Nov 21, 2016

అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ప్రధాన్యత


Ø రూ.41,235 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
Ø 30 శాతం భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
Ø టార్గెట్‌ 2018’  నినాదంతో పనులు వేగవంతం
Ø గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణం మొదలు
Ø 7 ప్రధాన రోడ్లు, 6 పాఠశాల నిర్మాణానికి టెండర్ల ప్రకటన
        మౌలిక వసతుల కల్పనతో నూతన రాజధాని అమరావతి దశ మారిపోనుంది. ఏ సంస్థలైనా ఇక్కడకు వచ్చి కార్యకలాపాలు మొదలుపెట్టాలంటే ముందుగా  మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో లేఅవుట్లు సిద్ధం చేసి, రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, విద్య, వైద్యం, నివాస, తాగునీరు, ఆతిధ్యం, రవాణా, విద్యుత్, టెలీఫోన్ వంటి సౌకర్యాలను సమకూరిస్తేనే ఏ సంస్థైనా నిర్మాణం మొదలు పెడుతుంది. అందువల్ల ఈ విషయంపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ బాధ్యతలు చూస్తున్న సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ఈ పనులను ముమ్మరం చేసింది. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 217 చదరపు కిలోమీటర్ల రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో బ్లూ –గ్రీన్ సిటీగా అభివృద్ధిపరిచేవిధంగా మౌలిక వసతుల కల్పనకు రూ.41,235 కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని అంచనా వేశారు. అయితే వచ్చే నాలుగేళ్లలోనే అత్యధికంగా రూ.32,500  కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.  ఇందులో 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రామాలలో మౌలిక సదుపాయాల నిమిత్తం రూ.2,537 కోట్లు ఖర్చు చేస్తారు.
టార్గెట్‌ 2018’ నినాదం
           రాజధాని మొదటి దశ నిర్మాణం వచ్చే ఏడాది మార్చిలో మొదలు పెట్టి 2018లో పూర్తి చేస్తారు. టార్గెట్‌ 2018’ నినాదంతో పనులు వేగంగా జరిపించి 5 విభాగాలలో 21 ప్రాజెక్టులు పూర్తి చేయాలని  నిర్ణయించారు.  భవన నిర్మాణాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన నిధులకు కొరతలేదు. నిధులు సమకూర్చడానికి కేంద్రంతోపాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చింది. మరో వెయ్యి కోట్లు ఇస్తుంది. హడ్కో (గృహ,పట్టణాభివృద్ధి సంస్థ) రూ.7,500 కోట్లు రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రా బ్యాంకు రూ.5 వేల కోట్లు ఇవ్వనుంది.  ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ(ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు) కలసి మొదటి దశలో రూ.4,300 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. మరో రూ.4,300 కోట్లు రెండవ దశలో ఇస్తాయి. అమరావతి అభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం ఆరు బిలియన్ డాలర్లతో అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. జపాన్, స్విట్జర్ ల్యాండ్, రష్యా వంటి అనేక దేశాలు కూడా అమరావతి అభివృద్ధికి వివిధ రకాలుగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాయి.

10 గ్రామాలలో ప్లాట్లు పంపిణీ
            ఇప్పటికే పది గ్రామాలలో లేఅవుట్లు సిద్ధం చేసి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ చేసింది. తుళ్లూరు మండలం బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పిచ్చుకులపాలెం, దొండపాడు, ఐనవోలు, కొండమరాజుపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరులలో ప్లాట్లు పంపిణీ చేశారు. ఆ ప్లాట్ల మధ్య 30, 40 అడుగుల వెడల్పు రోడ్ల నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఆయా గ్రామాలలో ప్రధాన రహదారులు 200 అడుగుల వెడల్పు వరకు నిర్మిస్తారు.  అమరావతి నగరానికి సంబంధించి ప్రధానమైన ఏడు రహదారులు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటిలో అత్యంత ప్రధానమైన  రోడ్లు 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో 316 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తారు. 134 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉంది.   ఆరు పాఠశాలల నిర్మాణానికి  టెండర్లు పిలిచారు. ఇందులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సిలబస్ తో బోధించే నాలుగు డే స్కూల్స్, రెండు బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయి. 8 వేల నుంచి 32 వేల చదరపు మీటర్లలో వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మిస్తారు.
అనుసంధాన రోడ్లు
            అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలిలను అనుసంధానం చేస్తూ రోడ్లను విస్తరిస్తారు. అవసరమైన చోట్ల కొత్త రోడ్లు నిర్మిస్తారు.  హైస్పీడ్  సర్క్యూట్ రైల్వే లైన్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంతాల మధ్య సరుకులు రవాణా, పౌరుల ప్రయాణ  వ్యవస్థను అన్ని రకాలుగా మెరుగుపరుస్తారు. అంతే కాకుండా నెలవారీ తీసుకునే  ఒకే పాస్ పైన రైలు, బస్సు వంటి వివిధ ప్రయాణ సాధనాలలో ప్రయాణించే విధంగా ‘యూనిఫైడ్ ట్రాన్స్ పోర్టేషన్ ప్లానింగ్’ ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మొత్తం రవాణా వ్యవస్థకు సంబంధించి జపాన్ కు చెందిన ఒక బృందం అధ్యయనం చేస్తోంది. ప్రాధమిక నివేదికను సిద్ధం చేశారు. వచ్చే నెలలో సమగ్ర సమాచారంతో పూర్తి నివేదిక అందజేస్తారు. ఆ తరువాత వెంటనే నిర్ణయాలు తీసుకొని అమలు చేసే అవకాశం ఉంది.
అనుమతులలో జాప్యం నివారణ
                 సీఆర్ డీఏ ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించి పత్రాలన్నీ సక్రమంగా ఉంటే లేఅవుట్లకు అక్కడికక్కడే  అనుమతులు మంజూరు చేస్తోంది. అనుమతులలో జాప్యాన్ని నివారించేందుకు సీఆర్డీఏ పరిధిలో లేఅవుట్లను ఆన్ లైన్ లోనే అనుమతించే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నాను. రాజధాని నిర్మాణం మొదటి దశ పూర్తి అయితే ఈ ప్రాంతంలో భూమి విలువ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది.  ఎకరం నాలుగు కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని అంచనా.  ఈ ప్రాంతంలో అత్యున్న స్థాయి మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటిగా సమకూరుతుండటంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...