Jun 10, 2017

ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రాధాన్యత


డీఐసీ మేనేజర్ల సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ రెడ్డి

          సచివాలయం, జూన్ 10: స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమల స్థాపనకు కృషి చేసి, పరిశ్రమల శాఖకు ప్రత్యేక గుర్తింపు తేవాలని పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ వాణిజ్యం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి ఎన్. అమరనాధరెడ్డి ఉద్యోగులను కోరారు. సచివాలయం 2వ బ్లాక్ లో శనివారం ఉదయం జరిగిన జిల్లా పరిశ్రమల కేంద్రాల(డీఐసీ) జనరల్ మేనేజర్ల సదస్సులో ఆయన   రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని సమీక్షించారు. రాష్ట్ర విభజన తరువాత పరిశ్రమల శాఖకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. అందువల్లే ఈ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆధీనంలోనే ఉంచుకున్నారన్నారు. భావితరాల భవిష్యత్, ఉపాధి అవకాశాలు మెరుగుపడటం కోసం అందరం ఒక టీమ్ గా పనిచేయాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రల(ఎంఎస్ఎంఈ)ను ప్రోత్సహించడంలో పరిశ్రమల శాఖ జీఎంలు అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పారు. కొత్త పారిశ్రామిక వేత్తలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి, వారికి తెలియని విషయాలు తెలియజెప్పాలన్నారు. జీఎంలు ప్రతి అంశంపైన పూర్తి అవగాహనతో ఉండాలని చెప్పారు.  ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని చెప్పారు. పెట్టుబడులు రాబట్టడం, కొత్త పరిశ్రమలకు అనుమతులు, ప్రోత్సహాకాలు ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో దేశంలోనే మంచి స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఆ విధంగా ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని, ఈ ఏడాది కూడా పారిశ్రామికవేత్తల్లో ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ దానిని నిలబెట్టుకోవాలన్నారు.

