Jun 29, 2017

సినీ పరిశ్రమలకు సౌకర్యాల కల్పన


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

         సచివాలయం, జూన్ 29: సినీ పరిశ్రమ రాష్ట్రానికి తరలి రావాలని, అందుకోసం ఆ పరిశ్రమకు కావలసిన అన్ని సౌకర్యాలు క్పలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ లోని తన చాంబర్ లో గురువారం సాయంత్రం జరిగిన  ప్రణాళిక, సేవారంగం టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశంలో రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావడంపై చర్చించారు. దక్షిణభారత చిత్ర పరిశ్రమలో తమిళ, తెలుగు చిత్రాలు అతి ఎక్కవగా నిర్మిస్తున్నట్లు, 2015లో ఈ రెండు భాషలలో 365 సినిమాలు విడుదలయినట్లు అధికారులు వివరించారు.  సినిమా నిర్మాణంలో లైసెన్సులు, షూటింగ్  విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను బట్టి, స్థానిక సంస్థల నుంచి నిర్మాత 70కి పైగా అనుమతులు పొందవలసి ఉంటుందని, ఈ విషయంలో ఏక గవాక్ష విధానం లేకపోవడం, టాక్స్ విధానాల  వల్ల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జీఎస్టీ కూడా వారికి అనుకూలంగా లేనట్లు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి సినిమా ఎడిటింగ్, ల్యాబ్, యానిమేషన్, ఫిల్మ్ టూరిజం .... వంటి సౌకర్యాలు కల్పించవలసి ఉంటుందని తెలిపారు. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకు కల్పించే సౌకర్యాలు, వసూలు చేసే టాక్స్ ల గురించి చర్చించారు.
సినీపరిశ్రమ తరలివచ్చి, ఇక్కడ స్థిరపడటానికి తీసుకోవలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సీఎస్ చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యంగా సముద్రతీరం, కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో  పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలన్నారు. కుటుంబ రెస్టారెంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని చెప్పారు.  రాష్ట్ర స్థాయిలో అన్ని అనుమతులను ఏక గవాక్ష విధానంలో ఇవ్వనున్నట్లు  అధికారులు తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు, మౌలిక వసతులు, నగరాలు, పర్యాటక ప్రదేశాల్లో క్యాబ్ సౌకర్యం, అద్దెకు బైకులు లభించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనూ, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విమాన ప్రయాణికులు పెరుగుతున్నందున విమానయాన సౌకర్యం మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
              రాష్ట్రంలో 60 శాతం మంది శ్రామికులు వ్యవసాయ రంగంలో పని చేస్తున్నా, జీఎస్ డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో ఈ రంగం వాటా 32 శాతం మాత్రమేనని  వివరించారు. అందువల్ల వ్యవసాయ రంగంలో అదనంగా ఉన్న శ్రామికులు పరిశ్రమలు, సర్వీస్ రంగాల్లోకి రావలసిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో మూడు అర్బన్, ఆరు సెమీ అర్బన్ రిటైల్ పార్కుల ఏర్పాటు, స్వయం సహాయక గ్రూపుల ఉత్పత్తులు, ఆన్ లైన్ ట్రేడింగ్, కిరాణా షాపుల వ్యాపారం మెరుగుపరుచుకునేందుకు రుణ ప్రణాళిక తదితర అంశాలను చర్చించారు. టూరిజం, హెల్త్, మీడియా, ఎంటర్ టెయిన్ మెంట్, విద్య, లాజిస్టిక్, అకౌంట్ అండ్ ఆడిటింగ్, మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ, లీగల్, ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీరింగ్ రంగాలు అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి అవకాశాలున్న రంగాలుగా గుర్తించారు. మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ అనుమతుల అంశం కూడా చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు,  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ  రవిచంద్ర, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్తరవాణా శాఖ కమిషనర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామల రావు తదితరులు పాల్గొన్నారు.

