Mar 28, 2024

లోక్ సభలో డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్

2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షా 48వేల ఓట్ల మెజార్టీతో డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ విజయం సాధించారు.

 17వ లోక్‌సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ పనితీరు, ఆయన సాధించిన విజయాలు

 వైద్య, ఆరోగ్య శాఖ:

కర్నూలు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్లు:

6 సూపర్ స్పెషాలిటీ కోర్సుల అనుమతి కొరకు కృషి చేసి 19 SSPG seats సాధించారు.  10 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల డిమాండ్‌కు పరిష్కారం లభించింది.

 స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రికి నిధులు: కర్నూలు సర్వజన వైద్యశాలలో నిర్మిస్తున్న స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ.58 కోట్ల నిధులు విడుదల చేయించేందుకు కృషి చేశారు.

 కర్నూలులో ESI ఆసుపత్రి : కర్నూలు ప్రాంత పరిశ్రమలలో పనిచేస్తున్న శ్రామికుల కొరకు 30 పడకల ESI ఆసుపత్రిని మంజూరు చేయించారు. 

 యునాని క్లినికల్ రీసెర్చ్ యూనిట్:  ఈ యూనిట్ కు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించారు.  కేంద్ర ప్రభుత్వ నిధులతో యునాని క్లినికల్ రీసెర్చ్ యూనిట్ స్థాపనకు విశేష కృషి చేశారు. 

 ఆదోని ESI హాస్పిటల్ పునర్నిర్మాణం: శిధిలావస్థలో ఉన్న ఆదోని ESI హాస్పిటల్ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆసుపత్రి నిర్వహణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపించగలిగారు.

 రైలు సర్వీసులు :

కర్నూలు - జైపూర్ రైలు : డాక్టర్ సంజీవ్ కుమార్ గారి కృషి వల్ల వారానికి ఒకసారి కర్నూలు నుండి జైపూర్ కు రైలు ప్రయాణం సౌకర్యం.

 కర్నూలు - మచిలీపట్నం రైలు : అనేక విధాలుగా ప్రయత్నించిన ఫలితంగా   కర్నూలు - మచిలీపట్నం  రైలు సేవలు మొదలయ్యాయి. ధోన్ - గుంటూరు డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైలుని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రైలుని త్వరలో పునఃప్రారంభిస్తారు.

 కర్నూలు రైల్వే స్టేషన్‌కి రెండవ ప్రవేశ ద్వారం: కర్నూలు రైల్వే స్టేషన్ పశ్చిమ గేటు నిర్మాణానికి రూ.43 కోట్లు విలువైన పనులు మంజూరు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ అధికారులను సమన్వయపరిచి ఈ ప్రాజెక్టును ప్రారంభం చేయించేందుకు డాక్టర్ సంజీవ్ కుమార్ కృషి చేశారు. స్థానిక రాజకీయ నాయకుల ప్రతిఘటనను అధిగమించగలిగారు.

 రైల్వే గూడ్స్ షెడ్డును దూపాడుకు మార్చడం:  కర్నూలు రైల్వే స్టేషన్ ఆవరణలో గూడ్స్ రైల్వే షెడ్డు ఉన్నది. దీని వలన లారీల వంటి భారీ వాహనాల ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే గూడ్స్‌ షెడ్‌ని దూపాడుకు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

 రైల్వే CMLR వర్క్‌షాప్ : పంచలింగాలలో నిర్మాణంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేశారు.ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 250 కోచ్‌ల సామర్థ్యంతో, రూ.283 కోట్ల బడ్జెట్‌తో 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు రూ.560 కోట్ల బడ్జెట్‌తో కెపాసిటీని పెంచారు.  తెలంగాణా ప్రభుత్వం ద్వారా రెండు ఎకరాల భూమిని ఇప్పించి ప్రాజెక్ట్ ను త్వరిత గతిన పూర్తి చేయడానికి కృషి చేశారు.

 కర్నూలు నుండి భోపాల్ వరకు ఇజ్తిమా ప్రత్యేక రైలు: ముస్లిం సోదరుల కొరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

 బెంగుళూరుకు వందేభారత్ రైలు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే  భారత్ రైలు ప్రాజెక్టులో  ఆ రైలు కర్నూలుకు కూడా వచ్చేవిధంగా కృషి చేశారు.

