Apr 30, 2018


సచివాలయ సందర్శనకు ఆధార్ తప్పనిసరి
           సచివాలయం, ఏప్రిల్ 30: సచివాలయ సందర్శకులకు ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి అని సాధారణ పరిపాలనా శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక, వ్యక్తిగత పనులపై సచివాలయానికి వచ్చేవారిని లోపలకు అనుమతించే ముందు వారి గుర్తింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కొత్త పాస్ లు ఇవ్వాలని నిర్ణయించారు.  అందువల్ల సందర్శకులు తమ వెంట ఆధార్ నెంబర్ ను తప్పనిసరిగా తీసుకువచ్చి, సంబంధింత అధికారికి తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా వారి వివరాలు కంప్యూటర్ లో నమోదు చేసి పాస్ ఇస్తారు.

Apr 28, 2018


రంగుల ప్రపంచం ముసుగు తొలిగింది
                     
  శ్రీరెడ్డి పడిలేచిన కెరటం
శ్రీరెడ్డి ఓ సంచలనం. సినిమా రంగం ముసుగు తొలిగించింది. ఇప్పటి వరకు సమాజానికి తెలియని అత్యంత దారుణమైన విషయాలను బయటపెట్టింది. పాత్రలు ఇస్తామని, ఇప్పిస్తామని సినిమా రంగంలో యువతులను, మహిళలను టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా  ఎలా వాడుకుంటున్నారో బహిర్గతం చేసింది. పెద్ద ఎత్తున లైంగిక దోపిడీ జరుగుతున్నట్లు పేర్కొంది.  ఆమె ధైర్యసాహసాలను చూసి వందల మంది యువతులు బయటకు వచ్చి తమ అనుభవాలను వెల్లడించారు. హీరోయిన్ అనిత వంటి వారు కూడా తాము ఎదుర్కొన్న వేధింపులు వివరించారు.  అప్పటి వరకు  ఇలా అట, అలా అట అని సూచాయగా తెలిసిన విషయాలను సమాజానికి తెలిసే విధంగా వాస్తవాలను శ్రీరెడ్డి బహిర్గతం చేసింది. మహిళా సంఘాలు, కొన్ని ఛానెళ్లు ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.  తీగలాగితే డొంక కదిలిందలినట్లు ఆమె టాలీవుడ్ లో చీకటి వ్యవహరాలు బయటపెడితే, ఒక్క టాలీవుడ్ ఏమిటీ కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మొత్తం సినిమా రంగం అంతా క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇంకా ఎక్కువ మాట్లాడితో ఇతర అన్ని రంగాలతోపాటు ప్రభుత్వంలో, పార్లమెంటులో కూడా ఉందని  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ  ఎంపీ రేణుకా చౌదరి వంటి  ప్రముఖ వ్యక్తులే బయట పెట్టారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపి శతృఘ్నసిన్హా వంటి వారు రేణుకా చౌదరి, సరోజ్ ఖాన్ వంటి వారి వ్యాఖ్యలను సమర్ధించారు.
              క్యాస్టింగ్ కౌచ్  ఒక్క సినిమా పరిశ్రమలోనే ఉన్నట్లు మాట్లాడతారు ఏమిటి? ఈ వ్యవహారం దేశంలో ఎక్కడ లేదు? మీడియాలో లేదా? అని సరోజ్ ఖాన్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె దీనిని సమర్ధిస్తున్నట్లు మాట్లాడారు. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ మాములేనని, దాని వల్ల కొంత మందికి ఉపాధి దొరుకుతుందని, తిండి దొరుకుతుందని చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తమ పరిశ్రమలో  ఎవరూ రేప్ లు చేసి వదిలిపెట్టరని, ఉపాధి చూపిస్తారని చెప్పారు. అయితే ఇలాంటి వ్యవహారాలకు సిద్ధపడలా? వద్దా? ఆ నటీమణుల మీద ఆధారపడి ఉంటుందని  ఆమె అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని, అందుకు చట్ట సభలు కూడా అతీతం కాదని పైర్ బ్రాండ్ గా పేరుపొందిన  రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరోజ్ ఖాన్  వ్యాఖ్యలను ఆమె సమర్ధించారు. ఇది అందరూ అంగీకరించవలసిన ఓ చేదు నిజం అని చెప్పారు. అన్ని రంగాల్లో పనిచేసే ప్రాంతాల్లో మహిళలకు వేధింపులు ఎదురవుతూనే ఉంటాయన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై దేశ వ్యాప్త ఉద్యమాలు రావాలన్నారు. హాలీవుడ్‌లో ఉన్న మీటూ ప్రచారం తరహాలో భారత్‌లో కూడా పోరాడాలని ఆమె మహిళలకు పిలుపు ఇచ్చారు. అన్ని చోట్లా ఉన్నట్లే రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.  లైంగిక ఆనందం, లైంగిక దోపిడీ అనేవి అటు వినోద రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఉన్నాయని, ఈ విషయమై సరోజ్ ఖాన్, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సబబేనని శత్రుఘ్నసిన్హా సమర్ధించారు. రాజకీయ రంగంలో దీనిని క్యాస్టింగ్ ఓట్ కౌచ్అనాలేమోనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదేనని, జీవితంలో ముందుకెళ్లేందుకు అప్పటి పరిస్థితులు డిమాండ్ చేసినట్లుగా కొన్నిసార్లు నడుచుకోకతప్పదన్న  అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
              మొదట శ్రీ రెడ్డిని  అర్ధనగ్న ప్రదర్శన చేసిందని - పరుష పదజాలం, బూతులు ప్రయోగించిదని అవకాశాల కోసం ఆమె పడుకొని రాద్ధాంతం చేస్తోందని ఆమె ఇష్టంతోనే పడుకుందని ఒళ్లు బలిసిందని బరితెగించిందని పెద్దవారిని బ్లాక్ మెయిల్ చేస్తోందనిఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడంతో బయటపడి ఈ విషయాలు చెబుతోందని, అవకాశాలు వస్తే హీరోయిన్ అయిపోయి ఇవేవీ పట్టించుకునేదికాదని ...... ఇలా ఎవరి ఇష్టవచ్చినట్లు వారు మాట్లాడారు. కొంతమంది పబ్లిక్ తోపాటు, కొందరు ఛానెళ్ల వారు కూడా ‘‘అభిరామ్ తో ఉన్న ఫొటోలు చూస్తుంటే నువ్వు ఇష్టపడినట్లుగానే కనిపిస్తుంది’’ ... లాంటి ప్రశ్నలు వేశారు. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో పాతుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ ని సాక్ష్యాధారాలతో బయటపెట్టి సంచలనం సృష్టించిన ఘతన మాత్రం శ్రీరెడ్డిదే. ఎక్కువ మంది ఆమె ఆందోళన వ్యక్తం చేసిన తీరుని మాత్రమే చూసి తప్పుపట్టి విమర్శించారు.  వాస్తవానికి  ఆమె లేవనెత్తిన అంశం గురించి పట్టించుకోలేదు. ఆమె అంత తీవ్ర స్థాయిలో రోడ్డెక్కి అల్లరి చేసి, అలజడి సృష్టించినందునే ఈ రోజు ఆ అంశానికి అంతటి ప్రాధాన్యత వచ్చింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో, తెలుగు సినిమా పరిశ్రమలో కదలిక వచ్చింది. పెద్దలు సమావేశమై సమాలోచనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సినిమా రంగంలోని పెద్దలే కాకుండా ప్రభుత్వంలోని వారు కూడా మాట్లాడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి  ప్రభుత్వాలు కూడా ఆలోచనలు చేస్తున్నాయి. ఇది మంచి మరిణామం. ఈ క్రమంలో లైంగిక దోపిడీ ఏమాత్రం తగ్గినా ఆ ఘనత శ్రీరెడ్డికే దక్కుతుంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Apr 27, 2018