Jun 23, 2017

అమరావతి ప్రకటన సిద్ధం

శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు
Ø ముసాయిదాలోని పది అంశాలపై సుదీర్గ చర్చ
Ø 8 మంది ప్రముఖ మహిళలు 3 గంటలపాటు అంశాలవారీగా పరిశీలన
Ø అంతర్జాతీయ స్థాయిలో ఇది ఓ ప్రాతిపదిక
Ø త్వరలో సీఎం ఆవిష్కరణ
సచివాలయం, జూన్ 23 : మహిళా సాధికారితకు సంబంధించిన అమరావతి ప్రకటన (డిక్లరేషన్) సిద్ధమైందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని సమావేశ హాలులో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడకు సమీపంలోని పవిత్రసంగమం వద్ద ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరిగిన జాతీయ మహిళాపార్లమెంట్ లో పాల్గొన్న రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయి మహిళలు, యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు, చర్చలు, సిఫారసులు, తీర్మానాలకు సంక్షిప్త రూపమే ఈ ప్రకటన అని వివరించారు. మహిళా పార్లమెంట్ లో అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళలతోపాటు దాదాపు 25 వేల మంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన, సిఫారసు చేసిన అంశాలకు సంక్షిప్త రూపం ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు దీనిని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులతో పది అంశాలతో కూడిన ఒక ముసాయిదాని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో స్త్రీ విద్య, మహిళల న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం, సమతుల ఆహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళల సమాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర, మహిళల సామాజికాభివృద్ధి, మహిళల డిజిటల్ విద్య అనే అంశాలు ఉన్నట్లు వివరించారు. ముసాయిదాను  రూపొందించడంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా ఎంతో కృషి చేసినట్లు ప్రశంసించారు. ఈ రోజు 8 మంది ప్రముఖ మహిళలు ఈ ముసాయిదాను అంశాలవారీగా మూడు గంటల పాటు పరిశీలించి, చర్చించి, మార్పులు చేర్పులు చేసి తుది రూపం ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వివాదాలకు తావులేకుండా విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను తయారు చేసిటన్లు చెప్పారు. తుది ప్రకటన ముద్రణ పూర్తి అయిన తరువాత దీనిని రూపొందించడంలో కృషి చేసిన మహిళల సమక్షంలో త్వరలో ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని స్పీకర్ చెప్పారు.
అంతకు ముందు సుమిత దావ్రా మాట్లాడుతూ మహిళా పార్లమెంటులో దాదాపు 12 వేల మంది విద్యార్థినులు పాల్గొన్నట్లు చెప్పారు. 14 మంది ప్రముఖ మహిళల ప్రసంగాలతోపాటు విద్యార్థినులు ప్రసంగాల్లో ముఖ్యమైన వాటితో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు సూచనలు, సలహాలు అమరావతి ప్రకటనలో ఉంటాయని చెప్పారు. ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ ఈ ప్రకటన రూపకల్పనలో తనను కూడా భాగస్వామిని చేయడం గొప్ప భాగ్యంగా భావించారు. మహిళలు, విద్యార్థుల స్వీయ అనుభవాల సారాంశం, సిఫారసులతో ఈ ప్రకటన రూపొందించడం గొప్ప చర్యగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త కూడా పాల్గొన్నారు.
అంశాలవారీగా విస్తృత స్థాయిలో చర్చలు
మహిళా సాధికారిత కోసం రూపొందించిన అమరావతి ప్రకటనకు  తుది రూపం ఇచ్చారు.  స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం స్పీకర్ చాంబర్ లో సమావేశమైన  పది మంది సభ్యులు ప్రకటన ముసాయిదాలోని పది అంశాలపై  విస్తృత స్థాయిలో చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి అంశంలోని విషయాలను ఆమూలాగ్రం చర్చించారు. మహిళలు, విద్యార్థినులు, బాలికలు, పిల్లలకు సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ స్థాయి పేద మహిళలు మొదలుకొని  పట్టణ స్థాయి పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు, ఒంటరి మహిళలు, గర్భినీ స్త్రీలు, పసిపిల్లల స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు, వ్యభిచార కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల సమస్యలు, మహిళలకు వృత్తి విద్య, గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం, పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ, మీడియా నుంచి రక్షణ, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు తదితర అనేక అంశాలను చర్చించి తగిన సూచనలు, సలహాలతో ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి తుది రూపం ఇచ్చారు. ఈ సమావేశంలో జస్టిస్ జీ.రోహిణి, అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏడీసీ) చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త, పద్మావతి మహిళా విశ్వవిద్యలయం ప్రొఫెసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

27న ఎంఎస్ఎంఈ దినోత్సవం


అదే రోజు సీఎం చే ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ప్రారంభం
సచివాలయం, జూన్ 23: యునైటెడ్ నేషన్స్  ప్రకటించిన ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నెల 27న ఎంఎస్ఎంఈ(సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల) దినోత్సం నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లబ్బీపేటలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బహుళజాతి కంపెనీలు,   వివిధ రంగాలకు చెందిన బ్యాంకుల,  జాతీయ స్థాయిలో ముఖ్య సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం  అదే రోజు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఆ రోజు ఈ రంగానికి సంబంధించి పలు నిర్ణయాలను ప్రకటిస్తారు. బహుమతులు కూడా అందజేస్తారు.  దేశంలో ఇటువంటి కార్పోరేషన్ ను ప్రారంభించిన మొదటి  రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది.
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ వేడుకలో పాల్గొనదలచినవారు ఆన్ లైన్ లో www.apindustries.gov.in వెబ్ సైట్ లో ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Jun 22, 2017

గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులందరికీ 1న జీతాలు


ట్రెజరీ శాఖ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం
 ·       జిల్లాల్లో ఒక్కో శాఖకు ఒక డీడీఓ మాత్రమే
·       ఇక నుంచి అన్ని డిజిటల్ ఓచర్లే
·       ట్రెజరీ శాఖలో జూలై 1 నుంచి ఇ-ఫైలింగ్
·       అన్ని శాఖల్లో రెవెన్యూ వ్యయం తగ్గించాలని ఆదేశం
·       ఉద్యోగుల ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి
·       ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చే తేదీపై చర్చ