 కోసిగి రైలు ఆగేవిధంగా చేశారు.

 కర్నూలు - ముంబై రైలు : హైదరాబాదు నుండి ముంబైకి నడుస్తున్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలును కర్నూలు నుండి ముంబై వరకు నడపవలసిందిగా పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. దూపాడు రైల్వే పనులు పూర్తి అయిన తరువాత, కర్నూలు ముంబై రైలు నడిపే అవకాశం ఉంది.

 జాతీయ రహదారులు :

ఆదోని బైపాస్ రోడ్ : పలు దఫాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించి, ఆదోని ప్రజల చిరకాల కోరిక అయిన ఆదోని బైపాస్ రోడ్డు సాధించ కలిగారు.

 మంత్రాలయం బైపాస్ రోడ్ : మంత్రాలయం బైపాస్ రోడ్డు కోసం పలు వినతి పత్రాలు సమర్పించి సాధించారు.

 జాతీయ రహదారుల క్రింద వంతెన రహదారులు (RUB): కర్నూలు నగరంలోని ITC జంక్షన్ లో RUB డాక్టర్ సంజీవ్ కుమార్ కృషి వల్ల వచ్చింది. ఆ పని సకాలంలో పూర్తి అయింది.  అలాగే, నన్నూరు సమీపంలో చిన్నటేకూరు దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FUT) మంజూరు చేయించారు. కర్నూలులోని వెంకటరమణ కాలనీ సమీపంలోని RUBని త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేశారు.

 కర్నూలు - బళ్ళారి రోడ్డును జాతీయ రహదారిగా మార్చుట: ఇందుకోసం డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఎంపీగా ఎన్నికైన మొదటి రోజు నుండి కృషి చేశారు. ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి చేరాయి.అసూయతో ఒక రాజకీయ నాయకుడు ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేందుకు ప్రయత్నం చేశాడు. 

 మైనారిటీస్ వెల్ఫేర్ :

MPLADS ద్వారా జరిగిన అభివృద్ధి పనులు : అంబులెన్సు, శ్మశానవాటికల పనులు, కమ్యూనిటీ హాల్స్, కోవిడ్ మహమ్మారి సమయంలో అందించిన వైద్య పరికరాలు, ప్రభుత్వ భవనాలకు ప్రహరీ గోడలు, విద్యాలయాలలో డిజిటల్ పరికరాలు, దివ్యాంగుల కొరకు డిజిటల్ లైబ్రరీ, మురికి కాలువలు, గ్రామాలలో విద్యుత్ పరికరాలు, పోలీసు జీపులు, పోలీస్ ఆఫీసులో గదులు, బోరుబావులు, గ్రామాలలో సిమెంటు రహదారులు, విద్యాలయాలలో తరగతి గదులు, గ్రామాలలో నీటి సరఫరా కొరకు పైపు లైన్లు తదితర పనులను MPLADS నిధులతో చేశారు.

 నియోజకవర్గాలవారీగా జరిగినపనులు :

కర్నూలు నియోజకవర్గంలో రూ.2 కోట్ల 17 లక్షల ఖర్చుతో 19  పనులు జరిగాయి.

కోడుమూరునియోజకవర్గంలో రూ.2 కోట్ల 40 లక్షల ఖర్చుతో 31 గ్రామాలలో 95 పనులు జరిగాయి.

పత్తికొండ నియోజకవర్గంలో రూ.3 కోట్ల 18 లక్షల ఖర్చుతో 44 గ్రామాలలో 108 పనులు జరిగాయి.

ఆలూరు నియోజకవర్గంలో రూ.4 కోట్ల 27 లక్షల ఖర్చుతో 100 గ్రామాలలో 196 పనులు జరిగాయి.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రూ.కోటి 62 లక్షల ఖర్చుతో 39 గ్రామాలలో 69 పనులు జరిగాయి.

ఆదోని నియోజకవర్గంలో రూ. కోటి  23 లక్షలు ఖర్చుతో 24 గ్రామాలలో 37 పనులు జరిగాయి.

మంత్రాలయం నియోజకవర్గంలో రూ.4 కోట్ల 10 లక్షల ఖర్చుతో 27 గ్రామాలలో 71 పనులు జరిగాయి. 

