Jun 26, 2019

టీడీపీ ప్రభుత్వ పాలనపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘం



జీఓ నెం.1411, తేదీన 26.06.2019 201
v గత  టీడీపీ ప్రభుత్వం  సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
v దాదాపు 30 అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేస్తుంది.
v  ఏసీబీ, విజిలెన్స్, సీఐడీ విభాగాల్లోని సీనియర్‌ అధికారుల బృందం విచారణకు సహకారం అందజేస్తారు.
v  ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఐదుగురు సభ్యుల మంత్రివర్గ ఉప సంఘానికి నిర్ధేశం.
v  అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విభజన గాయాలతో ఛిద్రమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన టీడీపీ సర్కార్‌ తద్భిన్నంగా వ్యవహరించింది.
v జూన్‌ 2, 2014 నుంచి మే 29, 2019 వరకు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. అక్రమార్జన కోసం అనుకూలమైన విధానాలను రూపొందించింది. వాటిని అడ్డం పెట్టుకుని ఇసుక నుంచి గనుల వరకూ సహజ సంపదను కొల్లగొట్టింది.
v టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి పేదల భూములను కబ్జా.  ప్రభుత్వ, దేవదాయ భూములను హస్తగతం చేసుకున్నారు.
v సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు.
v టీడీపీ నేతల దోపిడీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది.. టీడీపీ సర్కారు అసంబద్ధ విధానాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, యువకులు, బలహీన వర్గాలు, మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
v  టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల చిన్న, మధ్య తరగతి రైతులు భూములు కోల్పోయారు. భూ కబ్జాల వల్ల ప్రజలు వారి సొంత ఇళ్లను, గ్రామాలను కోల్పోయి నిర్వాసితులగా మారారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేసి దోపిడీ చేయడం వల్ల రాష్ట్రంలో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలిగింది.
v ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ఈ దోపిడీ సాగింది. వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అవినీతికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులతో పాటు సంస్థలను గుర్తించి, ఆ నిర్ణయాల వెనుక ఉన్న దురుద్దేశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
మంత్రివర్గ ఉప సంఘం
v ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు.
v ఎంపీలు విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులు.
v  సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీకి కార్యదర్శి.
v ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు.
v విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాలి.
v ఆరు వారాల్లోగా ఈ ఉప సంఘం నివేదిక సమర్పించాలి.
ఉప సంఘానికి మార్గదర్శకాలు
v గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన భారీ నిర్ణయాలు, కార్యక్రమాలు, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడంపై విచారణ.
v  రాష్ట్రంలో టెండర్ల విధానం, ఆ విధానంలో టీడీపీ సర్కారు చేసిన సవరణలు, కాంట్రాక్టర్లకు అప్పగించిన భారీ ప్రాజెక్టుల పనులు, ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులు, స్విస్‌ ఛాలెంజ్‌ విధానం, సహజ వనరుల కేటాయింపు (ప్రధానంగా భూములు, నీళ్లు, గనులు, విద్యుత్‌)లో నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి దోచుకున్న తీరుపై సమీక్ష.
v  బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రజాభ్యుదయం ముసుగులో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ సంస్థలపై చూపిన దుష్ప్రభావంపై సమీక్ష
v  గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్స్, లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ), స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్, జాయింట్‌ వెంచర్స్‌లో అవినీతికి పాల్పడటం, ఆశ్రిత పక్షపాతం చూపడంపై విచారణ.
v  వివిధ కార్పొరేషన్లు, పరిశ్రమలు, అథారిటీలు, సొసైటీల పనీతీరుపై సమీక్ష. వాటిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలి.
v   గత ప్రభుత్వం భారీఎత్తున కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయడంపై సమగ్రంగా విచారణ. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన తీరుపై సమీక్ష
v  ప్రభుత్వ భూముల కేటాయింపుపై సమగ్ర విచారణ. భూముల కేటాయింపులో క్విడ్‌ప్రోకోకు పాల్పడిన వ్యవహారాలపై ప్రత్యేకంగా సమీక్ష
v  గత ప్రభుత్వం మైనింగ్‌ లీజులు మంజూరు చేయడంపై సమగ్ర విచారణ. అక్రమంగా మైనింగ్‌ లీజులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చేకూరిన నష్టంపై నివేదిక.
v విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో నిబంధనలను ఉల్లంఘించడం, అక్రమాలకు పాల్పడి కమీషన్లు తీసుకోవడంపై విచారణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సొసైటీల్లో అక్రమాలకు పాల్పడిన తీరుపైన దర్యాప్తు.
v  వైద్య, విద్య, పౌష్టికాహార కార్యక్రమాల్లో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ.
v  ఐటీ రంగంపై సమగ్రంగా సమీక్ష.
v  సీఆర్‌డీఏ, పోలవరం ప్రాజెక్టు, పోర్టులు, విమానాశ్రయాలు, హైవే ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ పెద్దలు పాల్పడిన అక్రమాలపై సమగ్ర సమీక్ష. సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విధానంలో భూముల కొనుగోలు ద్వారా అక్రమంగా లబ్దిపొందడంపై విచారణ.
v  ఈ అక్రమాల్లో రాజకీయ నేతలు, కీలక అధికారుల పాత్రపై విచారణ.