సచివాలయం, జూన్ 22: రాష్ట్రంలోని అందరు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే  జీతాలు చెల్లించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్ లో ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్(డీడబ్ల్యూఏ) విభాగాల పనితీరుని సమీక్షించారు. ఈ సందర్భంగా  గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులకు సంబంధించి 30 ఏళ్లుగా ఉన్న డిమాండ్ జీతాల అంశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ  రవిచంద్ర వివరించారు. దాంతో వారికి 1వ తేదీనే జీతాలు చెల్లించడానికి మంత్రి అంగీకరించారు. దీనిని త్వరలో అమలు చేస్తామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు స్వయం సంమృద్ధి సాధించాలన్నారు. విద్యార్థుల పరీక్ష ఫీజులు, వాహనాల టాక్స్ చెల్లింపులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపులు వంటివి చలానాల రూపంలో కాకుండా ఇక నుంచి ఆన్ లైన్ లో చెల్లించడానికి ప్రజలకు అవకాశం కల్పించాలని మంత్రి ఆదేశించారు. అన్ని రకాల చెల్లింపులకు సంబంధించి డిజిటల్ ఓచర్లను అంగీకరించే విధానం ప్రవేశపెట్టాలని చెప్పారు. ఈ విధానం వల్ల బస్తాల, బస్తాల ఓచర్లను తరలించే భారం తప్పుతుందని, కనిపించని ఓచర్ల కోసం వెతుకులాట ఉండదన్నారు. 13 జిల్లాల్లో ప్రభుత్వంలోని ఒక్కొక్క శాఖకు ఒక్క డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్) మాత్రమే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో ఈ విధానం కొనసాగుతోందని, అదేవిధంగా అన్ని శాఖలలో అమలు చేయాలని మంత్రి చెప్పారు. ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఈ మూడు విభాగాల్లో జూలై 1 నుంచి ఇ-ఫైలింగ్ విధానం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్ లైన్ లో జరపడం, పేపర్ లెస్ పాలన,  ఇ-చెల్లింపులు వంటి వాటి ద్వారా ప్రభుత్వం వ్యయం తగ్గుతుందన్నారు. అన్ని శాఖల వారు రెవెన్యూ వ్యయం తగ్గించాలని మంత్రి చెప్పారు. ఆదాయ వనరులు సమకూర్చే శాఖలు రాబడికి సంబంధించి చేసే ఖర్చును తగ్గించుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చిన అప్పులను తక్కువ వడ్డీకి మార్చి ఆర్థిక భారం తగ్గించాలని చెప్పారు. ప్రభుత్వానికి రావలసిన డబ్బు ఎవరు ఎక్కడ చెల్లించినా వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

   ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి పెన్షన్ దారు తమ ఆధార్ నెంబర్లను ట్రెజరీలోని హెచ్ఆర్ఎంఎస్ లో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  జీతాలు, కాంట్ట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వాటితోపాటు అన్ని రకాల ప్రభుత్వ చెల్లిపులు ఆన్ లోనే చెల్లిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం(సీఎఫ్ఎంఎస్) అక్టోబర్ 2 నుంచి ఆచరణలోకి తీసుకురానున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జమాఖర్చులు అన్నీ ఆన్ లైన్ లో రియల్ టైమ్ లో జరుగుతాయని వివరించారు.  తద్వారా వ్యవస్థలోని విధానాల్లో సరళీకరణ ఏర్పడి పర్యవేక్షణ పారదర్శికంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఇచ్చే  ఇంక్రిమెంట్ ప్రస్తుతం చేరిన తేదీతో సంబంధం లేకుండా  1వ తేదీన ఇస్తున్నారు. దాదాపు 4.45 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున ప్రతి నెలా ఈ ప్రక్రియ కొనసాగించడంతో పని భారం ఎక్కువైపోతోంది. దీనిని తగ్గించడానికి మూడు నెలలకు ఒకసారి ఒక తేదీన ఇవ్వాలన్న ప్రతిపాదనను పరిశీలించారు. అంటే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యలో ఏడాది పూర్తి అయ్యే వారందరికీ జనవరి 1వ తేదీనే ఇంక్రిమెంట్ కలుపుతారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలోని వారందరికీ ఏప్రిల్ 1న కలుపుతారు. ఈ ప్రతిపాదనపై చర్చించారు.

Jun 21, 2017

ఆడిట్ అభ్యంతరాలు 3 నెలల్లో పరిష్కరించాలి

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు  ఆగ్రహం

పేరుకుపోయిన 35.19 లక్షల అభ్యంతరాలు
మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో ఏళ్లకు ఏళ్లు జరగని  ఆడిట్
వేల కోట్లకు లెక్కలు తేల్చని సంస్థలు
రికార్డులు సమర్పించని అధికారులు
వచ్చే బడ్జెట్ నాటికి అన్ని సంస్థల ఆడిటింగ్ పూర్తి చేయాలని ఆదేశం
కాంట్రాక్ట్ సిబ్బందిని తీసుకోవడానికి అనుమతి