  

17వ లోక్‌సభ సభ్యుడిగా సభలో డాక్టర్ సంజీవ్ కుమార్

 లోక్ సభలో చర్చలు :

డాక్టర్ సంజీవ్ కుమార్ గారు  లోక్ సభలో 22 చర్చలలో పాల్గొన్నారు. 1952 నుండి 19 సార్లు కర్నూలు లోక్ సభకు ఎన్నికలు నిర్వహించారు. 12 మంది ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతము 17వ లోక్ సభ పని చేస్తున్నది. 18వ లోక్ సభ కొరకు 13.5.24న ఎన్నికలు నిర్వహించనున్నారు.

 ప్రైవేటు మెంబెర్స్ బిల్లులు:

డాక్టర్ సంజీవ్ కుమార్ గారు  12 ప్రైవేట్ మెంబెర్స్ బిల్లుల కోసం దరఖాస్తు చేశారు. అందులో 6 బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ 72 సంవత్సరాల చరిత్రలో కర్నూలు ఎంపీగా  డాక్టర్ సంజీవ్ కుమార్ రికార్డు ఇది. కర్నూలుకు సంబంధించి లోక్ సభ చరిత్రలో ఇది ఒక రికార్డు. అంటే గతంలో కర్నూలు నుంచి ఎన్నికైన ఎవరూ సభలో ఇన్ని ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టలేదు.

 1. నేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన జాతీయ కమిషన్ బిల్లు (National Commission for Weavers Welfare Bill 2022 -(108/2022)

2. భారతీయ మెడిసిన్ వ్యవస్థకు సంబంధించిన జాతీయ కమిషన్ బిల్లు ( National Commission for Indian System of Medicine Bill 2022-(109/2022)

3. న్యాయ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు (Judicial Standards and Accountability Bill 2022- (110/2022)

4.భారతీయ వైద్యసేవలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు (Constitution Amendment Bill for Indian Medical Service (23/2023)

5. దివ్యాంగుల హక్కుల బిల్లు (The Rights of Persons with Disabilities Bill (12/2023)

6. చేనేత కార్మికుల సంక్షేమ అథారిటీ బిల్లు (Handloom Weavers Welfare Authority Bill (58/2023)

  

డాక్టర్ సంజీవ్ కుమార్ లోక్ సభలో లేవనెత్తిన ప్రశ్నలు

  17వ లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ 225 ప్రశ్నలు లేవనెత్తగలిగారు.

 300 రోజులు మాత్రమే లోక్ సభ నిర్వహణ

సంవత్సరానికి 100 రోజుల చొప్పున 500 రోజులు లోక్ సభ నిర్వహించ వలసి ఉంది. అయితే, కోవిడ్ కారణంగా 300 రోజులు మాత్రమే లోక్ సభ నిర్వహించారు. పూర్తి స్థాయిలో లోక్ సభ నిర్వహణ జరిగి ఉంటే డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పని తీరు ఇంకా మెరుగ్గా ఉండేది.

 కర్నూలు ఎంపీగా ఓ రికార్డ్

లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పనితీరు గతంలో ఎంపికైన  12 మంది పూర్వ లోక్ సభ సభ్యుల కంటే మెరుగ్గా ఉందన్న ప్రశంసలు అందుకున్నారు. కర్నూలు ఎంపీగా ప్రశ్నలు అడగడంలో, ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టడంలో, చర్చలలో పాల్గొనడంలో  ఆయన ఓ రికార్డును స్థాపించ గలిగారు. ఒక పద్మశాలి లోక్ సభ సభ్యుడు ఈ స్థాయిలో ప్రశ్నించడం, చర్చలలో పాల్గొనడం,  ప్రశ్నలు లేవనెత్తడం చేనేత వర్గాలకు గర్వకారణంగా ఉంది. ఉన్నత చదువులు చదివిన నిజాయితీపరులు లోక్ సభకు ఎన్నికైతే దేశానికి ఎంత ప్రయోజనకరమో డాక్టర్ సంజీవ్ కుమార్ చేసి చూపించారు.

