May 31, 2018


విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్ మెంట్
విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు

·       58 వేల కుటుంబాలకు ప్రయోజనం
·       15 ఏళ్ల లోపు సర్వీస్ ఉంటే 2 ఇంక్రిమెంట్లు
·       15 ఏళ్లకు మించి ఉంటే 3 ఇంక్రిమెంట్లు
·       32 మరణించిన కుటుంబాలవారికి ఉద్యోగాలు
·       పంపిణీ, సరఫరా నష్టం అతితక్కువతో దేశంలో నెంబర్ 1

             సచివాలయం, మే 31: విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చెప్పారు.  సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజల, ఉద్యోగుల పక్షపాతిగా పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి పీఆర్సీలో 30 శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్ ఇచ్చామన్నారు. గడచిన నాలుగేళ్లలో వినియోగదారులపై అదనంగా విద్యుత్ చార్జీల భారం మోపకుండానే ఉద్యోగులకు 25 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. 2018 పీఆర్సీ, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ కార్యదర్శులతో మాట్లాడి ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 31,543 ఉద్యోగులతోపాటు 26,493 మంది పెన్షన్ దారులు మొత్తం 58,036 మందికి అంటే అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని  వివరించారు. 15 ఏళ్ల లోపు  సర్వీస్ ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్ల దాటినవారికి మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. ఈ అంశంలో ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం సామరస్యపూరక వాతావరణంలో ఒక ఒప్పందానికి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకున్నందున ప్రభుత్వంపై అదనంగా రూ.860 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉద్యోగులను సంతృప్తి పరిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.  మరణించిన 32 మంది రెస్కో (గ్రామీణ విద్యుత్ సహకార సంఘం) ఉద్యోగుల కుటుంబాలలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 9 రెస్కోలు ఉన్నాయని, వాటిలో నష్టాలు వచ్చే ఏడిటిని ప్రభుత్వ శాఖలో కలిపివేసినట్లు చెప్పారు.
                 విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు అతి తక్కువతో దేశంలో మొదటి స్థానంలో మన రాష్ట్రం నిలిచిందని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. దేశంలో ఈ నష్టాలు 18 శాతంగా ఉందని, దానిని 15 శాతానికి తగ్గించాలని కేంద్ర నిర్ణయించిందని, అయితే మన రాష్ట్రంలో 9.72 శాతం మాత్రమే ఉందని వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణ ఫలితంగా, ఉద్యోగుల కృషి ఫలితంగా ఇది సాధించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. కొత్తగా చేపట్టే సంస్కరణల్లో విద్యుత్ ని నిల్వ చేసే యూనిట్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లా మక్కువలో, నెల్లూరు జిల్లాలో ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విండ్, సోలాల్ విద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టిపెట్టినట్లు తెలిపారు. విద్యుత్ సంస్కరణల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి కళా వెంకట్రావు అన్నారు.

సీఎం చంద్రబాబుకు, మంత్రి కళా వెంకట్రావుకు కృతజ్ఞతలు
              రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ విద్యుత్ రేట్లు కూడా పెంచకుండా తమకు 25 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ టి. చంద్రశేఖర్, కన్వీనర్ వేదవ్యాస్ లు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు  తగ్గించడానికి తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆందోళన ధోరణి లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ఒక అంగీకారం కుదిరినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. 2004లో 7 రెస్కోలు ప్రభుత్వంలో కలిశాయని, చనిపోయిన 32 మంది రెస్కో ఉద్యోగుల కుటుంబాల వారికి ఉద్యోగులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ శాఖలో సిబ్బంది కొరతగా ఉందని, సిబ్బందిని నియమించాలని కోరినట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై కూడా చర్చించామని రెండు రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వారు తెలిపారు.

May 30, 2018


ఎయిడ్స్ నియంత్రణకు విస్తృతంగా ప్రచారం
అధికారులను ఆదేశించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
Ø జూన్ 1 నుంచి తల్లిబిడ్డ రక్ష, ‘మీ ఎయిడ్స్ స్థితి’ కార్యక్రమాలు
Ø జూన్  15 నుంచి   గ్రామాలలోనే వైద్య పరీక్షలు
Ø శాఖల సమన్వయంతో ఎయిడ్స్ నియంత్రణ
Ø సాధికార మిత్రుల ద్వారా ప్రచారం 