Jun 21, 2019


ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం
మంత్రి ఆదిమూలపు సురేష్
          సచివాలయం, జూన్ 21: ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థని ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళతామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్నారు. మౌలిక వసతులు, అత్యాధునిక మౌలిక వసతులు అని రెండుగా వసతులు కల్పిస్తామన్నారు.  పాఠశాలల్లో ప్రహరి గోడలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట శాలలు, మంచినీరు వంటి మౌలిక వసతులు అన్ని  మెరుగుపరుస్తామని వివరించారు.  విద్యాశాఖలోని ఇంజనీర్లతో ఉదయం, విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లతో సాయంత్రం సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యా శాఖలోని దాదాపు 800 మంది ఇంజనీర్లు మూడు విభాగాలుగా పని చేస్తున్నారని, వారి మధ్య సమన్వయ లోపం, పనుల డూప్లికేషన్ వంటి అంశాలను గుర్తించిన్నట్లు చెప్పారు. ఈ రకమైన ఇబ్బందులను తొలగించి విద్యాశాఖలోని ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ పనులకు  ఒకేరకమైన విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అవసరాల మేరకే పనులు చేపడతామన్నారు.
విశ్వవిద్యాలయాలలో నియామకాల విషయంలో నిబంధనల మేరకు పారదర్శికత పాటించాలని వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. మెరిట్ ప్రాతిపధికగానే నియామకాలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు కూడా బ్యాక్ డోర్ నియామకాల ఆలోచన విరమించుకోవాలని సూచించారు. ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉపాధి అవకాశాలు లభించే విధంగా నూతన కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు.

             జీఎస్టీ, ఇన్ కమ్ టాక్స్ అంశాలనుయ చర్చించామని, విశ్వవిద్యాలయాలు లాభాపేక్షతో నడిచే సంస్థలు కాదని, అందువల్ల వాటికి మినహాయింపు కోరాలని అనుకుంటున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల ఫైనాన్స్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరి తరపున ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. పద్మావతి విశ్వవిద్యాలయానికి మున్సిపల్ కార్పోరేషన్ వారు కమర్సియల్ టాక్స్ విధించారని చెప్పారని, దానిని కూడా పరిష్కరిస్తామన్నరు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణకు సమాయత్తం చేయవలసిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయాలలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన 27 శాతం మధ్యంతర భృతి విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తించడంలేదని తెలిపారని, ఆ అంశాన్ని ఫైనాన్స్ విభాగంతో సంప్రదించి పరిష్కరిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ నిష్పత్తిని పాటించి గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
          విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే చెల్లించవలసిన బకాయిలు ఉన్నాయని, నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలన్నారు. బడిలో చేరే విద్యార్థుల సంఖ్య, అక్షరాశ్యతను పెంచడానికే అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్న ఆలోచన అందరిలో రావాలన్నారు.  విద్యా హక్కును తప్పనిసరిగా అమలు చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. మంత్రి వెంట దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఉన్నారు.

