Jun 26, 2018


3 గ్రామాలు తరలించాలని నిర్ణయం
ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రులు కిమిడి, సోమిరెడ్డి సమీక్ష

Ø అదనంగా నిధులు డిపాజిట్ చేయడానికి కంపెనీల అంగీకారం
Ø 36 ఇళ్లకు అదనంగా రూ.3 లక్షలు చొప్పున చెల్లింపు
Ø కాలుష్య నియంత్రణకు కమిటీ
Ø సీఎస్ఆర్ ఫండ్ కలెక్టర్ వద్ద డిపాజిట్
Ø పరిశ్రమలను ప్రోత్సహిస్తాం - నియమ నిబంధనలు పాటించాలి

            సచివాలయం, జూన్ 26: నెల్లూరు జిల్లా కృపట్నం పోర్టు పరిధిలో విద్యుత్  ప్రాజెక్టుల నిర్మాణానికి మూడు గ్రామాలను తరలించాలని విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళావెంకట రావు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి నిర్ణయించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని విద్యుత్ శాఖ మంత్రి పేషీలోని సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం సంబంధిత అధికారులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నూలటూరుపాడు, నేలటూరుపాలెం, ఎస్సీ కాలనీలను తరలించాలని నిర్ణయించారు. అందుకోసం అదనంగా డిపాజిట్ చేయడానికి జెన్ కో, ఎన్ సీసీ, ఎన్పీసీఐఎల్ (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రతినిధులు అంగీకరించారు. టెండర్లు పిలిచేంతవరకు అక్కడ నివశించే కుటుంబాలకు నెలకు రూ.2500లు, 30 కిలోల బియ్యం ఇవ్వడానికి కూడా వారు అంగీకారం తెలిపారు. నక్కలమిట్టలోని 36 ఇళ్లకు ఒక్కోదానికి అదనంగా రూ.3 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. కంపెనీలు తమ లాభాలలో సీఎస్ఆర్(కార్పోరేట్ సోషల్ రెస్సాన్సబిలిటీ) ఫండ్ 2 శాతం కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. కంపెనీల చట్టం ప్రకారం కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు, సీఎస్ఆర్ డిపాజిట్ చేయడానికి కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కంపెనీల ప్రతినిధులకు చెప్పారు.  కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుని మంత్రులు ఆదేశించారు. అందుకు  ఒక కమిటీని నియమించి చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఏపీపీడీసీఎల్ ఎస్ఈ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంర్థక శాఖల జెడీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఆ కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. చివరగా మంత్రి కళా వెంటక రావు మాట్లాడుతూ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నది తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. పరిశ్రమలు రావడానికి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని, అయితే పరిశ్రమలు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నియమనిబంధనలు పాటించవలసి అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

దళితుల దశ, దిశ మార్చిన చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యుడు దేవతోటి

            
   సచివాలయం, జూన్ 26: దళితుల దశ, దిశ మార్చింది ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యుడు దేవతోటి నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ పున్నయ్య చౌదరి సూచనలను కూడా ఆయన అమలు చేశారన్నారు. వైఎస్ హయాంలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పులివెందుల, ఇడుపులపాయ, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వినియోగించారని తెలిపారు. గత ప్రభుత్వం 2007 నుంచి 2014 వరకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ ని నియమించలేదని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ నేత మద్దతు పలుకుతూ దళిత హక్కులను కాలరాయడానికి పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఎస్సీలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇన్నొవా కార్లు, ట్రాక్టర్లు, భూమి కొనుగోలు పథకం, చంద్రన్న పెళ్లి కానుక, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం వంటి పథకాలు దళితుల అభ్యున్నతికి  కొనసాగిస్తున్నారని వివరించారు. నవ్యాంధ్ర నిర్మాణంలో దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో దళిత నాయకులు, మేథావులతో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోనే ఈ నెల 30న నెల్లూరులో ‘దళిత తేజం - తెలుగుదేశం పార్టీ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత మేథావులు, కవులు, కళాకారులు, రచయితలు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని దేవతోటి కోరారు.

