Feb 5, 2013

హిందూ దేవుళ్లంటే ఎందుకు అంత అలుసు?



                ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు హిందూ దేవతల బొమ్మలను వాడుకోవడం అలవాటైపోయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా దేవతల బొమ్మలు వినియోగిస్తున్నారు. బికినీలపైన, లోదుస్తులపైన, చివరకు చెప్పులపైన కూడా హిందూ దేవతల బొమ్మలను ముద్రిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక మతంవారి మనోభావాలను దెబ్బతీయకూడదన్న కనీస ధర్మాన్ని వారు ఎందుకు పాటించరు? వాటిని రూపొందించేవారికి ఈ విషయం తెలియదా? దీనికి సంబంధించి వారికి ఎవరూ సలహాలు ఇవ్వరా? సలహాలు ఇచ్చినా వారు పాటించరా? ప్రపంచంలో ప్రధానమై క్రైస్తవ, ముస్లిం మతాలకు సంబంధించిన గుర్తులను, బొమ్మలను ఎందుకు వాడరు? కేవలం హిందూ దేవతల బొమ్మలనే ఎందుకు ఇలా కించపరుస్తున్నారు? కనీస మర్యాద పాటించడం వారికి తెలియదనుకోవాలా? అంతర్జాతీయంగా ఏదైన కుట్ర దాగి ఉందా? తగిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం వల్లే ఇలా జరుగుతుందనుకోవాలా? ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన అంశమే కాదు. ఒక జాతికి, సంస్కృతికి ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన అంశం ఇది.

                  విదేశాలతోపాటు మన దేశంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వివాదాలకు దారి తీస్తున్నాయి. హిందూ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఆందోళనులు చేస్తున్నాయి. అయిన్పటికీ దేవతల బొమ్మలను మళ్లీమళ్లీ కించపరిచే విధంగా వినియోగిస్తూనే ఉన్నారు. ఇతర మతస్తులే కాకుండా, హిందువులు కూడా దేవతల బొమ్మలను అవమానకరమైన రీతిలో ఉపయోగిస్తున్నారు. అపచారానికి పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని రోస్ మౌంట్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో లిసా బ్లూ అనే ఫ్యాషన్ డిజైనర్ హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవి బొమ్మతో బికినీని రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచారని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విశాఖపట్నంలో కింగ్‑ఫిషర్ ఫ్యాషన్‑షోలో కూడా ఇది పునరావృతమైంది. ఈ షో రెండు రకాలుగా వివాదాలకు దారి తీసింది. స్త్రీని వ్యాపార వస్తువుగా చూపడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. కింగ్‑ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆటలు విశాఖపట్నంలో సాగనివ్వమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పోస్టర్‑లో మహిళలను కించ పరుస్తూ చూపారని మండిపడ్డారు. ఇటువంటి షోలకు అనుమతి ఇవ్వవద్దని వారు డిమాండ్‌ చేశారు. మహిళా సంఘాలు ఒక పక్క ఆందోళన చేస్తున్నప్పటికీ విశాఖ సాగర తీరంలో ఫ్యాషన్‑షో ప్రారంభించారు. హిందూ దేవతల చిత్రాలతో రూపొందించినదుస్తులను మోడల్స్ ధరించడంతో మరో వివాదం రేగింది.

