Nov 17, 2016

రాష్ట్రాభివృద్ధికి శాస్త్రీయపద్దతిలో భారీ ప్రణాళిక

ü ప్రతి నియోజకవర్గానికి  సామాజిక, ఆర్థిక సూచికలు
ü 32 విభాగాలలో 487 అంశాల వివరాల సేకరణ
ü జిల్లా, మండల స్థాయిలో స్థూల ఉత్పత్తి విలువలు

           రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం శాస్త్రీయపద్దతిలో భారీ ప్రణాళిక రూపొందించింది.
లక్ష్యాల సాధనకు ఒక పక్క మిషన్స్, గ్రిడ్స్ ప్రాతిపదికగా వృద్ధి వ్యూహ రచన చేసింది. మరో పక్క జిల్లా, మండల స్థాయిలో స్థూల ఉత్పత్తి విలువల గణాంకాలను సేకరిస్తోంది. ఇంకోపక్క ప్రతి నియోజకవర్గానికి సామాజిక, ఆర్థిక సూచికలు తయారు చేస్తోంది. 2022 నాటికి సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2029 నాటికి అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా నిలపాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇందుకోసమే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశానికి సంబంధించి శాస్త్రీయ పద్దతిలో  సమగ్ర సమాచారం సేకరిస్తోంది. 22 విభాగాలకు సంబంధించి 147 అంశాల వివరాలతో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్లానింగ్ శాఖ వారు గత నెలలో 175 నియోజకవర్గాల పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి 2014-15, 2015-16, 2016-17కు సంబంధించి సెప్టెంబర్ వరకు వివరాలు చేర్చారు.

32 విభాగాలలో 487 అంశాల వివరాల సేకరణ
           ప్రభుత్వం ఈ సారి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 32 విభాగాలలో 487 అంశాల వివరాలను సేకరిస్తోంది. పరిపాలన, జనాభా, ఆర్థిక, వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్, పశుసంరక్షణ, మత్స్య శాఖ, పరిశ్రమలు, విద్యుత్ శక్తి, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, గృహనిర్మాణం, విద్య, ఉన్నత విద్య, వయోజన విద్య, స్కాలర్ షిప్స్, వైద్య ఆరోగ్యం, సంక్షేమం, గ్రామీణ పట్టణాభివృద్ధి, రోడ్లు భవనాలు, రెవెన్యూ, ప్రభుత్వ సహాయం, శాంతిభద్రతలు, సమాచార సాంకేతిక, పర్యాటకం, ద్రవ్యోల్బణం, వాతావరణ, బడ్జెట్, ఇతర సామాజిక, ఆర్థిక సూచికలు విభాగాలలో మొత్తం 487 అంశాల వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో మౌలిక సదుపాయలు, జనాభా, అన్ని రకాల ఉత్పత్తులు, వనరులు, ఆదాయం, తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు, ఏ పంట ఉత్పత్తి ఎంత,  వర్షాలు, ఎరువులు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు,  నీటి సౌకర్యం, నీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, రోడ్లు, రవాణా సౌకర్యం, పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, గనులు,  విద్యుత్ సబ్ స్టేషన్లు, బ్యాంకులు, రుణాలు, రోడ్లు, పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్కిల్ డెవలప్ మెంట్, అన్ని ప్రభుత్వ పథకాల అమలు, అబ్దిదారులు... ఇలా ప్రతి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వీటన్నిటితోపాటు కరువు,  పేదరికం, మానవాభివృద్ధి, సంతోషం వంటి సూచికలను కూడా రూపొందిస్తారు. ప్రతి నియోజకవర్గ సామాజిక, ఆర్థిక, భౌగోళిక స్వరూపంతోపాటు మ్యాపులు, అన్ని అంశాల సమగ్ర వివరాలతో పుస్తకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది.

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు
           ఆయా నియోజకవర్గాల వాస్తవ సమాచారం ఆధారంగా అక్కడి సమాజిక, ఆర్థిక పరిస్థితులను, వెనుకబాటుతనాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సూచికల ఆదారంగా ఏఏ ప్రాంతాలు, ఏఏ రంగాలలో ఎంత స్థాయిలో వెనుకబడ్డాయో స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతి నియోజకవర్గంలో వెనుకబడి రంగాలను గుర్తిస్తారు. ఆ ప్రాంతాలు ఆయా రంగాలలో అభివృద్ధి సాధించడానికి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తుంది.  ప్రత్యేక ప్రణాళికల  ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టిపెడుతుంది. అలాగే అభివృద్ధి కారకాలను గుర్తించి ఆయా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తుంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆదాయం కూడా ఆశించినమేర పెరుగుతుంది. పౌరుల జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ విధమైన  శాస్త్రీయ పద్దతుల ద్వారా దూరదృష్టితో ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను, నిర్ణీత వ్యవధిలో సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం సంకల్పించినట్లు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవడానికి మార్గం ఏర్పడుతుంది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...