Oct 31, 2018


ప్రత్యేక రక్షణ దళం సైకిల్ ర్యాలీ
జాతీయ సమైక్యతా దినం
                
                సచివాలయం, అక్టోబర్ 31: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సమైక్యతా దినంలో భాగంగా బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దళం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి సచివాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 300 మంది పాల్గొన్న  ఈ ర్యాలీకి ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు  నాయకత్వం వహించారు. ఈ ర్యాలీ ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట, సీఎం నివాసం, మంతెన సత్యనారాయణ ఆశ్రమం, వెంకటపాలెం, మందడం మీదగా సచివాలయం చేరింది. నలుగురు దళానికి సంబంధించిన ప్రత్యేక దుస్తులు ధరించి రెండు మోటార్ సైకిళ్లపైన ర్యాలీకి ముందుభాగంలో ఉన్నారు. వారిలో ఒకరు జాతీయ జెండా, మరొకరు దళం చిహ్నంతో ఉన్న జెండా పట్టుకున్నారు. ర్యాలీ జరిగిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. సచివాలయం వద్దకు చేరిన ర్యాలీకి సచివాలయంలోని రక్షణ దళ సిబ్బంది చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ర్యాలీని సచివాలయం 2వ బ్లాక్ వద్ద కొద్దిసేపు నిలిపి కమాండెంట్ నరసింహారావు రెండు సార్లు శంఖం ఊదారు. ర్యాలీలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. ఆయన ఎక్కువసేపు శంఖం ఊదడం అందరినీ ఆకట్టుకుంది. సచివాలయం లోపల ర్యాలీ నిర్వహించి,  గేటు వద్ద మంచినీరు త్రాగి భారత్ మాతాకి జై, జై భారత్ మాతా... అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన మార్గంలోనే ర్యాలీని కొనసాగించారు. దాదాపు 50 కిలో మీటర్లు సాగిన ఈ ర్యాలీని మళ్లీ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకొని ముగించారు. ర్యాలీ కొనసాగినంత సేపు ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా ఉండటం విశేషం. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్లు పి.సత్యం, కె.కృష్ణమూర్తి, కె.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Oct 29, 2018



నవంబర్ 5న మంత్రి మండలి సమావేశం
                సచివాలయం, అక్టోబర్ 29: నవంబర్ 5 వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరుగుతుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.