                ఆధునిక వాణిజ్యం సామ్రాజ్యంలో ఆడవారిని ఒక వస్తువుగా వాడుకోవడం ఎక్కువైపోయింది. దానిని సమర్ధించేవారు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్‑షోల పేరిట ఆడవారి అందాలను, అంగాలను ప్రదర్శిస్తారు. దానికి తోడు వెర్రివేషాలు కూడా వేస్తుంటారు. అర్ధనగ్నం, కాదు ముప్పాతిక నగ్నంగా, అవకాశం ఉంటే ఇంకా ఎక్కువగా యువతులు తమ అంగాంగాలను ప్రదర్శిస్తారు. అంగ సౌష్టవాన్ని బట్టి కొందరు సెక్సీగా కనిపించడం సహజం. కానీ మగవారు ఆ దృష్టితో చూడకూడదంటారు. మహిళలు తమ ఇష్టమొచ్చిన రీతిలో దుస్తులు వేసుకుంటారని, మగవారు చూసే దృష్టిలో, ఆలోచనలో మార్పు రావాలని వారు వాదిస్తున్నారు. వారు ఇష్టపడి ఫ్యాషన్‑షోలలో తమ అందాలను ప్రదర్శిస్తుంటే మీరెవరు అడగటానికి, అడ్డుకోవడానికి? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాషన్‑షోలనేవి వ్యాపార అవకాశాలు కల్పించడానికి, కొత్త ముఖాలను పరిచయం చేయడానికి ఉపయోగపడతాయని చెబుతారు. కానీ ఇక్కడ మహిళలే బలైపోతున్నారని షోలను వ్యతిరేకించేవారి వాదన. ఆ విధంగా దుస్తులు వేసుకోవడం మన సంప్రదాయం కాదని చెబుతారు. స్త్రీలు సెక్సీగా దుస్తులు వేసుకోవడం వల్ల అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని కొందరు మహిళా సంఘాల నేతలు వాదిస్తున్నారు. సెక్సీగా కనిపించని చిన్న పిల్లలపైన, వృద్దులపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ష్యాషన్ షోలకు మద్దతు పలికేవారి వాదన. కురచదుస్తుల వల్ల జరిగే అనర్ధాలను వారు అంగీకరించరు. యువతులు తమ ఇష్టమొచ్చిన వృత్తిని ఎన్నుకుంటారని, తమ ఇష్టమొచ్చిన విధంగా దుస్తులు ధరిస్తారని వాదిస్తారు. వారికి వచ్చే కొత్తకొత్త అవకాశాలను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఫ్యాషన్‑షోలను అడ్డుకోవడాన్ని మహిళల స్వేచ్ఛను హరించడంగా భావిస్తారు. ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెడదాం. హిందూ దేవతల బొమ్మలతో రూపొందించిన దుస్తులను ఫ్యాషన్‑షోలో యువతులు ధరించినందుకు ఈ విషయం ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది.

మహిళలు మూడు రోజులు ఆందోళన చేసిన్నప్పటికీ లెక్కచేయకుండా కింగ్‑ఫిషర్‑ ఫ్యాషన్‑షోను ప్రారంభించారు. రెండు రోజులు నిర్వహించారు. పలువురు సినీ నటీనటులు, దేశం నలుమూలల నుంచి దాదాపు 40 మంది మోడల్స్ పాల్గొన్నారు. ‑‑షోలో శుక్రవారం వినాయకుడు బొమ్మ చిత్రించిన దుస్తులను మోడల్స్ ధరించి ర్యాంప్‑పై నడిచారు. విఘ్నేశ్వరుడి బొమ్మ ఒక మోడల్ ఉదరంపైన, తొడలపైన కనిపించింది. మరో మోడల్ గుండెలపైన కనిపించింది. దానికి తోడు వారు ఆ దుస్తులు వేసుకొని క్యాట్ వాక్ చేసే సమయంలో విఘ్నేశ్వర స్తోత్రం వినిపించారు. దాంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, తాము నిత్యం ఆరాదించే దైవాన్ని కించపరిచారని హిందూ సంఘాలు మండిపడ్దాయి. మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం మహిళా, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మహిళలను అసభ్యంగా చూపించడం పైన, హిందూ దేవతలను కురచ దుస్తులపైన ముద్రించడంపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లంటే అన్య మతస్తులకు చిన్న చూపని, ఇవే దుస్తులపై వేరే మతస్తుల చిత్రాలను వేసి ష్యాషన్ షోలో ప్రదర్శించగలరా? అని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. హిందూ దేశంలో దేవుళ్లకు అపచారం జరుగుతున్నా హిందువులు స్పందించకపోవడం దురదృష్టకరమని విశ్వ హిందూ పరిషత్ నేతలు అన్నారు. ఫ్యాషన్ షో నిర్వాహకులకు ప్రభుత్వ మద్దతు ఉన్నందువల్ల ఇటువంటి అపచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల్లో స్పందన రావల్సిన అవసరం ఉందన్నారు. విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

                ఒక పక్క మహిళా హక్కుల సంఘాల వారు, మరో పక్క హిందూ సంఘాల వారు ఆందోళకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తలకు దారితీస్తుందని భావించి పోలీసులు షోని రద్దు చేశారు. నిర్వాహకులపై 295(ఏ)సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షోని వ్యతిరేకించినవారు విజయం సాధించారు. ఒక మతానికి సంబంధించిన దేవతలను కించపరిచే సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా హిందూ దేవతల బొమ్మలను ఈ విధమైన కురచ దుస్తులపైన ముద్రించడాన్ని నిరోధించవలసి ఉంది.
                                          February 5, 2013 by Siramdasu Nagarjuna

Jan 26, 2013

తెలుగు పాలకులు సిగ్గుపడరా?


