Jun 14, 2017

ఏపీలో అవినీతి అంతానికి శుభారంభం


Ø  ఫలితాలనిస్తున్న 1100
Ø తీసుకున్న లంచం వెనక్కు ఇస్తున్న వైనం
Ø భయపడుతున్న అవినీతిపరులు
Ø ‘పేషెంట్ ఫస్ట్’ స్ఫూర్తితో ‘ప్రజలే ముందు’ కార్యక్రమం

        
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి అంతానికి తొలి అడుగుపడింది. వేళ్లూనుకుపోయిన వ్యవస్థలో ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో మార్పు రావడం సాధ్యంకాదు. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ అవినీతి పేరుకుపోయింది. ఇటువంటి అవినీతిని నిర్మూలించడానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్లాలి. వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకురావడానికి, అవినీతి అంతమొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగాంచారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ఆయనకు ఆయనేసాటి. అవినీతి నిరోధానికి, జవాబుదారీ, పారదర్శక పాలనకు       టెక్నాలజీని సోపానంగా మలుచుకుంటున్నారు. దాపరికం లేని పాలన,  పేదరికం లేని సమాజం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.  ప్రజాహితమైన, అవినీతి రహితమైన పాలనే ప్రభుత్వ విధానం. ఇందుకు ఎంచుకున్న మార్గం జవాబుదారీతనం. పారదర్శకత.  ఇందులో భాగంగా  తాజాగా ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన కార్యక్రమమే ప్రజలే ముందు’. వ్యవస్థలో ప్రజలకు తొలి ప్రాథాన్యత ఇస్తూ ఏ కార్యక్రమం ఆరంభించినా ప్రజలే ముందుఅనే స్పూర్తితో  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ప్రభుత్వం ప్రజలకు చేరువగా వెళ్లి, వారిని గౌరవించి, అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో ఈ కాల్ సెంటర్  ప్రారంభించింది.  ఏ స్థాయిలో అవినీతి ఉన్నా  1100 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే సత్వరం చర్యలు మొదలవుతాయి.సీఎం  అమెరికా పర్యటనలో రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి స్ఫూర్తితో ‘ప్రజలే ముందు’ అనే కార్యక్రమం మొదలుపెట్టారు.  మయో ఆస్పటల్ లో చికిత్స పొందుతున్న దేవేంద్ర గౌడ్ ను పరామర్శించడానికి సీఎం అక్కడకు వెళ్లారు. ఆ సందర్భంలో అక్కడ సేవచేసే విధానం, రోగులకు ఇచ్చే ప్రాధాన్యత, పరిస్థితులను గమనించారు.  అక్కడ అందించే వైద్యం, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగుల పట్ల ప్రవర్తించే తీరు అతనిని బాగా ఆకట్టుకుంది. ‘‘ ప్రపంచంలో అతిపెద్ద ఉత్తమమైన ప్రైవేటు ఆసుపత్రి రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి. పేషెంట్ ఫస్ట్అనే ఉన్నత ఆశయంతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్యసేవలతో పాటు వైద్యరంగంలో విస్తృత పరిశోధనలు కూడా నిర్వహిస్తోంది.  అక్కడి క్రమశిక్షణ నాకు చాలా బాగా నచ్చింది.  మయోలో రోగులకు ఇచ్చే ప్రాధాన్యతను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం  పీపుల్స్ ఫస్ట్(ప్రజలే ముందు) అనే నినాదాన్ని తీసుకుంది’’ అని చెప్పారు.