మానవత్వం పరిమళించే మంచి డాక్టర్

ప్రజల మనిషి, ఎంపీ డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్

 

   "వైద్యో నారాయణోహరిః" అన్న ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ సంజీవ్ కుమార్.  సమాజంలోని వేలమంది నిరుపేదల గుండె చప్పుళ్లను వింటూ, ఆపరేషన్ల ద్వారా ప్రాణాలు పోస్తూ పేదరికంపై పోరాడుతున్నారు. వైద్యవృత్తికి న్యాయం చేయాలన్న దృఢసంకల్పంతో ఉచిత ఆపరేషన్లు చేశారు.  ఉచిత పెన్షన్లు అందజేశారు. బ్రతుకు బ్రతకనివ్వుఅన్న సామాజిక స్పృహ వారి ప్రతి చర్యలో కనబడుతూ ఉండేది. పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మొదలగు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని దారిద్య్రానికి ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యుడిగా ఎంతో పేరు గడించిన ఆయన  కర్నూలు జిల్లా ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజానికానికి సేవ చేయాలన్న మహోన్నత సంకల్పంతో 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి  విజయం సాధించారు. లోక్ సభలో అడుగుపెట్టి కర్నూలు ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే అనేక మంచి పనులు చేశారు. ఉన్నత చదువులు చదివిన ఆయన అనర్ఘళంగా ఇంగ్లీషులో మాట్లాడగలిగి ఉండి కూడా మాతృ భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలన్న ఉద్దేశంతో డాక్టర్ సంజీవ్ కుమార్ పార్లమెంటులో తెలుగులో మాట్లాడారు. చేనేత రంగం, టెక్స్ టైల్ రంగాలలోని అనేక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టి సారించేవిధంగా కృషి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతితోపాటు తన ప్రాంతమైన కర్నూలుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పేదలకు ఉచితంగా మందులు అందజేయడానికి కృషి చేశారు. పేదలకు అతి తక్కువ ధరలకు జన ఔషధి మందులు అందజేయడంలో, జన ఔషధి మందుల షాపులు అధిక సంఖ్యలో  ఏర్పాటుచేయడం  ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో ఎంపీగా  ఆయన కృషి ఎంతో ఉంది.

 డాక్టర్ సంజీవ్ కుమార్ గారి బాల్యం:


వస్త్ర వ్యాపారరంగంలో ప్రముఖులైన  శ్రీ శింగరి శ్రీరంగం
, రంగమ్మ పుణ్య దంపతులకు 3-1-1967వ తేదీన  కర్నూలు నగరంలో డాక్టర్ సంజీవ్ కుమార్ గారు జన్మించారు. ఆరుగురి సంతానంలో రెండవ వారు సంజీవ్ కుమార్. బాల్యం నుంచి ఆయన  చాలా హుషారుగా, చురుకుగా ఉంటూ ఆట పాటలతోపాటు చదువులో  ప్రతిభ కనపరిచేవారు.

 కుటుంబ నేపథ్యం :

 శింగరి శ్రీరంగం గారి కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు మొత్తం ఆరుగురూ డాక్టర్లే. విద్య ప్రాధాన్యతను గుర్తించి వారిని చదివించిన ఘనత అంతా వారి అమ్మానాన్నలదే. పిల్లలు అందరూ ప్రభుత్వ కాలేజీలలో MBBS సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, కోడళ్ళు, అల్లుళ్ళు కూడా డాక్టర్లే. మనవళ్ళు, మనవరాళ్లు  కూడా డాక్టర్లే. ఈ కుటుంబంలో  మొత్తం 21 మంది డాక్టర్లు ఉన్నారు. కర్నూలు జిల్లాలో  వారిది ఓ పెద్ద డాక్టర్ల కుటుంబంగా ప్రసిద్ధికెక్కింది. ఇది బహుశా ఆంధ్ర ప్రదేశ్ వైద్య రంగంలోనే ఒక  అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వీరిలో అత్యధికులు బంగారు పతకాలు సాధించినవారు కావడం మరొక విశేషం.

 డాక్టర్ సంజీవ్ కుమార్ – డాక్టర్ వసుంధరల వివాహం

  సంజీవ్ కుమార్ గారు 4-3-1992న డాక్టర్ వసుంధర గారినిపెళ్లి చేసుకున్నారు. ఆమె ఆయుష్మాన్ హాస్పిటల్ లో స్త్రీ వ్యాధి నిపుణులుగా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. కుమార్తె కుమారి డాక్టర్  సౌమ్య కూడా తండ్రి బాటలోనే పయనించి మొదటి ప్రయత్నంలోనే  కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించి, కోర్స్ పూర్తి చేశారు. ఇద్దరు కుమారులు అక్షయ్ ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్, అభిరామ్ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నారు.

