Feb 19, 2019

ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు 
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆకాశపు స్వామి

   
     సచివాలయం, ఫిబ్రవరి 19 :  టైలర్ల సమస్యల పరిష్కారానికి భారతదేశంలోనే
మొదటిసారిగా ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడుకు ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్  ఆకాశపు స్వామి
కృతజ్ఞతలు తెలిపారు.  రెడీమేడ్ రంగం వల్ల దర్జీలకు సగం రోజులు పనిలేకుండా
పోతోందని వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని 
సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆకారపు స్వామి వెల్లడించారు.
దర్జీలకు వంద యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని, 50 సంవత్సరాలకే
ఫించను, రాయితీపై మెటీరియల్ సరఫరా, దర్జీలకు ప్రభుత్వ రాయితీతో ఇళ్ల
నిర్మాణాలు చేపట్టడానికి సీఎం అంగీకరించారని స్వామి తెలిపారు.  ఆధునిక కుట్టు
మిషన్లతో టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసేందుకు కూడా సీఎం
అంగీకరించినందుకు ఫెడరేషన్ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దర్జీల
సంక్షేమం కోసం త్వరలో ఫెడరేషన్ కు తగినన్ని నిధులు కేటాయించేందుకు సీఎం
అంగీకరించారని స్వామి తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడును మరలా
గెలిపించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్
ఆకాశపు స్వామి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిపై 11 లక్షల మంది
జీవిస్తున్నారని యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు గుర్తుచేశారు.
దర్జీ వృత్తి అంతరించిపోకుండా రాయితీతో ఆధునిక పరికరాలు సరఫరా చేయాడానికి
సీఎం అంగీకరించినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు
సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు
నబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో సీఎస్ అనీల్ చంద్ర పునీఠ సూచన

                   సచివాలయం, ఫిబ్రవరి 19: వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఉపాధి అవకాశాల మెరుగు కోసం గ్రామీణ స్థాయి నుంచి బ్యాంకర్లు  ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునీఠ సూచన చేశారు. సచివాలయం 5వ బ్లాక్ లో నబార్డ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ 2019-20 స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ఆయన ప్రసంగించారు. ప్రణాళికలు గ్రామ, మండల దిగువ స్థాయి నుంచి సెక్టార్ల ప్రకారం తయారు చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనేక పథకాలు ప్రవేశపెట్టి, వాటిని అమలు చేయడంలో దేశంలో ముందుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రానికి 650 అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ప్రగతి సాధించడంలో ఏపీని మంచి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల కృషి ఫలితంగా సమ్మిళిత అభివృద్ధి సాధించినట్లు సీఎస్ తెలిపారు. అంతకు ముందు నబార్డ్ ఏపీ ప్రాంతీయ ఛీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి నబార్డ్ రూ.1,87,061 కోట్ల రుణ ప్రణాళికతో స్టేట్ ఫోకస్ పేపర్ రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అత్యధికంగా రూ.1,23,526 కోట్లు, ఎంఎస్ఎంఈకి రూ.32,906 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత మూడున్నర దశాబ్దాలుగా నబార్డ్ వ్యవసాయ రుణ ప్రళానికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రణాళికలతో స్థానిక వనరుల ఉపయోగానికి, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రాధమిక రంగం, అర్బన్ డెవలప్ మెంట్ వంటి ఏడు మిషన్లను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి బ్యాంకింగ్ నెట్ వర్క్ ఉందన్నారు.  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం అద్వితీయమైన అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధిస్తున్నట్లు తెలిపారు.  గృహ నిర్మాణానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు సహకరించాలని కోరారు.
                     వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం-జడ్ బీఎన్ఎఫ్(జీరో బేస్డ్ నేచురల్ ఫార్మమింగ్)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్  త్వరలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పారు. ప్రస్తుతం 5 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాల్లో  ఈ సాగు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. మన దేశంలో ఈ సాగుని పరిశీలించడానికి అనేక దేశాల వారు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. 2022 నాటికి 60 లక్షల ఎకరాల్లో సాగు చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. బ్యాంకులు కౌలుదారులకు రుణాలు అందించాలన్నారు. అన్నదాత ఎవరు? వాస్తవ వ్యవసాయదారులు ఎవరు? అనేది గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. నిజమైన వ్యవసాయదారునికి ఫలితాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో వ్యవసాయ కుటుంబానికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రకటించిన 24 గంటల లోపల అమలులోకి వచ్చిందన్నారు. మొదటగా రైతుల ఖాతాలలో రూ.1000లు జమ చేసినట్లు చెప్పారు. ఈ విధంగా మొత్తం రూ.498 కోట్లు జమ చేసినట్లు రాజశేఖర్ తెలిపారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటుతో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు నబార్డ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఇచ్చే రుణాలు, ఆర్థిక సహాయానికి ఫోకస్ పేపర్ ప్రాధమికమైనదని చెప్పారు. హార్టీ కల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి,  ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కెఎస్డీ శివ వరప్రసాద్, నాబార్డ్ జీఎం కె.ఎస్.రఘుపతి, ఏజీఎం పీ.రామలక్ష్మి తదితరులు ప్రసంగించారు. ఈ సెమినార్ లో  వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Feb 18, 2019