               సచివాలయం, మే 30: రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులను ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ లో వైద్యఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో బువారం ఉదయం జరిగిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎయిడ్స్ కేసులు పెరిగిపోవడానికి కారణాలను తెలుసుకోవాలని, ఏ గ్రూపులవారు ఈ వ్యాధికి గురవుతున్నారో కనుగొనాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ఎయిడ్స్ ని నియంత్రించాలన్నారు. సాధికార మిత్రుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కార్యక్రమంలో దీనిని ఒక అంశంగా పరిగణించి ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్పారు. ఎయిడ్స్ రోగులు మందులు తీసుకోవడానికి ఎక్కువ దూరం వెళ్లకుండా వారికి అందుబాటులో  ఉంచాలని ఆదేశించారు. ఎక్కువగా గర్భిణీ మహిళలకు ఎయిడ్స్ వస్తుందని, బిడ్డకు కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉన్నందున భార్యభర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పారు. తల్లిబిడ్డ రక్ష కార్యక్రమం కింద జూన్ 1 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగా ప్రతి గర్భిణీకి హెచ్ఐవీ, సిఫిలెస్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలన్నారు. ‘మీ హెచ్ఐవీ స్థితి’ పేరుతో జూన్ 1 నుంచి నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రశ్నాపత్రం అందజేసి వివరాలు సేకరించాలన్నారు. జూన్ నెల 15 నుంచి స్వచ్ఛంద సంస్థల సిబ్బంది గ్రామాలకు వెళ్లి హెచ్ఐవీ పరిక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఎవరికైనా హెచ్ఐవీ ఉన్నట్లు తెలిస్తే వారిని ఆస్పత్రులకు తరలించాలని పూనం మాలకొండయ్య అన్నారు.
రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, సిబ్బంది, నిధులు, మందుల సరఫరా కేంద్రాలు, ఇతర రాష్ట్రాలలో పరిస్థితులు, స్వచ్ఛంద సంస్థల పనితీరు, ఆలిండియా రేడియో, దూరదర్శన్ లలో ప్రచారం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు.  ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.రాజేంద్రప్రసాద్, ఐఈసీ డిడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు
విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి కెఈ
Ø రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు
Ø చుక్కల భూముల క్రమబద్దీకరణకు 60 వేల దరఖాస్తులు
Ø  సమస్య పరిష్కారానికి జూన్ 13 నుంచి  స్పెషల్ డ్రైవ్
Ø ప్రభుత్వానికి రైతులే ప్రధానం, వారి సంతృప్తే ముఖ్యం
Ø బలవంతంగా భూములు లాక్కోం
Ø సైనికోద్యోగులకు ఇచ్చిన భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

