Nov 13, 2018


పీఎంఈవై-ఎన్టీఆర్ నగర్ గృహాలకు
రుణ మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
బ్యాంకర్లను కోరిన ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్

             సచివాలయం, నవంబర్ 13: పట్టణాలలో భారీ స్థాయిలో నిర్మించే పీఎంఈవై, ఎన్టీఆర్ నగర్ గృహాలకు రుణ మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్ బ్యాంకర్లను కోరారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్ బీసీ) సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 28 గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, మిగిలిన నిర్మాణాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో మొత్తం 5,28,886 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిలో 4,60,492 గృహాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.38,265 కోట్లు కాగా, అందులో ఇళ్ల నిర్మాణ వ్యయం 32,730 కోట్లు, భూమి విలువ రూ.1035 కోట్లు, మౌలిక సదుపాయాల వ్యయం రూ.4500 కోట్లని వివరించారు. ముఖ్యమంత్రి త్వరలో ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారన్నారు. సమయం తక్కువ ఉన్నందున బ్యాంకర్లు ఈ ప్రాజెక్టులకు రుణాల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రైవేటు బిల్డర్లు వ్యాపార దృక్పదంతో నిర్మిస్తారని, ప్రభుత్వం సామాజిక బాధ్యతతో ఈ ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు. భూమి, మౌలిక సదుపాయాలు, నిర్మాణ వ్యయం కలిపితే ఒక్కో ఫ్లాట్ విలువ రూ.10 నుంచి 12 లక్షలు ఉంటుందని, బ్యాంకులు రూ.2.65 లక్షలు మాత్రమే ఇవ్వలసి ఉంటుందన్నారు. బ్యాంకులకు కావలసిన అన్ని పత్రాలను మునిసిపల్, టిడ్కో, మెప్మా అధికారులు అందజేస్తారని చెప్పారు. ప్రభుత్వం ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్ కు, మార్ట్ గేజ్ కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చిందని వలవన్  తెలిపారు.
ఈ ఇళ్లను అత్యంత ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీతో దృఢంగా నిర్మిస్తున్నట్లు టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ బీఎం దివాన్ మైదీన్ చెప్పారు. ప్రజల నివాసంతోపాటు చిన్నతరహా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా ఈ కాలనీలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఒకే పద్దతిలో జీ+3 విధానంలో మూడు కేటగిరీలుగా ఇళ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. 300, 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు, 465 చదరపు అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వెర్టిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్, గ్లేజ్ సెరామిక్ టైల్స్, బ్లాక్ గ్రానైట్, సాల్ ఉడ్ తలుపులు, ప్లాస్టిక్ ఎమల్సన్ పెయింటింగ్ వంటి వాటిని వాడుతున్నట్లు వివరించారు.
ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ వంటి పెద్ద సంస్థలు వీటిని నిర్మిస్తున్నట్లు మైదీన్ చెప్పారు.

          టిడ్కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణం పూర్తి అయిన నెల్లూరు, గుంటూరు, చిలకలూరిపేట,కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, గుడివాడ,  భీమవరం, పొన్నూరు, అమలాపురం, పెద్దాపురం, రాజమండ్రి, మండపేట తదితర ప్రాజెక్టులను చూపించారు. ఈ ప్రాజెక్టుకు రుణాలు మంజూరుకు సంబంధించి 30 అంశాలను  టిడ్కో ఆర్థిక సలహాదారు జగదీష్ బ్యాంకర్లకు వివరించారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి పట్టణంలో బ్లాకుల వారీగా బ్యాంకులకు కేటాయిస్తామని చెప్పారు. లబ్దిదారులను కమిటీ ఎంపిక చేస్తుందని, డ్రా విధానంలో ఫ్లాట్లు లబ్దిదారులకు కేటాయిస్తారని, ఆ జాబితాలను మునిసిపల్ కమిషనర్ తన సంతకంతో ఆయా బ్యాంకు బ్రాంచ్ మేజేర్లకు  అందజేస్తారని వివరించారు. ప్రతి జిల్లాకు ఒక మెప్మా కోఆర్డినేట్ ఉంటారని, వారు బ్యాంకులకు సహకరిస్తారని చెప్పారు.  చిలకలూరిపేట ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ మొట్టమొదటగా రుణాలు మంజూరు చేసిందని, ఆ బ్యాంక్ మేనేజర్ ని అభినందించారు. న్యాయ సలహా, ఫ్లాట్ విలువ, అబ్దిదారుల వయసు, చెల్లించవలసిన వాయిదాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలను చర్చించారు.
దాదాపు అన్ని అంశాలకు బ్యాంకర్లు అంగీకరించారు. లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోతే అందరి పేరన కొత్త ఖాతాలు తెరుస్తామని వారు చెప్పారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి  వారు చేసిన సూచనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎల్ బీసీ కన్వీనర్ శివ వరప్రసాద్, 16 ప్రభుత్వ రంగ, 2 సహకార, 6 ప్రైవేటు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...