Jun 29, 2017

సినీ పరిశ్రమలకు సౌకర్యాల కల్పన


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

         సచివాలయం, జూన్ 29: సినీ పరిశ్రమ రాష్ట్రానికి తరలి రావాలని, అందుకోసం ఆ పరిశ్రమకు కావలసిన అన్ని సౌకర్యాలు క్పలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ లోని తన చాంబర్ లో గురువారం సాయంత్రం జరిగిన  ప్రణాళిక, సేవారంగం టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశంలో రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావడంపై చర్చించారు. దక్షిణభారత చిత్ర పరిశ్రమలో తమిళ, తెలుగు చిత్రాలు అతి ఎక్కవగా నిర్మిస్తున్నట్లు, 2015లో ఈ రెండు భాషలలో 365 సినిమాలు విడుదలయినట్లు అధికారులు వివరించారు.  సినిమా నిర్మాణంలో లైసెన్సులు, షూటింగ్  విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను బట్టి, స్థానిక సంస్థల నుంచి నిర్మాత 70కి పైగా అనుమతులు పొందవలసి ఉంటుందని, ఈ విషయంలో ఏక గవాక్ష విధానం లేకపోవడం, టాక్స్ విధానాల  వల్ల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జీఎస్టీ కూడా వారికి అనుకూలంగా లేనట్లు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి సినిమా ఎడిటింగ్, ల్యాబ్, యానిమేషన్, ఫిల్మ్ టూరిజం .... వంటి సౌకర్యాలు కల్పించవలసి ఉంటుందని తెలిపారు. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకు కల్పించే సౌకర్యాలు, వసూలు చేసే టాక్స్ ల గురించి చర్చించారు.
సినీపరిశ్రమ తరలివచ్చి, ఇక్కడ స్థిరపడటానికి తీసుకోవలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సీఎస్ చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యంగా సముద్రతీరం, కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో  పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలన్నారు. కుటుంబ రెస్టారెంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని చెప్పారు.  రాష్ట్ర స్థాయిలో అన్ని అనుమతులను ఏక గవాక్ష విధానంలో ఇవ్వనున్నట్లు  అధికారులు తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు, మౌలిక వసతులు, నగరాలు, పర్యాటక ప్రదేశాల్లో క్యాబ్ సౌకర్యం, అద్దెకు బైకులు లభించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనూ, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విమాన ప్రయాణికులు పెరుగుతున్నందున విమానయాన సౌకర్యం మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
              రాష్ట్రంలో 60 శాతం మంది శ్రామికులు వ్యవసాయ రంగంలో పని చేస్తున్నా, జీఎస్ డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో ఈ రంగం వాటా 32 శాతం మాత్రమేనని  వివరించారు. అందువల్ల వ్యవసాయ రంగంలో అదనంగా ఉన్న శ్రామికులు పరిశ్రమలు, సర్వీస్ రంగాల్లోకి రావలసిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో మూడు అర్బన్, ఆరు సెమీ అర్బన్ రిటైల్ పార్కుల ఏర్పాటు, స్వయం సహాయక గ్రూపుల ఉత్పత్తులు, ఆన్ లైన్ ట్రేడింగ్, కిరాణా షాపుల వ్యాపారం మెరుగుపరుచుకునేందుకు రుణ ప్రణాళిక తదితర అంశాలను చర్చించారు. టూరిజం, హెల్త్, మీడియా, ఎంటర్ టెయిన్ మెంట్, విద్య, లాజిస్టిక్, అకౌంట్ అండ్ ఆడిటింగ్, మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ, లీగల్, ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీరింగ్ రంగాలు అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి అవకాశాలున్న రంగాలుగా గుర్తించారు. మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ అనుమతుల అంశం కూడా చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు,  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ  రవిచంద్ర, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్తరవాణా శాఖ కమిషనర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామల రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...