వ్యవసాయ రంగంలో పరస్పరం
 సహకారించుకునే అంశాల పరిశీలన
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిని కలిసిన ఎన్ఎంఎస్ యూనివర్సిటీ ప్రతినిధులు
                సచివాలయం, అక్టోబర్ 29: అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీతో వ్యవసాయ రంగంలో పరస్పరం సహకరించుకునే అంశాలను పరిశీలించమని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరప పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం ఇది.  ఈ సందర్భంగా ఇరువైపుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. వ్యవసాయం, వ్యవసాయ విద్య, బోధన,  పరిశోధన, విస్తరణ తదితర అంశాలలో మనకు ఉపయోగపడేవాటిని పరిశీలించమని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ అధికారులకు మంత్రి చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల  పరిధిలోని కాలేజీలు, పరిశోధనా కేంద్రాలు,  పాలిటెక్నిక్ కాలేజీలు, వ్యవసాయ, ఉద్యానవన పంటలు, వివిధ ప్రాంతాలలో వర్షపాతం వివరాలు, అధిక ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్షపాతం, వాతావరణం ఆధారంగా పండే పంటలను విశ్లేషించారు. భూసార పరీక్షలు, చెరువులు, నీటి కుంటలు, ఫాం పాండ్స్,  భూగర్భజలాలు వంటి నీటి వనరుల లభ్యత, చెరువుల కింద సాగు, వివిధ జిల్లాలలో అత్యధికంగా పండించే పంటలు,  ద్రవ బయో ఫర్టిలైజర్, శాటిలైట్ ద్వారా పంటల పరిశీలన, వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, రైతుల ఫొటోలతోసహా  ప్రతి పొలంలో, తోటలలో పండే పంటలు నమోదయ్యే ఈ-పంట విధానం,  వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్కు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి పొందుతున్న సహకారం మొదలైన విషయాల గురించి వివరించారు.
             న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ వారు కూడా వారి విశ్వవిద్యాలయం పనితీరు, పరిశోధనలు, వారి పరిశోధనా కేంద్రాలు, ప్రస్తుతం వ్యవసాయంలో ఎదుర్కొంటున్న అంశాలు, నీటి వనరులు, నీటి నిర్వహణ, సహజ వనరులు, ఆధునిక టెక్నాలజీ వినియోగం, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆధునిక సౌకర్యాలు, బయోమెడికల్ పరిశోధన, ఆహార రక్షణ, ఆహార రక్షణ కేంద్రాలు, సేంద్రీయ వ్యవసాయం, మిరప, కాటన్ పంటలు, డెయిరీ నిర్వహణ,  పర్యావరణం, ఫిషరీస్, అడవి జంతువులు, టూరిజం మేనేజ్ మెంట్ వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. వివిధ దేశాలలో ఉన్న పరిశోధనా కేంద్రాలు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ తదితర అంశాలను  వివరించారు.
              వ్యవసాయంలో సాధించవలసిన అంశాలు, ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో  న్యూ మెక్సికో స్టేట్ యునివర్సిటీ వైస్ ప్రసిడెంట్, గ్రాడ్యుయేషన్ స్కూల్ డీన్  లూయిస్ సిఫాన్ టెస్, ఇంజనీరింగ్ విభాగం డీన్ లక్ష్మి ఎన్ రెడ్డి,  వ్యవసాయ విభాగం డీన్ రోలాండో ఫ్లారోస్,  కాలేజీ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ లారెన్ సిఫుటెస్, ఇండియన్ కో ఆర్డినేటర్ కుమార్ అన్నవరపు,  ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్.వి.నాయుడు, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ జె.దిలీప్ బాబు,  వ్యవసాయ విభాగం డీన్ డాక్టర్ జె.కృష్ణ ప్రసాద్ జీ, విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు, డిప్యూటీ డైరెక్టర్ ధర్మజ, వ్యవసాయ శాఖ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్.డి.ఆర్.కె.శర్మ తదితరులు పాల్గొన్నారు.
              ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు వచ్చిన న్యూ మెక్సికో స్టేట్ యునివర్సిటీ ప్రతినిధులు ఈ నెల 31న బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శిస్తారు. ఇక్కడ విశ్వవిద్యాలయాలలో విద్య, పరిశోధన, విస్తరణ, రాష్ట్రంలో పండే పంటలు, అనుసరించే ఆధునిక టెక్నాలజీ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించిన తరువాత వారు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

Oct 26, 2018


2వ రోజు జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్  -26.10.2018 శుక్రవారం

స్థలం : ఉండవల్లి కరకట్ట పక్కన ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజావేదిక

ముఖ్య అంశాలు


v తూర్పుగోదావరి, విశాఖపట్నంలో మలేరియా నివారణపై శ్రద్దపెట్టాలి. విశాఖలో డెంగీ నియంత్రణపై దృష్టి పెట్టాలి. స్వైన్ ఫ్లూ గత ఏడాది 454 కేసులు వస్తే ఈ ఏడాది 92 కేసులు వచ్చాయి. కర్నూలులో స్వైన్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. పొరుగు రాష్ట్రాల నుంచి స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా వైద్య సేవలు అందించాలి.మందులు పంపిణీ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
v పర్యాటక రంగంలో కాకినాడ హోప్ ఐలాండ్ ప్రాజెక్టు రూ.70కోట్లతో పూర్తిచేశారు. స్వదేశ్ దర్శన్ కింద పూర్తిచేసిన తొలి ప్రాజెక్టు ఇది: సీఎం
v శ్రీకాకుళం, విశాఖపట్నం, అమరావతి బుద్దిస్ట్ పర్యాటక క్షేత్రాల అభివృద్దిపై నిర్లక్ష్యం చేయడం తగదు: సీఎం
v  నెల్లూరులో కోస్టల్ టూరిజం డెవలప్ మెంట్ ప్రాజెక్టు రూ.59.70 కోట్లకు గాను రూ.41.95 కోట్లు ఖర్చుచేశారు: సీఎం
v శ్రీశైలం టెంపుల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు రూ.45.19 కోట్లకు రూ.22.33కోట్లు ఖర్చుచేశారు.