సాంఘీక సంక్షేమ శాఖలో లిడ్ క్యాప్ విలీనం
మంత్రి జవహర్, ఆర్టీసి చైర్మన్ వర్ల, ఎమ్మెల్సీ డొక్కా,
లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు కృతజ్ఞతలు

                 సచివాలయం, ఫిబ్రవరి 18: పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి  లిడ్ క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)ను విడదీసి సాంఘీక సంక్షేమ శాఖలో విలీనం చేసినందుకు మంత్రి జవహర్, ఆర్టీ చైర్మన్ వర్ల రామయ్య, శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్, లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబులు హర్షం వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 65 ప్రకారం మాదిగ, మాదిగ ఉప కులాలకు  ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం సహాయం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి జవహర్ తెలిపారు. అమలాపురం ఎంపీ పందుల రవీంద్ర ముందు తన ఇంటి పేరుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయన ప్రవర్తన తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శించడాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యుడిపై ఉమ్మివేస్తే తన మీదే పడుతుందన్నారు.
               ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ జీఓ నెంబర్ 65 జారీ చేసినందుకు మాదిగ, ఉప కులాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసిన మాదిరిగా సంక్షేమ ఫలాలు మాదిగలకు, ఆయా ఉప కులాలకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ జీఓ మాదిగలకు ఓ పెద్ద వరంగా పేర్కొన్నారు. ఇది సాహసోపేత నిర్ణయంగా వర్ల పేర్కొన్నారు. ఎంపీ పందుల రవీంద్ర నీడనిచ్చే చెట్టుని నరుక్కున్నారన్నారు. ఎండమావులను చూసి నీళ్లనుకున్నారని విమర్శించారు.
          ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ దళితులు, మాల, మాదిగ వర్గాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. లిడ్ క్యాప్ చైర్మన్ గా గూడూరి ఎరిక్సన్ బాబుని నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎంపీ రవీంద్ర బురద జల్లే కార్యక్రమాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారడం అనేది ఆయన ఇష్టమని, అయితే నిందారోపణలు చేయడం తగదన్నారు. అది మంచి సంప్రదాయం కాదన్నారు. దళితులకు చెడ్డ పేరు తేవద్దని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. అవాకులు చెవాకులు మానుకోమని సలహా ఇచ్చారు.
            లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల వరకు మాదిగలు ఉన్నట్లు తెలిపారు. కార్పోరేషన్ చైర్మన్ గా మాదిగ సామాజిక వర్గానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Feb 15, 2019

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా


          సచివాలయం, ఫిబ్రవరి 15: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావుకు ఆయన తన రాజీనామా లేఖని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభకు పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు.

