May 30, 2018


రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు
విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి కెఈ
Ø రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు
Ø చుక్కల భూముల క్రమబద్దీకరణకు 60 వేల దరఖాస్తులు
Ø  సమస్య పరిష్కారానికి జూన్ 13 నుంచి  స్పెషల్ డ్రైవ్
Ø ప్రభుత్వానికి రైతులే ప్రధానం, వారి సంతృప్తే ముఖ్యం
Ø బలవంతంగా భూములు లాక్కోం
Ø సైనికోద్యోగులకు ఇచ్చిన భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

                సచివాలయం, మే 30: రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాని పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, రిజిస్ట్రేషన్, దేవాదాయ) కెఈ కృష్ణమూర్తి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22- రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితా పరిష్కారం విషయంలోనూ, చుక్కల భూముల క్రమబద్దీకరణ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తామన్నారు. దశాబ్దాల నుండి పరిష్కారానికి నోచుకోని చుక్కల భూముల  సమస్యను  పరిష్కరించేందుకు  ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా,  ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. మన రాష్ట్రంలో  చుక్కల భూములు దాదాపు 24 లక్షలు ఎకరాల వరకు ఉన్నట్లు తెలిపారు.  ఈ భూములు అనుభవిస్తున్న వారికి హక్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. 2017 జూన్ 14న  చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టం అమల్లోకి వచ్చిందని,  దానికి సంబంధంచిన విధి విధానాలను ఖరారు చేస్తూ జూలై 17న 298 నెంబర్ జీఓ జారీ చేసినట్లు తెలిపారు. ఆ జీఓ ప్రకారం దరఖాస్తు చేసిన 6 నెలల లోగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన  జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు 60 వేల 164 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు చాలా తక్కువ పరిష్కారమయ్యాయని, అందువల్ల  స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పనిభారం, రెవెన్యూయేతర పనులు భారం వల్ల రెవెన్యూ సిబ్బంది 22 - , చుక్కల భూముల సమస్యల పరిష్కారంలో  కాలపరిమితి పాటించలేకపోయిందన్నారు. 22- విషయానికి వస్తే మొత్తం నిషేధిత భూముల జాబితా 5 విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఒకటి 22ఏ(1)(ఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ద్వారా  నిషేధించబడిన భూములని, రెండు 22ఏ(1)(బి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములని, మూడు 22(1)(సి) దేవాదాయ, వక్ఫ్ భూములని, నాలుగు 22(1)(డి) అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, అగ్రికల్చర్ ల్యాండ్ సీనింగ్ మిగులు భూములని, అయిదు 22(1)(ఇ) ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములని వివరించారు.  ఎవరైనా రైతులు తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించుకోవాలంటే జాబితా 1,2,4 లకు సంబంధించి కలెక్టర్ కు,  జాబితా 3 కు సంబంధించిన భూముల విషయంలో దేవాదాయ శాఖ కమీషనర్ లేదా  వక్ఫ్ బోర్డు కార్యదర్శికి, 5 కు సంబంధించిన భూములైతే  రాష్ట్ర స్థాయి కమిటీకి అర్జీలు ఇవ్వాలన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మీ-సేవ సర్వీసును ప్రారంభించామని, అక్కడ అర్జీ ఇస్తే సంబంధిత అధికారికి వెళుతుందని, ఆ అధికారి తక్షణం చర్యలు తీసుకుంటారని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతం చేసేందుకు మూడు నెలల పాటు రెవెన్యూ అధికారులకు రెవెన్యూయేతర పనులు అప్పగించ వద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. నిషేధిత జాబితా నుండి భూమిని తొలగించాలంటే కలెక్టర్ నివేదిక ఆధారంగా  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ  ఉత్తర్వులు ఇస్తారని,  ఇది జాప్యానికి కారణమవుతున్నందున 22- జాబితా నుంచి తొలగించే అధికారం సంబంధిత కలెక్టర్ కు  ఇస్తూ ఏప్రిల్ 13న  ఉత్తర్వులు ఇచ్చామన్నారు.    ఇక నుంచి ఏవైనా సర్వే నెంబర్లు 22- జాబితాలో చేర్చాలంటే తప్పనిసరిగా సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చి, వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
        చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) వారం వారం జరిపే వీడియో కన్ఫరెన్స్ ద్వారా 22- నిషేధిత భూముల జాబితా తయారీ, చుక్కల భూముల సమస్య పరిష్కార పరోగతిపై  సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా జూన్ 13 నుంచి 30 వరకు  స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్డీఓ,  తాహశీల్దార్లు  వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు.  సమస్యను పరిష్కరించేందుకు మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమం తరహాలో ప్రత్యేక పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్, అటవీ, సర్వే అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో నిషేధిత జాబితాను గ్రామ స్థాయిలో పంచాయితీ లేదా రెవెన్యూ కార్యాలయాల్లో ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిషేధిత జాబితాపై ప్రజల నుంచి రెవెన్యూ సిబ్బంది లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరిస్తారని,   అలాగే రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధికారులే  స్వయంగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు లేవనే కారణం చూపి 22- జాబితాను అప్ డేట్  చేయట్లేదని, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎస్ఎస్ అండ్ ఎల్ ఆర్  వారి దగ్గర ఉన్న భూమి రికార్డులు లేదా ప్రస్తుతం ఆ సర్వే నెంబర్ లో ఎవరు సాగు చేస్తున్నారు, ఎంతకాలం నుంచి సాగు చేసుకుంటున్నారు అనే విషయం  పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరిస్తామన్నారు. మొదటి దశలో నిషేధిత జాబితా ముడిపడి ఉన్న శాఖల అధికారులతో గ్రామసభ ఏర్పాటు చేసి పరిష్కరించదగినవి అక్కడికక్కడే పరిష్కరించి, జాబితాను రూపొందిస్తారని చెప్పారు. గ్రామసభలో పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్ర స్థాయి కమిటీలకు సి.సి.ఎల్.ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే డిపార్ట్ మెంట్ లోని సీనియర్ అధికారులు నేతృత్వం వహిస్తారని, ఈ కమిటీలు  జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పరిష్కారం చూపిస్తాయన్నారు. దానికి అనుగుణంగా కలెక్టర్ తుది జాబితాను సిద్థం చేస్తారన్నారు.
