Nov 20, 2019


తెలుగు మాద్యమం – కొన్ని వాస్తవాలు
 

        రాష్ట్రంలో ఒక్కసారిగా తెలుగు మీడియం రద్దు చేసి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలోని వారు అత్యధిక మంది బడి మానివేస్తారు.  మన రాష్ట్రం పూర్తిగా గ్రామీణ నేపధ్యం కలిగిన రాష్ట్రం. 2015లో కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీలో  94 పట్టణాలు ఉంటే, 17,521 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం,దాని అనుబంధ రంగాలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు కోటి 42 లక్షల కుటుంబాలు ఉంటే, కోటి 47 లక్షల  తెల్ల కార్డులున్నాయి. అందువల్ల దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిజమైన పేదలను అధికారికంగా చెప్పడం కష్టం. రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలవారు, నిరుపేదలు దాదాపు 70 శాతం మంది వరకు ఉండే అవకాశం ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలను (ఆడ,మగ) ఏదో ఒక పనికి పంపించి ఆదాయం పొందాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. వారు పెద్దగా చదువుకొని ఉండరు. అయినా ఉచిత విద్య, ప్రభుత్వాల ప్రోత్సాహం, చదువు విలువ తెలుగుసుకవడం  వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లలను బడికి పంపినా వారి చదువు విషయంలో కనీస శ్రద్ధ తీసుకునే అవకాశం, చదువులో వారి అనుమానాలను నివృత్తి చేసే సామర్ధ్యం వారికి ఉండదు. విద్యార్థులు ఐదవ తరగతిలోకి  వచ్చినా తెలుగు చదవటం, కూడికలు తీసివేతలు వంటి లెక్కలు చేయడం ఎక్కువ మందికి రావటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. కారణం పాఠశాలలు కాదు. తల్లి దండ్రులకు  పెద్దగా చదువురాకపోవడం, పేదరికం. పిల్లలను చిన్నకారణానికే బడికి పంపరు. ఇంటివద్ద చదువుకోమని చెప్పే వారు ఉండరు. హోంవర్క్ చేయడం అసలు ఉండదు. అలాంటి పిల్లవాడికి జ్వరం వస్తే ఎన్నాళ్ళకి బడికి పంపుతారో కూడా తెలియదు. ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చేవి కాకుండా ఇతర పుస్తకాలు ఎన్నాళ్ళకు కొంటారో, అసలుకొంటారో కొనరో కూడా తెలియదు. మన ప్రభుత్వపాఠశాలల్లో ఇలాంటి వారే ఎక్కువ. వారికి తెలుగు రావటమే కష్టం. వాస్తవ పరిస్థితులు ఇవి.
                  ఇక ప్రముఖుల పిల్లలు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాద్యమంలోనే చదువుతారు. ఒకవేళ వారు చదువులో  వెనకబడితే ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన ప్రత్యేక టీచర్లు, స్పెషల్ క్లాసుల ద్వారా కోచింగ్ ఇప్పిస్తారు.   ఆ తరువాత వారు  ఏ వృత్తిని ఎంచుకుంటారో దానికి కావలసిన భాష నేర్చుకుంటారు. సినిమా నటుడు కావాలనుకుంటే భాష నేర్పడానికి ఒక టీచర్ ని, నటన నేర్పడానికి మరో టీచర్‌ని పెట్టుకుంటారు. రాజకీయ నాయకుడు కావాలనుకుంటే భాష నేర్పడానికి ఒక టీచర్, మాట్లాడే తీరు నేర్పడానికి మరో టీచర్‌ని నియమించుకుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదలు వారి పిల్లలను అలా చదివించగలరా? అలా ప్రత్యేక శ్రద్ధ చూపడానికి వారికి అవకాశం, జ్ఞానం ఉంటాయా? చదుకునే అవకాశాల విషయంలో ఉన్నత వర్గాల పిల్లలతో మురికివాడల్లోని పిల్లలను పోల్చలేం. వారు పుట్టిపెరిగిన వాతావరణం, పరిసరాలు, ఇంట్లోను, చుట్టుపక్కల వారు మాట్లాడే భాషే వారికి అర్ధమవుతుంది. మాతృ భాషలోనైతేనే వారు విషయ పరిజ్ఞానం పొందడానికి, అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిలో తలెత్తే చిన్నచిన్న ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో సమాధానాలు చెప్పేవారు చుట్టుపక్కల ఎవరూ ఉండరు. వారి అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉండదు. తక్షణం మాద్యమం మార్చితే వారు చాలా ఇబ్బందులుపడతారు. రాష్ట్రంలో పదవ తరగతి తప్పేవారిలో ఎక్కువ మంది ఇంగ్లీష్ లాంగ్యేజ్ తప్పుతారు. ఏకంగా ఇంగ్లీష్ మాద్యమం ప్రవేశపెడితే వారి పరిస్థితి ఏమిటి? ఏ భాష రాక, చదవలేక, రాయలేక, విషయం అర్ధం కాక నానా అవస్తలు పడవలసి ఉంటుంది. అటూ ఇటూ చెడి వారి జీవితాలు నాశనమవుతాయి.  పిల్లలపై ఇంత వత్తిడి పెట్టడం భావ్యంకాదు. తెలుగే చదవడం, రాయడం సరిగా రాని వారిని ఇంగ్లీష్ మీడియంలో చేర్చితే ఆ వత్తిడిని తట్టుకోలేక పూర్తిగా స్కూల్ మానివేస్తారు. ఇది చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.
          ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారిలో అత్యధిక మంది తెలుగు మీడియంలో చదువుకున్నవారే. పదవ తరగతి తరువాత టీచర్ ట్రైనింగ్ అయినవారు కూడా అధికంగానే ఉన్నారు. వారు తెలుగులో చెప్పడానికి అలవాటుపడిపోయారు. ఇతరిత్రా కూడా వారికి ఇంగ్లీష్‌తో పనిలేదు. అందువల్ల వారందరూ చదువుకునే సమయంలో నేర్చుకున్న కాస్త ఇంగ్లీష్‌ని కూడా మరిచిపోయారు. ఈ విషయంలో వారిని తప్పు పట్టవలసిన అవసరంలేదు. ఇప్పుడు వారికి ఇంగ్లీష్ భాషకు సంబంధించి శిక్షణ ఇచ్చినా అతి కొద్ది మంది మాత్రమే ఇంగ్లీష్‌లో బోధించగలరు. పిల్లలతోపాటు వారిపై కూడా మనసికంగా వత్తిడి పెంచడమే. ప్రయోజనం కంటే నష్టాలే అధికంగా ఉంటాయి.  45, 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని బోధించడం ఆచరణలో సాధ్యంకాదు. అటు విద్యార్థుల పరిస్థితి, బోధన అంశాలు, బోధించే ఉపాధ్యాయుల సామర్ధ్యం...వంటి అన్నిటినీ సమగ్ర పరిశీలన, అధ్యయనం చేసిన విద్యావేత్తలు, మేథావులు విద్యాబోధన మాతృ భాషలోనే ఉత్తమమని తేల్చారు. యునెస్కో కూడా అదే చెప్పింది. చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో మాతృభాషకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల వారు ముందు మాతృ భాష, ఆ తరువాత ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. విశ్వవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. అత్యధిక ఉద్యోగాలకు స్పోకెన్ ఇంగ్లీష్ సరిపోతుంది. ప్రాధమిక స్థాయిలో విషయ పరిజ్ఞానికి, ముఖ్యంగా మన రాష్ట్రం వంటి గ్రామీణ నేపధ్యం కలిగిన ప్రాంతంలో మాతృ భాషకు మించినదిలేదు. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం ఓ  పెద్ద వరమని మభ్యపెట్టడం సరైన విధానం కాదు.  విద్యాభివృద్ధిలో భాగంగా తెలుగుతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి.  కానీ తెలుగు మీడియంని పూర్తిగా రద్దు చేయవలసిన అవసరంలేదు. ఏ మీడియంలోనైనా చదువుకునే స్వేచ్ఛ వారికి ఉండాలి. అలా రద్దు చేయడం వారి హక్కుని హరించడమే. ఇది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఇంగ్లీష్ మాద్యమం ప్రవేశపెడతారు, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాద్యమంలో చదువుకునే అవకాశం కల్పిస్తారా? వారికి తెలుగులో ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారా?  దానిని స్పష్టం చేయవలసి ఉంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. యూపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలను ప్రాంతీయ భాషలలో రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రశ్నాపత్రం గుజరాత్ భాషలో కూడా రూపొందిస్తున్నారు. పక్క రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ భాషల మాద్యమాలతోపాటు తెలుగు మాద్యమం కూడా ఉంది. ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాద్యమం రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ఆ రాష్ట్రాలలో తెలుగు మాద్యమం ఎత్తివేస్తే కావాలని మనం అడగగలమా? ప్రస్తుతం ఉన్నమాదిరిగా రెండు మాధ్యమాలు కొనసాగిస్తూ, దశలవారీగా ఇంగ్లీష్ మాధ్యమం తరగతులను పెంచడం మంచిది. రెండు మాద్యమాలు ఉండాలి. మాద్యమం ఎన్నుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఉండాలి. విద్యార్థులలో ఇంగ్లీష్ పరిజ్ఞానం పెంచడం కోసం ప్రతి తరగతిలో తప్పనిసరిగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించాలి.  భవిష్యత్ లో ఎడ్యుకేషన్ డిప్లమా, బీఈడీలలో ఇంగ్లీష్ బోధనా పద్దతులు మెరుగుపరచాలి. అక్కడ నుంచే ఇంగ్లీష్ ప్రాధాన్యం పెంచాలి.  ఇంగ్లీష్‌లో బోధించగలిగినవారినే ఉపాధ్యాయులుగా నియమించాలి.  ఇటువంటి విషయాలలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యావేత్తలు, వివిధ విద్యా కమిటీలు ప్రాథమిక విద్య, మాతృభాషలపై సమర్పించిన నివేదికలను పరిశీలించవలసిన అవసరం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Nov 14, 2019


హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం - దేశ రెండో రాజధాని
సర్వత్రా చర్చ
          
  హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, దేశ రెండవ రాజధాని అవుతుందన్న ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం అంశం తెరపైకి వచ్చింది. ఒక దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విడగొట్టి, హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే  తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం ఎలా చేస్తారన్న విమర్శలు వినవచ్చాయి.   ఆ తరువాత ఆ ఊసే లేదు. అయితే ఇటీవల మళ్లీ హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని, కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, పార్టీ, దేశ ప్రయోజనాల రీత్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతే కాకుండా దక్షిణాదిన బలపడాలన్న ఆలోచనతో బీజేపీ ఉంది. కశ్మీర్ విషయంలో ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకుంది.  370 ఆర్టికల్ ని రద్దు చేసి దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకుంది. ఆ క్రమంలో  హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్ ని  కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని  మాజీ మంత్రి చింతా మోహన్ ఇటీవల విలేకరులకు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందని సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ చిక్కుల్లో పడింది. ఎట్టకేలకు అక్కడ తమ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తోంది. చింతా మోహన్ హైదరాబాద్ గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తిరుపతికి మారుస్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఎవరికీ అచ్చిరాదని, జగన్‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.  రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని నియమించడం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసే వ్యాఖ్యల వల్ల రాజధానిని మార్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం విషయానికి వచ్చేసరికి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ వార్తల్లో  వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
              ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే,  తాజాగా హైదరాబాద్‌ని ఏకంగా దేశ రెండో రాజధాని చేసే అవకాశం ఉన్నట్లు బలంగా వినవస్తోంది. అయితే ఈ అంశం ఇప్పటిదేమీ కాదు.  హైదరాబాద్ ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి తోడు  దేశంలో ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువైపోయిందన్న  విమర్శలు చాలా కాలంగా వినవస్తున్నాయి.  దక్షిణాదివారికి ఢిల్లీలో భాష కూడా ఓ సమస్య. ఈ నేపధ్యంలో దక్షిణాదిన రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలన్న అంశం చాలా కాలంగా పరిశీలనలో ఉంది. హైదరాబాద్ ని దేశ రెండవ రాజధానిగా చేయాలని  సౌత్‌ ఇండియా పొలిటికల్‌ జేఏసీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై హైదరాబాద్‌లో సదస్సు  కూడా నిర్వహించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ  దక్షిణాదిన బలహీనంగా ఉంది. ఇక్కడ బలం పుంజుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. దక్షిణాది  ప్రజల మనసులలో స్థిర స్థానం సంపాదించాలన్న యోచనలో ఆ పార్టీ ఉంది. అందులో భాగంగా రెండవ రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసి దక్షిణాది ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికి తోడు ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి కలసి వచ్చాయి. ఢిల్లీ రాజధానిగా ఏర్పడి ఇప్పటికి 87 ఏళ్లయింది. దేశం జనాభాతోపాటు, దేశం నలుమూలల నుంచి వచ్చే జనాభాతో ఢిల్లీలో రద్దీ పెరిగిపోయింది.  వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరకుంది. తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఢిల్లీ మొత్తం పొగ కమ్మేసింది. అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేస్తోంది. విద్యార్థులు కాలుష్య బారిన పడకుండా  ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాలుష్యానికి తోడు నీరు, వసతి, భద్రత... తదితర సమస్యలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌ కూడా రాజకీయ నాయకుల నుంచి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్‌ విద్యాసాగర్ రావు  కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విజృంభించిన వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా  భారతరత్న, డాక్టర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనన్న ఆశా భావం వ్యక్తం చేశారు.  ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విద్యాసాగర్ రావు వంటి వ్యక్తి ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. 130 కోట్ల జనాభా, వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనం అయిన భారత దేశానికి రెండవ రాజధాని అవసరం ఎంతైనా ఉంది.  సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.  రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
             రాష్ట్రపతికి సిమ్లాలో  వేసవి విడిది  ఉంది.  ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్ట్రపతికి  శీతాకాల విడిదిగా ఉంటోంది. సికింద్రాబాద్‌లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు, ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. ఖర్చు పరంగా కొంత కలిసి వచ్చే అంశం ఇది. ఈ నేపధ్యంలో సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం, మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల పరంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉండటానికి అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ ని కూడా రద్దీ నగరం అనుకుంటే కొత్తగా నిర్మించే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశ రెండవ రాజధానిగా పరిశీలించే అవకాశం ఉంది.
-      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Nov 10, 2019

