి టెండర్ల ప్రకటన
        మౌలిక వసతుల కల్పనతో నూతన రాజధాని అమరావతి దశ మారిపోనుంది. ఏ సంస్థలైనా ఇక్కడకు వచ్చి కార్యకలాపాలు మొదలుపెట్టాలంటే ముందుగా  మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో లేఅవుట్లు సిద్ధం చేసి, రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, విద్య, వైద్యం, నివాస, తాగునీరు, ఆతిధ్యం, రవాణా, విద్యుత్, టెలీఫోన్ వంటి సౌకర్యాలను సమకూరిస్తేనే ఏ సంస్థైనా నిర్మాణం మొదలు పెడుతుంది. అందువల్ల ఈ విషయంపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ బాధ్యతలు చూస్తున్న సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ఈ పనులను ముమ్మరం చేసింది. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 217 చదరపు కిలోమీటర్ల రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో బ్లూ –గ్రీన్ సిటీగా అభివృద్ధిపరిచేవిధంగా మౌలిక వసతుల కల్పనకు రూ.41,235 కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని అంచనా వేశారు. అయితే వచ్చే నాలుగేళ్లలోనే అత్యధికంగా రూ.32,500  కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.  ఇందులో 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రామాలలో మౌలిక సదుపాయాల నిమిత్తం రూ.2,537 కోట్లు ఖర్చు చేస్తారు.
టార్గెట్‌ 2018’ నినాదం
           రాజధాని మొదటి దశ నిర్మాణం వచ్చే ఏడాది మార్చిలో మొదలు పెట్టి 2018లో పూర్తి చేస్తారు. టార్గెట్‌ 2018’ నినాదంతో పనులు వేగంగా జరిపించి 5 విభాగాలలో 21 ప్రాజెక్టులు పూర్తి చేయాలని  నిర్ణయించారు.  భవన నిర్మాణాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన నిధులకు కొరతలేదు. నిధులు సమకూర్చడానికి కేంద్రంతోపాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చింది. మరో వెయ్యి కోట్లు ఇస్తుంది. హడ్కో (గృహ,పట్టణాభివృద్ధి సంస్థ) రూ.7,500 కోట్లు రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రా బ్యాంకు రూ.5 వేల కోట్లు ఇవ్వనుంది.  ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ(ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు) కలసి మొదటి దశలో రూ.4,300 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. మరో రూ.4,300 కోట్లు రెండవ దశలో ఇస్తాయి. అమరావతి అభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం ఆరు బిలియన్ డాలర్లతో అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. జపాన్, స్విట్జర్ ల్యాండ్, రష్యా వంటి అనేక దేశాలు కూడా అమరావతి అభివృద్ధికి వివిధ రకాలుగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాయి.