Jun 25, 2018


11వ పీఆర్సీ కార్యదర్శిగా పాపారావు నియామకం

                 సచివాలయం, జూన్ 25: 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) కార్యదర్శిగా కెవిఎస్ కెఎస్  పాపారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీకి సహకరించేందుకు ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి కలిగిన కార్యదర్శితోపాటు ఇతర సిబ్బందిని మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి పాపారావుతోపాటు అధికారులు, సిబ్బంది  పీఆర్సీతోపాటు ఆర్థిక శాఖలోని ఇతర అంశాలకు సంబంధించిన పనులను కేటాయించినట్లు ఆయన వివరించారు.

సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం

దేవాలయ కేశఖండన కార్మికుల జేఏసీ
                  సచివాలయం, జూన్ 25: తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని దేవాలయ కేశఖండన కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లో సోమవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడారు. కనీస వేతనాల కోసం తాము జూన్ 1 నుంచి ఆదోళన చేస్తున్నట్ల తెలిపారు. 15వ తేదీ నుంచి కత్తి డౌన్ కార్యక్రమం మొదలు పెట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రెండవసారి మాట్లాడినప్పుడు తమ సమస్యలను పరిష్కరిస్తామని, సమస్యలను అధ్యయనం చేయడానికి ఎమ్మెల్సీ జనార్ధన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ రోజు జనార్ధన్  తమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శి ఎం.గిరిజా శంకర్ వద్దకు తీసుకువెళ్లారని చెప్పారు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరిగినట్లు తెలిపారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. 8 ఆలయాల్లో మిగులు ఆదాయం ఉంటుందని, ఆ దేవాలయాల్లో తమని ఉద్యోగులుగా గుర్తించి కనీసం రూ.15వేలు వేతనం ఇవ్వమని కోరుతున్నట్లు తెలిపారు. కనీస వేతనాలు ఇస్తే ఈఎస్ఐ, ఈపీఎఫ్ వస్తాయని చెప్పారు.  తమ సమస్యలన్నీ గిరిజా శంకర్ విన్నారని చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ సెలవులో ఉన్నారని, ఆమె రాగానే మళ్లీ మరోసారి చర్చలకు పిలుస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున తాము ఆదోళన విరమించినట్లు తెలిపారు. నాయీ బ్రాహ్మణ సంఘాలు చేస్తున్న ఆందోళనకు, తమకు సంబంధంలేదని బ్రహ్మయ్య స్పష్టం చేశారు. ఈ రోజు గిరిజా శంకర్ ని కలిసినవారిలో దేవాలయ కేశఖండన కార్మికుల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


ఎమ్మెల్సీగా గాలి సరస్వతి ప్రమాణస్వీకారం

             సచివాలయం, జూన్ 25: గాలి ముద్దు కృష్ణమ నాయుడు భార్య గాలి సరస్వతి సోమవారం ఉదయం శాసనసభా భవనంలోని బీఏసీ సమావేశ మందిరంలో శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ ఫరూక్ ఆమె చేత ప్రమాణం చేయించారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో ఖాళీ అయిన స్థానంలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. తన భర్త అడుగుజాడల్లో నడిచి పేద, బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆమె కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ ముద్దుకృష్ణమనాయుడిలా పని చేసి పేరుతెచ్చుకోవలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, దొరబాబు, శాసనసభ్యురాలు సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులను, విద్యా సంస్థలను రాజకీయం చేయవద్దు
మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్