Feb 14, 2019

హస్తినలో ఆంధ్రుల సత్తా చాటిన చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినలో ఆంధ్రుల సత్తా మరోసారి చాటారు. 68 ఏళ్ల వయసులో కూడా పోరాట పటిమ ప్రదర్శించారుధర్మపోరాట దీక్ష ఉద్యమాన్ని ఉదృతం చేశారు ఢిల్లీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తింది.  స్వామి కార్యంతోపాటు స్వకార్యం అన్నట్లురాష్ట్ర సమస్యకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంతోపాటు బిజేపీఏయతర రాజకీయ పార్టీల మధ్య బంధాన్ని పఠిష్టం చేసి విజయం సాధించారుమనకి దేశ వ్వాప్తంగా భరోసా లభించిందిసమాఖ్య వ్యవస్థ బలపడటానికి అవకాశం ఏర్పడిందిఈ క్రెడిట్ వంద శాతం చంద్రబాబుకే దక్కుతుందిఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేక హోదావిభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగడుతూనే ఉన్నారు. మొదట రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ధర్మపోరాట దీక్షలు చేశారుఅన్ని  దీక్ష సభలలో 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా వచ్చిన మోడీ తిరుపతిలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను ప్రదర్శించారు2018 ఏప్రిల్ 20న తన పుట్టిన రోజున విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆహారం తీసుకోకుండా ధర్మపోరాట దీక్ష చేశారు.  దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా పుట్టినరోజున రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేసి చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకతను చాటుకున్నారు'నమ్మక ద్రోహంకుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాంఅనే నినాదంతో ఏప్రిల్  30 తిరుపతిలో ధర్మపోరాట దీక్ష బహిరంగ సభ నిర్వహించారుఅప్పటికి సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ 2014 ఏప్రిల్‌ 30న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో  ప్రత్యేక హోదా ఇస్తామనిరాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఆ రోజు  అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారుఆ తరువాత మే 22న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కశాశాల మైదానంలో జూన్ 29  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలోజూలై  29  ఒంగోలులోసెప్టెంబర్ 29న తాడేపల్లిగూడెంలోఅక్బోబర్ 30న కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం సమీపంలోనవంబర్ 20 నెల్లూరు ఎస్ విజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లోడిసెంబర్ 26న అనంతపురంలో ధర్మపోరాట దీక్షలు చేశారుకేంద్ర ఉలిక్కిపడేలా సభలు నిర్వహించారుఅన్ని చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మంత్రులుఎమ్మెల్యేలుఎమ్మెల్సీలుఇతర ప్రజాప్రతినిధులుకార్యకర్తలుజనం భారీ స్థాయిలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారుఅన్ని సభలలో ప్రత్యేక హోదావిభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి చంద్రబాబు నాయుడు నిరసన తెలిపారు. పక్షపాత ధోరణిని ఎండగట్టారురాజధాని అమరావతిపోలవరం బహుళార్ధ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులివ్వాలనికడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనివిశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు ప్రత్యేక హోదా ఉండి ఉంటే 90 శాతం గ్రాంటు వచ్చేదని,    11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారనిఏపీకి ఎందుకివ్వరుఅని  ప్రశ్నించారునవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైనన్యాయమైన హామీలని, వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత  అని పేర్కొన్నారుఅమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారనిసర్దార్‌పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారని వివరించారు.   కేంద్ర నమ్మకద్రోహంకుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు.  ఫిబ్రవరి 11న  దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ధర్మపోరాట దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాన్ని మరో సారి మారు  మ్రోగించారు. దీక్షకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ‘‘నాకు గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం. 5 కోట్ల  ఆంధ్ర ప్రజల ప్రతినిధిని, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడినినేను కోరేది నాకు న్యాయం చేయమని కాదునా రాష్ట్రానికి న్యాయం చేయమనిమా హక్కులు నెరవేర్చమనివిభజన చట్టంలో ఉన్న 18 అంశాలు అమలు చేయమని నేను డిమాండ్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారురాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసిన చంద్రబాబు హస్తినలో కూడా దీక్ష చేసి ప్రత్యేక హోదా అంశానికి జాతీయ స్థాయి ప్రాధాన్యత కల్పించారుపార్లమెంట్ స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలో ముఖ్యమంత్రి హోదాలో  దీక్ష చేసి జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారుదేశం నలుమూలల నుంచి  జాతీయ స్థాయి నేతలురాజకీయ ఉద్దండులు మన్మోహన్ సింగ్దేవెగౌడఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ మూలాయం సింగ్శరద్ యాదవ్, రాహుల్ గాంధీ కేజ్రీవాల్శత్రుఘ్న సిన్హా  వంటి వారు  కదిలివచ్చి మద్దతు తెలిపారు అయితే రాష్ట్రం కోసం జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఉభయ కమ్యూనిస్టులువైఎస్ఆర్ కాంగ్రెస్, కొత్త పార్టీ జనసేన మద్దతు ప్రకటించలేదు 
  
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ – 9440222914




Feb 13, 2019


ప్రజా రాజధాని అమరావతి పుస్తకం ఆవిష్కరించిన సీఎం

       
సచివాలయం, ఫిబ్రవరి 13  :  సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రాసిన ప్రజా రాజధాని అమరావతిపుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం సచివాలయంలోని 1వ బ్లాక్ లో  ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుంచి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల  ఏర్పాటు, ల్యాండ్ పూలింగ్ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నిటినీ ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్ కాంప్లెక్స్ భవనం, విట్ భవనాల వరకు అన్ని ఫొటోలు ఇందులో ఉన్నాయి. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి అభినందించారు.