10 గ్రామాలలో ప్లాట్లు పంపిణీ
            ఇప్పటికే పది గ్రామాలలో లేఅవుట్లు సిద్ధం చేసి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ చేసింది. తుళ్లూరు మండలం బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పిచ్చుకులపాలెం, దొండపాడు, ఐనవోలు, కొండమరాజుపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరులలో ప్లాట్లు పంపిణీ చేశారు. ఆ ప్లాట్ల మధ్య 30, 40 అడుగుల వెడల్పు రోడ్ల నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఆయా గ్రామాలలో ప్రధాన రహదారులు 200 అడుగుల వెడల్పు వరకు నిర్మిస్తారు.  అమరావతి నగరానికి సంబంధించి ప్రధానమైన ఏడు రహదారులు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటిలో అత్యంత ప్రధానమైన  రోడ్లు 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో 316 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తారు. 134 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉంది.   ఆరు పాఠశాలల నిర్మాణానికి  టెండర్లు పిలిచారు. ఇందులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సిలబస్ తో బోధించే నాలుగు డే స్కూల్స్, రెండు బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయి. 8 వేల నుంచి 32 వేల చదరపు మీటర్లలో వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మిస్తారు.
అనుసంధాన రోడ్లు
            అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలిలను అనుసంధానం చేస్తూ రోడ్లను విస్తరిస్తారు. అవసరమైన చోట్ల కొత్త రోడ్లు నిర్మిస్తారు.  హైస్పీడ్  సర్క్యూట్ రైల్వే లైన్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంతాల మధ్య సరుకులు రవాణా, పౌరుల ప్రయాణ  వ్యవస్థను అన్ని రకాలుగా మెరుగుపరుస్తారు. అంతే కాకుండా నెలవారీ తీసుకునే  ఒకే పాస్ పైన రైలు, బస్సు వంటి వివిధ ప్రయాణ సాధనాలలో ప్రయాణించే విధంగా ‘యూనిఫైడ్ ట్రాన్స్ పోర్టేషన్ ప్లానింగ్’ ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మొత్తం రవాణా వ్యవస్థకు సంబంధించి జపాన్ కు చెందిన ఒక బృందం అధ్యయనం చేస్తోంది. ప్రాధమిక నివేదికను సిద్ధం చేశారు. వచ్చే నెలలో సమగ్ర సమాచారంతో పూర్తి నివేదిక అందజేస్తారు. ఆ తరువాత వెంటనే నిర్ణయాలు తీసుకొని అమలు చేసే అవకాశం ఉంది.
అనుమతులలో జాప్యం నివారణ
                 సీఆర్ డీఏ ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించి పత్రాలన్నీ సక్రమంగా ఉంటే లేఅవుట్లకు అక్కడికక్కడే  అనుమతులు మంజూరు చేస్తోంది. అనుమతులలో జాప్యాన్ని నివారించేందుకు సీఆర్డీఏ పరిధిలో లేఅవుట్లను ఆన్ లైన్ లోనే అనుమతించే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నాను. రాజధాని నిర్మాణం మొదటి దశ పూర్తి అయితే ఈ ప్రాంతంలో భూమి విలువ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది.  ఎకరం నాలుగు కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని అంచనా.  ఈ ప్రాంతంలో అత్యున్న స్థాయి మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటిగా సమకూరుతుండటంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com


సాగర తీరం వెంట పరిశ్రమల పంట

v నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగనున్న ఏపీ
v విసీఐసీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు
v ఏడీబీ అధ్యయనం పూర్తి, త్వరలో పనులు ప్రారంభం
v గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్
v 974 కిలో మీటర్ల సాగర తీరం
v ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర తీరంలోనూ, తీరం వెంబట భూగర్భంలోనూ అపారమైన సంపద నిక్షిప్తమై ఉంది. దానికి తోడు నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. ప్రభుత్వం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతోపాటు ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)ని పరిపాలనలో చొప్పించి ఇ-ప్రగతిని సాధిస్తోంది.  సాగర తీరంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకుంది. రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ ఎగుమతులకు ఈ పోర్టులు అనుకూలం. రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేస్తూ,  కొత్త పోర్డులు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సిబిఐసి) పరిధిలోకి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి), జపాన్ ఇంటర్నేషనల్ కార్పోరేషన్ ఏజన్సీ(జెఐసిఏ) లు కలసి సిబిఐసికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను  రూపొందించాయి.
తీరప్రాంత మొదటి కారిడార్
     దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటిది విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి). ఇది భవిష్యత్ లో తూర్పు ఆర్థిక  కారిడార్ గా కీలకం కానుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు విస్తరించి ఉంటుంది. 2500 కిలో మీటర్ల కారిడార్ ఇది. ఇందులో విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, శ్రీకాళహస్తిలను పారిశ్రామిక హబ్ లుగా తీర్చిదిద్దుతారు. ఈ కారిడార్ లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జపాన్ కు చెందిన అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీ ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వీసీఐసీకి భారీగా 4,200 కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించినట్లు కేంద్ర మంత్ర వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ కారిడార్ ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. తొలి దశలో రూ.2,100 కోట్లు, రెండో దశలో రూ.2, 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు తొలిదశ 2019 నాటికి పూర్తవుతుంది.  రెండవ దశ 2022 నాటికి పూర్తి అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 840 మిలియన్ డాలర్లు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంటుంది. 
         వీసీఐసీ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తొలిదశలో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.  దీంతో దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ-చెన్నై తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుందని చెప్పారు. మెరైన్ ఉత్పత్తుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విసిఐసి ప్రాజెక్టు అనుకున్న సమయానికి సమర్థవంతంగా పూర్తి కావాలంటే ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం. అందుకోసం ప్రభుత్వం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
       పారిశ్రామిక అవసరాలకు కావలసిన భూములు సమకూర్చే బాధ్యత ఏపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) చూసుకుంటుంది. భూసేకరణ, పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాల కేటాయింపు, వాటికి అనుకూల పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వ్వవహారాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం  కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలో నౌకానిర్మాణం, రేవులు, తయారీరంగం, మౌలిక సదుపాయాలు వంటి ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని ఇటీవల ఇక్కడికి వచ్చిన రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ చెప్పారు. పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు గల రాష్ట్రంగా ఏపీని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, రష్యా మధ్య సరికొత్త వాణిజ్య, పారిశ్రామిక, ఆర్థిక బంధాలు బలపడే అవకాశం ఉంది. విశాఖలో వరల్డ్ క్లాస్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రష్యాకు చెందిన టెక్నో నికోల్‌, ఇండియాకు చెందిన సన్‌ గ్రూపు ప్రతినిధులతో రెండవ అవగాహన ఒప్పందాలు కూడా చేసుకుంది.  
తీరంలో గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్
ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో విస్తరించి ఉన్న సముద్రతీర ప్రాంతాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ గా రూపొందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. తీరం వెంట ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాన్ని ప్రభుత్వం గుర్తించింది. మౌలిక వసతులలో భాగంగా తీరం వెంట రోడ్డును కూడా నిర్మిస్తారు. ఇప్పటికే విశాఖ - భీమిలి బీచ్ రోడ్డును నిర్మిస్తున్నారు. దానికి కొనసాగింపుగా భీమిలి-భోగాపురం మధ్య బీచ్ రోడ్డుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానంగా నిలుస్తాయి.  ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. అందువల్లనే ఏపిని తూర్పు తీర ముఖద్వారంగా అభివర్ణిస్తారు.
               తీరప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి దేశవిదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పెట్టుబడులు పెట్టేందుకు ఇపుడు అన్ని దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే వెంటనే అనుమతులిస్తామని  సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పరిశ్రమలకు కల్పించే రాయితీల వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దేశంలో రెండంకెల ఆర్థిక వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సాగరతీరం అభివృద్ధి చెందితే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది.
జారీ చేసినవారు: రిచర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

