Nov 10, 2018



2019కి ఈ-ప్రగతిసిద్ధం
*    డిసెంబర్ 31 నాటికి శాఖల అనుసంధానం
*    వేగంగా మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన 
*    వేవ్పేరుతో 4 విభాగాలుగా అనుసంధాన ప్రక్రియ
*    జనవరిలో విశాఖలో ఫ్లాగ్‌షిప్ స్టార్టప్ ఈవెంట్
*    భూ పత్రాలకు ప్రత్యేక యాప్
*    వచ్చే మార్చి నాటికి అన్ని భూముల వివరాలు డిజిటలైజ్
*    బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూములకు రక్షణ
*    2019 జూన్ నాటికి ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి

          
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘ఈ-ప్రగతి’లో దూసుకుపోతోంది. సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నతంగా నిలిచేందుకు 'ఇ-ప్రగతి' ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఏడాది చివరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఈ-ప్రగతిప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అన్ని మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన వేగంగా పూర్తి చేసే పనిలో ఐటీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ-ప్రగతిమొదటిదశ కింద ముందుగా 14 శాఖల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తారు.  రెండు-మూడు దశల్లో మిగిలిన శాఖలను అనుసంధానం చేస్తారు. ప్రజల సంతృప్తిని కొలిచేందుకు ఈ-ప్రగతిదోహదపడుతుంది. ఇన్నోవేషన్ హ్యాక్‌థాన్, ఆర్టీజీ, ఫైబర్‌గ్రిడ్, ఐవోటీ పురోగతిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వేవ్పేరుతో 4 విభాగాలుగా శాఖల అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. వేవ్ 1 కింద  ప్రాథమిక రంగం, విద్యారంగాలు, వేవ్ 2-ఆరోగ్య రంగం, వేవ్ 3-పరిశ్రమల రంగం, గ్రామీణ-పట్టణాభివృద్ధి, వేవ్ 4 కింద ఐటీ, మౌలికవసతులు, ఉత్పాదకత, ఈ-సీఎం, ఈ-కేబినెట్, ఈ-ఆఫీసు, ఈ-అసెంబ్లీ, ఈ-ప్రొక్యూర్‌మెంట్, సీఎఫ్ఎంఎస్, హెచ్‌ఆర్ఎంఎస్, శాంతి-భద్రతల అంశాలను అనుసంధానిస్తున్నారు. వన్ పోర్టల్, యాప్ స్టోర్, సీఎల్‌జీఎస్, ఎల్ఎంఎస్, ఈ-హైవే, డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్, బిగ్ డేటా ప్లాట్‌ఫామ్ ఇప్పటికే పూర్తయ్యాయి. పీపుల్స్ హబ్ ఇంటిగ్రేషన్ కూడా పూర్తి చేశారు.  ల్యాండ్ హబ్, మీసేవ ప్లస్ ప్లస్ చేపట్టవలసి ఉంది. ప్రాథమిక రంగం అనుసంధానం, విద్యారంగంలో 87 సేవలు పూర్తి అయ్యాయి.   పరిశ్రమల రంగంలో, గ్రామీణ-పట్టణాభివృద్ధి శాఖలలో డేటా విశ్లేషణ  పూర్తి అయింది. అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది.  వైద్యరంగాన్ని త్వరగా అనుసంధానించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో భూగర్భజలాలు, వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, జలవనరుల వివరాలు రియల్‌ టైమ్‌లో తెలుసుకోవడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్రంలో నాలుగో పారిశ్రామిక విప్లవం అమలు-ప్రభావంపై ప్రపంచబ్యాంకు బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఇన్నోవేషన్ పెద్దఎత్తున ప్రోత్సహించి అన్నిరంగాల్లో అమలుజేస్తున్నందున రాష్ట్రానికి ఈ గుర్తింపు వస్తోంది. ఒక్క వినూత్న ఆలోచన వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకువస్తుంది. ఆ దిశగా రాష్ట్రంలో నూతన ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి. 2022 కల్లా 17 సుస్థిర వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోంది. ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం అందించేందుకు గ్లోబల్ లివింగ్ హ్యాక్‌థాన్‌తో సహా వివిధ అంశాలపై  హ్యాక్‌థాన్‌లు  నిర్వహిస్తున్నారు.  స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, ఎకో సిస్టమ్ భాగస్వామ్యులకు ఉపకరించేలా వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 10 వరకు విశాఖలోని ఇన్నోవేషన్ వ్యాలీలో ఫ్లాగ్‌షిప్ స్టార్టప్ ఈవెంట్ను నిర్వహిస్తారు.