రాష్ట్రం కోసం దీక్ష చేస్తే, ఖర్చులపై దుష్ప్రచారం
మంత్రి కాలవ శ్రీనివాసులు

                  సచివాలయం, ఫిబ్రవరి 13: రాష్ట్రం కోసం ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్ష ఖర్చుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల వారు ఈ దీక్షలో పాల్గొన్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి ఒకటి, రాయలసీమ నుంచి ఒకటి రెండు రైళ్లు పెట్టామన్నారు. రైళ్లకు రూ.కోటీ 23 లక్షలు,  ఏపీ భవన్‌లో రూ. కోటీ 60 లక్షలు మొత్తం రూ.2 కోట్ల 83 లక్షలు ఖర్చయినట్లు మంత్రి వివరించారు. అయితే ప్రతిపక్షాలు రూ.10 కోట్లు ఖర్చయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వారి విమర్శ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుందన్నారు.    మనం రాష్ట్రం కోసం ఈ దీక్ష చేశామని చెప్పారు. 2011 సెప్టెంబరు 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ సద్భావన మిషన్పేరుతో మూడు రోజుల పాటు చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష ఖర్చు కంటే చాలా ఎక్కువన్నారు. అది ఆయన తన సొంతానికి, పార్టీ ప్రయోజనాల కోసం చేసిన దీక్షగా పేర్కొన్నారు.   మన ధర్మపోరాటం ఏపీకి చెందిన ఐదు కోట్ల ప్రజల కోసం చేసిన దీక్ష అని మంత్రి కాలవ అన్నారు.


రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు
మంత్రి మండలి నిర్ణయం
Ø ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు
Ø ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్
                    సచివాలయం, ఫిబ్రవరి 13: వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయం 1వ బ్లాక్ లో సమావేశమైన మంత్రి మండలి నిర్ణయించింది. సమావేశం అనంతరం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మంత్రి మండలి నిర్ణయాలను వివరించారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు సమగ్ర విధానం రూపొందించడానికి, వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఉద్దేశించి ఈ మండలి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా  మండలిలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇకపై అగ్రికల్చర్, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరన్నారు. వీరి సర్వీసులను పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటివరకు లేదని చెప్పారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయ విద్య మరింత నాణ్యత, నైపుణ్యత, సాంకేతికతతో కూడిన విధంగా చేయడానికి ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారి సర్టిఫికేట్లు పరిశీలించి నకిలీ సర్టిఫికేట్లను ఏరివేసే కార్యక్రమం కూడా మండలి చేపడుతుందన్నారు. వ్యవసాయ కోర్సులను నిర్వహించే కళాశాలలకు సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా సక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారా లేదా సర్టిఫికేట్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా తదితర అంశాలను తనిఖీ చేసే పూర్తి అధికారం వ్యవసాయ మండలికి ఉంటుందని, ఇది చట్టబద్ధత కలిగి  ఉంటుందని వివరించారు. ప్రభుత్వ గుర్తింపు పొందే కళాశాలలను ఈ మండలి సిఫారసు చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఉద్యాన విద్యలో ప్రమాణాలు మరింత పెరగడానికి కొత్తగా ఏర్పాటయ్యే మండలి ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు.  అందరికీ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సిమ్ కార్డుతో పాటు 3 ఏళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు.  అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రూ.10 వేలు  ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కేంద్ర నిబంధన ప్రకారం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రూ.6 వేలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇస్తుందని చెప్పారు. కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ శాఖ అధికారులు విధివిధానాలు రూపొందిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలు ఉన్నాయని,  5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది రైతులు ఉన్నారని వివరించారు. ఫిబ్రవరి చివరలోనే అన్నదాత సుఖీభవచెక్కుల పంపిణీ చేస్తామన్నారు.  రైతు రుణ మాఫీ  చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబానికి రూ.10వేలు చొప్పున ఇవ్వడం ద్వారా రైతులకు మొత్తం రూ.7,621 కోట్ల లబ్ది చేకూరుతుందని చెప్పారు.

