Aug 24, 2022

స్టాక్‌మార్కెట్ దిగ్గజం బిగ్‌బుల్ ఝున్‌ఝున్ వాలా


రూ.5వేల నుంచి రూ.43వేల కోట్లకు ఎగబాకిన  ఝున్ ఝున్ వాలా ఎవరు?

బిగ్ బుల్ ఆఫ్ ఇండియా రాకేష్ ఝున్ ఝున్ వాలా 5 వేల రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టి  43వేల కోట్ల రూపాయలకు పైగా గడించారు. బిగ్  కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్  రాకేష్ ఝున్ ఝున్ వాలా  భారతీయుల్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు.  భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో బిలియనీయర్.  స్టాక్ మార్కెట్ లో ప్రముఖ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝున్ ఝున్ వాలా  రాధేశ్యామ్, ఊర్మిళ దంపతులకు  జూలై 5, 1960 సంవత్సరంలో హైదరాబాదులో  జన్మించారు.  రాజస్థాన్ లోని ఝున్ ఝున్ గ్రామానికి చెందిన ఆయన తండ్రి  రాధేశ్యామ్ ఝుున్ ఝున్ వాలా ముంబైలో  ఆదాయపు పన్ను కమిషనర్‌గా  పనిచేశారు.  దాంతో వారి కుటుంబం ముంబైలో  స్థిరపడింది. తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో ఉన్నందున ఝున్ ఝున్ వాలా అక్కడే పెరిగారు. చిన్నతనంలో ఆయన తండ్రి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు. స్టాక్ మార్కెట్ గురించి  ఆయన తండ్రి తన స్నేహితులతో చర్చించేవారు. దాంతో రాకేష్ ఝున్ ఝున్ వాలాకు స్టాక్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది. ఒక రోజు ఆయన తన తండ్రిని స్టాక్ మార్కెట్ లో షేర్ల ధరల హెచ్చుతగ్గుల గురించి అడిగారు. వార్తలను, షేర్లను పరిశీలిస్తే అర్థమవుతుందని తండ్రి చెప్పారు. 12, 13 ఏళ్ల వయసు నుంచే షేర్ మార్కెట్, షేర్ల ధరలలో మార్పులు, వార్తల గురించి అధ్యయనంచేయడం మొదలుపెట్టారు. 


సిడెన్ హమ్  కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బికాం డిగ్రీ పూర్తి చేశారు.  ఆ తరువాత ట్రేడింగ్ నే కెరీర్ గా ఎంచుకుంటానని తండ్రితో చెప్పారు. దానికి ఆయన  ‘‘నీ ఇష్టాన్ని కాదనను, కాకపోతే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడుకున్నది. నువ్వక్కడ నిలదొక్కుకోలేకపోతే భవిష్యత్ ఏంటనేది ఆలోచించాలి’’ అని  చెప్పారు. ముందు సీఏ పూర్తి చేయమని తండ్రి  చెప్పారు. షేర్ల వ్యాపారమంటే పెళ్లి చేసుకోవడానికి పిల్లని కూడా ఎవరూ ఇవ్వరు అని తల్లి  చెప్పారు. తల్లిదండ్రుల సూచన మేరకు  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. సిఏ పూర్తి చేసిన తరువాత 1985లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే, షేర్లు కొనడానికి ఆయన వద్ద డబ్బులేదు.   కొంత డబ్బు ఇవ్వమని తన తండ్రిని అడిగారు.  ‘‘నీకు నచ్చినన్ని సంవత్సరాలు పైసా ఇవ్వకుండా ఇంట్లోనే  ఉండు.  డబ్బు మాత్రం ఇవ్వను’’ అని తండ్రి  చెప్పారు.   ఆ రోజు నుంచి తల్లితండ్రి  జీవించి ఉన్నంత వరకు వారితో కలిసే ఉన్నారు. 