జవాబుదారీ, పాదర్శకత, అవినీతి రహిత పాలన
             జవాబుదారీతనం, పాదర్శకత, అవినీతి రహిత పాలన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి  పేర్కొన్నారు. సచివాలయం 4వ బ్లాక్ సమావేశ హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలలోని సమస్యలన్నిటినీ పరిష్కరించి, వాటిని బలోపేతం చేస్తామన్నారు. విశ్వవిద్యాలయాల అటానమస్ కు ఇబ్బంది కలిగించమని, రోజువారీ కార్యకలాపాలలో వేలు పెట్టం అని చెప్పారు. నాణ్యమైన, గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అత్యున్నత విశ్వవిద్యాలయాల వరుసలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం ఉన్న స్థితిని ఫొటోలతో సహా రికార్డు చేయాలని, అయిదేళ్ల తరువాత ఎంత మెరుగుపడిందో స్పష్టంగా తెలియాన్నారు. వీసీలు, రిజిస్ట్రార్లు ఆయా విశ్వవిద్యాలయాలలో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. టీచింగ్ సిబ్బంది కొరత, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, 11 వందలకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఐఆర్ వర్తింపు, జీఎస్టీ, ఇన్ కమ్ టాక్స్, ఇంజనీరింగ్ విభాగాల పనులు.... తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, ఆర్థిక విభాగాల అధికారులు పాల్గొన్నారు.

  జిల్లా కలెక్టర్ల సమావేశ వేదిక మార్పు
         సచివాలయం, జూన్ 21 : ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం స్థలంలో మార్పు జరిగినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో జరగవలసిన ఈ సమావేశం ఉండవల్లి సమీపంలోని కరకట్ట పక్కన ఉన్న ప్రజావేదిక వద్ద జరుగుతుందని ఆయన  పేర్కొన్నారు.

Jun 20, 2019

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

Ø ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
Ø నాణ్యమైన, విలువైన, గుణాత్మక విద్యకు ప్రాధాన్యత
Ø తొలుత ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఒడి పథకం
Ø ఉపాధ్యాయులకు పదోన్నతులు
Ø సగ భాగం ఉపాధ్యాయుల సమస్యలపైనే దృష్టి
Ø నెలలో ఒక రోజు ఉపాధ్యాయుల ఫిర్యాదుల పరిష్కారం
Ø టెన్త్ లో 20 శాతం ఇంట్రనల్ అసెస్ మెంట్ ఎత్తివేత
Ø త్వరలో వైస్ ఛాన్సలర్ల సమావేశం

           సచివాలయం, జూన్ 20: నాణ్యమైన, విలువైన, గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్ లో గురువారం ఉదయం ఆయన ప్రవేశించారు. ముందుగా సతీసమేతంగా వచ్చిన సురేష్ కు వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఛాంబర్ లోకి ప్రవేశించిన  తరువాత ప్రత్యేక పూజ చేశారు.  ఆ తరువాత ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ వచ్చే అయిదేళ్లో రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రణాళికా బద్దంగా సంస్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడంతోపాటు వసతులు, మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. తెలుగు భాషతోపాటు ఇంగ్లీషు భాషకు కూడా ప్రధాన్యత ఇస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామన్నారు. వీటన్నిని అధ్యయనం చేసి సంస్కరణలకు సూచనలు చేయడానికి ఒక కమిటీని నియమించామని, దానిపైనే తొలి సంతకం చేసినట్లు తెలిపారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల ఫైలుపై రెండవ సంతకం చేశానని చెప్పారు. ఉపాధ్యాయుల స్థితిగతులను పరిశీలించి, రోస్టర్, కాలపరిమితి వంటి వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం కలిగిస్తామన్నారు.  స్కూల్ అసిస్టెంట్స్ నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. దీని వల్ల 19 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. టెన్త్ గ్రేడింగ్ లో 20 శాతం ఇంట్రనల్ అసెస్ మెంట్ ని ఎత్తివేస్తూ మూడవ సంతకం చేసినట్లు తెలిపారు. ఇంట్రనల్ అసెస్ మెంట్ మార్కుల విధానం వల్ల ప్రైవేటు పాఠశాలలు లబ్దిపొందుతున్నట్లు చెప్పారు.
పిల్లలు రాజన్న బడి బాట పట్టేవిధంగా చేస్తామని,  ప్రభుత్వ పాఠశాలలను తలమానికంగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

