Nov 30, 2018


వారం రోజుల్లో ఇళ్ల లబ్దిదారుల ఎంపిక
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
Ø అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
Ø లబ్దిదారుని ఇంటికే ఆదరణ పరికరాలు
Ø పథకాల యూనిట్లు మార్చుకునే అవకాశం

      సచివాలయం, నవంబర్ 30: ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిర్మించే ఎన్టీఆర్ గృహ పథకం లబ్దిదారులను వారం రోజులలో ఎంపిక చేయాలని మంత్రులను, జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్ల సెంటర్ సమీపంలోని ప్రజావేదిక వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన 18వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. గృహనిర్మాణ పథకాల సమీక్ష సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల కింద మొత్తం ఇళ్లు నిర్మాణ లక్ష్యం 19,57,429 కాగా, మంజూరైనవి 13,61,252, పనులు ప్రారంభమైనవి 11,51,465 అని,
పూర్తయినవి 7,20,113 అని గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇల్లు అనేది సెంటిమెంట్ గా  పేర్కొన్నారు. 20 లక్షల ఇళ్లు రూ.80వేల కోట్ల అంచనా వ్యయంతో  నిర్మించాలని చేపట్టిన అతి పెద్ద, చాలా మంచి ప్రాజెక్ట్ ఇదని ఆయన చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో అధికార యంత్రాంగం బాధ్యత తీసుకోవాన్నారు.  తెలంగాణలో హామీ మేరకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించలేదని అక్కడ ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లను చాలా బాగా నిర్మించారని ఆ శాఖ అధికారులను కొనియాడారు.  ఇప్పటివరకు పూర్తి అయిన గృహ నిర్మాణాలకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక, వారికి లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ఒక వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటి ద్వారా లబ్దిదారుల ఎంపిక చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపికలో చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్లే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు. పట్టణ గృహ నిర్మాణంలో మెప్మా మహిళల సహకారం తీసుకుంటున్నారని, అలాగే గ్రామీణ గృహ నిర్మాణంలో సెర్ప్ మహిళల సేవలు వినియోగించుకోవాలన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఒకేవిధంగా ఇళ్లు నిర్మించాలని చెప్పారు. ఒకే విధమైన విధానాలను అనుసరించాలన్నారు.   అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించుకున్న అర్హులైన పేదలకు కూడా ప్రభుత్వ సాయం ఒక్కో ఇంటికి రూ. 60 వేలు చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ప్రభుత్వ అనుమతితో ఇళ్లు నిర్మించుకున్నవారికి రూ. 70 వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో  పశ్చిమగోదావరి జిల్లా నమూనాను మిగిలిన జిల్లాలు అనుసరించాలని సీఎం చెప్పారు.
       అధికారులు, సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీఎం హెచ్చరించారు. ఎవరైనా డబ్బు తీసుకుంటే తిరిగి ఇవ్వవలసి ఉంటుదన్నారు. ఇళ్ల కేటాయింపు విషయంలో లబ్దిదారులను వేధిస్తే ఇల్లు తమకు కేటాయించారన్న ఆనందం పోతుందన్నారు. ఇల్లు పొందిన అనందం, సంతృప్తి వారిలో కనిపించాలని చెప్పారు. జాప్యం జరుగకుండా ముందస్తు ప్రణాళికలతో మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని, నిర్మాణం చేపట్టని చోట్ల లబ్దిదారులు చెల్లించిన మొత్తాలను వారికి తిరిగి చెల్లించాలని చెప్పారు.
370 అన్న క్యాంటిన్లు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్కటి చొప్పున 370 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయమని సీఎం అధికారులను ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 160 క్యాంటిన్ల ద్వారా  1,29,74,958 మంది లబ్దిపొందుతున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు చెప్పారు. అన్న క్యాంటిన్ల కోసం స్థలం ఎంపిక, నిర్మాణం, ఏజన్సీల ఎంపికలలో కూడా ఒకే విధానం అనుసరించాలని ఆదేశించారు. అన్న క్యాంటిన్ల నిర్వహణపై 80.67 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, సంతృప్తి స్థాయి ఇంకా పెరగాని చెప్పారు.