Nov 17, 2016

ఏపీలో పోర్టుల అభివృద్ధికి విస్తృత అవకాశాలు

Ø ఏడాదికి 550 మెట్రిక్ టన్నుల రవాణా లక్ష్యం
Ø నౌకల రాకపోకల సమయం 1.2 రోజులకు తగ్గించడం
Ø ఏకీకృత సరుకు రవాణా నిల్వ కేంద్రాల ఏర్పాటు
Ø జలమార్గాలతో  రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం
Ø జపాన్ తరహాలో పోర్టుల అభివృద్ధి
Ø ఏపీ విజన్ 2029 

             ఏపీలో పోర్టుల అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల  సుదీర్ఘ సముద్రతీరం ఉంది. ఇప్పటికే ఉన్న పోర్టులతోపాటు ప్రతిపాదిత పోర్టులను జపాన్ తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులను  మెగా పోర్టులుగా అభివృద్ధి పరుస్తారు.  విశాఖపట్నం, భావనపాడు, నరసాపురం, రామాయపట్నం పోర్టులను  పెద్ద పోర్టులుగా తీర్చిదిద్దుతారు.  మేఘవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, వాకట్‌పల్లి, రవ్వ, నిజాంపట్నం ఓడరేవు, దుగ్గరాజపట్నంలను చిన్న పోర్టులుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. పోర్టుల ఆధారిత వృద్ధిని  ఆర్థిక వృద్ధి కారకాలలో  ఒకటిగా, అత్యధిక వృద్ధి సాధించగల రంగంగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్  2029 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగేలా విజన్-2029ని ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. లక్ష్యసాధనకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం అందరినీ కలుపుకొని అనుసంధానం చేసే ఒక పరిపాలనా వ్యవస్థ(విజన్)ను ఏర్పాటు చేసింది.
            రాష్ట్రంలోని నౌకాశ్రయాలు 2029 నాటికి ఏడాదికి 550 మెట్రిక్ టన్నుల సరుకుల రవాణా నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండేవిధంగా అభివృద్ధిపరచాలని లక్ష్యంగా నిర్థేశించింది. 2015లో 117 మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యాన్ని 2019 నాటికి 250 మెట్రిక్ టన్నులకు, 2029 నాటికి 500 టన్నులకు, 2029 నాటికి వెయ్యి టన్నులకు పెంచాలని ప్రభుత్వం భవిష్యత్ పోర్టుల లక్ష్యాలను నిర్ణయించింది. ప్రస్తుతం నౌకల రాకపోకలకు ఒక ట్రిప్పుకు పట్టే సమయం 2.48 రోజులుగా ఉంది. దానిని 2019 నాటికి రెండు రోజులకు, 2022 నాటికి 1.5 రోజులకు, 2029 నాటికి 1.2 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలను జలమార్గాలతో అనుసంధానం చేస్తున్నారు. ఓడ రేవుల నుంచి రాష్ట్రంలోని ప్రధాన  రహదారులను కలుపుతూ రోడ్లు వేయడానికి రోడ్డు గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. మరోపక్క రాష్ట్రంలోని అన్ని ఓడరేవులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. లాజిస్టిక్ పార్కులు, జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఏకీకృత సరుకు రవాణా నిల్వ కేంద్రాల(ఫ్రైట్ విలేజ్ లు)ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్‌ వాటర్‌వే -4 గా ప్రకటించారు. 10 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న ఓడలు ఈ వాటర్‌వే ద్వారా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
పోర్టుల అభివృద్ధి