                సచివాలయం, మే 30: రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాని పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, రిజిస్ట్రేషన్, దేవాదాయ) కెఈ కృష్ణమూర్తి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22- రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితా పరిష్కారం విషయంలోనూ, చుక్కల భూముల క్రమబద్దీకరణ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తామన్నారు. దశాబ్దాల నుండి పరిష్కారానికి నోచుకోని చుక్కల భూముల  సమస్యను  పరిష్కరించేందుకు  ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా,  ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. మన రాష్ట్రంలో  చుక్కల భూములు దాదాపు 24 లక్షలు ఎకరాల వరకు ఉన్నట్లు తెలిపారు.  ఈ భూములు అనుభవిస్తున్న వారికి హక్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. 2017 జూన్ 14న  చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టం అమల్లోకి వచ్చిందని,  దానికి సంబంధంచిన విధి విధానాలను ఖరారు చేస్తూ జూలై 17న 298 నెంబర్ జీఓ జారీ చేసినట్లు తెలిపారు. ఆ జీఓ ప్రకారం దరఖాస్తు చేసిన 6 నెలల లోగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన  జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు 60 వేల 164 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు చాలా తక్కువ పరిష్కారమయ్యాయని, అందువల్ల  స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పనిభారం, రెవెన్యూయేతర పనులు భారం వల్ల రెవెన్యూ సిబ్బంది 22 - , చుక్కల భూముల సమస్యల పరిష్కారంలో  కాలపరిమితి పాటించలేకపోయిందన్నారు. 22- విషయానికి వస్తే మొత్తం నిషేధిత భూముల జాబితా 5 విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఒకటి 22ఏ(1)(ఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ద్వారా  నిషేధించబడిన భూములని, రెండు 22ఏ(1)(బి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములని, మూడు 22(1)(సి) దేవాదాయ, వక్ఫ్ భూములని, నాలుగు 22(1)(డి) అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, అగ్రికల్చర్ ల్యాండ్ సీనింగ్ మిగులు భూములని, అయిదు 22(1)(ఇ) ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములని వివరించారు.  ఎవరైనా రైతులు తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించుకోవాలంటే జాబితా 1,2,4 లకు సంబంధించి కలెక్టర్ కు,  జాబితా 3 కు సంబంధించిన భూముల విషయంలో దేవాదాయ శాఖ కమీషనర్ లేదా  వక్ఫ్ బోర్డు కార్యదర్శికి, 5 కు సంబంధించిన భూములైతే  రాష్ట్ర స్థాయి కమిటీకి అర్జీలు ఇవ్వాలన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మీ-సేవ సర్వీసును ప్రారంభించామని, అక్కడ అర్జీ ఇస్తే సంబంధిత అధికారికి వెళుతుందని, ఆ అధికారి తక్షణం చర్యలు తీసుకుంటారని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతం చేసేందుకు మూడు నెలల పాటు రెవెన్యూ అధికారులకు రెవెన్యూయేతర పనులు అప్పగించ వద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. నిషేధిత జాబితా నుండి భూమిని తొలగించాలంటే కలెక్టర్ నివేదిక ఆధారంగా  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ  ఉత్తర్వులు ఇస్తారని,  ఇది జాప్యానికి కారణమవుతున్నందున 22- జాబితా నుంచి తొలగించే అధికారం సంబంధిత కలెక్టర్ కు  ఇస్తూ ఏప్రిల్ 13న  ఉత్తర్వులు ఇచ్చామన్నారు.    ఇక నుంచి ఏవైనా సర్వే నెంబర్లు 22- జాబితాలో చేర్చాలంటే తప్పనిసరిగా సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చి, వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
        చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) వారం వారం జరిపే వీడియో కన్ఫరెన్స్ ద్వారా 22- నిషేధిత భూముల జాబితా తయారీ, చుక్కల భూముల సమస్య పరిష్కార పరోగతిపై  సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా జూన్ 13 నుంచి 30 వరకు  స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్డీఓ,  తాహశీల్దార్లు  వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు.  సమస్యను పరిష్కరించేందుకు మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమం తరహాలో ప్రత్యేక పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్, అటవీ, సర్వే అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో నిషేధిత జాబితాను గ్రామ స్థాయిలో పంచాయితీ లేదా రెవెన్యూ కార్యాలయాల్లో ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిషేధిత జాబితాపై ప్రజల నుంచి రెవెన్యూ సిబ్బంది లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరిస్తారని,   అలాగే రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధికారులే  స్వయంగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు లేవనే కారణం చూపి 22- జాబితాను అప్ డేట్  చేయట్లేదని, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎస్ఎస్ అండ్ ఎల్ ఆర్  వారి దగ్గర ఉన్న భూమి రికార్డులు లేదా ప్రస్తుతం ఆ సర్వే నెంబర్ లో ఎవరు సాగు చేస్తున్నారు, ఎంతకాలం నుంచి సాగు చేసుకుంటున్నారు అనే విషయం  పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరిస్తామన్నారు. మొదటి దశలో నిషేధిత జాబితా ముడిపడి ఉన్న శాఖల అధికారులతో గ్రామసభ ఏర్పాటు చేసి పరిష్కరించదగినవి అక్కడికక్కడే పరిష్కరించి, జాబితాను రూపొందిస్తారని చెప్పారు. గ్రామసభలో పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్ర స్థాయి కమిటీలకు సి.సి.ఎల్.ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే డిపార్ట్ మెంట్ లోని సీనియర్ అధికారులు నేతృత్వం వహిస్తారని, ఈ కమిటీలు  జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పరిష్కారం చూపిస్తాయన్నారు. దానికి అనుగుణంగా కలెక్టర్ తుది జాబితాను సిద్థం చేస్తారన్నారు.