సచివాలయం, జూన్ 21: మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఏపీ హౌసింగ్ బోర్డు వంటి సంస్థలలో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను మూడు నెలల్లో పరిష్కరించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అదేశించారు. సచివాలయం రెండవ బ్లాక్ లో బుధవారం ఉదయం ఆడిట్ విభాగంలో పనితీరును సమీక్షించారు.  మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు, పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, విశ్వవిద్యాలయాలు, టీటీడీ, జిల్లా గ్రంథాలయ సంస్థలు, రైతు బజార్లు వంటి 17 సంస్థలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 31 వరకు రూ.16,276.08 కోట్లకు సంబంధించి 35,19,004 ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
రూ.5,445.64 కోట్ల విలువైన పనులకు రికార్డులు సమర్పించలేదని 7,89,741 ఆడిట్ అభ్యంతరాలు, రూ.2,014.81 కోట్ల బకాయిలు వసూలు చేయలేదని 2,57,938 అభ్యంతరాలు, నిబంధనలు అతిక్రమించి రూ.1386.16 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు 7,04,498 ఆడిట్ అభ్యంతరాలు, రూ.86.25 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు 11059 అభ్యంతరాలు,  రూ.120.70 కోట్ల నిధులు తప్పుగా వినియోగించినట్లు 5386 అభ్యంతరాలు, రూ.115.69 కోట్లు ఎక్కువగా చెల్లించినట్లు 44,987 అభ్యంతరాలు, రూ.49.01 కోట్లు వృధాగా ఖర్చు చేసినట్లు 6992 అభ్యంతరాలు, రూ.385.63 కోట్ల నిధులు ఎక్కువగా ఖర్చుపెట్టినట్లు 61,242 అభ్యంతరాలు ఉన్నట్లు వివరించారు.
విశ్వవిద్యాలయాల్లో లెక్కల్లో తేడాలు, నిధులు దారిమళ్లింపు, నిబంధనల అతిక్రమణ, స్కాలర్ షిప్ ల పంపిణీ, నిధుల దుర్వినియోగం వంటి 24 అంశాలకు సంబంధించి రూ.1908.91 కోట్ల నిధులు వినియోగంపై 29,674 ఆడిట్ అభ్యంతరాలు, టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానాలు)లో 19 అంశాలకు సంబంధించి రూ.15.75కోట్ల వినియోగంపై 986 అభ్యంతరాలు, ఏపీ హౌసింగ్ బోర్డులో 19 అంశాలకు సంబంధించి  రూ.1358.83 కోట్ల వినియోగంపై 4054 అభ్యంతరాలు ఉన్నట్లు చెప్పారు.     
మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీలలో చాలా ఏళ్లకు సంబంధించి ఆడిట్ పూర్తి కాలేదని, ఒక కార్పోరేషన్ లో 12 ఏళ్ల నుంచి ఆడిట్ పెండింగ్ లో ఉంటే మరి కొన్ని కార్పోరేషన్లలో రెండేళ్లు, మూడేళ్లు ఆడిటింగ్ పెండింగ్ ఉన్నట్లు వివరించారు. ఆ విధంగా 13 కార్పోరేషన్లలో 32 ఏళ్లకు సంబంధించిన ఆడిటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఆయా సంవత్సరాలకు సంబంధించి లెక్కలను తేల్చలేదని చెప్పారు. మునిసిపాలిటీలకు వచ్చేసరికి కొన్నిటిలో 2, 3, 5 ఏళ్లకు ఆడిటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో 55 ఏళ్లకు సంబంధించి ఆడిటింగ్ ఉన్నట్లు చెప్పారు. అలాగే ఆయా సంవత్సరాలకు సంబంధించి జమాఖర్చులు కూడా పూర్తిగా రాయలేదని తెలిపారు. అయితే కార్పోరేషన్లలో, మునిసిపాలిటీల్లో ప్రస్తుత సంవత్సరం ఆడిటింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్థిక మంత్రి ఆగ్రహం
వేల కోట్ల రూపాయలకు సంబంధించి తగిన రికార్డులు సమర్పించకపోవడం, నిధులు దుర్వినియోగం, నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చుచేయడం, నిధులు దుర్వినియోగం, అధిక చెల్లింపులు, మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీల్లో ఏళ్లకు ఏళ్లు ఆడిట్ పూర్తి కాకపోవడం, పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి ఆడిట్ అభ్యంతరాలు ఏమీ ఉండకూడదని, ఈ లోపలే పరిష్కరించాలని చెప్పారు. దీనిని ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు.  ఆడిట్ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించడానికి అవసరమైన చోట స్టేట్ ఆడిట్ శాఖ నుంచి పదవీవిరమణ చేసిన వారిని ఒక ఆరు నెలలపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోమని చెప్పారు. ఈ పనికి ఆయా జిల్లాలకు చెందినవారిని తీసుకుంటే, వారికి అక్కడ పరిస్థితులు తెలుస్తాయని మంత్రి సలహా ఇచ్చారు.  పని లక్ష్యం నిర్ణయించి వారిచేత పని చేయిచాలన్నారు. ఈ పనిలో వారికి సహకరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు దుర్వినియోగం, తప్పుగా వినియోగించిన, అధికంగా చెల్లింపులు చేసిన, నిధులు వృధా చేసిన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థలు, ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు పేరుకుపోయిన ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన లెక్కలను సమర్పించి, మూడు నెలల లోపల ఆడిట్ ను పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అన్ని సంస్థలు నిధులు వినియోగం, జమాఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయా సంస్థలు గడచిన సంవత్సరాలకు సంబంధించిన జమాఖర్చుల వివరాలు, ఆడిట్ అభ్యంతరాలకు తగిన వివరణలు పంపిన ఒకటి, రెండు నెలల లోపు ఆడిట్ ని పూర్తి చేయాలన్నారు.  స్థానిక సంస్థలకు సంబంధించి బాధ్యత గల అధికారులు పెండింగ్ లోఉన్న వినియోగ సర్టిఫికెట్లను వెంటనే రాష్ట్ర ఆడిట్ శాఖకు అందజేయాలన్నారు. అలాగే పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయడానికి వారు  అధిక ప్రాధాన్య ఇవ్వాలని చెప్పారు. బకాయిల వసూలుకు ఏమీ చర్యలు తీసుకుంటారో ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు. ఆయా సంస్థల సీఈఓలు, ముఖ్య బాధ్యులు  నిధుల వినియోగానికి సంబంధించి తగిన రికార్డులు అందజేయడంలో బాధ్యత తీసుకోవాలన్నారు. ఆడిట్ కోసం ఆ రికార్డులు సమర్పించాలని చెప్పారు. నిధుల వినియోగం లెక్కల సమర్పణ, ఆడిటింగ్ ఏ మేరకు జరిగిందో పరిశీలించి ఇక ముందు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. పెండింగ్ లో ఉన్న లెక్కలు తేల్చడానికి, ఆడిట్ అభ్యంతరాలు పరిష్కరించడానికి ఒక విభాగం, ప్రస్తుత జమాఖర్చుల వివరాల నమోదు, ఆడిటింగ్ కు మరో విభాగాన్ని ఏర్పాటు చేసుకొని త్వరగా ఆడిటింగ్ పూర్తి చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆడిటి అభ్యంతరాలను మూడు నెలల్లో పరిష్కరించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.  ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, ఆడిట్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Jun 20, 2017

