Oct 22, 2022

దూకుడు పెంచిన చంద్రబాబు

 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలవడంతో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఈ నెల 18వ తేదీ మంగళవారం చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఎన్నికల్లో పొత్తుకంటే ముందు రాష్ట్రంలో  నెలకొన్న పరిస్ధితులపై  ఉమ్మడిగా పోరాడేందుకు తాము కలిసినట్లు ఇద్దరూ  ప్రకటించారు.దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు కలిశారు. వీరిద్దరి కలయికతో ఇరు పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇది ఒక అపూర్వ కలయికగా వారు భావిస్తున్నారు.మీడియా కూడా వీరి కలయికకు ప్రాధాన్యం ఇచ్చింది.దీంతో వీరి పొత్తులపై చర్చలు మొదలయ్యాయి. 

పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నాదెండ్లలో, నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రత్తి పంటను చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన  పొలం గట్లపై యువకుడిలా నడిచారు.ఓ చిన్న కాలవను ఎగిరి గంతేసి మరీ దాటారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు పర్యటనలో భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.నరసరావుపేట, గురజాల బహిరంగ సభలకు జనం భారీగా తరలి వచ్చారు. ఆ జనసమూహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆవేశంతో విజయోత్సాహంతో  ప్రసంగించారు. ప్రజలను ఉత్తేజపరిచారు. 

ఇక పవన్, చంద్రబాబు ఇంత కాలం తరవాత కలవడంతో రాజకీయ పొత్తులపై చర్చించుకోవడం మొదలైంది. అయితే, పొత్తుల ప్రస్తావన రాలేదని ఇరు పార్టీల నేతలు చెప్పారు. ప్రస్తుతానికి పొత్తుల ప్రసక్తిలేకపోయినా వారు కలిసి పోరాడటానికి  సిద్ధమయ్యారు. దీనిని పొత్తుకు మొదటి అడుగుగా భావించవచ్చు.

                                                                      - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Oct 18, 2022

హిజాబ్ మత వివాదం కాదు హక్కులు,స్వేచ్ఛ సమస్య

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం  దేశమంతా వ్యాపించి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. మతాచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించిన ఈ సున్నితమైన అంశం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వాలు,వర్గాలు, మతాల మధ్య చిచ్చుకు దారితీసింది. కర్ణాటక  ఉడిపి జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీకి    కొందరు ముస్లిం విద్యార్థినులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో హిజాబ్ ధరించి రావడంతో  ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత కాలేజీలో  హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను  తరగతులకు అనుమతించలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఏకంగా కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఈ  వివాదం మరింత ముదిరింది. ఉడిపి జిల్లా నుంచి కర్ణాటకలోని ఇతర  ప్రాంతాలకు, క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. ప్రతి రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ధరించడం  తమ మత ఆచారమని ముస్లింల వాదన. వాస్తవానికి ఇది మతానికి సంబంధించిన అంశమైనప్పటికీ, వివాదం మాత్రం మతాల మధ్య కాకుండా రెండు వర్గాల మధ్యే తలెత్తింది. రెండు వర్గాల వారూ  ఆందోళనకు దిగారు. నిరసనలు, విద్యార్థుల సస్పెన్షన్, ధర్నాలు, ఆందోళనలు, పోలీస్ కేసులు, అరెస్టులు.. పెద్ద దుమారమే చెలరేగుతోంది.

హిజాబ్ ధరించడం ముస్లిం విద్యార్థినులకు  రాజ్యాంగం ప్రసాదించిన హక్కని  కొందరు   కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని, ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ  మార్చి 15న సంచలన తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.  దీనిని సుప్రీం కోర్టులోని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం  10 రోజులు విచారించింది. ఈ ధర్మాసనం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ నెల 13న  ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం  విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను  రద్దు చేస్తూ జస్టిస్ ధూలియా తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు  తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు.చివరకు ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు నివేదించారు. ఈ వివాదంపై  ప్రధాన న్యాయమూర్తి  త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం రెండు మతాల మధ్య చిచ్చుకు దారి తీసింది. ఇరు మతాల వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.తాము రెండు, మూడు పెళ్లిళ్లు  చేసుకుంటామని అంటారని,  అయితే, తాము  రెండు పెళ్లిళ్లు  చేసుకున్నా ఇద్దరు భార్యలకు గౌరవంగా చూస్తామని ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు  షౌకత్‌ అలీ  చెప్పారు. కానీ, హిందువులు ఒకరినే వివాహం చేసుకుని, మరో ముగ్గురు ఉంపుడుగత్తెలను ఉంచుకుంటారని, భార్యకు గానీ, ఉంపుడుగత్తెలకు గానీ గౌరవం ఇవ్వరని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   