         ఎస్సీ,ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా 4.67 లక్షల ఎస్సీ కుటుంబాలు రూ.38.65 కోట్లు,  50 వేల ఎస్టీ కుటుంబాలు రూ.5.78కోట్లు లబ్ది పొందినట్లు సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయి 67.40 శాతం మాత్రమే ఉందని, ఉచితంగా ఇచ్చే పథకానికి కూడా సంతృప్తి స్థాయి ఇంత తక్కువగా ఉంటే ఎలా అని సీఎం ప్రశ్నించారు. పథకానికి సంబంధించి ప్రచారం నిర్వహించాలని సూచించారు.
           వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమీక్షలో తమ శాఖ ఆద్వర్యంలో 18 కార్యక్రమాలు చేపట్టినట్లు  ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, శిశు మరణాలు తగ్గినట్లు చెప్పారు. డయాబిటీస్ అదుపునకు ఇండియన్ డయాబెటీస్ అసోసియేషన్ సూచనల మేరకు ఆహారపు అలవాట్లలో మారపు తీసుకురావడానికి పౌరసరఫరాల శాఖతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య అసమానతల సబ్ కమిటీ సమావేశాలు 1403 కేంద్రాలలో మూడు నెలలకు ఒకసారి జరుగుతున్నట్లు చెప్పారు. డిజి అప్లికేషన్ లో ఏఎన్ఎంలకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రులలో మానసిక వైద్యులను నియమించడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి పలకరింపు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేదలకు వైద్యసేవల్లో సంతృప్తిస్థాయి పెరగాలని, అన్ని జిల్లాలలో 85 శాతం సంతృప్తి రావాలని అన్నారు. 108సేవలు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు,సంచార చికిత్స,తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్, అన్ని పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరగాలని చెప్పారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో డ్రైవర్ల ప్రవర్తన బాగాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అది మంచి పద్ధతి కాదని, సిబ్బంది మర్యాదగా వ్యవహరించి, గౌరవంగా మెలగాలన్నారు. డాక్లర్లు అందుబాటులో లేరని, మందుల కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు ఆర్టీజిఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.  సర్వీస్ ప్రొవైడర్ల సేవలను నిశితంగా పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని, దశలవారీగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు.  వైద్యశాఖ మౌలిక వసతుల సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రులలో సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. న్యూట్రీ గార్డెన్లను అభివృద్ది చేసే బాధ్యతను అవుట్ సోర్సింగ్ ఇచ్చి పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని సీఎం చెప్పారు.
         అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటులో దేశంలో మన రాష్ట్రం కేరళ తరువాత 2వ స్థానంలో నిలించిదని, కేరళను కూడా మించిపోవాలన్నారు.  3035 డిజిటల్ క్లాస్ రూమ్ లు నిర్మించామని,  ఈ ఏడాది డిజిటల్ క్లాస్ రూముల లక్ష్యం 645 అని,  వచ్చే ఏడాది 1320 నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.  6,285 పాఠశాలల్లో ప్రహరీగోడలు నిర్మించవలసి ఉండగా, 2,414 పాఠశాలల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. విశాఖ, అనంతపురం, కడప జిల్లాల్లో  ప్రహరీగోడల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, గోదావరి జిల్లాలలో 99 శాతం పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నాయని, మిగిలిన జిల్లాలు కూడా కూడా త్వరగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. అంగన్ వాడీల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
లబ్దిదారుని ఇంటికే గౌరవంగా ఆదరణ పరికరాలు
ఆదరణ-2 పథకం కింద ఇచ్చే పరికరాలు లబ్దిదారుని ఇంటికే గౌరవంగా తీసుకువెళ్లి ఇవ్వాలని, అందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ  పథకాన్ని చేపట్టిందన్నారు. ఈ పథకంపై ప్రజల్లో  సంతృప్తి 54 శాతం మాత్రమే వుందని, దీనిని పెంచాలని చెప్పారు. రెవెన్యూ డివిజన్ల వారీగా గానీ, నియోజకవర్గాల వారీగా గానీ ఆయా జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు, కలెక్టర్లు కలసి నిర్ణయించుకొని పనిముట్లను లబ్దిదారులకు వెంటనే చేర్చాలని ఆదేశించారు.  
బ్యాంకులపై సామాజిక బాధ్యత
పేద వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల కింద రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు కూడా సామాజిక బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ మాత్రమే ఇస్తూ, రుణం ఇవ్వడం లేదని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తేగా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాలకే కాదు, బ్యాంకు  కూడా సామాజిక బాధ్యత ఉందన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన పథకాల విషయంలో యూనిట్లను మార్చుకునే వెసులు బాటు ఇవ్వమని ఆ శాఖ అధికారులకు, కలెక్టర్లకు సీఎం చెప్పారు.
గుంటూరు జిల్లాలో స్కాలర్ షిప్ దరకాస్తుల గడువు పెంపు
గుంటూరు జిల్లాలో కొన్ని ఇబ్బందుల కారణంగా కొంతమంది విద్యార్థులు స్కాలర్ షిప్ లకు దరకాస్తు చేసుకోలేకపోయారని, వారు దరకాస్తు చేసుకోవడానికి గడువు పెంచవలసిందిగా ఆ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కోరగా, అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