                      సచివాలయం, జూన్ 25: ప్రాజెక్టులను, విద్యా సంస్థలను రాజకీయం చేయవద్దని, వాటిని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ప్రతిపక్షాలను కోరారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించి పట్టుదలతో ఇప్పటికి 62 శాతం పూర్తి చేశారని, దేశంలో ఇదో చరిత్ర అని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు 5 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రతి సోమవారంని పోలవరంగా ప్రకటించి 65 సార్లు ప్రత్యక్షంగా గానీ, వర్చువల్ గా గానీ 65 సార్లు చూశారని తెలిపారు. 25 సార్లు ప్రాజెక్టుని సందర్శించారని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే ప్రాజెక్టుని ఇన్నిసార్లు సందర్శించలేదన్నారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలోని ముంపు గ్రామాలు ఆ రాష్ట్రంలో లేకపోతే అటువంటి సమస్యలు పరిష్కారమైన దాఖలాలులేవని తెలిపారు. జూరాల ప్రాజెక్ట్, కావేరి జలాల వంటి అంశాలను గుర్తు చేశారు. ఈ విషయాలను దృష్టిలోపెట్టుకొని ముఖ్యమంత్రి ఆ రోజున ముంపు గ్రామాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పారన్నారు.  2020 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.  16 ఏళ్లు మంత్రిగా, దీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇటువంటి కీలక అంశాలని తెలియనివి కావన్నారు. అయినా బీజేపీ ప్రతినిధి బృందంతో  ఆయన పోలవరం ప్రాజెక్టుని సందర్శించి, దానిని రాజకీయం చేయడం తగదన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో వాస్తవాలను విస్మరించి, విమర్శలు చేయడం మంచిదికాదని హితవు పలికారు. 

కన్నాను తెలుగు జాతి క్షమించదు

                 రెండుసార్లు రాష్ట్రానికి ద్రోహం చేసిన కన్నాను తెలుగుజాతి క్షమించదన్నారు. సమైక్యాంద్ర ఉద్యమం జరిగే రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి సీఎం పదవి కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. ఆనాడు ఒక్కసారైనా సోనియా వద్ద ఆయన పోలవరం ప్రాజెక్టు విషయం ప్రస్తావించారా? అని అడిగారు. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం బీజేపీ, వైసీపీ కలసి దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కన్నా రాష్ట్రానికి చేస్తున్న రెండోసారి చేస్తున్న ద్రోహం పరాకాష్ట అన్నారు. వైసీపీ ఎజండాను కన్నా అమలు చేస్తూరని, ఇటువంటి ద్వంద పార్టీ నాయకత్వం విచిత్రంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలను చరిత్ర క్షమించదని చెప్పారు. వైసీపీ వారు బీజేపీని, మోడీని విమర్శించకుడా చంద్రబాబుని విమర్శించడం విధానంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే, నాలుగేళ్లలో రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని బిజేపీ నేతలు గానీ, వైసీపీ నేతలు గానీ జాతియ విద్యాసంస్థల అంశం ప్రస్తావించలేకపోతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలుగా ప్రాజెక్టులు, విద్యా సంస్థల విషయంలో రాజకీయంగా వ్యవహరించవద్దని చెబుతున్నామన్నారు. అలా చేస్తే రాష్ట్రం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని హిదాయత్ హెచ్చరించారు.


చంద్రబాబు నాయకత్వంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తాం

శాసన మండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్
                    సచివాలయం, జూన్ 25: తమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని శాసన మండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ధీమాగా చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఎలా సాధించాలో చంద్రబాబు నాయుడుకు తెలుసన్నారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసన మండలి సభ్యుడు బీటెక్ రవి ఇద్దరూ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు తెలుపకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వారికి ఉక్కు ఫ్యాక్టరీ కావాలని లేదన్నారు. తనకు అనుమతిస్తే రెండేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తానని గాలి జనార్ధన రెడ్డి చెబుతున్నారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపిందని చెప్పారు. ఇదంతా బీజేపీ, వైసీపీ, గాలి జనార్ధన రెడ్డి ఆడుతున్న నాటకం అన్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే బీజేపీ ఎండగడతామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని వైసీపీ నేత జగన్మోహన రెడ్డి గానీ, జనసేన నేత పవన్ కల్యాణ్ గానీ  కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయరని ఆయన ప్రశ్నించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేది చంద్రబాబు నాయుడేనని, ప్రధానిని నిర్ణయించేది తెలుగు ప్రజలనేని డొక్కా అన్నారు.