 వాస్తవానికి ఇది మతం సమస్యకాదు. హక్కుల సమస్య.   ఇస్లాంలో  హిజాబ్ తప్పనిసరా? ముస్లింలు అందరూ హిజాబ్ ధరిస్తారా? అన్న ప్రశ్నలు ఇక్కడ ముఖ్యం కాదు. ఈ వివాదం పూర్తిగా మహిళల హక్కులకు సంబంధిచినదే.  ఎందుకంటే ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాలలో  మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. దానిని అక్కడ మహిళలు వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్ ను వ్యతిరేకిస్తూ  ఇరాన్‌లో  మహిళలు రోడ్డెక్కారు. దేశంలోని  అత్యధిక  నగరాల్లో  నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 35 మంది మృతి చెందారు.వందలాది సామాజిక కార్యకర్తలను, రాజకీయ ప్రత్యర్థులను  పోలీసులు అరెస్టులు చేశారు.ఇదే సమయంలో  కాలేజీల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ  భారత్‌లో కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడి ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని మహిళలు తాము హిజాబ్ ధరించం అని ఆందోళనలకు దిగినే, ఇక్కడ భారత్‌లోని విద్యార్థినులు తాము హిజాబ్ ధరిస్తామని ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ, ఇక్కడ నిరసలు, ఆందోళనలు చేసేవారు ముస్లింలే. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా, ఇరుదేశాల మహిళలు హక్కుల గురించే మాట్లాడుతున్నారు. తమ హక్కులకు, స్వేచ్ఛకు ప్రభుత్వాలు భంగం కలిగిస్తున్నాయనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

హిజాబ్‌ను ధరించడం, ధరించకపోవడం మహిళల ఇష్టాఇష్టాలకు, స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వారు వాదిస్తున్నారు. వారికి, వీరికి ఇద్దరికీ మనదేశంలోని మహిళా హక్కుల కార్యకర్తలు మద్దతు పలుకుతున్నారు. ఈ చర్యలు మహిళల హక్కులను హరించడమేనని వారు పేర్కొంటున్నారు. ఇరాన్‌లో ఇస్లాం పేరుతో మహిళలపై బలవంతంగా హిజాబ్‌ను రుద్దడం, భారత్‌లో యూనిఫామ్ పేరుతో ముస్లిం విద్యార్థినులు  హిజాబ్ ధరించకూడదని చెప్పడం  ప్రభుత్వాలు మహిళలను నియంత్రించడానికి చేసే ప్రయత్నాలలో భాగమేనని మండిపడుతున్నారు. మహిళలు ధరించే దుస్తులపై ప్రభుత్వాల నియంత్రణ ఏమిటని అడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం కోర్టువైపే ఉంది. ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఉంది. 

                                                                  - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్టు. 944022914                                                                     

\


Oct 14, 2022

హిందీ భాషపై దుమారం

దక్షిణాదిన తీవ్ర నిరసన

విద్యావేత్తల ఆందోళన

హిందీ భాషపై మళ్లీ దుమారం చెలరేగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన  అధికార భాషలపై గత నెలలో  జరిగిన   పార్లమెంట్‌  కమిటీ సమావేశంలో  మొత్తం 112 సిఫార్సులతో  కూడిన ప్రతిపాదనలను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. 1963 అధికార భాషల చట్టం ప్రకారం 1976లో ఏర్పడిన ఈ కమిటీలో 20 మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 30 మంది ఎంపీలు ఉంటారు. సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు   ఐఐటీ, ఐఐఎం,ఎయిమ్స్,  టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలన్నింటిలోనూ హిందీని తప్పనిసరి చేయాలని, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో   హిందీ మీడియం మాత్రమే ఉండాలని ఈ కమిటీ సూచించింది.  ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంగ్లీషు స్థానంలో  హిందీని తప్పనిసరి చేయాలని కూడా సిఫారసు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కోర్టు తీర్పులు... మొదలైన అన్నిటిలోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు  హిందీ భాషలోనే జరగాలని నివేదించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీషును అనుమతించాలని, ఆ ప్రాంతాల్లో కూడా క్రమంగా ఇంగ్లీషు స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించింది.  ప్రభుత్వ ఆహ్వాన పత్రికలు, ఉపన్యాసాలు అన్నీ హిందీలోనే ఉండాలని సూచించింది.  ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషకు ప్రాచుర్యం లభించినందున ఐక్యరాజ్య సమితి అధికార భాషల్లో దీనిని చేర్చాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. 

అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాలను ఈ కమిటీ మూడు భాగాలుగా విభజించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు బీహార్,మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్,  రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులను ఏ గ్రూప్‌లో చేర్చింది. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, చండీఘర్, దమన్ అండ్ డయూ, నాగర్ హవేలీలను బీ గ్రూప్‌లో, మిగిలిన వాటిని సీ గ్రూప్‌లో చేర్చింది. హిందీ మాట్లాడేవారిని ఏ గ్రూప్ లో చేర్చడం  వివాదానికి దారి తీసింది. మిగతా భాషలు మాట్లాడేవారిని ద్వితీయ పౌరులుగా చూస్తారన్న భావన కలుగుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ విభజనకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

 ఈ కమిటీ సిఫారసులు వివాదాస్పదమయ్యాయి.  హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల వారు, ముఖ్యంగా దక్షిణాదివారు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కమిటీ సిఫారసులను అమలు చేయడం అంటే అన్ని ప్రాంతీయ భాషలను ఒక్క వేటుతో తుదముట్టించడమేనని పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదనలు మాతృభాషలకు ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కర్ణాటకలోని చిత్రదుర్గలో  భారత్​ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఈ విషయమై స్పందించారు. భాష అనేది ఓ విశ్వాసం, ఓ భావన, భాషలో ఓ చరిత్ర ఉంటుందని, ప్రతి రాష్ట్రానికీ తమ ప్రాంతీయ భాషను ఉపయోగించుకునే హక్కు ఉందని తెలిపారు.  విద్యార్థులు తమకు తెలిసిన భాషలో పరీక్షలు రాయడానికి  అనుమతించాలని రాహుల్ చెప్పారు.

 
భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ప్రతీకగా నిలిచే భారత్‌లో ఏ ఒక్క భాషనైనా ఇతర భాషల కంటే ఎక్కువ చేసినా అది దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల భాషలను అధికార భాషలుగానే  కేంద్రం పరిగణించాలని, హిందీని తప్పనిసరి చేసే ప్రయత్నం చేయొద్దని డీఎంకే అధినేత,  తమిళనాడు సీఎం స్టాలిన్‌  ప్రధానిని కోరారు.  దేశంలో  హిందీ భాషను మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారన్న విషయం  గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రం తన ప్రయత్నాలను విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని స్టాలిన్ హెచ్చరించారు. మరో సారి హిందీ వ్యతిరేక ఉద్యమం రావాలని తాము  కోరుకోవడం లేదని  డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. హిందీని అభివృద్ధి చెందని రాష్ట్రాల భాషగా  డీఎంకేకు చెందిన మరో ఎంపీ ఇళంగోవన్ పేర్కొన్నారు.పశ్చిమబెంగాల్, గుజరాత్,మహారాష్ట్ర,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా లేదన్నారు. 

 హిందీ భాషను బలవంతంగా రుద్దితే దేశం ముక్కలవుతుందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎఎస్ అళగిరి  కేంద్రాన్ని హెచ్చరించారు.బీజేపీ పాలనలో హిందీని అధికార భాషగా రుద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భారత్‌కు జాతీయ భాష అంటూ ఏదీ లేదని, ఇతర అధికారిక భాషల మాదిరిగానే హిందీ కూడా ఓ అధికారిక భాష మాత్రమేనని  తెలంగాణ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హిందీని  రాష్ట్రాలపై రుద్దడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. 

రాజకీయ పార్టీల నేతలే కాకుండా విద్యావేత్తలు కూడా ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకొని ఉద్యోగాలు సంపాదించాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లీష్  తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లీష్‌లో  కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే యువత మనుగడ కష్టమని, హిందీని రుద్దడమంటే భావి పౌరుల జీవితాలతో ఆడుకోవడమేనన్న భావన వారిలో నెలకొంది. ప్రాంతీయ భాషలకు, మాతృభాషలకు ప్రాధాన్యత కలిగిన  భిన్నత్వంలో ఏకత్వం గల  మన దేశంలో ఇలాంటి నిర్ణయాల వల్ల విద్యా,ఉపాధి పరంగా ఇబ్బందులు తలెత్తడమేకాకుండా  ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


 


 


Oct 8, 2022

మదరాసీలు - తెలుగువారు

పొట్టి శ్రీరాములు  చనిపోయేటప్పటి  ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. 


ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రా న్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేశారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు. 


తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం  అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. 


ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.


గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక.... రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యం శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. ఆ త్యాగజీవి కీ.శే పొట్టి శ్రీరాములు  ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది. 


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...