తండ్రి కాదనడంతో  సీఏగా ప్రాక్టీస్  చేస్తున్న అన్నయ్య రాజేష్ వద్ద 5వేల రూపాయలు అప్పుగా తీసుకుని ట్రేడింగ్ మొదలు పెట్టారు. అప్పటి స్టాక్  మార్కెట్ సూచీ 150 పాయింట్లు. మొట్టమొదటిసారి ఆయన టాటాపవర్, టాటా టీ షేర్లు కొన్నారు. టాటా టీ షేర్లలో మూడు నెలల్లోపే మూడు రెట్లు లాభం వచ్చింది.  వచ్చిన లాభంతో  సెసా గోవాలో నాలుగు లక్షల షేర్లు కొన్నారు. సంవత్సరం తరువాత నాలుగో వంతు వాటా ఉంచుకొని, మిగతావి అమ్మేశారు.  వచ్చిన డబ్బుని వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. వాటిలో టైటాన్ షేర్ల ద్వారా అధిక లాభాలు వచ్చాయి. 1987 ఫిబ్రవరి 22న  ఝున్ ఝున్ వాలా రేఖను వివాహం చేసుకున్నారు. వారికి ఒక అమ్మాయి నిష్ఠ, ఇద్దరు మగ పిల్లలు కవలలు  ఆర్యమాన్, ఆర్యవీర్.ఒకవైపు ట్రేడింగ్ చేస్తూనే, భార్యాభర్తల పేర్లు కలిసివచ్చేవిధంగా  రేర్ ఎంటర్ ప్రైజస్ అనే పేరుతో బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించారు.  తరువాత సినిమా రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. నిర్మాతగా ఇంగ్లీష్ - వింగ్లీష్, షమితాబ్, కీ అండ్ కా చిత్రాలను నిర్మించారు.  అనతి కాలంలోనే   వ్యాపార దిగ్గజంగా పెరిగి, వేల కోట్ల  రూపాయల ఆస్తులకు అధిపతి అయ్యారు. అయితే, అన్ని సందర్భాలలో ఆయనకు లాభాలు రాలేదు. కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చాయి. అయితే, ఎక్కువ శాతం ఆయన ట్రేడింగ్  లాభాల బాటలో నడిచింది.  ఆయన కొనే షేర్ల విలువ ఖచ్చితంగా పెరుగుతుందని పెట్టుబడిదారుల నమ్మకం. అనుకోకుండా ఒక రోజు మాటల సందర్భంలో   తండ్రి  ‘‘నీ సంపాదనలో  నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నా ఆదాయం నాకు సరిపోతుంది. నువ్వు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి’’ అని 

ఝున్ ఝున్ వాలాతో అన్నారు.   అప్పటి నుంచీ   ఆయన స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం చేస్తూ వచ్చారు. 2008లో తండ్రి మరణించిన తరువాత ఆయన మాటను గౌరవించి  అగస్త్య ఇంటర్నేషనల్ షౌండేషన్ కు ఆర్థిక సహాయం అందించేవారు. విద్య, వైద్య రంగాలకు సైతం ఎంతో సహాయం చేశారు. శంకర్ ఐ కేర్ వైద్య సంస్థతో కలిసి ముంబైలో ‘ఆర్.ఝున్ ఝున్ వాలా శంకర్ ఐ హాస్పటల్’ ను నిర్మించారు. భారతీయుల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఝున్ ఝున్  వాలా ఆప్‌టెక్, హంగామా డిజిటల్ మీడియా సంస్థలకు   చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా,  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌,  ప్రైమ్ ఫోకస్, బిల్‌కేర్ లిమిటెడ్,   మిడ్ డే మల్టీమీడియా, నాగార్జున కన్ స్ట్రక్షన్స్ వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ‘ఆకాశ ఎయిర్’ సంస్థ ద్వారా  విమానయాన రంగంలో కూడా అడుగు పెట్టారు.   2022 ఆగస్టు 7న ‘ఆకాశ ఎయిర్’ తొలి విమానంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించారు. ఆ తరువాత వారం రోజులకే ఆయన మరణించారు. 

 2022 జూలై నాటికి ఆయన ఆస్తుల విలువ 43 వేల 653 కోట్ల రూపాయలకు పెరిగింది.  ఎన్ని వేల కోట్లు ఆస్తులు గడించినప్పటికీ ఆయన నిరాడంబరంగానే  జీవించారు. పిల్లలకు కూడా ఆయన మధ్యతరగతి జీవితాన్నే అలవాటు చేశారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం   భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో   ఆయన  36వ  వ్యక్తిగా నిలిచారు.  అమెరికన్ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ తో   ఆయనను పోల్చుతారు. రేసులు,  సిగరెట్లు, మద్యం వంటి అలవాట్లు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.  2022 ఆగస్టు 14న  రాకేష్ ఝున్ ఝున్ వాలా   గుండె పోటుతో కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేస్తూ  ఆర్థిక వ్యవస్థకు, దేశ పురోగతికి ఝున్ ఝున్ వాలా కృషి చేశారని  కొనియాడారు.  ఆయన మరణం స్టాక్ మార్కెట్ రంగానికి తీరనిలోటు. స్టాక్ మార్కెట్ చరిత్రలో  బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అధ్యాయం ముగిసింది. 

