Jun 21, 2017

ఆడిట్ అభ్యంతరాలు 3 నెలల్లో పరిష్కరించాలి

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు  ఆగ్రహం

పేరుకుపోయిన 35.19 లక్షల అభ్యంతరాలు
మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో ఏళ్లకు ఏళ్లు జరగని  ఆడిట్
వేల కోట్లకు లెక్కలు తేల్చని సంస్థలు
రికార్డులు సమర్పించని అధికారులు
వచ్చే బడ్జెట్ నాటికి అన్ని సంస్థల ఆడిటింగ్ పూర్తి చేయాలని ఆదేశం
కాంట్రాక్ట్ సిబ్బందిని తీసుకోవడానికి అనుమతి

సచివాలయం, జూన్ 21: మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఏపీ హౌసింగ్ బోర్డు వంటి సంస్థలలో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను మూడు నెలల్లో పరిష్కరించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అదేశించారు. సచివాలయం రెండవ బ్లాక్ లో బుధవారం ఉదయం ఆడిట్ విభాగంలో పనితీరును సమీక్షించారు.  మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు, పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, విశ్వవిద్యాలయాలు, టీటీడీ, జిల్లా గ్రంథాలయ సంస్థలు, రైతు బజార్లు వంటి 17 సంస్థలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 31 వరకు రూ.16,276.08 కోట్లకు సంబంధించి 35,19,004 ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
రూ.5,445.64 కోట్ల విలువైన పనులకు రికార్డులు సమర్పించలేదని 7,89,741 ఆడిట్ అభ్యంతరాలు, రూ.2,014.81 కోట్ల బకాయిలు వసూలు చేయలేదని 2,57,938 అభ్యంతరాలు, నిబంధనలు అతిక్రమించి రూ.1386.16 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు 7,04,498 ఆడిట్ అభ్యంతరాలు, రూ.86.25 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు 11059 అభ్యంతరాలు,  రూ.120.70 కోట్ల నిధులు తప్పుగా వినియోగించినట్లు 5386 అభ్యంతరాలు, రూ.115.69 కోట్లు ఎక్కువగా చెల్లించినట్లు 44,987 అభ్యంతరాలు, రూ.49.01 కోట్లు వృధాగా ఖర్చు చేసినట్లు 6992 అభ్యంతరాలు, రూ.385.63 కోట్ల నిధులు ఎక్కువగా ఖర్చుపెట్టినట్లు 61,242 అభ్యంతరాలు ఉన్నట్లు వివరించారు.
విశ్వవిద్యాలయాల్లో లెక్కల్లో తేడాలు, నిధులు దారిమళ్లింపు, నిబంధనల అతిక్రమణ, స్కాలర్ షిప్ ల పంపిణీ, నిధుల దుర్వినియోగం వంటి 24 అంశాలకు సంబంధించి రూ.1908.91 కోట్ల నిధులు వినియోగంపై 29,674 ఆడిట్ అభ్యంతరాలు, టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానాలు)లో 19 అంశాలకు సంబంధించి రూ.15.75కోట్ల వినియోగంపై 986 అభ్యంతరాలు, ఏపీ హౌసింగ్ బోర్డులో 19 అంశాలకు సంబంధించి  రూ.1358.83 కోట్ల వినియోగంపై 4054 అభ్యంతరాలు ఉన్నట్లు చెప్పారు.     
మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీలలో చాలా ఏళ్లకు సంబంధించి ఆడిట్ పూర్తి కాలేదని, ఒక కార్పోరేషన్ లో 12 ఏళ్ల నుంచి ఆడిట్ పెండింగ్ లో ఉంటే మరి కొన్ని కార్పోరేషన్లలో రెండేళ్లు, మూడేళ్లు ఆడిటింగ్ పెండింగ్ ఉన్నట్లు వివరించారు. ఆ విధంగా 13 కార్పోరేషన్లలో 32 ఏళ్లకు సంబంధించిన ఆడిటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఆయా సంవత్సరాలకు సంబంధించి లెక్కలను తేల్చలేదని చెప్పారు. మునిసిపాలిటీలకు వచ్చేసరికి కొన్నిటిలో 2, 3, 5 ఏళ్లకు ఆడిటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో 55 ఏళ్లకు సంబంధించి ఆడిటింగ్ ఉన్నట్లు చెప్పారు. అలాగే ఆయా సంవత్సరాలకు సంబంధించి జమాఖర్చులు కూడా పూర్తిగా రాయలేదని తెలిపారు. అయితే కార్పోరేషన్లలో, మునిసిపాలిటీల్లో ప్రస్తుత సంవత్సరం ఆడిటింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్థిక మంత్రి ఆగ్రహం
