Apr 19, 2018


ప్రత్యేక హోదా కథా కమామిషు!      
         ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో పార్లమెంట్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హాదా ఇవ్వాలన్న డిమాండ్ తో ఏపీలో జరుగుతున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా దీనినిపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని ఒకసారి  పరిశీలిస్తే, 1969లో 5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని దేశంలో ప్రవేశపెట్టారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి పరిస్థితులు అనుకూలంగా లేని  రాష్ర్టాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర నిధులు కేటాయించాలని, వివిధ రకాల కేంద్ర పన్నులలో మినహాయింపు ద్వారా ఆ రాష్ర్టాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఐదవ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసింది. ఆ ప్రకారం వివిధ సమస్యలను ఎదుర్కొంటూ, అన్ని విధాల వెనుకబడిన, అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాలకు ఈ హోదా కల్పించారు. ఆ నాడు దేశంలో 17 రాష్ట్రాలు ఉండేవి.  మొదట్లో వాటిలో అసోం, నాగాలాండ్, జమ్మూ-కాశ్మీర్ మూడు రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడం, అక్కడి పరిస్థితులు కారణంగా మరో ఎనిమిది రాష్ట్రాలకు కూడా విడతలవారీగా ప్రత్యేక హోదా కల్పించారు. ఆ మూడు రాష్ట్రాలు కాక ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రత్యేక హోదా ఉంది. ఆ విధంగా ప్రస్తుతం దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. 1970-71లో హిమాచల్ ప్రదేశ్ కు, 1971-72లో మణిపూర్, మేఘాలయ, త్రిపురలకు, 1975-76లో సిక్కింకు, 1986-87లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు, 2001-2002లో ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా కల్పించారు.  ప్రత్యేక హోదా పొందిన చివరి రాష్ట్రం ఉత్తరాఖండ్. ప్రణాళికా సంఘం సలహా మేరకు ప్రధాన మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ మండలిలో  కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అయితే, ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్‌ను ఎన్డీయే( నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా అనేది నిధుల కేటాయింపునకు ముడిపడి ఉన్నందున కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా  కీలకంగా మారింది.

ప్రత్యేక హోదాకు ప్రాతిపదిక
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు - రవాణా సౌకర్యాలు సరిగాలేకపోవడం - జనసాంద్రత తక్కువ - గిరిజనుల సంఖ్య ఎక్కువ- సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు తక్కువ తలసరి ఆదాయం - ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్టవంతం కాకపోవడం- విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం... ఇలా అనేక అంశాల ప్రాతిపదికగా ప్రత్యేక హోదా కల్పిస్తారు. వీటిలో అన్ని లేకపోయినా కొన్ని ఉన్నా ఇస్తారు.  ప్రత్యేక హోదాకు ఒక నిర్ధిష్ట ప్రాతిపదిక రూపొందించాలన్న ఉద్దేశంలో 2013లో కేంద్ర ప్రభుత్వం అప్పటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది.

ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు
       ప్రత్యేక హోదా కల్పించిన  రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించేందుకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. గ్రాంట్ గా ఇచ్చిన సొమ్ముని తిరిగి చెల్లించవలసిన అవసరంలేదు. కేంద్రం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఒక రకంగా, లేని రాష్ట్రాలకు ఒక రకంగా నిధులు కేటాయిస్తుంది.  కేంద్రం రాష్ట్రాలకు అందించే సాయం మూడు రకాలుగా ఉంటుంది. సాధారణ కేంద్ర సాయం (నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ - ఎన్‌సీఏ), అదనపు కేంద్ర సాయం (ఎడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్- ఏసీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్-ఎస్‌సీఏ). ఎన్‌సీఏ కేటగిరీ కింద అందించే మొత్తం సాయంలో 30 శాతం గ్రాంట్ల రూపంలో అందుతుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. 90 శాతం గ్రాంట్లు, 10 శాతం రుణాల ఫార్ములాను కేంద్ర ప్రాయోజిక పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథకాలకు వర్తింపజేస్తారు. కేంద్ర సాయానికి సంబంధించిన నిబంధనలు ఒకేసారి నిర్ణయించలేదు. విడతలవారీగా ఆయా పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు.  1992-93 నుంచి అమలవుతున్న గాడ్గిల్ ఫార్ముల ప్రకారం  మొత్తం కేంద్ర ఆదాయంలో  ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు  కావాల్సిన నిధులు ఇవ్వాలి. ఆ  తర్వాత  ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ఈ ఫార్ముల పై అనేక తర్జనభర్జనలు జరిగాక రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని 1991 లో అప్పటి ప్లానింగ్ కమీషన్ డిప్యుటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో ఒక కమిటీ వేశారు.
ఆ కమిటీ ఇచ్చిన నివేదికనే గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అంటారు.  దాని ప్రకారం ప్రత్యేక హోదా కలిగిన  పది రాష్ట్రాలకు (అప్పటికి ఉన్నవి 10) కేంద్రo వాటాగా రాష్ట్రాలకు ఇచ్చే ప్లాన్ నిధులలో 30 శాతం కేటాయించారు. మిగతా 70 శాతం ప్రత్యేక హోదా లేని ఇతర రాష్ట్రాలు ఇవ్వలని ప్రతిపాదించారు.
ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం గ్రాంట్ గా, 10 శాతం  అప్పుగా పరిగణిస్తారు.  ఇతర రాష్ట్రాలకు 30 శాతం గ్రాంట్, 70 శాతం అప్పుగా కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే ఇస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ప్రాతిపదికగా ఆ నిధులను కేటాయిస్తారు.  ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు విభజిస్తారు. ఏ నిధులైనా ఆయా రాష్ట్రాల వార్షిక ప్రణాళిక ఆధారంగా కేటాయిస్తారు. కేంద్ర విధించే పన్నుల్లో మినహాయింపు, కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపు వాయిదా, వడ్డీని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.  సాధారణంగా  కేంద్ర చేసే సహాయంలో అధిక భాగం ప్రత్యేక హోదా కలిగిన 11 రాష్ర్టాలకు అందుతుంది. ఉదాహరణకు 2011-12లో  కేంద్రం అందించిన సహాయంలో దాదాపు  56 శాతం నిధులు ప్రత్యేకహోదా ఉన్న 11 రాష్ర్టాలకు అందాయి. మిగతా 18 రాష్ర్టాలకు 44 శాతం శాతం నిధులు మాత్రమే కేటాయించారు. అంటే ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు కేంద్రం సాయం ఏ స్థాయిలో అందుతోందో అర్ధం చేసుకోవచ్చు.  దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన కొన్ని ప్రాజెక్టులకు కేంద్ర అదనంగా  నిధులు ఇస్తుంది. ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు రుణంగా మాత్రమే ఇస్తారు.  ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు   ఇచ్చే నిధులలో 90 శాతం ఉచితంగా(గ్రాంట్)గా ఇస్తుంది. కేంద్ర ప్రత్యేక సహాయం కూడా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకే ఎక్కుగా అందుతుంది. ఆ రకంగా కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు అందుతాయి. అంతేకాకుండా ప్రధానంగా ఆ రాష్ట్రాల పారిశ్రామికాభివృద్ధికి  వివిధ రకాల కేంద్ర పన్నులు ఎక్సైజ్‌, కస్టమ్స్, కార్పోరేట్, ఆదాయపు పన్ను వంటి (ప్రస్తుతం జీఎస్టీ) వాటికి  రాయితీ, విరామం, మినహాయింపులను ఇస్తారు. ఆదాయపు పన్నును వంద శాతం వరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది.  ఈ పన్నుల రాయితీ అనేది ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులను బట్టి రాష్ట్రానికి, రాష్ట్రానికి వ్యత్యాసం ఉంది. ఈ కారణాల రీత్యా ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...