                      స్పెషల్  డ్రైవ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని,  ఏ గ్రామాల్లో ఎప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తారో,  షెడ్యూల్ ను పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రభుత్వపరంగా  రావాల్సిన చుక్కల భూములు తాహశీల్దార్లు గుర్తించి,  వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపించాలన్నారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకి సంబంధించి జిల్లా కమిటీల నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు వుంటే 90 రోజుల్లోగా సీసీఎల్ఏ దరకాస్తు  చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు.  దీనిపై సీసీఎల్ఏ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అలాగే  ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సైనికోద్యోగులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.  నిర్ధిష్ఠ  సర్వే నెంబర్ గురించి  అభ్యంతరాలు వుంటే అటువంటి భూముల వివరాలను గ్రామాల్లో ప్రకటించాలని, మిగిలిన భూములను అభ్యంతరాలు లేనివిగా గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. 1954 సంవత్సరం ఏ నిబంధనలు లేకుండా అసైన్డ్ చేసిన భూములను 22- జాబితా నుంచి తొలగించే ప్రతిపాదన  ప్రభుత్వ పరిశీలనలో వుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం - 2017
                 నూతన రాష్ట్ర అవసరాల నిమిత్తం 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం 12 సవరణలకు కేంద్ర ప్రభుత్వం యథాతథంగా  ఆమోదించినందుకు ఉప ముఖ్యమంత్రి  సంతోషం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లు 2017( నెం.32/2017 ) ని శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన తరువాత  నవంబర్ 12 ,2017న కేంద్ర ప్రభుత్వానికి  పంపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  ఈ చట్టాన్ని  రూపొందించడం జరిగిందన్నారు. ప్రతిపాదించిన సవరణలను కేంద్రం ఆమోదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ముఖ్యమైన విద్య, వైద్య, సాంకేతిక సంస్థలకు, రహదారులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన  సాగునీటి ప్రాజెక్టుల కొరకు భూములను సిద్దంగా ఉంచగలుగుతామని చెప్పారు.  రైతులకు సముచిత పరిహారం, పునరావాస కల్పన, పునర్ నిర్ధారణ నిబంధనలలో రాజీపడకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సవరించామన్నారు. ప్రజాప్రయోజనాలను ఆశించి ప్రభుత్వం అవసరం ఉన్నచోటల్లా రైతులను ఒప్పించి నేరుగా భూములను సేకరించవచ్చని,  దీని వల్ల త్వరితగతిన  ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతామని చెప్పారు. జిల్లా కలెక్టర్ లేక ప్రభుత్వం నియమించిన అధికారి ఆసక్తి ఉన్న రైతులతో లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంటారని,  దీన్ని ఆధారంగా చేసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అట్టి భూములు కొనుగోలు చేశాక ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొనే అవసరం ఉండదని,  గెజిట్ లో ప్రచురించిన తేదీ నుంచి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తారని కెఈ చెప్పారు. రైతులకు ఒకే సారి ఏకమొత్తంలో  డబ్బులు చెల్లిస్తారని, సదరు భూమార్పిడి వల్ల భూయజమాని కాకుండా మరే కుటుంబమైనా నష్టపోతే వారికి కూడా పునరావాసం  కింద  ఏక మొత్తంలో చెల్లిస్తారని తెలిపారు. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో కన్సెంట్ అవార్డుకు అవకాశం లేదని,  ప్రస్తుత రాష్ట్ర సవరణ బిల్లులో సెక్షన్ 23 కింద కలెక్టర్ కన్సెంట్ అవార్డు ఉండాలని ప్రతిపాదించామన్నారు. భూసేకరణ ధర ఖరారు చేసిన తరువాత నిర్వాసితులు ఆ ధరకు అంగీకరిస్తే ఇక అదే ఖరారవుతుందని చెప్పారు. భూసేకరణ సందర్భంగా ఎవరైనా వ్యక్తికి పొరపాటుగా నష్టపరిహారం చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్య తీసుకొనవచ్చుని తెలిపారు. ఏదైనా భూమి కేంద్ర భూసేకరణ చట్టం కింద సేకరిస్తే సదరు భూమిని 5 సంవత్సరాల లోపల లేదా ప్రాజెక్టు నిర్దేశిత కాలవ్యవధి, ఏది తరువాత  అయితే దానిని పరిగణలోనికి తీసుకుంటారని చెప్పారు.    ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం-2017 రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం పట్ల ఎవరూ అపోహ పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ‘‘మాకు రైతులే ప్రధానం, వారి సంతృప్తి మేరకే సముచిత నష్టపరిహారం చెల్లించిన తరువాత మాత్రమే భూసేకరణ జరుగుతుంది. బలవంతంగా భూములను లాక్కునే చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడదు’’ అని కెఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) అనీల్ చంద్ర పునీఠా, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ పాల్గొన్నారు.