v పశు సంవర్ధకశాఖలో 20 శాతం లక్ష్యానికి ఇప్పటికి 16 శాతం వరకు చేరుకున్నాం : ముఖ్యమంత్రికి అధికారుల ప్రెజెంటేషన్.
v  రెండు త్రైమాసాల్లో మత్స్య రంగంలో 19.89 శాతం వృద్ధి రేటు నమోదు.
v  ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను 60 వేల ఎకరాల్లో చేయాలని లక్ష్యం పెట్టుకోగా 70 వేల ఎకరాలలో మంజూరు చేశాం. 49వేల ఎకరాల్లో గ్రౌడింగ్ జరిగింది. సైలేస్ పంపిణీ వేగవంతం చేస్తున్నాం. రూ.250 కోట్ల కన్వర్జెన్స్ నరేగా కింద లక్ష్యం కాగా, 14పథకాల కింద  ఆయా పనులను చేపట్టి పాల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తున్నాం.12,150 విఎల్ ఆర్పీలను గుర్తించాం. అన్ని నియోజకవర్గాలలో డిసెంబర్ కల్లా పశువైద్య శిబిరాల నిర్వహణ పూర్తిచేస్తాం: ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గోపాల కృష్ణ ద్వివేది
v  మత్స్య ఎగుమతుల్లో ఏపీలో 11.08 వృద్ధి రేటు నమోదు.

ప్రకాశం జిల్లా
వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, గుండ్లకమ్మ, కొరిశపాడు ప్రాజెక్టులను, వెలుగొండ టెర్నల్ ని చూసారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు.
వెలుగొండ ప్రాజెక్ట్ వన్ టైమ్ సెటిల్ మెంట్ ఫైల్ ఆర్థిక శాఖకు పంపినట్లు ఆర్ అండ్ ఆర్ (రిహాబిలేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) స్పెషల్ కమిషనర్ జి.రేఖారాణి చెప్పగా,  ఆ ఫైల్ వెంటనే పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారిని ఆదేశించారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు
ఉభయ గోదావరి జిల్లాల్లో డెల్టా మోడరేషన్ చేపట్టాలని, లిఫ్ట్ ఇరిగేషన్, డ్రైనేజ్ పనులు చేపట్టాలని, వ్యవసాయ కాలవలు మరమ్మతులు చేయాలని మంత్రి పితాని సత్యనారాయణ అడిగారు. తప్పకుండా ఆ పనులు చేపడతామని  మంత్రి ఉమ సమాధానం చెప్పారు.
మూలపాడులో బటర్ ఫ్లై పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. తమ జిల్లాలో  ఆర్నమెంటల్ ఫిషెస్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

రాయలసీమ జిల్లాలు
రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నీరందిస్తామని మంత్రి ఉమ చెప్పారు. నవంబర్ లో మడకశిర, హిందూపురానికి, డిసెంబర్ లో చిత్తూరు జిల్లా కుప్పంకు నీరందిస్తామన్నారు.

కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాకు తెలుగుగంగ నీరు అందడంలేదని, రైతులు చాలా బాధపడుతున్నారని మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. అక్కడ మచ్చుమర్రి ఉందని, నీరందించి ఆయకట్టుని కాపాడతామని మంత్రి ఉమ చెప్పారు. ఈ నెల 30న తాను కడప, కర్నూలు వస్తున్నట్లు చెప్పారు.
కర్నూలు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టి శిశు మరణాలను గణనీయంగా తగ్గించినట్లు ఆ జిల్లా కలెక్టర్ కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. బాలింతల ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల మంచి ఫలితాలు కనిస్తున్నట్లు చెప్పారు.

