Sep 25, 2019


‘ఒకే దేశం - ఒకే భాష’ సాధ్యమేనా?

             ఒకే దేశం ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకే ఎన్నికలు - ఒకే కార్డు,  ఒకే విధమైన రిజర్వేషన్ విధానం -  దేశ పౌరులందరికీ (స్త్రీపురుషులిద్దరికీ) సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను, ఒకే పోటీ పరీక్ష ..... మాదిరిగా ఒకే భాష సాధ్యమేనా? వేల సంవత్సరా నుంచి  పలు ప్రాచీన భాషలకు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న  మన దేశంలో అది సాధ్యం కాదు. హిందీ దివస్‌ సందర్భంగా ఒకే దేశం-ఒకే భాష అని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ‘‘యావత్‌ భారతావనిని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం హిందీ భాషకు ఉంది. అంతర్జాతీయంగా భారత్‌కు విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలి. 2020 నుంచి హిందీ దివస్‌ను ఘనంగా జరుపుకుంటాం. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా హిందీకి మంచి గుర్తింపు తీసుకొస్తాం’’ అన్న షా మాటలను దేశ వ్యాప్తంగా సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకె అధినేత స్టాలిన్, సినీ హీరో కమల్ హాసన్, ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ వంటి పలువురు తప్పుపట్టారు. నిరసన వ్యక్తం చేశారు. మాతృభాషాభిమానం మెండుగా ఉన్న దక్షిణాది, ముఖ్యంగా తమిళనాడు నుంచి తీవ్రస్థాయిలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, లేదంటే మరో భాషా ఉద్యమానికి సిద్ధమవుతామని డిఎంకే పార్టీ వర్గాలు హెచ్చరించాయి. కర్ణాటకలో అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాషాభిమానులు రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 'ఒకే దేశం-ఒకే భాష' ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాగా  ఏచూరి పేర్కొన్నారు. దేశమంటే కేవలం హిందీ, హిందుత్వ కాదని.. వాటి కంటే  భారత్‌ ఎంతో విశాలమైందని అసదుద్దీన్ పేర్కొన్నారు. భారతీయులందరి భాష  హిందీ మాత్రమే కాదని, ఇక్కడ ఎన్నో సంస్కృతులు, ఎన్నో మాతృభాషలు ఉన్నాయని, ముందు వాటి అందాన్ని, భిన్నత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి అంటూ వ్యాఖ్యానించారు.  షా వ్యాఖ్యలు భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదాన్ని తెస్తాయని స్టాలిన్ హెచ్చరించారు. హిందీ భాషను దేశమంతా బలవంతంగా రుద్దాలనుకోవడం ముర్ఖత్వమని  ఎండీఎంకే అధ్యక్షుడు వైగో వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే హిందీ వద్దనుకునే రాష్ట్రాలు భారత్‌లో ఉండే పరిస్థితి లేదని  హెచ్చరించారు. జల్లికట్టుపై ఆందోళన కేవలం ఓ నిరసనలా సాగిందని, భాషా పోరాటం దానికంటే మహోగ్రంగా ఉంటుందని, అటువంటి మహోగ్ర భాషాపోరాటాన్ని భారత్ కోరుకోదని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

              పరిపాలనా సౌలభ్యం కోసం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని అంశాలు ఒకే రకంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలనాపరమైన అంశాలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండటం వల్ల వ్యయం తగ్గుతుంది. జమిలీ ఎన్నికలైతే ప్రభుత్వానికి, పార్టీలకు ఖర్చు తగ్గుతుంది. విద్యాపరంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు వంటివి  ఒకటే ఉంటే విద్యార్థులకు ఖర్చు తక్కువ, సౌలభ్యంగా ఉంటుంది. అలాగే చట్టాలు, పన్నులు, గుర్తింపు కార్డులు, కొన్ని సర్టిఫికెట్లు... వంటివి ఒకే రకంగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ’ఏక్తా భారత్‘ భావన కూడా నెలకొంటుంది. అయితే మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు విషయంలో అది సాధ్యం కాదు. ఆ రకమైన ఆలోచన మంచిదీ కాదు. మన దేశంలో 122 భాషలు, 19,500 మండలికాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకుగురైన వర్గాలు, అనేక మతాలు,  భాషలు, విభిన్న సంస్కృతులకు నిలయం భారత్. వీటికి తోడు ఇక్కడ వేళ్లూనుకున్న వేల కులాలు ఉన్నాయి.
