Mar 29, 2019

అవినీతిపై ఉక్కు పాదం


ఉన్నత స్థాయిలో ఓ కొత్త వ్యవస్థ
48 ఏళ్ల పోరాట ఫలితం
             
   దేశంలో ప్రభుత్వం పేరు చెప్పి జరిగే అవినీతి నియంత్రణకు ఉన్నత స్థాయిలో ఓ కొత్త వ్యవస్థ ఏర్పడింది. అదే లోక్ పాల్’, అవినీతి వ్యతిరేక అంబుడ్‌‌సమన్ వ్యవస్థ. భారత న్యాయ వ్యవస్థలో ఇది ఒక చారిత్రక ఘట్టం. 48 ఏళ్ల  పోరాట ఫలితంగా ఇది సాధ్యమైంది. జన లోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ కాలం ఉద్యమం చేశారు. ఎట్టకేలకు మార్చి 19న సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
జాతీయ మానవ హ్కకుల సంఘం సభ్యునిగా ఉన్నా పినాకి చంద్రఘోష్ భారత ప్రధమ లోక్ పాల్గా నియమితులయ్యారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేతృత్వంలోని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగీలతో కూడిన లోక్ పాల్’  ఎంపిక కమిటీ  మార్చి 17న జస్టిస్‌ ఘోష్‌ పేరును ఖరారు చేసిరాష్ట్రపతికి పంపించింది.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దానిని ఆమోదించారు. మార్చి 23న రాష్ట్రపతి ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1976లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్‌ ఘోష్‌ 1997లో ఆ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత2012లో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది2017లో పదవీ విరమణ చేశారు. ఆయన పూర్వీకుడు హరచంద్ర ఘోష్  కలకత్తాలో బ్రిటీషువారు నెలకొల్పిన సదర్ దివానీ అదాలత్ కు  1876లో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన తండ్రి శంభు చంద్ర ఘోష్  కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్‌ సభ్యులుగా వివిధ హైకోర్టులకు చెందిన మాజీ ప్రధాన న్యాయమూర్తులు దిలీప్‌ బి భోసలేప్రదీప్‌ కుమార్‌ మొహంతిఅభిలాషా కుమారితో పాటు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (తరువాత రాజీనామా చేశారు) అజరు కుమార్‌ త్రిపాఠీ,  నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా మహారాష్ట్ర మాజీ సీఎస్‌ దినేశ్‌కుమార్‌ జైన్‌ సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బీ) మాజీ ఉమెన్ చీఫ్ అర్చనా రామసుందరంఐఆర్ ఎస్ మాజీ అధికారి మహేందర్‌ సింగ్‌ఐఏఎస్ మాజీ అధికారి ఇంద్రజిత్ ప్రసాద్ గౌతంలను  రాష్ట్రపతి నియమించారు. వారి చేత జస్టిస్ ఘోష్ మార్చి 27న ప్రమాణస్వీకారం చేయించారు. వీరంతా 70 ఏళ్లు వచ్చేవరకు లేదా 5 ఏళ్లు పూర్తి అయిన తర్వాత రిటైర్‌ అవుతారు. ప్రధాన మంత్రితోపాటు ప్రజా ప్రతినిధులుప్రభుత్వ ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ చేయడం లోక్ పాల్  ప్రధాన విధి. ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణ జరిపే స్వతంత్ర సంస్థ ఇది.

                  1966లోనే మొరార్జీ నేతృత్వంలోని పరిపాలన సంస్కరణల సంఘం కేంద్రంలో లోక్‌పాల్రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పా టుచేయాలని సూచించింది. మొట్ట మొదటి సారిగా   4వ లోక్ సభలో 1969లో  లోక్‌పాల్ బిల్లుని ఆమోదించారు. రాజ్య సభలో ఆమోదించలేదు.   ఆ తరువాత  19711977198519891996199820012005,2008లలో కూడా ఈ  బిల్లుని వరుసగా 9 సార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదించలేదు. జన్ లోక్‌పాల్ బిల్లు చట్టం కోసం  అవినీతి-వ్యతిరేక కార్యకర్త 72 ఏళ్ల అన్నా హజారే 2011 ఏప్రిల్ 5న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. హజారే నేతృత్వంలో ప్రజా ఉద్యమం ఓ ఉప్పెనలా చెలరేగింది. దీక్ష నాలుగు రోజులు కొనసాగించిన తరువాత అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2011లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతామని  ప్రకటించారు. దాంతో ఆయన దీక్ష విరమించారు.  2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ప్రధాన మంత్రిని ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2012 డిసెంబర్ లో హజారే మళ్లీ దీక్షకు దిగారు. దీంతో  బిల్లులో పలు సవరణలు చేసి డిసెంబర్ 18న లోక్ సభలో ఆమోదించారు. బిల్లు ముసాయిదాని రూపొందించడం కోసం కమిటీలు – న్యాయ నిపుణులుప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులు, రాజకీయ నాయకులతో చర్చలు - సంప్రదింపులు - ఆందోళనలు - నిరసనలు - జాతీయ భద్రతా మండలి తిరస్కారం ... ఇలా అనేక దశలు దాటిన తరువాత లోక్‌పాల్లోకాయుక్త చట్టంని 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో చట్టంగా మారింది. అయితే అరేళ్ళ‌ తర్వాత, అదీ సుప్రీం కోర్టు జోక్యంతో లోక్ పాల్ చ‌ట్టం ఇప్పుడు అమ‌లులోకి వ‌చ్చింది. అధికార నిర్వహణలో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులలో రోజురోజుకు నిరంకుశత్వం,ఆశ్రిత పక్షపాతంతోపాటు అవినీతి కుంభకోణాలు పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు ఏర్పడిన  నియంత్రణ వ్యవస్థే లోక్‌పాల్.  లక్షాలాది భారతీయులు పాల్గొని దేశ వ్యాప్తంగా నడిచిన ఈ ఉద్యమం అహింసాయుతంగారాజకీయ జోక్యం లేకుండా కొనసాగింది. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజలే భాగస్వాములుగా ఇంత సుదీర్ఘ కాలం ఉద్యమం నడవడం  విశేషంగా చెప్పవచ్చు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘకాలం పార్లమెంటు ఆమోదానికి నోచుకోకుం డా పక్కన పడవేసిన  బిల్లుల్లో లోక్‌పాల్ బిల్లు ఒకటి. లోక్‌పాల్‌ నియామకంలో జరిగిన జాప్యంపై ప్రతిపక్షాల నుంచి  కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.  లోక్‌ పాల్ ఏర్పాటులో ప్రభుత్వం జాప్యాన్ని ప్రశ్నిస్తూ లోక్‌ పాల్ ఎంపిక కమిటీని ఏర్పాటుచేసిపది రోజుల్లో ఎంపికను ఖరారు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో కేంద్రం ఈ వ్యవస్థను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. కేంద్రరాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు,ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ జరిపే అధికారం లోక్‌పాల్‌లోకాయుక్తలకు ఉంటుంది. లోక్ పాల్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. లోక్ పాల్ కు తగినన్ని వనరులు ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ వ్యవస్థ వృత్తిపరమైన నిబద్ధతతో పని చేస్తుంది. ఉన్నతస్థాయిలో జరిగే అవినీతిని నియంత్రించడంలో ఈ కొత్త వ్యవస్థ ఒక హెచ్చరిక. దేశంలో పేరుకుపోయిన అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి అవకాశం ఏర్పడింది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Mar 27, 2019


కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష

              సచివాలయం, మార్చి 27: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్ కెవివై)కు కేంద్ర నుంచి అధిక నిధులు రాబట్టడానికి వీలుగా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్రపునీఠ సూచించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో ఆర్ కెవివై రాష్ట్ర స్థాయి నిధుల మంజూరు కమిటీ సమాశం సీఎస్ అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో  2018-19 ప్రగతిని, 2019-20 ప్రతిపాదనలను సమీక్షించి, కేంద్ర పథకాలకు సంబంధించి కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టడానికి సీఎస్ సలహాలు ఇచ్చారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధుల మంజూరు, విడుదల, వినియోగం, అదనపు నిధుల మంజూరు గురించి సంబంధిత అధికారులు సీఎస్ కు వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, పట్టుపురుగుల పెంపకం, మత్స్య, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం(జడ్ బీఎన్ఎఫ్), ఆచార్య ఎన్జీ రంగా, ఉద్యానవన, పశువైద్య విశ్యవిద్యాలయాలు, ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజన్సీ) తదితర శాఖల నిధుల వినియోగం, ప్రతిపాదనలపై చర్చించారు. చిరుధాన్యాల ఉత్పత్తి, వివిధ జిల్లాలలో ప్రకృతి వ్యవసాయం తీరుని సమీక్షించారు.  పశుసంవర్ధక శాఖ పరిధిలో 8 ప్రాజెక్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆరు వెటర్నరీ డిస్పెన్సరీలను ప్రతిపాదించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ నీర్జా, ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, హార్టీ కల్చర్, సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరిఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Mar 26, 2019


అసెంబ్లీకి 3,925 – లోక్ సభకు 548 నామినేషన్లు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది

Ø మొత్తం ఓటర్లు : 3,93,45,717
Ø మహిళలు : 1,98,79,421
Ø పురుషులు : 1,94,62,339
                       సచివాలయం, మార్చి 26: 2019 సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలలో 548 మంది, 175 శాసనసభ స్థానాలలో 3,925 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభకు సంబంధించి అత్యధికంగా నంద్యాల స్థానానికి 38, అతి తక్కువగా చిత్తూరు స్థానానికి 13 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. 17 స్థానాల్లో 15కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. శాసనసభ కు సంబంధించి కూడా నంద్యాలలోనే అత్యధికంగా 61, అతి తక్కువగా పార్వతీపురం, పాలకొండలలో 10 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. 118 స్థానాలలో 15 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల 15 మంది పేర్లు, ఒక నోటా కలుపుకొని 16 వరకు ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుందని చెప్పారు. 16 దాటితే 2వ యూనిట్, 32 దాటితే 3వ యూనిట్, 48 దాటితే 4వ యూనిట్ ని అనుసంధానించవలసి ఉంటుదన్నారు.
చట్టం ప్రకారం, చట్టంలోని నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి నామినేషన్లను పరిశీలిస్తారని, అక్కడ పరిశీలకులు కూడా ఉంటారని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి న్యాయ నిపుణులు అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, అలాగే సినిమాటోగ్రఫీ చట్టంలోని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మొత్తం ఓటర్లు  3,93,45,717
                 ఈ నెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 ఉన్నట్లు తెలిపారు. 2014తో పోల్చితే 26,24,109 మంది ఓటర్లు అదనంగా కలిసినట్లు చెప్పారు. 7.08 శాతం పెరుగుదల ఉందన్నారు.  మొత్తం ఓటర్లలో మహిళలు 1,98,79,421 మంది ఉండగా, పురుషులు  1,94,62,339 మంది, 3వ జెండెర్ 3,957 మంది ఉన్నట్లు వివరించారు. దివ్యాంగులు 5,27,734 మంది, అందులో అంథులు 82,748 మంది ఉన్నారని తెలిపారు.  ప్రవాసాంధ్ర ఓటర్లు 5,323 మంది ఉన్నారని చెప్పారు. కొత్తగా  18-19 సంవత్సరాల మధ్య వయసు గల యువ ఓటర్లు 10,15,219 మందిని చేర్చినట్లు  తెలిపారు. కొత్త ఓటర్లకు అవగాహన కల్పించడంలో, వారిని ఓటర్లుగా చేర్చడంలో, దరఖాస్తులు పరిష్కరించడంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది కృషిని సీఈఓ ప్రశంసించారు. ఒకే రోజు 4.5 లక్షల దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. 45వేల మంది బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) ఉండటం వల్ల, తహశీల్డార్లు, ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు అందరూ ఒక బృందంగా ప్రత్యేక శ్రద్ధతో విశేష కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.
              రాష్ట్ర వ్యాప్తంగా సీవిజల్ టీమ్స్ 3,635 ఉన్నాయని, మొత్తం 2,614 ఫిర్యాదులు రాగా, వాటిలో 1,014 వాస్తవమైనవని,  వంద నిమిషాల్లోపల 66 శాతం వాటికి స్పందించినట్లు, తగు చర్యలు తీసుకున్నట్లు  తెలిపారు. ఇంకా 40 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ ఫిర్యాదులు ఆధారంగా 17 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. రూ.12.13 కోట్ల విలువైన నగదు, రూ.92 లక్షల విలువైన చీరలు, డ్రెస్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదు, బంగారం, వెండి, చీరలు, డ్రెస్ మెటీరియల్, ఇతర వస్తువులు మొత్తం రూ.30.66 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.17 కోట్ల విలువైన 467 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఎన్నికలలో స్వాధీనం చేసుకున్నదానికి ఇది రెట్టింపు అని చెప్పారు. 20 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పోలీస్ ఫ్లైయింగ్ స్వ్కాడ్, ఎక్సైజ్ సిబ్బంది, ఆదాయపు పన్ను, వాణిజ్య పన్నుల శాఖ, నోడల్ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రశంసించారు.
        ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రాజకీయ పార్టీలకు 367 నోటీసులు పంపామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయి, అభ్యర్థులు ఖరారైనందున ఇక అభ్యర్థులకు సంబంధించిన ఉల్లంఘనలపై కూడా నోటీసులు పంపుతామని చెప్పారు. ఓటర్లకు, ఓటింగ్ శాతం పెంచడానికి మై ఓట్ క్యూ యాప్ బాగా ఉపయోగపడుతుందన్నారు. ఓటర్ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు చెక్ చేస్తే అక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారో తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రతి 15 నిమిషాలకు బూత్ సిబ్బంది ఈ యాప్ ని అప్ డేట్ చేస్తుంటారన్నారు.

                    ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నట్లు సీఈఓ చెప్పారు. గ్రాడ్యుయేట్ నియోజవకర్గాలలో  అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేయడం వల్ల బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉందని, వాటిని బండిల్స్ గా తయారు చేయడానికి  ఈ రోజు సరిపోతుందని, ఫలితాలు రేపు తెలిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నంలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఒక రౌండ్ పూర్తి అయిందని, మొదటి రౌండ్ లో 17,293 ఓట్లు లెక్కించారని, రఘువర్మకు 7,834 ఓట్లు రాగా, శ్రీనివాసులు నాయుడుకు 5,232 ఓట్లు వచ్చినట్లు గోపాల కృష్ణ ద్వివేది వివరించారు.
                       అదనపు సీఈఓ సుజాత శర్మ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని పోలింగ్ బూత్ ల వద్దకు తరలించడానికి వాహనాలు,  పోలింగ్ బూత్ ల వద్ద షామియానాలు, ఓటర్లు కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు, మంచినీటి సౌకర్యం కల్పించడం, దివ్యాంగులకు వీల్ చైర్లు, అంథులకు బ్రెయిలీ డమ్మీ బ్యాలెట్ ను అందించడం  వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ వివేక్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

Mar 21, 2019

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు



జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో సమావేశం
                
సచివాలయం, మార్చి 21 : సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, శాంతి భద్రతలపై గురువారం సాయంత్రం సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశంలో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, రవాణా, ఆదాయపు పన్ను  మొదలైన శాఖలు సమన్వయంతో ఒక బృందంగా పనిచేయాలన్నారు. ఆయా శాఖల సిబ్బంది బాధ్యతతో కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, అవకతవకలను అరికట్టాలని ఆయన సూచించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ఎన్నికల నిబంధనలు అతిక్రమించినవారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారికి వివరణ ఇవ్వటానికి 48 గంటలు మాత్రమే సమయం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్­లలో వివాదస్పద పోస్టింగులు పరిశీలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే వివరణ ఇవ్వటానికి వారికి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ గురించి కేంద్ర బలగాలు, రాష్ట్ర స్పెషల్ పోలీస్ బృందాలు విధులు నిర్వహిస్తాయని, అవసరమైనచోట రిటైర్డు పోలీసులు, ఎక్స్­సర్వీస్ మెన్, ఎన్­సిసి, ఎన్­ఎస్ఎస్ బృందాల సహాయం తీసుకోమని గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లెవనేత్తిన పలు నిర్వహణాపరమైన అంశాలపై పరిష్కార మార్గాలను సూచించారు. 