Nov 27, 2018


 మిల్లర్లు వెంటనే బకాయిలు చెల్లిస్తే పెనాల్టీ ఎత్తివేత
పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
                 సచివాలయం, నవంబర్ 27: మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లడ్ రైస్) సరఫరా చేయనందున చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో పెనాల్టీ ఎత్తివేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు  రూ.93.82 కోట్లు  ఉన్నట్లు తెలిపారు. పెనాల్టీతో కలిపితే రూ.115 కోట్లు దాటుతుందన్నారు.  నెల్లూరు జిల్లాలోని మిల్లులు ఎక్కువ బకాయిపడినట్లు  తెలిపారు. మిల్లర్లు వెంటనే చెల్లించేట్లైతే సీఎంతో మాట్లాడి పెనాల్టీ ఎత్తివేయిస్తానని చెప్పారు. అవకాశం ఉన్న మిల్లర్లు చెల్లించారని, అవకాశంలేనివారు మిల్లులు అమ్మి చెల్లిస్తామని చెబుతున్నారన్నారు. ఇప్పటికే మిల్లర్లను అరెస్ట్ చేయించినట్లు తెలిపారు. ఆ మిల్లులు సీజ్ చేయించినట్లు చెప్పారు. పెనాల్టీ ఎత్తివేస్తే మిల్లులను అమ్మి చెల్లిస్తామని  మూడు మిల్లుల వారు చెప్పారన్నారు.
గత ఏడాదికి మిల్లర్లు ఇంకా 22,428 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయవలసి ఉందని, వారు ఇంకా సమయం అడుగుతున్నారని, సీఎం ఆమోదంతో మరో 5 రోజులు సమయం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 47,81,955 మెట్రిక్ టన్నుల ధాన్య కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఒప్పటికే 1,52,446 మెట్రిక్ టన్నుల ధాన్యం  14,440 మంది రైతుల వద్ద  కొనుగోలు చేసి 48 గంటల్లో రూ.252 కోట్లు చెల్లించినట్లు వివరించారు.
గత ఏడాది మాదిరిగా తెల్ల రేషన్ కార్డుదారులకు చంద్రన్న సంక్రాతి, క్రిస్టమస్ కానుకలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కానుకల కింద ఇచ్చే సరుకుల నాణ్యత విషయంలో రాజీపడేప్రసక్తిలేదని చెప్పారు. రేషన్ డిపోల ద్వారా ఇచ్చే మొత్తం బియ్యానికి ప్రత్యామ్నాయంగా కార్డుదారులు కోరితే జొన్నలు గానీ, రాగులు గానీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సీఎం చెబుతున్నారని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 10.16 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు, 11.16 మెట్రిక్ టన్నుల రాగులు కార్డుదారులు తీసుకున్నట్లు వివరించారు. కార్డుదారుల ఇబ్బందులను గమనించి  గ్రామానికి దూరంగా ఉండే నివాసప్రాంతాలకు ప్రభుత్వమే రవాణా ఖర్చులు భరించి సరుకులు పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక నుంచి రేషన్ డిపో డీలర్లు అక్కడకే వెళ్లి వారికి సరుకులు ఇవ్వాలన్నారు.
              పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండీ ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ రేషన్ డిపోల ద్వారా కిలో రూ.12లకు ఇచ్చే డబుల్ ఫార్టిఫైడ్ ఉప్పు చాలా మంచిదని చెప్పారు. అది పిల్లలకు, పెద్దలకు, ఆడవారికి అందరికీ మంచిదని తెలిపారు. ఆ ఉప్పుని తమిళనాడు సాల్ట్ కార్పోరేషన్ నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు.  జొన్నలు, రాగులు ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా అమ్ముడుపోతున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయన్నారు. కంది పప్పు కిలో రూ.40లకే ఇస్తున్నట్లు చెప్పారు.