May 25, 2018


‘ఆపరేషన్ గరుడ’లో భాగమే రమణదీక్షితులు ఆరోపణలు
బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య
v ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి
v ఈ నాటకానికి కర్త, కర్మ, క్రియ అమిత్ షా
v అర్చకులు జీతాలు రెట్టింపు చేసిన ఘతన బాబుదే!
v తొలిసారిగా  బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు
v 92 వేల పేద బ్రాహ్మణులకు లబ్ధి
               సచివాలయం, మే 25: భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న నాటకం ‘ఆపరేషన్ గరుడ’లో భాగమే టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ఆరోపణలని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. టీటీడీ ఆలయ పవిత్రతకు భంగం కలిగేవిధంగా వారు వ్యవహరిస్తున్నరన్నారు. దీక్షితులు వీఐపీ భక్తులకు ప్రత్యేక పూజలు జరిపించి, వారి సేవలో తరించేవాడన్నారు. 1952లో నమోదు చేసిన రికార్డుల ప్రకారం పింక్ డైమండ్ అనేది లేదన్నారు. పోటు సంపెంగ ప్రాకారం దక్షిణంవైపు మార్చడానికి ఆగమ శాస్త్రం ప్రకారం అభ్యంతరం ఏమీ ఉండదలని 1999లో దీక్షితులు స్వహస్తాలతో రాసి ఇచ్చారని తెలిపారు. ప్రధాన ఆలయానికి, వేయి కాళ్ల మండపానికి సంబంధంలేదని, దానికి కూల్చివేయడానికి అభ్యంతరం ఏమీలేదని ఆనాడు దీక్షితులు సంతకం చేసి ఇచ్చిన పత్రం ఉందన్నారు. దేవస్థానం అనుమతిలేకుండా ఆయన ప్రైవేటుగా యాగాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ఏడు కొండలు దేనికి రెండు కొండలు చాలు అని జీఓ తీసుకువచ్చినప్పుడు దీక్షితులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏడు కొండలివాడితో పెట్టుకున్నవారు ఏమైపోయారో అందరికీ తెలుసన్నారు. స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్టింగ్ నుంచి బయటపడ్డారని చెప్పారు.  సాటి అనువంశిక అర్చకులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని, వారికి ఇబ్బందికరమైన డ్యూటీలు వేసి, సెలవులు మంజూరు చేయకుండా వేధించేవారని తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమాలలో వారిని పాల్గొనకుండా చేసేవారని, ఏకపక్ష నిర్ణయాలతో  వారిని అవమానించి అవహేళన చేసేవారని  ఆరోపించారు. దీక్షితులు జీవన విధానం, వ్యవహార శైలి కూడా అభ్యంతరకరంగా ఉంటుందని, టీ షర్టులు వేసుకొని తిరిగేవారని, చెన్నై వెళితే ఆడి, బీఎండబ్లూ వంటి కార్లలో తిరుగుతూ భోగాలు అనుభవిస్తారని విమర్శించారు. దీక్షితులు ఆడే నాటకానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అమిత్ షా అన్నారు. ఈ నాటకం ఆపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సమర్ధుడై నాయకుడుగా పేర్కొన్నారు. నాటకాలు కట్టిపెట్టకపోతే కేసులు పెడతాం కబడ్ధార్ అని  దీక్షితులు, ఐవైఆర్ లను హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలన్నారు.
ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి
          ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి అని, అన్నం పెట్టిన చేతినే కరిచిన విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన ‘ఎవరు రాజధాని అమరావతి?’ అనే పుస్తకం రాయడాన్ని నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే అన్ని కులాలవారితోపాటు బ్రాహ్మణ యువతకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. టీటీడి పరిధిలోని పురాతన దేవాలయాల నిర్వహణ కేంద్ర పురావస్తు శాఖ చేపట్టాలని కేంద్రానికి నివేదిక పంపిన ద్రోహి ఐవైఆర్ అన్నారు.
తొలిసారిగా  బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రాహ్మణుల గురించి ఆలోచించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. తొలిసారిగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం నిధులు కేటాయించారని చెప్పారు. ఇప్పటి వరకు రూ.215 కోట్లు మంజూరు చేశారని, ఈ ఏడాదికి మరో రూ.85 కోట్లు కేటాయించారని చెప్పారు. వివిధ పథకాల ద్వారా 92వేల మంది పేద బ్రాహ్మణులు లబ్ది పొందినట్లు తెలిపారు. అర్చకులు జీతాలు రెట్టింపు చేసిన ఘతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. 65 ఏళ్ల నిబంధన అనేది టీటీడీకి మాత్రమే వర్తిస్తుందని, రాష్ట్రంలోని అర్చకులు ఓపిక ఉన్నంతవరకు కొనసాగవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూపదీప నైవేధ్యాలకు ప్రతేక నిధులు కూడా ఆయనే కేటాయించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులకు చేసిన మేలు మరువలేనిదన్నారు. దీక్షితులు, ఐవైఆర్ ఇద్దరూ బ్రాహ్మణులను టీడీపీ నుంచి వేరు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలించవని ఆనంద సూర్య చెప్పారు.