అదనపు డిజి (లా&ఆర్డర్) రవిశంకర్ మాట్లాడుతూ, అన్ని జిల్లాలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలను ఆదేశించారు. రాజకీయ అధిపత్యం, కులం, ఫ్యాక్షన్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలన్నారు. సరిహద్దు జిల్లాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 2014 లో నమోదైన కేసులతో ఇప్పడు నమోదైన కేసులను పోల్చి సమీక్షించారు. ఎక్సైజ్ కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎక్సైజ్ కేసులపై సమీక్షించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లాల నుంచి మద్యం తరలి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు.

అదనపు సీఇఓ సుజాత శర్మ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలు, ఫోటో ఓటర్ స్లిప్లులు, ఈవీఎంల గురించి వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసిసి), శాంతిభద్రతలు, ఓటర్ల జాబితా, ఈవీఎంలు, ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యర్ధులు, రాజకీయ పార్టీల ఖర్చులు, ఎన్నికల నిబంధనల అతిక్రమణ, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలపై కేసులు, లైసెన్సు కలిగిన ఆయుధాల స్వాధీనం, ఎక్సైజ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రతిస్పందిస్తూ ఆయా జిల్లాలలో నమోదైన నిబంధనల అతిక్రమణ కేసులు, నగదు, మద్యం, బంగారం, వెండి, లైసెన్సు కలిగిన ఆయుధాల స్వాధీనానికి సంబంధించిన కేసుల వివరాలు తెలియజేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్, పెండింగులో ఉన్న వారెంట్స్, అరెస్టులు, బైండోవర్ కేసులు గురించి వివరించారు. ఎన్నికల ముందు రోజు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామాగ్రిని తరలించడానికి కావలసిన బస్సులు, తదితర ఏర్పాట్ల గురించి వివరించారు. ఐజిపి కె.వి.వి గోపాల రావు, డిఐజి ఎం. రఘురామ్ (సిఎపిఎఫ్ నోడల్ అధికారి), ఎస్పీ కమ్యూనికేషన్స్  జి. సూర్యకుమార్, అదనపు సీఇఓ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




Mar 16, 2019

మంగళగిరి నాడు – నేడు

              

 

         మంగళగిరి అంటే  చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం,  కొండపైన పానకాలస్వామి, తిరునాళ్ల గుర్తుకు వస్తాయి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. ఆంధ్ర శాతవాహనులు
, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రిజులు,  విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, రెడ్డి రాజులు, గజపతులు, శ్రీ కృష్ణదేవ రాయలు, కుతుబ్‌షాహీలు పాలించిన ప్రాంతపరిధిలో మంగళగిరి ఉండేది. ఆ తరువాత ఫ్రెంచ్, నిజాం, బ్రిటీష్ వారి పాలనలో ఉంది.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. గాలిలో ఠీవిగా నిలబడినట్లు కనిపించే ఈ గాలిగోపురం మంగళగిరికి ఓ ప్రత్యేకత. ఇది పట్టణ వారసత్వ సంపద.

              మంగళగిరి తిరునాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత ఇప్పటికీ ఇక్కడ తిరునాళ్ల చాలా భారీ ఎత్తున జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ చతుర్ధశి రోజు అర్థరాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరుసటి రోజు జరిగే  రథోత్సవాన్ని అప్పటికీ ఇప్పటికీ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 1965లో నిర్మించిన ఆస్తులు-అంతస్తులు చిత్రంలో దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో అని భానుమతి పాడిన పాటలో
‘‘మాయామర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్ళకు పొతే...పొతే
జనం ఒత్తిడికి సతమతమవుతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు దిగు
గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో... అని రాశారంటే ఈ తిరునాళ్లకు ఎంత పేరుందో అర్ధం చేసుకోవచ్చు. తిరునాళ్ల రోజు వేల మంది కొండ శిఖర భాగానికి  చేరుకునేవారు. ఆ రోజు కొండపైకి బారులుతీరి జనం ఎక్కుతున్న దృశ్యాలు కనిపించేవి. కొండ శిఖర భాగాన ఉన్న గండాలయ దీపాన్ని భక్తులు దర్శించుకునేవారు. చాలా మంది ఆ దీపానికి నూనే పోయాలని మొక్కుకునేవారు. వారు కొండపైకి ఎక్కి మొక్కు తీర్చుకునేవారు.  ఇప్పుడు కొండపైకి రోడ్డు మార్గం ఏర్పడింది. ఎక్కివెళ్లే జన సంఖ్య తగ్గింది.
    పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు
              మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2019 మార్చి 11వ తేదీ సోమవారం నుంచి 22వ తేదీ గురువారం వరకు జరుగుతాయి. ఈ 12 రోజులు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత కూడా ఆస్థాన అలంకారోత్సవాలు, ఉగాది ఉత్సవాలు జరుగుతాయి.  11వ తేదీ సోమవారం మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తారు. 12వ తేదీ మంగళవారం ధ్వజారోహణం (కైంకర్యపరులు: మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్), 13వ తేదీ బుధవారం హనుమంత వాహనం (పెదపాలెంకు చెందిన వాశిరెడ్డి మల్లేశ్వరరావు), 14వ తేదీ గురువారం రాజాధిరాజ వాహనం (పెదపాలెంకు చెందిన పెమ్మసాని శైలేంద్ర), 15వ తేదీ శుక్రవారం యాలి వాహనం (మురికిపూడి మాధవరావు), 16వ తేదీ శనివారం సింహ వాహనం(కీర్తి శేషులు మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు), 17వ తేదీ ఆదివారం ఉదయం హంస వాహనం(వేదాంత గోపాల సత్యవతి, ఆమె కుమారులు), రాత్రి గజ వాహనం (పాత మంగళగిరి శ్రీపద్మశాలీయ సంఘం), 18వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి పొన్నవాహనం(మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం)పై స్వామి వారిని ఊరేగిస్తారు.  పొన్నవాహనం రోజు భక్తులు వేలాదిగా వస్తారు. దేవాలయ ప్రాంగణం, మెయిన్ బజారు జనంతో కిటకిటలాడుతుంది.  19వ తేదీ మంగళవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది.
కల్యాణానికి శాశ్వత కైంకర్యపరులు  శేకూరుకు చెందిన వాసిరెడ్డి జయదత్తు, వాసిరెడ్డి ప్రభునాథ్.  అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం మంగళగిరి పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు మధుపర్కములు, మంగళ ద్రవ్యాలు సమర్పిస్తారు. ఈ ఏడాది సంఘం  తరపున అవ్వార్ వాచ్ కంపెనీ అధినేత శరత్ బాబు సమర్పిస్తారు. ప్రధాన అర్చకులుగా దీవి అనంత పద్మనాభాచార్యులు, నల్లూరి శ్రీరామభట్టాచార్యులు వ్యవహరిస్తారు. కళ్యాణం వ్యాఖ్యాతగా గుంటూరు హిందూ కళాశాల సంస్కృత అధ్యాపకులు దీవి నరసింహ దీక్షితులు వ్యవహరిస్తారు.