బహుముఖ ప్రజ్ఙాశాలి బాపుకు తమిళనాడు కోటాలో పద్మశ్రీ లభించడం తెలుగువారికి ఎంత అవమానం? ఈ పరిస్థితి ఏర్పడినందుకు మన పాలకులు సిగ్గుపడరా? బాపు బొమ్మ, బాపు లిపి, బాపు సినిమా, బాపు కథ, బాపు కార్టూన్.అన్నింటిలోనూ తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. బాపు గీత, రాత తెలుగు సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు అంటే తెలియని తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. 1945 నుంచే చిత్రాలు గీస్తున్నారు.  బాపు వేసిన కవర్‑ పేజీ బొమ్మలతో ఎన్నో వందల పుస్తకాలు ముస్తామయ్యాయి. అవి బాపు చిత్రాలు.1967 నుంచే సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలంటే సినిమాలా అవి బాపు సినిమాలు. సాక్షి, అందాల రాముడు, ముత్యాలముగ్గు వంటి అచ్చ తెలుగు  చిత్రాలతో తెలుగువారి మనసు దోచుకున్నారు. తన దర్శకత్వ ప్రతిభతో ఎందరో నటీనటులను తీర్చిదిద్దారు.

 తెలుగువారందరూ గర్వించదగిన ఇంటి బాపుకు ఇప్పటి వరకు ఒక్క పద్మ పురస్కారం  లభించకపోవడం చిత్రంగాలేదూ! ఈ విషయంపై ఎన్ని విమర్శలు వచ్చినా మన పాలకులు దున్నపోతుమీద వర్షంపడినట్లు ఉండిపోయారు. అది మన నైజం అనిపించుకున్నారు. ఇప్పటివరకు బాపుకు పద్మశ్రీ ఎందుకు రాలేదు. ఎందుకు ఇవ్వలేదు. తెలుగువాడిగా పుట్టినందుకా? అందుకే అని చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, సుప్రసిద్ధ నేపథ్యగాయని పి.సుశీలల విషయంలో కూడా ఇదే జరిగింది. తెలుగువారైనప్పటకీ వారికి మన పాలకులు పద్మ పురస్కారాలు అందివ్వలేకపోయారు. తమిళనాట పాలకులు పెద్ద మనసుతో వారిని తమ వారిగా భావించి  సిఫార్సు చేసి పద్మ పుస్కారాలు సాధించుకున్నారు.

ఇప్పుటికైనా బాపును పద్మశ్రీ వరించింది. కాదు పద్మశ్రీకే బాపు దొరికాడు. బాపుగారికి పద్మశ్రీ ఏమిటి అసయ్యంగా. పద్మశ్రీకి బాపు అని బిరుదు ఇవ్వాలిగాని. ఇస్తే గిస్తే భారత రత్న కన్నా మరేదైనా మన బాపు గారికి నప్పుతుందా? మీరే చెప్పండి? అన్న ప్రముఖ సినీగీత రచయిత చైతన్య మాటలు అక్షర సత్యం.  బాపుకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో ఇప్పుడు పద్మశ్రీకే వన్నె పెరిగింది. అయితే ఇది తమిళనాడు కోటాలో రావడం ఎంత బాధాకరం! ఇంతటి తెలుగువాడికి మనం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వలేకపోయాం.

 బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రిక లేదంటే అతిశయోక్తికాదు. బాపు బొమ్మ, బాపు శైలి, బాపు అక్షరాలు ప్రశిద్ధి పొందాయి. పుంఖానుపుంఖాలుగా బొమ్మలు గీసి బాపు తెలుగువారిని అలరించారు. సంతకం అక్కరలేని చిత్రకారుడు.  బాపు బొమ్మలతో రూపొందించిన శుభాకాంక్షల గ్రీటింగ్స్ ఇష్టపడనివారుండరు. బాపు వేసే ముఖచిత్రం కోసం రచయితలు ఎదురుచూస్తారు. బాపు బొమ్మ వేసేవరకు నెలలునెలలు తమ పుస్తకాన్ని అచ్చువేయించకుండా ఉన్న రచయితలు,  కవులు ఎంతోమంది ఉన్నారు. బాపు బొమ్మలపై  ప్రసిద్ద కవి ఆరుద్ర కూనలమ్మ కవిత ఇలా రాశారు. 
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!

బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ.  1933 సంవత్సరం డిసెంబర్‌ 15  పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్‌లో ఆయన జన్మించారు.  మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి 1955లో లా డిగ్రీ పూర్తిచేశారు. బాపు ఆంధ్రపత్రిక వార్తా పత్రికలో 1955లో పొలిటికల్‌ కార్టూనిస్ట్‌గా పనిచేశారు. బాపు గీత వయ్యారం తెలుగువారందరికీ తెలుసు. బాపు ఫాంట్ పేరుతో ఆయన రాత అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయన దర్శకత్వం సరేసరి. అద్బుత దృశ్యకావ్యాలు మనకు అందించారు. తన చిత్రాల ద్వారా తెలుగు అందాలను, తెలుగు సంస్కృతిని పండించారు.  తన తొలి చిత్రం సాక్షితో విజయకేతనం ఎగురవేశారు. గీతలో, దర్శకత్వంలో తనదైన ముద్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఘనుడు.

బాపు దర్శకత్వం వహించిన కళాఖండాలు

తెలుగు శ్రీరామరాజ్యం     2011     తెలుగు
తెలుగు సుందరకాండ     2008     తెలుగు
రాధా గోపాళం               2005     తెలుగు
రాంబంటు                  1996     తెలుగు
పెళ్ళికొడుకు             1994     తెలుగు
పరమాత్మా                1994     హిందీ
శ్రీనాథ కవిసార్వభౌమ     1993     తెలుగు
మిష్టర్ పెళ్ళాం         1993     తెలుగు
పెళ్ళి పుస్తకం         1991     తెలుగు
ప్రేమ్ ప్రతిగ్యా         1989     హిందీ
దిల్ జలా         1987     హిందీ
ప్యార్ కా సిందూర్     1986     హిందీ
కళ్యాణ తాంబూలం     1986     తెలుగు
మేరా ధరమ్         1986     హిందీ
ప్యారీ బెహనా         1985     హిందీ
బుల్లెట్         1985     తెలుగు
జాకీ         1985     తెలుగు
మోహబ్బత్         1985     హిందీ
సీతమ్మ సేత         1984     తెలుగు
మంత్రిగారి వియ్యంకుడు     1983     తెలుగు
వోహ్ సాత్ దిన్         1983     హిందీ
ఏది ధర్మం ఏది న్యాయం     1982     తెలుగు
కృష్ణావతారం         1982     తెలుగు
నీతిదేవన్ మయగుగిరన్     1982     తమిళం
పెళ్ళీడు పిల్లలు         1982     తెలుగు
బేజుబాన్         1981     హిందీ
రాధా కళ్యాణం         1981     తెలుగు
త్యాగయ్య         1981     తెలుగు
హమ్ పాంచ్         1980     హిందీ
వంశవృక్షం         1980     తెలుగు
కలియుగ రావణాసురుడు     1980     తెలుగు
పండంటి జీవితం         1980     తెలుగు
రాజాధిరాజు         1980     తెలుగు
తూర్పు వెళ్ళే రైలు     1979     తెలుగు
మనవూరి పాండవులు     1978     తెలుగు
అనోఖా శివభక్త్         1978     హిందీ
గోరంత దీపం         1978     తెలుగు
స్నేహం         1977     తెలుగు
భక్త కన్నప్ప         1976     తెలుగు
సీతాస్వయంవర్         1976     హిందీ
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్     1976     తెలుగు
సీతాకల్యాణం         1976     తెలుగు
ముత్యాల ముగ్గు     1975     తెలుగు
శ్రీ రామాంజనేయ యుద్ధం     1974     తెలుగు
అందాల రాముడు     1973     తెలుగు
సంపూర్ణ రామాయణం     1971     తెలుగు
బాలరాజు కధ         1970     తెలుగు
ఇంటి గౌరవం         1970     తెలుగు
బుద్ధిమంతుడు         1969     తెలుగు
బంగారు పిచ్చుక     1968     తెలుగు
సాక్షి         1967     తెలుగు
                                            January 26, 2013 by Siramdasu Nagarjuna

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...