                                                                          - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 94402









Aug 21, 2022

అమ్మ కొడుకు ఓ విజయం



లక్ష్యం, తపన, పట్టుదల, కృషి ఉంటే పెళ్లి, పిల్లలు, వయసు ఇవి ఏవీ లక్ష్యసాధనకు అడ్డుకావని నిరూపించింది ఓ వనిత. కన్న కొడుకుతోపాటు యువతరంతో పోటీపడి ఓ తల్లి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అరుదైన సంఘటన కేరళలో జరిగింది. కేరళ రాష్ట్రం మలప్పురం పట్టణానికి చెందిన 42 సంవత్సరాల వయసు ఉన్న బిందు అనే మహిళ, ఆమె కుమారుడు వివేక్‌తోపాటు పోటీపరీక్షలలో శిక్షణ పొంది  పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షలు రాశారు. తల్లీకొడుకు ఇద్దరూ ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో  ఉత్తీర్ణత సాధించారు.  42 ఏళ్ల అమ్మ,  24 ఏళ్ల కొడుకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న బిందు కల ఇన్నేళ్ల తర్వాత నెరవేరింది. ఇటీవల జరిగిన ఈ సంఘటన కేరళలోనే కాకుండా దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ వార్తతోపాటు తల్లీకొడుకుల ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  వివేక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో విశేషం ఏమీలేదు. కానీ,  కొడుకుతోపాటు తల్లి కూడా అదే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో వారు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.

 బిందు  కేరళలోని మలప్పురం పట్టణానికి చెందిన వ్యక్తి.  ఆమె  భర్త  చంద్రన్  మలప్పురం జిల్లాలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఎడప్పల్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమారుడు వివేక్ ఒట్టుపర, కుమార్తె   హృద్య ఉన్నారు.  బిందుకు చిన్న వయసులోనే పెళ్లైంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆమె ఎంతోకాలంగా కలలు కంటోంది. అయితే, పిల్లలు పుట్టడం, వారి ఆలనాపాలనా చూసుకోవడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం ఆమెకు సాధ్యంకాలేదు. దాంతో ఆమె కల నెరవేరలేదు.  మలప్పురం జిల్లాలోని ఆరీకోడ్‌లో ఆమె గత 11 ఏళ్లుగా  అంగన్‌వాడీ టీచర్‌‌గా పని చేస్తున్నారు.  2019-20లో బిందు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు. అయితే,  ఆమె అంతటితో    ఆగిపోలేదు. ఉన్నత స్థానానికి ఎదగటం కోసం తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు.  మరోపక్క పిల్లలు  కూడా పెద్దవాళ్లయ్యారు.  కొడుకు వివేక్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ  పరీక్షలు రాస్తున్నాడు. బిందు కూడా అంగన్ వాడీ టీచర్ పోస్టుతో సంతృప్తి చెందలేదు.  ఇప్పటి వరకూ ఆమె రెండు సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు.  ఐసీడీసీ సూపరింటెండెంట్ పోస్టుకు  పోటీ పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. 

ఇదే క్రమంలో ఆమె కొడుకు వివేక్ కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్యాలని అనుకున్నాడు. ఇప్పటికే రెండు సార్లు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసిన బిందు కూడా కొడుకుతోపాటు మరోసారి  ఆ పరీక్షలు రాయడానికి సిద్ధపడ్డారు. తియ్య కమ్యూనిటీకి చెందిన వారికి రిజర్వేషన్ ఉండటంతో ఆమెకు 42 ఏళ్లు వచ్చినా కేరళ పబ్లిక్ సర్వీస్  కమిషన్ లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పోస్టుకు అర్హురాలు కావడంతో  ఆమె అప్లై చేశారు. అయితే, ఇంతకు ముందులా కాకుండా  గట్టిపట్టుదలతో ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. తల్లీకొడుకులు  ఇద్దరూ కలిసి ఒకే కోచింగ్ సెంటర్ లో చేరారు.  ప్రతిరోజూ కలిసే క్లాసులకు హాజరయ్యేవారు. ఇంటి దగ్గర కూడా ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీ చేశారు. తల్లీకొడుకుల పట్టుదల, వారు ప్రిపేర్ అయ్యేతీరును గమనించిన కోచింగ్ సెంటర్‌లోని అధ్యాపకులు కూడా వారిని  ప్రోత్సహించారు. చంద్రన్ కూడా భర్తగా, తండ్రిగా వారిద్దరినీ ప్రోత్సహించారు.