             రాష్ట్రంలోని పోర్టులన్నిటినీ అన్ని రకాలుగా అభివృద్ధిపరచడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కృష్ణపట్నం, విశాఖ పోర్ట్ లు అంతర్జాతీయ ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి. దుగరాజపట్నం పోర్టును త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారు. ఉత్తర భారతదేశానికి కార్గో కంటెయినర్లను పంపించేదుకు అనువుగా  రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పోర్టులను మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రైవేటు రంగం ద్వారా పోర్టుల అభివృద్ధి చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాలను అభివృద్ధిపరుస్తారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో నౌకా నిర్మాణ కేంద్రం ప్రతిపాదనలో ఉంది. అంతే కాకుండా విశాఖపట్నం జిల్లా రాంబిల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మిస్తానని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు.

పోర్టుల ఆధారిత అభివృద్ధిపై  దృష్టి
            కోస్తా తీరాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ గా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో విస్తరించి ఉన్న సముద్రతీర ప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి  ప్రణాళికులు సిద్ధం చేసింది.  తీర ప్రాంతాన్ని వినియోగించుకొని పోర్టుల ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నౌకాశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా తీర ప్రాంత ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని  నౌకాశ్రయాలు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానంగా నిలుస్తూ, ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాకినాడ-పుదుచ్చేరి, కాకినాడ- భద్రాచలం అంతర్గత జల రవాణా మార్గాలను దగ్గరలో ఉన్న పోర్టులతో అనుసంధానం చేయనున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెరైన్ బోర్డును కూడా నెలకొల్పాలన్న ఆలోచనలో  ప్రభుత్వం  ఉంది.  ఈ బోర్డు ఏర్పాటైతే సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, హార్బర్సలో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంటుంది. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జలమార్గాలకు చెందిన ప్రాజెక్టులు చేపడుతోంది. సాగరమాల పథకంలో రాష్ట్రం ప్రధాన భాగస్వామి కానుంది. ఆసియా దేశాలలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా అంర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. కేంద్ర జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల కాకినాడ-పుదుచ్ఛేరి జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)తో ఈ రకమైన ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఏపి నిలిచింది.