శ్రీహరికి అత్తింటివారు, శ్రీ మహాలక్ష్మికి పుట్టింటివారుగా
 న్యాయస్థానం నుంచి హక్కు పొందిన పద్మశాలీయులు
      
           శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పద్మశాలీయులు అమ్మవారికి మెట్టెలు, మంగళసూత్రాలు, స్వామివారికి ఉత్తర జంధ్యాలు, పట్టు పీతాంబర వస్త్రాలు సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. అయితే 1915లో దేవస్థానం ధర్మకర్త ఆ ఆచారాన్ని అడ్డుకున్నారు. పద్మశాలీయుల గౌరవానికి భంగం కలిగించారు. వారు తీసుకువచ్చిన కానుకలను తిరస్కరించారు. అతను తన సొంత ఖర్చులతో ఆ కానుకలు సమర్పించారు. ఆడపిల్లకు పుట్టింటివారే ఈ కానుకలు సమర్పిస్తారు. వారు ఎంత పేదవారైనా ఈ ఆచారాన్ని ఆచరించడం సాంప్రదాయం. శ్రీ లక్ష్మి తమ ఆడబిడ్డ అని స్వజాతి అభిమానం గల గ్రామంలోని పద్మశాలీయులు అందరూ కలసికట్టుగా గుంటూరులోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము శ్రీవారికి అత్తింటివారమని, శ్రీలక్ష్మికి పుట్టింటివారమని ప్రతి ఏడు జరిగే కళ్యాణానికి కానుకలు సమర్పించే హక్కు తమ వంశానికి మాత్రమే ఉందని వాదించారు. ఆ నాటి దేవస్థాన ఆచార్యుడు, పురాణ,ఇతిహాసాలను అధ్యయనం చేసిన పండితుడు కందాళ రంగాచార్యులు వారి వాదనను సమర్ధించారు. అంతే కాకుండా అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, తాళపత్ర గ్రంథాల ఆధారంగా పద్మశాలీయుల గురించి, వారి బ్రాహ్మణ జాతి, వారికి గౌరవ మర్యాదలు ఏ విధంగా దక్కుతున్నాయి, వారికి శ్రీ మహాలక్ష్మి సోదరి ఎలా అయింది, వారు మాత్రమే అత్తవారి తరపున కానుకలు సమర్పించడానికి అర్హులు ఎలా అయ్యారో పూర్తి వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న గుంటూరు అడిషనల్ మునసబు పీసీ త్యాగరాజు అయ్యర్ అవర్ ఘళ్  స్వామి వారికి కళ్యాణం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి పుట్టింటి వారిగా కానుకలు సమర్పించే హక్కును  పద్మశాలీయులకు స్థిరపరుస్తూ 1916 ఆగస్ట్ 8న తీర్పు చెప్పారు. పద్మశాలీయులు సముచిత గౌరవం పొందడానికి అర్హులుగా పేర్కొన్నారు. భృగు వంశీయులైన పద్మశాలీయులు సిరికి పుట్టింటివారు అనుటలో సంశయం లేదని తీర్పులో తెలిపారు.

            20వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు బంగారు గరుడోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి శాశ్వత కైంకర్యపరులు వాసిరెడ్డి జయదత్తు, వాసిరెడ్డి ప్రభునాథ్. ఉదయం 11 గంటలకు బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది. దీనికి శాశ్వత కైంకర్యపరులు రాజుపేటకు చెందిన  లేటు అరిపిరాల చినఅప్పయ్య శాస్త్రి, మొక్కపాటి ఆనందయ్య. మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీవారి రథోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి కైంకర్యపరులు మాడభూషి వేదాంతాచార్యులు. ప్రసాదం శ్రీవాసవి సేవాసమితి, దేవతి భగవన్నారాయణ అందజేస్తారు.  ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ప్రాంతవాసులు దేశంలో ఎక్కడ ఉన్నా ఆనవాయితీగా, తమ పట్టణం, తమ ప్రాంతం తిరునాళ్ల అన్న భావనతో  హజరవుతారు. 21 గురువారం ఉదయం 8 గంటలకు చక్రవారి సూర్ణోత్సవం, వసంతోత్సవం. వీటికి కైంకర్యపరులు నిడమర్రుకు చెందిన భూమిపుత్ర కన్సల్టెన్సీ యాజమాన్యం కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి. రాత్రి 8 గంటలకు ధ్వజ అవరోహణం, కేళీ గుర్రం, దొంగలదోపిడి. కైంకర్యపరులు బెంగళూరుకు చెందిన బుల్లా రుక్మిణీరావు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహిస్తారు. కైంకర్యపరులు నందం సాంబశివరావు, శాంతకుమారి. సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వాదశ ప్రదక్షణలు, రాత్రి 8 గంటలకు పర్వంకోత్సవం జరుగుతాయి.
ఆస్థాన అలంకారోత్సవాలు
            మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయి. 23న మత్స్యావతారం, 24న వటపత్రశాయి, 25న రుక్మిణీహరణం, 26న గోవర్ధనోద్ధరణ, 27న గజేంద్ర మోక్షం, 28న పార్థసారధి29న శ్రీరంగనాయకులు, 30న రుక్మిణి కళ్యాణం, 31న స్తంభోద్భవం, ఏప్రిల్ 1న కాళీయమర్థనం, 2న పరమపదనాధుడు, 3న శ్రీరామ పట్టాభిషేకం, 4న కోదండ రాముడు, 5న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అలంకారాలు చేస్తారు. 6వ తేదీ ఉదయం ఉగాది తిరువంజనోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం వికారి నామ సంవత్సరం సందర్భంగా శనగల శేషాంజనేయ గోపాల్ పంచాంగ శ్రవణం ఉంటుంది. సాయంత్రం బంగారు గరుడోత్సవం, అద్దాల మహల్ పవళింపు సేవ, గులాబీ పువ్వులతో సహస్ర నామార్చన జరుగుతాయి.

                కొండపైన స్వామివారికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి అని పేర్లు వచ్చాయి. మంచినీరులో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి తయారు చేసి భక్తులు సమర్పించే పానకం చెంబు అయినా, బిందె అయినా    సగం మాత్రమే స్వామివారు ఆరగిస్తారు.  అదే ఇక్కడి ప్రత్యేకత. మిగిలిన సగం పానకం భక్తులకు వదిలేస్తారు. దానిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఆ పానకం తాగడం వల్ల  నీరసం తగ్గి దేహంలో ఉత్సాహం పెరుగుతుందని, కొత్త చైతన్యం వస్తుందని, దేహంలోని వేడి సమస్థితికి  వస్తుందని, ఆకలి బాగా వేస్తుందని, రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం తగ్గుతుందని, రుమాటిజం, ఎముకలుకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయని, మధుమేహ వ్యాది అదుపులో ఉంటుందని, శత్రువుల బాధ ఉండదని, బుద్ది చురుకుగా పని చేసి జ్ఞాపకశక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. కొండ పైన, కింద ఆలయాలు రెండూ పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందాయి. అంతేకాకుండా ఈ భూమి మీద తొలి వైష్టవ క్షేత్రంగా మంగళగిరిని చెబుతారు. 1820లో తంజావూరు మహారాజు  శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి  దక్షిణావృత శంఖం బహూకరించారు. ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవాల సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనానంతరం ఆ శంఖంతో తీర్ధం తీసుకుంటే అన్ని విధాల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