ఆంత్రాక్స్ నివారణకు
మాతృభాషలో అవగాహనా కార్యక్రమాలు
ఐటీడీఏ అధికారులకు మంత్రి నక్కా ఆనందబాబు ఆదేశం


             సచివాలయం, ఏప్రిల్ 27:  విశాఖ మన్యంలో ప్రభలిన ఆంత్రాక్స్ వ్యాధి ఎక్కువ మందికి సోకకుండా గిరిజనులకు వారి మాతృభాషలైన కువి, కోదు భాషలలో అవగాహక కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఐటీడీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఆంత్రాక్స్ సోకిన 17 మందిని విశాఖ కేజీహెచ్ కు తరలించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ వ్యాధి ప్రభలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గిరిజనులకు వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి ప్రధానంగా జంతువుల నుంచి సోకుతుందని, అందువల్ల చనిపోయిన జంతుమాంసం తినవద్దని, దానిని పూర్తిగా కాల్చాలని 11 వందల నివాస ప్రాంతాల్లో  విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాధి ప్రభలిన రెండు మండలాల్లోనే కాకుండా గతంలో చింతపల్లి, జీకేవీధి, ముంచింగ్ పుట్ట్, అరకు, పెదబయలు మండలాలలో కూడా ఈ వ్యాధి సోకిన అనుభవాలు ఉన్నాయని, అందువల్ల పాడేరు ఐటిడీఏ పరిధిలోని గ్రామాలన్నింటిలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. గిరిజనులు జంతు మాంసం ఇళ్లలో ఎండపెడుతూ ఉంటారని దానిని నివారించాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి రెండు నెలల వరకు యాంటిబయాటిక్స్ వాడవలసి ఉంటుందని, కోర్సు మొత్తాన్ని వారు వాడేవిధంగా జాగ్రత్త వహించాలని చెప్పారు.
వర్షాకాలం మొదలైతే మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రభుత్వంలోని సంబంధిత శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. గిరిజన, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య శాఖల సిబ్బంది, సాధికార మిత్రలు, ఆషా వర్కర్లు అందరూ కలసి వారికి అవగాహన కల్పించాన్నారు. సాధికార మిత్రలను ఇంటింటికి పంపి గిరిజనులకు అర్ధమైయ్యే రీతిలో వారి మాతృభాషలో చెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, ప్రజాప్రతినిధులు కూడా కలసి వారికి అవగాహన కల్పించాలన్నారు.

            పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ డబ్బు లేక వ్యాధి సోకిన  గిరిజనులను ఆస్పత్రికి తరలిస్తామంటే రావడంలేదని, అటువంటి వారిని తాను దగ్గర ఉండి ముగ్గురిని విశాఖ కేజీహెచ్ కి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వ్యాధి సోకిన ప్రాంతంలో 80 కుటుంబాలు ఉంటున్నాయని, వారందనికి 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని ఆమె కోరారు. అలాగే వ్యాధి సోకినవారికి రూ.10వేల చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల పక్కన పశువులను ఉంచుతారని, అలా కాకుండా ఊరిబయట పశువుల పాకలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే పరిశీలించమని కోరారు.  మరుగుదొడ్లు నిర్మించినా వాటిని వినియోగించుకోవడంలేదని, స్టోర్ రూమ్ లుగా వాడుకుంటున్నారని, ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలను కూడా సద్వినియోగం చేసుకోవడంలేదని, వాటిని వినియోగించుకునేవిధంగా వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఈశ్వరి చెప్పారు. ఆమె కోరిన విధంగా బియ్యం అందజేయమని మంత్రి ఆనందబాబు అధికారులను ఆదేశించారు.
                గిరిజన శాఖ డైరెక్టర్ గందం చంద్రుడు మాట్లాడుతూ ఆంత్రాక్స్ తోపాటు వర్షా కాలంలో ప్రభలే వ్యాధుల గురించి కరపత్రాలు ప్రచురించి పంపామని, వాటిని సంతలు జరిగే ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ, సెర్ఫ్, సాధికార మిత్రలు కలసి పంచిపెట్టాలని చెప్పారు. అలాగే మైకుల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. చనిపోయిన జంతువులను పూర్తిగా కాల్చివేయడం మంచిదన్నారు. పీహెచ్ సీల వారీగా మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వర్షాలు పడేటప్పుడు రక్తపరీక్షలు సేకరించడంతోపాటు వైద్యశిబిరాలు నిర్వహించాలని చెప్పారు. వర్షాలు పడేలోపల గ్రామాలలో రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిడీఏ పీడీ రవి పఠాన్ శెట్టి, పాడేరు సబ్ కలెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Apr 26, 2018