ఆర్థిక శాఖపై పెరిగిన వత్తిడి

ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు
సచివాలయం, జూన్ 20: గత సంవత్సరం చెల్లించవలసిన బిల్లులు, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చెల్లించవలసిన బిల్లులు భారీ మొత్తంలో ఉండటం వల్ల ఆర్థిక శాఖపై వత్తిడి పెరిగిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్ లో మంగళవారం సాయంత్రం ఆర్థిక శాఖ అధికారులతో మొదటి త్రైమాసికం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక శాఖకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. గత సంవత్సరం 4వ క్వార్టర్ లో చెల్లించవలసిన బిల్లులు రూ.10 వేల కోట్ల వరకు ఈ త్రైమాసికంలో చెల్లించవలసి వచ్చిందని చెప్పారు. ఈ త్రైమాసికం బిల్లులు కూడా కలుపుకుంటే భారీ మొత్తంలో రూ. 49వేల కోట్లు చెల్లించవలసి వచ్చిందన్నారు. దానికి తోడు ఇరిగేషన్, మునిసిపల్ పరిపాలన, రోడ్లు భవనాలు, హోం వంటి కొన్ని శాఖలు అదనపు నిధులు అడుతున్నట్లు తెలిపారు. పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులకు మూలధన వ్యయం బాగా పెరిగిందని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు బడ్జెట్ లో లేకపోయినా ఇస్తున్నామన్నారు.
 రెవెన్యూ రాబడి అంత ఇబ్బందికరంగా లేకపోయినప్పటికీ ఇంకా రూ.10వేల కోట్ల బిల్లులు చెల్లించవలసి ఉందన్నారు. పాత బకాయిలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని కూడా త్వరగా చెల్లిస్తామని చెప్పారు. ఆ బకాయిలను మొదటి త్రైమాసికంలోనే చెల్లించమని ఆదేశించినట్లు తెలిపారు.  ఆదాయానికి, రాబడికి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు, రాష్ట్ర ఆదాయం ఉన్నప్పటికీ బడ్జెట్ లోని లోటు అలాగే కొనసాగుతోందని చెప్పారు. అయితే వృద్ధి రేటు బాగుందన్నారు. వృద్ధి రేటులో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, మన రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను నియంత్రణలో పెట్టుకోవలసిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ పెరగాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అనుకున్న స్థాయిలో లేదని, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల ఆదాయం  పరవాలేదన్నారు.
కేంద్రం నుంచి అదనపు గ్రాంట్లు రావలసి ఉందన్నారు. రూ.9 వేల కోట్ల వరకు వచ్చాయని, ఇంకా రూ.10వేల కోట్లు రావలసి ఉందని, అవి ఈ నెలాఖరుకు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూలధన వ్యయం విడుదల చేయమని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలోని ఆర్థిక లోటుకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా రూ.3వేల కోట్లు రావలసి ఉందన్నారు. అయితే కేంద్రం 138 కోట్లే వస్తాయని చెబుతోందన్నారు. విభజన సమయంలో చెప్పిన ప్రకారం ఆ మొత్తాన్ని కేంద్రం తప్పనిసరిగా ఇవ్వవలసి ఉందని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాస్తారని చెప్పారు.
మంత్రులు, కార్యదర్శులు అర్ధం చేసుకోవాలి
మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలన్నారు. ముందు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసి, ఆ తరువాత అదనపు బడ్జెట్ అడగాలని కోరారు. అదనపు నిధులు అడగకుండా ప్రాధాన్యతా క్రమంలో పథకాలను అమలు చేసుకోవాలన్నారు. అదనపు బడ్జెట్ ని ఆమోదించలేని స్థితిలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలిపారు. ఏ శాఖ అయినా బిల్లు పెడితేనే డబ్బు చెల్లిస్తామని, ఇక నుంచి ముందుగా చెల్లించేదిలేదని చెప్పారు.  ఇప్పటికే రూ.4వేల కోట్లు అప్పు చేశామని, మరో రూ.12వేల కోట్లు అప్పు చేసే అవకాశం ఉందని చెప్పారు. అర్ధ సంవత్సరం అయిన తరువాత పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు రెండు డీఏలు, గ్రాడ్యూటీ చెల్లిస్తామని చెప్పామని, డబ్బు వెసులుబాటు చూసుకొని తప్పక చెల్లిస్తామని అన్నారు.
30న జీఎస్టీ సమావేశం
ఈ నెల 30న జీఎస్టీ సమావేశం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచే జీఎస్టీ అమలులోకి వస్తుందన్నారు. ప్రధాని ప్రారంభించే ఆ కార్యక్రమం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరుగుతుందని చెప్పారు. జీఎస్టీటికి సంబంధించి తాము చేసిన సూచనలు చాలా వరకు కేంద్రం అంగీకరించిందని, అయితే గ్రానైట్, మార్బుల్ విషయంలో ఒప్పుకోలేదన్నారు. పెట్రోల్, లిక్కర్ లను రాష్ట్రాలకు వదిలివేశారని చెప్పారు. వ్యాపారస్తులకు వేధింపులు లేకుండా, సామాన్య మానవుడిపై అధిక భారం పడకుండా జీఎస్టీ విధానం ఉంటుందని వివరించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టం వస్తే దానిని 5 ఏళ్లపాటు కేంద్రం భరిస్తుందని చెప్పారు.
మరో పదివేల పోస్టులు భర్తీ చేస్తాం
ప్రభుత్వ పోస్టులు 20వేలు భర్తీ చేస్తామని చెప్పామని, ప్రస్తుతం 10వేల పోస్టులు భర్తీ చేస్తున్నారని, మిగిలిన పదివేలు కూడా ఆ తరువాత భర్తీ చేస్తామన్నారు. కాంట్రాక్ట్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు.

