Jun 8, 2017

నదుల అనుసంధానంతో రాష్ట్రమంతా జల కళ


Ø సుస్థిర సేద్యంతో రైతుకు రెట్టింపు లాభాలు
Ø కరవు రహిత రాష్ట్రంగా ఏపీ
Ø ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆదాయం
Ø వ్యవసాయానికి ఊతం ప్రత్యేక బడ్జెట్
Ø వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఏపీ
Ø భూసార పరీక్షా కార్డుల పంపిణీలో ద్వితీయ స్థానం
Ø శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం
Ø 7 ప్రాజెక్టుల ద్వారా 25.76 లక్షల ఎకరాలకు నీరు
Ø రైతు పక్షం నిలిచిన ప్రభుత్వం

      నదుల అనుసంధానంతో రాష్ట్రమంతటా నీరుపారి జల కళ సంతరించుకోనుంది. సకాలంలో సాగునీరందడంతో రాష్ట్రం సస్యశ్యామలం కానుంది. ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతులు అధికంగా ఉన్న రాష్ట్రం మనది. రాష్ట్రంలో 60 శాతంపైగా ప్రజలు వ్యవసాయాధారంగా జీవిస్తున్నారు. ఆధునిక సాగుపద్దతులను అనుసరించి కృషి పండితులుగా పేరు ఘడించారు మన రైతులు. సాగునీరందితే   సుస్థిర సేద్యంతో వారు రెట్టింపు లాభాలు గఢించే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం చేపట్టే నదుల అనుసంధాన ప్రక్రియ వల్ల త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కరవు రహిత రాష్ట్రంగా అవతరించనుంది. నదుల అనుసంధానం, వర్షపు జలాలను భూగర్భ జలాలుగా మల్చుకుంటేనే ఇది సాధ్యం. విఖ్యాత ఇరిగేషన్ ఇంజనీర్ డా. కె.ఎల్ రావు ఆలోచన నదుల అనుసంధానం.  ఆయన పుట్టిన గడ్డ(కృష్ణా జిల్లా)పైకి గోదావరి నీరు తీసుకొచ్చి నివాళులర్పించింది ఈ ప్రభుత్వం. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానించి దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.   పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి తీసుకొచ్చింది. సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిలో 150 నుంచి 2000 టిఎంసిల నీటిని నదులకు మళ్లిస్తే కరవు ఉండదు. నదుల అనుసంధానం ద్వారా 14 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ  లక్ష్యం. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గత ఏడాది 8.5 లక్షల ఎకరాల్లో 2,500 కోట్ల విలువైన పంటను కాపాడారు. గోదావరి ఎర్రటి మట్టినీళ్లతో అధిక దిగుబడులు వచ్చాయి. గోదావరి-పెన్నా అనుసంధానానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. మొదట గోదావరి నుంచి సంగం బ్యారేజీ వరకు నీటిని తీసుకెళ్లిన తర్వాత విస్తరణ ఉంటుంది. పురుషోత్తపట్నం ద్వారా ఏలేరుకు నీరు తీసుకువెళ్లి  విశాఖకు అందిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఏడు మండలాలకు నీళ్లిస్తారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానాన్ని నిజం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరంలో అన్ని నదులను కలపడానికి, సోమశిల, స్వర్ణముఖి నదులను అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. హంద్రీనీవా ద్వారా మడకశిర, కుప్పం, నెల్లూరుకు నీళ్లు ఇవ్వవలసి ఉంది.  చింతలపూడి ద్వారా పశ్చిమగోదావరితో పాటు సాగర్‌ ఎడమ కాలువ కింద నీరందించే కృష్ణా జిల్లాలోని ఆయకట్టుకు నీరు అందిస్తారు.
శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం
రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం  శరవేగంగా జరుగుతోంది.  గ్రావిటీ ద్వారా 2018కి నీళ్లు సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2019లో పోలవరం పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు  60 శాతం వరకు పూర్తయ్యాయి. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి స్థాయిలో వ్యయాన్ని భరిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 26న  నాబార్డ్ (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్)  తో కేంద్రం ఒప్పందం కదుర్చుకుని రూ.1981 కోట్లు విడుదల చేసింది.  పోలవరం పూర్తయితే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పూర్తయితే  960 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానదికి 80 టిఎంసీల నీటిని మళ్లిస్తారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయంతో అనుసంధానం చేస్తారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల పరిశ్రమలకు, తాగునీటికి 23.44 టిఎంసిల నీరు సరఫరా చేస్తారు.
