Mar 16, 2019

మంగళగిరి నాడు – నేడు

              

 

         మంగళగిరి అంటే  చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం,  కొండపైన పానకాలస్వామి, తిరునాళ్ల గుర్తుకు వస్తాయి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. ఆంధ్ర శాతవాహనులు
, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రిజులు,  విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, రెడ్డి రాజులు, గజపతులు, శ్రీ కృష్ణదేవ రాయలు, కుతుబ్‌షాహీలు పాలించిన ప్రాంతపరిధిలో మంగళగిరి ఉండేది. ఆ తరువాత ఫ్రెంచ్, నిజాం, బ్రిటీష్ వారి పాలనలో ఉంది.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. గాలిలో ఠీవిగా నిలబడినట్లు కనిపించే ఈ గాలిగోపురం మంగళగిరికి ఓ ప్రత్యేకత. ఇది పట్టణ వారసత్వ సంపద.

              మంగళగిరి తిరునాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత ఇప్పటికీ ఇక్కడ తిరునాళ్ల చాలా భారీ ఎత్తున జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ చతుర్ధశి రోజు అర్థరాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరుసటి రోజు జరిగే  రథోత్సవాన్ని అప్పటికీ ఇప్పటికీ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 1965లో నిర్మించిన ఆస్తులు-అంతస్తులు చిత్రంలో దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో అని భానుమతి పాడిన పాటలో
‘‘మాయామర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్ళకు పొతే...పొతే
జనం ఒత్తిడికి సతమతమవుతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు దిగు
గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో... అని రాశారంటే ఈ తిరునాళ్లకు ఎంత పేరుందో అర్ధం చేసుకోవచ్చు. తిరునాళ్ల రోజు వేల మంది కొండ శిఖర భాగానికి  చేరుకునేవారు. ఆ రోజు కొండపైకి బారులుతీరి జనం ఎక్కుతున్న దృశ్యాలు కనిపించేవి. కొండ శిఖర భాగాన ఉన్న గండాలయ దీపాన్ని భక్తులు దర్శించుకునేవారు. చాలా మంది ఆ దీపానికి నూనే పోయాలని మొక్కుకునేవారు. వారు కొండపైకి ఎక్కి మొక్కు తీర్చుకునేవారు.  ఇప్పుడు కొండపైకి రోడ్డు మార్గం ఏర్పడింది. ఎక్కివెళ్లే జన సంఖ్య తగ్గింది.
    పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు
              మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2019 మార్చి 11వ తేదీ సోమవారం నుంచి 22వ తేదీ గురువారం వరకు జరుగుతాయి. ఈ 12 రోజులు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత కూడా ఆస్థాన అలంకారోత్సవాలు, ఉగాది ఉత్సవాలు జరుగుతాయి.  11వ తేదీ సోమవారం మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తారు. 12వ తేదీ మంగళవారం ధ్వజారోహణం (కైంకర్యపరులు: మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్), 13వ తేదీ బుధవారం హనుమంత వాహనం (పెదపాలెంకు చెందిన వాశిరెడ్డి మల్లేశ్వరరావు), 14వ తేదీ గురువారం రాజాధిరాజ వాహనం (పెదపాలెంకు చెందిన పెమ్మసాని శైలేంద్ర), 15వ తేదీ శుక్రవారం యాలి వాహనం (మురికిపూడి మాధవరావు), 16వ తేదీ శనివారం సింహ వాహనం(కీర్తి శేషులు మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు), 17వ తేదీ ఆదివారం ఉదయం హంస వాహనం(వేదాంత గోపాల సత్యవతి, ఆమె కుమారులు), రాత్రి గజ వాహనం (పాత మంగళగిరి శ్రీపద్మశాలీయ సంఘం), 18వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి పొన్నవాహనం(మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం)పై స్వామి వారిని ఊరేగిస్తారు.  పొన్నవాహనం రోజు భక్తులు వేలాదిగా వస్తారు. దేవాలయ ప్రాంగణం, మెయిన్ బజారు జనంతో కిటకిటలాడుతుంది.  19వ తేదీ మంగళవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది.
కల్యాణానికి శాశ్వత కైంకర్యపరులు  శేకూరుకు చెందిన వాసిరెడ్డి జయదత్తు, వాసిరెడ్డి ప్రభునాథ్.  అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం మంగళగిరి పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు మధుపర్కములు, మంగళ ద్రవ్యాలు సమర్పిస్తారు. ఈ ఏడాది సంఘం  తరపున అవ్వార్ వాచ్ కంపెనీ అధినేత శరత్ బాబు సమర్పిస్తారు. ప్రధాన అర్చకులుగా దీవి అనంత పద్మనాభాచార్యులు, నల్లూరి శ్రీరామభట్టాచార్యులు వ్యవహరిస్తారు. కళ్యాణం వ్యాఖ్యాతగా గుంటూరు హిందూ కళాశాల సంస్కృత అధ్యాపకులు దీవి నరసింహ దీక్షితులు వ్యవహరిస్తారు.