                గ్రామ పంచాయతీలలోని కంటింజెన్సీ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.  1998లో డీఎస్సీ లో అర్హత పొందిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే, 2008లో డీఈడీ, బీఈడీ  అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించిందన్నారు.  గత మంత్రి మండలి సమావేశంలో 31 ఆస్పత్రులలో పడకలను పెంచాలని నిర్ణయించగా, ఈసారి మరో 22 ఆస్పత్రుల స్థాయి పెంచాలని, ఐఏఎస్ అధికారులు, ఎన్జీవోలు,ఉద్యోగులకు  ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు కూడా అమరావతిలో నామమాత్రపు ధరకు 30 ఎకరాలు ఇవ్వాలని, డబ్బు మొత్తం రెండేళ్లలో మూడు వాయిదాలలో చెల్లించడానికి అవకాశం కల్పించారని,  మొదటి వాయిదా చెల్లించిన వెంటనే భూమిని స్వాధీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 9 పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, 9 ఫిషరీస్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి ఈ కళాశాలలు ప్రారంభం అవుతాయన్నారు.  
ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.కోటీ 23లక్షలు,  ఏపీ భవన్‌లో అయ్యింది రూ. కోటీ 60 లక్షలు) మొత్తం రూ.2 కోట్ల 83 లక్షలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
వక్కలిగ రిజర్వేషన్ల పరిధి చిత్తూరు వరకు పెంపు
              బీసీ(బి)లో ఉన్న వక్కలిగ/కుంచటిగ సామాజిక వర్గానికి ఇచ్చే రిజర్వేషన్ చిత్తూరు జిల్లాలో వున్న వారికి కూడా వర్తింపు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఈ కులాల జనాభా 5 లక్షల  మంది అని తెలిపారు. ఎక్కువ మంది అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో ఉన్నారని చెప్పారు.       ఇంత వరకు పరిశ్రమల శాఖలో వున్న లిడ్‌క్యాప్ ఇకపై సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ పరిధిలో పనిచేస్తుందని చెప్పారు. సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పరిధిలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీలో ఒక గెజిటెడ్ లైబ్రేరియన్ పోస్టు,         78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు  9 సీనియర్ అసిస్టెంట్స్, 28  డేటా ఎంట్రీ ఆపరేటర్లు,  28 మంది శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయించామన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి హయాంలో 1954లో వైకుంఠపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారని,  అప్పటి నుంచి డెల్టా ప్రజల ఆకాంక్ష అదని, ఈరోజు దానిని నెరవేర్చడంపై ఆయకట్టు రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ విషయమై మంత్రి మండలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ తీర్మానం చేసినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.

Feb 12, 2019


13న ఉదయం 8 గంటలకే  మంత్రి మండలి సమావేశం
            సచివాలయం,ఫిబ్రవరి 11: ఈ నెల 13వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగవలసిన మంత్రి మండలి సమావేశం ఉదయం 8 గంటలకే జరుగుతుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా ఉద్యమం ఉదృతం


Ø రాష్ట్రం నుంచి హస్తినకు చేరిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష
Ø బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడంలో విజయం
Ø 68 ఏళ్ల వయసులో కూడా పోరాట పటిమ ప్రదర్శన

              ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉదృతం చేశారు.  దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదం మరో సారి మారు  మ్రోగింది.  కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన ఏపీ భవన్‌ వేదికగా సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. రాష్ట్ర సమస్యకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టువదలసి విక్రమార్కుడిలా 68 ఏళ్ల వయసులో  ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు ‘‘నాకు గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం. 5 కోట్ల  ఆంధ్ర ప్రజల ప్రతినిధిని, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడిని. నేను కోరేది నాకు న్యాయం చేయమని కాదునా రాష్ట్రానికి న్యాయం చేయమని. మా హక్కులు నెరవేర్చమనివిభజన చట్టంలో ఉన్న 18 అంశాలు అమలు చేయమని నేను డిమాండ్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. మంత్రులుఎమ్మెల్యేలుకార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ధర్మపోరాట దీక్షలో పాల్గొనడం విశేషం. చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్‌తృణమూల్‌ కాంగ్రెస్‌ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, వామపక్షాలతో సహా దాదాపు 22 రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించాయి. రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లాతో సహా పలువురు నేతలు కూడా దీక్షా శిబిరానికి తరలి వచ్చి మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో ప్రతిపక్ష నేత హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయమని ఆయన ఇక్కడ  నుంచే  వారం రోజులు దీక్ష చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో హామీలు నెరవేర్చమని ఒక రోజు దీక్ష చేశారు. పార్లమెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన దీక్ష చేసి జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం విషయంలో జాతీయ స్థాయిలో అందోళన చేయడంతోపాటు బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడంలో ఆయన విజయం సాధించారు.  

