May 2, 2018


పోలవరం ఓ ఛాలెంజ్!
           రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బెడిసికొట్టిన  నేపధ్యంలో పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ఛాలెంజ్ గా నిలుస్తోంది. కేంద్రం సహాయసహకారాలు అందించే విషయంలో ఊహించని విధంగా కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోంది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం మొక్కవోని దీక్షతో రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గతంలోకంటే మించిన శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇప్పటికి సీఎం 58 సార్లు వర్చువల్ సమీక్ష నిర్వహించారు.  పనుల వేగం ఏమాత్రం ఆగకపోగా ఇంకా ఊపుతో  శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన తరువాత ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా స్పిల్‌వే కాంక్రీట్ పనులు ఒక్క నెలలో తొలిసారిగా లక్ష క్యూబిక్ మీటర్లు దాటింది. ఏప్రిల్ నెలలో 1,15,658 క్యూబిక్ మీటర్ల  పనులు జరిగాయి. వచ్చే రెండు నెలల్లో ఈ వేగం ఇంకా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
             రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే నదుల అనుసంధానం ఆలోచన చేసిన తొలి వ్యక్తి విఖ్యాత నీటిపారుదల ఇంజనీర్ డాక్టర్ కె.ఎల్ రావు. దానిని ఆచరణలో అమలు చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది.  కెఎల్ రావు పుట్టిన గడ్డ(కృష్ణా జిల్లా)పై గోదావరి జలాలు పారించి ఈ ప్రభుత్వం ఆయనకు ఘన  నివాళులర్పించింది. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.  పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తీసుకురావడం ద్వారా  కృష్ణా ఆయకట్టులో 10  లక్షల ఎకరాలకు నీరందించారు. చివరి భూములకు కూడా నిరందించారు. దాంతో ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. కొంతమంది రైతులు ఎకరానికి 60 బస్తాల వరకు పండించారు.  రైతుల ఆనందానికి అవధులులేవు.  సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిలో 150 నుంచి 2000 టిఎంసిల నీటిని నదులకు మళ్లిస్తే కరవు ఊసే ఉండదు. నదుల అనుసంధానం ద్వారా 14 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ  లక్ష్యం. మొదట గోదావరి నుంచి సంగం బ్యారేజీ వరకు నీటిని తీసుకెళ్లిన తర్వాత గోదావరి-పెన్నా అనుసంధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పురుషోత్తపట్నం ద్వారా ఏలేరుకు నీరు తీసుకువెళ్లి  విశాఖకు అందిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఏడు మండలాలకు నీరందిస్తారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానాన్ని నిజం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరంలో అన్ని నదులను కలపడానికి, సోమశిల, స్వర్ణముఖి నదులను అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. హంద్రీనీవా ద్వారా మడకశిర, కుప్పం, నెల్లూరుకు నీళ్లు ఇవ్వవలసి ఉంది.  చింతలపూడి ద్వారా పశ్చిమగోదావరితో పాటు సాగర్‌ ఎడమ కాలువ కింద నీరందించే కృష్ణా జిల్లాలోని ఆయకట్టుకు నీరు అందిస్తారు.
            పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పూర్తయితే  960 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానదికి 80 టిఎంసీల నీటిని మళ్లిస్తారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయంతో అనుసంధానం చేస్తారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల పరిశ్రమలకు, తాగునీటికి 23.44 టిఎంసిలు సరఫరా చేస్తారు
పోలవరం ప్రాజెక్టుకు  భూసేకరణ, పునరావాసం ప్రభుత్వానికి  తలకు మించిన భారంగా మారింది. ప్రాజెక్టు ప్రారంభించిన నాటి మార్కెట్‌ ధరలకు నేటి  ధరలకు పొంతన లేకపోవడంతో ప్రభుత్వంపై పెనుభారం పడింది. దీంతో అంచనా వ్యయాలు విపరీతంగా పెరిగాయి. 2014లో ఆనాడున్న మార్కెట్‌ ధరలు, భూముల రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా భూసేకరణ చేశారు. పాత చట్టం ప్రకారం భూసేకరణ ప్రారంభించారు. కానీ నేడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు భూమికి భూమి, నష్టపరిహారం, పరిహారం చెల్లించాల్సి రావడం  ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. కేంద్రం నుంచి సక్రమంగా నిధులు రాకపోవడంతో భూసేకరణ ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది.  ఇంకా 60 వేలకు పైగా ఎకరాలను సేకరించవలసి ఉంది.  వాస్తవానికి ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు ఒక్క భూసేకరణ, ఇతర పరిహారాలకు రూ.11,131 కోట్లు ఖర్చవుతుం దని అంచనా వేశారు. ఇప్పుడు అది రూ.36 వేల కోట్లకు పెరిగింది. దాంతో ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెరిగింది.
               పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగం పుంజుకోవడంతో ఏప్రిల్ 30 వరకు ప్రాజెక్ట్ నిర్మాణం 53.02 శాతం పూర్తయింది.  పోలవరం కుడి ప్రధాన కాలువ 89.44 శాతం పూర్తయింది. ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం 59.16 శాతం పూర్తయింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 85.10 శాతం, స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ ఎర్త్ వర్క్ పనులు 72.30 శాతం, స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16.40 శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60 శాతం, జెట్ గ్రౌటింగ్ పనులు 64.90శాతం పూర్తి అయ్యాయి. వర్షాలు వచ్చేలోగా గోదావరి నదిలో పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి స్థాయిలో వ్యయాన్ని భరిస్తోంది.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు పోలవరం నిర్మాణానికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత రూ.8,229.11 కోట్లు, 2018 ఫిబ్రవరి వరకు మొత్తం రూ.13,364.98 కోట్లు వ్యయం చేశారు. నాబార్డ్ (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్)  తో కేంద్రం ఒప్పందం కదుర్చుకుని రూ.1981 కోట్లు విడుదల చేసింది.  అయితే ఇటీవల కేంద్ర రాష్ట్ర సంబంధాలు బెడిసికొట్టడంతో పూర్తి చేసిన పనులకు నిధులు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  ప్రస్తుతం ఇంకా మూడు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్రం నుంచి రావలసి ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ముందుగా చెప్పిన ప్రకారం 2019 నాటికి దీనిని  పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...