            50 ఏళ్ల క్రితంతో పోలిస్తే పట్టణం విస్తరించడం, భక్తుల అభిరుచుల్లో మార్పుల వల్ల దైవ కార్యక్రమాలతోపాటు ఇతరత్రా అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో తిరునాళ్ల సందర్భంగా  హరికథ, బుర్రకథ, నాటకాలు, నృత్యం వంటి సంగీత, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రోజులు జరిగేవి. భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చేవారు. శివరాత్రికి, తిరునాళ్లకు సినిమా హాళ్లలో ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు ప్రదర్శించేవారు.  దేవాలయ ప్రాంతంతోపాటు మెయిన్ బజార్, మెయిన్ రోడ్డు, ఇతర వీధులు అన్ని జనంతో సందడిగా ఉండేవి. స్వామివారి కళ్యాణం సందర్భంగా పట్టణంలో అత్యధిక మంది జాగరణ ఉండేవారు.
              విజయదశమి రోజున జరిగే స్వామివారి పారువేట కూడా తిరునాళ్లలా జరిగేది. ఆ రోజు నరసింహ స్వామి గిరి ప్రదక్షణ చేస్తారు.  ఆ సందర్భంగా  స్వామివారు  విప్పటం రోడ్డు సమీపంలోని నాలుగు స్తంభాల మండపం వద్దకు వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది. అక్కడ కూడా మిఠాయి కొట్లు, పిల్లలు ఆడుకునే వస్తువుల అమ్మకాలు వంటివాటితో  తిరునాళ్ల వాతావరణం ఉండేది. రాత్రిపూట భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చేవారు. మంటపం వద్ద స్వామివారిని దర్శించుకునేవారు. దారి వెంట పొలాలు, తోటలు ఉండేవి. అప్పటికి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఇక్కడికి రాలేదు. కొండ అవతల టీబీ శానిటోరియం ఉండేది. చాలా మంది అర్ధరాత్రి దేవునితోపాటు కొండ చుట్టూ తిరిగి వచ్చేవారు. ఆ పారువేట త్రిల్లింగ్ ఇప్పుడు లేదు. తిరునాళ్ల, రథోత్సవం మాత్రం అదే స్థాయిలో జరుగుతున్నాయి.
           అప్పట్లో పెద్ద కోనేరు(కళ్యాణ పుష్కరిణి) వాడకంలో ఉండేది. 1558లో విజయనగర రాజుల కాలంలో దీనిని తవ్వారు. నాలుగువైపుల మెట్లు ఉన్న ఈ కోనేరులో భక్తులు స్నానాలు చేసేవారు. కోనేరులోపలి ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు పూజలు చేసి దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు అది పూర్తిగా పాడుబడిపోయింది. దేవాలయ పాలక మండలి వారు ప్రభుత్వం నుంచి నిధులు పొంది దానికి పూర్వ దశ తేవలసిన అవసరం ఉంది. దేవాలయానికి ముందు చిన్న కోనేరు అవతల కొండ వరకు అప్పట్లో అంతా ఖాళీ స్థలం ఉండేది. అక్కడే టీటీడీ కళ్యాణమండపం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, విద్యుత్ శాఖ కార్యాలయం, జనావాసాలు వచ్చేశాయి. అప్పట్లో చిన్న కోనేరుకు ఉత్తరం వైపున, కొత్తగా నిర్మించిన వసతి గృహసముదాయం వెనుక భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అక్కడే పరిషత్ నాటికలు కూడా ప్రదర్శించేవారు. ఇప్పుడు దేవాలయ సింహద్వారం పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

          ఇక్కడ దేవాలయానికి ఎంత పేరుందో, చేనేత పరిశ్రమకు అంతర్జాతీయంగా అంతకు మించిన  పేరుంది. తరతరాలుగా ఇక్కడి ప్రజలలో అధిక శాతం మంది చేనేతపైనే ఆధారపడి జీవించేవారు. 1980 దశకంలో ఇక్కడ చేనేత పరిశ్రమ బాగా విస్తరించింది. నూలు వ్యాపారం, రంగుల వ్యాపారం, మాస్టర్ వీవర్స్, నూలుకు రంగుల అద్దకం యూనిట్లు, చిలపలు, కండెలు చుట్టడం, ఆసు తోడటం, పడుగులు చేయడం, మొలలు కట్టడం, మగ్గం నేయడం, పన్నెలు తయారు చేయడం వంటి పనులతో పట్టణంలోని వీధులన్నీ సందడిగా కళకళలాడుతుండేది. యాదవులు రంగుల అద్దకం పనులు చేసేవారు. ముస్లింలు పన్నెలు కట్టేవారు. పద్మశాలీయులతోపాటు వైశ్యులు వస్త్రవ్యాపారం చేసేవారు.  పది వేలకు పైగా చేనేత మగ్గాలు ఉండేవి. ప్రతి వీధిలోనూ మగ్గం నేసేవారు. వందకు పైగా చేనేత షెడ్లు (బిల్డింగ్ అనేవారు) ఉండేవి. ఇక్కడి చేనేత చీరల రంగులు, మన్నిక విషయంలో మంచి పేరుంది.  కాలక్రమంలో ఇక్కడ చేనేత మగ్గాలు తగ్గిపోయాయి.  అయినా ఇప్పటికీ మంగళగిరి చేనేత చీరలకు, డ్రెస్ మెటీరియల్ కు ప్రసిద్ధి. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలు చీరల కోసం ఇక్కడకు రావడం, ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడం చేస్తున్నారంటే ఇక్కడి చేనేత విశిష్టత, కార్మికుల నైపుణ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మరమగ్గాల ధాటికి చేనేత రంగం దెబ్బతింది. దాంతో చేనేత కార్మికులు, వారి పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలలో స్థిరపడితే,  ఎక్కువ మంది బంగారం పని చేయడానికి అలవాటుపడ్డారు. చేనేత పరిశ్రమ స్థానాన్ని బంగారపు వస్తువుల తయారీ పరిశ్రమ ఆక్రమించింది. 80వ దశకంలో కూడా మంగళగిరి నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా యువకులు విజయవాడ వెళ్లి బంగారపు పని చేసేవారు. ఇప్పుడు ఇక్కడ పది వేల మందికి పైగా ఈ బంగారం పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు కాక ఇక్కడ నుంచి విజయవాడ, తెనాలి, గుంటూరు వెళ్లి ఈ పని చేసేవారు మూడు వేల మంది వరకు ఉంటారు. చేనేత పరిశ్రమ చాలా సునిశితమైనది. దానికి చాలా నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యత వారి జీన్స్ లో ఉంది. బంగారపు పని కూడా అంతే సునిశితమైనది, దీనికి అటువంటి నైపుణ్యమే కావాలి. అందువల్ల ఆ పనిలో ఇక్కడి వారు చాలా   త్వరగా ఇమిడిపోయారు. ఇక్కడ అన్ని రకాల బంగారు వస్తువులు తయారు చేస్తారు. దానికి అనుబంధంగా బంగారం కరగబెట్టడం, కత్తిరించడం, మెరుగుపెట్టడం వంటి మొత్తం 20 రకాల పనులు చేస్తుంటారు. ఇక్కడ తయారు చేసే బంగారు వస్తువులకు కూడా దక్షిణ భారత దేశంలో మంచి పేరు వచ్చింది. దానికి ఇక్కడి కార్మికుల నైపుణ్యమే కారణం.