ఒక పక్క పోలవరం నిర్మిస్తూనే హంద్రీ-నీవాతో మడకశిర, కుప్పం వరకు నీటిని తీసుకెళ్లడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండో పక్క శ్రీశైలం నుంచి గాలేరు-నగరి ద్వారా సీమకు నీరు తీసుకు వెళ్లాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.  కడప దాకా నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులను చిత్తూరు దాకా పొడిగిస్తారు.  పోలవరం-ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రి-నీవా, గాలేరు-నగరి, వంశధార-నాగావళి నదులను ప్రాధాన్యక్రమంలో అనుసంధానం చేస్తారు.  పోలవరం, కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, హెడ్ వర్క్స్ 60 శాతం, తోటపల్లి ప్రాజెక్టు   85 శాతం, .హంద్రి-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు   91 శాతం,  హంద్రి-నీవా ఫేజ్-2  74 శాతం, గాలేరు-నగరి సుజల స్రవంతి ఫేజ్-1     88 శాతం, బి. ఆర్.ఆర్ వంశధార (ప్రాజెక్ట్ ఫేజ్-2, స్టేజ్-2  70 శాతం, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 70 శాతం,  గుండ్లకమ్మ రిజర్వాయర్  93 శాతం పూర్తి అయ్యాయి.  ఈ 7 ప్రాజెక్టులు పూర్తి అయితే 25.76 లక్షల ఎకరాల భూమి ఆయకట్టు ఏర్పడుతుందని అంచనా.
        రాష్ట్ర విభజన సమయంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉండేది.  విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం చీకటికి చరమగీతం పాడింది.
గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అపార పరిపాలనా అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు  అశాస్త్రీయ విభజనతో ఏర్పడిన సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని  గట్టెక్కిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ముంపుమండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు సీఎం కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించారు.        ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీన చేసే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే మంత్రి మండలి తొలి  సమావేశం ఆమోదముద్ర వేసింది. ఆ తరువాత సీఎం వ్యవసాయ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. పంటపొలాలకు, , గృహావసరాలకు, పారిశ్రామిక అవసరాలకు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని అందరికీ విద్యుత్తు పథకాన్ని తెచ్చారు. ఏడాదికే  మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో విద్యుత్తు వ్యవస్థ గాడిన పడింది.  ప్రజలకు పవర్‌కట్ బాధ తప్పింది. సేద్యానికి  7 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో వ్యవసాయం మెరుగుపడసాగింది. ఆ తరువాత విద్యుత్ తక్కువగా ఖర్చయ్యే మోటార్ పంపుసెట్లను పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసేంది. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం, సాగువ్యయం తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాథమిక రంగ మిషన్‌గా గుర్తించి అభివృద్ధికి బాటలు వేసింది. 2016-17లో ప్రాథమిక రంగం ఆంధ్రప్రదేశ్‌ 14.03 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇదే సమయంలో మన దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4.37 శాతం మాత్రమే.
28 శాతం నుంచి 30 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా  2016-17లో వ్యవసాయం ద్వారా రూ.31,536 కోట్ల జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ - పన్నులు కాకుండా స్థూలంగా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల విలువ) వచ్చింది.
 ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆదాయం
ప్రతి కుటుంబానికి రూ. 10 వేల ఆదాయం కల్పించడానికి  ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ  అనుబంధ రంగాలైన పాడిరిశ్రమ, ఉద్యాన పంటలు, మత్స్యశాఖల సహాయంతో రైతుల ఆర్ధిక పరిస్థితి మెరుగుపర్చవచ్చని భావించింది. ఎప్పుడూ ఒకే ఆదాయాన్ని నమ్ముకునే రైతుల ఆలోచనా ధోరణిలో మార్పుతీసుకొచ్చి  వారిని ఉద్యాన పంటలవైపు మళ్లించింది. ఉద్యానవన రంగ ఉత్పత్తిలో 30 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం  ముందుకు సాగుతోంది.  2016-17లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఉద్యానపంటల విస్తీర్ణం 15.41 లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ విస్తీర్ణంలో 202.50 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు  ఉత్పత్తి అయ్యాయి.  మామిడి, అరటి, నిమ్మ, బత్తాయి, ఆయాల్ పామ్, కొబ్బరి, ఉల్లి, మిరప, పసుపు, ధనియాలు తదితర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో స్థూల ఆదాయ విలువలో 9.95 శాతంగా ఉన్న ఉద్యాన రంగ వాటా 2016-17 సంవత్సరం ప్రథమార్ధానికి 18.33 శాతంగా నమోదైంది. ప్రాథమిక రంగం రెండంకెల వృద్ధిరేటు సాధనకు ప్రభుత్వం ఉద్యాన రంగాన్ని గ్రోత్ ఇంజన్‌గా గుర్తించింది.  ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, మిరప పంటల సాగులో దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది. మామిడి, టొమాటో ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రానిది రెండో స్థానం. కర్షకుడు రెట్టింపు ఆదాయం సాధించేందుకు తోడ్పాటు అందిస్తోంది. వ్యవసాయానికి ఊతమివ్వటానికి దేశ చరిత్రలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  మూడేళ్ల నుంచి వ్యవసాయానికి ప్రత్యేకబడ్జెట్ ప్రవేశపెడుతోంది.
