Nov 27, 2018


 మిల్లర్లు వెంటనే బకాయిలు చెల్లిస్తే పెనాల్టీ ఎత్తివేత
పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
                 సచివాలయం, నవంబర్ 27: మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లడ్ రైస్) సరఫరా చేయనందున చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో పెనాల్టీ ఎత్తివేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు  రూ.93.82 కోట్లు  ఉన్నట్లు తెలిపారు. పెనాల్టీతో కలిపితే రూ.115 కోట్లు దాటుతుందన్నారు.  నెల్లూరు జిల్లాలోని మిల్లులు ఎక్కువ బకాయిపడినట్లు  తెలిపారు. మిల్లర్లు వెంటనే చెల్లించేట్లైతే సీఎంతో మాట్లాడి పెనాల్టీ ఎత్తివేయిస్తానని చెప్పారు. అవకాశం ఉన్న మిల్లర్లు చెల్లించారని, అవకాశంలేనివారు మిల్లులు అమ్మి చెల్లిస్తామని చెబుతున్నారన్నారు. ఇప్పటికే మిల్లర్లను అరెస్ట్ చేయించినట్లు తెలిపారు. ఆ మిల్లులు సీజ్ చేయించినట్లు చెప్పారు. పెనాల్టీ ఎత్తివేస్తే మిల్లులను అమ్మి చెల్లిస్తామని  మూడు మిల్లుల వారు చెప్పారన్నారు.
గత ఏడాదికి మిల్లర్లు ఇంకా 22,428 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయవలసి ఉందని, వారు ఇంకా సమయం అడుగుతున్నారని, సీఎం ఆమోదంతో మరో 5 రోజులు సమయం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 47,81,955 మెట్రిక్ టన్నుల ధాన్య కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఒప్పటికే 1,52,446 మెట్రిక్ టన్నుల ధాన్యం  14,440 మంది రైతుల వద్ద  కొనుగోలు చేసి 48 గంటల్లో రూ.252 కోట్లు చెల్లించినట్లు వివరించారు.
గత ఏడాది మాదిరిగా తెల్ల రేషన్ కార్డుదారులకు చంద్రన్న సంక్రాతి, క్రిస్టమస్ కానుకలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కానుకల కింద ఇచ్చే సరుకుల నాణ్యత విషయంలో రాజీపడేప్రసక్తిలేదని చెప్పారు. రేషన్ డిపోల ద్వారా ఇచ్చే మొత్తం బియ్యానికి ప్రత్యామ్నాయంగా కార్డుదారులు కోరితే జొన్నలు గానీ, రాగులు గానీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సీఎం చెబుతున్నారని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 10.16 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు, 11.16 మెట్రిక్ టన్నుల రాగులు కార్డుదారులు తీసుకున్నట్లు వివరించారు. కార్డుదారుల ఇబ్బందులను గమనించి  గ్రామానికి దూరంగా ఉండే నివాసప్రాంతాలకు ప్రభుత్వమే రవాణా ఖర్చులు భరించి సరుకులు పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక నుంచి రేషన్ డిపో డీలర్లు అక్కడకే వెళ్లి వారికి సరుకులు ఇవ్వాలన్నారు.
              పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండీ ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ రేషన్ డిపోల ద్వారా కిలో రూ.12లకు ఇచ్చే డబుల్ ఫార్టిఫైడ్ ఉప్పు చాలా మంచిదని చెప్పారు. అది పిల్లలకు, పెద్దలకు, ఆడవారికి అందరికీ మంచిదని తెలిపారు. ఆ ఉప్పుని తమిళనాడు సాల్ట్ కార్పోరేషన్ నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు.  జొన్నలు, రాగులు ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా అమ్ముడుపోతున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయన్నారు. కంది పప్పు కిలో రూ.40లకే ఇస్తున్నట్లు చెప్పారు.

డీలర్ల బకాయిల లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించిన మంత్రి
                ఐసీడీఎస్, పాఠశాలలకు సరఫరా చేసిన సరుకులకు సంబంధించి డీలర్లకు చెల్లించవలసిన బకాయిల లెక్క తేల్చమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారి బకాయిలను చెల్లించుదామని చెప్పారు. చంద్రన్న సంక్రాతి, క్రిస్టమస్ కానుకలు అందించే సంచులు, సరుకుల విషయంలో నాణ్యత ముఖ్యమని, ఎక్కడా రాజీపడవద్దని అధికారులకు చెప్పారు. సరుకుల నాణ్యత పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. వేలిముద్ర సరిగా పడని వృద్ధులకు, అవకాశంలేని లెప్రసీ రోగులకు వేలిముద్ర తీసుకోకుండా సరుకులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రైతులకు ధాన్యం కోసం, మిల్లర్లకు బియ్యం కోసం ఇచ్చే సంచులు, మిల్లర్ల నుంచి రావలసిన బియ్యం, జిల్లాల వారీగా మిల్లర్లు చెల్లించవలసిన బకాయిలు, చంద్రన్న సంక్రాంతి కానుకలో ఉండే సరుకులు, గింజ ధాన్యాల పంపిణీ, డీలర్ల చెల్లించవలసిన బకాయిలు తదితర అంశాలను చర్చించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...