కడప జిల్లా
ఈ ఏడాది గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ చెప్పారు. అక్కడ రోప్ వే కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలు నిర్వహించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు.

అనంతపురం జిల్లా
ఈ ఏడాది పెనుకొండ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వీర పాండియన్ చెప్పారు. బాగా నిర్వహించండని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు.

చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లాకు శిల్పారామం కేటాయించమని పర్యాటక శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకు తగిన స్థలం కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్ ప్రద్యమ్నను సీఎం ఆదేశించారు.

విజయనగరం జిల్లా
తుఫానుకు కూలిపోయిన చింతచెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నట్లు  విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ చెప్పారు. అక్కడ వెంటనే మొక్కలు నాటమని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

v ఆర్నమెంటల్ ఫిషెస్ పై ఫిషరీస్ శాఖ రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.



Oct 25, 2018


జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ -25.10.2018 గురువారం
స్థలం : ఉండవల్లి కరకట్ట పక్కన ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజావేదిక


ముఖ్య అంశాలు
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
Ø నూతనంగా నూర్ బాషా/దూదేకుల ముస్లిం కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు. రూ. 40 కోట్లు కేటాయింపు.
Ø మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు కేటాయింపు.
Ø నిధులు ఇస్తున్నా విద్యార్ధులకు సకాలంలో ఉపకారవేతనాలు ఇవ్వకపోవడం సమర్ధనీయం కాదు.
Ø  90 శాతం సంతృప్తి సాధించకుంటే ఆ శాఖ అధికారులు విఫలమైనట్టే.
Ø డిసెంబర్ కల్లా రాష్ట్రంలో సగం గ్రామాలు స్వచ్ఛంగా కనిపించాలి.
Ø  మురుగునీటి పారుదల వ్యవస్థను అనుసంధానం చేసి, అక్కడ మురుగు నీటి శుద్ధి నిర్వహణ చేపట్టాలి.
Ø  ఈ డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 50 శాతం గ్రామాల్లో మురుగునీటి ఇంకుడు గుంటలు (సోప్ పిట్స్) తవ్వడం పూర్తి చేయాలి.
Ø  5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
Ø   పట్టణ ప్రాంతాలలో డోర్ నెంబర్లు నవంబరు లోపల పూర్తిచేయాలి. వీధి సూచికలను మూడు మాసాల్లో పెట్టాలి.
Ø ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించాలి.
Ø పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నూరు శాతం ఎల్ఈడి బల్డులు అమర్చాలి.
Ø  రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం(జడ్బీఎన్ఎఫ్-జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) చేస్తున్నారు.
Ø 2024 నాటికి వంద శాతం రైతులు ఈ విధానంలోకి రావాలి.
Ø రాష్ట్రంలో 42 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. కోటి ఎకరాలలో పండించాలన్నది లక్ష్యం.
Ø వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐసీఏఆర్ ప్రతిష్టాత్మక పాలసీ లీడర్ షిప్ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్ వ్యవసాయశాఖ మంత్రి చంద్రమోహన రెడ్డికి అందించారు. ఆ అవార్డ్ ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన సీఎంకు అందజేశారు. 
Ø ధాన్యం ఉత్పాదకతలో నెల్లూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది.
Ø వ్యవసాయంలో రసాయనాల వాడకం గణనీయంగా తగ్గింది. రైతులకు రెండు వేల కోట్ల రూపాయలు ఆదా అయింది.
Ø  ఏపీలో చేపట్టిన జీరో  బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద అగ్రో ఎకాలజీ ప్రోగ్రామ్ : ప్రకృతి సేద్యంపై ప్రభుత్వ సలహాదారు విజయకుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
---------------------------------
Ø సామాజిక సాధికారిత కోసం 2 లక్షల మంది లబ్దిదారులకు రాయితీతో వివిధ రకాల పరికరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష యూనిట్లు బ్యాంకుల ద్వారా కాగా, మరో లక్ష మందికి ఆదరణ పథకం ద్వారా మెగా గ్రౌండింగ్ మేళాలో డిసెంబర్ 31 నాటికి అందరికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Ø ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు కోరిన మేరకు భూములు కొనుగోలు చేసి ఎస్సీలకు అందజేయాలని సీఎం చెప్పారు.
Ø అన్ని కార్పోరేషన్లకు ఒక రకమైన నిబంధనలు రూపొందించమని సీఎం ఆదేశించారు.
Ø చంద్రన్న పెళ్లి కానుకలు  అందించే విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించమని దేశించారు.
Ø సూక్ష్మ నీటిపారుదల పద్దతిలో సాగు చేయడంలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినందుకు ఆ శాఖ అధికారులను సీఎం అభినందించారు. ఈ రకమైన సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు.

అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో 19 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని కోరగా, కేంద్రం నిబంధనల మేరకు 17 మండలాలనే గుర్తించిందని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. మిగిలిన రెండు మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని మంత్రి పరిటాల సునీత కోరారు. రాష్ట్రం ప్రభుత్వం గుర్తించే విధంగా ప్రతిపాదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ చెప్పారు.
అనంతపురంలో స్టేడియం నిర్మాణానికి నిధులున్నా స్థలం సమస్య ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా  
తిత్లీ తుపాను పునరావాస చర్యలు చేపట్టడంలో అధికారులు అందరూ బాగా పని చేశారని జిల్లా ఇన్ చార్జి మంత్రి పితాని సత్యనారాయణ అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో పేదలు ఎక్కువ మంది ఉన్నారని, ఇళ్లన్నీ ఎక్కువగా మట్టితోనే నిర్మించడం వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయని మంత్రి చెప్పారు. వారికి పక్కా ఇళ్లు నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున తుఫానులు వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కావలసిన పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
తిత్లీ తుఫాను వల్ల దెబ్బతిన్న పలాస, ఇచ్చాపురం మున్సిపాల్టీలను అమృత్ పథకం నిధులను వినియోగించుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ధనుంజయ రెడ్డి సూచనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చిత్తూరు జిల్లా
సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండటంతో ఆ జిల్లా కలెక్టర్ ప్రద్యమ్నను సీఎం అభినందించారు.
రైతులకు అదనపు ఆదాయం కోసం 12 వేల  తేనెటీగల పెట్టెలు ఇవ్వాలన్న కలెక్టర్ ప్రద్యమ్న ప్రతిపాదనను సీఎం అంగీకరించారు. దానిని ఇంకా పెద్ద ఎత్తున చేపట్టే అంశాన్ని పరిశీలించమని అధికారులను ఆదేశించారు.
కడప జిల్లా
మురుగునీటి ఇంకుడు గుంటలు (సోప్ పిట్స్) తవ్వకానికి స్థలాలు, భూములో రాళ్లు వంటి పలు సమస్యలు జిల్లాలో తలెత్తుతున్నట్లు కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
గుంటూరు జిల్లా
ఎల్ఈడీ బల్బులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వాటిని సరఫరా చేసే వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కోరగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ అంగీకరించారు.
ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఇంకా 20 నుంచి 25 టీఎంసీల నీటి లోటు ఉందని, దీనిని అదిగమించేందుకు వాగుల్లో వృధాగా పోతున్న నీటిని వాడుకునేందుకు రైతులకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. ఏ ఏ ప్రదేశాలలో కావాలో తెలియజేస్తే విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు.
విశాఖ జిల్లా
చెత్త సేకరణకు సంబంధించి జిల్లాల వారీగా ఇచ్చిన స్టార్ రేటింగ్ లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

నోట్: ఈ వార్తకు ఫొటోలు ఉన్నాయి.
జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.