ఇద్దరూ కలిసి ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. కేరళ పబ్లిక్ సర్వీస్  కమిషన్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలో వివేక్‌కు 38వ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలో  బిందుకు 92వ ర్యాంక్ వచ్చింది. దాంతో ఆ తల్లీకొడుకుల ఆనందానికి అవధులు లేవు. చిరకాల వాంఛ నెరవేరినందుకు,  కొడుకుతోపాటు తనకూ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు  బిందు  సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  కేరళ రాష్ట్రమంతా ఇప్పుడు వీరిద్దరివైపే చూస్తోంది.  వారి ఇంటర్వ్యూల వీడియోలు వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా కూడా వారి గురించి చర్చించుకుంటున్నారు. బిందు మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒక  భార్యగా, గృహిణిగా, తల్లిగా తన వంతు బాధ్యతలను నెరవేర్చడమే కాకుండా ఆత్మ విశ్వాసంతో ఉంటే  ఆశయ సాధన అసాధ్యం కాదని, స్త్రీలు తలుచుకుంటే  ఏదైనా సాధించగలరని బిందు నిరూపించారు. మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.  అమెకు మనస్ఫూరిగా అభినందనలు తెలియజేద్దాం.

                                                                  - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914







Aug 16, 2022

చిరంజీవి ఓ సంచలనం



చిరంజీవి ఆ పేరే  తెలుగుసినిమా రంగంలో ఓ పెను సంచలనం. ఓ మెరుపు.  తుఫానులా దూసుకువచ్చారు. తిరుగులేని మెగాస్టార్ లా ఎదిగారు. అద్వితీయమైన డ్యాన్సులు, అమోఘమైన నటనతో యువత గుండెల్లో తిష్టవేశాడు. డ్యాన్స్ చేయడంలో తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పగలిగేవిధంగా సాధన చేశాడు. మెరుపు వేగంతో డ్యాన్సులు చేసి హీరోగా విజయం సాధించారు. తన బ్రేక్ డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు.  అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. తన నటన, డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. మెరిసే కళ్లతో, హావభావాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల  మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారు.  

ఎంత ఎదిగినా ఒదిగి ఉండి నిర్మాతల్లోనూ, దర్శకుల్లోనూ సుస్థిర స్థానం పొందగలిగారు. దానికితోడు అతని నటన శిఖరాగ్రానికి చేరుకోవడానికి వీలుగా  కథా బలం ఉన్న పాత్రలు లభించాయి. తిరిగి చూసుకునే పనిలేకుండా తెలుగు చిత్రజగత్తులో దూసుకుపోయారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లిచేసుకోవడం కూడా అతనికి అన్ని విధాలా కలిసివచ్చింది. ఆమె సోదరుడు అల్లు అరవింద్ ఆయనకు కొండంత అండగా నిలిచారు. చిరంజీవి సోదరులు  నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా అన్నకు తగ్గ తమ్ముళ్లుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన అండతో ఎదుగుతూ తమ తమ ప్రత్యేకతలు చాటుకున్నారు. అన్న పేరును కూడా నిలుపుతున్నారు. వారికి చిరంజీవి లాంటి అన్న దొరకడం ఎంత అద‌ృష్టమో, చిరంజీవికి నాగబాబు, పవన్ కల్యాణ్ లాంటి తమ్ముళ్లు  దొరకడం కూడా అంతే అదృష్టం. చిరంజీవికి మరో అదృష్టం రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా తండ్రి పేరును నిలిపే విధంగా తన సత్తా చాటుతూ  ఎదుగుతున్నారు. 