Jun 21, 2018


భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ
              సచివాలయం, జూన్ 21: రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములు, 22, భూధార్ వంటి భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) అనిల్ చంద్ర పునేఠ 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లను, ఆర్డీఓలను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు ఆర్డీఓలతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్లే ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్కల భూముల, 22ఏ భూములకు సంబంధించి వచ్చిన దరకాస్తులను చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. ఆ తరువాత కూడా ఈ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో రెవెన్యూ సమీక్షలు నిర్వహించాలన్నారు.  ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ప్రచారం చేయడానికి, గ్రామసభలు నిర్వహించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు.   రెవెన్యూ శాఖలో నిన్ననే 138 మందికి ప్రమోషన్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ప్రమోషన్లు పొందిన సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29వేల దరకాస్తులు ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఆయా జిల్లాల అధికారులు ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. కొందరు రెండు నెలలు, కొందరు జూలై 31, ఇంకొందరు జూలై 15లోపల పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే లైన్ల నిర్మాణానికి, జాతీయ రహదారులు, అనంతపురం-అమరావతి హైవే నిర్మాణానికి భూమిని త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు ప్రతి వారం జరిగే సమీక్షా సమావేశాలకు హాజరైతే సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
భూ సమస్యల పరిష్కార కార్యక్రమానికి అపూర్వ స్పందన
            భూ సమస్యల పరిష్కారానికి గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామసభలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి తహశీల్డార్, స్పెషల్ ఆఫీసర్, సర్వేయర్, వీఆర్ఓ, ఆర్ఐలతో కమిటీలు నియమించినట్లు, వారికి తగిన శిక్షణ కూడా ఇచ్చినట్లు వివరించారు. లక్షల సంఖ్యలో కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆడియో, వీడియో క్లిప్పింగ్ లు, ఫ్లెక్సీలు, మీడియా ద్వారా కూడా భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సభలలో ఏఏ సమస్యలు పరిష్కరించేది, ఏఏ సమస్యలు పరిష్కరించినది పూర్తి వివరాలతో మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల  వద్ద బోర్డులు ప్రదర్శిస్తున్నట్లు వివరించారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా తెలిపామన్నారు. కొన్ని గ్రామ సభలలో స్పీకర్, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నట్లు చెప్పారు.  గ్రామ సభలకు వెళ్లే కమిటీ సభ్యులు ఆయా గ్రామ రికార్డులు, మ్యాప్ లు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు. అవకాశం ఉన్నచోట్లకు మొబైల్ మీ సేవా కేంద్రాలను కూడా తరలిస్తున్నట్లు చెప్పారు.  వచ్చిన దరకాస్తులలో అవకాశం ఉన్నవాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. మొబైల్ మీ సేవ ద్వారా అడంగల్ వంటి వాటిలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని గతంలో ఇచ్చిన సమస్యలకు సంబంధించినవే ఉన్నట్లు చెప్పారు. దరకాస్తులను అనుమతించేది, లేనిది అక్కడికక్కడే చెబుతున్నామన్నారు. కొన్నిటి రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లో చుక్కల భూముల సమస్యలు ఎక్కువగా ఉంటే, మరి కొన్ని జిల్లాల్లో 22ఏ భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని అంశాలను కంప్యూటర్ లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.  నాలుగు ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు రైతులు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