శ్రీహరికి అత్తింటివారు, శ్రీ మహాలక్ష్మికి పుట్టింటివారుగా
 న్యాయస్థానం నుంచి హక్కు పొందిన పద్మశాలీయులు
      
           శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పద్మశాలీయులు అమ్మవారికి మెట్టెలు, మంగళసూత్రాలు, స్వామివారికి ఉత్తర జంధ్యాలు, పట్టు పీతాంబర వస్త్రాలు సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. అయితే 1915లో దేవస్థానం ధర్మకర్త ఆ ఆచారాన్ని అడ్డుకున్నారు. పద్మశాలీయుల గౌరవానికి భంగం కలిగించారు. వారు తీసుకువచ్చిన కానుకలను తిరస్కరించారు. అతను తన సొంత ఖర్చులతో ఆ కానుకలు సమర్పించారు. ఆడపిల్లకు పుట్టింటివారే ఈ కానుకలు సమర్పిస్తారు. వారు ఎంత పేదవారైనా ఈ ఆచారాన్ని ఆచరించడం సాంప్రదాయం. శ్రీ లక్ష్మి తమ ఆడబిడ్డ అని స్వజాతి అభిమానం గల గ్రామంలోని పద్మశాలీయులు అందరూ కలసికట్టుగా గుంటూరులోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము శ్రీవారికి అత్తింటివారమని, శ్రీలక్ష్మికి పుట్టింటివారమని ప్రతి ఏడు జరిగే కళ్యాణానికి కానుకలు సమర్పించే హక్కు తమ వంశానికి మాత్రమే ఉందని వాదించారు. ఆ నాటి దేవస్థాన ఆచార్యుడు, పురాణ,ఇతిహాసాలను అధ్యయనం చేసిన పండితుడు కందాళ రంగాచార్యులు వారి వాదనను సమర్ధించారు. అంతే కాకుండా అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, తాళపత్ర గ్రంథాల ఆధారంగా పద్మశాలీయుల గురించి, వారి బ్రాహ్మణ జాతి, వారికి గౌరవ మర్యాదలు ఏ విధంగా దక్కుతున్నాయి, వారికి శ్రీ మహాలక్ష్మి సోదరి ఎలా అయింది, వారు మాత్రమే అత్తవారి తరపున కానుకలు సమర్పించడానికి అర్హులు ఎలా అయ్యారో పూర్తి వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న గుంటూరు అడిషనల్ మునసబు పీసీ త్యాగరాజు అయ్యర్ అవర్ ఘళ్  స్వామి వారికి కళ్యాణం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి పుట్టింటి వారిగా కానుకలు సమర్పించే హక్కును  పద్మశాలీయులకు స్థిరపరుస్తూ 1916 ఆగస్ట్ 8న తీర్పు చెప్పారు. పద్మశాలీయులు సముచిత గౌరవం పొందడానికి అర్హులుగా పేర్కొన్నారు. భృగు వంశీయులైన పద్మశాలీయులు సిరికి పుట్టింటివారు అనుటలో సంశయం లేదని తీర్పులో తెలిపారు.