               నవరత్నాలలో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకాన్ని 2020 జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. మొదట ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రవేశపెడతామన్నారు. నిపుణులు, మేథావులతో చర్చించి, మేథోమథనం జరిగిన తరువాత ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశపెట్టే అంశం పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ డబ్బు వృధా కాకుండా చూస్తామన్నారు.  విద్యార్థుల డ్రాప్ అవుట్ ని తగ్గించడానికి, అక్షరాశ్యతను పెంచడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పుకు ఇది అతి పెద్ద అడుగుగా పేర్కొన్నారు.  అయితే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా రూపొందించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ పథకం పేరు చెప్పి అడ్మిషన్లు జరిపే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

                     ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన సమయాన్ని సగ భాగం కేటాయిస్తానని మంత్రి చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫిర్యాదులు స్వీకరించడానికి నెలలో ఒక రోజు కేటాయిస్తామన్నారు. అధికారుల సమక్షంలో వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాలతో సహా విద్యా వ్యవస్థలోని నియామకాలలో  అవకతవకలకు తావులేకుండా మెరిట్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిష్ణాతులు, మేథావులను విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తామని చెప్పారు. అన్ని స్థాయిలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి త్వరలో వైస్ ఛాన్సలర్ల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు  పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి జనం సమస్యలు తెలుసని చెప్పారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో పని చేసి విద్యా శాఖకు మంచి పేరు తెస్తానని మంత్రి సురేష్ చెప్పారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఈడీ పాఠశాలల పేర్లు, వివరాలు ఇస్తే వెంటనే విచారణకు ఆదేశిస్తానన్నారు. ప్రమాణాలు పాఠించని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఇతర కాలేజీలపైన, ప్రైవేటు విశ్వవిద్యాలయాలపైన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 

మానవేంద్రనాథ్ రాయ్, వెంకట రమణలు
హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం
     అమరావతి, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం చీకటి మానవేంద్రనాథ్ రాయ్, మఠం వెంకట రమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు చదివి వినిపించగా,  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. 

Jun 19, 2019

జగన్ ప్రభుత్వం – పదవుల కేటాయింపు - సామాజిక న్యాయం
రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం
       రాజకీయాల్లో నూతన అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తెర తీశారు. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు దగ్గర నుంచి మంత్రి మండలి ఏర్పాటు వరకు సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పదవులలో కూడా ఇదే పాటిస్తానని ఆయన చెప్పారు. రాజకీయాలలో మాటలు చెప్పేవారే గానీ చేతలలో చూపించేవారు చాలా తక్కువగా ఉంటారు. జగన్ మాత్రం చెప్పిన మాటలను చేసి చూపించారు. పాలనా పరంగా కూడా ఎవరూ ఊహించని రీతిలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించడంలో నిలువెత్తు నిదర్శనంగా జగన్ నిలిచారు.

అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ఆ విషయంలో స్పీకర్ కు సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నట్లు శాసనసభా నాయకుడుగా సభలో ప్రకటించడంతో ప్రజలకు జగన్ పై గౌరవం ఇంకా పెరిగింది. సమాజంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు స్థానం కల్పించే విధంగా మంత్రి మండలిని చాలా చాకచక్యంగా కూర్చారు. ఈ కూర్పులో ఆయన నైతిక విలువలను కూడా పాటించినట్లు స్పష్టమవుతోంది.   దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని విధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి, సముచిత స్థానం కల్పించడానికి అయిదుగురిని ఉప ముఖ్య మంత్రులుగా నియమించారు. అన్ని వర్గాల వారికీ ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇది తొలిసారి. ఆ విధంగా సామాజిక న్యాయం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాలకు జగన్ ఆదర్శంగా నిలిచారు.
         గత మంత్రి మండలిలో గానీ, ఇప్పుడు గానీ ముఖ్యమంత్రితో సహా 26 మంది సభ్యులే ఉన్నారు. గత మంత్రి మండలిలో  అయిదుగురు కమ్మ, నలుగురు రెడ్డి, ముగ్గురు కాపు, 8 మంది బీసీలు, ఎస్సీ లు ఇద్దరు, వైశ్య, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వెలమ ఒక్కొక్కరు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికే చెందినకోడెల శివప్రసాద రావు స్పీకర్ గా ఉన్నారు. ప్రస్తుత మంత్రి మండలిలో ఏడుగురు బీసీలు, అయిదుగురు ఎస్సీలు, అయిదుగురు రెడ్లు, నలుగురు కాపులు, కమ్మ, మైనార్టీ, వైశ్య, క్షత్రియ, ఎస్టీలు ఒక్కొక్కరు మంత్రులుగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
         గత మంత్రి మండలిలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు(కమ్మ), మంత్రులుగా లోకేష్(కమ్మ), ప్రత్తిపాటి పుల్లారావు(కమ్మ), దేవినేని ఉమామహేశ్వరరావు(కమ్మ), పరిటాల సునీత (కమ్మ), అమరనాథరెడ్డి (రెడ్డి), భూమా అఖిల ప్రియ(రెడ్డి), సీహెచ్.ఆదినారాయణ రెడ్డి(రెడ్డి), సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి(రెడ్డి),  యనమల రామకృష్ణుడు(యాదవ-బీసీ), చింతకాయల అయ్యన్నపాత్రుడు (కొప్పు వెలమ-బీసీ), కింజరాపు అచ్చెన్నాయుడు(కొప్పు వెలమ-బీసీ), పితాని సత్యనారాయణ(శెట్టి బలిజ-బీసీ), కాలువ శ్రీనివాసులు (బోయ-బీసీ), కొల్లు రవీంద్ర(మత్స్యకార-బీసీ), కెఈ కృష్ణమూర్తి (ఈడిగ-బీసీ), కిమిడి కళావెంకట్రావు(తూర్పు కాపు-బీసీ), గంటా శ్రీనివాసరావు(కాపు), డాక్టర్ పొంగూరు నారాయణ(కాపు), నిమ్మకాయల చినరాజప్ప(కాపు), సిద్ధా రాఘవరావు(వైశ్య), సుజయ కృష్ణ రంగారావు(వెలమ-ఓసీ), కొత్తపల్లి జవహర్(మాదిగ-ఎస్సీ), నక్కా ఆనందబాబు(మాల-ఎస్సీ),కిడారి శ్రావణ్ కుమార్(ఎస్టీ), ఎన్.మొహమ్మద్ ఫరూక్ (మైనార్టీ) ఉన్నారు. ఎస్టీ, మైనార్టీలకు చివరలో స్థానం కల్పించారు. చేనేత, క్షత్రియ, బ్రాహ్మణులకు అసలు స్థానం లేదు.