శ్రీవారి అత్తింటివారికి అవకాశం!
              తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) పాలకవర్గం నియామకంలో  పొరపాటు జరిగిపోయింది. మన దేశంలో వేల ఏళ్లుగా  ఆధ్యాత్మికంగా, సామాజికంగా పాతుకుపోయిన వ్యవస్థలో ఇటువంటి పాలకవర్గాల నియామకంలో ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. అందులోనూ ప్రపంచంలోని ప్రతి హిందువు కులాలతో సంబంధంలేకుండా  ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునేంతటి ప్రాచుర్యం పొందిన దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. అంతర్జాతీయ స్థాయిలో అంతటి విశిష్టిత కలిగిన దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు మతపరంగా, ఆధ్యాత్మికంగా, నడవడిక పరంగా అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తులై ఉండాలని హిందువులు ఆశిస్తారు.  అటువంటి కమిటీ నియామకంలో తప్పుగానీ, పొరపాటు గాని జరిగితే  అది సమాజపరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నియామకాలు కులాలు, రాజకీయ ప్రాతిపదికన జరిగినప్పటికి హిందువుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంది.
         ఆ కమిటీ చైర్మన్ పదవి ఓ యాదవుడికి ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం చెప్పరు. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు. అందువల్ల యాదవులకు ఆ రకమైన గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ను ఆ పదవికి ఎంపిక చేయడం పట్లే అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆ పదవికి ఆయన పేరు ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరిగిన సమయంలోనే, ఆయన క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గొంటారని విమర్శలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఆయన ఆ సభలలో పాల్గొనడం తప్పేమీకాదు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా. సామాజిక పరంగా అది మంచిపనే. కానీ ఇక్కడ విశ్వాసాలు వేరు. ఏ మతమైనా  మతపరమైన వ్యక్తుల మనోభావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో వాటిని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించక తప్పదు. ఇది సున్నితమైన అంశమైనప్పటికీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కు ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే ప్రభుత్వంలో మరో ఉన్నతమైన పదవి ఇచ్చి, టీటీడీ చైర్మన్ గా ఇటువంటి వివాదాలకు అవకాశంలేని వారిని నియమిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో భూమన కరుణాకర రెడ్డిని కమిటీ చైర్మన్ గా నియమించినప్పుడు కూడా అయన నాస్తికుడని, ఆయనను దైవ సంబంధమైన  కమిటీలో ఎలా నియమిస్తారని విమర్శలు వచ్చాయి.  కమిటీ సభ్యులుగా ఓ దళిత వ్యక్తిని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగినది. వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరితో సమానంగా గుర్తించి తగిన స్థానం ఇవ్వవలసిన బాధ్యత అందరిపై ఉంది. వారిని ఆ విధంగా గౌరవించిన నాడు తమను తక్కువగా చూస్తున్నారన్న భావన వారిలో తొలగిపోయే అవకాశం ఉంది.  