నటనలో శిఖరాగ్రానికి చేరుకున్న చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో కొంతమేర ఫలితాలు సాధించినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై, కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా  నిస్వార్థంగా సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటన ద్వారా తెలుగు సినీజగత్తులో ఉన్నత శిఖరాలకు చేరిన చిరంజీవి ఏ రంగంలో ఉన్నా నిజాయితీగా వ్యవహరించడం వల్ల మంచి మనిషిగా గుర్తింపు పొందారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవలో కూడా ముందున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి నేత్ర, రక్తనిధి,



ఆక్సిజన్ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా తన అభిమానులకు ఆదర్శంగా నిలిచారు.   దేశం మొత్తంలో   మూడు వేలకు పైగా చిరంజీవి అభిమాన సంఘాలున్నాయి. అభిమానులు కూడా రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. అభిమానులకు నిజమైన హీరోగా నిలిచి వారినీ ఉత్తమ మార్గంలో నడిపిస్తున్నారు.

ఈ మెగా హీరో అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.  పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు  1955 ఆగస్టు 22న  చిరంజీవి జన్మించారు. తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగి కావడంతో తరచూ పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేవారు. దాంతో చిరంజీవి ప్రాథమిక విద్యాభ్యాసం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో కొనసాగింది.ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, నరసాపురం శ్రీ వై.ఎన్. కళాశాలలో బీకాం పూర్తి చేశారు.   1976లో చెన్నైలోని  మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందారు. 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి- సురేఖల వివాహం జరిగింది. వారికి సుస్మిత, శ్రీజ ఇద్దరు కుమార్తెలు.  ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ.

1978లో పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నట ప్రస్థానం మొదలైంది. అయితే, ప్రాణంఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది.  సినిమా రంగంలో చిరంజీవి అందుకున్న మొదటి పారితోషికం వెయ్యి నూట పదహార్లు. నటజీవితం ప్రారంభంలో హీరోగానే కాకుండా విలన్ గా, ఇతర ప్రాముఖ్యత గల పలు పాత్రలు పోషిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని తనదైన గుర్తింపు పొందారు.  తెలుగు సినీరంగ దిగ్గజాలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఉద్ధండుల హవా కొనసాగే సమయంలో చిరంజీవి తన బ్రేక్ డ్యాన్సులు, ఫైట్లతో కొత్త ట్రెండ్ ను సృష్టించి వారితో పోటీపడ్డారు. ఆ తరువాత హీరోగా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయినా, ఎంత పేరుప్రఖ్యాతులు వచ్చినా క్రమశిక్షణ, శ్రమించే స్వభావాన్ని, హుందా తనాన్ని వదిలిపెట్టలేదు. అవే ఆయనకు శ్రీరామరక్షగా నిలిచాయి. 

మనవూరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన తరువాత  ‘ఖైదీ’ చిత్రం చిరంజీవిని స్టార్‌ హీరోగా నిలబెట్టింది. ‘ఖైదీ’ సాధించిన సక్సెస్‌తో చిరంజీవి సుప్రీమ్‌ హీరో అయ్యారు. ఈ సినిమా కలెక్షన్స్‌ లో ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించింది.  ఖైదీ తెలుగు సినిమా పోకడను మార్చింది. దాంతో  స్పీడ్ పెరిగింది. దాంతో చిరంజీవి ఓ కొత్త  ట్రెండ్‌కు నాంది పలికాడు.  ‘మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్‌, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ’ వంటి పక్కా కమర్షియల్‌ చిత్రాలతో విజయపరంపర కొనసాగింది.   ఆయన రేంజ్‌ ఓ స్థాయిలో పెరిగిపోయింది.  ‘అడవి దొంగ’ ఘన విజయంతో చిరంజీవి పెద్ద స్టార్‌ హీరోగా మారిపోయారు.  ‘విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయ్‌, రాక్షసుడు, దొంగమొగుడు’ చిత్రాలు చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ని ఇంకాఇంకా పెంచేశాయి.  ‘పసివాడి ప్రాణం’ సంచలన విజయం సాధించింది.  ‘స్వయంకృషి’తో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.  స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమైంది.  మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దానిని ప్రదర్శించారు. 