 ప్రతిభాశాలియైన విద్యార్థి :

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు డాక్టర్ సంజీవ్ కుమార్ తొలి నుంచి చదువులలో ప్రతి తరగతిలో ప్రథములుగా నిలుస్తూ, ఉన్నత శిఖరాలు అధిరోహించారు. 1971-1982 మధ్య కాలంలో కర్నూలు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివారు. అక్కడ 1 నుండి 9 వ తరగతి వరకు 1ST Rank, 10వ తరగతిలో 2ND Rank సాధించారు. విద్యార్థి దశలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనబడ్డాయి. పదవ తరగతిలో స్కూల్ ప్యూపుల్ లీడర్ గా ఎన్నికై అందరి ప్రశంసలను పొందారు. 1982-84లో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. చదువులలో ఉత్తమ శ్రేణి ఫలితాలు సాధిస్తూనే విద్యార్థి సంఘ ఎన్నికలలో చురుకుగా పాల్గొనే వారు. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో తన మిత్రుల విజయంలో ముఖ్య పాత్ర పోషించి, కింగ్ మేకర్ అయ్యారు.

 కర్నూలు మెడికల్ కాలేజీలో  MBBSలో బంగారు పతకం

1984-1990లో MBBS చదివారు. మొదటి ప్రయత్నంలోనే కర్నూలు మెడికల్ కాలేజీలో  MBBS సీటు సాధించారు. అక్కడ కూడా డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. MBBS ఫైనల్ పరీక్షలలో గైనకాలజీ  విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో 1st Rankతో బంగారు పతకం సాధించారు. జనరల్ సర్జరీ విభాగంలో 2ND RANKతో అగ్రస్థానంలో నిలిచారు.  ఇక్కడ కూడా విద్యార్థి సంఘ ఎన్నికలలో ముఖ్యమైన భూమిక పోషించారు.  1992-1995 మధ్య కాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో MS జనరల్ సర్జరీ చదివారు. MS ప్రవేశ పరీక్షలో విశ్వవిద్యాలయ స్థాయిలో 5TH Rank సాధించారు. యూనివర్సిటీ 1ST Rankతో MS పూర్తి చేశారు.

  ఉస్మానియా మెడికల్ కాలేజీలో MChలో డిస్టింక్షన్

1998-2000 : MCh యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు ప్రవేశపరీక్షలో రాష్ట్ర స్థాయి 2nd Rank సాధించి, హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివారు. MCh Final పరీక్షలలో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. ప్రతిభ, అణుకువ ఉంటే దేనినైనా సాధించవచ్చని మన డాక్టర్ గారు విద్యార్థి దశ నుండే నిరూపించి భావితరాలకు మార్గదర్శకులయ్యారు.

 వైద్యసేవలో నిష్ణాతుడు

అత్యధిక సంఖ్యలో లేజర్, లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసిన ఘనత డాక్టర్ సంజీవ్ కుమార్ ది. ప్రజల మనిషిగా, ఉత్తమ వైద్యులుగా పేరు గడించారు.  1990-1992 మధ్య కాలంలో  కర్నూలు నగరం నరసింగరావుపేటలో  బెంగుళూరు హాస్పిటల్అనే సర్జికల్ క్లినిక్ స్థాపించి, వేల సంఖ్యలో  శస్త్రచికిత్సలు నిర్వహించారు. రెండు వేల రూపాయలకే ఆపరేషన్అన్న నినాదంతో వేలాది మంది పేదల గుండెలలో  పేదల డాక్టరుగా నిలిచిపోయారు. 2000- 2005 మధ్య కాలంలో కర్నూలు నగరం జిప్సన్ కాలనీలో  బెంగుళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్అనే సర్జికల్ హాస్పిటల్ స్థాపించి యూరాలజీ, లాప్రోస్కోపిక్ విభాగాలలో పేరు గడించారు.