ఉమ్మడి కుటుంబం – న్యూక్లియర్ ఫ్యామిలీ




        
భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ప్రపంచ దేశాలు కూడా దానిని గుర్తించాయి. ఇప్పటికీ ఈ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది.  పాశ్చాత్య దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, ఆధునిక పోకడల ప్రభావంతో కాలక్రమంలో మన దేశంలో ఈ వ్యవస్థ అంతరించిపోతోంది. మనుషులలో విశాల ధృక్పదం సన్నగిల్లి ఉమ్మడి కుటుంబాలు కుంచించుకుపోయి అతి చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) ఏర్పడుతున్నాయి. అలా అని పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయలను విమర్శించడం కాదు.  పాశ్చాత్య నాగరికతలోని విద్యావిధానం, మతాతీత మానవతావాదం, శాస్త్రీయత, హేతువాదం... వంటి అంశాలను అలవర్చుకున్నా మన సమాజానికి ఉపయుక్తంగా ఉండేది. ఏ సమాజాన్నైనా మంచికంటే చెడే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. చిన్న కుటుంబం అంటే భార్యా, భర్త, తమ పిల్లలు ఒకరు లేక ఇద్దురు, అంతే. అటువంటి కుటుంబాలే పెరిగిపోతున్నాయి. పట్టణాలలో అయితే అన్నీ అవే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలు అనేక తలెత్తుతున్నాయి. సామాజిక కట్టుబాట్లు పతనమయ్యాయి. కుటుంబాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. కుటుంబం, వ్యక్తుల ప్రభావం సమాజంపై పడి సమాజం పూర్తిగా నాశనమైపోతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్లు... ఇలా అందరూ ఉంటారు. వీరంతా ఇప్పుడూ ఉంటారు. కానీ ఎవరి దారి వారిదే. ఎవరి బతుకు వారిదే.  కొంతమంది కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నా, కొందరు వారిని దూరంగా ఉంచుతారు. ఉద్యోగాల రీత్యా, పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు తప్పనిసరిగా దూరంగా ఉంచవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అయితే అవి చాలా తక్కువ.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, విడాకులు, గృహహింసలు, ఆత్మహత్యలు ఉండవు. మానవ సంబంధాలు, ప్రేమానురాగాలు బలంగా ఉంటాయి.  ఓదార్పులు ఉంటాయి.