డీలర్ల బకాయిల లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించిన మంత్రి
                ఐసీడీఎస్, పాఠశాలలకు సరఫరా చేసిన సరుకులకు సంబంధించి డీలర్లకు చెల్లించవలసిన బకాయిల లెక్క తేల్చమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారి బకాయిలను చెల్లించుదామని చెప్పారు. చంద్రన్న సంక్రాతి, క్రిస్టమస్ కానుకలు అందించే సంచులు, సరుకుల విషయంలో నాణ్యత ముఖ్యమని, ఎక్కడా రాజీపడవద్దని అధికారులకు చెప్పారు. సరుకుల నాణ్యత పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. వేలిముద్ర సరిగా పడని వృద్ధులకు, అవకాశంలేని లెప్రసీ రోగులకు వేలిముద్ర తీసుకోకుండా సరుకులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రైతులకు ధాన్యం కోసం, మిల్లర్లకు బియ్యం కోసం ఇచ్చే సంచులు, మిల్లర్ల నుంచి రావలసిన బియ్యం, జిల్లాల వారీగా మిల్లర్లు చెల్లించవలసిన బకాయిలు, చంద్రన్న సంక్రాంతి కానుకలో ఉండే సరుకులు, గింజ ధాన్యాల పంపిణీ, డీలర్ల చెల్లించవలసిన బకాయిలు తదితర అంశాలను చర్చించారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ప్రారంభించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు
                సచివాలయం, నవంబర్ 26: రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయ లక్ష్మి, బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ రామారావుని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో వారికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-2, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ శాఖలో సబ్ ఇనస్టెక్టర్లు, కానిస్టేబుళ్లు మొదలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లలో ఆ పోస్టులకు సంబంధించిన పోటీ పరీక్షలకు కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభం కావలసి ఉందని, అయితే ఎక్కడా ప్రారంభం కాలేదని ఆయన వివరించారు. కోచింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసుకునేందుకు నిరుపేద బీసీ విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరే ఆర్థిక స్థోమతలేని బీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి పరిస్థితిని దృష్టిలోపెట్టుకొని  ప్రభుత్వం వెంటనే స్పందించి కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభించాలని శంకరరావు  కోరారు. ముఖ్య కార్యదర్శి ఉదయ లక్ష్మి స్పందిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించేలా చూస్తానని చెప్పారు.

Nov 22, 2018


అమరావతిలో మరో 6 సంస్థలకు భూ కేటాయింపు
మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
              సచివాలయం, నవంబర్ 22 :  రాజధాని అమరావతి పరిధిలో మరో 6 సంస్థలకు భూములు కేటాయించాలని  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని ఆర్థిక మంత్రి ఛాంబర్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భూములు కేటాయించిన తరువాత నిర్ణీత కాలంలోపల నిర్మాణాలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. సవిత విశ్వవిద్యాలయానికి 40 ఎకరాల చొప్పున రెండు విడతలుగా మొత్తం 80 ఎకరాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 10.2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు, ఏపీపీఎస్సీకి 1.5 ఎకరాలు,ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ కు ఒక ఎకరం, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్(వైఎంసీఏ)కు 2.65 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.         
      సమావేశంలో మంత్రులు డాక్టర్ పి.నారాయణ, గంటా శ్రీనివాస రావు, నక్కా ఆనందబాబు, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్, వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఏపీ సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.


 కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్
మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
Ø వైద్య,ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని బోధనా సిబ్బందికి వర్తింపు
Ø 30 వేల మందికి లబ్ది
Ø 180 రోజుల మెటర్నటీ సెలవులు
Ø అధ్యాపకులకు 10 రోజుల బ్రేక్ తో 12 నెలల జీతం
Ø పదవీవిరమణ వయసు 58 నుంచి 60కి పెంపు
Ø అందరికీ ఉద్యోగ భద్రత
Ø అన్ని శాఖలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒకే విధానం ఆలోచన

సచివాలయం, నవంబర్ 22 :  కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్(ఎంటీసీ) ఇవ్వాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి ఛాంబర్ లో గురువారం ఉదయం సమావేశమైన మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వైద్య, ఆరోగ్య శాఖలోని సిబ్బందికి, ఉన్నత విద్యాశాఖలోని విశ్వవిద్యాలయ, డిగ్రీ, జూనియర్ కాలేజీలలో పని చేసే అధ్యాపకులకు మాత్రమే వర్తిస్తుంది. ఉప సంఘం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మహిళలకు 180 రోజులు మెటర్నటీ సెలవులు ఇస్తారు. ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతారు. అధ్యాపకులకు ప్రస్తుతం పది నెలలకు మాత్రమే జీతం ఇస్తున్నారు. దానిని 12 నెలలకు పెంచుతారు. అయితే ప్రతి ఏడాది పది రోజులు బ్రేక్ ఇస్తారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తారు. ఈ రోజు తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల వైద్య, ఆరోగ్య శాఖలో 23,372 మందికి, ఉన్నత విద్యా శాఖలో 3,802 మందికి లబ్డి చేకూరుతుంది. అందరికీ డీఏ లేకుండా ఎంటీసీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ.38 కోట్ల అదనపు భారం పడుతుంది.  అయితే వివిధ శాఖలలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని మంత్రి యనమల అధికారులను ఆదేశించారు. ఆంధ్రా యూనివర్సిటీలోని ‘28 రోజుల ఉద్యోగులు’, ఎన్ఎంఆర్ ల సమస్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఎన్ఎండీ ఫరూక్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్, వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రత్యేక కమిషనర్ సుజాత శర్మ తదితరులు పాల్గొన్నారు.

Nov 21, 2018


అవును! బాబు వచ్చారు జాబులొచ్చాయి

ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2019 ప్రతిపక్షాలకు చెంపపెట్టు
  • ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి
  • నైపుణ్యత గల యువతదే భవిష్యత్
  • రాష్ట్రంలో పటిష్ట రాజకీయ నాయకత్వం
  • మోడీ,జగన్,పవన్ బాబుని చూసి నేర్చుకోవాలి