దేశంలోని పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం తయారు చేయడం కోసం డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ తోపాటు దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు 284 మందితో రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా  పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు,  భారత్ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్ల పాటు ఆగవలసి వచ్చింది.  భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్  మూడేళ్ల కాలం అవిశ్రాంతంగా శ్రమించారు.  ఆయన కృషి ఫలితంగా 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దేశంలోని 22 షెడ్యూల్‌ భాషలకు రాజ్యాంగంలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 29 పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛను కల్పిచింది. రాజ్యాంగ రూపకల్పనలో మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తలకు విఘాతం కలిగించే విధంగా షా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై అనేకమంది ధ్వజమెత్తుతున్నారు. దేశంలో హిందీ భాషతో పాటు ప్రాచీనంగా ఉన్న అనేక భాషలు ఉన్నాయి. దక్షిణాధి భాషలు అంతకంటే ఎక్కువ ప్రాచీనంగా ఉన్నాయి. భాష, సంస్కృతి చాలా బలీయమైనవి. హిందీ రాజభాషగా గుర్తింపు పొందినా ప్రాంతీయ భాషలకు కూడా తగిన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది.  హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే గతంలో మాదిరి ఉధృతంగా మాతృభాషా ఉద్యమాలు జరుగుతాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Sep 20, 2019


18 ఏళ్ల లోపువారు ఆత్మహత్య చేసుకుంటే అది హత్యే!
  ‘18 ఏళ్ల లోపువారు ఆత్మహత్య చేసుకున్నా అది హత్యే!’ అనేది ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని హీరో డైలాగ్. ఇది అక్ష్యర సత్యం. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. 18 ఏళ్ల లోపు పిల్లలు ముఖ్యంగా విద్యార్థులలో ఎక్కువ శాతం మంది ఇటు తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థల వేధింపులకు, హింసకు గురవుతున్నారు. వారిది యాంత్రిక జీవనం అయిపోయింది. ఓ ఆటాలేదు. ఓ పాటా లేదు. పుస్తకాల మోత, ఎప్పుడూ చదువు, చదువు... ఇదే వారి బతుకైపోయింది. ఆ బతుకులో జీవంలేదు. వారి ఆలోచనలకు, ఇష్టాలకు ప్రాధాన్యతేలేదు. ఇక ప్రేమానుబంధాలు, ఆత్మీయత, అనురాగాలు మచ్చుకైనా కానరావు. పిల్లలు వాటికి దూరమైపోతున్నారు.  తల్లిదండ్రుల చెప్పిన చదువులే చదవాలి. వారు చేరమన్న కోర్సులోనే చేరాలి. అందుకు వారి స్థాయి చాలకపోయినా అలాగే ఈడ్చుకురావాలి. ఆ చిన్నారులకు మరో గత్యంతరం లేదు. చాలా మంది విద్యార్థుల బతుకులు దుర్భరమైపోతున్నాయి. తల్లిదండ్రులకు ఏవో తీరని కోరికలు ఉంటాయి. వారు ఏ డాక్టరో, ఇంజనీరో చదవాలని, ఐఏఎస్ కొట్టాలని కలలు కంటారు. వారికి సాధ్యంకాదు. అటువంటివారిలో అధిక మంది వాటిని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు.  ఆ ప్రయత్నాలు చాలా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఇంకొందరు చదువులోనూ, క్రీడలలోనూ వృత్తిలోనూ, వ్యాపారంలోనూ ఉన్నతంగా ఉంటారు. తమ పిల్లలు కూడా అదేవిధంగా తయారు కావాలని ఆ కాంక్షిస్తారు. అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ వారు చదువులో ఉన్నతంగా నిలవాలని వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తారు. పిల్లల  ఇష్టాఇష్టాలతో పనిలేదు. వారు చెప్పిన విధంగా చదవాలి. అంతేకాకుండా వారు కోరుకున్నన్ని మార్కులు రావాలి. కొందరు తల్లిదండ్రులకు అత్యాశ ఎక్కువ. పిల్లవాడి సామర్ధ్యాన్ని అంచనావేయలేరు. 95 శాతం మార్కులు వచ్చినా వారికి సంతృప్తి ఉండదు. ఇంకో రెండు శాతమో, మూడు శాతమో వస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అంత కష్టపడి అన్ని మార్కులు సాధించినా తల్లిదండ్రులు, గురువుల మెప్పు పొందలేకపోయామని ఆ విద్యార్థులు బాధపడుతుంటారు. ‘ఛీ ఈ చదువులు’ అనుకునే స్థాయికి వారు వస్తారు.