            20వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు బంగారు గరుడోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి శాశ్వత కైంకర్యపరులు వాసిరెడ్డి జయదత్తు, వాసిరెడ్డి ప్రభునాథ్. ఉదయం 11 గంటలకు బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది. దీనికి శాశ్వత కైంకర్యపరులు రాజుపేటకు చెందిన  లేటు అరిపిరాల చినఅప్పయ్య శాస్త్రి, మొక్కపాటి ఆనందయ్య. మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీవారి రథోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి కైంకర్యపరులు మాడభూషి వేదాంతాచార్యులు. ప్రసాదం శ్రీవాసవి సేవాసమితి, దేవతి భగవన్నారాయణ అందజేస్తారు.  ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ప్రాంతవాసులు దేశంలో ఎక్కడ ఉన్నా ఆనవాయితీగా, తమ పట్టణం, తమ ప్రాంతం తిరునాళ్ల అన్న భావనతో  హజరవుతారు. 21 గురువారం ఉదయం 8 గంటలకు చక్రవారి సూర్ణోత్సవం, వసంతోత్సవం. వీటికి కైంకర్యపరులు నిడమర్రుకు చెందిన భూమిపుత్ర కన్సల్టెన్సీ యాజమాన్యం కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి. రాత్రి 8 గంటలకు ధ్వజ అవరోహణం, కేళీ గుర్రం, దొంగలదోపిడి. కైంకర్యపరులు బెంగళూరుకు చెందిన బుల్లా రుక్మిణీరావు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహిస్తారు. కైంకర్యపరులు నందం సాంబశివరావు, శాంతకుమారి. సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వాదశ ప్రదక్షణలు, రాత్రి 8 గంటలకు పర్వంకోత్సవం జరుగుతాయి.
ఆస్థాన అలంకారోత్సవాలు
            మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయి. 23న మత్స్యావతారం, 24న వటపత్రశాయి, 25న రుక్మిణీహరణం, 26న గోవర్ధనోద్ధరణ, 27న గజేంద్ర మోక్షం, 28న పార్థసారధి29న శ్రీరంగనాయకులు, 30న రుక్మిణి కళ్యాణం, 31న స్తంభోద్భవం, ఏప్రిల్ 1న కాళీయమర్థనం, 2న పరమపదనాధుడు, 3న శ్రీరామ పట్టాభిషేకం, 4న కోదండ రాముడు, 5న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అలంకారాలు చేస్తారు. 6వ తేదీ ఉదయం ఉగాది తిరువంజనోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం వికారి నామ సంవత్సరం సందర్భంగా శనగల శేషాంజనేయ గోపాల్ పంచాంగ శ్రవణం ఉంటుంది. సాయంత్రం బంగారు గరుడోత్సవం, అద్దాల మహల్ పవళింపు సేవ, గులాబీ పువ్వులతో సహస్ర నామార్చన జరుగుతాయి.

                కొండపైన స్వామివారికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి అని పేర్లు వచ్చాయి. మంచినీరులో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి తయారు చేసి భక్తులు సమర్పించే పానకం చెంబు అయినా, బిందె అయినా    సగం మాత్రమే స్వామివారు ఆరగిస్తారు.  అదే ఇక్కడి ప్రత్యేకత. మిగిలిన సగం పానకం భక్తులకు వదిలేస్తారు. దానిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఆ పానకం తాగడం వల్ల  నీరసం తగ్గి దేహంలో ఉత్సాహం పెరుగుతుందని, కొత్త చైతన్యం వస్తుందని, దేహంలోని వేడి సమస్థితికి  వస్తుందని, ఆకలి బాగా వేస్తుందని, రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం తగ్గుతుందని, రుమాటిజం, ఎముకలుకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయని, మధుమేహ వ్యాది అదుపులో ఉంటుందని, శత్రువుల బాధ ఉండదని, బుద్ది చురుకుగా పని చేసి జ్ఞాపకశక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. కొండ పైన, కింద ఆలయాలు రెండూ పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందాయి. అంతేకాకుండా ఈ భూమి మీద తొలి వైష్టవ క్షేత్రంగా మంగళగిరిని చెబుతారు. 1820లో తంజావూరు మహారాజు  శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి  దక్షిణావృత శంఖం బహూకరించారు. ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవాల సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనానంతరం ఆ శంఖంతో తీర్ధం తీసుకుంటే అన్ని విధాల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