            సచివాలయం, నవంబర్ 21: అవును! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు, రాష్ట్రంలో యువతకు జాబులొచ్చాయని శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఈ దఫా అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ రంగంలో గానీ,ప్రైవేటు రంగంలో గానీ 5 లక్షల ఉద్యోగాల వరకు వచ్చాయని తెలిపారు. ఉద్యోగార్హ నైపుణ్య మానవవనరులపై పీపుల్‌ స్ట్రాంగ్‌, వీబాక్స్‌, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన  సర్వే ఆధారంగా రూపొందించిన ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2019 దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. అత్యధిక ఉద్యోగార్హ నైపుణ్యం (ఎంప్లాయిబిలిటీ)గల మానవవనరులున్న రాష్ట్రంగా కీర్తి గడించిందంటే ఇది తెలుగు యువత నైపుణ్యతకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టు అన్నారు. ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇప్పిస్తోందని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున యువతకు శిక్షణ ఇప్పించే ప్రభుత్వం దేశంలో మనదేనని చెప్పారు. విశాఖ నగరాన్ని ఫిన్ టెక్ వ్యాలీగా రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నైపుణ్యత గల యువత ఉన్నందునే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, అమేజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, దాంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని, ఇంకా సోలార్ విద్యుత్, అగ్రిటెక్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ నూతన ఆవిష్కరణలు, ఆధునిక పోకడలుపోవడంతో రాష్ట్రంలో  ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. కియా మోటార్ వంటి సంస్థలు వచ్చాయని, శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ ఉత్సత్తులు ఉధృతం కావడంతో తెలుగు యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ ని చెప్పుకునేవారని, ఇప్పుడు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయన్నారు.
        చంద్రబాబు వచ్చిన తరువాత ప్రభుత్వ రంగంలో డిఎస్సీ, ఏపీపీఎస్సీ ద్వారా, పోలీస్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు, ఆర్టీసీలో ఖాళీలను, అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఆ రకంగా ప్రభుత్వంలో దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ, కాపు కార్పోరేషన్ ల ద్వారా లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించారన్నారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు చూపించిందని డొక్కా చెప్పారు. వీటితోపాటు రాష్ట్రంలో పటిష్ట రాజకీయ నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణ ఉండటం వల్ల అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు.   ప్రైవేటు రంగంలో యువతకు భారీ స్థాయిలో ఉపాధి లభించినట్లు చెప్పారు. ఆ విధంగా వరదగా ఉద్యోగావకాశాలు లభించడంతో 5 లక్షల మంది యువతకు ఉపాధి వచ్చిన్నట్లు తెలిపారు. దీనంతటికీ సీఎం చంద్రబాబు ముందు చూపే కారణంగా పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారానే రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్ ఉందన్నారు.  ప్రస్తుతం వైద్య శాఖలో డాక్టర్, బోధనా సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్, గ్రూప్ 3 వంటి పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఇటువంటి అనుకూల అంశాలు కనిపించవా? అని డొక్కా ప్రశ్నించారు. ఆ పార్టీల వారిని కళ్లున్న కబోదులుగా ఆయన పేర్కొన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అందులో పది శాతం మందికి కూడా అవకాశాలు కల్పించని ప్రధాని మోడీని వీరు ఎందుకు ప్రశ్నించరని  మాణిక్య వరప్రసాద్ అడిగారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే బాధ్యతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత భారీ స్థాయిలో ఇక్కడ నిరుద్యోగ భృతి ఇస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్మోహన రెడ్డి, పవన్ కల్యాణ్ చంద్రబాబుని చూసి నేర్చుకోవాలన్నారు.

Nov 19, 2018


పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యత
గ్రామాలలో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థపై సీఎస్ సమీక్ష
               సచివాలయం, నవంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ  అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం  గ్రామాల్లో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ తీరుని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగురునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా పనిచేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులను, చేపట్టిన చర్యలను అధికారులు సీఎస్ కు వివరించారు. రెండు వేల మంది కంటే తక్కువగా జనాభా ఉండే గ్రామాల్లో సోక్ పిట్ లు ఏర్పాటు చేస్తామని, అందుకు సంబంధించి సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. రెండు వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో తప్పనిసరిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.  మండలానికి ఒక మల్టీపర్పస్ డ్రైన్ క్లీనింగ్ మిషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్ర, ఎస్సీ కార్పోరేషన్ల సహకారంతో కాలువల శుభ్రత పనులను థర్డ్ పార్టీకి అప్పగించనున్నట్లు తెలిపారు. కాలువలలో మురుగునీరు పారుదలకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి,  కమిషనర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సమాచార వ్యూహం ముఖ్యం
జీపీడీపీ సమీక్షాసమావేశంలో సీఎస్