అంతర్జాతీయ సంస్థల సహకారం
         ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీపర్యటనలలో పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి తమ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న సంస్థల సహకారం పొందడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి యోసుకే తకాగి సీఎంకు హామీ ఇచ్చారు.   మెరైన్ రంగంలో ఏపికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసేందుకు  రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌బిల్లింగ్‌ కార్పొరేషన్‌  అధ్యక్షుడు అలెక్సీ ఎల్‌ రఖ్మనోవ్‌ తన సంసిద్ధత వ్యక్తం చేశారు.  ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని, పోర్టుల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అందిస్తామని జపాన్ కు చెందిన యొకోహమా పోర్టు ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల అభివృద్ధికి తాము సహకరిస్తామని హిటాచి గ్రూప్ జీఎం అకిరా షిముజు కూడా సీఎంకు హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెడతామని, అయితే రాయితీలు కల్పించాలని ఆయన కోరారు.  ఏపీలో జపనీస్ డెస్క్ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ఆయనకు చెప్పారు. సనరైజ్‌ స్టేట్‌ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని హెంబర్‌ పోర్టు అధికారులు కూడా  ఆసక్తి కనబరిచారు.  
రాష్ట్రంలో నౌకానిర్మాణ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ చెప్పారు. ఏపీ ఇడీబీ, జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం కూడా  జరిగింది. జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ రష్యా, తూర్పు యూరప్‌లో అతిపెద్ద నౌకా  నిర్మాణ సంస్థగా పేరొందింది. ఈ సంస్థ సబ్ మెరైన్లు, ఉపరితల నౌకలు, సైనిక అవసరాల కోసం ప్రత్యేక జల వాహనాలు, సముద్ర గర్భంలో మంచుగడ్డలు కరిగించే యంత్రాలు, ఆఫ్‌షోర్ సొల్యూషన్స్, ట్రాన్స్‌పోర్టు వెస్సల్స్, స్పెషలైజ్డ్ వెస్సల్స్, జాలర్లకు ఉపయోగపడే వేట పడవలను తయారుచేస్తుంది. జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ సంస్థ, ఏపీ ప్రభుత్వంతో కలిసి సరకు రవాణా, ప్రయాణికుల రవాణాకు వీలయ్యే నౌకలను రూపొందిస్తుంది. వాటి నిర్వహణ  కూడా చేపడుతుంది.
 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ విధమైన చర్యల వల్ల రాష్ట్రంలో పోర్టులు త్వరితగతిన అభివృద్ధిచెందే అవకాశం ఉంది. జలరవాణాకు అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థికవృద్ధికి దోహదపడుతుంది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ కొరడా

v అనధికార అమ్మకాలపై 4,466  కేసులు - 4,457 మంది అరెస్ట్
v కల్తీ మద్యం కేసులు 13,419 - 8,540 మంది అరెస్ట్
v 14,953 లీటర్ల ఐఎంఎల్, 4,436 లీటర్ల బీరు స్వాధీనం
v 495 వాహనాలు సీజ్
v ఎక్సైజ్ ఆదాయం రూ.7,903 కోట్లు

రాష్ట్రంలో మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది.  ఎక్కడబడితే అక్కడ మద్యం అనధికారికంగా అమ్మకుండా, కల్తీ మద్యం నిరోధించేందుకు  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎక్సైజ్ శాఖవారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల దాడులు అధికం చేశారు. కేసులు నమోదు చేసి, వేల మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అనధికార మద్యం అమ్మకాలకు సంబంధించి 4,466 కేసులు నమోదు చేశారు. 4,457 మందిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ శాఖ దాడులలో 14,953 లీటర్ల ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) ను, 4,436 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014 జూన్ నుంచి 16,754 కేసులు నమోదు చేసి, 16,450 మందిని అరెస్ట్ చేశారు.

కల్తీ మద్యం కేసులు 13,419
          రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టి, పేదల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం పఠిష్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ వారు నిర్వహించిన దాడులలో ఈ ఏడాది 13,419 కేసులు నమోదు చేశారు. కల్తీ మద్యం తయారీతో సంబంధం ఉన్న  8,540 మందిని అరెస్ట్ చేశారు. దాడులలో అక్రమంగా తయారు చేసిన 79,158 లీటర్ల కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. 495 వాహనాలను సీజ్ చేశారు.

ఎక్సైజ్ ఆదాయం రూ.7,903 కోట్లు

ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్సైజ్ ఆదాయం మొత్తం రూ. 7,903.45 కోట్లు లభిచింది. ఇందులో ఎక్సైజ్ రెవెన్యూ  రూ.2,764.82 కోట్లు కాగా, వ్యాట్(ఎక్సైజ్) రెవెన్యూ రూ.5,138.63 కోట్లు. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ వరకు రూ. 8,480.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఐఎంఎల్ కేసులు 204.99 లక్షలు, బీరు కేసులు 115.07 లక్షలు అమ్ముడుపోయాయి.

22 ఎక్సైజ్ డిపోలు
         రాష్ట్రంలో మొత్తం 22 ఎక్సైజ్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల ద్వారానే అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలలో మూడేసి డిపోలు ఉన్నాయి.చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలలో రెండేసి డిపోలు ఉన్నాయి. మిగిలిన అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్కో డిపో మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఈ డిపోల ద్వారానే మద్యం సరఫరా అవుతుంటుంది.


జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...