            50 ఏళ్ల క్రితంతో పోలిస్తే పట్టణం విస్తరించడం, భక్తుల అభిరుచుల్లో మార్పుల వల్ల దైవ కార్యక్రమాలతోపాటు ఇతరత్రా అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో తిరునాళ్ల సందర్భంగా  హరికథ, బుర్రకథ, నాటకాలు, నృత్యం వంటి సంగీత, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రోజులు జరిగేవి. భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చేవారు. శివరాత్రికి, తిరునాళ్లకు సినిమా హాళ్లలో ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు ప్రదర్శించేవారు.  దేవాలయ ప్రాంతంతోపాటు మెయిన్ బజార్, మెయిన్ రోడ్డు, ఇతర వీధులు అన్ని జనంతో సందడిగా ఉండేవి. స్వామివారి కళ్యాణం సందర్భంగా పట్టణంలో అత్యధిక మంది జాగరణ ఉండేవారు.
              విజయదశమి రోజున జరిగే స్వామివారి పారువేట కూడా తిరునాళ్లలా జరిగేది. ఆ రోజు నరసింహ స్వామి గిరి ప్రదక్షణ చేస్తారు.  ఆ సందర్భంగా  స్వామివారు  విప్పటం రోడ్డు సమీపంలోని నాలుగు స్తంభాల మండపం వద్దకు వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది. అక్కడ కూడా మిఠాయి కొట్లు, పిల్లలు ఆడుకునే వస్తువుల అమ్మకాలు వంటివాటితో  తిరునాళ్ల వాతావరణం ఉండేది. రాత్రిపూట భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చేవారు. మంటపం వద్ద స్వామివారిని దర్శించుకునేవారు. దారి వెంట పొలాలు, తోటలు ఉండేవి. అప్పటికి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఇక్కడికి రాలేదు. కొండ అవతల టీబీ శానిటోరియం ఉండేది. చాలా మంది అర్ధరాత్రి దేవునితోపాటు కొండ చుట్టూ తిరిగి వచ్చేవారు. ఆ పారువేట త్రిల్లింగ్ ఇప్పుడు లేదు. తిరునాళ్ల, రథోత్సవం మాత్రం అదే స్థాయిలో జరుగుతున్నాయి.
           అప్పట్లో పెద్ద కోనేరు(కళ్యాణ పుష్కరిణి) వాడకంలో ఉండేది. 1558లో విజయనగర రాజుల కాలంలో దీనిని తవ్వారు. నాలుగువైపుల మెట్లు ఉన్న ఈ కోనేరులో భక్తులు స్నానాలు చేసేవారు. కోనేరులోపలి ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు పూజలు చేసి దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు అది పూర్తిగా పాడుబడిపోయింది. దేవాలయ పాలక మండలి వారు ప్రభుత్వం నుంచి నిధులు పొంది దానికి పూర్వ దశ తేవలసిన అవసరం ఉంది. దేవాలయానికి ముందు చిన్న కోనేరు అవతల కొండ వరకు అప్పట్లో అంతా ఖాళీ స్థలం ఉండేది. అక్కడే టీటీడీ కళ్యాణమండపం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, విద్యుత్ శాఖ కార్యాలయం, జనావాసాలు వచ్చేశాయి. అప్పట్లో చిన్న కోనేరుకు ఉత్తరం వైపున, కొత్తగా నిర్మించిన వసతి గృహసముదాయం వెనుక భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అక్కడే పరిషత్ నాటికలు కూడా ప్రదర్శించేవారు. ఇప్పుడు దేవాలయ సింహద్వారం పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

          ఇక్కడ దేవాలయానికి ఎంత పేరుందో, చేనేత పరిశ్రమకు అంతర్జాతీయంగా అంతకు మించిన  పేరుంది. తరతరాలుగా ఇక్కడి ప్రజలలో అధిక శాతం మంది చేనేతపైనే ఆధారపడి జీవించేవారు. 1980 దశకంలో ఇక్కడ చేనేత పరిశ్రమ బాగా విస్తరించింది. నూలు వ్యాపారం, రంగుల వ్యాపారం, మాస్టర్ వీవర్స్, నూలుకు రంగుల అద్దకం యూనిట్లు, చిలపలు, కండెలు చుట్టడం, ఆసు తోడటం, పడుగులు చేయడం, మొలలు కట్టడం, మగ్గం నేయడం, పన్నెలు తయారు చేయడం వంటి పనులతో పట్టణంలోని వీధులన్నీ సందడిగా కళకళలాడుతుండేది. యాదవులు రంగుల అద్దకం పనులు చేసేవారు. ముస్లింలు పన్నెలు కట్టేవారు. పద్మశాలీయులతోపాటు వైశ్యులు వస్త్రవ్యాపారం చేసేవారు.  పది వేలకు పైగా చేనేత మగ్గాలు ఉండేవి. ప్రతి వీధిలోనూ మగ్గం నేసేవారు. వందకు పైగా చేనేత షెడ్లు (బిల్డింగ్ అనేవారు) ఉండేవి. ఇక్కడి చేనేత చీరల రంగులు, మన్నిక విషయంలో మంచి పేరుంది.  కాలక్రమంలో ఇక్కడ చేనేత మగ్గాలు తగ్గిపోయాయి.  అయినా ఇప్పటికీ మంగళగిరి చేనేత చీరలకు, డ్రెస్ మెటీరియల్ కు ప్రసిద్ధి. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలు చీరల కోసం ఇక్కడకు రావడం, ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడం చేస్తున్నారంటే ఇక్కడి చేనేత విశిష్టత, కార్మికుల నైపుణ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మరమగ్గాల ధాటికి చేనేత రంగం దెబ్బతింది. దాంతో చేనేత కార్మికులు, వారి పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలలో స్థిరపడితే,  ఎక్కువ మంది బంగారం పని చేయడానికి అలవాటుపడ్డారు. చేనేత పరిశ్రమ స్థానాన్ని బంగారపు వస్తువుల తయారీ పరిశ్రమ ఆక్రమించింది. 80వ దశకంలో కూడా మంగళగిరి నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా యువకులు విజయవాడ వెళ్లి బంగారపు పని చేసేవారు. ఇప్పుడు ఇక్కడ పది వేల మందికి పైగా ఈ బంగారం పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు కాక ఇక్కడ నుంచి విజయవాడ, తెనాలి, గుంటూరు వెళ్లి ఈ పని చేసేవారు మూడు వేల మంది వరకు ఉంటారు. చేనేత పరిశ్రమ చాలా సునిశితమైనది. దానికి చాలా నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యత వారి జీన్స్ లో ఉంది. బంగారపు పని కూడా అంతే సునిశితమైనది, దీనికి అటువంటి నైపుణ్యమే కావాలి. అందువల్ల ఆ పనిలో ఇక్కడి వారు చాలా   త్వరగా ఇమిడిపోయారు. ఇక్కడ అన్ని రకాల బంగారు వస్తువులు తయారు చేస్తారు. దానికి అనుబంధంగా బంగారం కరగబెట్టడం, కత్తిరించడం, మెరుగుపెట్టడం వంటి మొత్తం 20 రకాల పనులు చేస్తుంటారు. ఇక్కడ తయారు చేసే బంగారు వస్తువులకు కూడా దక్షిణ భారత దేశంలో మంచి పేరు వచ్చింది. దానికి ఇక్కడి కార్మికుల నైపుణ్యమే కారణం.