            మంగళగిరి వాసులు ఏ పని చేసినా సందడేగాని, అలజడి ఉండదు. వివాదాలకు తావులేకుండా అన్ని కులాలవారు కలిసిమెలిసి జీవిస్తారన్నదానికి నిదర్శనం ఇది. మంగళగిరి ప్రత్యేకత కూడా ఇదే. ఎన్నికలు వచ్చినప్పడు మంగళగిరి పేరు చెబితే ఉభయ కమ్యూనిస్టు నేతలు తలలు పట్టుకుంటారు. రాష్ట్రమంతటా కలిసి పోటీ చేసినా ఇక్కడ మాత్రం ఇద్దరూ పోటీపడేవారు. శాసనసభ స్థానాన్ని, మున్సిపాలిటీని అనేక సార్లు దక్కించుకున్నవారు ఈ విధంగా పోటీపడి బలహీనపడ్డారు. మంగళగిరి గ్రామ పంచాయతీ 1969లో మున్సిపాలిటీగా  ఏర్పడింది. ఇక్కడ ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నందున ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా మున్సిపల్ చైర్మన్ పదవి మాత్రం వారినే వరిస్తుంది. సమైక్యతకు చిహ్నంగా వైస్ చైర్మన్ పదవిని మాత్రం ఒకసారి ముస్లింలకు, మరొకసారి ఎస్సీలకు, యాదవులకు, ఇంకోసారి వైశ్యులకు ఇస్తూ వస్తున్నారు. మంగళగిరి రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతమైన పట్టణం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచింది. ఒకప్పుడు ఎర్ర జెండా రెపరెపలాడిన నేల ఇది. ఇక్కడ ఒక వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు  అదే స్థాయిలో నాస్తిక సమాజం, హేతువాదం, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో భౌతిక వాదానికి సంబంధించిన శిక్షణా తరగతులు, ఇతర కార్యక్రమాలు జరుగుతుండేవి. 1983లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీనటి జమున పోటీ చేసి ఓడిపోయారు. గుంటూరు, విజయవాడల మధ్య జాతీయ రహదారి పక్కన ఉండటం వల్ల కూడా పట్టణం అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధానిలో భాగమైంది. దానికి సింహద్వారంగా నిలిచింది.
         బాధాకరమైన విషయం ఏమిటంటే ఒక వైపు పట్టణం పెరుగుతుంటే మరోవైపు వీధులన్నీ కుంచించుకుపోతున్నాయి. గతంలో మెయిన్ బజార్, షరాబ్ బజార్, మసీదు వీధుల్లో లారీలు తిరిగేవి. సాధుసోడా కొట్టు ఎదురుగా అప్పట్లో గుర్రపు బళ్లను నిలిపేవారు. విజయవాడ నుంచి లారీలలో సరుకులు తీసుకువచ్చి చిల్లర దుకాణాలలో దింపేవారు. ఆక్రమణలు పెరిగిపోవడంతో ఇప్పుడు మనుషులు నడిచివెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఈ వీధులను విశాలం చేయవలసిన అవసరం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. ఫొటోలు : సాంబ - ఫొటోగ్రాఫర్.

Mar 11, 2019


ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం స్వీకరించిన బీటీ నాయుడు
              సచివాలయం, మార్చి 11: శాసనసభా ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రం అందజేశారు. మార్చి 5న ఆయన శాసన మండలి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 30 తరువాత బీటీ నాయుడు ప్రమాణస్వీకారం చేస్తారు.

ఎమ్మెల్సీగా శమంతకమణి ప్రమాణస్వీకారం



సచివాలయం, మార్చి 11: శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి చైర్మన్ షరీఫ్ సోమవారం ఉదయం ఎమ్మెల్సీ శమంతకమణి చేత రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు.  శాసనమండలి సభ్యురాలిగా శమంతకమణి పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది.  గవర్నర్ కోటాలో ఆమె  రెండవసారి ఎంపికయ్యారు.


Mar 10, 2019


2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ఏప్రిల్ 11న పోలింగ్ - మే 23న ఫలితాలు
       ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసన సభ  ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 11న ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు.

మొదటి దశలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు
ఏప్రిల్ 11న పోలింగ్.. మే 23న ఫలితాలు
         దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఆదివారం (10-03-2019) ఢిల్లీలో లోక్‌సభతో పాటూ నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేసింది.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..
మార్చి 18న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది
మార్చి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
మార్చి 25 నామినేషన్లు వేసేందుకు ఆఖరు తేదీ
మార్చి 26న నామినేష్లను పరిశీలిస్తారు
మార్చి 28 వరకు నామినేష్ల ఉపసంహరణకు గడువు
ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు
      షెడ్యూల్ రావడంతో పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. అలాగే ప్రచారానికి కేవలం 15 నుంచి 20 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. పోలింగ్ జరిగిన 41 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి.

లోక్‌సభతో పాటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లోనే ప్రక్రియ మొత్తం ముగిసేలా 7 దశల్లో ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు రెండు నెలల పాటూ ఎన్నికల హడావిడి ఉంటుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు అవసరమవుతాయని ఈసీ భావిస్తోంది. అందుకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తోంది.

Mar 9, 2019


మానవత్వం పరిమళించిన 
మంచి మనిషి డాక్టర్ సంజీవ్ కుమార్      
 "వైద్యో నారాయణోహరిః" అనిఆర్యోక్తి. దానికి నిలువెత్తు రూపకంగా చేతిలో స్టెతస్కోప్ పట్టి రోగాలను నయం చేసే ఆయన... సమాజంలోని లక్షలాది నిరుపేదల గుండె చప్పుళ్లను సైతం వింటున్నారు.మంచు తెరలాంటి తెల్లకోటు వేసుకొని పసి పాప బోసినవ్వుల్లాగాచిరునవ్వులు చిందిస్తూ అందరిని ఆత్మీయులుగా భావించి పలుకరించే ఆయనమనసు సైతం తెల్లన.ఆపరేషన్ల ద్వారా ప్రాణాలు పొసేఆయన,సమాజంలోని పేదరికంపై పోరాడుతున్నారు. ఉచిత ఆపరేషన్లు, ఉచిత పెన్షన్లు, పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మొదలగు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని దారిద్య్రానికి ఆపరేషన్ చేస్తున్నారు.ఆ డాక్టర్ మరెవరోకాదు.... ఆయనే శ్రీ శింగరిసంజీవ్ కుమార్ఆయనగురించిసమాజానికితెలియచేసేభాగ్యంమాకుకలిగినందుకుసంతోషిస్తున్నాను. 