మంత్రి అమరనాథరెడ్డితోపాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి సాలమన్ ఆరోకియా రాజ్, కమిషనర్ సిద్ధార్ధ జైన్, ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్యలు 13 జిల్లాలకు సంబంధించి పరిశ్రమల శాఖ సమస్యలు, ఎంఓయులు, పారిశ్రమల స్థాపన తీరు ఆమూలాగ్రం సమీక్షించారు. జిల్లాల వారీగా పెద్ద యూనిట్లు, చిన్న యూనిట్లు – బడ్జెట్ కేటాయింపులు – ప్రోత్సహకాల చెల్లింపులు – పరిశ్రమలకు భూముల కేటాయింపులు – ఏ పరిశ్రమ స్థాపన ఏ స్థితిలో ఉంది – ఎస్సీ,ఎస్టీలకు చెల్లించవలసిన ప్రోత్సహకాలు, మార్జిన్ మనీ చెల్లింపులు – ఎంఎస్ఎంఈల స్థాపనలో అనుసరించవలసి విధానాలు – ఔత్సామిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ – శాఖలో సాంకేతిక సమస్యలు – ఐటీ సంస్కరణలు, సాఫ్ట్ వేర్ ఇబ్బందులు, కంప్యూటర్,స్కానర్ల సమస్యలు, ఇంటర్ నెట్ స్పీడ్, ఈ-ఫైలింగ్ – బ్యాంకర్లతో సమస్యలు – సింగిల్ డెస్క్ పోర్టల్ – పారిశ్రామిక అనుమతులు – ఇన్ స్పెక్షన్ నివేదికలు – ఆన్ లైన్ సమస్యలు – గ్రానైట్ పరిశ్రమ, కాలుష్య సమస్యలు .... వంటి అన్ని విషయాలను సమీక్షించారు. అనుమతుల విషయంలో పశ్చిమగోదావరి జిల్లా వంద శాతం ఫలితాలను సాధించి ప్రధమ స్థానంలో నిలిచింది.  చాలా సమస్యలకు ఉన్నతాధికారులు సాలమన్ ఆరోకియా రాజ్, సిద్ధార్ధ జైన్ లు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు.  రూ.50 వేల వరకు ఖర్చు చేసుకొని వేగంగా పని చేసే ప్రాసెసర్లు కొనుక్కోవడానికి, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవడానికి అనుమతించారు. ఇన్ స్పెక్షన్ నివేదికలను 24 గంటల్లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. అటు పారిశ్రామికవేత్తలకు, ఇటు జీఎంలకు ఆన్ లైన్ వ్యవహారాలను నిర్వహణను సరళతరం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత కంపెనీలకు అనుమతులు త్వరితగతిన ఇవ్వాలన్నారు.
ఏదైనా దరఖాస్తుని తిరస్కరిస్తే, ఎందుకు తిరస్కరించారో వారికి తెలియజేయాలని చెప్పారు.
సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొని పారిశ్రామికవేత్తలకు సహకరించాలని చెప్పారు. అన్ని శాఖల సహకారంతో  ప్రభుత్వం తరపున సమకూర్చవలసిన మౌలిక వసతులు అన్నిటిని కల్పించడంలో జీఎంలు చురుకుగా పనిచేయాలని చెప్పారు. ఆయా జిల్లా కలెక్టర్లకు పరిస్థితిని వివరించి, వారి వెంటబడి అనుమతులు పొందాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 101 నియోజకవర్గాల్లో భూములు గుర్తించినట్లు జీఎంలు చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తప్పనిసరిగా భూములను గుర్తించాలని ఉన్నతాధికారులు వారికి చెప్పారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు, వాటికి సంబంధించి సంప్రదించవలసిన వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లతో డేటా సేకరించి పంపాలని చెప్పారు.
పరిశ్రమల శాఖతోపాటు అనుబంధంగా ఉంటే శాఖలకు సంబంధించి గతంలో 150 సమస్యలు ఉండేవని, వాటిని ఇప్పుడు 51కి తగ్గించినట్లు చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి వచ్చే వారంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఇక ముందు పేపర్లు, ఫైళ్లు ఏమీ ఉండ వని అన్ని ఈ ఫైలింగ్ చేయాలన్నారు. ఈ ఫైలింగ్ లో ఫైళ్లు చెకచెకా నడుస్తాయని సిద్ధార్ధ జైన్ చెప్పారు. తాము ఏదైనా ఫైల్ ఆన్ లైన్ లో పంపితే  కార్యదర్శి సాలమన్ ఆరోకియా రాజ్ నిమిషంలో స్పందిస్తారని తెలిపారు. ఒక్క కాగితం కూడా కమిషనరేట్ కు పంపించవలసిన అవసరంలేదన్నారు. కలెక్టర్ సంతకంతో ఆన్ లైన్ లో లెటర్ వస్తే పారిశ్రామిక ప్రోత్సాహకాలు వారి వారి బ్యాంకు ఖతాల్లో జమ అవుతాయని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయని, ఇక ముందు గ్రామ పంచాయతీల అనుమతులు అవసరంలేదని, అవి కూడా ఆన్ లైన్ లోనే జరిగిపోతాయని చెప్పారు. జీఎంలు అందరూ పాస్ వర్డ్ తెలుసుకొని ఏరోజుకారోజు అన్ని అంశాలు అప్ డేట్ చేయాలని ఆదేశించారు. పనిలో జాప్యాన్ని సహించేదిలేని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.35,194 కోట్ల పెట్టుబడులతో 54,283 మందికి ఉపాధి కల్పించే 86 పరిశ్రమల సివిల్ పనుల ప్రగతిని గురించి చర్చించారు. అలాగే మరో రూ.2,70,724 కోట్లతో నెలకొల్పే  4, 13, 386 మందికి ఉపాధి కల్పించే 85  పరిశ్రమలకు భూముల కేటాయింపులు, అనుమతులు గురించిన వివరాలను మంత్రి  తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించనున్న, సివిల్ పనులు జరుగుతున్న, భూములు కేటాయించిన, కేటాయించవలసి ఉన్న, వివిధ రంగాలకు చెందిన ప్రతిపాధిత చిన్నతరహా, పెద్ద, మెగా పరిశ్రమలు గ్రానైట్, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్ పోర్ట్స్ యూనిట్స్, ఆల్ట్రాటెక్, రామ్ కో, ప్రిజమ్, ఇండస్ట్రియల్ గ్యాస్, మైనింగ్, మినరల్ ప్రాసెసింగ్, మార్బుల్, సిరామిక్ టైల్స్, వాల్ మార్ట్, రెడ్డి ల్యాబ్స్, ఈస్ట్ కోస్ట్, బయోప్రోడక్ట్స్, ఓఎన్ జీసీ, హెచ్ పీసీఎల్, జీఏఐఎల్, తేజా సిమెంట్, అశోక్ లేలాండ్, విప్రో, కేసీపీ, నెరోలాక్ తదితర పరిశ్రమల  విషయం చర్చించారు. సదస్సు లో ఏపీఐఐసీ వైస్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఏ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్ లు కూడా పాల్గొన్నారు.

జారీ చేసినవారు : పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.





No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...