Nov 14, 2018


సినిమా రంగం అభివృద్ధికి చర్యలు
మంత్రి నక్కా ఆనందబాబు
Ø త్వరలో సినీ ప్రముఖులతో  సమావేశం
Ø నవంబర్ లో రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్
Ø పూనే తరహాలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూషన్ ఏర్పాటు
Ø ఐఏఎస్ కోచింగ్ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి అధికారి
             సచివాలయం, నవంబర్ 14: రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సాంఘీక సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయంలోని 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాటోగ్రఫీ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా తనకు అప్పగించినందున ఆ శాఖకు సంబంధించిన  హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండి ఎస్.వెంకటేశ్వర్, ఇతర అధికారులతో చర్చించినట్లు తెలిపారు. సినిమా రంగం గురించి కూలంకుషంగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు, అవార్డులు, షూటింగ్ రాయితీలు, థియేటర్ల సమస్యలు అన్నిటిని అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ రంగం అభివృద్ధికి తీసుకునే చర్యలలో భాగంగా త్వరలో సినీ ప్రముఖులు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ప్రతి ఏడాది నవంబర్ లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేవారమని, రాష్ట్రం విడిపోయిన తరువాత జరపలేదని, వచ్చే ఏడాది ఏపీలో ఆ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కూడా మన రాష్ట్రంలో జరపడానికి ఆ నిర్వాహకులతో మాట్లాడతామన్నారు. రాష్ట్రంలో సినిమా రంగం పట్ల ఆసక్తి చూపించే యువతకు తగిన శిక్షణ ఇచ్చేందుకు పూనేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తరహాలో ఒక ఇన్ స్టిట్యూషన్ ని నెలకొల్పుతామని చెప్పారు. దానికి సంబంధించి అధ్యయనం జరుగుతున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ విద్యాపథకం కింద ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ అభ్యర్థుల సమస్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ అంశంపై ప్రతి రోజు సంక్షేమ శాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఢిల్లీ పంపుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శిక్షణ పొందవలసి ఉంటుందని, వారి సమస్యలు ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరిస్తుందన్నారు. తెలుగు మీడియంలో కూడా శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరంలేదని మంత్రి ఆనందబాబు హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...