Mar 5, 2019

వేగంగా రాజధాని అమరావతి నిర్మాణం



 


 

                    ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆధునిక అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో  అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తోంది. రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమరావతి రూప శిల్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీబీ)లు సమర్థవంతంగా, అత్యంత వేగంగా అమలు చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా భూ సమీకరణ దగ్గర నుంచి సీఆర్డీఏ కమిషనర్ తోపాటు ఆ సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది కృషి ప్రశంసనీయమైనది. మన రాష్ట్రానికి పూర్తిగా కొత్త అయిన ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) విధానాన్ని ఆచరణలో అమలు చేయడంలో వారు విజయం సాధించారు. ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచారు. గుంటూరు జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున 29 గ్రామాల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో  జల కళ, పచ్చదనం పరుచుకున్న అద్భుతమైన మహానగరంగా రాజధానిని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించుకోవడానికి పదేళ్లు హక్కు ఉన్నా, నవ్యాంధ్ర నుంచే ప్రభుత్వ పాలనా వ్యవహారాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు భావించారు. ఆ క్రమంలో నూతన రాజధానిలో వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం(ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)లోని 5 బ్లాక్ లను రికార్డు స్థాయిలో 4 నెలలో నిర్మించారు. శాసన మండలి, శాసనసభ భవన సముదాయాన్ని 192 రోజుల్లో నిర్మించి మరో రికార్డు సృష్టించారు. ఈ నగర నిర్మాణ అంచనా వ్యయం రూ.లక్ష కోట్లు. ప్రస్తుతం రూ.40వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రోడ్లు, డక్ట్ (భూగర్భంలో కేబుల్ వ్యవస్థకు ఏర్పాటు చేసిన మార్గం) ద్వారా కేబుల్ గ్రిడ్, గ్యాస్, విద్యుత్, పైప్ లైన్లు,  నీటి పారుదల వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతోపాటు పరిపాలనా భవనాలు, అన్ని వర్గాల వారికి వసతి గృహాలు, ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణ పనులు అన్నీ ఏక కాలంలో వేగంగా జరగడం దీని ప్రత్యేకత.  దేశంలో డక్ట్ లను వినియోగిస్తున్న రాష్ట్రం మనదే.   నగరంలోని రోడ్లు, కూడలులు, ఇతర కట్టడాలు, ప్రభుత్వ భవంతుల నిర్మాణంలో అడుగడుగున తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి  ఉట్టిపడేవిధంగా  ఆకృతులు రూపొందించారు. ఆ విధంగానే నిర్మిస్తున్నారు. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సహా మొత్తం 35 ప్రధాన రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. రోడ్లను విశాలంగా నిర్మించడంతోపాటు నడక దారులు, ఇరు పక్కల మొక్కలు నాటుతున్నారు. కొన్ని రోడ్ల వెంట ఇప్పటికే పలు రకాల పూల మొక్కలు నాటారు.
             ప్రపంచ స్థాయిలో నిర్మించే ఈ మహానగర రూపకల్పనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నగరానికి ఆధునిక హంగులన్నీ సమకూరుస్తున్నారు.  సాంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా అత్యంత ఆధునిక విదేశీ టెక్నాలజీని వినియోగించి  నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఒక్క ఇటుక కూడా వినియోగించకుండా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్లాబ్‌తో పాటు  గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో  పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భవన నిర్మాణ ఆకృతికి తగిన విధంగా అల్యూమినియం మౌల్డింగ్‌ను తయారు చేస్తారు.  పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్, ఇనుము మిశ్రమం కలిపి వేగంగా కట్టుకుంటూ వెళ్లిపోతారు.  ఇలా ఒక దాని వెంట ఒక ఫ్లోర్  నిర్మిస్తారు. ఈ విధానంలో భవన నిర్మాణ సమయం చాలా వరకు తగ్గుతుంది.  నూతన ప్రయోగాలలో  భాగంగా  ప్రీ కాస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో  భవన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్, ఇనుము వంటి వాటితో తయారు చేసిన కొన్ని ఆకృతులను, పెద్ద దిమ్మెలను ఇతర ప్రాంతాలలో తయారు చేసి, వాటిని తీసుకువచ్చి ఇక్కడ బిగిస్తారు. దాంతో నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతున్నాయి. సాధారణంగా ఇక్కడ నిర్మించేటంతటి భవనాలు నిర్మించడానికి రెండు, మూడు ఏళ్లు పడుతుంది. కానీ ఆధునిక టెక్నాలజీ వినియోగించడంతో వారానికో అంతస్తు లేస్తోంది. పలు  బహుళ అంతస్తుల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు 3800 ఫ్లాట్ల నిర్మాణం ఏక కాలంలో జరుగుతున్నాయి.  ఈ విధంగా నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం కూడా కొనసాగుతోంది.
             రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద అత్యంత ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో  ర్యాఫ్ట్ పౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దీనికి గత ఏడాది డిసెంబర్ 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.   డయాగ్రిడ్సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి  సచివాలయం శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయం నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా అతి ఎత్తైన సచివాలయం కూడా ఇదే అవుతుంది.  41 ఎకరాల్లో 56 లక్షల చదరపు అడుగుల్లో 250 మీటర్ల ఎత్తులో శాశ్వత సచివాలయం నిర్మిస్తున్నారు. 40 అంతస్తులతో 4 టవర్లు, 50 అంతస్తులతో మరో టవర్  నిర్మిస్తారు. ఈ నిర్మాణాలన్నిటికీ పిల్లర్లు ఉండవు.  సచివాలయం నిర్మాణానికి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదే. ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన 50 అంతస్థుల టవర్ కోసం 11,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఈ పనిని నిర్విరామంగా 55 గంటల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.  రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ తో జరగడానికి దాదాపు 20వేల మంది కార్మికులు రాత్రి, పగలు నిరంతరం శ్రమిస్తున్నారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవన సముదాయ నిర్మాణాన్ని ఆధునిక టెక్నాలజీతో చాలా వేగంగా 192 రోజుల్లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టుని ఇక్కడే నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3న ఈ భవనాన్ని భాతర అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రారంభించారు. ఆ తరువాత కొత్తగా నిర్మించే హైకోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. రాజధానిలో ఇల్లు లేని దాదాపు 5 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించారు.  ప్రభుత్వ గృహ నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఏపీ సీఆర్డీఏ ఉంది. మరో పక్క ప్రైవేటు భవనాల నిర్మాణం కూడా జరుగుతోంది. విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ భవనాలు నిర్మించారు. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. మరి కొన్ని విద్యా సంస్థలు, బీఆర్ ఎస్ మెడి సీటీ, ఏపీఎన్ఆర్టీ భవనాలు, టీటీడీ వారి ఆలయం, కృష్ణా నదిపై కూచిపూగి ఐకానిక్ బ్రిడ్జి, నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
                    అమరావతిలోని పరిపాలనా నగరంలో భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే సచివాలయంలో విద్యుత్ వాహనాలను వాడుతున్నారు. కొంతమంది సచివాలయ, సీఆర్డీఏ అధికారులు కూడా ఈ వాహనాలను వాడుతున్నారు. సచివాలయంలో, విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజధాని నగరంలో ఉష్టోగ్రతను తగ్గించడానికి  ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. నగరం అంతటికీ ఉపయోగపడేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఈ విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సంస్థతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 440 మీటర్లకు ఒక కూల్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. గ్యాస్, నీరు, విద్యుత్ మాదిరిగా కావలసిన ఇంటికి ఏసీని అందిస్తారు. ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఎక్కడాలేదు. అమరావతిలో 40 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ఈ విధంగా రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాలలో ఉండే ఆధునిక సౌకర్యాలన్నిటిని సమకూరుస్తారు.  
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...