Aug 24, 2022

స్టాక్‌మార్కెట్ దిగ్గజం బిగ్‌బుల్ ఝున్‌ఝున్ వాలా


రూ.5వేల నుంచి రూ.43వేల కోట్లకు ఎగబాకిన  ఝున్ ఝున్ వాలా ఎవరు?

బిగ్ బుల్ ఆఫ్ ఇండియా రాకేష్ ఝున్ ఝున్ వాలా 5 వేల రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టి  43వేల కోట్ల రూపాయలకు పైగా గడించారు. బిగ్  కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్  రాకేష్ ఝున్ ఝున్ వాలా  భారతీయుల్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు.  భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో బిలియనీయర్.  స్టాక్ మార్కెట్ లో ప్రముఖ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝున్ ఝున్ వాలా  రాధేశ్యామ్, ఊర్మిళ దంపతులకు  జూలై 5, 1960 సంవత్సరంలో హైదరాబాదులో  జన్మించారు.  రాజస్థాన్ లోని ఝున్ ఝున్ గ్రామానికి చెందిన ఆయన తండ్రి  రాధేశ్యామ్ ఝుున్ ఝున్ వాలా ముంబైలో  ఆదాయపు పన్ను కమిషనర్‌గా  పనిచేశారు.  దాంతో వారి కుటుంబం ముంబైలో  స్థిరపడింది. తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో ఉన్నందున ఝున్ ఝున్ వాలా అక్కడే పెరిగారు. చిన్నతనంలో ఆయన తండ్రి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు. స్టాక్ మార్కెట్ గురించి  ఆయన తండ్రి తన స్నేహితులతో చర్చించేవారు. దాంతో రాకేష్ ఝున్ ఝున్ వాలాకు స్టాక్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది. ఒక రోజు ఆయన తన తండ్రిని స్టాక్ మార్కెట్ లో షేర్ల ధరల హెచ్చుతగ్గుల గురించి అడిగారు. వార్తలను, షేర్లను పరిశీలిస్తే అర్థమవుతుందని తండ్రి చెప్పారు. 12, 13 ఏళ్ల వయసు నుంచే షేర్ మార్కెట్, షేర్ల ధరలలో మార్పులు, వార్తల గురించి అధ్యయనంచేయడం మొదలుపెట్టారు. 


సిడెన్ హమ్  కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బికాం డిగ్రీ పూర్తి చేశారు.  ఆ తరువాత ట్రేడింగ్ నే కెరీర్ గా ఎంచుకుంటానని తండ్రితో చెప్పారు. దానికి ఆయన  ‘‘నీ ఇష్టాన్ని కాదనను, కాకపోతే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడుకున్నది. నువ్వక్కడ నిలదొక్కుకోలేకపోతే భవిష్యత్ ఏంటనేది ఆలోచించాలి’’ అని  చెప్పారు. ముందు సీఏ పూర్తి చేయమని తండ్రి  చెప్పారు. షేర్ల వ్యాపారమంటే పెళ్లి చేసుకోవడానికి పిల్లని కూడా ఎవరూ ఇవ్వరు అని తల్లి  చెప్పారు. తల్లిదండ్రుల సూచన మేరకు  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. సిఏ పూర్తి చేసిన తరువాత 1985లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే, షేర్లు కొనడానికి ఆయన వద్ద డబ్బులేదు.   కొంత డబ్బు ఇవ్వమని తన తండ్రిని అడిగారు.  ‘‘నీకు నచ్చినన్ని సంవత్సరాలు పైసా ఇవ్వకుండా ఇంట్లోనే  ఉండు.  డబ్బు మాత్రం ఇవ్వను’’ అని తండ్రి  చెప్పారు.   ఆ రోజు నుంచి తల్లితండ్రి  జీవించి ఉన్నంత వరకు వారితో కలిసే ఉన్నారు. 