గత ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్‌లో 4.5 శాతం కేటాయిస్తే ఈ ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయించింది.  2017-18 వ్యవసాయ బడ్జెట్ కింద రూ.7,167.68 కోట్లు కేటాయించింది. వంశధార, గండికోట ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన  రైతులకు వేల కోట్ల నష్టపరిహారంగా చెల్లించింది.  రాష్ట్రంలో 28.5 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ 2016-17లో ధాన్యం 156.85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండవచ్చని వ్యవసాయ నిపుణుల అంచనా. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
 భూసార పరీక్షా కార్డుల పంపిణీలో దేశంలో ద్వితీయ స్థానం
 రైతులకు భూసార పరీక్షా కార్డులు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం వరసగా రెండోసారి దేశంలో రెండో స్థానంలో నిలిచింది.  రాష్ట్రంలో 56 ప్రయోగశాలల ద్వారా మట్టి నమూనాల విశ్లేషణతో  భూసార పరీక్షలు జరుగుతున్నాయి. సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్ ద్వారా నేల సంరక్ష యాజమాన్యాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మరో 11 లక్షల భూసార ఆరోగ్య కార్డులు పంపిణీచేపట్టింది.  మొదటి దశ కింద 26 లక్షల కార్డుల పంపిణీ పూర్తికానుంది. రెండో దశలో 2017-18 సంవత్సరానికి మరో 28 లక్షల భూసార ఆరోగ్య కార్డులు అందిస్తారు.  బయోమెట్రిక్ విధానంలో తొలిసారి విత్తనాలు సరఫరా చేసి అక్రమాలను అరికట్టారు.  2016-17లో రూ.503.06 లక్షల వ్యయంతో 5,126 చంద్రన్న రైతు ప్రదర్శన  క్షేత్రాలను నిర్వహించారు.  2017-18లో 3,448 చంద్రన్న రైతు ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందు కోసం రూ.17.23 కోట్లు వ్యయం చేయాలని ప్రతిపాదించారు. 2016-17 లో పొలం పిలుస్తోందిగ్రామప్రదర్శనల ద్వారా 1820 లక్షల మంది రైతులకు అవగాహన కల్పించారు.
 కరవుపై యుద్ధం
తుఫానుకంటే భయంకరమైనది కరవు. కరవుపై యుద్ధం చేయడం ఊహకు అందని విషయం. కానీ గతం ఏడాది రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్ర లోని ప్రకాశం, గుంటూరు శ్రీకాకుళం జిల్లాలలో వర్షాభావం నెలకొంది.    వేరుశనగపంట ఎండిపోయే ప్రమాదంలో పడింది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఎండిపోతున్న పంటల విస్తీర్ణాన్ని గుర్తించిన ప్రభుత్వం తక్షణం జీవరక్షక తడులను ఇచ్చి పంటలను కాపాడింది. రెయిన్ గన్స్తో 4 లక్షల ఎకరాల్లోని పంటను రక్షించింది.  నీరు లేక పంటలు ఎండిపోవడం అనేది భవిష్యత్తులో ఇక ఉండదు. రెయిన్ గన్ల వినియోగం దేశంలోనే తొలిసారి. కరవును తరిమికొట్టడంలో మన రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచింది. మిర్చిధరలు పడిపోయి రైతాంగం ఆందోళనకు గురైతే ప్రభుత్వం సకాలంలో స్పందించి వారిని ఆదుకుంది. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా క్వింటాల్ మిర్చికి మద్దతు ధర రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వచ్చేలా చర్యలు తీసుకుంది. సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా క్వింటాల్ ఒక్కింటికి అదనంగా రూ 1,500 చెల్లించింది. ఇరవై   క్వింటాళ్ల వరకు ఈ రాయితీ వర్తింపజేశారు. ఒక్కో మిర్చి రైతుకు రూ 30 వేలు బ్యాంకులో జమ అయ్యింది. ఈ విధంగా ప్రభుత్వం రైతుపక్షంగా నిలిచింది.
                                     -          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...