x

Jun 19, 2017

సచివాలయంలో ఇక పూర్తి స్థాయిలో ఇ-ఫైలింగ్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశం
 సచివాలయం, జూన్ 19: సచివాలయంలోని ఫైల్స్ అన్నీ ఇ-ఆఫీస్ పద్దతిలో నిర్వహించాలని, పరిపాలనలో భౌతికమైన  ఫైల్స్ (పేపర్ లెస్) లేకుండా సచివాలయ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇ-ఆఫీస్ నిర్వహణ, త్వరితగతిన ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై సీఎస్ సచివాలయ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఇ-ఆఫీస్ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. కార్యదర్శి స్థాయి నుంచి ఏఎస్ఓ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఇ-ఫైలింగ్ విధానం అనుసరించాలని పేర్కొన్నారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం, సామర్థ్యం పెంపుదల, త్వరితగతిన ఫైళ్ల పరిష్కరణ వంటి సూచనలు చేశారు. ఎస్ఓలు, ఏఎస్ఓలు గరిష్ట స్థాయిలో ఫైళ్లను పరిష్కరించేవిధంగా ఉన్నత స్థాయి కార్యదర్శులు చూడాలన్నారు. వారికి సమాన స్థాయిలో పనిని అప్పగించాలని పేర్కొన్నారు.  వారి పనితీరును తరచూ సమీక్షించి,  ఇ-ఫైలింగ్ సరిగా చేయనివారిని గుర్తించి వారిలో నైపుణ్యం పెంచాలన్నారు. కొంతమంది ఏఎస్ఓలు ఏడాది కాలంలో ఒక్క ఇ-ఫైల్ కూడా పంపలేదని తెలిపారు.
ఇ-ఆఫీస్ ఫైలింగ్ లో చురుకుగా పని చేసినవారి ప్రతిభ గుర్తించి వారికి సర్టిఫికెట్లు ఇస్తామని, అందుకు గాను కార్యదర్శులు ప్రతిభ కనపరిచినవారి వివరాలు పంపాలని తెలిపారు. వివిధ శాఖల్లోని సలహా విభాగంలో ఉండే కార్యదర్శులు జాప్యంలేకుండా సలహాలను, సూచనలు 24 గంటల్లోగా పంపాలన్నారు. ఫైళ్లు త్వరగా పరిష్కారమవడానికి మంత్రులు, కార్యదర్శులు సమీక్షలు నిర్వహించి, ఆయా శాఖల పనితీరు మెరుగుపరచాలని చెప్పారు. సచివాలయంలో విజిలెన్స్, భూసేకరణ, పెద్ద ఎత్తున్న ఉన్న ఇతర ఫైల్స్ తో సహా పూర్తి స్థాయిలో అంతా ఇ-ఫైలింగ్ జరగాలని, అయితే ఏవైనా తప్పనిసరిగా భౌతికరూపంలోనే పంపించవలసిన ఫైల్స్ ను సీఎస్ అనుమతితోనే పంపాలన్నారు.
ప్రభుత్వ ఈ ఏడాది 20,163 జీఓలు విడుదల చేసిందని, అయితే వాటిలో 46 శాతం ఎస్టాబ్లిష్ మెంట్ కు సంబంధించినవే ఉన్నాయని, వీటిని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపయోగపడేవి, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన జీఓలు ఎక్కువగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఇ-ఫైలింగ్ ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)వారు లెక్కించి నివేదిక ఇచ్చారని, ఏడాదికి 900 రోజుకు మూడు ఫైళ్లు పరిష్కరించినవారిని హై వాల్యూమ్ గా, మిగిలినవారిని లో వాల్యూమ్ గా గుర్తించారని తెలిపారు.  ఫైల్ ని 24 గంటల్లోగా పరిష్కరించినవారిని హైస్పీడ్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. పది మంది కార్యదర్శులు, 49 మంది ఏఎస్ లు, 24 మంది ఎస్ఓలు హైవాల్యూమ్, హైస్పీడ్ కేటగిరి-1లో ఉన్నారని, 18 మంది సెక్రటరీలు, 22 మంది ఏఎస్ లు, 210 మంది ఎస్ఓలు, 418 మంది ఏఎస్ఓలు లోవాల్యూమ్, లోస్పీడ్ లో ఉన్నారని వివరించారు.

గిరిజన ప్రాంతాల్లో మంచినీటి కోసం ప్రత్యేక నిధి నుంచి రూ.105 కోట్లు


సంక్షేమ శాఖల సమీక్షా సమావేశంలో సీఎస్ దినేష్ కుమార్
సచివాలయం,జూన్ 19: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి అవసరాల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.105 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)దినేష్ కుమార్ చెప్పారు. సచివాలయం బ్లాక్ 1లోని సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం వివిధ సంక్షేమ శాఖలు, గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. గిరిజన, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, నరేగా, నాబార్డ్ నిధుల వినియోగం, త్రాగునీటి సరఫరా,సోలార్ విద్యుత్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యుత్ వినియోగం తదితర అంశాలను చర్చించారు. ఆయా శాఖల అధికారులు పరిస్థితులను వివరించారు. 7298 విశ్వవిద్యాలయాల కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో మొత్తం 15,78,759 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నట్లు అధికారులు సీఎస్ కు వివరించారు. విద్యార్థుల స్కాలర్ షిప్ లకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ ఆమోదించే విధంగా తాను ట్రెజరీ అధికారులతో మాట్లడతానని సీఎస్ చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగించే విధంగా పైలెట్ ప్రాజెక్ట్ కు 5 పాఠశాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ పాఠశాలల్లో బల్బులతోపాటు వంటకు కూడా సోలార్ విద్యుత్ ని వినియోగిస్తారు.  రాష్ట్రంలోని అన్ని  గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాల్లో సాధారణ విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చాలని సీఎస్ ఆదేశించారు. ఆ విధంగా విద్యుత్ ని ఆదా చేయాలని ఆయన తెలిపారు.  ఈ బల్బుల మార్పిడి ప్రక్రియ జూలై నెల ఆఖరుకు పూర్తి చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన జిల్లాలకు ఆగస్టు 15న అవార్డులు ప్రకటిస్తామన్నారు. ఎనర్జీ ఆడిట్ ని జూలై చివరకు పూర్తి చేయాలన్నారు.  గిరిజన, ఎస్టీలు నివశించే 575 ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)నిధులతో గ్రావెల్ రోడ్లు వేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఆయా వర్గాలు నివశించే ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేయించాలని చెప్పారు. ఎస్సీలు 500ల మందికి పైన, ఎస్టీలు 250 మందికి పైన ఉన్న ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేయించాలన్నారు. అవసరమైతే నాబార్డ్, ఇతర నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