May 24, 2018


ప్రకృతి వ్యవసాయం ద్వారా
రసాయన రహిత ఆహారం, పర్యావరణ పరిరక్షణ
ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు విజయకుమార్

Ø 5 లక్షల మంది రైతులు, 1.25 లక్షల హెక్టార్లు లక్ష్యం
Ø 6 ఏళ్లలో రూ.16,134 కోట్లు వ్యయం
Ø భవిష్యత్ ప్రణాళిక జూన్ 2న  ప్రకటన
Ø జూన్ 5న దేశంలోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం
Ø త్వరలో యాప్ రూపకల్పన

             సచివాలయం, మే24: ప్రకృతి వ్యవసాయం రసాయన రహిత పౌష్టికాహారం అందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు, రైతు సంక్షేమానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు టి.విజయకుమార్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. అటు రైతులకు, ఇటు ప్రజలకు, పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2015 సెప్టెంబర్ లో దీనిని ప్రవేశపెట్టామని,  2016 ఖరీఫ్ లో  అమలు చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. 2018 నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 972 గ్రామాల్లో 63 వేల హెక్టార్లలో ఈ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తున్నట్లు వివరించారు. రైతులను చైతన్యపరచి, ఈ వ్యవసాయం పట్ల వారికి అవగాహన కల్పించి 2018-19లో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ పద్దతిలో సాగుచేయించదలచినట్లు చెప్పారు. ఈ ఏడాది మూడు వేల గ్రామాల్లో 5 లక్షల మంది రైతుల చేత 1.25 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడం ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పద్దతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరేళ్లలో ఇందు కోసం రూ.16,134 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.  ఈ వ్యవసాయం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కవ వస్తుందన్నారు. ప్రజలకు రసాయన రహిత ఆహారంతోపాటు రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. ఒక నెల రోజులపాటు వర్షాలు కురవకపోయినా ఈ వ్యవసాయపద్దతిలో పంటలకు నష్టం ఉండదని, దీనికి నీరు తక్కువ అవసరం ఉంటుందని తెలిపారు. భూమిలోనే సారం ఎక్కువగా ఉంటుదని, పోషకవిలువలు అన్నీ ఉంటాయని, అవే ఉపయోగపడతాయని వివరించారు. ఈ వ్యవసాయం ద్వారా రైతుకు 13 రెట్లు ఆదాయం ఎక్కవ వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఈ విధానినికి మారడానికి అయిదేళ్లయినా సమయం పడుతుందని, ఆ లోపు రైతు సంఘాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సమాయత్తం చేస్తామన్నారు.

త్వరలో మొబైల్ యాప్
              త్వరలో ఒక మొబైల్ యాప్ ను రూపొందించి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగపడేవిధంగా వివరాలు అందిస్తామని చెప్పారు. విత్తన దశ నుంచి పంట కోత దశ వరకు ఆయా పంటలకు రైతులు అనుసరించిన పద్దతులు, వాడిన సహజ ఎరువుల వివరాలు అందులో పొందుపరిచే ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ పద్దతి ద్వారా ఇతర రైతులకు ఆ వివరాలు తెలియడంతోపాటు, వినియోగదారులకు కూడా ఆ పంటలకు ఎటువంటి సహజసిద్ధ ఎరువులు వాడింది తెలుస్తుందన్నారు. జనవరిలో మన రాష్ట్రంలోని రైతులకు సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ 9 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయలో శిక్షణ ఇచ్చి ఎంతో సహాయపడినట్లు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ వ్యవసాయ పద్దతులకు కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించినట్లు తెలిపారు. రైతులకు ఆదాయం ఎక్కువ రావడానికి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ ద్వారా అమ్మకాలు జరుపుతామన్నారు. మహిళా సంఘాల ద్వారా మార్కెటింగ్ చేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. సచివాలయంలో కూడా ఒక స్టాల్ పెట్టే ప్రతిపాదనను పరిశీలించమని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తృత పరచడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగం వారు సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. బీఎన్ పీ పారిబాస్ బ్యాంకువారు కూడా సహకరిస్తున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పులకు తట్టుకోవడంలో ప్రకృతి వ్యవసాయం ఉత్తమైనదిగా పేర్కొన్నారు. ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

జూన్ 5న భారత్ లోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం
             ఈ ఏడాది జూన్ 5న భారత్ లోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపనున్నట్లు విజయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 2వ తేదీన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, సమ్మిళిత అభివృద్ధి ప్రపంచ వ్యాపార మండలి అధ్యక్షులు సన్నీ వర్గీస్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నాచుర్ అంతర్జాతీయ అధ్యక్షుడు పవన్ సుఖ్ దేవ్, పీఎన్ బీ పారిబాస్ గ్లోబల్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు ఆంటోని సిరే తదితరులు మన రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. ఆ రోజున గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎందురుగా బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 నాటికి 60 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించే విధంగా రూపొందించిన ప్రణాళికను ప్రకటిస్తారని చెప్పారు.  ఆ రోజున యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగంతో ఒక ఒప్పొందం కూడా చేసుకోనున్నట్లు విజయకుమార్  తెలిపారు.