 2006 నుంచి 2022 వరకు

కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు కూడా అందించాలన్న సంకల్పంతో ఆయుష్మాన్ ద ఫ్యామిలీ హాస్పిటల్ను కర్నూలు వెంకటరమణ కాలనీలో స్థాపించారు. ఇది కార్పొరేట్ ఆస్పత్రి అయినా, ఫీజులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయి. అదే దీని ప్రత్యేకత. అది డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి మాత్రమే సాధ్యమైంది. పలు సర్జికల్ విభాగాలలో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ  ఆస్పత్రి ద్వారా ఆయన  ప్రజలకు బాగా చేరువయ్యారు. హస్తవాసి మంచిదిఅన్న పేరు పొందారు.పేద ప్రజలకు సంజీవనిని  అందిస్తూ తన పేరును  సార్థకం చేసుకున్నారు.

 వంశ పారంపర్యంగా సేవా తత్పరత

మానవ సేవే మాధవ సేవఅన్న భావం వారి రక్తంలోనే ఉంది.  అమ్మానాన్నల నుండి ఆయనకు అది వారసత్వంగా వచ్చింది. సమస్త దానాలలోకెల్లా గొప్ప దానం భూదానం. దాని ప్రాముఖ్యతను గుర్తించి శ్రీ శ్రీరంగంగారు తన సోదరులతో కలిసి పత్తికొండ గ్రామంలోని పెద్దల ఆస్తి  ఏడు ఎకరాల భూమిని 145 కుటుంబాలకు ఉచితంగా ఇచ్చారు. అదే నేడు ఆంజనేయ నగర్గా రూపుదిద్దుకొని పత్తికొండ పాతపేటలో ఉంది. సమాజంలో వెనుకబడిన వర్గాలవారిని ఆదరించడంలో తాము ముందుంటామని నిరూపించుకున్న కుటుంబం డాక్టర్ గారిది.

 పేదప్రజల గుండె చప్పుడు డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్

తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పేద ప్రజల గుండె చప్పుడై  పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పెన్షన్లు: మిత్రుడు వేమయ్య, సోదరుడు అచ్యుతరావుతో కలిసి గత రెండున్నర సంవత్సరాలుగా 30 నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 1000/- చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.

 ఉచిత వైద్య శిబిరాలు ఉచిత శస్త్రచికిత్సలు : ఆరోగ్యమే మహాభాగ్యంఅన్న సూత్రాన్ని గుర్తించిన డాక్టరు గారు 2008 నుండి 2016  వరకు ఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపీణీ  చేశారు.

 2016లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున మెడికల్ క్యాంపులు : ఆనంద జ్యోతి సేవా ట్రస్ట్, బుట్టా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒకే రోజు ఏడు ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా 7,520 మందికి ఉచిత వైద్యం అందించారు. వలసలకు పేరొందిన కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ, పత్తికొండ గ్రామాలలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

 ఆనందజ్యోతి పథకం-100 ఉచిత క్యాంపులు 500 ఉచిత ఆపరేషన్లు : 2018లో ఈ పథకం ప్రారంభించారు. ఇప్పటివరకు 62 ఉచిత సర్జరీ క్యాంపులు నిర్వహించి, 375 ఉచిత ఆపరేషన్లు చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో లేనివ్యాధులకు కూడా ఈ పథకం ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు:  మనిషిలో దాగిన శక్తిని వెలికి తీయటకు గల ఏకైక మార్గం ప్రోత్సాహకాలివ్వడం.ప్రతి సంవత్సరం పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు  ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి  బాసటగా నిలుస్తున్నారు. 2016 MBBS ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో  1ST RANK సాధించిన  మాచాని హేమలతకు మిత్రులతో కలిసి పౌర సన్మానం చేశారు. రాజకీయ ఉద్దండులు, మేధావులు, వేలాది  మంది జొహరాపురం ప్రజలు ఆమెను దీవించారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఆణిముత్యాన్ని గౌరవించి బడుగు బలహీన వర్గాలలో మనోధైర్యాన్ని నింపారు.

ఉద్యోగమేళాలు:  పలు ఉద్యోగమేళాల ద్వారా నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.

పోటీ పరీక్షలకు కోచింగ్: ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకింగ్, సివిల్స్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ఇప్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

వివాహ పరిచయ వేదికలు: గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వివాహ పరిచయ వేదికలు నిర్వహించారు.