           మరికొందరైతే పిల్లల ఆలోచనా విధానం, వారి శారీరక స్థితి, వారి జ్ఞాన సామర్థ్యం తెలుసుకోకుండా డాక్టర్ సీటు రావాలని కోరుకుంటారు. కోచింగ్ లో చేర్పిస్తారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తారు. ఇక తమ బిడ్డ డాక్టర్ సీటు కొట్టేసినట్లు ఊహించుకుంటారు. ఆ బిడ్డ పరిస్థితిని గమనించరు. వారు ఏవైనా సమస్యలు చెప్పినా పట్టించుకోరు. ఇంకా అది సాధించాలి, ఇది సాధించాలి అని ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఒక ఏడాది సీటు సాధించకపోతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆ సీటు రాకపోతే ఇక జీవితంలేదన్నట్లు ప్రవర్తిస్తారు. విద్యార్థుల మానసిక స్థితిమీద చావు దెబ్బ కొడతారు.  రెండో ఏడాది దీర్ఘకాల కోచింగ్, అప్పుడూ రాకపోతే మూడే ఏడాదీ  ఇంకా అదే కోచింగ్... విద్యా సంస్థలు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఇలా సాగిపోతుంటాయి తల్లిదండ్రుల ఆలోచనలు, వారి చర్యలు. ఆ బిడ్డ సీటు సాధించాలి లేదా చావాలి. పిల్లలకు కుటుంబ వ్యవస్థ, సున్నితమైన అంశాల గురించి చెప్పరు. బంధాలు, అనుబంధాలను ఆస్వాదించే అవకాశం ఇవ్వరు. వావి వరసలు నేర్పరు. పిల్లలు ఇతర సమస్యలు ఏవి చెప్పినా అటు తల్లిదండ్రులు, ఇటు గురువులు పట్టించుకోరు. కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్,  తోటి విద్యార్థుల వికృత చేష్టలు, వారి బెదిరింపులు, అలాగే కొందరు గురువుల వెకిలి చూపులు, వారి లైంగిక వేధింపులు, హెచ్చరికలు, చేర్పించిన కోర్సులో పుస్తకాలు చదవలేని స్థితి, ఆయా సబ్జెక్టుల పట్ల ఆసక్తిలేకపోవడం, ఆడపిల్లలైతే తోటి విద్యార్థుల ప్రేమ వేధింపులు, యాసిడ్ దాడులు, తీవ్రమైన ఒత్తిడి, హింస, భయం..... ఇలా ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. వాటిని తల్లిదండ్రులకు, విద్యా సంస్థ యాజమాన్యాలకు చెప్పినా ఫలితం ఉండదు.
           యాజమాన్యాల దృష్టంతా వ్యాపారంపైన, సంపాదనపైనే ఉంటుంది. పిల్లల జీవితాలు ఎలా పాడైనా వారికి పట్టదు. ఇంకా మార్కుల కోసం వారిని వేధిస్తుంటారు. ఏ కారణం వల్లో మార్కులు సరిగా రాకపోతే వారిని కించపరుస్తారు. అవమానిస్తారు. అవహేళన చేస్తారు. కొందరు గురువులుగా కాకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. మరోవైపు పిల్లలకు తల్లితండ్రుల వద్ద ప్రేమగా గడిపే అవకాశాలు, పరిస్థితులు బాగా తగ్గిపోతున్నాయి.  ప్రేమకు మొకంవాసిపోతున్నారు.  ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఆ పసి మనసులు ఎంత తల్లడిల్లుతాయో ఆ తల్లిదండ్రులు ఏనాడైనా ఆలోచిస్తున్నారా? వారు చెప్పే మాటలను వినడానికి ప్రయత్నిస్తున్నారా? వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? లేదు. చివరికి వారు మరో గత్యంతరంలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటువంటి వాటిని ఆత్మహత్యలు అని ఎలా అంటాం. అవన్నీ హత్యలే. అందుకు బాధ్యులు తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థల యాజమాన్యాలే. ఇటువంటి హత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టవలసి ఉంది. ముఖ్యంగా అత్యంత దారుణంగా ప్రవర్తించే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. బిడ్డ ఆత్మహత్య చేసుకున్న తరువాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. వారు బతికి ఉండగానే వారు చెప్పేవి వినాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. వారిని ప్రేమగా బుజ్జగించి నచ్చజెప్పాలి.  తల్లి,తండ్రి, గురువు దైవం అంటారు. ఆ తరువాత గురువులు బాధ్యతగా వ్యవహరించాలి. గురువు స్థానానికి వారు తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడే ఇటువంటి హత్యలు ఆగుతాయి.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Sep 6, 2019

దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వ  నిర్ణయాలు
         
                ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేవిధంగా అనేక నిర్ణయాలు తీసుకొని సంచలనాలు సృష్టిస్తోంది. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవానికి తెరతీసింది.  వ్యవస్థలో సమూల మార్పు, సామాజిక సమానత్వం, అవినీతి నిర్మూలనకు నడుం కట్టింది. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, దేశంలో ఎవరూ చేయని అనేక చట్టాలను  చేసింది. పార్టీ ఫిరాయింపులకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో రాజకీయంగా ఆదర్శంగా నిలిచేవిధంగా జగన్ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలలోని సభ్యులు ఎవరైనా పార్టీ మారదలచుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి రావాలన్న నిబంధన విధించారు. అంతే కాకుండా పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ కు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. ఈ ప్రభుత్వ పనితీరుకు దేశం మొత్తం ఒక్కసారిగా ఏపీ వైపు చూస్తోంది. అందరికీ సమాన అవకాశాల కోసం నూతన చట్టాలు చేసింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే యువతకు 2.8 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి చరిత్ర సృష్టించింది. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా రివర్స్ టెండరింగ్ కి పూనుకుంది. మన రాజకీయ వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవడానికి అనేక తప్పుడు మార్గాలు అనుసరిస్తుంటారు. ఆ రకమైన అవినీతి చర్యలకు స్వస్తి చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో అడ్డదారులు తొక్కడానికి వీరందరూ భయపడే పరిస్థితి వచ్చింది. దాంతోనే ప్రభుత్వంలో చాలా మార్పు వచ్చింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో శాశ్విత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలలో, విద్యాపరంగా సీట్ల కేటాయింపుల్లో బీసీలకు జరిగే అన్యాయాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కమిషన్ ద్వారా అవకాశం ఏర్పడుతుంది. అలాగే దయనీయంగా ఉన్న ఎంబీసీల(అత్యంత వెనుకడిన తరగతులు) పరిస్థితి మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. సమాజంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు స్థానం కల్పించే విధంగా మంత్రి మండలిని రూపొందించారు. ఏ రాష్ట్రంలో జరుగని విధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి అయిదుగురిని ఉప ముఖ్య మంత్రులుగా నియమించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన శాసనసభ తొలి సమావేశాల్లోనే కౌలు రైతుల సంక్షేమంఉద్యోగాల కల్పనల్యాండ్‌ టైటిల్‌, అట్టడుగు వర్గాలుమహిళల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి అనేక చట్టాలు చేశారు. నామినేషన్ విధానంలో చేపట్టే కాంట్రాక్ట్ పనులలో, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్, అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏకంగా శాసనసభలో చట్టం చేశారు. ఇప్పటి వరకు అందరూ మాటలు చెప్పిన వారే గానీ చట్టం చేసినవారు లేరు. పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్తోమత ఈ బలహీన, బడుగు, దళిత వర్గాలకు లేదు. కనీసం నామినేటెడ్ కాంట్రాక్టులైనా వచ్చే అవకాశం లభిస్తుంది.  ఈ చట్టం ఆ సామాజిక వర్గాలలో సంపూర్ణ ఆత్మస్థైర్యాన్ని నింపింది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేశారు. దాంతో యువతకు ప్రభుత్వంపై ఓ నమ్మకం ఏర్పడింది. వ్యవసాయ రంగం పురోగతిరైతు సంక్షేమం కోసం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్,  రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి  ఏర్పాటు చేశారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్,  ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ లను ఏర్పాటు చేశారు. టెండరింగ్ ప్రక్రియలో ఈ ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా టెండరింగ్ పనులను హైకోర్టు జడ్జి ఖరారు చేసే విధంగా చట్టం రూపొందించారు.  ఈ రకమైన పలు చట్టం చేసిన మొదటి ప్రభుత్వంగా ఏపీ రికార్డుకెక్కింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రభుత్వంలో పారదర్శక పాలనకు నిదర్శనగా ప్రభుత్వం ద్వారా జరిగే కోటి రూపాయలకు మించిన లావాదేవీ ఏదైనా ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. ఆ లావాదేవీ ఏ కంపెనీ ద్వారా, ఏ సంస్థ ద్వారా జరుగుతుందో ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా వివరాలు అందుబాటులో ఉంచుతారు.  మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ పాలన రూపకల్పనలో భాగంగా  గ్రామ, పట్టణ ప్రాంతాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడానికి గ్రామసేవకుల వ్యవస్థను ప్రారంభించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా వీరు వ్యవహరిస్తారు. ప్రజలకు వీరు అందించే సేవల ద్వారా నాయకులుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం ప్రవేశపెట్టారు. అలాగే సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయటానికి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రారంభించారు.