ఇటువంటి నియామకాల విషయంలో మత పరంగా వారు ఆచరించే విధానాలు, ఆలోచనలు, సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.  కమిటీ సభ్యురాలిగా పాయకరావు పేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నియామకం కూడా విమర్శలకు దారితీసింది. గతంలో  స్వయంగా ఆమే తన కారులో, తన బ్యాగ్ లో  తప్పనిసరిగా బైబిల్ ఉంటుందని చెప్పారు. ఆమె అటు క్రీస్తుని, ఇటు వెంకటేశ్వరుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు, ప్రార్ధించవచ్చు. ఒక రకంగా అది మంచిదే. కానీ మత విశ్వాసాలు ఇటువంటి వాటిని అనుమతించవు. ఏ మత పెద్దలైనా ఇటువంటివాటిని అంగీకరించరు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, దానిని అరికట్టాలని,  ఉద్యోగులలో కొందరు క్రైస్తవులు ఉన్నారని, వారిని బదిలీ చేయాలని హిందువులు గగ్గోలు పెడుతున్నారు.   ఈ నేపధ్యంలో అనిత నియామకం వివాదాలకు దారి తీసింది. పరిస్థితిని అర్ధం చేసుకొని తన నియామకాన్ని రద్దు చేయమని ఆమె కోరడం అభినందనీయం. ఇటువంటి చర్యలు వేల సంవత్సరాలుగా హిందువులోల జీర్ణించుకుపోయిన మనోభావాలను దెబ్బతీస్తాయి. మనది లౌకక రాజ్యమైనా ఇటువంటి నియామకాల్లో మతపరమైన ఆనవాయితీలను గౌరవించకతప్పదు. ఇలాంటి నియామకాలు ప్రభుత్వాలకు కత్తిమీద సాములాంటివి.  మతపరమైన అంశాలతోపాటు అనేక సమాజిక వర్గాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పదవిని అత్యంత గౌరవంగా భావించే అన్ని రంగాలలో ఉన్నతవర్గాల వారు  పోటీపడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు లబ్ధిపొందాలని చూస్తుంటాయి. ప్రభుత్వం అంటే గిట్టనివారు కూడా ఇటువంటి సందర్భాలను తమకు అనుకూలంగా వాడుకుంటుంటారు. అందువల్ల మత, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా నష్టం జరుగకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
                ఇదిలా ఉంటే శ్రీవారికి అత్తింటివారమైన తమ కులస్తులకు కమిటీలో స్థానం కల్పించలేదని పద్మశాలీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి జీవిత భాగస్వామి పద్మావతిదేవి పద్మశాలీయుల ఆడపడుచు. తిరుమల బ్రహ్మాత్సవాలలో వారికి ఆ గౌరవం దక్కుతోంది. అయితే కమిటీలో సభ్యత్వం లేదని వారు బాధపడుతున్నారు. పద్మావతీ దేవి తమ ఆడపడుచు అయినందున ప్రతిసారి కమిటీలో తమ వారికి స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో కమిటీలో మార్పులు చేయవలసి రావడంతో పద్మశాలి కులస్తులకు ప్రధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే రాష్ట్రంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మంది ఆధారపడే  చేనేత రంగానికి సంబంధించిన కులాలను సంతృప్తిపరచినట్లు అవుతుందన్న భావన కూడా ఉంది. అనిత తప్పుకోవడంతో హరికి అత్తింటివారికి కమిటీలో స్థానం దక్కే అవకాశం ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Apr 23, 2018


సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా
సెక్స్ వర్కర్లుగా మారుతున్న యువతులు

మానవ అక్రమ రవాణాపై వర్క్ షాప్ లో వక్తల అభిప్రాయం
Ø ఇది తీవ్రమైన సామాజిక సమస్య: డీజీపీ మాలకొండయ్య

                సచివాలయం, ఏప్రిల్ 23: సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో సోమవారం ఉదయం మానవ అక్రమ రవాణాపై జరిగిన వర్క్ షాప్ లో పలువురు వక్తలు అభిప్రాయం పడ్డారు. ఎక్కువ మంది పేద వర్గాలు, అణదొక్కబడిన కులాల  వారే ఇందులో చిక్కుకుంటున్నారని, అయితే కొందరు విసాలవంతమైన జీవితానికి అలవాటుపడినవారు, తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో ఉన్నవారు కూడా ఈ వృత్తిలోకి దిగుతున్నారని చెప్పారు. యువతులను మోసం చేసి, ప్రలోభపెట్టి ఈ వృత్తిలోకి దింపేవారిపై,  ముంబై, పూనా, గల్ఫ్ దేశాలకు పంపేవారిపై, అమ్మేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. అమాయకంగా తెలిసీతెలియక ఈ వృత్తిపట్ల ఆసక్తి చూపేవారికి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. సెక్స్ వర్కర్లను, ట్రాఫికింగ్ ను వేరుగా చూడాలని, సెక్స్ వర్కర్లపై దాడులు ఆపాలని, లేని ప్రాంతాల్లో రిహాబిలేషన్ హోమ్స్ ఏర్పాటు చేయాలని, తండాల నుంచి యువతులను ముంబై, పూనే, గల్ఫ్ దేశాలకు పంపడాన్ని ఆపాలని, ఉజ్వల హోమ్స్ ని మెరుగుపరచాలని, సెక్స్ వర్కర్ల పునరావాసం కోసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలని, సెక్స్ వర్కర్లకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చెప్పారు.

 ఇది తీవ్రమైన సామాజిక సమస్య: డీజీపీ
ఇది చాలా తీవ్రమైన సామాజిక సమస్యగా డిజీపీ ఎం.మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  సెక్స్ వర్కర్లకు సంబంధించి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన కొన్ని సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలను చెప్పారు. కొన్ని సమస్యలను జిల్లా స్థాయిలోనే జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ, ఇతర శాఖల సమన్వయంతో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.  సెక్స్ వర్కర్లపై దాడులు చేయడం ఆపివేశామని, ట్రాఫికింగ్ ని వేరుగానే చూస్తున్నట్లు, దానికి పదేళ్ల వరకు శిక్ష పడేఅవకాశం ఉందని, సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టడంలేదని, వారిని బాధితులుగానే పరిగణిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.

హూస్టన్ లో విస్తృతంగా ప్రచారం
మానవ అక్రమ రవాణకు వ్యతిరేకంగా హూస్టన్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు మానవ అక్రమ రవాణపై అమెరికన్ నిపుణురాలు, హూస్టన్ అధికారి మినాల్ పటేల్ డేవిస్ చెప్పారు. సెక్స్ వర్కర్లు, మానవ అక్రమ రవాణాపై హూస్టన్ లోని పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఈ అంశానికి సబంధించి 1200 మంది ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్, కృష్ణా జిల్లా న్యాయమూర్తి పీఆర్ రాజు, విజయవాడ డీసీసీ బ్రహ్మారెడ్డి, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ రాజీవ్, సీఐడి విభాగం ప్రాంతీయ అధికారి మేరి ప్రశాంతి,  డీఎస్పీలు సరిత, శ్రీలక్ష్మి, యుఎస్ కాన్స్ లేక్ కు చెందిన చందిల్, పద్మజ, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Apr 19, 2018


ప్రత్యేక హోదా కలిగిన 3 రాష్ట్రాలపై ఓ అధ్యయనం
(ఉత్తరాఖండ్,  హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్)
       
  ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో తెలుసుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రాలపై హిమాచల్ ప్రదేశ్ లోని సిరమూర్ జిల్లా పాంటాసాహిబ్ కు చెందిన  త్రివేణి స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారు ఒక అధ్యయనం చేశారు.  ఈ అధ్యయనానికి  ప్రాజెక్ట్ డైరెక్టర్ గా డాక్టర్ ధ్యాన్ సింగ్ టోమర్, కన్సల్టెంట్ గా ప్రొఫెసర్ శ్యామ ప్రసాద్ వ్యవహరించారు.  కేంద్ర ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ లోని సోషియో ఎకనామిక్ రిసెర్చ్ డివిజన్ వారు ఈ అధ్యయనానికి  నిధులు సమకూర్చారు.  అధ్యయన నివేదికను వారు సోషియో ఎకనామిక్ రిసెర్చ్ డివిజన్ వారికి అందజేశారు.  ప్రధానంగా ప్రత్యేక హోదాతో వచ్చిన రాయితీలు, నిధుల కారణంగా  ఈ మూడు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రగతి, ఆర్ధికాభివృద్ధి ఏ మేరకు జరిగిందన్న అంశంపై పరిశోధన జరిగింది. ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, కశ్మీర్ లలో బాగా అభివృద్ధి చెందిన జిల్లా ఒకటి, వెనుకబడిన జిల్లా ఒకటి చొప్పున రాష్ట్రానికి  రెండేసి జిల్లాలను తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా కలిగిన ఈ రాష్ట్రాలకు సరిహద్దున గల పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ఏ మేరకు జరిగిందన్న అంశంపై కూడా రెండేసి జిల్లాలను ఎంపిక చేసుకుని పరిశోధన కొనసాగించారు. ప్రత్యేక హోదా కింద ఈ రాష్ట్రాలకు భారీగా నిధులు వచ్చినప్పటికీ,  వాటి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లతో పోలిస్తే పారిశ్రామికాభివృద్ధిలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ బాగా వెనుకబడ్డాయి. ప్రత్యేక హోదా ప్రకటించిన అనంతరం ఈ మూడు రాష్ట్రాల్లో అభివృద్ధి విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్న విషయం గమనార్హం. ఫ్యాక్టరీలు పెరిగాయి. మూలధనం పెరిగింది. పెట్టుబడులు పెరిగాయి. పారిశ్రామిక కార్మికుల సంఖ్య పెరిగింది. పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. కార్మికుల వేతనాలు పెరిగాయి. ఉత్పత్తి పెరిగింది. ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల ఈ మూడు రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య పారిశ్రామికీకరణ, అభివృద్ధి విషయంలో తీవ్ర అసమానతలు ఏర్పడ్డాయి. అలాగే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో కూడా ఈ అసమానతలు తీవ్రంగా ఉండటం గమనార్హం. పారిశ్రామికాభివృద్ధి విషయంలో హిమాచల్ ప్రదేశ్ కన్నా ఉత్తరాఖండ్ బాగా లబ్ధి పొందింది. రాష్ట్ర విభజన తరువాత ఉత్తరాఖండ్ లో ఉన్న వనరులకు ప్రత్యేక హోదా ఊతంగా మారి ఆ రాష్ట్రాన్ని విజయపథాన నిలబెట్టింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ కున్న కొన్ని సమస్యల కారణంగా ఆ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడే ఉంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడంలో బాగానే విజయవంతమయ్యాయి. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేక హోదా దోహదపడింది.
ప్రత్యేక హోదా దుర్వినియోగం
            ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు పలువురు ప్రత్యేక హోదాను దుర్వినియోగం చేశారు. తమ పరిశ్రమల్లో ఉత్పత్తి విలువను బాగా పెంచి చూపించి ఎక్సైజ్ డ్యూటీ వంటి మినహాయింపులు ద్వారా భారీ మొత్తంలో  ప్రయోజనాలు పొందారు. ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు తమకు కావాల్సిన నిపుణులను దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తీసుకుని వారికి అధిక వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించారు. స్థానిక యువతకు మాత్రం నిర్ధేశించిన సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించలేదు. స్థానికులకు ఉపాధి కల్పించాన్న నిబంధనను తుంగలో తొక్కారు. దాదాపు 50 శాతం కంపెనీలు ఈ విధంగా నిబంధనలు అతిక్రమించాయి. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి  ఒనగూడే ప్రయోజనాలేంటన్న అంశంపై స్థానిక ప్రజల్లో చాలా మందికి కనీస అవగాహన లేదు. దీంతో హోదా రావడం వల్ల మంచి జరిగిందనేవారు 32.9 శాతం మంది ఉంటే, నిజంగా అభివృద్ధి జరిగిందని చెప్పేవాళ్లు 29 శాతం మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యేక హోదా కారణంగా ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రణాళికలు విస్తృతమవుతాయని నమ్మేవాళ్లు 44 శాతం ఉంటే, అంతగా నమ్మకం లేని వాళ్లు 29 శాతం ఉన్నట్లు వారు జరిపిన సర్వేలో తేలింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వాల పనితీరు పట్ల 39 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. హోదా పొందిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మాత్రమే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరుకునే వారి సంఖ్య 66.7 శాతంగా ఉంది.  తమ రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఉపయోగపడుతుందని నమ్మేవాళ్ల సంఖ్య మాత్రం 89 శాతంగా ఉంది.
జమ్మూ-కశ్మీర్ కోసం ప్రత్యేక ప్యాకేజీ
                ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా పరిశ్రమలకు వివిధ రూపాల్లో రాయితీలు కల్పించారు. పారిశ్రామికాభివృద్ధి కోసం జమ్మూ-కశ్మీర్  రాష్ట్రం 2002 జూన్ 14న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం పరిశ్రమలకు పదేళ్ల పాటు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కేంద్ర పెట్టుబడి రాయితీ పథకం కింద పదేళ్ల పాటు పరిశ్రమల స్థాపనకు అయ్యే ఖర్చులో 15 శాతం లేదా 30 లక్షల రూపాయలకు మించకుండా మినహాయింపు కల్పించారు. పరిశ్రమల నిర్వహణ కోసం పెట్టే పెట్టుబడిలో మూడు శాతం వడ్డీ రాయితీని పదేళ్ల పాటు వర్తింపజేశారు.  కేంద్ర సమగ్ర బీమా పథకం కింద పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు పదేళ్ల పాటు వంద శాతం బీమా సౌకర్యం కల్పించారు. మొదటి ఐదేళ్ల పాటు వంద శాతం ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. ఆ తరువాతి ఐదేళ్ల పాటు 30 శాతం పన్ను మినహాయింపు ఇస్తారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రత్యేక ప్యాకేజీ
               ఈ రెండు రాష్ట్రాల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని 2003 జనవరి 7న ప్రకటించారు. షరతులతో 100 శాతం ఎక్సైజ్ రాయితీ ఇచ్చారు. తొలి ఐదేళ్ల వరకు 100 శాతం ఆదాయపన్నులో మినహాయింపు, తరువాత 30 శాతం పన్ను మినహాయింపు వర్తింపజేశారు. 15 శాతం లేదా రూ.30 లక్షలకు మించకుండా పెట్టుబడి రాయితీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ రుణాలు అందజేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్రం నుంచి రాయితీలు అందుతున్నాయి. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు ప్రధాన మంత్రి రోజ్ గార్ యోజన ద్వారా పెట్టుబడిలో 15 శాతం రాయితీ లభిస్తుంది. స్థానిక మానవ వనరులకు ఉపాధి కల్పించని పరిశ్రమలకు పై రాయితీలు కల్పించరాదన్న నిబంధనను ఉత్తరాఖండ్ రాష్ట్రం ఖచ్చితంగా అమలు చేస్తోంది.
పరిశ్రమలు పెట్టుబడులు – ఉపాధి కల్పన
             ఉత్తరాఖండ్ లో రూ.23,905 కోట్ల పెట్టుబడులతో 16,012 పరిశ్రమలను స్థాపించి 1,61,610 మందికి ఉపాధి కల్పించారు. హిమాచ్ ప్రదేశ్ లో రూ.10,104 కోట్ల పెట్టుబడులతో 7,606 పరిశ్రమలను ప్రారంభించి 95, 618 మందికి ఉపాధి కల్పించారు. జమ్మూ,కశ్మీర్ లో రూ. 1989 కోట్ల పెట్టుబడులు పెట్టి 8,091 పరిశ్రమలను స్థాపించి 59,621 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రత్యేక హోదా కల్పించినంత మాత్రాన అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండవు. ఆయా రాష్ట్రాలలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, భూమి, వనరుల లభ్యతపై  ఆధారపడి అభివృద్ధి చెందుతాయి. 
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...