         ఈ మంత్రి వర్గంలో సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి(రెడ్డి), ఉప ముఖ్యమంత్రులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్(శెట్టి బలిజ-గౌడ్-బీసీ), అంజాద్ బాషా (మైనారిటీ), ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని-కాపు), కలత్తూరు నారాయణ స్వామి(మాల-ఎస్సీ),  పాముల పుష్ప శ్రీవాణి(ఎస్టీ) ఉన్నారు. మంత్రులుగా డాక్టర్  పెద్దిరెడ్డిగారి రామచంద్రారెడ్డి(రెడ్డి), బుగ్గన రాజేంద్రనాథ్ (రెడ్డి), బాలినేని శ్రీనివాసరెడ్డి(రెడ్డి), మేకపాటి గౌతం రెడ్డి(రెడ్డి), కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని-కమ్మ), చెరుకువాడ శ్రీరంగనాథ్ (రాజు), ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు(అవంతి శ్రీనివాస్ - కాపు), కురసాల కన్నబాబు (కాపు), పేర్ని వెంకట్రామయ్య(నాని-కాపు), వెలంపల్లి శ్రీనివాసరావు(కోమటి), మేకతోటి సుచరిత (మాల-ఎస్సీ), పినిపే విశ్వరూప్ (మాల-ఎస్సీ), తానేటి వనిత (మాదిగ-ఎస్సీ) ఆదిమూలపు సురేష్(మాదిగ-ఎస్సీ), బొత్స సత్యన్నారాయణ (తూర్పు కాపు-బీసీ), మోపిదేవి వెంకట రమణ (మత్స్యకార-బీసీ), అనిల్ కుమార్(యాదవ-బీసీ), ధర్మాన కృష్ణదాస్ (పోలినాటి వెలమ), గుమ్మనూరి జయరాం(బోయ-బీసీ), మాలగుండ్ల శంకర నారాయణ(కురుమ-బీసీ) మంత్రులుగా ఉన్నారు. గత మంత్రి మండలిలో స్థానం లభించని కొన్ని సామాజిక వర్గాలకు ఇందులో స్థానం లభించింది. గత మంత్రి మండలిలో ఎస్సీలు ఇద్దరు ఉంటే, ఈ మంత్రి మండలిలో అయిదుగురు ఉన్నారు. అంతేకాకుండా చివరిదాక ఆగకుండా మొదటి నుంచే అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించి గౌరవించారు. ఎంత చేసినా ఈ వ్యవస్థలో కొందరికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా వ్యవసాయం రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడి జీవించేది చేనేత రంగం. గడచిన మంత్రి వర్గంలో గానీ, ఈ మంత్రి వర్గంలో గానీ చేనేత సామాజిక వర్గం వారికి మంత్రి పదవి ఇవ్వలేదు.  రాజకీయంగా, పరిపాలనా పరంగా జగన్ వ్యవహార శైలిని, అనుసరించే విధానాన్ని పరిశీలిస్తే మంత్రి వర్గంలో స్థానం కల్పించలేని ఇటువంటి సామాజిక వర్గాల వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తప్పనిసరిగా  ప్రధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jun 18, 2019

