Feb 3, 2019



వేగంగా నిర్మించిన
తాత్కాలిక హైకోర్టు భవనం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రశంసలు
సచివాలయం, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టుని ఆధునిక టెక్నాలజీతో చాలా వేగంగా 192 రోజుల్లో నిర్మించారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రశంసించారు. రాజధాని అమరావతిలోని నేలపాడులో నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్ లో ఆదివారం మధ్యాహ్నం ఆయన తాత్కాలిక హైకోర్టుని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ శాశ్విత హైకోర్టు భవనం కూడా ఇంతేవేగంగా నిర్మించాలన్నారు.  హైకోర్టు నిర్మాణం, తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుపై   సీఎంను అభినందించాల్సిన పనిలేదని, రాజ్యాంగపరమైన అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారన్నారు. ఏపీ తాత్కాలిక హైకోర్టును ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఆనందకరమైన క్షణంగా పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అయితే ఈ కేసులను పెండింగ్ అనడానికి వీలులేదన్నారు. వీటిలో  25 లక్షల  కేసులు  పదేళ్లనాటివని,  81 లక్షల కేసులు ఏడాది లోపు ఫైల్ అయినవేనని, 50 లక్షలు పెట్టీ కేసులని వివరించారు. పెట్టీ కేసులు  పరిష్కరించడం తక్షణ కర్తవ్యంగా పేర్కొన్నారు.  వీటిపై న్యాయ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  దేశంలోని  హైకోర్టులు పెట్టీ కేసుల పరిష్కరంలో చొరవ చూపాలన్నారు. పెండింగ్ కేసులు భారీగా ఉండటానికి  జడ్జీ పోస్ట్ లు ఖాళీగా ఉండటం ఒక కారణంగా పేర్కొన్నారు. జిల్లా కోర్టుల్లో  5 వేల  జడ్జీ, సబ్ ఆర్డినెట్ జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. హైకోర్టులలో  392 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి  సంబంధించి హై కోర్టుల నుంచి సిఫార్సు లు రావడం లేదన్నారు. హైకోర్టులు జడ్జి పోస్టుల ఖాళీలపై త్వరగా సిఫార్సు లు పంపాలని చెప్పారు.  సుప్రీంకోర్టులో వంద జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని  వారంలోపు భర్తీ చేస్తామన్నారు. పెండింగ్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు జడ్జీలు, న్యాయవాదులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. న్యాయ వ్యవస్థను న్యాయముర్తులు, న్యాయవాదులు రక్షించాలన్నారు. న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి అన్నారు.
అమరావతి నిర్మాణంలో ఇది ఓ ప్రధాన ఘట్టం
రాజధాని అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవనం ప్రారంభం ఓ ప్రధాన ఘట్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  చారిత్ర ఘట్టంలో భాగస్వాములైన అందరికీ  ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని, రాజధానికి భూములు ఇచ్చి సహకరించిన రైతులందికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34 వేల ఎకరాల భూమి త్యాగం చేశారన్నారు. రైతుల త్యాగం వృథాకాకుండా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అమరావతిలో నిర్మించే నవనగరాల్లో న్యాయనగరం కూడా ఒకటని తెలిపారు. బౌద్ధ స్థూపాకారంలో అద్భుతరీతిలో న్యాయనగరం నిర్మిస్తామన్నారు. న్యాయనగరంలో న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తామని చెప్పారు.  ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు కూడా దోహదం చేస్తాయని పేర్కొన్నారు.2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా, 2030 నాటికి అగ్ర రాష్ట్రంగా,  2050 నాటికి ప్రపంచంలోనే అత్యత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు కూడా తమ ప్రణాళికలో భాగంగా పేర్కొన్నారు.  ఇక్కడకు వచ్చే అతిథులను అమరావతి అందాలు ఆకట్టుకుంటాయని చెప్పారు.  హైదరాబాద్ లో నల్సార్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశానని,  అమరావతిలో కూడా నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలని కోరారు.  భూమితోపాటు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అమరావతిలో ఉండే న్యాయాధికారులు, సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని చెప్పారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. హైకోర్టు ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
                   సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా అభినందించారు. రైతుల త్యాగాన్ని ముందు తరాలు గుర్తుంచుకుంటాయన్నారు. ఇది ఓ చరిత్రాత్మకమైన రోజుగా పేర్కొన్నారు. అమరావతి కొత్త రాజధాని ఏమీ కాదని, దీనికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. శాతవాహనుల కాలంతో ధాన్యకటకంగా పేరొందిందని చెప్పారు. బౌద్ధులు నడయాడిన నేల ఇదని,  ప్రేమ, కరుణ, క్షమకు నిలయంగా ఉందన్నారు. మళ్లీ కొంత్త అధ్యాయం మొదలైందన్నారు. తాత్కాలిక హైకోర్టుని అత్యంత వేగంగా నిర్మించినందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎల్.నాగేశ్వర రావు మాట్లాడుతూ తాను గుంటూరులో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు, మరో 9 మంది ప్రాణత్యాగం, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు తదితర విషయాలను వివరించారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారందరూ ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ మద్రాస్ ప్రసిడెన్సీ నుంచి హైకోర్టు విడిపోయి, గుంటూరులో ఏర్పాటు, ఆ తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు, రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ హైకోర్టు ప్రారంభం తదితర విషయాలను వివరించారు. హైకోర్టు నిర్మాణం త్వరగా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
                 తాత్కాలిక హైకోర్టు నిర్మాణ విశిష్టతలు తెలిపే ఏవీని స్క్రీన్ పై ప్రదర్శించారు. అంతకు ముందు తాత్కాలిక హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ ఆవిష్కరించారు. భవనం లోపల గోడపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తితోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర న్యాయమూర్తులు భవనంలో లోపల పలు కోర్టుల హాళ్లను  సందర్శించారు. సభ ప్రారంభంలో అచ్యుత మానస బృందం ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. చివరలో న్యాయమూర్తులందరికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్ఞాపికలు ఇచ్చి, శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ వందన సమర్పణ చేశారు.

                         ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్.సుభాష్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణణ్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి వెంకటరామిరెడ్డి,  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి సతీమణి నృపాంజలి, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,  మంత్రులు కొల్లు రవీంద్ర, డాక్టర్ నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర,  డీజీపీ ఆర్.పి.ఠాకూర్,  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ జి.రామారావు, పలువురు మాజీ న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజధాని రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...