          ఈ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవలసిన అవసరంలేదు. ఫిర్యాదిదారుల రక్షణకు ప్రభుత్వం హామీగా ఉంటుంది.  లంచగొండులను బయటపెట్టేవారి రక్షణ కోసం ఇప్పటికే పటిష్టమైన చట్టాలున్నాయి. కేంద్ర చట్టాలను కూడా పరిశీలించి అవసరమైతే మరిన్ని రక్షణాత్మక చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మధ్యవర్తుల అవినీతిపై ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పొచ్చు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి ప్రజలకు సంతోషాన్ని, సంతృప్తినీ కలిగించాలన్నది దీని లక్ష్యం. సేవలు, వాటిపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలపై సమీక్ష జరుపుకోవాలనుకోవడం గొప్ప ముందడుగు. 500 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. పెన్షన్లు, చంద్రన్న బీమా, రేషన్ కార్డుల జారీ, ఇళ్ల నిర్మాణం, ఆస్పత్రులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు  వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా  ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ఎలా అందుతున్నాయన్న అంశంపై కూడా కాల్ సెంటర్ నుంచి నేరుగా లబ్దిదారులకు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రన్న బీమాకు సంబంధించి 52 వేల మందికి, పెన్షన్లకు సంబంధించి ఆరు లక్షల 40 వేల మందికి, రేషన్ కార్డుల గురించి తొమ్మిది లక్షల 50 వేల మందికి ఫోన్ చేసి ప్రభుత్వ అధికారుల పనితీరును వాకబు చేశారు.  మూడు వేల మంది లబ్దిదారులు అధికారుల అవినీతి గురించి చెప్పారు. వారిచ్చిన వివరాల ఆధారంగా ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది.  ఈ క్రమంలో ఇప్పటికే కొందరు అధికారులు, దళారులు ప్రజల నుంచి తీసుకున్న లంచం సొమ్మును వెనక్కి ఇచ్చివేశారు. పెన్షన్ విషయంలో ఓ ఉద్యోగి రూ.1000 లు లంచం తీసుకున్నట్లు  ఒక లబ్ధిదారుడు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ మొదలుపెట్టడంతో ఆ ఉద్యోగి పది మంది వద్ద తీసుకున్న లంచం డబ్బును తిరిగి ఇచ్చాడు.  ఈ సొమ్ము రూ.500, రూ.1000 లైనప్పటికీ అవినీతి నిర్మూలనలో ఇది ఓ గొప్ప పరిణామంగా పేర్కొనవచ్చు. ప్రజలు సరైన రీతిలో స్పందిస్తే  క్రమంగా పెద్ద పెద్ద అవినీతి తిమింగిలాలుసైతం భయపడే రోజులు వస్తాయి. ఆ విధంగా అవినీతికి తావులేని వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది.
              ప్రభుత్వంలో అవినీతిని తగ్గించడం కోసం చేపట్టిన ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని ప్రయోజనాత్మక ఫలితాలిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహానికి తావులేదు.  ప్రభావవంతమైన ఈ అస్త్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలు చూపించగలిగితే ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో విస్తృత స్థాయిలో పాతుకుపోయిన లంచగొండితనం, అవినీతిని ప్రక్షాళన చేయడానికి చేపట్టిన ఈ ప్రయోగం అద్భుత ఫలితాలనిస్తోంది. విద్యార్థులకు నెలనెలా అందించే ఉపకార వేతనాలు మొదలుకొని  ప్రభుత్వంలోని అన్ని పథకాలకు సంబంధించిన ఎవరు, ఎక్కడ అవినీతికి పాల్పడుతున్నా ప్రజలు ఈ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదులే కాదు సూచనలు కూడా చేయవచ్చు. ఈ కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పౌర సరఫరాల శాఖ పనితీరుపై సర్వే చేయించింది. రేషన్ కోసం లంచం ఇచ్చారా? అని  లబ్దిదార్లను  ప్రశ్నిస్తే 96 శాతం మంది లేదని సమాధానం చెప్పారు. 2 శాతం మంది మాత్రం ఇచ్చామని చెప్పారు.  పింఛన్ల పంపిణీపై సర్వేలో అవినీతి ఉందాఅని ప్రశ్నించగా 99 శాతం లబ్దిదారులు లంచం ఇవ్వలేదని సమాధానం చెప్పారు. ఒక శాతం మంది  మాత్రం ఇచ్చినట్లు చెప్పారు. సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకుని ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అర్హులకు చేరాలన్నదే ప్రభుత్వ  లక్ష్యం.  అన్ని శాఖలు, పథకాలు, కార్యక్రమాల అమలు గురించి పూర్తి లెక్కలు ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకూ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ యంత్రాంగం రోజువారీగా అప్‌డేట్‌ చేస్తోంది.  పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం మరేం కావాలి? పోస్ట్ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల పంపిణీకి అమలుచేస్తున్న ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ విధానంతో అవినీతి చాలావరకు తగ్గింది. విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయి. మరోవైపు రవాణాశాఖ డిజిటలీకరణ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం వచ్చింది. వాహన వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతోంది. ఇలా అన్ని శాఖల్లో అవినీతి ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.  ప్రజల సంతృప్తే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ఇలాగే కొనసాగితే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ని మనం త్వరలోనే చూడగలం.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...