          న్యూక్లియర్ ఫామిలీలలో భార్యా, భర్తలు ఉద్యోగాలు చేస్తుంటారు. పిల్లల ఆలనాపాలన బాధ్యతగా చూసే అవకాశాలు వారికి ఉండవు. డబ్బు సంపాదిస్తారు, ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన వయసులో తల్లిదండ్రులు వారికి అందుబాలులో ఉండరు. మంచీచెడు చెప్పే అవకాశం వారికి ఉండదు. దాంతో వారికి  అవలక్షణాలన్నీ అబ్బుతాయి. వారి స్కూల్ సమస్యలు, శరీర ఎదుగుదలలో వచ్చే సమస్యలు, మానసిక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వాస్తవం చెప్పాలంటే అవసరమైనప్పుడు వారిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. పిల్లలు ఆడైనా, మగైనా...  చెడు స్నేహాలు - చెడు అలవాట్లు - నేరాలు చేయడం -మానసిక సమస్యలు – విలువలు, మానవ సంబంధాలు తెలియకపోవడం - విచ్చలివిడితనం - ఆత్మహత్యలు- ఎదిగీఎదగని దశలో ప్రేమలు – వికృత చేష్టలు మోసం చేయడం – మోసపోవడం – ఈర్ష్యలు, ధ్వేషాలు - పాఠశాలల్లో, కాలేజీలో వారికి వేధింపులు – ఇటు తల్లిదండ్రలు, అటు టీచర్ల టార్గెట్లు – డ్రగ్స్ కు బాలిసలవడం – హత్యలు చేయడం – చివరికి తల్లిదండ్రులను కూడా హత్య చేయడం .....  వెరసి సమాజం మొత్తంపై ఆ ప్రభావం పడుతుంది. దాంతో మొత్తం సమాజం కలుషితమైపోతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. అయితే అది విచ్ఛన్నం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం వ్యక్తులనే అనడానికి వీలులేదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, సంప్రదాయంగా వస్తున్న కుల వృత్తులు దెబ్బతినడం, జీవన శైలిలో మార్పులు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం... వంటి అనేక కారణాలు ఉన్నాయి.  కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే ఆ ప్రభావం సమాజంమీద పడి దుష్పరిణామాలు ఎదురవుతాయని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. దీనికి ప్రధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పరిగణించాలని 1993లో నిర్ణయించింది. దానిని దృష్టిలో పెట్టుకొని న్యూక్లియర్ ఫ్యామిలీలలోని తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం తప్ప చేయగలిగింది ఏమీలేదు.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Nov 1, 2019

భూముల వివ‌రాలు


గ్రామ కంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
అసైన్డ్భూమి : భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్భూములుగా పేర్కొంటారు. భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే గాని ఇతరులకు అమ్మడానికి బదలాయించడానికి వీలుండదు.
ఏడబ్ల్యూ భూములు : శిస్తును నిర్థారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్వేస్ట్ల్యాండ్అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
బంజరు భూమి : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.
అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
అడంగల్‌ : దీనినే పహాణి అని కూడా అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు దస్త్రం (రిజిస్టర్‌)లో నమోదు చేస్తుంటారు. దీన్నే గ్రామ లెక్కల మూడో నంబరు రిజిస్టర్గా పిలుస్తారు. ఆంధ్రాలో అడంగల్అని పిలుస్తుండగా తెలంగాణాలో పహాణీగా వాడుకలో ఉంది.
చిట్టా : రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్ను చిట్టా అంటారు. దీన్ని గ్రామ లెక్క నంబరు-6 అని అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను అసామీల వారీగా వసూలు చేసి రిజిస్టర్లో నమోదు చేస్తారు.
జమాబందీ : ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకు వచ్చారా లేదా అని నిర్థారించడం, గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమాబందీ అంటారు.
అజమాయిషీ : భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నదీ, లేనిదీ తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్‌, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహశీల్దారు, ఉప తహశీల్దారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనంబరు 3లో నమోదు చేయాలి. విధంగా అజమాయిషీని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది.
దస్తావేజు : భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. భూ బదలాయింపులు చేసే సమయంలో దస్తావేజులను చట్టపరంగా, రిజిస్ట్రేషన్చేయించుకోవాలి.
ఎన్కంబరెన్స్సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియ జేసే ధ్రువపత్రం. 32 ఏళ్లలోపు సర్వే నంబరు భూమికి గల లావాదేవీలను తెలియజేస్తుంది.
ఫీల్డ్మెజర్మెంట్బుక్‌ (FMB) : దీనిని ఎఫ్ఎంబీ టిప్పన్అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్ఎంబీ ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనంబర్లు, పట్టాలు, వాటికొలతలు ఉంటాయి.
బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వేనిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు.
బీమెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. అర్హులైతే కొనసాగిస్తారు. అనర్హులైతే తొలగిస్తారు.
ఫసలీ : ఏటా జులై 1 తర్వాత నుంచి తర్వాత సంవత్సరం జూన్‌ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్నిఫసలీఅంటారు. పదం మొఘల్చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.
ఎకరం : ఇది భూమి విస్తీర్ణానికి కొలమానం. 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్లు (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం). వీటిని ఎకరంగా పరిగణిస్తారు.


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...