Apr 28, 2018


రంగుల ప్రపంచం ముసుగు తొలిగింది
                     
  శ్రీరెడ్డి పడిలేచిన కెరటం
శ్రీరెడ్డి ఓ సంచలనం. సినిమా రంగం ముసుగు తొలిగించింది. ఇప్పటి వరకు సమాజానికి తెలియని అత్యంత దారుణమైన విషయాలను బయటపెట్టింది. పాత్రలు ఇస్తామని, ఇప్పిస్తామని సినిమా రంగంలో యువతులను, మహిళలను టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా  ఎలా వాడుకుంటున్నారో బహిర్గతం చేసింది. పెద్ద ఎత్తున లైంగిక దోపిడీ జరుగుతున్నట్లు పేర్కొంది.  ఆమె ధైర్యసాహసాలను చూసి వందల మంది యువతులు బయటకు వచ్చి తమ అనుభవాలను వెల్లడించారు. హీరోయిన్ అనిత వంటి వారు కూడా తాము ఎదుర్కొన్న వేధింపులు వివరించారు.  అప్పటి వరకు  ఇలా అట, అలా అట అని సూచాయగా తెలిసిన విషయాలను సమాజానికి తెలిసే విధంగా వాస్తవాలను శ్రీరెడ్డి బహిర్గతం చేసింది. మహిళా సంఘాలు, కొన్ని ఛానెళ్లు ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.  తీగలాగితే డొంక కదిలిందలినట్లు ఆమె టాలీవుడ్ లో చీకటి వ్యవహరాలు బయటపెడితే, ఒక్క టాలీవుడ్ ఏమిటీ కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మొత్తం సినిమా రంగం అంతా క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇంకా ఎక్కువ మాట్లాడితో ఇతర అన్ని రంగాలతోపాటు ప్రభుత్వంలో, పార్లమెంటులో కూడా ఉందని  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ  ఎంపీ రేణుకా చౌదరి వంటి  ప్రముఖ వ్యక్తులే బయట పెట్టారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపి శతృఘ్నసిన్హా వంటి వారు రేణుకా చౌదరి, సరోజ్ ఖాన్ వంటి వారి వ్యాఖ్యలను సమర్ధించారు.
              క్యాస్టింగ్ కౌచ్  ఒక్క సినిమా పరిశ్రమలోనే ఉన్నట్లు మాట్లాడతారు ఏమిటి? ఈ వ్యవహారం దేశంలో ఎక్కడ లేదు? మీడియాలో లేదా? అని సరోజ్ ఖాన్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె దీనిని సమర్ధిస్తున్నట్లు మాట్లాడారు. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ మాములేనని, దాని వల్ల కొంత మందికి ఉపాధి దొరుకుతుందని, తిండి దొరుకుతుందని చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తమ పరిశ్రమలో  ఎవరూ రేప్ లు చేసి వదిలిపెట్టరని, ఉపాధి చూపిస్తారని చెప్పారు. అయితే ఇలాంటి వ్యవహారాలకు సిద్ధపడలా? వద్దా? ఆ నటీమణుల మీద ఆధారపడి ఉంటుందని  ఆమె అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని, అందుకు చట్ట సభలు కూడా అతీతం కాదని పైర్ బ్రాండ్ గా పేరుపొందిన  రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరోజ్ ఖాన్  వ్యాఖ్యలను ఆమె సమర్ధించారు. ఇది అందరూ అంగీకరించవలసిన ఓ చేదు నిజం అని చెప్పారు. అన్ని రంగాల్లో పనిచేసే ప్రాంతాల్లో మహిళలకు వేధింపులు ఎదురవుతూనే ఉంటాయన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై దేశ వ్యాప్త ఉద్యమాలు రావాలన్నారు. హాలీవుడ్‌లో ఉన్న మీటూ ప్రచారం తరహాలో భారత్‌లో కూడా పోరాడాలని ఆమె మహిళలకు పిలుపు ఇచ్చారు. అన్ని చోట్లా ఉన్నట్లే రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.  లైంగిక ఆనందం, లైంగిక దోపిడీ అనేవి అటు వినోద రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఉన్నాయని, ఈ విషయమై సరోజ్ ఖాన్, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సబబేనని శత్రుఘ్నసిన్హా సమర్ధించారు. రాజకీయ రంగంలో దీనిని క్యాస్టింగ్ ఓట్ కౌచ్అనాలేమోనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదేనని, జీవితంలో ముందుకెళ్లేందుకు అప్పటి పరిస్థితులు డిమాండ్ చేసినట్లుగా కొన్నిసార్లు నడుచుకోకతప్పదన్న  అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
              మొదట శ్రీ రెడ్డిని  అర్ధనగ్న ప్రదర్శన చేసిందని - పరుష పదజాలం, బూతులు ప్రయోగించిదని అవకాశాల కోసం ఆమె పడుకొని రాద్ధాంతం చేస్తోందని ఆమె ఇష్టంతోనే పడుకుందని ఒళ్లు బలిసిందని బరితెగించిందని పెద్దవారిని బ్లాక్ మెయిల్ చేస్తోందనిఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడంతో బయటపడి ఈ విషయాలు చెబుతోందని, అవకాశాలు వస్తే హీరోయిన్ అయిపోయి ఇవేవీ పట్టించుకునేదికాదని ...... ఇలా ఎవరి ఇష్టవచ్చినట్లు వారు మాట్లాడారు. కొంతమంది పబ్లిక్ తోపాటు, కొందరు ఛానెళ్ల వారు కూడా ‘‘అభిరామ్ తో ఉన్న ఫొటోలు చూస్తుంటే నువ్వు ఇష్టపడినట్లుగానే కనిపిస్తుంది’’ ... లాంటి ప్రశ్నలు వేశారు. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో పాతుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ ని సాక్ష్యాధారాలతో బయటపెట్టి సంచలనం సృష్టించిన ఘతన మాత్రం శ్రీరెడ్డిదే. ఎక్కువ మంది ఆమె ఆందోళన వ్యక్తం చేసిన తీరుని మాత్రమే చూసి తప్పుపట్టి విమర్శించారు.  వాస్తవానికి  ఆమె లేవనెత్తిన అంశం గురించి పట్టించుకోలేదు. ఆమె అంత తీవ్ర స్థాయిలో రోడ్డెక్కి అల్లరి చేసి, అలజడి సృష్టించినందునే ఈ రోజు ఆ అంశానికి అంతటి ప్రాధాన్యత వచ్చింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో, తెలుగు సినిమా పరిశ్రమలో కదలిక వచ్చింది. పెద్దలు సమావేశమై సమాలోచనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సినిమా రంగంలోని పెద్దలే కాకుండా ప్రభుత్వంలోని వారు కూడా మాట్లాడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి  ప్రభుత్వాలు కూడా ఆలోచనలు చేస్తున్నాయి. ఇది మంచి మరిణామం. ఈ క్రమంలో లైంగిక దోపిడీ ఏమాత్రం తగ్గినా ఆ ఘనత శ్రీరెడ్డికే దక్కుతుంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...