May 23, 2018


అమిత్ షా వ్యాఖ్యలు లౌకిక స్వరూపానికి ప్రమాదకరం
ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు

                సచివాలయం, మే 23: దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, లౌకిక స్వరూప రక్షణకు ప్రార్థనలు చేయమన్న ఢిల్లీలోని ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని టీడీపీ ఖండిస్తున్నట్లు ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. వివిధ మతాలు, భాషలు, కులాలు, వర్గాలు ఉన్న భారతదేశ లౌకిక స్వరూపానికి ఆయన వ్యాఖ్యలు  ప్రమాదకరం అన్నారు. ఈ దేశంలో అట్టడుగున ఉన్న అనేక వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందలేదన్నారు. అందరూ సమానంగా అభివృద్ధి చెంది కుల రహిత సమాజం ఏర్పడాలన్నదే డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గాయపడ్డ హృదయాలు, వ్యక్తులు, సంస్థలు గొంతెత్తి మాట్లాడతాయని, అందులో భాగంగానే జోసఫ్ దేశం కోసం ప్రార్థనలు చేయమన్నారని చెప్పారు. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 2019లో ఏర్పడే ప్రభుత్వం అన్నారేగాని, ఏ ప్రభుత్వమో ఆయన ప్రస్తావించకపోయినా అమిత్ షా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని, ఆయనకు భయం ఎందుకని ప్రశ్నించారు. కుల, మత, వర్గ వివక్షలేదని ఆయన చెబుతున్నారని, అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ పేరుతో వివక్ష కొనసాగుతుందన్నారు. క్రైస్తవులు శాంతి కాముకులని, వారు ప్రార్ధనలు మాత్రమే చేస్తారని చెప్పారు.

                 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, టీడీపీ నేతలు గానీ ఎవరూ జోసఫ్ వ్యాఖ్యలపై మాట్లాడలేదని, అయినా మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించడం సరికాదని అమిత్ షా అనడంలో అర్ధంలేదన్నారు. అంబేద్కర ఆశయాలకు అనుగుణంగా అన్ని మతాలు, కులాల వారు ఎదగాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా పేర్కొన్నారు. ఎస్సీలతో సమానంగా దళిత క్రైస్తవులకు కూడా సౌకర్యాలు కల్పించాలని ఏప్రిల్ 14న తీర్మానం చేశారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగానికి కట్టుబడిన లౌకికవాద రాజకీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. బిజేపీని మతమౌఢ్యంతో సామ్రాజ్యవాద కాంక్షతో వ్యవహరించే పార్టీగా పేర్కొన్నారు. మతవాదులుగా ముద్రపడితే మీకే నష్టం అని ఆయన బిజేపీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వాలకు సేవాదృక్పదం ఉండటం అవసరం అన్నారు. కర్నాటక ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చెక్ పెట్టినా బీజేపీకి బుద్ధిరాలేదా అని ప్రశ్నించారు. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ డబ్బుని విచ్చలవిడి ఖర్చుచేసిందని, గిరిజనులను రెచ్చగొట్టిందని ఆరోపించారు.

                 ప్రజాస్వామ్యవాదులను ఒకటిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలను చూసి బీజేపీ సహించలేకపోతోందన్నారు. రాజ్యాంగానికి విలువ ఇస్తూ సమసమాజ సిద్ధాంతం కోసం టిడిపి పని చేస్తుందన్నారు. తమ పార్టీ ఒక మతానికి, ఒక వర్గానికి కొమ్ముకాయదని స్పష్టం చేశారు. బిజేపీ వికృత క్రీడలకు నాయకత్వం వహిస్తోందని విమర్శించారు.  ఆ పార్టీకి గడ్డు కాలం వచ్చిందన్నారు.

                 వైఎస్ఆర్ సీపీ నేతలు ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతారని, ఢిల్లీలో బైబిల్ కు వ్యతిరేకులతో చేయి కలుపుతారని విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ వైఖరి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసుల నుంచి బయటపడటానికి ఆ పార్టీని బీజేపీలో కలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ క్రైస్తవులకు అండగా ఉంటుందని జూపూడి చెప్పారు.