                  మొదటి రోజు 20వ తేదీ  శ్రీకాకుళం జిల్లాలో 131 గ్రామ సభలు, విజయనగరం జిల్లాలో 101, తూర్పుగోదావరి జిల్లాలో 168, పశ్చిమగోదావరి జిల్లాలో 103, గుంటూరు జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 133, కడపలో 69, అనంతపురం జిల్లాలో 97, కర్నూలులో 99 గ్రామ సభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.  చిత్తూరు జిల్లాలో 279 దరకాస్తులు, విశాఖ జిల్లాలో 54 దరకాస్తులు, చిత్తూరు జిల్లాలో 59 దరకాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 14 వేల చుక్కల భూములు ఉన్నట్లు, వాటిలో 300 పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలినవి రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కడప జిల్లాలో జేకేసీ భూముల సమస్య ఉన్నట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వ్యక్తిగతంగా సాగు చేసుకునేవారి వారసులకు పట్టాలు ఇస్తామన్నారు.
నూతన సాఫ్ట్ వేర్
ప్రజలు ఇచ్చిన దరకాస్తులను అధిక సంఖ్యలో ఆమోదించడం లేక తిరస్కరించడం చేయడానికి వీలుగా కొత్త సాఫ్ట్ వేర్ ని ఈ రోజు నుంచే ప్రవేశపెట్టినట్లు సాంకేతిక విభాగానికి చెందిన నవ్య చెప్పారు. దీనిని కలెక్టర్ లాగిన్ అవ్వాలన్నారు. అది పని చేసే విధానం, అందులో ఉన్న ఆప్షన్స్ గురించి వివరిస్తూ అందరికీ వాట్సప్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ దగ్గరగా ఉన్న విజయవాడ, గుంటూరు, ఏలూరు వంటి చోట్లకు వెళ్లి సాంకేతికంగా అక్కడివారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు వారికి వివరించాలని ఆదేశించారు.
అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకు సంబంధించి అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో  సర్వే పూర్తి అయిందని వివరించారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వాటిలో ఈ హైవే కూడా ఉందని, ఆ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
కృష్ణా జిల్లాలో భూధార్ 80 శాతం పూర్తి
కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన భూధార పని దాదాపు 80 శాతం పూర్తి అయినట్లు సంబంధిత అధికారి చెప్పారు. వెబ్ ల్యాండ్ డేటాని భూధార్ లో నింపడానికి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వారం లోపల అన్ని మండలాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జులై 1 నుంచి అన్ని మండలాల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీనికి సంబంధించి డీఐఓలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ఏపీఐఐసీకి సంబంధించి ఈ నెల 25వ తేదీ సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు సీఎస్ చెప్పారు. ఆ రోజు కియా మోటార్స్ అంశం చర్చిస్తామన్నారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారులకు భూసేకరణ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా అనిల్ చంద్ర పునేఠ సమీక్షించారు.

ఆరోగ్యకరమైన సమాజానికి యోగా తప్పనిసరి

ఏపీ ప్రత్యేక రక్షణదళ డీఐజీ ఏసురత్నం
సచివాలయం, జూన్ 21: ఆరోగ్యకరమైన సమాజానికి యోగా తప్పనిసరని ఏపీ ప్రత్యేక రక్షణదళ డీఐజీ సీహెచ్. ఏసురత్నం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్ వద్ద గురువారం ఉదయం  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.కృష్ణమూర్తి, 300 మంది ఏపీ  ఎస్పీఎఫ్ సిబ్బందితో కలసి ఆయన యోగాసనాలు, ద్యానముద్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గంట అయినా యోగా చేస్తే మంచిదన్నారు. నేటి యాత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిపోయి చాలా మంది ఆరోగ్యం కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి రోజూ యోగా చేస్తే మానసిక ప్రశాంతత పొందగలుగుతామన్నారు.

ఆరోగ్యకరమైన సమాజానికి యోగా తప్పనిసరి

ఏపీ ప్రత్యేక రక్షణదళ డీఐజీ ఏసురత్నం
సచివాలయం, జూన్ 21: ఆరోగ్యకరమైన సమాజానికి యోగా తప్పనిసరని ఏపీ ప్రత్యేక రక్షణదళ డీఐజీ సీహెచ్. ఏసురత్నం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్ వద్ద గురువారం ఉదయం  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.కృష్ణమూర్తి, 300 మంది ఏపీ  ఎస్పీఎఫ్ సిబ్బందితో కలసి ఆయన యోగాసనాలు, ద్యానముద్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గంట అయినా యోగా చేస్తే మంచిదన్నారు. నేటి యాత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిపోయి చాలా మంది ఆరోగ్యం కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి రోజూ యోగా చేస్తే మానసిక ప్రశాంతత పొందగలుగుతామన్నారు.

