Apr 21, 2020

క‌రోనా వైర‌స్ - జ‌ర్న‌లిస్టుల‌పై ప్ర‌భావం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి సంద‌ర్భంగా దేశంలో 24 గంట‌లూ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ని చేసేవారు  వైద్య‌, పారిశుద్ధ్య‌, పోలీస్‌, మిడియా సిబ్బంది. వీరితోపాటు విద్యుత్, గ్యాస్ స‌ర‌ఫ‌రా, ఇత‌ర డెలివ‌రీ సిబ్బంది కూడా సాధార‌ణ ప‌నివేళ‌ల్లో ప‌ని చేస్తున్నారు.  కానీ వీరంద‌రిలో తీవ్రంగా న‌ష్టపోతున్న‌ది జ‌ర్న‌లిస్టులే. వీరు 24 గంట‌లూ అటెన్ష‌న్‌లో ఉండాలి. నిద్ర‌పోతున్నా లేచి ప‌రిగెత్తాలి. కొన్ని సంద‌ర్భాల‌లో వీరి ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంటుంది.  వీరు త‌మ బాధ‌లు మ‌రొక‌రికి చెప్పుకోలేరు. చెప్పినా తీర్చేవారు లేరు. ఇది నా అనుభ‌వంతో చెబుతున్నాను. సామాజిక బాధ్య‌త‌కు, వృత్తి ధ‌ర్మానికి నిబ‌ద్ధులు వీరు. అంద‌రినీ హైలెట్ చేస్తారు. వీరిని హైలెట్ చేసేవారు లేరు. వీరి ఆర్థిక ప‌రిస్థితులు మెరుగుప‌డే మార్గం క‌నిపించ‌డంలేదు.  క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మారుతున్న ప‌రిస్థితుల ప్ర‌భావం వీరిపై తీవ్రంగా ప‌డే ప్ర‌మాదం ఉంది.
- శిరందాసు నాగార్జున‌

Apr 1, 2020

కన్నీటి కెరటాల వెన్నెల

- తాడి ప్రకాష్

 మనశ్శాంతిలేని రోజులివి. దినపత్రికలు మనల్ని భయకంపితుల్ని చేస్తాయి. వ్యాస్ శవాన్నీ, నెత్తురోడే శంకర్ శవాన్నీ పొద్దున్నే మనింటికి మోసుకొస్తాయి. డిస్టర్బ్ చేస్తాయి. చల్లని ఉదయాన ఆలోచనల్ని పదునైన బ్లేళ్లతో చీరేస్తాయి. కొందరు డాక్టర్లు ఆపరేషన్ చేసి పొట్టలో సూదులో, గాజుగుడ్డలో మరిచిపోతారు. కొందరు దగుల్బాజీలు రేప్ చేసిన ఒక పిచ్చితల్లి.. గర్భవతై రోడ్లపై రికామీగా తిరుగుతుంటుంది. కోడల్ని కిరోసిన్ పోసి తగలబెట్టిన హంతకులు రెండో కట్నం కోసం పెళ్లి చేసుకుంటున్న సుపుత్రుణ్ణి చిర్నవ్వుతో ఆశీర్వదిస్తుంటారు. కూరగాయలు కొనుక్కోవడానికెళ్లిన ఒక మధ్య తరగతి జంటని మతం పేరు చెప్పి కొందరు కత్తులతో కుమ్ముతారు. సోమాలియాలో ఆకలి ఆకలి అంటూ రోజుకో యాభై మంది చొప్పున నేలరాలిపోతుంటారు. ఒక జర్నలిస్టుని కాల్చి చంపి, ‘‘వాడు నక్సలైట్’’ అని పోలీసులు వెకిలిగా నవ్వుతారు. లాకప్ లో రిక్షావాణ్ణి కొట్టి చంపి ‘‘వాడు పాత కేడీ’’ అంటారు. కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న దేశంలో ఒక సగటు సినిమా నటుడు సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటాడు. వడ్డాది పాపయ్యలాంటి కళాకారుడు దిక్కూమొక్కూ లేకుండా ఓ పూరింట్లో ప్రాణాలు విడుస్తాడు. హృదయంలేని సమాజంలో ఇమడలేక బంగోరేలాంటి నిండైన మనిషి ఎక్కడో సట్లెజ్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. జయలలితకి జ్వరం వచ్చిందంటే ఒక వెర్రిబాగుల తమిళ సోదరుడు ఆత్మాహుతి చేసుకుంటాడు.