Oct 24, 2018


అమరావతిలో 20 సంస్థలకు
126 ఎకరాల కేటాయింపు
మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
Ø ఎన్టీఆర్ హెల్త్ యూనిర్సిటీకి 50 ఎకరాలు
Ø గతంలో 85 సంస్థలకు 1375 ఎకరాల కేటాయింపు

              సచివాలయం, అక్టోబర్ 24: రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 126 ఎకరాలు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని ఆర్థిక మంత్రి చాంబర్ లోని సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఉపసంఘం సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించామని, కొన్నిటిని తిరస్కరించామని, మరి కొన్నిటిని వాయిదావేశామని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు 5.56 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ భూములకు ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు నిర్ణయించినట్లు చెప్పారు.
       గతంలో పది విభాగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. ఆ భూములకు సంబంధించి ఆయా సంస్థలు రూ.506 కోట్లకు రూ.386 కోట్లు సీఆర్డీఏకు చెల్లించినట్లు తెలిపారు. మొత్తం సంస్థల నిర్మాణం, పెట్టుబడుల మొత్తం విలువ రూ.45,675 కోట్లని  చెప్పారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి సంస్థలు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.

29 గ్రామాలు సమానంగా అభివృద్ధి
              రాజధాని పరిధిలోని 29 గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందేవిధంగా భూ కేటాయింపులు జరగాలని అంతకు ముందు జరిగిన మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. నబార్డ్ కు ఇచ్చే భూమి విలువను ఎకరాకు రూ.2 కోట్లుగా నిర్ణయించారు. రామకృష్ణ మిషన్, ఉన్నత విద్యా శాఖ, ఏపీ ఫైబర్ నెట్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఘం, అంతర్జాతీయ క్రికెట్ అకాడమి, కెనరా బ్యాంక్, విజయా బ్యాంక్, ఏపి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, ఏపీ ఫైనాన్సియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్, అమరావతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అకాడమి తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయింపుతోపాటు వాటి ధరలు నిర్ణయించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, స్పెషల్ కమిషర్ వి.రామమోహన రావు, అడిషనల్ కమిషనర్ ఎస్. షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Oct 23, 2018

కేంద్రం, ప్రతిపక్షాలకు పట్టని తుఫాను బాధితుల బాధలు
మంత్రి కాలవ శ్రీనివాసులు
                   సచివాలయం, అక్టోబర్ 23: శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను బాధితుల బాధలు అటు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రతిపక్షాలకు గానీ పట్టడంలేదని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక పక్క వరదలు, కరువుతో రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పని చేస్తోందన్నారు. సహాయపడవలసిన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అక్కడే మకాంవేసి సహాయక చర్యలు పర్వవేక్షించారని చెప్పారు. వేలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయి, తిండి కూడా లేక అల్లాడుతున్న పరిస్థితులలో ప్రభుత్వం సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇళ్ల పైకప్పుల కోసం 10వేల సిమెంట్ రేకులు, టార్పాలిన్ లు సరఫరా చేసినట్లు చెప్పారు. నిత్యావసర వస్తువులు అందజేసినట్లు తెలిపారు. 12 రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. 40 వేల విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, నేలకొరిగి భారీ నష్టం సంభవించినట్లు తెలిపారు.  రాష్ట్రం నలుమూలల నుంచి 11 వేల మంది విద్యుత్ కార్మికులు, అధికారులు రాత్రి పగలు పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారని చెప్పారు. 50వేల మంది ఇళ్లు కోల్పోయారని, 16వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయని వివరించారు. పండ్లు, జీడి తోటలతో కళకళలాడిన ప్రాంతం కోలుకోలేని స్థితికి చేరడం బాధాకరం అన్నారు. అధికారులు వారం రోజులలో నష్టం వివరాలు సేకరించారన్నారు. ఈ నెలలోనే నష్టం పరిహారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితులలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తుఫాను సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. బాధితులకు నమ్మకాన్ని కలిగించి, భరోసా ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డికి బాధితులను పరామర్శించడానికి అవకాశం గానీ, ఓపిక గానీ, తీరిక గానీ లేదా? అని మంత్రి కాలవ ప్రశ్నించారు.  సొంత పత్రికలో విషపూరిత రాతలు రాసి బాధితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ తున్నారన్నారు. కష్టం వచ్చినప్పుడు బాధితులకు నాయకులు ఉన్నారన్న భావన కలిగించాలన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగడమే వారి పని అన్నారు. తక్షణం చేపట్టిన సహాయక చర్యలు కనిపించడంలేదా? అని అడిగారు. కేంద్రం సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు 3వ రోజునే ప్రధాన మంత్రి వచ్చారని, వెయ్యి కోట్ల రూపాయలు సహాయం ప్రకటించారని, అయితే రూ.600 కోట్లే ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రాజ్ నాథ్ సింగ్ కూడా రాలేదని, ఏరియల్ సర్వే కూడా చేయలేదన్నారు.  ఒక్క అధికారిని కూడా పంపలేదని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు కేంద్రానికి, ప్రతిపక్షానికి ఎందుకు పట్టడంలేదని ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డి గానీ, పవన్ కల్యాణ్ గానీ కేంద్రాన్ని ఎందుకు అడగరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నారన్నారు. నష్టం జరిగిన దానికి సమానంగా కాకపోయినా గతంలో కంటే ఎక్కువగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం తక్షణం స్పందించాలని, సహాయం అందించడానికి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితులలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా ఉండి, బాధితులకు ఉపయోగపడేవిధంగా వ్యవహరించాలని మంత్రి కాలవ హితవు పలికారు.
కోర్టు తీర్పుని గౌరవిస్తాం
పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పుని గౌరవిస్తామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. రిజర్వేషన్లు, ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయినట్లు తెలిపారు. తమ పార్టీ తొలి నుంచి స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు.

