Mar 19, 2024

వైసీపీ వ్యూహాలు ఫలించేనా?


2024 ఎన్నికల శంఖారావం మోగింది. ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాలను రోజుకో రకంగా మార్చివేస్తోంది.  ట్విస్టులపై ట్విస్టులు ఇస్తోంది.  ఒంటరిగా పోటీ చేయడమే గాక, సింహం సింగిల్ గానే వస్తుందని ప్రచారం చేసుకుంటుంది. అంతకు మించిన విషయం ఏమిటంటే, ఈ ఎన్నికల్లో  ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ప్రకటించి చరిత్ర సృష్టించింది. అలాగే, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది.  ఎమ్మెల్యే స్థానాలు  బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 కేటాయించింది. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మహిళలు 19 మంది, మైనార్టీలు ఏడుగురు ఉన్నారు.  11 ఎంపీ స్థానాల్లో బీసీ అభ్యర్థులను ప్రకటించింది. ఇదో రికార్డ్. ఎంపీ అభ్యర్థుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారు. వైసీపీ జాబితాలో సామాజిక సమీకరణాలు బాగా పాటించారన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఆ పార్టీకి బాగా కలిసివచ్చే అవకాశం.


టీడీపీ బీసీల పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వైసీపీ మాత్రం మొదటి నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి దగ్గర నుంచి, రాజ్యసభ సభ్యులు, శాసనస మండలి సభ్యులు,  అనేక నామినేటెడ్ పోస్టులలో బీసీలకు భారీ స్థాయిలో అవకాశాలు కల్పించింది. ఎప్పుడూ అధికారం పొందని కులాలకు కూడా అవకాశం ఇచ్చింది. అలాగే, నిధులు లేకపోయినా కొత్త కార్పోరేషన్లు ఏర్పాటు చేసింది. అధికారాలు లేని ఉత్తుత్తి పదవులైనా, తమను గుర్తించి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్న భావన బీసీ వర్గాల్లో ఉంది.  ఈ అంశాన్ని వైసీపీ విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటోంది. ఆ మేరకు బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి వైసీపీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. టీడీపీ మాత్రం అవకాశం ఉన్నప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులలో బీసీలను నియమించలేదన్న విమర్శను ఎదుర్కొంటోంది. టీడీపీ హయాంలో కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకుండా వదిలివేసింది, అర్హులు ఉన్నా బీసీలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే, వైసీపీలో అధినేత జగన్ తర్వాత ద్వితీయశ్రేణి నాయకులు విజయశాయిరెడ్డి, మిధున్ రెడ్డి, రామచంద్రారెడ్డి... ఇలా ఆ సామాజిక వర్గం వారే కనిపిస్తారు. నామ మాత్రపు పదవులు మాత్రం బీసీలకు, ఎస్సీలకు గణనీయంగా ఇచ్చారు.  అదే టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ద్వితీయశ్రేణి నాయకులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు వంటి బీసీ నేతలే ఉంటారు. అలా కొద్ది మందికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చేవారు.  కానీ, ఇతర పదవుల విషయానికి వచ్చేసరికి బీసీలకు ప్రధాన్యత ఇవ్వలేదన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఓ సారూప్యత ఉంది.  ఇద్దరూ తమ పక్కన ఉండే నాయకులు ఎవరైనా, వారి మాట వినరు. తమ ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళతారు. అధికారుల విషయంలో మాత్రం ఇద్దరూ ఒక్కటి కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారుల మాట కూడా అసలు వినరు. తన ధోరణిలోనే పోతారు.  చంద్రబాబు నాయుడు మాత్రం అధికారుల మాట వింటారు.  



వైసీపీ అనుసరించిన మరో ముఖ్యమైన వ్యూహం ఏమిటంటే..  34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 14 మంది ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదు. కొందరు సిటింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చివేసింది.ఇటు పార్టీలోనూ, అటు ప్రతిపక్షాల్లోనూ ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.  కానీ, ఆ పార్టీకి అంతకుమించి మరో మార్గంలేదు. ఎందుకంటే, వైసీపీలో ఎక్కువ మంది మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్రజలలో పలుకుబడి అసలులేదు. అంతకు ముందు కాస్తో కూస్తో ఉన్నది కూడా పోయింది. వారు తమ తమ నియోకవర్గాలలో పనులు ఏమీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఏ పని చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రస్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో పాత వారికి టికెట్లు ఇస్తే, గెలిసే అవకాశం లేదని ఆ పార్టీ అధిష్టానం తెలుసుకుంది. వారికి టికెట్లు ఇవ్వకూడదని లేదా నియోజకవర్గాలు మార్చాలని నిర్ణయించింది. నియోజకవర్గం మారిస్తే, అక్కడ వారివి కొత్త ముఖాలవుతాయి. ఆ విధంగా లాభపడవచ్చన్నది వైసీపీ వ్యూహం. అది కాస్త ఫలించే అవకాశం ఉంది. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు తమని గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్మకం.  అందుకనే, ఈ వ్యూహాన్ని అనుసరించింది. టికెట్లు రాక కొందరు, అసంతృప్తితో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. నిజం చెప్పాలంటే, వైసీపీ అనుసరించిన ఈ వ్యూహం వారికి కూడా కలిసివచ్చింది. వైసీపీలో వారికి టికెట్లు ఇచ్చినా గెలిచే అవకాశంలేదు. ఇప్పుడు, వారు పార్టీలు మారడం, అక్కడ టికెట్లు పొందడం చెకచెకా జరిగిపోయాయి. ఇప్పుడు వారు కొత్తగా ‘‘వైసీపీలో మా చేతులు కట్టివేశారు. ఏం చేయలేకపోయాం’’ అని చెప్పుకుని పోటీ చేస్తారు. ఇలా అయితే, వారిలో కొందరు గెలిచే అవకాశం కూడా ఉంది. ఇక వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ కూటముల మేనిఫెస్టోల యుద్ధం మొదలు నాకుంది. వైసీపీ ఇంకెన్ని ట్విస్ట్ లు చేస్తుందో చూడాలి.    


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...