డాక్టర్ సంజీవ్ కుమార్ గారిబాల్యం:వస్త్ర వ్యాపారరంగములోప్రముఖులైనశ్రీశింగరి శ్రీరంగం, శ్రీమతి రంగమ్మ గార్ల పుణ్య దంపతులకు1967 వ సంవత్సరము, జనవరి మాసము 3 వ తేదీన మన కర్నూలు నగరము నందు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు జన్మించారు. బాల్యము నుండియు  చాలా హుషారుగా, చురుకుగా ఉంటూ ఆట పాటలంయందు, చదువులంయందు ప్రతిభ కనపరిచేవారు. ఆరుగురి సంతానంలో రెండవ వారు సంజీవ్ కుమార్.
కుటుంబ నేపథ్యం :
·         శింగరి శ్రీరంగం గారి కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు గంగాధర్, అచ్చుతరావు, ముగ్గురు సోదరీమణులు మహాలక్ష్మి, ఛాయాదేవి, మంజుల మొత్తం ఆరుగురూ డాక్టర్లే. విద్య ప్రాధాన్యతను గుర్తించి వారిని చదివించిన ఘనత అంతా వారి మాతాపితలదే. పిల్లలు అందరూ ప్రభుత్వ కాలేజీలలో MBBS సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, ఇద్దరు తమ్ముళ్ల భార్యలు పద్మజ, సువర్ణ, ముగ్గురు సోదరీమణుల భర్తలు సందా సూర్య ప్రకాష్, మందా నాగేశ్వరరావు, కన్నెపల్లి శ్రీనివాస్ లు కూడా డాక్టర్లే. శ్రీరంగం గారి 14 మంది మనవళ్లు, మనవరాళ్లలో ఏడుగురు డాక్టర్లు. ఒక మనవడు, ఒక మనవరాలు డాక్టర్లను పెళ్లి చేసుకున్నారు. వెరసి 21 మంది డాక్టర్లు. వారిది ఓ పెద్ద డాక్టర్ల కుటుంబంగా ప్రసిద్ధికెక్కింది. ఒకే కుటుంబములో 21 మంది డాక్టర్లు ఉండడం రాయలసీమలో ప్రప్రథమం. ఇది బహుశా ఆంధ్ర ప్రదేశ్ వైద్య రంగంలోనే ఒక  అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వీరిలో అత్యధికులు బంగారు పథకాలు సాధించినవారు కావడముమరొక ఒక విశేషం.
·         సంజీవ్ కుమార్గారు 1992 మార్చి 4  డాక్టర్ బలిమిడి వసుంధరను పెళ్లి చేసుకున్నారు. వారి కుమార్తె కుమారి సౌమ్య కూడా తండ్రి బాటలోనేపయనించి మొదటి ప్రయత్నంలో ఓపెన్ క్యాటగిరీలో కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించి పూర్తి చేశారు.  వారి ఇద్దరు కుమారులు అక్షయ్, అభిరామ్ 9,8 తరగతులు చదువుతున్నారు.
ప్రతిభాశాలియైనవిద్యార్థి:పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఆయన తొలి నుంచి చదువులలోప్రతి తరగతిలో ప్రథములుగా నిలుస్తూ, ఉన్నత శిఖరాలు అధిరోహించారు.
·         1971-1982 మధ్య కాలంలో కర్నూలు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివారు. అక్కడ ప్రతి తరగతిలోనూ అగ్రభాగాన నిలిచారు. విద్యార్థి దశలోనే ఆయనకు నాయకత్వ లక్షణాలు అబ్బడంతో  పదవ తరగతిలో స్కూల్ విద్యార్థి నాయకుడిగా అందరి  ప్రశంశలను పొందారు. 
·         1982-84లో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. ఆ పరంపర అలాగే కొనసాగించారు.
·         1984-1990లో MBBS చదివారు. మొదటి ప్రయత్నంలోనే కర్నూలు మెడికల్ కాలేజీ నందు MBBS సీటు సాధించారు. అక్కడ కూడా డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు.MBBSఫైనల్ పరీక్షలలో గైనెకాలజి  విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో 1st Rank తో బంగారు పతకం సాధించారు. జనరల్ సర్జరీ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. 
·         1992-1995 మధ్య కాలములో కర్నూలు మెడికల్ కాలేజీలో MS జనరల్ సర్జరీ చదివారు. MSప్రవేశ పరీక్షలో విశ్వవిద్యాలయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించి ఓపెన్ కేటగిరీలో సీటు పొందారు.యూనివర్సిటీ 1st Rank తో MS పూర్తి చేశారు.
·         1998-2000 :MChయూరాలజీసూపర్ స్పెషాలిటీకోర్సుప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి 2nd Rank సాధించి, హైద్రాబాదులోనిఉస్మానియా మెడికల్ కాలేజీనందుచదివారు. MCh Finalపరీక్షలందు డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు.
·         "ప్రతిభ" మరియు అణకువఉంటే దేనైనా సాధించ వచ్చని మన డాక్టర్ గారు విద్యార్థి దశ నుండే నిరూపించి ఎందరో భావి విద్యార్థులకు మార్గ దర్శకులైనారు.
వైద్యసేవలోనిష్ణాతుడు :అత్యధిక సంఖ్యలో లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసిన ఘనత ఆయనది. ప్రజల డాక్టరుగా,ఉత్తమ వైద్యులుగా పేరు గడించారు.
·         1990-1992 మధ్య కాలము :కర్నూలు నగరము నరసింగ రావు పేటలో  బెంగుళూరు హాస్పిటల్అను సర్జికల్ క్లినిక్ స్థాపించి, వేల సంఖ్యలో  శస్త్ర చికిత్సలు నిర్వహించారు. “2000 వేల రూపాయలకేఆపరేషన్లుఅన్న నినాదంతో వేల మంది పేదల గుండెలలో “పేదల డాక్టరు” గా నిలిచిపోయారు.
·         2000- 2005 మధ్య కాలము :కర్నూలు నగరము జిప్సన్ కాలనీలో  బెంగుళూరుసూపర్ స్పెషలిటీ హాస్పిటల్అను సర్జికల్ హాస్పిటల్స్థాపించి యూరాలజీ మరియు లాపరోస్కోపీ విభాగాలలో పేరు గడించారు.
·        2006 నుండి ప్రస్తుతము వరకు :పేదలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న సంకల్పంతో కర్నూలులోని వెంకటరమణ కాలనీ నందు, అత్యాధునిక వసతులతో 50 పడకల ఆయుష్మాన్ ద ఫ్యామిలీ హాస్పటల్స్థాపించారు. ఈ ఆస్పత్రి ద్వారా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ మరియు బళ్ళారి జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కార్పోరేట్ ఆస్పత్రి. ఇక్కడ కార్పోరేట్ వైద్యం అందుతుంది. ఫీజులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయి. అదే దీని ప్రత్యేకత. అది డాక్టర్ సంజీవ్ కుమార్ గారికేసాధ్యమయ్యింది. ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ సర్జరీ, యూరాలజీ, గైనకాలజీ సంబంధిత వ్యాధులకు ల్యాప్రోస్కోపి పద్ధతిలో శస్త్ర చికిత్సలు చేస్తారు. అపెండిక్స్, పిత్తాశయంహెర్నియా, కడుపు నొప్పి, అల్సర్, వరిబీజం, గొంతులో గడ్డలు, మొలలు, కిడ్నీలో రాళ్లు, ఎక్టోపిక్ గర్భం, అండాశయ, గర్భాశయవ్యాధులు ... మొదలైన అన్ని రకాల వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేస్తారు. లేజర్ సర్జరీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.  ఈ ఆస్పత్రి ద్వారా ఆయన  ప్రజలకు బాగా చేరువయ్యారు. రోగులతో నవ్వుతూ మాట్లాడుతూ, వారిలో మనోధైర్యాన్ని నింపుతూ ప్రజల మన్నన పొందుతున్నారు.  "హస్తవాసి మంచిది" అన్న పేరు పొందారు.పేద ప్రజలకు "సంజీవని " అందిస్తూ, తనపేరును  సార్థకం చేసుకున్నారు.
సేవా తత్పరత వంశపార్యంపరంగావచ్చింది: "మానవ సేవ్ మాధవ సేవ" అను సూక్త్యానుసారం సేవా దృక్పథం అనేది వారి రుధిరంలోనే ఉంది.  జననీజనకులనుండి  ఆయనకు వారసత్వముగా సంక్రమించింది. సమస్త దానాలలోకెల్లా గొప్ప దానం భూదానం. దాని ప్రాముఖ్యతను గుర్తించిశ్రీశ్రీరంగం గారు తన సోదరులతో కలిసి పత్తికొండ గ్రామములోని పెద్దల ఆస్తి అయిన 7 ఎకరాల భూమిని 145 కుటుంబాలకు ఉచితంగా ఇచ్చారు.అంజనేయ నగర్అని పిలువబడే ఆ కాలనీ పత్తికొండ పాత పేటలో ఉన్నది. సమాజములో వెనుకబడిన వర్గాల వారినిఆదరించడములో తాము ముందుంటామనినిరూపించుకున్న కుటుంబం డాక్టర్ గారిది.
పేదప్రజల గుండె చప్పుడుడాక్టర్శింగరిసంజీవ్కుమార్ : తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న డాక్టర్ సంజీవ్ కుమార్గారు పేద ప్రజల గుండె చప్పుడై చేపడుతున్న  సే