                సచివాలయం, నవంబర్ 19: గ్రామీణాభివృద్ధి విషయంలో అన్ని శాఖలకు సంబంధించి సమాచార వ్యూహం చాలా ముఖ్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ అన్నారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం  గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)పై ఆయన సమీక్షించారు. జిల్లాల్లో జీపీడీపీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల్లో అన్ని శాఖలకు సంబంధించినవారిని  కూడా ఆహ్వానించాలని చెప్పారు. అవసరమైతే ఒక వాట్స్ ప్ గ్రూప్ ని కూడా ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు. గ్రామపంచాయతీల అభివృద్ధి విషయంలో అన్ని శాఖలు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీటన్నిటితోపాటు పనులు సకాలంలో పూర్తి కావడం కూడా ముఖ్యమని సీఎస్ చెప్పారు.
                  జీపీడీపీ కింద చేపట్టిన చర్యలను అధికారులు సీఎస్ కు వివరించారు. ఇందులో వివిధ శాఖలకు సంబంధించి 29 రకాల పనులు ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖలో -క్రాప్, సాయిల్ టెస్ట్ లు లాంటివి,  రెవెన్యూ, ఫిషరీస్, నరేగా, పేదరిక నిర్మూలన, సామాజిక వనాలు, ఆరోగ్యకేంద్రాలు, పారిశుద్ధ్యం, అంగన్ వాడీ కేంద్రాలు,  భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. వర్షాలు, కరువు నివారణ చర్యలు, చెత్త, కంపోస్ట్, త్రాగునీరు, కేంద్ర నిధులు వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్ వి ప్రసాద్,  పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పి.రంజిత్ బాషా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి  తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ కుమార్ మీనాకు అభినందనలు
            విజయవాడలో మూడు రోజులపాటు ఎఫ్‌1హెచ్‌2, ఎఫ్‌4 పవర్‌ బోట్‌ పోటీలను అత్యద్భుతంగా నిర్వహించారని  పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను సీఎస్ పునీఠ ప్రత్యేకంగా అభినందించారు. లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారని, కార్యక్రమం విజయవంతంమయిందని ఆయన అన్నారు.

సామాజిక బాధ్యతగా గ్రామీణాభివృద్ధి

జాతీయ రుర్బన్ మిషన్ పనులను సమీక్షించిన సీఎస్
సచివాలయం, నవంబర్ 19: గ్రామీణాభివృద్ధిని సామాజిక బాధ్యతగా భావించాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం  జాతీయ రుర్బన్ మిషన్ రాష్ట్ర స్థాయి ఎన్ ఫోర్స్ మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మిషన్  పనులను సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాశ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పథకాల ప్రచారం బాగుందని, గ్రామదర్శిని కార్యక్రమాలకు వెళ్లినప్పుడు గుర్తించినట్లు చెప్పి, వారిని అభినందించారు. ఈ పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో బాధ్యులు ఉత్సాహంగా పనిచేయాలని సీఎస్ చెప్పారు.

రాష్ట్రంలో పథకం అమలు తీరుని అధికారులు సీఎస్ కు వివరించారు. 13 జిల్లాలు 13 క్లస్టర్లుగా ఉంటాయని, అలాగే ప్రతి మండలం ఒక క్లస్టర్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మండలం ఒక క్లస్టర్ యూనిట్ గా అభివృద్ధికి రివైజ్డ్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గ్రామాలలో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, విద్య, సమాజిక మౌలికసదుపాయాలు, నైపుణ్య శిక్షణ వంటి 16 అంశాలకు మండలానికి ఒక కోటి రూపాయలు నిధులు ఖర్చు చేయవచ్చని వివరించారు. మొదటి దశలో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం 5 జిల్లాలలో, రెండు, మూడు దశలలో మిగిలిన జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సీఈఓ, మండలంలో ఎంపీడీఓ బాధ్యులుగా ఉంటారని తెలిపారు. ఆరోగ్యం, వ్యాధులు, తల్లిబిడ్డలకు పౌష్టికాహారం వంటి విషయాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్ వి ప్రసాద్,  పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి,  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...