Jun 20, 2018


‘సాక్షర భారత్ మిషన్’ కేంద్రం నిలిపివేసింది
ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు
Ø గౌరవ వేతనం నష్టపోతున్న 19 వేల మంది
Ø ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్న చంద్రబాబు

          సచివాలయం, జూన్ 20: సాక్షర భారత్ మిషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్రప్రభుత్వమని, ఆ కారణంగా 19,336 మంది గౌరవ వేతనం నష్టపోతారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని, అది నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. సాక్షర భారత్ మిషన్ కార్యక్రమం  కేంద్ర ప్రభుత్వ పథకమని, అది 2009లో ప్రారంభమైందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి 60:40 గా ఉంటుందని తెలిపారు. కేంద్రం ఈ పథకాన్ని 2016లో, 17లో నిలిపివేస్తున్నట్లు చెబుతూ ఆ రెండేళ్లూ పొడిగిస్తూ వచ్చిందన్నారు. చివరకు ఈ ఏడాది మార్చిలో దీనిని నిలిపివేశారని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 18,862 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 494 మంది మండల కోఆర్డినేటర్లు పని చేస్తున్నారన్నారు. గ్రామ కోఆర్డినేటర్ కు నెలకు రూ.2,000, మండల కోఆర్డినేటర్ కు రూ.6,000 గౌరవవేతనం ఇచ్చినట్లు వివరించారు.
                  ఈ కార్యక్రమం స్థానంలో పడో-పడావో కార్యక్రమం చేపట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వమని, అయితే బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు, విష్ణువర్ధన రెడ్డిలు 21 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడం ద్వారా మధ్యప్రదేశ్ లో గత అక్టోబర్ లో 20వేల మందిని, గుజరాత్ లో 22వేల మందిని, రాజస్థానంలో 20వేల మందిని, చత్తీస్ గడ్ లో కూడా వేల మందిని తొలగించారని, దేశం మొత్తం మీద లక్ష మంది వరకు తొలగించారని వివరించారు. రాష్ట్ర అక్షరాశ్యత మిషన్ అథారిటీ వద్ద ఉన్న రూ.3.35 కోట్లు, రూ.54.92 లక్షలను తిరిగి ఇచ్చివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ అక్షరాశ్యత మిషన్ అథారిటీ ఆదేశించిందన్నారు.
          రాష్ట్రంలోని వాలంటీర్లను తొలగించకుండా కొనసాగించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సార్లు కేంద్రానికి విజ్ఙప్తి చేస్తూ లేఖలు రాసినట్లు తెలిపారు. దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. వారిని వాలంటీర్లుగా తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని,  ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారని జూపూడి చెప్పారు.

చంద్రబాబు పాలన మైనార్టీలకు స్వర్ణయుగం

మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ హిదాయత్
·       మైనార్టీల ఆత్మీయ బంధువు చంద్రబాబు

            సచివాలయం, జూన్ 20 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మైనార్టీలకు స్వర్ణయుగం అని మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ వర్ణించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఆ ప్రభావం మైనార్టీలపై పడకుండా వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గడచిన 4 ఏళ్లలో మైనార్టీలకు రూ.2480 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2018-19లో రూ.1106 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశంలో ఏ రాష్ట్రం ఇన్ని నిధులు కేటాయించలేదన్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడుని మైనార్టీలు ఆత్మీయ బంధువుగా భావిస్తారని పేర్కొన్నారు. మైనార్టీలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దుల్హన్‌ పథకం, రోషిణి పథకం, దుకాణ్‌-మకాన్‌ పథకం, ఇమామ్ లకు  గౌరవ వేతనం, స్కాలర్ షిప్ పథకం వంటివి అందజేస్తున్నట్లు తెలిపారు.  విదేశీ విద్య కోసం ప్రస్తుతం ఇచ్చే రూ.10లక్షలను రూ.15 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అందువల్ల మైనార్టీలు అందరూ సీఎంకు అండగా ఉంటారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏకగ్రీవంగా మద్దతు పలుకుతామన్నారు. రాజకీయంగా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ప్రధానిని నిర్ణయించే స్థాయిలో ఉంటారని చెప్పారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. మైనార్టీ సమాజం సీఎంకు అండగా ఉండాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలో ఉన్నత స్థానంలో ఉందని హిదాయత్ అన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...