వా కార్యక్రమాలు :
v  పెన్షన్లు : మిత్రుడు వేమయ్య మరియు సోదరుడు అచ్యుతరావుతో కలిసి గత రెండున్నర సంవత్సరములుగా 30 నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 1000/- చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.
v  ఉచిత వైద్య శిబిరములు:
·         "ఆరోగ్యమే మహాభాగ్యము"అన్న సూత్రాన్ని గుర్తించి 2008 నుండి2016  వరకుఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి, ఉచితంగా మందులు పంపీణీ  చేశారు.
·         2016లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఆనంద జ్యోతి సేవా  ట్రస్ట్మరియు బుట్టా ఫౌండేషన్వారిఆధ్వర్యములో ఒకే రోజు 7 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి 7520మందికి ఉచిత వైద్యం అందించారు. వలసలకు పేరొందిన కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ మరియు పత్తికొండ గ్రామాలలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
·         2018 ఆగష్టు నుండి 2019 జనవరి వరకు :“ఆనంద  జ్యోతి 100 ఉచిత క్యాంపులు 500 ఉచిత ఆపరేషన్లు అను పథకంలో భాగంగా 62 ఉచిత సర్జరీ క్యాంపులు నిర్వహించి, 375 ఉచిత ఆపరేషన్లు చేయడం విశేషం.ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు కూడా ఆనంద జ్యోతి సేవా ట్రస్ట్ ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. హాస్పటల్ బెడ్ ఛార్జీలు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, ఆక్సిజన్, డాక్టర్ ఫీజులు, నర్సు ఫీజు, రక్త పరీక్షలు అన్నీ ఉచితం. రోగులు మందుల ఖర్చు మాత్రమే భరించవలసి ఉంటుంది.
v  విద్యార్థులకు ప్రోత్సాహకాలు:
·         మనిషిలోని అంతర్గతంగా దాగిన శక్తులను వెలికి తీయటానికి గల ఏకైక మార్గం ప్రోత్సాహకాలివ్వడం. ప్రతిసంవత్సరం పదవ తరగతి,  ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు  ప్రోత్సహకాలు అందిస్తూ వారికి  బాసటగా నిలుస్తున్నారు.
·         "విద్యార్జనకు పేదరికం అడ్డు కాదు".నిరుపేద కుటుంబములో జన్మించి 2016 MBBS ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి 1ST RANK సాధించిన  మాచాని హేమలత గారికి, మిత్రులతో కలిసి, పౌర సన్మానం చేశారు. రాజకీయ ఉద్దండులు, మేధావులుమరియువేలాది  మంది జొహరాపురంప్రజలు పాల్గొన్న ఆ కార్యక్రమము గ్రామీణ పేద ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
v  ఉద్యోగ మేళాలు: నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు పలు సార్లు ఉద్యోగ మేళాలు నిర్వహించారు.
v  ప్రవేశ పర్రేక్షలకు కోచింగ్: ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకింగ్ మరియు సివిల్స్ ప్రవేశ పరీక్షలకోచింగ్ఇప్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
v  వివాహ పరిచయ వేదికలు: గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వివాహ పరిచయ వేదికలు నిర్వహించారు.
v  ఆపత్కర సమయాలలో మానవత్వం:"ఆపద సమయాలలో వెన్ను తట్టి నిలిచి ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు"  అని గ్రహించిన వారు కావటం చేత, కర్నూలువరదలసమయములోవందల మందికిఆయుష్మాన్ఆసుపత్రిలోఆశ్రయంకల్పించిభోజనవసతిసమకూర్చారు.ఉచిత వైద్య సేవలు అందించారు.
v  సంఘ సేవ: కుల సంఘాలలో మరియు బలహీన వర్గాలలో ఐకమత్యం సాధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని  13 జిల్లాలు పర్యటించి సంఘీయులను విశేషంగా చైతన్య పరిచారు.
v  కర్నూలు ఫోర్ట్ లయిన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.
v  లలిత కళలలో ఉచిత శిక్షణ : తన చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం వారిది. కుల మతాలు, ఆర్ధిక స్తోమతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లలిత కళలలో, POPA ద్వారా, ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.జిల్లా స్థాయి ఉద్యోగస్తులు కూడా  తమ పిల్లలను ఈ శిక్షణా తరగతులకు పంపిస్తున్నారంటే శిక్షణా ప్రమాణాల స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ విధంగా ఆయన అన్ని వర్గాల వారికి ఆత్మబంధువయ్యారు. ప్రజలజీవితాలలో వెలుగు నింపేందుకు, మహోన్నత విలువలతోసేవలు అందిస్తూ, సమాజ నిర్మాణానికి నడుంకట్టి ముందడుగు వేస్తున్న డా. సంజీవ్ కుమార్ గారు ఆదర్శనీయులు.

రాజకీయరంగప్రవేశం :
శింగరి శ్రీరంగ వంశబ్దశింగరిసంజీవ కుమార్నామధేయా ! శ్రీరంగం రంగమ్మల పుత్ర రత్నమా ! మీ పేరులోనే ఆదర్శం, సేవా గుణం సమ్మిళతములై ప్రకాశించినవి. అందుకే జీవం పొసే "సంజీవ కుమార్" గా ప్రముఖ వైద్యులుగా కీర్తి గడించావు. దాదాపు 27 సంవత్సరాలు మీ శ్రీమతి వసుంధరతో కలిసి కుటుంబ భారాన్ని మోశారు.
సామాన్యుల కష్టాలు గుర్తెరిగిన కుటుంబం మీది. అందుకే పరంపరగా వచ్చిన పొలాన్ని నిలువ నీడ లేక నిరాశ్రయులైన వారికి ధారాదత్తం చేశారు మీ పెద్దలు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల ఇళ్లలో దీపం వెలిగించారు.
నిజాయితీగా వైద్య సేవలు చేస్తూ సామాన్యులకు కూడా వైద్యము భారము కాదుఅని నిరూపించారు. నిరూపిస్తూ ఉన్నారు. వైద్య శాస్త్ర సాంకేతికకు మారు పేరుగా కర్నూలు నగరములో వెలిసిందిఆయుష్మాన్ హాస్పిటల్. గతములో బెంగళూరు హాస్పిటల్పేరుతొ రెండు వేలకే శస్త్ర చికిత్సలునిర్వహించి రాయలసీమలోనే అతి తక్కువ ధరకే ఆపరేషన్ చేసే "పేదల డాక్టరు"గా  ఖ్యాతి గడించారు. పేదల డాక్టరుగా చిన్న-పెద్ద, బీద-ధనిక, అను వ్యత్యాసము చూప కుండా, 'నేను మీ అందరి వాడిని' అని ముందుకు వెళ్తున్నారు. అందరి గుండెల్లో నిలిచి పోయారు.
భాయి భాయి అన్న నినాదాముతో అన్ని కులాలను, మతాలను, వర్గాలను ఏకం చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఎందరో కళాకారులను, సామాజిక కార్యకర్తలను, యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు చేయూత నిస్తున్నారు. పేద రోగుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. చేస్తూనే వున్నారు. అందుకే గాంధీ జయంతి రోజున గాంధేయ వాదిగా 'ఆనంద జ్యోతి ట్రస్ట్' నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేపట్టారు.  మిమ్ములను ప్రోత్సహించడం, ముందుకు నడిపించడం మా బాధ్యత, కనీస కర్తవ్యం..

అన్యాయాన్ని అరికట్టడం కోసం... దగా పడ్డ తమ్ముళ్లు చెల్లెళ్లకు చేయూతనివ్వడం కోసం.....నిద్రాణమైయున్న మన సమాజాన్ని మేల్కొల్పడం కోసం.....అన్న పూర్ణ దేశంగా పేరు గాంచిన మన సమాజములోని కటిక పేదల కోసం.... అభాగ్యులను, నిరుపేదలను ఆదుకోవడం కోసం .....విద్య వైద్యం అందరి హక్కు అనిచెప్పడం కాదు చేసి చూపించే ఉత్తమ నాయకుల కొరకు ఎదురు చూసే ఈ సమాజము కోసం…. మీలాంటి వారు రాజకీయ ప్రవేశం చేసి చట్ట సభల్లో మీ గళం వినిపించాలి. సామాన్య ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్న మీ లాంటి వారు ప్రజా క్షేత్రములోకిరావాలనియువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారంతా మీకు జేజేలుపలుకుతున్నారు. రాజకీయ నాయకునిగా మాకు అండగా నిల్చోమని సాదరంగా మన సమాజం అంతా మీకు ఆహ్వానం పలుకుతుంది.

ఇట్లు
 డాక్టర్ సంజీవ్ కుమార్ అభిమాన సేవా సంఘం, కర్నూలు జిల్లా.


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...