Jun 16, 2017

వ్యవసాయ రంగానికి రూ. రు.87,471 కోట్ల రుణాలు


ఎస్ఎల్ బీసీ సమావేశ నిర్ణయాలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి చంద్రమోహన రెడ్డి
Ø ఇన్ పుట్ సబ్సిడీపై రేపు నిర్ణయం
Ø 5,80 లక్షల క్వింటళ్ల మిర్చి, 3 లక్షల క్వింటళ్ల పసుపు కొనుగోలు
Ø కౌలు రైతులకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణం

సచివాలయం, జూన్ 16: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వాణిజ్య బ్యాంకులు ఈ ఏడాది(2017-18) రు.87,471 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్ బీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. తాము రూ.91,557 కోట్ల రుణాలు ఇవ్వమని కోరగా, ఇంతరకే ఆమోదించినట్లు ఆయన తెలిపారు.  సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్ఎల్ బీసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రూ.25వేల కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.14,335 కోట్లు, మొత్తం రూ.1,26,806 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం రంగానికి ఇచ్చే రుణాల్లో 10 శాతం అంటే రూ. 8,740 కోట్ల రుణాలు  కౌలు రైతులకు ఇస్తారని తెలిపారు. కౌలు రైతులకు కూడా   లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణం ఇస్తారని చెప్పారు.  రెవెన్యూ ఉద్యోగులు, వెలుగు కార్యకర్తల సమన్వయంతో  రైతులకు రుణ అర్హత పత్రాలు(ఎల్ఈసీ), సాగు ధృవీకరణ పత్రాలు( సీఓసీ) అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే మూడు లక్షల మంది రైతులకు ఎల్ఈసీలు జారీ చేశారని, ఇంకా 5.60 లక్షల మందికి ఇవ్వవలసి ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం అయినందున ఎల్ఓసీ, సీఓసీలు ఇచ్చిన తరువాత వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా రుణాలు ఇస్తాయని చెప్పారు.  దేశంలో రైతులకు గురించి ఆలోచన చేస్తున్నది ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు. దేశంలో మొదటిసారిగా రైతులకు ఎల్ఓసీ, సీఓసీలు ఇచ్చింది కూడా తమ ప్రభుత్వమేనన్నారు.
ఇన్ పుట్ సబ్సిడీపై రేపు నిర్ణయం
రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీపై రేపు సాయంత్రం 3 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వ్యవసాయ బీమా హెక్టార్ కు కేంద్రం రూ.6,900లు ఇస్తుందని, అయితే ఇన్ పుట్ సబ్సిడీ, బీమా కలిపి హెక్టార్ కు రూ.15వేల రూపాయల చొప్పున రెండు హెక్టార్లకు రూ.30 వేల రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. కేంద్రం ఇచ్చిన దానికి తోడు  మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బీమా రూ.15వేలకు పైన వచ్చినా ఆ మొత్తం రైతులకే ఇస్తామని చెప్పారు.
5,80 లక్షల క్వింటళ్ల మిర్చి కొనుగోలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 95 కోట్ల విలువైన 5,80 లక్షల క్వింటళ్ల మిర్చి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే మూడు లక్షల క్వింటళ్ల పసుపు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పసుపు ఏ గ్రేడ్ రూ.6,500, బీ గ్రేడ్ రూ.6000 చొప్పున కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు.

Jun 14, 2017

27న చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటు


పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధరెడ్డి
·        చిత్తూరు-నెల్లూరు జిల్లాలు కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ గా ఎంపిక
·        స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు యోచన
·       పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ
·       ఆన్ లైన్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు
·       పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త పాలసీల రూపకల్పన
·       ఎంఓయులు జరిగిన వాటిలో 137 పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభం
·       పరిశ్రమలకు భూ కేటాయింపుల సరళీకరణ
·       దేశంలో మొదటిసారిగా జిల్లా స్థాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు

      సచివాలయంజూన్ 14: యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యుఎన్ఓప్రకటించిన ప్రకారం ఈ నెల 27న జరిగే సూక్ష,చిన్నతరహామధ్యతరహా పరిశ్రల(ఎంఎస్ఎంఈదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలుఫుడ్ ప్రాసెసింగ్వ్యవసాయ వాణిజ్యంవాణిజ్యంప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి ఎన్అమరనాధరెడ్డి చెప్పారుసచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారుకార్పోరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారన్నారుసూక్ష,చిన్నతరహామధ్యతరహా పరిశ్రల ద్వారా అత్యధిక మందికి ఉపాధి లభించే అకాశం ఉందనిఅందు వల్ల ప్రభుత్వం ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారుతమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో 19,193 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈల ద్వారా  2.26 లక్షల మందికి ఉపాధి లభించినట్లు వివరించారుచిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అభించే అవకాశం ఉంటుందనిఅందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారుఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో ఈ పార్కుల కోసం భూములు ఎంపిక చేసినట్లు తెలిపారుమిగిలిన నియోజకవర్గాల్లో కూడా భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారుఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో భాగంగా ఆ సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారుఈ రంగంలో మూతపడిన పరిశ్రమలను పున:ప్రారంభించేందుకు రూ.160 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్
             మన రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల  కోస్తా తీరం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందిఉపాధి కూడా అత్యధిక మందికి లభించే అవకాశం ఉందిఈ నేపధ్యంలో నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లోని 50 కిలోమీటర్ల  ప్రాంతాన్ని కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ గా కేంద్రం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారుదీంతో ఆ ప్రాంతంలోని యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారుఇప్పటికే ఈ ప్రాంతాన్ని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ గా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారుఈ కారిడార్ అభివృద్ధికి ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాక్ రూ.5500 కోట్లుఇతర బ్యాంకులు రూ. 4 వేల కోట్లుఏపీ ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారుదీంతోపాటు చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారునూతనంగా ప్రారంభించే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వారికి ఆయా పరిశ్రమల్లో అవసరాలమేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో  స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందు కోసం కాలేజీల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారుఅదేవిధంగా నెల్లూరు-చిత్తూరు జిల్లాల మధ్య స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లా స్థాయి ర్యాంకులు

       ప్రపంచం బ్యాంకు 2016 నివేదిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి చెప్పారుపరిశ్రామిక రంగంలో మనం అనుసరించే విధానాల ఆధారంగా  ఈ ర్యాంక్ ఇచ్చినట్లు తెలిపారుఈ ఏడాది నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లా స్థాయిలో ర్యాంకులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారుఆయా జిల్లాల్లో పనితీరుఆచరణలో ఎంఓయూల ప్రగతిపారిశ్రామిక అనుమతులుమౌలిక వసతుల కల్పనప్రోత్సాహకాల చెల్లింపు తదితర అంశాల  ఆధారంగా  ర్యాంకులు ఇస్తారని, ఈ విధంగా ర్యాంకులు ఇచ్చే విధానం మొదలు పెట్టిన రాష్ట్రం దేశంలో మనదే మొదటిదని వివరించారు

పారిశ్రామికీకరణకు నిబంధనలు సరళతరం
          రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు భూకేటాయింపుఅనుమతుల నిబంధనలను సరళతరం చేసినట్లుపెట్టుబడులు రాబట్టడానికి ఈ రంగంలో చాలా మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారుపరిశ్రమ స్థాపించడానికి కావలసిన 39 అనుమతులు 21 రోజుల్లో ఇస్తున్నట్లు చెప్పారువాటిలో 34 అనుమతులు 10 నుంచి 15 రోజుల్లోనే ఇస్తున్నట్లు తెలిపారుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అయిదు రకాల ముఖ్యమైన పారిశ్రామిక ప్రోత్సాహకాలను త్వరితగతిన ఆన్ లైన్ లోనే చెల్లించే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రోత్సహకాలకు సంబంధించి ఇప్పటి వరకు 7939 దరఖాస్తులు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. 2014 జూన్ నుంచి ప్రోత్సహకాల కింద రూ.2567.11 కోట్లు ప్రభుత్వం విడుల చేసినట్లు మంత్రి వివరించారుపెండింగ్ లో ఉన్న వాటిని కూడా త్వరగా పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారురూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే మెగా పరిశ్రమల్లో ఉపాధి ఆధారంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నూతన నిబంధనలు రూపొందిస్తున్నట్లు చెప్పారుఎంఓయులను అమలు పరచడానికి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు చెప్పారుఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలకు సంబంధించి 137 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారుఅటు రైతులకు ఉపయోగపడేఇటు ఉపాధికి అవకాశాలు ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారుఈ రంగంలో రూ.10,747.88 కోట్ల పెట్టుబడులతో 1,09,886 మందికి ఉపాధి లభించే 340 ఎంఓయూలు జరిగినట్లు చెప్పారువాటిలో రూ.1,141.17 కోట్ల పెట్టుబడులతో 26,801 మందికి ఉపాధి కల్పించిన 115 ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారుమిగిలినవి కూడా వివిద దశల్లో ఉన్నట్లు చెప్పారుఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పాలసీని రూపొందించి టెక్స్ టైల్సిల్క్ టెక్స్ టైల్ పార్కులను ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు.  పారిశ్రామిక రంగంలో ఎస్సీ,ఎస్టీలనుమహిళలను ప్రోత్సహించడంలో భాగంగా వారికి అదనంగా ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు తెలిపారువెనుకబడిన జిల్లాల్లో దాదాపు రూ.6,500 కోట్ల వరకు పెట్టుబడులు రాబట్టడానికి వెనుకబడిన జిల్లాల ఆల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ పాలసీని రూపొందించినట్లు చెప్పారుఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన కియా మోటార్స్ రూ.13,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి నూతన పాలసీ ఉపయోగపడిందన్నారు.
విశాఖలో 2016, 2017లో జరిగిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో అన్ని విభాగాల్లో 1569 ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయులు జరిగాయని చెప్పారువీటి ద్వారా రూ.16,87,845 కోట్ల పెట్టుబడులు, 30,74,933 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి వివరించారువాటిలో ఇప్పటికే రూ.32,735 కోట్ల పెట్టుబడులతో 137 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు, 80,981 మందికి ఉపాధి లభిస్తున్నట్లు చెప్పారు రూ.5,00,732 కోట్ల పెట్టుబడితో 13,02,902 మందికి ఉపాధి లభించే 311 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...