వేల కోట్ల రూపాయలకు సంబంధించి తగిన రికార్డులు సమర్పించకపోవడం, నిధులు దుర్వినియోగం, నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చుచేయడం, నిధులు దుర్వినియోగం, అధిక చెల్లింపులు, మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీల్లో ఏళ్లకు ఏళ్లు ఆడిట్ పూర్తి కాకపోవడం, పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి ఆడిట్ అభ్యంతరాలు ఏమీ ఉండకూడదని, ఈ లోపలే పరిష్కరించాలని చెప్పారు. దీనిని ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు.  ఆడిట్ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించడానికి అవసరమైన చోట స్టేట్ ఆడిట్ శాఖ నుంచి పదవీవిరమణ చేసిన వారిని ఒక ఆరు నెలలపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోమని చెప్పారు. ఈ పనికి ఆయా జిల్లాలకు చెందినవారిని తీసుకుంటే, వారికి అక్కడ పరిస్థితులు తెలుస్తాయని మంత్రి సలహా ఇచ్చారు.  పని లక్ష్యం నిర్ణయించి వారిచేత పని చేయిచాలన్నారు. ఈ పనిలో వారికి సహకరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు దుర్వినియోగం, తప్పుగా వినియోగించిన, అధికంగా చెల్లింపులు చేసిన, నిధులు వృధా చేసిన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థలు, ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు పేరుకుపోయిన ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన లెక్కలను సమర్పించి, మూడు నెలల లోపల ఆడిట్ ను పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అన్ని సంస్థలు నిధులు వినియోగం, జమాఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయా సంస్థలు గడచిన సంవత్సరాలకు సంబంధించిన జమాఖర్చుల వివరాలు, ఆడిట్ అభ్యంతరాలకు తగిన వివరణలు పంపిన ఒకటి, రెండు నెలల లోపు ఆడిట్ ని పూర్తి చేయాలన్నారు.  స్థానిక సంస్థలకు సంబంధించి బాధ్యత గల అధికారులు పెండింగ్ లోఉన్న వినియోగ సర్టిఫికెట్లను వెంటనే రాష్ట్ర ఆడిట్ శాఖకు అందజేయాలన్నారు. అలాగే పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయడానికి వారు  అధిక ప్రాధాన్య ఇవ్వాలని చెప్పారు. బకాయిల వసూలుకు ఏమీ చర్యలు తీసుకుంటారో ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు. ఆయా సంస్థల సీఈఓలు, ముఖ్య బాధ్యులు  నిధుల వినియోగానికి సంబంధించి తగిన రికార్డులు అందజేయడంలో బాధ్యత తీసుకోవాలన్నారు. ఆడిట్ కోసం ఆ రికార్డులు సమర్పించాలని చెప్పారు. నిధుల వినియోగం లెక్కల సమర్పణ, ఆడిటింగ్ ఏ మేరకు జరిగిందో పరిశీలించి ఇక ముందు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. పెండింగ్ లో ఉన్న లెక్కలు తేల్చడానికి, ఆడిట్ అభ్యంతరాలు పరిష్కరించడానికి ఒక విభాగం, ప్రస్తుత జమాఖర్చుల వివరాల నమోదు, ఆడిటింగ్ కు మరో విభాగాన్ని ఏర్పాటు చేసుకొని త్వరగా ఆడిటింగ్ పూర్తి చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆడిటి అభ్యంతరాలను మూడు నెలల్లో పరిష్కరించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.  ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, ఆడిట్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...