Feb 1, 2019

ఈవీఎంల ట్యాంపరింగ్‌ దుమారం


  దేశానికి ఎన్నికల వేళైంది. ఈ సమయంలో కొత్త రాజకీయ పార్టీలు, రాజకీయ ఫిరాయింపులు, రాజకీయాలు మాట్లాడటం సహజం. కానీ ఈ సారి దేశమంతటా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల ట్యాంపరింగ్‌(దురుద్దేశంతో పాడుచేయడం) పై మాట్లాడుతున్నారు. మాటలు కాదు పెద్ద దుమారమే చెలరేగుతోంది.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది రాజకీయ నాయకులు
ఈవీఎంలను విశ్వసించడంలేదు. వాటి నిర్వహణ, వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తారని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఈవీఎంల ట్యాంపరింగ్ లపై చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు ఊతం ఇచ్చాయి.  ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్-యూరప్ విభాగం  ఇటీవల లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షుజా కాలిఫోర్నియా నుంచి లైవ్ వీడియో ద్వారా మాట్లాడారు. భారత్‌లో 2014 లోక్ సభ ఎన్నికలలలో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్గుజరాత్మధ్యప్రదేశ్, రాజస్థాన్చత్తీస్ గడ్ఢిల్లీలలో రిగ్గింగ్ జరిగినట్లు వివరించారు. అలా చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచిందని చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించారు. 2009 నుంచి 2014 వరకు తాను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) లో పనిచేశానని, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను రూపొందించిన బృందంలో తాను కూడా ఒక సభ్యుడిగా పనిచేసినట్లు షుజా చెప్పారు. ఈ ట్యాంపరింగ్‌ కు కేంద్రం హైదరాబాద్ అని కూడా అతను పేర్కొన్నారు.  2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలుఇటీవల జరిగిన మధ్యప్రదేశ్-ఛత్తీసగఢ్-రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అయితే, తమ బృందం ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం వల్ల బీజేపీ ఓటమిపాలైందన్నారు.  కేంద్ర మంత్రి గోపీనాధ్ ముండే మృతి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలకూ ఈవీఎంల హ్యాకింగ్ కు సంబంధం ఉన్నట్లు కూడా షుజా  సంచలన ఆరోపణలు చేశారు.  అయితే ముందు చెప్పిన విధంగా షుజా ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ ని నిరూపించలేదు. లైవ్ లో చూపిస్తానని చెప్పి చూపించలేదు. సయీద్ షుజా ఆరోపణలను ఈసీఐఎల్  ఖండించింది. అతను తమ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేయలేదనితాము సేవలు పొందుతున్న ఇతర సంస్థల్లో కూడా పనిచేయలేదని స్పష్టం చేసింది.  షుజా ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తీవ్రస్థాయిలో స్పందించింది. అతనిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో,కట్టుదిట్టమైన భద్రతనిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలకు తావులేదని ఈసీ పేర్కొంది. 2010లో నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేసినట్లు  తెలిపింది. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కానేకాదని స్పష్టం చేసింది. ఈవీఎం అనేది ఓట్లను నమోదు చేసే యంత్రం మాత్రమేననిదానిని ఎవరూ నియంత్రించ లేరని (ప్రోగ్రామ్‌ చేయలేరని) ఎన్నిక ప్రధాన అధికారి(సీఈసీ) సునీల్ అరోరా  స్పష్టం చేశారు.  డిల్లీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో   ఫలితాలు భిన్నంగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలలో మళ్లీ  బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. 

                   మానవుడు విజ్ఙానవంతుడైన దగ్గర నుంచి ఓ పక్క సౌకర్యాలు పెరుగుతుంటే, మరో పక్క ప్రమాదాలు కూడా ముంచుకొస్తున్నాయి. అణు విజ్ఞానం మానవాళికి అపారమైన అనుభవం మిగిల్సింది. అమెరికా హిరోషిమా, నాగసాకీ నగరాలపై అణుబాంబుని ఉపయోగించడం వల్ల ఆ రెండు నగరాలు శవాల దిబ్బలయ్యాయి. వందేళ్లపాటు ఆ నేలపై మొక్క మొలవకుండా చేశారు. అదే అణు విజ్ఞానాన్ని మానవాళి సుఖంగా జీవించడానికి కూడా వినియోగించవచ్చు. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న అణు ఆయుధాలతో ప్రపంచం మొత్తం విద్యుత్ వెలుగులు నింపవచ్చు. నిరంతరం పరిశ్రమలను నడపవచ్చు. మనిషి ఆలోచనా విధానాలకు, వికృత చేష్టలకు నిదర్శనాలు ఇవి. నేటి ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో బ్యాంకులకు వెళ్లకుండా దేశంలో ఎక్కడైనా ఏటీఎంల ద్వారా డబ్బు డ్రా చేసుకోగలుగుతున్నాం. మరో పక్క కొందరు ఆ విజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు ఎన్ని జరుగుతున్నాయో అంతకు మించి వాటిని దుర్వినియోగం చేసేవారు కూడా తయారవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగిస్తున్నారో పరిశీలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యమేమీ కాదని అర్ధమవుతోంది. ప్రపంచం వ్యాప్తంగా 120 దేశాల్లో వీటిని వినియోగించడంలేదు. 20 దేశాలలో మాత్రమే వినియోగిస్తున్నారు.  పలువురు సీనియర్ రాజకీయ నేతలతోపాటు  టెక్నాలజీని ప్రమోట్ చేసే చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారంటే ఆలోచించవలసిన విషయమే. ప్రజాస్వామ్యాన్ని యంత్రాలపై ఆధారపడేలా చేయడం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడతామని కూడా ఆయన  స్పష్టం చేశారు. దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  బ్యాలెట్‌తో పోలింగ్ నిర్వహించాలని  బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఛాలెంజ్ విసిరారు. ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్టా వచ్చే ఎన్నికలలో బ్యాలెట్ లనే వినియోగించాలని జాతీయ స్థాయిలో 22 బీజేపీయేతర పార్టీల ప్రతినిధులు త్వరలో ఎన్నికల సంఘాన్ని కలిసి కోరనున్నాయి. ఈవీఎంలపై ఇన్ని అనుమానాలు, ఇంత దుమారం రేగుతున్న సమయంలో ఎన్నికల సంఘం బాధ్యత మరింత పెరుగుతోంది. రాజకీయ పరంగా ఈవీఎంలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నందున ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బ్యాలెట్ల అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలించాలి. ఒక వేళ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వాటినే వినియోగించినా  తగిన జాగ్రత్తలు, గట్టి భద్రతా చర్యలు తీసుకోవలసిన అవసరం ఈసీఐపై ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...