                భూ యజమానులు తమ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు మొబైల్ ఫోన్‌లో పొందేలా ఒక అప్లికేషన్ అందుబాటులోకి తీసుకురానున్నారు.  భూ సంబంధిత డాక్యుమెంట్లు ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లో సైతం అందుకునే అవకాశం ఉంటుంది. ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ చెయ్యడంతో పాటు టాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రం ల్యాండ్ రికార్డ్స్ ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్లాట్ ఫార్మ్ పైకి తీసుకురాలేదు. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల వివరాలు డిజిటలైజ్ చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీ తో రక్షణ కల్పిస్తాంరు. ఈ రకమైన టెక్నాలజీ వాడటం ద్వారా 80 శాతం ప్రజాధనాన్ని వృధా కాకుండా నిరోధించగలుగుతున్నారు. దేశానికే గొప్ప నమూనాగా నిలిచిన ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2019 జూన్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఫైబర్ నెట్  కనెక్షన్లు ఈ నెలాఖరుకు 7 లక్షల వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిలో వేగం పెంచారు. ఈ ప్రాజెక్టుని అభివృద్ధిపరిచేందుకు, అదనపు సీపీయూ బాక్సుల ఏర్పాటుకు అవసరమైన రూ.3,283 కోట్ల రుణాన్ని సమకూర్చుకునేందుకు  ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి నవంబర్ 6న జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది. సామాజిక ఆర్థిక వృద్ధి  సాధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 గ్రిడ్లలో ఫైబర్ గ్రిడ్ ఒకటి. 24 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ ప్రసారాలు, టెలిఫోన్ సదుపాయాలు కల్పించాలన్నది ఈ గ్రిడ్ ప్రధాన  లక్ష్యం. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ స్టేట్ ఫైబర్ గ్రిడ్ లిమిటెడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా 13 జిల్లాలలో హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. 24 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యుత్ స్థంభాల ద్వారా ఆప్టికల్ కేబుల్ సమకూర్చడమే కాకుండా 2445 గుర్తించిన సబ్ స్టేషన్లలో పాయింట్స్ ఆప్ ప్రెజెన్స్  ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం నెట్‌వర్క్ కు విశాఖపట్నంలోని స్టేట్ వైడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఏపీ సీసీ టీవీ సర్వలైన్స్ ప్రాజెక్టుడిసెంబర్ నెలాఖరుకు పూర్తవుతుంది. రాష్ట్రంలో మొత్తం 14,770 సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్)  ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ప్రతి పథకం, ప్రతి అంశంలో ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోగలుగుతున్నారు. ఏ ఏ స్థాయిల్లో, ఎక్కడెక్కడ, ఏ పథకం అమలు తీరులో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా ఉందో తెలుసుకొని ఆయా అంశాలను సరిదిద్ది, తగిన చర్యలు చేపట్టి సంతృప్తి స్థాయి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. పాలన 100 శాతం పారదర్శకంగా జరగడానికి ఇది దోహదపడుతోంది. ప్రస్తుతానికి సచివాలయం పక్కన రెండున్నర ఎకరాలలో ఆర్టీజీ రాష్ట్ర కార్యాలయం నిర్మించారు.   జిల్లా కేంద్రాలను కూడా ఈ ఏడాది చివరికి సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌ రూం వ్యవస్థను, స్టూడియోల నిర్మాణాన్ని, సిస్టమ్ ఇంటిగ్రేషన్‌ను త్వరలో పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే వర్చువల్ క్లాస్‌ రూం ప్రారంభిస్తారు. ప్రారంభంలో కనీసం నాలుగు వేల వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. వీటన్నిటితోపాటు సైబర్ సెక్యూరిటీ, ఏపీ కంటెంట్ కార్పొరేషన్, ఏపీ టవర్స్ కార్పొరేషన్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ అభివృద్ధి దశలో ఉన్నాయి.  ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ను విస్తృత స్థాయిలో వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టారు. ఆ కార్పోరేషన్ ఇప్పటి వరకు ఏం  సాధించింది, ఇంకా ఏ విధంగా డ్రోన్ల వినియోగాన్ని విస్తృతపరచాన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పోలీసింగ్‌కు కూడా డ్రోన్లు వినియోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. డ్రోన్ల సాయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్య వివరాలను సేకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నారు.  పాలనలో సాంకేతికతను విరివిగా వినియోగించేలా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి చేశారు. కొత్తగా చేపట్టే నియామకాలకు కంప్యూటర్ విద్యను తప్పనిసరి చేయనున్నారు.  ఆ విధంగా ఈ-ప్రగతిలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలుస్తుంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...