Oct 22, 2018


కుట్ర రాజకీయాలు మానుకోండి

కన్నాకు మంత్రి ఆనందబాబు హితవు
సచివాలయం, అక్టోబర్ 22: కుట్ర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయమై బీజేపీ వారు రిలే నిరాహార దీక్షలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి రూ.6,500 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్నారన్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్డు పరిధిలో ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బు చెల్లిస్తామని ముందు చెప్పి, ఏడాది తరువాత వెనక్కు తగ్గిన ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర బీజేపీ ఎంపి అని తెలిపారు. ఆ గ్రూప్ ఎందుకు ముందుకు వచ్చిందో, ఎందుకు వెళ్లిందో తెలియదన్నారు. అగ్రిగోల్డ్ ప్రధాన నిందితులు అవ్వారు సీతారామ్ ని ఐవైఆర్ కృష్ణారావు, కన్నా లక్ష్మీనారాయణలే రామ్ మాధవ్ కు పరిచయం చేశారన్నారు. ఆ సీతారామ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బంధువులని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నోయిడా-గుర్గామ్ ప్రాంతాలలో సీతారామ్ ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ పరిస్థితులలో అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన కన్నా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ఏదో చేశామని చెప్పుకోవడానికి కన్నా అసలు విషయాన్ని పక్క దారిపట్టిస్తున్నారన్నారు. ఆయన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వకాల్తాగా దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. వారి వెనుక బాధితులు లేరన్నారు. ఈ అంశంపై సీబిఐ విచారణకు ఆదేశించమని కర్ణాటక ప్రభుత్వం కోరిందని, విచారణకు ఆదేశించలేదేం అని ఆయన ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.21వేల కోట్ల ఆస్తులకు అటాచ్ మెంట్ తెచ్చినట్లు చెప్పారు.
తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి కన్నా పార్టీ మారారన్నారు. వైసీపీలోకి వెళ్లవలసిన కన్నా బీజేపీలోకి మారారని విమర్శించారు. బీజేపీకి ఇక్కడ ఓట్లు లేవని, వారికి ఒక్క ఓటు కూడా రాదని, అయినా వారికి సమాధానం చెప్పవలసి వస్తుందన్నాదు.  రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన హామీలపై  వీరు కేంద్రాన్ని నిలదీయరేమని ఆయన ప్రశ్నించారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి ఆగదన్నారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ముందుకు వెళుతున్నారని చెప్పారు.  2050 నాటికి రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందన్నారు. తమ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, వారి వల్లకాదన్నారు. చంద్రబాబుపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి ఆనందబాబు చెప్పారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...