పుట్టిన రోజు విజయవాడలో నిరాహార దీక్ష
              సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, ప్రత్యేక హోదా కోసం ఆయన రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ధర్మపోరాట దీక్షలు చేశారు. ఈ దీక్షలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని మద్దతు తెలిపారు. అన్ని ధర్మపోరాట దీక్ష సభలలో  గత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా వచ్చిన మోడీ తిరుపతిలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను ప్రదర్శించారుతొలుత సీఎం చంద్రబాబు నాయుడు  2018 ఏప్రిల్ 20 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూనవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైనన్యాయమైన హామీలు. వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత!’  అని పేర్కొన్నారు. ప్రత్యేక హౌదావిభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసన తెలిపారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున ఈ దీక్ష చేపట్టినట్లు చెప్పారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. పుట్టిన రోజువేడుకలకు దూరంగా ఉండాలనిఆ రోజంతా నిరాహారంతో దీక్ష చేశారు. పుట్టినరోజున ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేయడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ  రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంమోదీ సర్కారు వైఖరికి నిరసనగా  పుట్టిన రోజున నిరాహార దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.  తిరుపతిలో వెంకటేశ్వరుడి నామాలను చూస్తూ మోదీ మనకు ప్రత్యేక హోదాతో సహా ఎన్నో హామీలు ఇచ్చారు. వాటికి తిలోదకాలు ఇచ్చిన తీరును ఎండగడుతూ నమ్మకద్రోహంకుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు దీక్ష చేపట్టినట్లు చెప్పారు.  రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు. ఓట్లు అడిగేందుకు ప్రతిపక్ష నేత జగన్‌కు ఏ అర్హత ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడమేనా వారి అర్హత అని అడిగారు. ‘‘కొన్ని పార్టీలు ముసుగు వేసుకున్నాయి. ఆ ముసుగు వీరులకు మోదీ అండదండలున్నాయి. ఏపీ విషయంలో మాటమీద నిలబడకుండా ముసుగు వీరుల మాటలు విన్నారు. మునిగిపోతారు. ఈ ముసుగు వీరుల బండారం బయటపడుతుంది’’అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  రాష్ట్రంలో మొత్తం 25మంది ఎంపీలు టీడీపీ తరపున గెలిస్తే  మనం చెప్పిన ప్రభుత్వమే ఢిల్లీలో ఉంటుందన్నారు. భవిష్యత్తులో కేంద్రంలో చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. మనం గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. విభజన చట్టం అమలు చేయాలనిరాజ్యసభలో ఇచ్చిన హామీల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.  పసిబిడ్డలాంటి రాష్ట్రానికి సకాలంలో అందాల్సిన సహాయం అందకపోతే నష్టపోతామన్నదే తన భయంగా పేర్కొన్నారు. ఆ నాడు చంద్రబాబుకు చంద్రబాబుకు మద్దతుగా 13జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు.
పలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
 తిరుపతిలో
               రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై 2018 ఏప్రిల్  30 'నమ్మక ద్రోహంకుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాంఅనే నినాదంతో తిరుపతిలో ధర్మపోరాట దీక్ష బహిరంగ సభ నిర్వహించారు. అప్పటికి సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన నరేంద్ర మోడీ 2014 ఏప్రిల్‌ 30న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో  ప్రత్యేక హోదా ఇస్తామనిరాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఆ రోజు  అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం  చంద్రబాబు మాట్లాడుతూ  మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ఎండగట్టారు. ఢిల్లీలో ప్రధాని ఉలిక్కిపడేలా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని  హెచ్చరించారు. తాను ప్రధానిపైనాకేంద్రంపై పోరాడుతుంటే,  కలిసి రావాల్సింది పోయి కొందరు తనను విమర్శిస్తున్నారన్నారు. ఎప్పుడూ మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ కూడా తనను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీకి ఎవరిపైనా కోపం లేదని,పొట్టకొట్టినప్పుడు తిరగబడుతామని చంద్రబాబు కేంద్రాన్ని  హెచ్చరించారు.