                      స్పెషల్  డ్రైవ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని,  ఏ గ్రామాల్లో ఎప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తారో,  షెడ్యూల్ ను పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రభుత్వపరంగా  రావాల్సిన చుక్కల భూములు తాహశీల్దార్లు గుర్తించి,  వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపించాలన్నారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకి సంబంధించి జిల్లా కమిటీల నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు వుంటే 90 రోజుల్లోగా సీసీఎల్ఏ దరకాస్తు  చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు.  దీనిపై సీసీఎల్ఏ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అలాగే  ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సైనికోద్యోగులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.  నిర్ధిష్ఠ  సర్వే నెంబర్ గురించి  అభ్యంతరాలు వుంటే అటువంటి భూముల వివరాలను గ్రామాల్లో ప్రకటించాలని, మిగిలిన భూములను అభ్యంతరాలు లేనివిగా గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. 1954 సంవత్సరం ఏ నిబంధనలు లేకుండా అసైన్డ్ చేసిన భూములను 22- జాబితా నుంచి తొలగించే ప్రతిపాదన  ప్రభుత్వ పరిశీలనలో వుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం - 2017
                 నూతన రాష్ట్ర అవసరాల నిమిత్తం 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం 12 సవరణలకు కేంద్ర ప్రభుత్వం యథాతథంగా  ఆమోదించినందుకు ఉప ముఖ్యమంత్రి  సంతోషం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లు 2017( నెం.32/2017 ) ని శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన తరువాత  నవంబర్ 12 ,2017న కేంద్ర ప్రభుత్వానికి  పంపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  ఈ చట్టాన్ని  రూపొందించడం జరిగిందన్నారు. ప్రతిపాదించిన సవరణలను కేంద్రం ఆమోదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ముఖ్యమైన విద్య, వైద్య, సాంకేతిక సంస్థలకు, రహదారులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన  సాగునీటి ప్రాజెక్టుల కొరకు భూములను సిద్దంగా ఉంచగలుగుతామని చెప్పారు.  రైతులకు సముచిత పరిహారం, పునరావాస కల్పన, పునర్ నిర్ధారణ నిబంధనలలో రాజీపడకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సవరించామన్నారు. ప్రజాప్రయోజనాలను ఆశించి ప్రభుత్వం అవసరం ఉన్నచోటల్లా రైతులను ఒప్పించి నేరుగా భూములను సేకరించవచ్చని,  దీని వల్ల త్వరితగతిన  ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతామని చెప్పారు. జిల్లా కలెక్టర్ లేక ప్రభుత్వం నియమించిన అధికారి ఆసక్తి ఉన్న రైతులతో లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంటారని,  దీన్ని ఆధారంగా చేసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అట్టి భూములు కొనుగోలు చేశాక ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొనే అవసరం ఉండదని,  గెజిట్ లో ప్రచురించిన తేదీ నుంచి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తారని కెఈ చెప్పారు. రైతులకు ఒకే సారి ఏకమొత్తంలో  డబ్బులు చెల్లిస్తారని, సదరు భూమార్పిడి వల్ల భూయజమాని కాకుండా మరే కుటుంబమైనా నష్టపోతే వారికి కూడా పునరావాసం  కింద  ఏక మొత్తంలో చెల్లిస్తారని తెలిపారు. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో కన్సెంట్ అవార్డుకు అవకాశం లేదని,  ప్రస్తుత రాష్ట్ర సవరణ బిల్లులో సెక్షన్ 23 కింద కలెక్టర్ కన్సెంట్ అవార్డు ఉండాలని ప్రతిపాదించామన్నారు. భూసేకరణ ధర ఖరారు చేసిన తరువాత నిర్వాసితులు ఆ ధరకు అంగీకరిస్తే ఇక అదే ఖరారవుతుందని చెప్పారు. భూసేకరణ సందర్భంగా ఎవరైనా వ్యక్తికి పొరపాటుగా నష్టపరిహారం చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్య తీసుకొనవచ్చుని తెలిపారు. ఏదైనా భూమి కేంద్ర భూసేకరణ చట్టం కింద సేకరిస్తే సదరు భూమిని 5 సంవత్సరాల లోపల లేదా ప్రాజెక్టు నిర్దేశిత కాలవ్యవధి, ఏది తరువాత  అయితే దానిని పరిగణలోనికి తీసుకుంటారని చెప్పారు.    ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం-2017 రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం పట్ల ఎవరూ అపోహ పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ‘‘మాకు రైతులే ప్రధానం, వారి సంతృప్తి మేరకే సముచిత నష్టపరిహారం చెల్లించిన తరువాత మాత్రమే భూసేకరణ జరుగుతుంది. బలవంతంగా భూములను లాక్కునే చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడదు’’ అని కెఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) అనీల్ చంద్ర పునీఠా, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...