            మంగళగిరి వాసులు ఏ పని చేసినా సందడేగాని, అలజడి ఉండదు. వివాదాలకు తావులేకుండా అన్ని కులాలవారు కలిసిమెలిసి జీవిస్తారన్నదానికి నిదర్శనం ఇది. మంగళగిరి ప్రత్యేకత కూడా ఇదే. ఎన్నికలు వచ్చినప్పడు మంగళగిరి పేరు చెబితే ఉభయ కమ్యూనిస్టు నేతలు తలలు పట్టుకుంటారు. రాష్ట్రమంతటా కలిసి పోటీ చేసినా ఇక్కడ మాత్రం ఇద్దరూ పోటీపడేవారు. శాసనసభ స్థానాన్ని, మున్సిపాలిటీని అనేక సార్లు దక్కించుకున్నవారు ఈ విధంగా పోటీపడి బలహీనపడ్డారు. మంగళగిరి గ్రామ పంచాయతీ 1969లో మున్సిపాలిటీగా  ఏర్పడింది. ఇక్కడ ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నందున ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా మున్సిపల్ చైర్మన్ పదవి మాత్రం వారినే వరిస్తుంది. సమైక్యతకు చిహ్నంగా వైస్ చైర్మన్ పదవిని మాత్రం ఒకసారి ముస్లింలకు, మరొకసారి ఎస్సీలకు, యాదవులకు, ఇంకోసారి వైశ్యులకు ఇస్తూ వస్తున్నారు. మంగళగిరి రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతమైన పట్టణం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచింది. ఒకప్పుడు ఎర్ర జెండా రెపరెపలాడిన నేల ఇది. ఇక్కడ ఒక వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు  అదే స్థాయిలో నాస్తిక సమాజం, హేతువాదం, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో భౌతిక వాదానికి సంబంధించిన శిక్షణా తరగతులు, ఇతర కార్యక్రమాలు జరుగుతుండేవి. 1983లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీనటి జమున పోటీ చేసి ఓడిపోయారు. గుంటూరు, విజయవాడల మధ్య జాతీయ రహదారి పక్కన ఉండటం వల్ల కూడా పట్టణం అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధానిలో భాగమైంది. దానికి సింహద్వారంగా నిలిచింది.
         బాధాకరమైన విషయం ఏమిటంటే ఒక వైపు పట్టణం పెరుగుతుంటే మరోవైపు వీధులన్నీ కుంచించుకుపోతున్నాయి. గతంలో మెయిన్ బజార్, షరాబ్ బజార్, మసీదు వీధుల్లో లారీలు తిరిగేవి. సాధుసోడా కొట్టు ఎదురుగా అప్పట్లో గుర్రపు బళ్లను నిలిపేవారు. విజయవాడ నుంచి లారీలలో సరుకులు తీసుకువచ్చి చిల్లర దుకాణాలలో దింపేవారు. ఆక్రమణలు పెరిగిపోవడంతో ఇప్పుడు మనుషులు నడిచివెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఈ వీధులను విశాలం చేయవలసిన అవసరం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. ఫొటోలు : సాంబ - ఫొటోగ్రాఫర్.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...