  విశాఖపట్నంలో
         నమ్మకద్రోహం, కుటిల రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2018 మే 22న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కశాశాల మైదానంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నదని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రజలంతా మద్దతు తెలపాలని ఆ సందర్భంగా ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసి, కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా  రైల్వే జోన్‌తోపాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ దీక్షలు నిర్వహించి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. 

కాకినాడలో
            రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన తెలుగుదేశం పార్టీ ఆ తరువాత విభజన హామీల అమలుకు కేంద్రంపై వత్తిడి పెంచుతూ వచ్చింది.  అందులో భాగంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2018 జూన్ 29  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించింది.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భావితరాల  భవిష్యత్తు కోసమే ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తే వదిలే ప్రసక్తే లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రానికి అన్యాయం చేసినవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లడిగే బీజేపీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తే ఏమనుకోవాలన్నారు.  ఢిల్లీని తలదన్నే రాజధానికి సహకరిస్తానన్న ప్రధాని మోడి అమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని, సర్దార్‌పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారని వివరించారు.  ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వరని అడిగారు.  పిడికిలి బిగించి పోరాడుదాం, విజయం మనదే అని కాకినాడ వేదికగా చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

ఒంగోలులో
                ప్రత్యేక హోదావిభజన హామీలు అమలు కోసం 2018 జూలై  29
టీడీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేశారు. సందర్శంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పై మరోసారి నిప్పులు చెరిగారు. ‘ప్రధాని మోడీ కంటే ముందే నేను సీఎం అయ్యాను. తొమ్మిదేళ్లు నిరంతరాయంగా ప్రజలకు సేవలందించాను. ఇప్పుడాయన నాకు పరిపక్వత లేదంటున్నారు. పరిపక్వత లేనిది నాకా.. మీకాఎవరి పరిపక్వత ఎంతో తేల్చుకుందాం రండి’ అని  సవాల్‌ విసిరారు. గత ఎన్నికలకు ముందు నల్లధనాన్ని వెలికితీస్తాననిఅవినీతి సొమ్మును జప్తు చేస్తానని ప్రగల్భాలు పలికిన మోదీ  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆస్తులను ఎందుకు జప్తు
చేయలేదని ప్రశ్నించారు. దెబ్బతగిలిన చోటే కారంపూసి ఆనందించే శాడిస్టు మనస్తత్వంతో కేంద్రం వ్యవహరిస్తోందని సీఎం మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజీలేని పోరాటం చేస్తామని
హెచ్చరించారు. కేంద్రం నమ్మించి మోసం చేసిందన్నారు.  విషయమై పార్లమెంటు లోపలవెలుపల బీజేపీ తీరునుమోదీ వైఖరిని ఎండగట్టాం. కుట్ర రాజకీయాలపై  ధర్మపోరాటం  ప్రారంభించామనిఒంగోలు సభతో నాలుగు సభలు పూర్తయ్యాయని,12 సభలు పూర్తయ్యేలోపు ఆ
పార్టీలను బంగాళాఖాతంలో కలిపేద్దామన్నారు.  రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీలు పార్లమెంటులో సమర్థంగా తమ గళం వినిపించారని వారిని అభినందించారు. ఒక రాష్ట్ర సమస్య కోసంఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశంలోనే మొదటిసారని చెప్పారు.  టీడీపీ ఈ చరిత్రను సృష్టించిందన్నారు.    తెలుగుదేశం పార్టీ ఏమిటోతెలుగోడి సత్తా ఏమిటో మోడీకి కర్ణాటక ఎన్నికల్లో కొద్దిగానే కనిపించిందని2019 ఎన్నికల్లో పూర్తిగా  చూపిస్తామని హెచ్చరించారు.