ఆపత్కర పరిస్థితులలో మానవత్వం :  కర్నూలు వరదల సమయంలో వందల మందికి ఆయుష్మాన్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించి భోజన వసతి సమకూర్చారు. ఉచిత వైద్య సేవలు అందించారు. "ఆపద సమయాలలో వెన్ను తట్టి నిలిచి ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు"  అని నిరూపించారు.

సంఘ సేవ:  కుల సంఘాలలో, బలహీన వర్గాలలో ఐకమత్యం సాధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని  13 జిల్లాలు పర్యటించి సంఘీయులను విశేషంగా చైతన్య పరిచారు. కర్నూలు ఫోర్ట్ లయిన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.

లలిత కళలలో ఉచిత శిక్షణ : తన చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం ఆయనది. కులమతాలు, ఆర్థిక స్తోమతలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు లలితకళలలో, POPA ద్వారా, ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయి ఉద్యోగస్తులు కూడా  తమ పిల్లలను ఈ శిక్షణా తరగతులకు పంపిస్తున్నారంటే శిక్షణా ప్రమాణాల స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. తోటి మానవులకు సేవ  చేయటమే తన జీవన విధానంగా చేసుకున్న డాక్టర్ గారు అన్ని వర్గాల వారికి ఆత్మబంధువు అయ్యారు. సేవలతో సమాజ నిర్మాణానికి నడుంకట్టి ముందడుగు వేస్తున్న డా. సంజీవ్ కుమార్ గారు ఆదర్శప్రాయులు.

 రాజకీయరంగ ప్రవేశం

శింగరి శ్రీరంగ వంశాబ్ద  శింగరి సంజీవ కుమార్ శ్రీరంగం రంగమ్మల పుత్ర రత్నం! ఆయన పేరులోనే ఆదర్శం, సేవా గుణం సమ్మిళతములై ప్రకాశిస్తున్నాయి. అందుకే జీవం పొసే సంజీవ కుమార్గా, ప్రముఖ వైద్యులుగా కీర్తి గడించారు. సామాన్యుల కష్టాలు గుర్తెరిగిన కుటుంబం వారిది. అందుకే వంశపారంపరంగా వచ్చిన పొలాన్ని నిలువనీడ లేక నిరాశ్రయులైన వారికి వారి పెద్దలు ధారాదత్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదప్రజల ఇళ్లలో దీపం వెలిగించారు. గాంధీ జయంతి రోజున గాంధేయవాదిగా 'ఆనంద జ్యోతి ట్రస్ట్'ను నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ట్రస్ట్ ద్వారా కర్నూలు ఆడపడుచుల జీవితాల్లో ఆనందాన్నినింపారు సంజీవ్ కుమార్, వసుంధర దంపతులు. శ్రీమతి డాక్టర్ వసుంధర స్త్రీవ్యాధి నిపుణురాలిగా పేదమహిళలకు ఉచితంగా వైద్యం చేస్తూ మహిళలకు విశేష సేవచేస్తున్నారు. నిజాయితీగా వైద్య సేవలు చేస్తూ సామాన్యులకు చేరువయ్యారు. బెంగళూరు హాస్పిటల్లో  రెండు వేలకే శస్త్ర చికిత్సలు నిర్వహించి పేదల డాక్టరుగా  ఖ్యాతి గడించారు. నమ్మకానికీ, నైపుణ్యానికీ  మారు పేరుగా వెలిసింది ఆయుష్మాన్ హాస్పిటల్’.  చిన్న-పెద్ద, బీద-ధనిక అను వ్యత్యాసం చూపకుండా, 'నేను మీ అందరి వాడిని' అని నిరూపించుకున్నారు. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భాయి భాయి అన్న నినాదంతో అన్ని కులాలను, మతాలను, వర్గాలను ఏకం చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఎందరో  కళాకారులను, సామాజిక కార్యకర్తలను, యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు చేయూత నిస్తున్నారు.  డాక్టర్ సంజీవ్ కుమార్ రాజకీయాలలో స్థిరపడి, ప్రజలకు ఇంకా చేరువై సేవచేయాలని 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. లోక్ సభ సభ్యుడయ్యారు. రాజకీయాలలో కొనసాగాలన్న ఉద్దేశ్యంతో   హాస్పిటల్ ను 2022లో మూసివేశారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...