‘మంచిదొంగ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలతో  కొత్త రికార్డులు సృష్టించారు. ‘రుద్రవీణ’ సినిమాని సొంతంగా నిర్మించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్నారు. ‘ఖైదీ నెంబర్‌ 786‘, ‘మరణ మృదంగం’తో మెగాస్టార్‌ అయ్యారు. 100వ చిత్రం ‘త్రినేత్రుడు’ ఆ తరువాత ‘స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ’ వంటి వరుసగా విజయవంతమైన చిత్రాలతో అభిమానుల ఆనందానికి అవధులులేవు.  ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’  అద్వితీయమైన విజయంతో  రికార్డులను తిరగరాసింది.  గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు’ ఇలా ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి.  ‘ఘరానా మొగుడు’ అత్యధిక  వసూళ్లను సాధించింది.  ఆ తరువాత హిందీలో   ప్రతిబంద్‌,  ఆజ్‌కాగూండారాజ్‌ చిత్రాలలో నటించి భారతీయ ప్రేక్షకులను అలరించారు.  ఆ తరువాత ‘హిట్లర్‌’ వంటి  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించారు.  మాస్టర్‌, బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం, అన్నయ్య, ఇద్దరు మిత్రులు, శ్రీమంజునాథ’ వంటి వరుస మెగా హిట్స్‌తో పరిశ్రమని ఒక ఊపు ఊపారు.  ‘ఇంద్ర’తో తన రికార్డులను తానే తిరగరాసి తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచారు. చిరంజీవి నటసార్వభౌమ నందమూరి తారక రామారావుతో తిరుగులేని మనిషిలో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో మెకానిక్ అల్లుడులో,  సూపర్ స్టార్ కృష్ణతో తోడుదొంగలు, కొత్తపేటరౌడీ,  ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో మోసగాడు, కృష్ణంరాజుతో మనఊరి పాండవులు, ప్రేమతరంగాలు, పులిబెబ్బులి వంటి చిత్రాలలో నటించారు. 

 ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’తో నవ్వులు పండించి  భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. ‘స్టాలిన్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాత రాజీయ రంగ ప్రవేశం చేశారు.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత దాదాపు పది సంవత్సరాలు సినీ జీవితానికి విరామం ప్రకటించారు. తరువాత 150వ చిత్రంగా  ఖైదీనంబర్‌ 150లో నటించారు.  మళ్లీ వరుసగా సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నారు. నటనలో అత్యంత ప్రతిభను కనపరిచి మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్  బహుమతులు గెలుచుకున్నారు.  చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 2006 లో కేంద్రం నుంచి పద్మభూషణ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ఘరానా మొగుడు చిత్రాన్ని 1993   భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శించారు.  ఈ సినిమాతో చిరంజీవి దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు.  ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే వంటి పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌తో  పోల్చి  ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అని కొనియాడాయి.  చిరంజీవిని ‘ద వీక్’ పత్రిక  ‘ద న్యూ మనీ మెషీన్’ గా పేర్కొంది.  

1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు  దేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం 1.25 కోట్ల రూపాయలు అందుకున్నారు.   1999-2000 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా  సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు.   చిరంజీవిని భారతీయ సినిమాను ప్రభావితం చేసిన ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకడిగా 2013లో  ఐబీఎన్ లైవ్  పేర్కొంది.తగ్గేదేలే అన్నరీతిలో  చిరంజీవి ప్రస్తుతం కూడా దూసుకుపోతూనే ఉన్నారు. కథ ఎంపికలో చిరంజీవి  తీసుకునే  సమయం, జాగ్రత్తలు అందరికీ తెలిసినవే. నటనే ఆయనకు సర్వస్వం. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా రాజకీయాలను పూర్తిగా వదిలివేశారు. వాటికి స్వస్తిచెప్పారు.  నటనకే అంకితమయ్యారు. ఇప్పుడు కూడా ఎవగ్రీన్ హీరోలా ఈ తరం వారితో  పోటీపడుతూ  కొత్త లుక్ తో సంచలనాలు సృష్టించబోతున్నారు.  ఎప్పటికప్పుడు అప్ డేట్ అవడం చిరంజీవి ప్రత్యేకత.  అందుకు గాడ్‌ఫాదర్‌లోని ఈ కొత్త స్టిల్సే నిదర్శనం.  ఇదే కాకుండా భోళా శంకర్, పేరు ప్రకటించని మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. మంచి ఫిట్‌నెస్‌తో, తాజా లుక్‌తో యంగ్ హీరోలా అభిమానులను అలరించనున్నారు. మళ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తారని ఆశిద్ధాం.  కొండంత అండగా ఆయనకు అభిమానులు ఉండగా, చిరంజీవికి రికార్డులకు కొదవేముంటుంది.


 - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...