Sep 30, 2023

చేనేత సహకార సంఘాల ప్రక్షాళన అవసరం

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది.   వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు చేనేత రంగంలోనే ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో,  అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో  దాదాపు 3 లక్షల మంది వరకు చేనేత రంగం ద్వారా  ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం,  ఆసు తోడటం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, దోనెలు, లాకలు, డిజైన్ డాబీలు,  రాట్నాలు, నాడెలు, కదుళ్లు, పన్నెలు, పన్నెల్లో ఉపయోగించే ఇత్తడి ఈనెలు వంటివాటిని తయారుచేయడంతోపాటు అత్యాధునిక డిజైన్స్ రూపకల్పన ద్వారా ఉపాధి పొందడం. ఇంతమంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగంపై ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ వహించడంలేదు. దాంతో చేనేత రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.  

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది వృత్తి కళాకారులు, కార్మికులు మాదిరిగానే  సహకార వ్యవస్థ ద్వారా చేనేత కార్మికులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. చేనేత సహకార సంఘాల ద్వారా వడ్డీ, సబ్సిడీలు వంటి అనేక రాయితీలు అందుకుంటున్నారు. అలాగే, ఈ సంఘాల ద్వారా చేనేత కార్మికులు ఉపాధితోపాటు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దానిని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో  దాదాపు 1282 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైగా చేనేత సహకార సంఘాలు బోగస్ వే ఉన్నాయి. అంటే ఈ సొసైటీలలో చేనేత కార్మికులు ఉండరు. మగ్గాలు ఉండవు. రికార్డులలో మాత్రం అన్నీ ఉన్నట్లు రాసి, నాబార్డ్ రుణాలు, ప్రభుత్వ  రాయితీలన్నీ కొందరు వ్యక్తులు స్వాహా చేస్తున్నారు. చేనేత సొసైటీల ప్రక్షాళనకు సహకార శాఖ ఓ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. సంఘాలన్నిటినీ తనిఖీ చేయాలి. జమా,ఖర్చులు, రుణాలు, సబ్సిడీలు, ఇతర రాయితీలతోపాటు  మగ్గాలను కూడా పరిశీలించాలి.  చేనేత కార్మికులు ఉండారో లేదో గమనించాలి. ఆ క్రమంలో బోగస్ గా తేలినవాటిని రద్దు చేయాలి. సొసైటీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేవాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. నిజమైన చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించాలి. ఈ విధంగా చేనేత సహకార రంగంలో సంస్కరణలు చేస్తే నిజమైన చేనేత కార్మికులు లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. వారు ఆర్థికంగా ఎదుగుతారు. 
  కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలలో  సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది.  అక్కడ చేనేత కార్మికులకు  పీఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. ఆ రకంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో  ఏపీలోని సహకార శాఖ వారు ముందు బోగస్ సొసైటీలను రద్దు చేయాలి. సహకార సంఘాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సంఘాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. నిజమైన సొసైటీలను, నిజంగా పనిచేసే చేనేత కార్మికులను గుర్తించి, వారికి ఉపాధి కల్పించడంతోపాటు సహకార సంఘాల ద్వారా వచ్చే రాయితీలు నేరుగా వారికి అందే ఏర్పాటు చేయాలి. వ్యవసాయమైనా, చేనేత.. ఏ రంగమైనా మార్కెటింగ్ ముఖ్యం. దళారులులేని మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటే చేనేత కార్మికులకు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల విస్తృత స్థాయిలో సహకార సంఘాల నెట్ వర్క్ ఏర్పాటు చేసి, చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే చేనేత కార్మికుల కళానైపుణ్యానికి తగిన గుర్తింపుతోపాటు ఉపాధి మెరుగుపడి, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914 



అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...