కేంద్రం, తెలంగాణతో సంత్సంబంధాలు
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలతో సంత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర రావుతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర విభజన, నదీ జలాల సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిధులు, గ్రాంట్లను పెంచాలని, పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు రావలసిన నిధులు తక్షణం విడుదల చేయాలని, నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి, రాష్ట్రా భివృద్ధికి సహకరించాలని కోరారు. పార్లమెంట్‌ హామీ మేరకు విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని,  పదేళ్లపాటు జీఎస్టీఐటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, రెవెన్యూ లోటు రూ.22,948 కోట్లను పూడ్చాలని, పోలవరం ప్రాజెక్ట్  కోసం ఖర్చు చేసిన రూ.5,103 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరుతూ ప్రధానికి ప్రత్యేకంగా ఓ లేఖ అందజేశారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం  చేపట్టిన రెండు నెలల్లోనే  దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు.  వీడీపీ అసోసియేట్స్ వారు ముఖ్యమంత్రుల పనితీరుపై దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన సర్వేలో 3వ స్థానం పొందారు.  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో,  యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్  రెండో స్థానంలోతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 5వ స్థానంలో నిలిచారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో కూడా సీఎం జగన్మోహన రెడ్డి  4వ ర్యాంక్ సాధించారు. నవరత్న పథకాలుసామాజిక న్యాయంఅవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టడం ద్వారా జగన్ అందరి మనసులలో సుస్థిర స్థానం సంపాదించారు. దూకుడుగా వ్యవహరిస్తున్నా చిరకాలం గుర్తుండే శాశ్విత నిర్ణయాలు తీసుకుంటున్నారు.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Sep 4, 2019

బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా?



·       రుణాల ఎగవేత అధికం
·       ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ నష్టం
·       చిరు వ్యాపారులకు నిబంధనలు అధికం
·       బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచాలి
                  
          ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలను దేశంలోని రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి, సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 1969 జూలై 19న బ్యాంకుల జాతీయం చేశారు. పేద-మధ్య తరగతి వర్గాలను వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా? అంటే బడా బాబులకు ఉపయోగపడినంతగా పేదలకు, రైతులకు ఉపయోగపడటంలేదనే చెప్పాలి. బ్యాంకులు జాతీయం చేసి 50 ఏళ్లు గడిచినా  ఏ ఉద్దేశాలతో బ్యాంకులను జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు కొంతవరకు మాత్రమే నెరవేరాయి. ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే ఎక్కువగా ఉపయోపడుతున్నాయి. వాళ్లే బ్యాంకుల సొమ్మును బొక్కేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను  మోసం చేసి వేల కోట్లు దిగమింగుతున్నారు. ఆ డబ్బుని రాబట్టే సరైన వ్యవస్థ మన దేశంలో లేకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు కూడా తగిన రీతిలో పకడ్భందీగా చట్టాలను రూపొందించలేకపోతున్నాయి. దాంతో బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులను మోసం చేయడం ఏడాదికేడాది పెరిగిపోతోంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. వినియోగదారులు చేసిన మోసాలను బ్యాంకులు గుర్తించగలిగిన సరాసరి సమయం 22 నెలలుగా ఉంది.  2018-19లో బ్యాంకుల వినియోగదారులైన కొంతమంది పారిశ్రామికవేత్తలు రూ.71,542.93 కోట్ల  మేర బ్యాంకులను మోసం చేశారు.  ఈ మోసాలకు సంబంధించి 6,801 కేసులు నమోదయ్యాయి. 2017-18లో రూ.41,167.04 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకే  అధిక వాటా ఉంది. బ్యాంకుల్లోనే అధిక మోసాలు వెలుగు చూశాయి.
