Jun 20, 2017

ఆర్థిక శాఖపై పెరిగిన వత్తిడి

ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు
సచివాలయం, జూన్ 20: గత సంవత్సరం చెల్లించవలసిన బిల్లులు, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చెల్లించవలసిన బిల్లులు భారీ మొత్తంలో ఉండటం వల్ల ఆర్థిక శాఖపై వత్తిడి పెరిగిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్ లో మంగళవారం సాయంత్రం ఆర్థిక శాఖ అధికారులతో మొదటి త్రైమాసికం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక శాఖకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. గత సంవత్సరం 4వ క్వార్టర్ లో చెల్లించవలసిన బిల్లులు రూ.10 వేల కోట్ల వరకు ఈ త్రైమాసికంలో చెల్లించవలసి వచ్చిందని చెప్పారు. ఈ త్రైమాసికం బిల్లులు కూడా కలుపుకుంటే భారీ మొత్తంలో రూ. 49వేల కోట్లు చెల్లించవలసి వచ్చిందన్నారు. దానికి తోడు ఇరిగేషన్, మునిసిపల్ పరిపాలన, రోడ్లు భవనాలు, హోం వంటి కొన్ని శాఖలు అదనపు నిధులు అడుతున్నట్లు తెలిపారు. పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులకు మూలధన వ్యయం బాగా పెరిగిందని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు బడ్జెట్ లో లేకపోయినా ఇస్తున్నామన్నారు.
 రెవెన్యూ రాబడి అంత ఇబ్బందికరంగా లేకపోయినప్పటికీ ఇంకా రూ.10వేల కోట్ల బిల్లులు చెల్లించవలసి ఉందన్నారు. పాత బకాయిలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని కూడా త్వరగా చెల్లిస్తామని చెప్పారు. ఆ బకాయిలను మొదటి త్రైమాసికంలోనే చెల్లించమని ఆదేశించినట్లు తెలిపారు.  ఆదాయానికి, రాబడికి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు, రాష్ట్ర ఆదాయం ఉన్నప్పటికీ బడ్జెట్ లోని లోటు అలాగే కొనసాగుతోందని చెప్పారు. అయితే వృద్ధి రేటు బాగుందన్నారు. వృద్ధి రేటులో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, మన రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను నియంత్రణలో పెట్టుకోవలసిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ పెరగాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అనుకున్న స్థాయిలో లేదని, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల ఆదాయం  పరవాలేదన్నారు.
కేంద్రం నుంచి అదనపు గ్రాంట్లు రావలసి ఉందన్నారు. రూ.9 వేల కోట్ల వరకు వచ్చాయని, ఇంకా రూ.10వేల కోట్లు రావలసి ఉందని, అవి ఈ నెలాఖరుకు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూలధన వ్యయం విడుదల చేయమని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలోని ఆర్థిక లోటుకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా రూ.3వేల కోట్లు రావలసి ఉందన్నారు. అయితే కేంద్రం 138 కోట్లే వస్తాయని చెబుతోందన్నారు. విభజన సమయంలో చెప్పిన ప్రకారం ఆ మొత్తాన్ని కేంద్రం తప్పనిసరిగా ఇవ్వవలసి ఉందని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాస్తారని చెప్పారు.
మంత్రులు, కార్యదర్శులు అర్ధం చేసుకోవాలి
మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలన్నారు. ముందు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసి, ఆ తరువాత అదనపు బడ్జెట్ అడగాలని కోరారు. అదనపు నిధులు అడగకుండా ప్రాధాన్యతా క్రమంలో పథకాలను అమలు చేసుకోవాలన్నారు. అదనపు బడ్జెట్ ని ఆమోదించలేని స్థితిలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలిపారు. ఏ శాఖ అయినా బిల్లు పెడితేనే డబ్బు చెల్లిస్తామని, ఇక నుంచి ముందుగా చెల్లించేదిలేదని చెప్పారు.  ఇప్పటికే రూ.4వేల కోట్లు అప్పు చేశామని, మరో రూ.12వేల కోట్లు అప్పు చేసే అవకాశం ఉందని చెప్పారు. అర్ధ సంవత్సరం అయిన తరువాత పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు రెండు డీఏలు, గ్రాడ్యూటీ చెల్లిస్తామని చెప్పామని, డబ్బు వెసులుబాటు చూసుకొని తప్పక చెల్లిస్తామని అన్నారు.
30న జీఎస్టీ సమావేశం
ఈ నెల 30న జీఎస్టీ సమావేశం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచే జీఎస్టీ అమలులోకి వస్తుందన్నారు. ప్రధాని ప్రారంభించే ఆ కార్యక్రమం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరుగుతుందని చెప్పారు. జీఎస్టీటికి సంబంధించి తాము చేసిన సూచనలు చాలా వరకు కేంద్రం అంగీకరించిందని, అయితే గ్రానైట్, మార్బుల్ విషయంలో ఒప్పుకోలేదన్నారు. పెట్రోల్, లిక్కర్ లను రాష్ట్రాలకు వదిలివేశారని చెప్పారు. వ్యాపారస్తులకు వేధింపులు లేకుండా, సామాన్య మానవుడిపై అధిక భారం పడకుండా జీఎస్టీ విధానం ఉంటుందని వివరించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టం వస్తే దానిని 5 ఏళ్లపాటు కేంద్రం భరిస్తుందని చెప్పారు.
మరో పదివేల పోస్టులు భర్తీ చేస్తాం
ప్రభుత్వ పోస్టులు 20వేలు భర్తీ చేస్తామని చెప్పామని, ప్రస్తుతం 10వేల పోస్టులు భర్తీ చేస్తున్నారని, మిగిలిన పదివేలు కూడా ఆ తరువాత భర్తీ చేస్తామన్నారు. కాంట్రాక్ట్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు.

x

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...