Jun 9, 2017

అమరావతి నిర్మాణానికి నిధులు సిద్ధం


Ø ఇక నిర్మాణమే
Ø శరవేగంగా ప్రైవేటు నిర్మాణాలు
              
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి మహానగర నిర్మాణానికి భూసమీకరణ పూర్తి అవడంతోపాటు నిధులు కూడా దాదాపు సమకూరాయి. ఇక నిర్మాణం మొదలుపెట్టడమే మిగిలింది. ఓ పక్క వెలగపూడిలో రికార్డు సమయంలో 210 రోజుల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి అయింది. పరిపాలన ఇక్కడ నుంచే కొనసాగుతున్న విషయం తెలిసిందే.  192 రోజుల్లో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణాలను పూర్తి చేసి సమావేశాలు కూడా నిర్వహించారు. మరో పక్క రాజధానిలో అంతర్గతంగా ఏడు రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇంకో పక్క ప్రముఖ విద్యా సంస్థలు విట్, ఎస్ఆర్ఎం భవనాల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర నడిబొడ్డున 53,478 ఎకరాల్లో 217.23 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో కృష్ణా నదికి ఒడ్డున 15 కిలోమీటర్ల పొడవున రాజధాని నిర్మిస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 25 రెవెన్యూ గ్రామా (29 గ్రామాలు)ల్లో 28,102 మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా 34,416 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 26,173 మంది రైతులు 32,739 ఎకరాలను స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా 2,959 మంది రైతులు 1,676 ఎకరాలు అప్పగించవలసి ఉంది. ఈ భూమిని 2013 భూసేకరణ చట్ట ప్రకారం తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడింది. 40 రోజుల్లో దానిని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.  భూములు ఇచ్చిన రైతులకు ఏపీ సీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్లాట్లు  పంపిణీ చేసే కార్యాక్రమం దాదాపు పూర్తి అయింది. ప్లాట్ల వివరాలతో కూడిన  హక్కు పత్రాలను రైతులకు అందజేశారు. రాజధాని మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలు, 27 పట్టణాలు ఉంటాయి. ఆయా నగరాలకు భూముల కేటాయింపు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. పరిపాలన నగరానికి 2,702 ఎకరాలు, ఆర్థిక నగరానికి 5,168, న్యాయ నగరానికి 3,438, పర్యాటక నగరానికి 11,574, విజ్ఞాన నగరానికి 8,547, ఎలక్ట్రానిక్స్ నగరానికి 6,582, ఆరోగ్యనగరానికి 6,511, మీడియా నగరానికి 5,107,  క్రీడల నగరానికి 4,150 ఎకరాలు  కేటాయించాలని ప్రతిపాదించారు.  

         జల కళ-పచ్చదనం నిండిన అంతర్జాతీయ స్థాయి నగరం (బ్లూ-గ్రీన్ సిటీ) నిర్మించడానికి రూ.58 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ప్రధాన నిర్మాణాలు ఈ ఏడాది మొదలుపెట్టి మొదటి మూడేళ్లలో అంటే 2019 వరకు 32,463 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రోడ్ల వంటి కొన్ని మౌలిక సదుపాయాలు, పవర్, గ్యాస్ వంటి రూ. 5,271 కోట్ల విలువైన పనులను పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిఫ్) పద్దతిలో చేపడతారు.  రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10,816 కోట్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 5,600 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.4,967 కోట్లు, పవర్ కు రూ.3,287 కోట్లు, వరదల నియంత్రణకు రూ.1000 కోట్లు, నీటికి రూ.574 కోట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.176 కోట్లు, అంకుర ప్రాంత అభివృద్ధికి రూ.614 కోట్లు, పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి బ్రాండ్ నేమ్ ప్రచారం చేయడానికి, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ప్రభుత్వ ప్రతినిధులు అనేకమంది దేశవిదేశీ పర్యటనలు ఫలితాలనిస్తున్నాయి. కొన్ని జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించగా, సింగపూర్, చైనా, జపాన్, బ్రిటన్, ఆస్థానా వంటి దేశాలు తమ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. నిర్మాణంలో అన్నిదశలలో పాలుపొచుకోవడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు.

        మొదటి మూడేళ్లలో ఖర్చు చేయాలనుకుంటున్న నిధుల్లో చాలా వరకు సమకూరాయి. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో రాజధాని నిర్మాణానికి సీఆర్డీఏ నిధులు సమకూర్చుకుంటోంది.  హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) రూ.14,200 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని విడతలవారీగా విడుదల చేస్తుంది. మొదటి దశలో రూ.7500 కోట్లు ఇస్తుంది. ఇప్పటికే హడ్కో రూ.1275 కోట్ల చెక్కుని అందజేసింది.  ప్రపంచ బ్యాంకు నుంచి  రుణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ బ్యాంకు మొదటి విడత రూ.3,400 కోట్లు, 2వ విడత 3,400 కోట్లు ఇస్తుంది. బ్యాంక్ బోర్డు ఆమోదించగానే తొలి విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4,500 కోట్లు అందజేస్తుంది. పీపీపీ విధానంలో మౌలిక వసతులు, బాండ్స్ వంటి ఇతర మార్గాల్లో సీఆర్డీఏ రూ.10,663 కోట్ల వరకు సమకూరుస్తుంది. రాజధానిలో అంకుర ప్రాంత అభివృద్ధి పనులను స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ కు చెందిన సంస్థలకు అప్పగించారు. ఆ సంస్థల ప్రతినిధులు రాజధానిలో క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించి తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ సంస్థలు త్వరలో విజయవాడలో తమ కార్యాలయాలను ప్రారంభించి, పనులు మొదలుపెడతాయి. అమరావతి నగరంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలు అత్యున్నతంగా(ఐకానిక్‌), వాటి ఆకృతులు విలక్షణం (యునిక్‌)గా ఉండటంతోపాటు  ప్రపంచంలోని అత్యున్నత నగరాల సరసన నిలిచేవిధంగా ఉండాలన్నది  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావన. కొత్త రాజధానిలోని ప్రతి కట్టడం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించేవిధంగా ఉండాలని లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్‌ సంస్థకు ప్రభుత్వం సూచించింది. ప్రస్తుత గ్రామాల ఉనికి కోల్పోకుండా చూడాలన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశం. రాజధానిలో అత్యంత ప్రధానమైన పాలనా నగరం తుది నమూనాను లండన్ కు చెందిన నార్మన్ పోస్టర్ సంస్థ మరో పది రోజుల్లో అందజేస్తుంది. నెల రోజుల్లోపల స్ట్రక్చరల్ డిజైన్ కూడా అందజేస్తుంది. ఆ తరువాత పాలనా నగరంతోపాటు శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు కూడా మొదలవుతాయి. రెండేళ్లలో రాజధానికి ఒక రూపు తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది.

                            - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914          


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...