                       2018-19లో వినియోగదారుల మోసాల వల్ల రూ.64,509.43 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోయాయి. ఈ మొత్తానికి సంబంధించి 3,766 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఉన్నాయి. అంటే ఈ మోసగాళ్లు విదేశీ బ్యాంకులను కూడా వదిలిపెట్టలేదు. మోసాలన్నింటిలో రుణ ఎగవేతలే ఎక్కువగా ఉన్నాయి. కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, నగదు జమలకు సంబంధించిన మోసాలు 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే ఫోర్జరీ, మోసాలకు  సంబంధించి 72 భారీ కేసులు నమోదయ్యాయి. రూ.లక్ష కన్నా తక్కువ రుణం తీసుకొని ఎగ్గొట్టినవారి కేసులు 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నవారే బ్యాంకులను మోసం చేశారని స్పష్టమవుతోంది. ఇక్కడ ఒక విషయం మనం ముఖ్యంగా గమనించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా, ప్రైవేటు రంగ బ్యాంకులైనా రైతులకు, మధ్యతరగతి వారికి, చిరు వ్యాపారులకు 50 వేల రూపాయల రుణం కావాలంటే పాతిక రకాల నిబంధనలు విధిస్తారు. బంగారం, స్థిరాస్తులు, హామీలు... వంటివి కావాలి. చిరు వ్యాపారులు రూ.50 వేల రుణం తీసుకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలా కోటి రూపాయలతో 20 కుటుంబాలు బతుకుతాయి. వారి రుణ బకాయి చెల్లించకపోతే ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇంకా ఏదైనా తేడా వస్తే ఆస్తులు వేలం వేస్తారు. ఈ బడా పారిశ్రామికవేత్తలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఎగ్గొట్టగలుగుతున్నారు? ఏడాదికేడాది బ్యాంకులకు ఈ రకమైన నష్టాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ ఎందుకు పకడ్భందీగా వ్యవహరించడంలేదు? ఆ పారిశ్రామికవేత్తల కనుసన్నలలోనే ఈ బ్యాంకులు, ప్రభుత్వాలు నడుస్తున్నాయోమో అని అనిపిస్తోంది.
                    ప్రభుత్వాలు ప్రకటించే రుణ ప్రణాళికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు 50 శాతం రుణాలు కూడా బ్యాంకులు వారికి ఇవ్వవు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే సందర్భాలలో కూడా వారిని నానా వేధింపులకు గురి చేస్తారు. బడా వ్యాపారులకు ఇచ్చే దాంట్లో నాలుగవ వంతు రుణాలు చిరు వ్యాపారులకు ఇస్తే కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. బకాయిలు తిరిగి చెల్లించే శాతం కూడా పెరుగుతుంది. తక్కువ మొత్తంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. చిరు వ్యాపారులు, రైతులు పరువు గురించి ఆలోచిస్తారు. అవకాశం ఉన్న మేరకు శాయశక్తులా బకాయిలు చెల్లిస్తారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీ పెట్టే  వ్యాపారులకు  అటువంటివి ఏమీ ఉండవు.  అంతే కాకుండా వారి వద్ద నుంచి బకాయిలు వసూలు చేసుకోవడానికి శక్తివంతమైన సాధనాలు ఏమీ లేవు. రుణాలు ఇవ్వడానికి నియమనిబంధనలు బలహీనంగా ఉన్నందువల్లే వారు అలా చేయగలుతున్నారు.  అందువల్ల వారికి రుణాలు ఇవ్వడానికి హామీలు, నిబంధనలు కఠినతరం చేయవలసి ఉంది. అలాగే బకాయిలు వసూలు చేసుకోవడానికి కూడా కఠిన చట్టాలు చేయాలి. ఈ పరిస్థితులలో దేశంలో ఆర్థిక రంగం బలోపేతం కావడానికి, ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలను పటిష్టపర్చవలసిన అవసరం ఉంది. అలాగే బ్యాంకులు సామాన్యులు, రైతులు, చిరువ్యాపారుల అవసరాలు తీర్చగలిగే విధంగా వారికి రుణాలు ఇచ్చే విషయంలో నిబంధనలు సరళతరం చేయాలి.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...