May 22, 2018


రొయ్యల పెంపకందారుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఆ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష

Ø రొయ్యల మార్కెట్ విస్తృత పరచాలి
Ø ఎగుమతులు పెంచాలి
Ø రుణాలు ఇచ్చే అవకాశాలు పరిశీలన
Ø ధరలు పడిపోకుండా చర్యలు 

               సచివాలయం, మే 21: సముద్ర ఉత్పత్తులు, రొయ్యల వ్యాపారాన్ని విస్తృతంచేసి అమ్మకాలను, ఎగుమతులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన సముద్ర ఉత్పత్తులు, ముఖ్యంగా చెరువులలో రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులపై జరిగిన  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల ధరలు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధర తగ్గడం, యాంటిబయాటిక్స్ వాడకం వల్ల ఎగుమతులను తిరస్కరిచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఈ పరిస్థితులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, కేంద ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎంపెడా అధికారులతో సీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మన రొయ్యల అమ్మకాల మార్కెట్ ని అంతర్జాతీయంగా విస్తరింపజేసి ఎగుమతులను పెంచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు. యాంటిబయాటిక్స్ వాడకుండా రైతులకు అవగాహన కలిగించాలన్నారు.

         గత ఏడాది కిలో రూ.500 ఉన్న రొయ్యల ధరలు రూ.380 లకు పడిపోయినట్లు అధికారులు సీఎస్ కు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో మనకు పోటీగా ఉన్న ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలలో ఉత్పత్తి పెరిగిందని తెలిపారు.  దాంతో వారు ధరలు తగ్గించి ఎగుమతులు చేయడంతో వారి ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, రష్యాలలో మార్కెట్ పెద్దగాలేదన్నారు.  అంతేకాకుండా మన దేశంలో కూడా ఒడిషా, పశ్చిమబెంగాల్, గుజరాత్, తమిళనాడులలో ఉత్పత్తి పెరిందని చెప్పారు. యాంటి బయాటిక్స్ వాడకం వల్ల మన ఎగుమతులను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దానికి తోడు అమెరికాలో యాంటి డంపింగ్ డ్యూటీని 0.84 శాతం నుంచి 2.34 శాతానికి పెంచడం వల్ల కూడా ఎగుమతులు తగ్గినట్లు వివరించారు. మన రాష్ట్రంలో కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసే పొడిలో యాంటిబయాటిక్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

           ఈ పరిస్థితులలో అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ని విస్తృతపరచి ఎగుమతులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ కోరారు. అలాగే ధరలు పడిపోకుండా, రైతులు నష్టపోకుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రైతులకు ఇచ్చే మాదిరిగా రొయ్యల సాగు చేసేవారికి రుణాలు ఇచ్చే అవకాశం ఉందేమో మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. యాంటిబయాటిక్స్ ఉన్న పౌడర్ ని తయారుచేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రొయ్యల సాగుని, దాని ద్వారా విస్తరించే నీటి, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని అధికారును ఆదేశించారు. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యల సాగు వల్ల తలెత్తే కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించి ఆక్వా విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమైన యాంటిబయాటిక్ వాడకాన్ని నిరోధించాలని చెప్పారు. నాణ్యమైన రొయ్యల ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు వారు కాలువల నీటిలో కాలుష్య స్థాయిలను పరీక్షించాలని ఆదేశించారు. బోర్లను ఏపీవాల్టా(నీటి భూమి, చెట్ల చట్టం) ప్రకారం నియంత్రించాలన్నారు.
చేపలు, రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతులు, ఎగుమతులలో పోటీ, ఏపీ ఫిషరీస్ పాలసీ-2015, ప్రోత్సహక పథకాలు, రొయ్య పిల్లల ఉత్పత్తి, ఇన్సూరెన్స్, మార్కెట్ విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, యాంటీబయాటిక్స్ అమ్మకాల నియంత్రణ, ఆక్వాషాపులపై దాడులు, ల్యాబులు, ఆక్వాకు విద్యుత్, సౌరశక్తి, డీజిల్ వినియోగం తదితర అంశాలను చర్చించారు.

సముద్ర ఉత్పత్తులు, చెరువలలో రొయ్యల పెంపకాన్ని  అభివృద్ధిపరచడం కోసం 9 జిల్లాల్లో 82 ఎగుమతి కేంద్రాలను, 68 ప్రాసెసింగ్ యూనిట్లను, 70 స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హేచరీస్ ని, ఆక్వాషాపులను తనిఖీ చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారి చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జీ.అనంత రాము, ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్, ఎంపీఈడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఏ.లహరి తదితరులు పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...