సాధ్యమైనంత త్వరగా రైతులకు పగలు 9 గంటల విద్యుత్



విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి బాలినేని

ప్రయోగాత్మకంగా 60 శాతానికి పైగా సరఫరా

                 
సచివాలయం, జూన్ 18: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం సాధ్యమైనంత త్వరగా రైతులకు వ్యవసాయం కోసం రోజుకు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంస్తులోని సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరా, వినియోగం, వ్యయం, బకాయిలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంకేతికపరమైన పనులను పూర్తి చేసి వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి అధికారులు, సిబ్బంది శాయశక్తులా కృషి చేయాలన్నారు. నీతివంతమైన పాలన అందించాలన్నది సీఎం ప్రధాన ధ్యేయం అని, అందుకు అనుగుణంగా మంచి ప్రభుత్వం అన్న పేరు తేవాలని, అందులో విద్యుత్ శాఖ ముందుండాలన్నారు. పవర్ కట్ ఫిర్యాదులు రాకుండా చూడాలని మంత్రి  చెప్పారు.
ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, నెడ్ క్యాప్, సోలార్ పవర్ కార్పోరేషన్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిసియన్సీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సంస్థల పనితీరుని సమీక్షించారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగంతోపాటు ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్ మెంట్ స్కీమ్(ఐపీడీఎస్), దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకం, హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పథకం,  పవర్ ఫర్ ఆల్ పథకం, ఉదయ్ పథకం, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్, వ్యవసాయ ఫీడర్స్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్ ఎనర్జీ కారిడార్ .... గురించి అధికారులు మంత్రికి వివరించారు. గాలి, వాన వచ్చినప్పుడు మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వెంటనే పునరుద్దరిస్తున్నామని చెప్పారు. అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా వినియోగదారులకు మెజేస్ పంపుతామని చెప్పారు.  పగటి పూట ప్రస్తుతం 60 శాతానికి పైగా విద్యుత్ ని వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్లు తెలిపారు.  వ్యవసాయ ఫీడర్లను ఏ, బీ రెండు గ్రూపులుగా విభజించి ఈ విద్యుత్ ని సరఫరా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వ్యవసాయ ఫీడర్ల ద్వారా చాలా వరకు అందిస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో 70 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 64 శాతం అందిస్తున్నట్లు వివరించారు.  కృష్ణా జిల్లాలో 328 ఫీడర్లకు 228, గుంటూరు జిల్లాలో 364 ఫీడర్లకు 281, ప్రకాశం జిల్లాలలో 664 ఫీడర్లకు 634, నెల్లూరు జిల్లాలో 674 ఫీడర్లకు 390 ఫీడర్ల ద్వారా 9 గంటలు విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. పగటి పూట అంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అని వివరించారు. పగటి పూట విద్యుత్ సరఫరా చేయడం వల్ల పాము కాట్లు, విద్యుత్ ప్రమాదాలు వంటివి చాలా వరకు తగ్గిపోయాయని తెలిపారు. హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పథకం వల్ల మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల మోటార్లు కాలడం సంఘటనలు లేవని, లో ఓల్టేజ్ సమస్య లేదని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ మొదటి దశ పనులు పూర్తి అయినట్లు చెప్పారు. విద్యుత్ వాహనాల వాడకం, ఛార్జింగ్ గురించి వివరించారు. టాటా టైజర్, మహీంద్రా సంస్థలు 300 విద్యుత్ వాహనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు వీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఎల్ఈడీ బల్బులు వాడటం వల్ల 14వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్లు వివరించారు. 66వేల సోలార్ పంపుసెట్లు అందజేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఎన్నిసార్లు అంతరాయం కలిగింది, ఎంత సమయం సరఫరా నిలిచిపోయింది తెలుసుకోవడానికి ఉన్న వ్యవస్థ గురించి మంత్రికి వివరించారు. అంతరాయాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
          ధర్మల్, సోలార్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి గురించి వివరించారు. గాలి మర విద్యుత్‌ ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువ భాగం తెలంగాణలోకి వెళ్లినట్లు చెప్పారు. బొగ్గు, రవాణా ఛార్జీలు పెరిగి ఉత్పత్తి వ్యయం పెరిగినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. ప్రభుత్వం నుంచి రావలసిన సబ్సిడీలు రాలేదని తెలిపారు. పంచాయతీరాజ్, వాటర్ వర్క్, నీటి పారుదల శాఖల నుంచి అధికంగా బకాయిలు రావలసి ఉందని చెప్పారు. పట్టిసీమ, ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయినట్లు తెలిపారు. ఆక్వా రైతులకు, ఎస్సీ, ఎస్టీలు వంటి వారికి ఇచ్చే సబ్సిడీలు చాలా ఉన్నట్లు చెప్పారు. సబ్సిడీలు మొత్తం పది వేల కోట్ల రూపాయల వరకు రావలసి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రూ.5వేల కోట్ల బకాయిలు రావలసి ఉందని చెప్పారు.  రాష్ట్ర విభజనకు సంబంధించి 500 మంది ఉద్యోగుల సమస్య ఉందని, అది ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు.

ఏపీ ట్రాన్స్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసే విషయంలో అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేస్తారని చెప్పారు. ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిసియన్సీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీఈఓ ఏ.చంద్రశేఖర రెడ్డి, నెడ్‌ క్యాప్‌ ఎండీ కమలాకర్‌ బాబు, ఆయా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Jun 17, 2019