తాడేపల్లిగూడెంలో
                  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ సాధన, రాజధానికి నిధుల విడుదల కోరుతూ 2018 సెప్టెంబర్ 29న టీడీపీ ఆధ్వర్యంలో  తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ  విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. హోదా ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని,  నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉండి ఉంటే 90 శాతం గ్రాంటు వచ్చేదని,  రాష్ట్రానికి ఇచ్చిన రూ.1500 కోట్లతో ఎలక్ట్రిసిటీ కేబుల్‌ కూడా రాదన్నారు.  11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏపీకి ఎందుకివ్వరు? అని  ప్రశ్నించారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు కర్మాగారం రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని విమర్శించారు.  ఇతర నగరాల్లో ర్యాపిడ్‌, బుల్లెట్‌ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారని, విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం తాము చేసే పోరాటంలో అంతిమంగా గెలిచేది ధర్మం, న్యాయమేనని చంద్రబాబు పేర్కొన్నారు.  అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందన్నారు. దేశంలో ఎవరికీ సాధ్యం కానివిధంగా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.  మన కలల రాజధాని అమరావతిని దేశంలో అన్ని నగరాల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తాడేపల్లిగూడెం సభకు టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  జనం భారీగా రావడంతో పట్టణం చివరన పొలాల్లో సభ పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు.

ప్రొద్దుటూరులో
             ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను గాలికొదిలేసి జనాల్ని మభ్యపెట్టిన కేంద్రానికి చెంపపెట్టులా 2018 అక్బోబర్ 30న టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు  కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్ష చేశారు.  పట్టణంలోని బొల్లవరం సమీపంలో 86 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారీ సభావేదిక వద్దకు అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిలో శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా ఏపీకి అండగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారని, కానీ మోదీ ఏపీకి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.   మోదీ చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.      తాము కొత్తగా ఏమీ కోరటంలేదని,  విభజన చట్టంలోని  హమీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో పోరాడిన ఏకైక పార్టీ టీడీపీనేనని తెలిపారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంటులో బీజేపీ డిమాండ్‌ చేసిందని,   ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారని వివరించారు.  ఒక ప్రధాని ఇచ్చిన హామీని మరో ప్రధాని నెరవేర్చవలసిన బాధ్యత లేదా? అని  ప్రశ్నించారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి ప్రధాని మోడీ చేతులుదులుపుకున్నారన్నారు.  విశాఖ రైల్వేజోన్‌ విషయలో కూడా  మోసం చేశారని మండిపడ్డారు. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఈ విధంగా నిధులు ఇస్తే 30 ఏళ్లయినా నిర్మాణాలు పూర్తి కావని సీఎం అన్నారు.

నెల్లూరులో
                నెల్లూరు ఎస్ విజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో 2018 నవంబర్ 20న టీడీపీ
ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ  రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలపడానికే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టడంలో సహకరించిన బీజేపీ హామీలను  అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ సభకు జనం భారీ సంఖ్యలో ప్రత్యేక వాహనాలలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో కొందరు జాతీయ రహదారిపై నిలబడగా, మరి కొందరు వెనుతిరిగి వెళ్లిపోయారు. అంటే ఆ స్థాయిలో జనం హాజరయ్యారు.

అనంతపురంలో
           ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2018 డిసెంబర్ 26న అనంతపురంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీకి కేంద్రం ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.  విభజన తర్వాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అప్పట్లో బీజేపీతో చేయి కలపాల్సివచ్చిందని చెప్పారు.  విభజన హామీల అమలు కోసం నాలుగేళ్ల పాటు వేచి చూశామన్నారు. రోజులు గడుస్తున్నా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి  సాయం అందించలేదని చెప్పారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనే ఉద్దేశంతోనే ఎన్టీయే  నుంచి బయటికి వచ్చామని  వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాయ మాటలు చెప్పారన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అడిగితే ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు.  ఢిల్లీని తలదన్నే విధంగా ఏపీ రాజధాని నిర్మిస్తామని ధీమాగా చెప్పారు.  మట్టి నీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తామన్నా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేదని చెప్పారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించలేదన్నారు.  రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడితే ఐటీ అధికారులతో దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు.  ప్రధాని మోడీ మన మీద పెత్తనం మాత్రమే కోరుకుంటున్నారని, మనం బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు హస్తినలో కూడా దీక్ష చేసి తెలుగువారి సత్తా చాటారు. యావత్ దేశం దృష్టి ఏపీకి ప్రత్యేక హోదాపై నిలిచేలా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వేల మంది దీక్షలో పాల్గొన్నారు.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...