హింస! హింస!!
సిటీ బస్సు ఎక్కడమూ హింసే!
ఎల్.కే.జీ సీటు సాధించడమూ హింసే!
సినిమాలూ, ఉద్యోగాలూ, పెళ్లిళ్లు, సంసారాలు, విప్లవం, సాహిత్యం అంతా హింసే!
బతుకునిండా నిండిపోయింది హింస!
ఇంత వత్తిడీ, ఉద్రిక్తతా, సంఘర్షణావున్నా... ‘‘కులాసాగా వుండటానికి అలస్కా దాకా అవకాశం ఉంది’’ అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలు మధ్య తరగతి వాడి భుజం తడతాయి. ఇంత వినోదం కోసం ఓ తెలుగు సినిమాకు వెళతాడు. బయట కొచ్చేసరికి అతని కాళ్లకు గిట్టలు మొలుస్తాయి. నెత్తికి కొమ్ములు వస్తాయి. ఇల్లు చేరితే టీవీలో తెలుగు సీరియల్ వస్తూ వుంటుంది. దాంతో ఈ పిరికి, మురికి బతుకు మీద జాలిపడే సహనమూ నశిస్తుంది. ఆ క్షణంలో ఆత్మహత్యలు చేసుకొనే ధైర్యవంతులను చూస్తే ఈర్ష్య కలుగుతుంది.
ఇంత దుర్భర, దుస్సహ, దుర్మార్గ జీవనంలోనూ ఓ చమత్కారం ఉంది. ఒకింత ఆనందాన్ని ఒడిసిపట్టుకొనే దారి వుంది. ఒక హాయియైన నవ్వు్కీ, సంతోషానికీ, నిశ్చింతకీ... అయ్యయ్యో తిలక్ చెప్పినంత అవకాశం వుంది. దీని కోసం హిప్నటిస్టుల్నీ, హిచ్ కాకుల్నీ కలవాల్సిన అవసరం లేదు.
వణికించే ఉదయాన విడిపోయే తెలిమంచు తెరల సౌందర్యాన్ని తనివి తీరా చూశారా? పొద్దున్న నిద్ర లేవగానే కుమార గంధర్వ గానాన్ని హృదయం ఇచ్చి విన్నారా ఎప్పుడన్నా? ‘ఆనా కెరినినా’ పుస్తకం చివరి పేజీలు చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారా? గిరిజన వీరుడు ‘బిర్సాముండా’ డాక్యుమెంటరీ చూసి కదిలిపోయారా? రే ‘పథేర్ పాంచాలి’లో ఆ ఇద్దరు పసి బిడ్డలూ రైలును చూడ్డం కోసం పొలాలకు అడ్డంపడి పరిగెత్తడంలోని అందాన్ని అనుభవించారా? ‘హమ్ జీకే క్యా కరేంగే’ అనే సైగల్ గొంతులోని విషాద మాధుర్యాన్ని గుండెలో నింపుకున్నారా? ‘నాలో ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ ప్రజాసేవ చేస్తాను’ అని ఎన్టీఆర్ ఎప్పట్లాగే మాట్లాడితే, వళ్లు మండిన ఒక జర్నలిస్టు ఆ వార్తకి ‘యావజ్జీవ ప్రజాసేవ’ అని శీర్షిక పెట్టడంలో ప్రొటెస్ట్ నీ, వ్యంగ్యాన్నీ ఎంజాయ్ చేశారా? పొరపాట్న ఒక్క రోజు తాగడం మానేసి, టైంకి ఇల్లు చేరుకున్నప్పుడు ఆ వెర్రి ఇల్లాలి కళ్లల్లో సంతృప్తీ, వెలుగూ చూసి సిగ్గుపడ్డారా? ‘బాధలన్ని తీసి మీరు బాకులు సెయ్యండిరో’’ అని వంగపండో, గద్దరో పాడితే విని ఉత్తేజంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారా? తిరుమల కొండమీద తెల్లవారుజామున ఎమ్మెస్ సుప్రభాతాన్ని మోసుకొచ్చే చల్లగాలి పరిమళాన్ని ఆస్వాదించారా? అల్లరిగా తిరుగుతూ గూడుకట్టే పిచికల్నీ, తల్లి రెక్కల కిందికి పారిపోయే కోడిపిల్లల్నీ, పాదాలు తాకుతూ తిరిగే చిన్నారి కుక్కపిల్లల్నీ చూడ్డంలోని మహదానందం మీకు ఎరుకేనా? ఎప్పుడన్నా చేలో రాత్రిపూట వెన్నెల్లో మంచె మీద పడుకున్నారా? వేరుశెనగ చేను గట్ల మీద మిత్రులతో కబుర్లు చెప్పుకున్నారా? చలికాలం అమ్మ పాత చీరని నాలుగు మడతలు పెట్టి కప్పినపుడు కళ్లు అప్రయత్నంగా చెమర్చడం మీకు తెలుసా? బాధతో కావలించుకొని ఏడ్చిన మిత్రుణ్ణి తలనిమిరి ఓదార్చే విలాసం మీకు కలిగిందా? ముష్ఠి యాభై రూపాయలకే నెలంతా నీ ఇంట్లో చాకిరీ చేసే పదేళ్ల పిల్లకి కొత్త గౌను కొనిచ్చే సాహసం ఎప్పుడన్నా చేశారా? ఆ దీనమైన కళ్లలో విభ్రాంతినీ, సంబరాన్నీ చూడాలనిపించిందా?
ఇదంతా బతుకే.
కమ్ముకున్న చిక్కని విషాదం తెరల మధ్య వెన్నెల రుతువులాంటి బతుకు. నానాటికీ నిస్సారమైపోతున్న ఆధునిక నాగరిక యాంత్రిక జీవనంలో కన్నీటి చెమలచుట్టూ చిర్నవ్వుల పూలు పూయించుకోగిలిగినప్పుడే బతుకు ధన్యమౌతుంది.
- తాడి ప్రకాష్
(ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం సంపాదకీయం- 31, జనవరి 1993)

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...