పూర్తిగా అదుపులో శాంతి భద్రతలు
హోమ్ మంత్రి మేకతోటి సుచరిత
          సచివాలయం, జూన్ 17: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. సచివాలయంలో సోమవారం రాత్రి మంత్రి మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని, ఇదేనా రాజన్న రాజ్యం అని ప్రశ్నిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. దాడులలో వైసీపీ కార్యకర్తలు 57 మంది గాయపడితే, టీడీపీ కార్యకర్తలు 44 మంది గాయపడ్డారని, ఎవరు ఎవరిమీద దాడి చేస్తున్నారో ఈ లెక్కలు చెబుతాయన్నారు. 2014 జూన్ లో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో తమ పార్టీ వారు దాడులు చేస్తే చూసీ చూడనట్లు ఉండమని ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిపై ఆ పార్టీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, కాల్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే రోజాను శాసనసభకు రాకుండా అడ్డుకున్నారని, మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయని చెప్పారు. అలాంటి పాలన చేసిన వారా తమ ప్రభుత్వం గురించి ప్రశ్నించేది, వారికి ఆ అర్హత లేదన్నారు. తమ నేత జగన్మోహన రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ‘కోడి కత్తి’ అని అవహేళన చేశారన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను ఆ నాడు ఈ నాడు తొలగిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీ మాట వినలేదని ఒక మహిళను వివస్త్రను చేశారని, ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు పెట్టారని చెప్పారు. వారి అరాచకాలకు తగిన బుద్ది చెప్పి ప్రజలు తమను 151 శాసనసభా స్థానాలలో గెలిపించారని చెప్పారు. ఉనికి కోల్పోతామన్న భయంతో టీడీపీ వారు ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారన్నారని మంత్రి సుచరిత అన్నారు.


Jun 16, 2019


త్వరలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు
హోమ్ మంత్రి సుచరిత
Ø బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్
Ø ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

        సచివాలయం, జూన్ 16: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అనుమతితో రాష్ట్రంలో త్వరలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోమ్, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లో ఆదివారం ఉదయం ఆమె తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కానిస్టేబుల్ మెడికల్ రీయింబర్స్ మెంట్ ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. అంతకు ముందు భర్త దయాసాగర్ తో కలసి వచ్చిన మంత్రికి వేద పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మంత్రి బాధ్యతలు స్వీకరించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు వేద మంత్రాలు, ప్రార్ధనలతో మంత్రిని దీవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రంలో నాలుగు బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. వాటిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెప్పారు. వాటిలో ఒకటి మహిళా బెలాలియన్, మరొకటి గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామన్నారు. బాబా సాహేబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్, సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి వల్ల తాను ఈ పదవిని చేపట్టినట్లు తెలిపారు. దళిత మహిళనైన తనకు బాధ్యత గల హోమ్ మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు అరికట్టడానికి, అటువంటి సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీ ఆఫ్ ని తప్పనిసరిగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. 2018 రిక్రూట్ మెంట్ కు సంబంధిచిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. పోలీస్ శాఖలోని ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేష్ విడుదల చేస్తామని చెప్పారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేస్తామన్నారు. బాధితుల కష్టాలు చెప్పుకునేందుకు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.
          బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి ఒకటి, రెండు రోజులు సమయం ఇవ్వాలని మీడియాకు సూచించారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల క్రితం జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫాస్టర్ ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పినట్లు తెలిపారు. వెంటనే తాను అధికారులకు విషయం తెలిపి విచారించి, తగిన చర్యలు తీసుకోమని చెప్పానన్నారు. పోలీసులు వెళ్లేసరికి ఫాసర్ట్ పారిపోయారని తెలిపారు. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు కొందరు మీడియా వారు రాశారని చెప్పారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ ఫాస్టర్ ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారని తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకునే సమయం ఇవ్వకుండా ఆ విధంగా రాయడమేమిటని ఆమె ప్రశ్నించారు. తొందరపడకుండా ఫిర్యాదు అందిన తరువాత కొద్దిగా సమయం ఇవ్వాలని మంత్రి సుచరిత  మీడియా వారిని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షల మేరకు తాము పని చేస్తామని మంత్రి చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి సుచరితకు పాయకరావుపేట  ఎమ్మెల్యే గొల్ల బాబురావు, లా అండ్ ఆర్డర్ అడిషన్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ డాక్టర్‌ గజరావు భూపాల్‌, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. మరి కొందరు మంత్రి దంపతులను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...