తండ్రి కాదనడంతో  సీఏగా ప్రాక్టీస్  చేస్తున్న అన్నయ్య రాజేష్ వద్ద 5వేల రూపాయలు అప్పుగా తీసుకుని ట్రేడింగ్ మొదలు పెట్టారు. అప్పటి స్టాక్  మార్కెట్ సూచీ 150 పాయింట్లు. మొట్టమొదటిసారి ఆయన టాటాపవర్, టాటా టీ షేర్లు కొన్నారు. టాటా టీ షేర్లలో మూడు నెలల్లోపే మూడు రెట్లు లాభం వచ్చింది.  వచ్చిన లాభంతో  సెసా గోవాలో నాలుగు లక్షల షేర్లు కొన్నారు. సంవత్సరం తరువాత నాలుగో వంతు వాటా ఉంచుకొని, మిగతావి అమ్మేశారు.  వచ్చిన డబ్బుని వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. వాటిలో టైటాన్ షేర్ల ద్వారా అధిక లాభాలు వచ్చాయి. 1987 ఫిబ్రవరి 22న  ఝున్ ఝున్ వాలా రేఖను వివాహం చేసుకున్నారు. వారికి ఒక అమ్మాయి నిష్ఠ, ఇద్దరు మగ పిల్లలు కవలలు  ఆర్యమాన్, ఆర్యవీర్.ఒకవైపు ట్రేడింగ్ చేస్తూనే, భార్యాభర్తల పేర్లు కలిసివచ్చేవిధంగా  రేర్ ఎంటర్ ప్రైజస్ అనే పేరుతో బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించారు.  తరువాత సినిమా రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. నిర్మాతగా ఇంగ్లీష్ - వింగ్లీష్, షమితాబ్, కీ అండ్ కా చిత్రాలను నిర్మించారు.  అనతి కాలంలోనే   వ్యాపార దిగ్గజంగా పెరిగి, వేల కోట్ల  రూపాయల ఆస్తులకు అధిపతి అయ్యారు. అయితే, అన్ని సందర్భాలలో ఆయనకు లాభాలు రాలేదు. కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చాయి. అయితే, ఎక్కువ శాతం ఆయన ట్రేడింగ్  లాభాల బాటలో నడిచింది.  ఆయన కొనే షేర్ల విలువ ఖచ్చితంగా పెరుగుతుందని పెట్టుబడిదారుల నమ్మకం. అనుకోకుండా ఒక రోజు మాటల సందర్భంలో   తండ్రి  ‘‘నీ సంపాదనలో  నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నా ఆదాయం నాకు సరిపోతుంది. నువ్వు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి’’ అని 

ఝున్ ఝున్ వాలాతో అన్నారు.   అప్పటి నుంచీ   ఆయన స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం చేస్తూ వచ్చారు. 2008లో తండ్రి మరణించిన తరువాత ఆయన మాటను గౌరవించి  అగస్త్య ఇంటర్నేషనల్ షౌండేషన్ కు ఆర్థిక సహాయం అందించేవారు. విద్య, వైద్య రంగాలకు సైతం ఎంతో సహాయం చేశారు. శంకర్ ఐ కేర్ వైద్య సంస్థతో కలిసి ముంబైలో ‘ఆర్.ఝున్ ఝున్ వాలా శంకర్ ఐ హాస్పటల్’ ను నిర్మించారు. భారతీయుల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఝున్ ఝున్  వాలా ఆప్‌టెక్, హంగామా డిజిటల్ మీడియా సంస్థలకు   చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా,  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌,  ప్రైమ్ ఫోకస్, బిల్‌కేర్ లిమిటెడ్,   మిడ్ డే మల్టీమీడియా, నాగార్జున కన్ స్ట్రక్షన్స్ వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ‘ఆకాశ ఎయిర్’ సంస్థ ద్వారా  విమానయాన రంగంలో కూడా అడుగు పెట్టారు.   2022 ఆగస్టు 7న ‘ఆకాశ ఎయిర్’ తొలి విమానంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించారు. ఆ తరువాత వారం రోజులకే ఆయన మరణించారు. 

 2022 జూలై నాటికి ఆయన ఆస్తుల విలువ 43 వేల 653 కోట్ల రూపాయలకు పెరిగింది.  ఎన్ని వేల కోట్లు ఆస్తులు గడించినప్పటికీ ఆయన నిరాడంబరంగానే  జీవించారు. పిల్లలకు కూడా ఆయన మధ్యతరగతి జీవితాన్నే అలవాటు చేశారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం   భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో   ఆయన  36వ  వ్యక్తిగా నిలిచారు.  అమెరికన్ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ తో   ఆయనను పోల్చుతారు. రేసులు,  సిగరెట్లు, మద్యం వంటి అలవాట్లు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.  2022 ఆగస్టు 14న  రాకేష్ ఝున్ ఝున్ వాలా   గుండె పోటుతో కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేస్తూ  ఆర్థిక వ్యవస్థకు, దేశ పురోగతికి ఝున్ ఝున్ వాలా కృషి చేశారని  కొనియాడారు.  ఆయన మరణం స్టాక్ మార్కెట్ రంగానికి తీరనిలోటు. స్టాక్ మార్కెట్ చరిత్రలో  బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అధ్యాయం ముగిసింది. 

                                                                          - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 94402









No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...